‘ఒక వాక్యం రాలింది’ సమీక్ష
వ్యాసకర్త: జి. వెంకటకృష్ణ
(జనవరి 2023, కవితా!69, సమకాలీన కవితల కాలనాళిక లో మొదట ప్రచురితమైంది.)
*****
కందిమళ్ల లక్ష్మి మా కర్నూలు అమ్మాయి. గృహిణి. ఇద్దరు ఎదిగిన కొడుకుల తల్లి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది. మా కథాసమయం నిర్వహించిన సాహిత్య సమావేశాలకు వస్తూండేది . పాఠకురాలిగా , మంచి చదువరి. ఆ చదువరి తనంలో నుంచే కవిత్వం రాయడం నేర్చుకుంది. సరళమైన భాషలో తన మనసుకు నచ్చిన చిన్న చిన్న సంగతులను కూర్చుతుంది. భావగర్భితంగా పేర్చడం నేర్చుకుంది. నాలుగేళ్ల క్రితం ‘ రెప్ప చాటు రాగం ‘ సంవత్సరం క్రితం ‘ కొంతదూరం వచ్చాక ‘ ఇప్పుడు ‘ ఒక వాక్యం రాలింది ‘ అంటూ తన రచనను పుస్తకాలుగా ప్రచురించుకుంది .
పుస్తకం ( నోట్ పుస్తకాలు, బడి పుస్తకాలు తప్ప) ఎరగని యింట్లోకి , కథలూ కవిత్వాలూ ప్రవేశపెట్టడం చిన్న విషయం కాదు. ‘ ఇంట్లోకి చెదలు రావడానికి మార్గాలు పుస్తకాలు, ‘ అనే అధికారిక అభ్యంతరాలను తట్టుకొని , దొంగగా , చాటుగా పుస్తకం కనబడకుండా చదవడం మొదలుపెట్టి , బెడ్రూం నుంచి హల్లోకి సాహిత్య పుస్తకాలు తేవడానికి యీమెకు నాలుగేళ్లు పట్టింది. మొదటి పుస్తకం పెద్ద కొడుకు సహాయంతో వేసినప్పుడు , పుస్తకాన్ని కనీసం కన్నెత్తి చూడలేని కుటుంబ సభ్యులు , యిప్పుడు యింట్లో పెద్ద లైబ్రరీని కళ్లింత చేసుకొని చూస్తున్నారు. పెద్దబ్బాయి యిప్పుడు మంచి సాహిత్య పాఠకుడిగా మారాడు . ఇదంతా ఒక గృహిణి సాధించిన విజయం.
సాహిత్యాన్ని తూచడానికి తూనికరాళ్లు చాలా వుంటాయి . నేను కూడా ఎర్రెర్రని కనికరాళ్లను పెట్టుకొని తిరిగేవాడ్నే . సాహిత్య పాఠకత్వమూ , సృజనాత్మకత , ఆరోగ్య కరమైన శుభ్ర సమాజ నిర్మాణమూ వేర్వేరు స్థాయిల్లో , వేర్వేరు అంశాల వల్ల ప్రభావితమవుతూ వుంటాయి. రాసే వాళ్లని రాయనివ్వాలి . ఎవరి అల్లిక వాళ్లదే కదా. ఒకే రకమైన బుట్టలు ఎంత మంది అల్లడం లేదు . ఎవరింట్లో పసిపాపవైనా నడకలు మనల్ని మురిపించేవే కదా.
కందిమళ్ల లక్ష్మికి జీవితంలో ఎన్నో ఫిర్యాదులున్నాయి . ఆ ఫిర్యాదుల్ని వెళ్లడించలేని , పరిష్కరించుకోలేని తనం , మౌనంగా మారుతుంది . అది మౌనమైన క్రోధం . అది అనర్థకారి/ ప్రమాదకారి అని తెలుసు.అందుకే అంటుంది..
‘అదో కథ
విధి చేతిలో
కీలుబొమ్మైన కథ
జీవితకథ ‘.
ఏ స్త్రీ జీవితకథైనా అటుయిటుగా యిట్లాగే వుంటుంది. దాన్ని యీ కవి గుర్తించింది.
‘ ఆంక్షల చట్రంలో
కత్తుల మీద నడక నీది
ముళ్ల కిరీటాన్ని పెట్టినా
గుంభనంగా కూర్చున్న గులాబీవి
ఎంత సహనం నీకు భూమిలా.’ అని అందుకే అంటుంది.
మరి యీ కవికి ఊరట ఎక్కడ దొరుకుతుంది?
‘ అక్షరాలతో,పూలతో ఉన్నప్పుడు కలిగే ఊరట
మనుషులతో వున్నప్పుడు కలగటం లేదు.
అందుకేనేమో , ఆక్రోశమైనా ఆనందమైనా
అక్షరాలతో పూలతో
పంచుకోవడం అలవాటైపోయింది.’
అక్కడైతే యే ఫిర్యాదులూ వుండవు. ఏ పేచీలూ వుండవు.
‘ అసూయ లేని
ధ్వేషం లేని
ఒక నిశ్శబ్దం
ఒక హృదయ స్పందన
అంతా
ఒకే భాషగా ప్రవహిస్తూ..’ వుంటుంది అనుకుంటుంది.
‘ నీ లోకంలో నువ్వు
వీచే గాలి స్పర్శకు పులకిస్తూ
విచ్చుకునే పూలను చూసి పరవశిస్తూ
అలా నువ్వు ఒక నిజమై పోతుంటావు.’
ఇక్కడ, ‘ఒక నిజమై’ పోవడం యేమిటో పాఠకుడు పట్టుకోగలిగితే గుండెలు బరువెక్కక మానవు. అయితే కవి అందుకునే నిజాలు , కేవలం ప్రకృతికి సంబంధించినవే అయినప్పటికీ, ఆ జాబితాలోకి రైతు కూడా యిప్పుడు చేరాడు .
‘ చినుకుల్లో తడిసినప్పుడంతా
ఎక్కడి నుండో, లేక నాలోనే ఏమో
మట్టి వాసన మొలకవాసన
పూలవాసన పిందెల వాసన
పండ్లవాసన రైతువాసన
నిజం భలేగా…’
ఇప్పుడు కందిమళ్ల లక్ష్మి కవిత్వం లో పూల పక్కనే , సీతాకోకచిలుక పక్కనే రైతు కూడా చోటుచేసుకున్నాడు .
పొలాలలో/ పసివాడై పరవశించే
అమాయకుడి కళ్లల్లో
ఎర్రజీరల పద్యం.
నాగలిని/ మెడకు తగిలించుకొని
కల్మషాలకు తావివ్వని వాడి
ఆగ్రహ పద్యం.
అంటుంది , ఎర్రపద్యం అనే కవితలో.
ఇంకో కవితలో , దుఃఖం ను అకాల వర్షంతో పోల్చి , రైతు పంటకు ముడిపెడుతుంది.
‘ ఈ వర్షంలా దుఃఖమూ అంతే
ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు.
వచ్చినప్పుడంతా
ఆకాశానికి మబ్బు పట్టినట్టుగా
ముసురుకుంటుంది ఎంతో చీకటి చేస్తుంది.
అప్పుడే కదా వివేకం మేలుకోవాలి
లేదంటే, చేతికి అందవలసిన ధాన్యం
నేలపాలవుతుంది.’
ప్రకృతి నుంచి సామాజిక అంశాలవైపు కవులు అడుగులు వేయకతప్పదు . ఎంతని భావకతుతో , మార్మికతతో , నిజమైన వాస్తవాల నుంచి దూరంగా వుండగలరు . ఎంతగా వైయక్తిక జీవితం ప్రభావితం చేసినా , వైయక్తిక జీవితాన్ని నడిపించే సామాజిక జీవితాన్ని గుర్తించక తప్పదు. అప్పుడు హృదాంతరాలాన కవి వాక్కు దిక్కుల ధ్వనిస్తుంది. ఈ కవే అన్నట్టు..
‘ మరలా రెక్కలు వచ్చిన పక్షిలా
తెప్పరిల్లుకొని
నిజాయితీగా అడుగుతావు
శతాబ్దాల నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ
అదంతా ఒక కథలా సాగుతూ ఉంటుంది
ఒక పుస్తకం అవుతుంది
అనేకానేక సంఘటనలతో..’
తదుపరి, కందిమళ్ల లక్ష్మి కథల సంపుటి తో కనబడుతుంది.ఆమెకు అభినందనలు.
ఈ పుస్తకాన్ని ‘అస్త్ర ‘ ప్రచురించింది. కావాల్సిన వారు తెప్పించుకుని చదవండి. ‘అనల్ప ‘ వారు సోల్ డిస్ట్రిబ్యూటర్స్. నవోదయ బుక్ హౌస్ (హైదరాబాద్/కాచిగూడ) లో పుస్తకం లభిస్తుంది.
Leave a Reply