ఊర్వశి – కాళిదాసు నాటకానికి నవలారూపం

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

************

ఊర్వశి – కాళిదాసు నాటకానికి నవలారూపం

శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి

భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచనల గురించి వినని వారుండరు. ముఖ్యంగా దృశ్యరూపంలో రసజ్ఞులను అలరించేందుకు రచించిన అద్భుతమైన నాటకాలు గురించి విన్నప్పటికీ వాటిని సంస్కృతంలో చదవి ఆస్వాదించగలిగే పాఠకులు అరుదే. సాహిత్యాభిమానుల కోసం మాళవికాగ్నిమిత్రం, అభిజ్ఞాన శాకుంతలం ఇప్పటికే తెలుగులో నవలారూపంలోకి తీసుకొచ్చిన అనల్ప ప్రచురణకర్తలు విక్రమోర్వశీయం నాటకానికి కూడా తెలుగు నవలారూపం ఇవ్వాలని సంకల్పించారు. అందుకు సంస్కృతం, తెలుగు భాషల్లో పట్టు ఉన్న రచయిత్రి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారి సహకారం తీసుకున్నారు.

వీరలక్ష్మీదేవిగారి శైలి గురించి, భాష గురించి ఆమె రచనలు పరిచయమున్న వారికెవరికైనా తెలుసు. అతి సుకుమారంగా, లలితంగా ఉండే ఆమె భాష ఊర్వశి వంటి సున్నితమైన ప్రణయ గాథను చెప్పేందుకు చాలా అనువైనది.

కథలోకి వెళ్తే…

దేవేంద్రుని కొలువులోని అప్సరసలలో ఊర్వశి అపురూపమైన సౌందర్యవతి. ఆకాశ విహారానికి వచ్చిన ఆమెను ఒక రాక్షసుడు ఎత్తుకుపోతాడు. పురూరవ చక్రవర్తి ఆకాశంలో సూర్యుడి ఉపాసన పూర్తి చేసుకుని వస్తూ, రక్షించమనే ఆర్తనాదాలు వింటాడు. విషయం తెలుసుకుని, అభయమిచ్చి ఊర్వశిని వెతుకుతూ వెళ్తాడు. ఆయన ఊర్వశిని తీసుకురాగలడా అని రంభ సందేహపడుతున్నప్పుడు అది సాధ్యమేనంటుంది మేనక. ఆమె నమ్మకానికి తగ్గట్టుగానే చక్రవర్తి ఊర్వశిని రక్షించి తీసుకువస్తాడు. ఆమె అందం పట్ల చక్రవర్తి విభ్రాంతికి లోనవుతాడు. ఊర్వశి తనను రక్షించిన పురూరవుణ్ణి చూసి రాక్షసులు తనను ఎత్తుకుపోవటం చేత తనకు పురూరవుణ్ణి కలిసే అదృష్టం కలిగిందని అనుకుంటుంది. తనలో పురూరవుని పట్ల గాఢమైన అనురక్తి కలగటాన్ని గమనిస్తుంది. ఆ తొలి సమావేశంలోనే వారిద్దరి మనసులు పరస్పరం ఆకర్షణకు లోనవుతాయి.

సూర్యుణ్ణి సేవించుకుని వచ్చిన పురూరవుడు అన్యమనస్కంగా ఉండటాన్ని పట్టపురాణి గ్రహించి, విదూషకుడిని కారణమడిగి రమ్మని పరిచారికను పంపుతుంది. రాజు పరిస్థితికి రాణి దిగులు పడుతోందని చెప్పిన పరిచారిక విషయం రాబట్టేందుకు రాజు నిద్రలో ఎవరినో కలవరిస్తున్నాడంటుంది. కంగారుపడిన విదూషకుడు ‘ఊర్వశిని కలవరించాడా’ అంటాడు. విషయం రాణిని చేరుతుంది.

రాజు ఊర్వశి గురించిన విరహవేదన విదూషకుని తో చెప్పుకుంటాడు. అతనితో కలిసి ప్రమదవనానికి వెళ్తాడు. ఆ వనప్రవేశం రాజు విరహబాధను మరింత పెంచుతుంది. ఊర్వశిని ఏదోరకంగా చూడాలన్న రాజు అంతలోనే తన కుడి కన్ను అదిరిందని, మనసుకు శుభసూచకంగా తోస్తోందంటాడు.

అదే సమయంలో ఊర్వశి, చిత్రలేఖ ఆకాశం నుంచి కిందకి దిగుతారు. రాజుపై కలిగిన ప్రేమ వలన సిగ్గు విడిచి తాను ఆయన దగ్గరకి బయలుదేరానని ఊర్వశి అంటుంది. దేవగురువు బృహస్పతి నేర్పిన విద్య అపరాజిత ఉపయోగించి ఇద్దరూ అదృశ్యంగా రాజు కోసం చూస్తూ చిత్రంగా ప్రమదవనానికే వెళ్తారు. మొదట చూసినప్పటి కంటే రాజు ఇంకా ప్రియదర్శనుడుగా ఉన్నాడని ఊర్వశి అనుకుంటుంది.

ఊర్వశిని చూసే ఉపాయం చెప్పమని రాజు విదూషకుడిని అడగగా, నిద్రపోతే కలలో కనిపిస్తుందని, లేదా ఆమె చిత్రాన్ని చిత్రిస్తే కంటిముందే ఉంటుందని చెపుతాడు.  

తన హృదయంలో రగులుతున్న బాధ అప్సరస అయిన ఊర్వశికి తెలిసే ఉండాలని, అయినా ఆమె తనను పట్టించుకోకపోవడం తనకు అవమానమని రాజు విదూషకునితో అంటాడు. రాజు తనకోససమే వేదన పడుతున్నాడని ఊర్వశికి నిశ్చయమవుతుంది. ఒక భూర్జపత్రాన్ని తీసుకుని రాజుకు లేఖ రాస్తుంది. కళ్లపడిన ఆ పత్రమేమిటో చూడమని రాజు విదూషకునితో అంటాడు. రాజు బాధ గమనించిన ఊర్వశి తన బాధను రాసి పంపిందేమో అంటూనే రాజు కోరిక మీద దానిని చదివి వినిపిస్తాడతను. తాను కూడా రాజులాగే బాధ పడుతున్నానని, పైగా పారిజాత పూలశయ్య, నందనవనం నుండి వచ్చే గాలులతో మరింతగా బాధ పడుతున్నానని రాసిన ఆ లేఖలో ఊర్వశి హృదయం ఉందని, తామిద్దరూ ప్రణయంలో సమంగా ఉన్నట్టు రాజుకు అర్థమవుతుంది. ఇంతలో భరతముని రాసిన నాటకం ఇంద్రుని సమక్షంలో వేసేందుకు రమ్మని చిత్రలేఖ, ఊర్వశి లకు అదృశ్యంగా పిలుపు అందుతుంది. వాళ్లు దేవలోకానికి వెళ్లిపోతారు.

విదూషకుడి చేతిలోని ఊర్వశి లేఖ జారిపోయి ఎగిరిపోతుంది. విదూషకుడు, రాజు లేఖను వెదుకుతున్న సమయంలో చేటితో కలిసి అక్కడకి వచ్చిన మహారాణికి ఆ లేఖ అందుతుంది. చేటితో ఆ లేఖను చదివించుకుని, రాణి విషయం అర్థం చేసుకుంటుంది. రాజు వెతుకుతున్న లేఖను ఆయనకు అందిస్తుంది. రాజు కంగారుగా తాము వెతుకుతున్న లేఖ రాజ్య పరిపాలనకు సంబంధించినదని చెపుతాడు. రాణి వెళ్లబోగా రాజు తానామెను బాధించినందుకు క్షమాపణ కోరతాడు. ఊర్వశి పట్ల ప్రేమలో కూరుకుపోయినా తనకు రాణి మీద గౌరవం ఉందంటాడు విదూషకుడితో.  

 దేవేంద్రసభలో లక్ష్మీస్వయంవరం నాట్య ప్రదర్శన సమయంలో లక్ష్మీదేవి పాత్రను అభినయిస్తున్న ఊర్వశి పురూరవుని విరహంలో మునిగిపోయి పురూరవుని పేరును ఉచ్ఛరిస్తుంది. దానితో గురువు శుక్రాచార్యులు ఆమెకు దేవలోకంలో చోటు లేదని శపిస్తారు. ఆమె మనసు అర్థమైన ఇంద్రుడు ఆ శాపాన్ని వరంగా మారుస్తూ పురూరవుడు తనకు ఆప్తమిత్రుడని, భూలోకంలో ఆయనతో సంతోషంగా జీవించి, సంతానవతి కమ్మని ఆమెను దీవిస్తాడు. కానీ సంతానం కలిగేదాకా మాత్రమే ఆమెకు భూలోకవాసం అని చెప్తాడు.

మహారాణి ఒక వ్రతాన్ని మొదలుపెడుతూ, మణిభవనానికి రమ్మని రాజుకు సందేశాన్ని పంపుతుంది. అభిమానవతులైన స్త్రీలు ముందు భర్తను అవమానించినా తర్వాత దానిని క్షమించి ఏకాంతాన్ని ఏర్పాటు చేస్తారని, అక్కడ తమ భర్త చెప్పే ప్రేమపూర్వక అనునయ వాక్యాలు వారిని సేదదీరుస్తాయని రాజు అనుకుంటాడు.

పురూరవుని నామస్మరణతో ఊర్వశి మోహమూ, విరహమూ పెరిగిపోయి, చిత్రలేఖతో కలిసి ఆయనను వెతుక్కుంటూ అదృశ్యరూపంలో మణిభవనం చేరుతుంది. విదూషకునితో రాజు తన విరహబాధను చెప్పుకుంటుండగా విని, అది తన గురించిన విరహవేదనే అని ఊర్వశి తెలుసుకుంటుంది.

మణిభవనం చేరిన రాణి తాను ప్రియప్రసాదన వ్రతం చెయ్యబోతున్నానని రాజుకు చెపుతుంది. పూజ ముగించిన రాణి రాజుకు నమస్కరించి, ఆయన ఏ స్త్రీని కోరుకుంటున్నాడో, ఆయనను ఏ స్త్రీ కోరుకుంటుందో వారిద్దరూ హాయిగా కలిసి ఉండాలన్నదే తన వ్రత ఉద్దేశమని వివరించి, రాజు పట్ల తన ప్రేమను తెలియజేస్తుంది. రాణికి భర్త పట్ల ఉన్న ప్రేమను చూసినప్పటికీ తన హృదయాన్ని రాజు నుండి తప్పించుకోలేకపోతున్నానని ఊర్వశి సఖితో అంటుంది. రాణి స్వయంగా తనకు రాజును ఇచ్చినట్టు భావిస్తుంది. ఆమెను అక్కడ వదిలి చిత్రలేఖ స్వర్గానికి వెళ్లిపోతుంది.

ఊర్వశి రాజును గంధమాదన పర్వతం మీదకి తీసుకెళ్తుంది. అక్కడి భోగము మానవమాత్రులకు అందనిది. ఆ పర్వతం మీద స్త్రీలు ప్రవేశించకూడని ఒక వనం ఉంది. అందులో ప్రవేశిస్తే వాళ్లు లతలుగా మారిపోతారు. ఊర్వశి ఆ విషయం శాపవశాన మరచిపోయి ఆ వనంలోకి ప్రవేశించి, లతగా మారిపోతుంది. ఉద్యానవనమంతా ఊర్వశి కోసం పిచ్చివాడిలా వెతుక్కుంటున్న రాజును చిత్రలేఖ తన ధ్యానంలో తెలుసుకుంటుంది. గౌరీదేవి పాదాలకు అలంకారమైన సంగమమణి దొరికితే లత ఊర్వశిగా మారిపోతుందని చిత్రలేఖకు తెలుసు. కానీ ఆ విషయాన్ని విధికి వదిలేస్తుందామె.

వనమంతా ఉన్మాదంతో సంచరిస్తున్న రాజు మబ్బును చూసి ఎవరో రాక్షసులు తన ప్రియురాలిని ఎత్తుకుపోయినట్లు భావిస్తాడు. ఆమె విరహంలో మూర్ఛపోతాడు. లేచి ఊర్వశి తనపై అలిగి వెళ్లిపోయిందా అని వాపోతాడు. “కాలం రాజాజ్ఞతోనే నడుస్తుంది” అన్న మునుల మాటలు గుర్తొచ్చి, ధీరుడైన రాజుగా పరిస్థితులను తనకు అనుకూలంగా చేసుకోవాలనుకుంటాడు. దుఃఖాన్ని పక్కన పెట్టి, చుట్టూ ఉన్న వనాన్ని, మెరుపులతో నిండిన ఆకాశాన్ని, పుష్కలంగా ప్రవహించే సెలయేళ్లను తాను అనుభవించే రాజభోగాలుగా తలపోస్తాడు.

వనంలో నర్తించే నెమలిని, కోయిలను, ఊర్వశి నడకలను దొంగిలించిన హంసలను కూడా ఊర్వశి జాడ చెప్పమని వేడుకుంటాడు. రాజు దొంగలను శిక్షిస్తాడన్న భయంతో హంసలు ఎగిరిపోతాయి. చక్రవాకాల జంటను, తుమ్మెదను, గజరాజు జంటను, సురభి కంధర పర్వతాన్ని తన ప్రియతమ ఆచూకీ చెప్పమంటాడు. ప్రవహించే నదిని, లేడిని అడిగినా ఎవరూ జవాబివ్వరు. ఈ పరాభవాల్ని అనుభవించడమే తన విధి అనుకుంటాడు.

ఊర్వశి ఎక్కడైతే అదృశ్యమైందో అక్కడే వెతకాలని నిర్ణయించుకున్నాడు. రాళ్లమధ్య ఎర్రగా మెరుస్తున్న మణిని చూసి, ఊర్వశి జడలో అలంకరించాలని తీసుకుంటాడు. అంతలోనే ఆమె లేనప్పుడు మణి ఎందుకని వదిలెయ్యబోగా, అది సంగమనీయమణి అని, వదలద్దని పరమేశ్వరుని మాటలు వినిపిస్తాయి. ఊర్వశితో కలిపినట్టైతే ఆ మణిని గౌరవంతో తలదాల్చుతానంటాడు. ఎదురుగా కనిపించిన పూలు లేని ఒక లతను చూసి కళ్లు మూసుకుని పెనవేసుకుంటాడు. ఆ లత ఊర్వశిగా మారిపోతుంది. ఆ స్పర్శ ఊర్వశి స్పర్శలాగ ఉందని తోచి తన భ్రమ అనుకుంటాడు. కళ్ళు విప్పి ఊర్వశిని చూసి మూర్ఛపోతాడు. తేరుకున్నాక పరస్పరం క్షమించమని కోరుకుంటారు.

పూర్వం కుమారస్వామి తన బ్రహ్మచర్య వ్రతభంగం కలగకుండా ఆ పర్వతం మీదకి ఏ స్త్రీ అయినా వస్తే పూలతీగలా మారిపోవాలని ఏర్పాటు చేసుకున్నాడని, సంగమనీయమణి ఆ శాపానికి పరిహారమని, శుక్రాచార్యుల శాపప్రభావం వల్ల తానీ వనంలోకి ప్రవేశించానని ఊర్వశి రాజుకు చెపుతుంది.  

ఊర్వశీ పురూరవులు నగరం చేరుతారు. విదూషకుడు తన రాజుకు ఊర్వశితో సంతానం కావాలని కోరుకుంటాడు. ఒకరోజు రాజు స్నానసమయంలో తీసిపెట్టిన సంగమనీయమణిని గద్ద మాంసపు ముక్కగా తలచి తన్నుకుపోతుంది. రాజాజ్ఞ మేరకు ఆ మణిని వెదికి పట్టుకొచ్చిన ఆయన పరివారం మణిని పట్టుకుని ఉన్న బాణం మీద ఏదో రాసి ఉందని గమనిస్తారు. ఊర్వశీ పురూరవుల సంతానమే ఈ ధనుశ్శాలి అని తెలుస్తుంది. ఊర్వశితో తనకు సంతానముందన్న విషయం విని రాజు ఆశ్చర్యపోతాడు.

అంతలో రాజును కలిసేందుకు ఒక తాపస స్త్రీ, ఒక బాలుడు వస్తారు. ఆ బాలుడు రాజు పోలికలతో ఉన్నాడని విదూషకుడు గుర్తుపడతాడు. ఊర్వశి తన బిడ్డను చ్యవన మహర్షి ఆశ్రమంలో పెట్టినట్టు తాపసి చెపుతుంది. రాజు పుత్రుని ముఖం చూసిన వెంటనే ఊర్వశి తిరిగి స్వర్గానికి రావలసి ఉంటుందన్న ఇంద్రుని ఆజ్ఞను ఆమె రాజుకు తెలుపుతుంది.

ఊర్వశిని దుఃఖపడవద్దని, ఇంద్రుని ఆజ్ఞను అనుసరించమని చెప్పి, విదూషకుడు సూచించినట్టు తమ బిడ్డకు పట్టాభిషేకం చేసి, తాను వానప్రస్థానానికి వెళ్లిపోతానంటాడు రాజు. అంతలో నారదుడు వచ్చి భవిష్యత్తులో దేవేంద్రునికి పురూరవుని సహాయం అవసరమని, అందుచేత పురూరవుడు బలోపేతుడయ్యేందుకు ఊర్వశి ఎప్పటికీ అతని వద్దనే ఉండాలన్న ఇంద్రుని సందేశాన్ని వినిపిస్తాడు. ఇంద్రుని నుంచి మరేదైనా వరం కావాలా అని నారదుడు అడిగినపుడు మంచి సమాజం ఏర్పడేందుకు సంపద, జ్ఞానం కలిసిమెలిసి ఉండేలా చెయ్యమని సమాజశ్రేయస్సును అభిలషించే రాజు కోరుకుంటాడు. కథ సుఖాంతమవుతుంది.

 ఊర్వశి, పురూరవుల ప్రణయగాథ అందమైన కావ్యంగా రూపుదిద్దుకుంది. ప్రేక్షకులను మంత్రించివేసే దృశ్యకావ్యమిది.

ఊర్వశి గురించిన ఎన్నో చారిత్రక విషయాలను తెలియజేసిన రచయిత్రి ముందుమాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి…

ఋగ్వేదం నుంచి చలం పురూరవ దాకా ఊర్వశీ పురూరవుల ప్రణయాన్ని ఎందరెందరో కథలుగా రాసారు, కానీ ఈ కథను కాళిదాసు కావ్యం చేసాడంటారు. మోక్షసాధనా రహస్యాన్ని చెప్పిన అరవిందులు, విశ్వకవి రవీంద్రుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటివారు కూడా ఊర్వశిని గురించి రాసారు. రవీంద్రుడు ఊర్వశిని ప్రకృతిగా ఆరాధించగా, కృష్ణశాస్త్రి ప్రకృతిలో తాను దర్శించిన సౌందర్యమంతటినీ కూర్చి ఊర్వశిగా సాక్షాత్కరింపచేసుకున్నారు.

నాయిక చేత ప్రేమలేఖ రాయించటం ద్వారా స్త్రీ సాధికారతను సూచించారని, ఇలాటి ప్రయోగానికి కాళిదాసు ఆద్యుడని అంటారు. గృహస్థ జీవితాన్ని మించినగొప్ప ప్రేమానుభవం ఒకటి ఉందని, దానికి అర్హులుగా వ్యక్తులు ఎదగాలని చెప్పటం నాటక ఉద్దేశం కావచ్చంటారు. ధర్మార్థ కామాలలో అర్థకామాల నుంచి ధార్మికత వైపు చేసే ప్రయాణం తీరు వివరించేందుకే ఈ నాటకం రాసి ఉండచ్చని, అందువల్లనే ఇందులో నాయకుడు తగిన వయసు, అనుభవం కలిగిన మలియవ్వనపు దశలోని వ్యక్తి అంటారు.

ఈ నవలలో కొన్ని సందర్భాలు ప్రత్యేకం గుర్తుండిపోతాయి.

ఊర్వశి, పురూరవులు కలిసిన తర్వాత అప్పటిదాకా ఊర్వశీ విరహంలో తనను బాధించిన చంద్రకిరణాలు, మన్మథుడి బాణాలు ఆమె పొందుతో తనకెంతో సుఖాన్నిస్తున్నాయని రాజు భావిస్తాడు. “విరుద్ధమైనవన్నీ సానుకూలంగా మారడమే అభ్యుదయం” అన్నమాటలు ఆలోచింపజేస్తాయి.

రాణి వ్రతం ఆచరిస్తోందన్న విషయం విన్న రాజు ఆమె తన సుకుమారమైన శరీరాన్ని అలసిపోయేలా చేస్తోందంటాడు. ఆ సందర్భంలో చిత్రలేఖ “నాగరీకులైన పురుషులకు తమ వలపు వేరొకచోట ఉన్నప్పుడు భార్యల పట్ల మరింత దాక్షిణ్యం కలుగుతుంది.” అనుకుంటుంది. లోకరీతి పట్ల ఆమెకున్న అవగాహన ఆశ్చర్యం కలిగిస్తుంది. రాణి వ్రత ఉద్దేశం తెలిసినపుడు ఆమెకు భర్త పట్ల ఉన్న గాఢమైన అనురాగం అర్థమవుతుంది. 

ఊర్వశి అదృశ్యమైనపుడు ఆమె తన మీద ఎందుకు కోపగించిందో తెలియటంలేదని కోకిలతో చెపుతూ, “నా వల్ల ఒక్క తప్పయినా ఉండాలి కదా, లేకపోయినా ఇలాగే కోపిస్తారు ప్రియలు. భార్యలకు తమ భర్తల మీద ఆ అధికారం ఉంటుందేమో” అంటాడు రాజు.

ఊర్వశి కోసం తపిస్తూ “శ్రేయస్సులు అనిర్వేద ప్రాప్యములు” అనుకుంటాడు రాజు. ఎప్పుడూ నిర్వేదం లేకుండా సంతోషంగా ఉండేవారి దగ్గరకే అదృష్టాలు వచ్చి చేరుతాయని ఆర్యులు చెప్పేరంటూ రాజు గుర్తు చేసుకుంటాడు.

తమ సంతానం పురూరవుడి కంటబడితే తాను తిరిగి దేవలోకం వెళ్లిపోవాల్సి ఉంటుందని కొడుకును దూరంగా ముని ఆశ్రమంలో పెట్టిన ఊర్వశిలోని స్త్రీసహజమైన మాతృప్రేమ ఆమెకు పురూరవుని పట్ల ఉన్న ప్రేమ ముందు బలహీనమవుతుంది. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది.

నవల చదువుతున్నంతసేపూ అనేక వాక్యాలు పాఠకులను ఒక్కక్షణం నిలబెట్టేస్తాయి. అందమైన సున్నితమైన ప్రకృతి వర్ణనలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఊర్వశీ పురూరవులు ప్రేమకోసం పడే తపన చదువరుల మనసులను కదిలిస్తుంది. మహాకవి కాళిదాసు రాసిన ప్రఖ్యాత సంస్కృత నాటకాన్ని ఇలా తెలుగులో నవలా రూపంలో చదువుకోగలగడం సాహిత్యాన్ని ప్రేమించేవారికి గొప్ప అవకాశం.

ఈ పుస్తకం తెలుగు సాహిత్యానికి అవసరమని ఆలోచన చేసిన అనల్పవారికి, వారి ఆలోచనకు అపురూపమైన రూపాన్నిచ్చిన రచయిత్రి శ్రీమతి వీరలక్ష్మీదేవి గారికి అభినందనలు.

ప్రచురణః అనల్ప, 2022

ధరః 150 రూపాయలు

     

You Might Also Like

Leave a Reply