మరపురాని మనీషి

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

********

20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలు

                                                              తిరుమల రామచంద్ర

ప్రకృతి అందించిన భౌగోళికమైన ప్రత్యేకతలతో ఒక ప్రాంతం సహజంగా రూపుదిద్దుకుంటుంది. భౌతికమైన అసిత్వాన్ని దాటి తనదైన భాషా, సంస్కృతుల్నిపెంపొందించుకుని క్రమక్రమంగా ఒక విశిష్టమైన గుర్తింపును తెచ్చుకుంటుంది. ఆ విశిష్టతకు కారణమైన ఎందరో మహానుభావుల కృషి, త్యాగాలు ఒక అపురూపమైన వారసత్వాన్ని భావితరాలకి అందిస్తాయి.  

ఇప్పుడు మనం మాట్లాడుకునే పుస్తకం ఇలాటి అపురూపమైన వ్యక్తుల గురించి ఒక జాతి, ప్రాంతపు ప్రజల వైభవోపేతమైన సమీప గతాన్ని మన కళ్ల ముందుంచుతుంది. ఈ పుస్తకం “మరపురాని మనీషి”. రచయిత శ్రీ తిరుమల రామచంద్ర.

ఈ పుస్తకం నలభై అయిదు మంది ఆంధ్రప్రాంతపు దిగ్గజాలను పరిచయం చేస్తుంది. భాష, సాహిత్యం, సంగీతం, రాజకీయం వంటి అనేక విషయాలలో అంతులేని కృషి చేసిన ఈ లబ్దప్రతిష్టుల గురించి మనకు ఎన్నో విషయాలను చెపుతుంది. ఈ పుస్తకానికి ఉన్న మరొక ప్రత్యేకత ఈ మహానుభావులందరి జీవితాలను కళ్లకు కట్టి చూపించే అరుదైన ఛాయా చిత్రాలు. వాటిని శ్రీ నీలంరాజు మురళీధర్ గారు అందించారు.  

1962 -1964 ప్రాంతాలలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక ‘’మరపురాని మనీషి” పేరుతో 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలను ఛాయాచిత్రాలతో పాటుగా ఒక శీర్షికను అందించింది.

దశాబ్దాల క్రితం ఒక వారపత్రిక లో వచ్చిన ఈ శీర్షిక పుస్తక రూపాన్నిపొందటం వెనుక చాలా సంగతులే ఉన్నాయి. పుస్తకం ముందుమాటలో ప్రచురణకర్త శ్రీ శాయిగారు, శ్రీ అక్కిరాజు రమాపతి గారు, శ్రీ నీలంరాజు మురళీధర్ గారు పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇలాటి ఒక ప్రయత్నం చెయ్యాలన్న ఆలోచన, ఆచరణ అంత సులువుగా జరగలేదన్నది చెపుతాయి.

1999లో “మరపురాని మనీషి” శీర్షిక గురించి అక్కిరాజుగారు శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణగారితో ప్రస్తావించినపుడు వాటినన్నింటిని పుస్తకంగా తీసుకురావాలన్న ఆశ సత్యనారాయణగారికి కలిగింది. పుస్తకంలో శ్రీ నీలంరాజుగారి దగ్గర ఉన్న అరుదైన ఫోటోలు చేర్చాలనుకున్నప్పుడు నీలంరాజుగారు అంత సులువుగా ఆ ఫోటోలను ఇచ్చేందుకు ఇష్టపడలేదు. నెగిటివ్ లకు ఎలాటి నష్టం కలగకూడదన్నది వారి ఆలోచన, సంశయం. కానీ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి మధ్యవర్తిత్వంతో పుస్తక సంచాలకులు శ్రీ శాయిగారికి ఫోటోలు అందాయి. పుస్తకం తయారయ్యేప్పుడు, పూర్తైన తరువాత చూసిన నీలంరాజుగారు సంతృప్తిని పొందారు. సామాన్యులకు అందుబాటుకు రాని ఈ ఫోటోలు పుస్తకానికి ప్రాణవాయువు. 2001వ సంవత్సరంలో వచ్చిన ఈ పుస్తకం తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప చేర్పు అని ప్రత్యేకం చెప్పనక్కరలేదు.

ఆనాటి ఆంధ్రప్రభ వారపత్రిక ముఖ్యంగా రచయిత్రుల సీరియళ్లతో నడుస్తూ, కేవలం కథలకే ఎక్కువగా పరిమితమైందని, సాహిత్యానికి ఎక్కువ స్థానం లేదన్న సాహితీపరుల విమర్శను ఎదుర్కొంది. ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ బుద్ధవరపు చినకామరాజుగారు (తూలికా భూషణ్) పత్రికను సాహిత్యపరంగా శక్తిసంపన్నం చెయ్యాలనుకున్నారు. “మరపురాని మనీషి” శీర్షిక ద్వారా ఆంధ్ర దేశంలోని కవులను, కళాకారులను, పండితులను, వ్యాకరణవేత్తలను, నటులను, సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చిన మహిళలను, చరిత్రకారులను పరిచయం చెయ్యాలని, ఆ మహానుభావులను కలిసి వారి జీవిత విశేషాలను, జీవన శైలిని పాఠకులకు అందించాలనుకున్నారు. ఆ విషయాలను అక్షరీకరించే బాధ్యతను శ్రీ తిరుమల రామచంద్రగారికి, ఫోటోలను తీసే బాధ్యతను శ్రీ నీలంరాజు మురళీధర్ గారికి పురమాయించారు చినకామరాజుగారు.

“మరపురాని మనీషి” పుస్తక ముద్రణకు పూనుకున్న శాయిగారు వ్యాసాలను, ఫోటోలను సరిచూసుకుని, పదహారు మంది ప్రముఖుల మీది వ్యాసాలు కొరవడ్డాయని గ్రహించి, శ్రీ మల్లాది కృష్ణానంద్ గారి ద్వారా ఆ కొరవడిన వ్యాసాలను రాయించారు. (వివిధ రంగాల్లో నిష్ణాతులైన కీర్తిశేషులైన 116మంది తెలుగు ప్రముఖులతో “తెలుగు పెద్దలు” పుస్తకాన్ని నేటి యువతకోసం రాసిన అనుభవం వీరిది.) పుస్తక ముఖచిత్రం ప్రముఖ చిత్రకారులు శ్రీ చంద్ర గారు రూపొందించారు.

శ్రీ రామచంద్రగారి వ్యాసాలతో పాటు ఐదు వ్యాసాలను “ఆంధ్రప్రభ” వారు శ్రీ ఆరుద్ర చేత రాయించారని, వాటిని ఈ సంకలనంలో చేర్చే విషయంలో శ్రీమతి రామలక్ష్మీ ఆరుద్రగారి అనుమతి లభించనందున ఆ ఐదు వ్యాసాలను పరిహరించవలసి వచ్చిందనీ శాయిగారు ముందుమాటలో చెప్పారు.

ఇందరు ప్రముఖుల నిబద్ధత, నిజయితీ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని చదవటం ఒక గొప్ప అనుభవం. ఇందరు మహా మనీషులను దగ్గరగా తెల్సుకోవటం సంతోషాన్ని, ఒకింత గర్వాన్ని కూడా ఇస్తుంది.

ఈ పుస్తకంలో ఉన్న నలభై ఐదు మంది మహనీయుల గురించి ఒక్కో వాక్యం రాసినా బహుశా ఈ వ్యాసం సుదీర్ఘం కాక తప్పదు. కానీ ఈ పుస్తకానికిచ్చే నివాళిగా అది అవసరం.

“మరపురాని మనీషి” వ్యాసాలను ప్రచురించిన ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక యాజమాన్యం, ఆ వ్యాసాల కత్తిరింపులను జాగ్రత్తగా భద్రపరచి అందించిన డా. శ్రీపాద కృష్ణమూర్తిగారు, అందమైన వ్యాసాలను అందించిన శ్రీ రామచంద్రగారు, అరుదైన ఫోటోలను అందించిన శ్రీ నీలంరాజు మురళీధర్ గారు, ముఖచిత్రాన్ని రూపొందించిన శ్రీ చంద్రగారు, పుస్తకం గురించి ముందుగా ఆలోచన చేసిన డా. అక్కిరాజు రమాపతిగారు, పుస్తకాన్ని ప్రచురించేందుకు ముందుకొచ్చిన శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణగారు ఈ పుస్తకం రూపుదిద్దుకోవడంలో స్మరణీయులన్నది సంచాలకుల మాట. ఇంతటి బాధ్యతను తలకెత్తుకుని విజయవంతంగా పూర్తిచేసిన శ్రీ శాయిగారు వారిలో ఒకరు.

ఈ మహనీయులందరినీ స్వయంగా కలిసి, తమలోకి తాము చూసుకునేలా ప్రోత్సహించి, నిజాయితీతో కూడిన వారివారి జీవిత విశేషాలను శ్రీ రామచంద్రగారు సమర్థవంతంగా రాబట్టారు. కవి, నాటక రచయిత, విద్వద్విమర్శకుడు, లలిత కళావిశారదుడు, బహుముఖ ప్రజ్ఞ కలవారు అయిన రామచంద్రగారు మరో మరపురాని మనీషి.

ముందుమాటలో శ్రీ నీలంరాజుగారు సాహిత్యం పట్ల, ఫోటోగ్రఫీ పట్ల చిన్నప్పటినుండీ తనకున్న ఆసక్తిని, “మరపురాని మనీషి” శీర్షిక కోసం శ్రీ రామచంద్రగారితో చేసిన ప్రయాణాలను, తన అనుభవాలను ఆసక్తికరంగా, వివరంగా చెప్పుకొచ్చారు. పింగళి లక్ష్మీకాంతం గారు ఆదరంగా మాట్లాడినా ఈ శీర్షికలో భాగం కానని నిర్మొహమాటంగా చెప్పటం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో సంభాషణకు పట్టిన సుదీర్ఘ సమయం వంటివి ఇక్కడ పంచుకున్నారు. ఈ ప్రముఖుల ఫోటోలను తీసేటప్పుడు వారివారి సహజత్వాన్ని రాబట్టేందుకు తాను పడిన అవస్థను చెప్పారు. ఇవన్నీ పుస్తకానికి అందమైన అలంకారాలు.

పుస్తకంలోకి వెళితే…

శ్రీ కాశీ కృష్ణాచార్యులు గారు ఒక మహా సంస్థ వంటివారు. సాహిత్యం, తర్క వేదాంత గణితాది శాస్త్రాలు, అమరవాణి మొదలు ఆంగ్లం వరకు అనేక భాషలు, సేద్యం, సంగీతం, వీణా వేణు, వాయులీన మృదంగాది జంత్రవాద్యాల నైపుణ్యత, వడ్రంగం, కుస్తీ, గరిడీ వంటి చతుష్షష్టి కళలన్నీ ఆపోశన పట్టిన వారు. హాస్యం పట్ల మక్కువ. సంస్కృతం జాతీయ భాషే కాదు, విశ్వభాష కాగలదంటారు. ఆర్ష సంప్రదాయ ప్రతినిధులు. పది సంవత్సరాల వయసునుంచే పద్యాలు చెప్పటం మొదలుపెట్టి, 19వ ఏట తొలి అవధానం చేసి, సహస్రాధికంగా శాస్త్రార్థాలు జరిపి, పది పన్నెండేళ్ల పాటు ఆంధ్ర సంస్కృతోపాధ్యాయులుగా పనిచేసినా ఏదో కొరత, వెలితి వారికి తోచింది. అమరవాణీ ప్రచారానికి జీవితం అంకితం చేయడం తమ లక్ష్యమని నిశ్చయించుకున్నారు. దానికొరకు అనేక సంస్కృత గ్రంథాలు సరళంగా రచించారు.

1985లో జన్మించిన మాడపాటి హనుమంతరావు గారు అన్నిటికి చదువే పదిలమైన పునాది అని నమ్మినవారు. హైదరాబాదులోని నారాయణగూడ బాలికల పాఠశాల మొదలైనవి ఆయన కృషితో మహావట వృక్షాలయాయి. గ్రంథాలయ విస్తరణ, మహిళాభ్యుదయం, సాహిత్య విస్తృతి, వర్తక స్వాతంత్య్రం, బేగారీ (వెట్టి) నిర్మూలనం వంటి అనేక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఆంధ్రోద్యమాన్ని నడిపారు. ఆంధ్రమహాసభను స్థాపించి, సభలను గ్రామాలలో జరిపించేవారు. 24 సంవత్సరాలు లాయర్ వృత్తిలో ఉన్నప్పుడు సేవాదీక్షకు స్వర్ణయుగంగా పనిచేసారు. సాహిత్యం సమాజశ్రేయస్సును కోరాలి అని నమ్మారు. ప్రేం చంద్ రచనలు తెలుగు చేసారు. పద్మభూషణ బిరుదును పొందారు. హైదరాబాద్ కార్పొరేషన్ కి మొదటి మేయర్ వీరు. 1958లో మొదటి శాసన మండలికి మొదటి అధ్యక్షులు. భార్య మాణిక్యాంబగారిని చదివించారు.

1885లో జన్మించిన డా. గిడుగు వేంకట సీతాపతి గారు తెలుగు ప్రబంధాలలోని పద్యాలను, ఘట్టాలను, చాటువులను మొదలైన వాటిని “కవితోదయ చంద్రిక” పేరుతో ఆంధ్రేతరుల కోసం సంస్కృతంలోకి అనువదించారు. గ్రీకు, లాటిన్, జర్మన్ అనాది భాషలు, మరెన్నో భాషలపై పట్టు ఉంది. పర్లాకిమిడి తాలూకాను ఒరిస్సాలో కలపాలన్న పర్లాకిమిడి రాజాగారిని ఎదిరించి బాహాటంగా ఆంధ్రోద్యమంలో పాల్గొన్నారు. సవరలను గురించి పరిశోధన చేసారు. సవర సాహిత్యాన్ని గురించి తెలుగు, ఇంగ్లీషులలో రాసి, వాషింగ్టన్ లోని ఇంటర్నేషనల్ అకాడమీ వారి “డాక్టర్ ఆఫ్ లెటర్స్” బిరుదును పొందారు. అనేక గ్రంథాలను రచించారు. సినిమాలలో నటించారు. చదరంగం, సైకిలు పోటీల పట్ల అభిమానం. 1948లో తెలుగులో విజ్ఞానసర్వస్వం మొదలైనప్పటినుండి పది సంవత్సరాలు ప్రధాన సంపాదకులు వీరు.

1887లో జన్మించిన శ్రీ హరార్కే గుండేరావు గారు అరబ్బీ, ఫారసీ, ఉర్దూ భాషలు నేర్చి, ఇస్లాం తత్త్వశాస్త్రాన్ని భారతీయ తత్త్వభావనతో సమన్వయపరచి ఖురాన్ షరీఫ్ ను అరబ్బీ నుంచి, మన్ననీ షరీఫ్ ను ఫార్సీ నుంచి సంస్కృతీకరించారు. ముస్లిం ధార్మిక సమావేశాలలో వారి ఆహ్వానంపై పాల్గొని “హిందువులు గోవును పూజించి గౌరవిస్తే, మీరు భగవంతుని పేర బలి ఇచ్చి గౌరవిస్తారు. దారులు వేరే కానీ భావం సమానమే. అలాగే మూర్తి పూజ విషయంలోనూ మన ఇద్దరి ఉద్దేశాలు పవిత్రమైనవే. కాలదేశాలను బట్టి మార్గాలు మారాయి.” అని చెప్పారు. బీదర్ దగ్గర అగ్రహారంలో జన్మించిన హర్కారే నాలుగుభాషలు చిన్ననాడే నేర్చారు. వారి భాషా పాండిత్యాన్ని, న్యాయశాస్త్ర వైశారద్యాన్ని చూసి ప్రభుత్వం జిల్లా జడ్జిగానూ, ఆ పైన కలెక్టర్ గా నియమించింది. న్యాయశాఖ పై అభిమానంతో వారు జడ్జిగానే పనిచేసారు. ఫార్సీ, ఉర్దూ, ఇంగ్లీషుల ద్వారా సంస్కృతభాషా ప్రచారం వారి లక్ష్యమని చెప్తారు.

శ్రీ తాపీ ధర్మారావు గారు ఆగర్భ శ్రీమంతులు. చిన్నవయసులోనే సంస్థానాధీశులతో మెలిగి సకల భోగాలూ అనుభవించి, వివిధ మానవ ప్రవృత్తులూ చూసినవారు. వ్యావహారిక భాషావాదంలో గిడుగువారిని ఎదిరించారు. “విలాసార్జున” నాటకంలో గురజాడను దుయ్యబట్టారు. ఆడంబరాలు గిట్టవు. గోల్ఫ్, చదరంగం ఆడేవారు. గుర్రపుస్వారీలో నిపుణులు. “విజయవిలాసం” లోని పద్యానికి వేదం వేంకట రాయశాస్త్రిగారి వ్యాఖ్యానం సంతృప్తి కలుగక, ఆ కవి హృదయాన్ని మరింత బాగా తెలిపేందుకు వ్యాఖ్య రాసి పత్రికలో ప్రచురించారు. ”సారంగధర” చిత్రంతో సినిమా రంగంతో సంబంధం ఏర్పడగా, దాదాపు పది సంవత్సరాలు అది జీవనాధారమైంది. న్యాయం కోసం ఎంతటివారినైనా ఎదిరించగలవారు. తమ భావాలను సౌమ్యంగానైనా కచ్చితంగా చెప్పేవారు. తెలియని విషయాన్ని ఎంత చిన్నవాడు తెలిపినా స్వీకరించే సరసత. తప్పుని దిద్దికుని ముందడుగు వేసే గుండెనిబ్బరం, శత్రుత్వంతో వచ్చినవారిని కూడా మిత్రులను చేసుకునే సరళత వీరి సుగుణాలు.

1887 లో జన్మించిన శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారు జీవితాన్ని సారస్వతోద్యమానికి అంకితం చేసారు. అర్థ శతాబ్ది పైచిలుకు తెలంగాణా చరిత్ర తిరగవేస్తే సేవా రంగంలో వీరు, శ్రీ మాడపాటి హనుమంతరావుగారూ కవలలుగా కనిపిస్తారు. మాడపాటివారి సంఘసేవకు దీటుగా ఆదిరాజుగారి సారస్వతసేవను చెపుతారు. చిన్నతనాన తండ్రి మరణంతో బంధువుల దగ్గర పదమూడేళ్ల వయసు వరకు చదువుకుని, ఇంగ్లీషు చదువుకు తల్లితో కలిసి హైదరాబాదు వచ్చారు. ప్రముఖ దేశభక్తులు, సారస్వత పోషకులు, తెలుగువారికి పట్టుగొమ్మ గా ఉన్న రావిచెట్టు రంగారావు గారి వద్ద ఆశ్రయం పొందారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, విజ్ఞాన వర్థినీ పరిషత్తు, ఆంధ్ర చంద్రికా గ్రంథమాల వంటి సంస్థలకు మూలపురుషులుగా సేవ చేసారు. హైస్కూల్ లో భారతీయ పురాణ కథ పాఠం చెపుతున్నప్పుడు ఒక విద్యార్థి ఆక్షేపించగా, “జాతి ఎంత ప్రాచీనమైతే అంత విడ్డూరపు ఐతిహ్యాలుంటాయి” అని చెప్పి సమాధానపరిచారు. గ్రీకు పురాణ గాథలను రాసారు.

1889 లో శ్రీ మామిడిపూడి వేంకటరంగయ్య గారు జన్మించారు. తాను అభిమానించిన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. విజయనగరం మహారాజా వారి కోరికపై దివానుగా పనిచేసారు. వారితో సంబంధంలేని సంఘహితోద్యమం ఆంధ్రప్రదేశ్ లో కనిపించదు. సహకారోద్యమంలో, గ్రంథాలయోద్యమంలో, బ్యాంకింగ్ ఉద్యమంలో మామిడిపూడివారు ప్రధాన పాత్ర వహించారు. అనేక గ్రంథాలు రాసారు. అప్పటి విద్యావిధానం వారికి నచ్చలేదు. “చదువులో శిష్యులకు, గురువులకు శ్రద్ధ కనిపించదు. విద్యా ప్రమాణం తగ్గిందని నా నమ్మకం. పూర్వం ఇప్పడున్నన్ని వినోదాలు లేవు. అందువల్ల విద్యార్థుల దృష్టి ఏకాగ్రంగా ఉండేది.” అంటారు వారు. ఇది ఇరవైయవ శతాబ్దపు అరవయ్యో దశకం నాటి మాట. ఇప్పటి విద్యా విధానం, ప్రమాణాలు చూస్తే వారు ఎంత నిరాశకు గురవుతారో! శ్రీ రామచంద్రగారు వారిని కలిసేటప్పటికి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వాతంత్య్రోద్యమ చరిత్ర తృతీయ సంపుట రచన చేస్తున్నారు. దానికొరకు రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నారు.

1890 లో శ్రీ గన్నవరపు సుబ్బరామయ్య గారు జన్మించారు. “భారతి” పత్రిక ద్వారా నవ రచయితలందరినీ తీర్చిదిద్దినవారు వీరు. “భారతి” పత్రికలో రచన పడడమంటే పులిట్జర్ బహుమతి సంపాదించినట్లేనని భావించే ప్రమాణాన్ని, ప్రతిష్టని సంతరించిన వారు. ఎవరిపట్లా పక్షపాతం చూపని పట్టుదల, ఎవరేమనుకున్నా నమ్మినదానిని ఒంటరిగా అనుసరించే గుండె నిబ్బరం, తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పే తెగువ, తన ద్వారా పలువురికి మేలు జరగాలన్న తపన, తాము చేసే పని అందరి మెప్పు పొందాలన్న వ్యగ్రత సమిష్టిగా గన్నవరపువారి స్వరూపం. ఇంగ్లీషు భాషతో పాటు అనేక భారతీయ భాషలను తెలిసినవారు. శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి ఉత్తమ సాహిత్య మాసపత్రిక ప్రచురిద్దామనే సంకల్పం కలగగా, దాని నిర్వహణకు ప్రాచ్య భాషా పాండిత్యం, ఆధునిక విజ్ఞానం, రాజకీయాలతో పరిచయం, దక్షత కలవారి కోసం అన్వేషించి, వేటూరి ప్రభాకరశాస్త్రి గారి ప్రోద్బలంతో గన్నవరపువారిని అందుకు నియమించారు. వాస్తు శిల్పాది వివిధ శాస్త్రాలకూ, శాసన చరిత్రాది పరిశోధనకూ, సాహిత్య విమర్శకూ ఇతర భాషలవారూ వరవడిగా తీసుకోదగినంత అపూర్వంగా “భారతి” ని తీర్చిదిద్దారు. “జర్నలిజం దేశ ఔన్నత్యాన్ని సాధించేదిగా, సంఘ మర్యాదను కాపాడేదిగా ఉండాలని” వారంటారు.

1891లో శ్రీ నేలటూరి వేంకటరమణయ్య గారు జన్మించారు. “దొరలు వ్రాసిన చరిత్ర వఠ్ఠి అబద్ధాలు. వాటిని నమ్మవద్దు. మనకు కావలసింది సత్యం” అని వీరి ఉపాధ్యాయులు శ్రీ వేదం వేంకటాచలయ్యగారు చెప్పగా అ మాటలు వేంకటరమణయ్యగారి మీద ప్రభావం చూపాయి. వీరిని నేలటూరి వేంకటరమణయ్యగారని కాక హంపీ వేంకటరమణయ్యగారనో, విజయనగరం వేంకటరమణయ్యగారనో అంటే చప్పున చరిత్రాభిమానులందరికీ తెలుస్తుంది. మద్రాసు విశ్వవిద్యాలయంలో చరిత్రలో మొదటి డాక్టరేట్ (1930) వీరిదే. అంశం “ఆరిజన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ టెంపుల్స్”. అనేక చరిత్ర గ్రంథాలను రాసారు.

1892లో శ్రీ తల్లావజ్ఝల శివ శంకరశాస్త్రి గారు జన్మించారు. మెట్రిక్యులేషన్ తరువాత అనేకమంది మహాపండితుల వద్ద న్యాయ వ్యాకరణ వేదాంతాలు, వివిధ దేశ, విదేశ భాషలు నేర్చారు. శరీరవ్యాయామం, వ్యవసాయం, ఉద్యాన కళ తో పాటు ఈత, గుర్రపుస్వారీ నేర్చారు. క్రికెట్, టెన్నిస్, బేస్ బాల్ వంటివి ఇష్టమైనవి. చిత్రకళ, శిల్పం నేర్చుకున్నారు. అనేక కావ్యాలు, పద్యాలు, నాటికలు, నవలలు రాసారు. ఉపాధ్యాయులుగా పనిచేసారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని కారాగారానికి వెళ్లారు. సక్రమమైన సంప్రదాయంలో, నవీన దృష్టితో, నూతన కల్పనలతో సాహిత్యం పెంపొందించటమే లక్ష్యంగా వారు జీవించారు. “మనభాష కాక మరి రెండు భాషలు ప్రతివారికీ రావాలి” అంటారు. వారొక విజ్ఞాన సర్వస్వం. సంచార గ్రంథాలయం. తల్లావజ్ఝల వారి ఆత్మకథ “నాలో మార్పు” అన్నపేరుతో 1936లో “ప్రతిభ” పత్రికలో వచ్చింది.

శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారికి పాతికేళ్లు నిండని వయసులో రవీంద్ర కవీంద్రుడు మైసూరుకు వచ్చారు. రవీంద్రుడు పాడుతూ ఉంటే వెంటవెంటనే స్వరపరచుకుంటున్న ఈ యువకుడిని చూసి రవీంద్రుడు ఆశ్చర్యపడ్డారట. అప్పటికే ఆ యువకుడు సంగీతసాహిత్య రంగాలలో సుప్రతిష్ఠితుడనీ, మైసూరు మహారాజాస్థాన విద్వాంసులలో ఎనిమిది రూపాయల నెల జీతం పుచ్చుకుంటున్నవాడని రవీంద్రునికి తెలియదు. రాళ్లపల్లి వారి విమర్శనలను కొంచెం చదివినా తత్త్వమును దెలిసికొనవలెనను ఆశ, తెలిసిన వానిని నిర్భయంగా ప్రపంచానికి బోధించు ధైర్యం, మంచి పదునుగల చురకత్తి వంటి రచనాశక్తి, దానికి మెరుగిచ్చునట్టి సూక్ష్మదృష్టి, గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్టు తిడుతూనే నవ్వించే హాస్య కుశలత వారి విమర్శలకు మూలద్రవ్యాలని తెలిసిపోతుంది. అనేక విమర్శ గ్రంథాలను వెలయించారు. 38 సంవత్సరాలు మైసూరులో మహారాజ కళాశాలలో ఆంధ్రపండిత పదవిని నిర్వహించారు. “ఇప్పటికీ ప్రాచీన సాహిత్యాభిరుచి జనంలో తగ్గలేదని, ప్రాచీన గ్రంథాలపై అభిరుచి కలిగించటానికి పఠనం అవసరమని” అంటారు. “సాహిత్య పరమార్థం – అన్ని కళల పరమార్థం – అలౌకికానుభవం, చిత్త సంస్కారం” అంటారు.

శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అపస్వర వాద్యమని, “నిరాధార వాద్య” మని మన సంగీత విద్వాంసులు అనే వయొలిన్ ను సాధించి, స్వాధీనం చేసుకున్నారు. పాశ్చాత్యుల వయొలిన్ టెక్నిక్ ను పరిపూర్ణంగా తెలుసుకొని, వయొలిన్ వాయించే తీరును మన సంగీత రుచుల పారిశుద్ధ్యం ఏమాత్రం చెడకుండా ప్రదర్శించేవారు. “ఏ సంగతి వాయించినా ఎంత మృదువుగా, ఎంత ఘనంగా కమాను తీసినా, నాదంలో స్నిగ్ధత, గాంభీర్యం కొంచెమైనా చెదరక, దృఢ సంకల్పంతో, నిశ్చలమైన నమ్మికతో, ఏకాగ్ర దృష్టితో ఫిడేలే తామై, తామే ఫిడేలై నాదామృతపు సోనలు కురిపించిన నాయుడుగారు ఫిడేలు నాయుడుగారు” అని శ్రీ రాళ్లపల్లివారన్నారు. కర్నాటకలో పుట్టి, తెలుగునాట జీవించి, తమిళనాడులో స్థిరపడిన నాయుడుగారి మహోన్నత దశకు కారణం వారి సాధన.

1894 లో శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు జన్మించారు. చిన్ననాటి నుంచి చేసిన సంగీత సాధన, దానికి తోడు శ్రావ్యమైనా గంభీరమైన శారీరం, వాదవివాదాలలో ఒడుపు, ఎదిరిని బెదరగొట్టే సమయస్ఫూర్తి వారిని ప్రతివాది భయంకరులుగా చేయగా, వారి సరసత ప్రతివాది శివశంకరులుగా తీర్చిదిద్దింది. “భాష ఉద్ధరించబడాలనే దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. దానికి భాషా పరిశోధన అవసరం.” అని చెప్పే దీపాలవారు భాషా స్వరూప జిజ్ఞాసువులకు, కావ్యరస పిపాసువులకు, సత్యాన్వేషకులకు గండాదీపంగా, అఖండదీపంగా వెలుగులు వెలార్చుతూ వెలుగొందుతున్నారు.

శ్రీ కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు శాంతస్వభావులు. దేశంలోని వివిధ ప్రాంతాలను, ప్రజలను ఒక్క కొలిక్కి తీసుకురావడానికి సాహిత్యం ఒక్కటే ఉత్తమ సాధనమని నమ్మారు. అందుకోసం పరిపాలన భాష అయిన ఇంగ్లీషు ద్వారానే తెనుగు సొబగులను ఇతర ప్రాంతాలవారికి, ఇతర దేశాలవారికీ అందించాలని నమ్మి, ఆ కృషిలో భాగంగా అనేక అనువాదాలు చేసారు. “రాజనీతిజ్ఞులకన్నా సాహిత్యవేత్తలే భారతదేశ సమైక్యత సాధించగలరని అభిప్రాయపడ్డారు. “త్రివేణి” ని ఉత్తమస్థాయిలో నడిపారు. కొంతకాలం కృష్ణాపత్రికకు సంపాదకత్వం వహించారు. పశుత్వం నుంచి మానవత్వానికి, మానవత్వం నుంచి దైవత్వానికి దారితీసేదే ఉత్తమ సాహిత్యమంటారు.

1895 లో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు జన్మించారు. వీరికి శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారితో కల్సి పద్యాలు చెబుదామని ఉబలాటంగా ఉండేది. ఒకనాడు బందరులో వారిని కలిసినపుడు ఆ మాట చెప్పగా, పింగళివారు “ఛస్! నీకేమి వచ్చు. సంస్కృతమా? తెలుగా? ఇంగ్లీషా?” అని కస్సుమన్నారట. విశ్వనాథలో పట్టుదల పెరిగింది. సంస్కృతం పై పట్టు సాధించారు. దానితో వారి రచన క్లిష్టతరమవటంతో మిగిలిన కవులు వారిని “పాషాణపాక ప్రభూ” అని సంబోధించారు. అది విశ్వనాథవారిలో సంఘర్షణకు కారణమై, తన మార్గం తనదేనన్న నిర్ణయానికి తెచ్చింది. విశ్వనాథ వారి పాత్రలు కొంత వేషం మార్చుకుని తిరిగే లోకంలోని మానవులే. వీరు హాస్యప్రియులు. స్టంట్ సినిమాలు, ఇంగ్లీషు సినిమాలు ఇష్టం. లక్షన్నర పుటలు పైగా రాసిన విశ్వనాథ వారి రచనలకున్న ప్రాచుర్యం భారతదేశంలో ఏ ఇతర కవి రచనలకూ లేదు. వీరు పట్టి సాధించని సాహిత్య ప్రక్రియ లేదు. “వేయి పడగలు” నవల వేయి పుటలు 29 రోజులలో చెప్పి రాయించారు.

1895లో జన్మించిన శ్రీ గుర్రం జాషువా గారు విశ్వమానవ మతాభినివేశంతో కరుణరసం కలబోసి భారతమాతకు కల్పనానల్ప కవితామందిరాలు నెలకొల్పారు. “దొరల రాచరికమె మెరుగయ్యె ననిపించె మారుపల్కవేల మంతిరన్న” అని గద్దించగల ధైర్యసాహసాలు, “చెవులు బట్టి పిండి శిక్షించి జడమైన కట్టెకెట్లు విద్య గరపినాడో!” అంటూ ద్వారం వారి గురించి సహజసుందరంగా చోద్యాలుపోయే గడుసుతనం వారి ప్రతిభకు కొద్ది ఉదాహరణలు. ఒకమారు గాంధీని కల్సినపుడు అక్కడున్న ఒక జర్మన్ పండితునికి ఒక రాజకీయ నాయకుడు వారిని “దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ పొయట్” అని పరిచయం చేశారట. కవితకు కులమతాలు అంటగట్టడం ఎలాటి సభ్యతో అర్థం కావటం లేదంటారు గుర్రంవారు. “విశ్వమానవ సౌభ్రాత్రం, నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం” అని చెప్పే గుర్రంవారు తన కవిత్వం సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలనుకుంటారు. వారి “గబ్బిలం” మహా కావ్యం.

శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ గారు జాతీయోద్యమ సమయంలో సంఘశ్రేయస్సు లక్ష్యంతో రచనలు చేసారు. జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో, మహిళాభ్యుదయ సంఘసంస్కార కార్యకలాపాలు విస్తరిస్తున్న రోజుల్లో ఎందరో మహిళలు ప్రబోధ వ్యాసాలు రాసేవారు. “మా చెట్టు నీడ ముచ్చటలు” అనే శీర్షిక కింద లీలాదేవి అనే వారు రాసేవారు. అవి ఆగిపోయిన తరువాత “శారద లేఖలు” శారద అనేవారు రాసేవారు. అవన్నీ దేశం స్వతంత్రం కావాలని, తెలుగునాడు సమైక్యం కావాలని పడిన ఆవేదనల ముచ్చట్లు. ఆ లీలాదేవి, ఆ శారద పెద్ద చదువు, పదవీ లేని కనుపర్తి వరలక్ష్మమ్మగారని అతి ప్రయత్నం మీద ప్రపంచానికి తెలిసింది. ఆమె అన్నలు చిన్ననాటినుంచీ చదువు విషయంలో ప్రోత్సహించారు. 1909లో వివాహమైన తరువాత సంస్కరణాభిలాషి అయిన భర్త ఆమెకు తోడ్పాటునివ్వటమూ వారి అదృష్టం. చోరగుడి సీతమ్మగారి సాంగత్యంతో సంస్కృతం, తెనుగు పంచకావ్యాలు చదివారు. 1921లో బెజవాడలో కాంగ్రెస్ సమావేశానికి గాంధీ వచ్చినప్పుడు కనుపర్తివారు వారిని కలిసారు. గాంధీజీ కోరిన ప్రకారం ఆనాటినుండీ ఖద్దరు వ్రతం పట్టారు.

1897లో జన్మించిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మాటలు వింటూంటే ఉన్నత పర్వతాగ్రం మీదో, సంజమబ్బుల పవడాల చాయలలో నదీతీరానో, ఉద్యానవనంలోనో, సముద్రపు అంచులలోనో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. “దేవులపల్లి వంశమున దేవులు పుట్టిరి” అని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు ప్రశంసించారు. దేవులపల్లి కుటుంబంలో అందరూ పండితులే. బాల్యంలో తండ్రి, పెత్తండ్రిగార్ల శిక్షణ, ఆపైన కాకినాడ కళాశాలలో రఘుపతి వేంకటరత్నం నాయుడుగారు, రామానుజాచార్యులుగార్ల ప్రోత్సాహం కృష్ణశాస్త్రిగారిని తీర్చిదిద్దాయి. రొమాంటిక్ ఉద్యమ ప్రవాహం వారిని ముంచెత్తింది.  “ఆకులో ఆకునై, పూవులో పూవునై…” అంటూ వారు గొంతు విప్పారు.  “నాకు కవిత్వం పుట్టలోని పాములాగ, తెల్లవారి తలుపులు తట్టి వచ్చిపడే అతిథిలాగ, రేకులు విచ్చుతున్న పూవులాగ రకరకాలుగా వస్తుంది.” అంటారు వారు. “ఎప్పుడో హృదాయావేదన భరించనప్పుడు కేక పెడతాను. అది కీర్తన అవుతుంది.” అన్న వారి మాటలు మధురంగా తోస్తాయి. “నాది చిక్కని కవిత అని నా నమ్మకం” అనిచెప్పే దేవులపల్లి వారిని నవ్యకవితా ప్రస్థానాచార్యులుగా చెపుతారు శ్రీ తిరుమల.

శ్రీ అద్దంకి శ్రీరామమూర్తి గారు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు నటనరంగంలో కరుణరస ప్రవాహాలు పారించి సహృదయులను ముంచెత్తిన నటసార్వభౌములు. ధర్మరాజు, కణ్వుడు, దశరథుడు పాత్రలు వారికి మక్కువ. పాండవ విజయం లో వారు ధర్మరాజుగా నటిస్తూ అభిమన్యుని “ఆకర్ణాంతములైన ఆ కనులు…ఆ మోకాల్మీదికి జారు చేగవ” అని పద్యం పాడుతుంటే ప్రేక్షకలోకం ఏడిచేది. వ్యాయామం పట్ల ప్రీతితో కుస్తీలు పట్టేవారు. ఉపాధ్యాయ శిక్షణ పొందాద్రు. కానీ నాటకాలలోకొచ్చారు. సంగీతం బాగా రావాలన్న ఆలోచనతో వేషాలు మాని, శ్రీ పారుపల్లి రామకృష్ణయ్యగారి వద్ద సంగీతసాధన చేసి పదేళ్లు కచేరీలు కూడా చేసారు. పదిహేను సంవత్సరాల సినిమా జీవితం ఉజ్జ్వలంగా సాగింది. వారు సంగీతంలో ఉంటే అపర త్యాగబ్రహ్మ, వ్యాయామంలో ఉంటే రెండవ రామమూర్తి అయి ఉండేవారు. ఎక్కడున్నా వారిది వెలిగే జాతకమే.

1899లో జన్మించిన శ్రీ నాయని సుబ్బారావు గారు ఆత్మాశ్రయ కవితా నూతన ప్రవాహంలో ఉవ్వెత్తుగా లేచిన మహాతరంగమైనవారు. విశ్వనాథవారి “వేయిపడగలు” లో ప్రణయ తపస్వి, ప్రణయ సిద్ధుడు అయిన కిరీటి మరెవరో కారు, శ్రీ నాయనివారే. బి.ఎ. ఆఖరు సంవత్సరంలో జాతీయోద్యంలో పాల్గొని, చదువు మానుకున్నారు. ఒంగోలులో ఆంధ్రకేసరి ప్రకాశంగారి జాతీయ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసారు. వారు తక్కిన భావకవులవలె కాక ప్రణయాన్ని దేవీమూర్తిలోని ఒక అంశంగా, ఒక కళగా దర్శించారు. వారి పద్యాలు జీవితాన్ని చీల్చుకుని, చక్కగా, చిక్కగా వస్తాయి. వారి పెద్ద కుమార్తె ప్రసిద్ధ కవయిత్రి శ్రీమతి నాయని కృష్ణకుమారి. చిన్నప్పుడు మాతృభాషను నేర్చుకుంటే ఇతర భాషలు నేర్చుకోవడం సులభమని, భాషల మూలసూత్రాలన్నీ సమానమే కనుక మాతృభాష మూలసూత్రాలు ఒంటబట్టాలని వారు అంటారు.

1900లో జన్మించిన శ్రీ పులిపాటి వేంకటేశ్వరులు గారు సంపన్న కుటుంబంలో, మంచి అభిరుచులతో పెరిగారు. అర్దశతాబ్ది నాటకానుభవం ఉన్నవారు. శనివారాలు, అమావాస్యలు, నాటకంలో అభినయించే నాటి రాత్రిళ్లు ఉపవాసముండి నటనను వ్రతంగా ఆచరించినవారు, రచనాకౌశలమున్నవారు కావటంతో నాటక కళను, నాటక శాలలను గురించి ఎన్నో వ్యాసాలు రాసారు. జనానికి మంచి అభిరుచి కలిగించే బాధ్యత నటులదేననీ, వ్యాపార దృష్టితో కాక కళాదృష్టితో నాటక ప్రదర్శన జరగాలంటారు. నాటకం సినిమా కన్నా కళాదృష్టితో పై స్థాయిదని వారి గట్టి నమ్మకం. నాటక సంఘాలు, ప్రభుత్వం, మంచి విమర్శకులు నాటకాభివృద్ధికి తోడ్పడాలని అంటారు. ప్రజలను సన్మార్గానికి మళ్లించే ఏ విషయమైనా నాటక వస్తువేనంటారు.

1901లో జన్మించిన శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారు జీవితానికి, రచనకూ సంబంధం ఉంటే వ్యక్తిత్వం, రచన రాణిస్తాయని నమ్ముతారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా బ్రతకాలని, నిరాడంబరంగా ఉండాలని శ్రమించారు. తిలక్ జాతీయ కళాశాల ప్రారంభించి తెలుగు బోధించటం మొదలుపెట్టారు. దానితో పాటు జాతీయ కార్యక్రమం, ఖద్దరు విక్రయం, కాంగ్రెస్ ప్రచారం సాగించారు. “కవితా పరమావధి రసం, ఆనందం. మానవ హృదయాన్ని సంస్కరించడానికిగాని, శాంతి కలిగించడానికిగాని ఉపయోగపడేదే ఆనందం.” అంటారు. “రచయితలు సంఘానికి సరైన సందేశం ఇచ్చినప్పుడు, సంఘం కూడా వారి సందేశానికి కొంత విధేయమవుతుంది” అంటూ నేటి కవి బాధ్యతను సూచిస్తారు. కాలానుగుణమైన భావవిప్లవం అవసరమంటారు.

1902లో జన్మించిన శ్రీ ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి గారు ఇరవై సంవత్సరాల వయసులో ఉభయ భాషలలోనూ అష్టావధాన, శతావధానాలు వందకు పైగా చేసారు. దర్శనాలు అధ్యయనం చేయనిదే, నిత్య జీవితానికి ఉపయోగపడే వాస్తు జ్యోతిషాదులు తెలియనిదే సంపూర్ణత్వం లభించదని త్రివిధ జ్యోతిశ్శాస్త్రం అభ్యసించి, పది సంవత్సరాలు పంచాంగాలు గుణించి ముద్రించారు. ఇరవైయవ ఏట నుంచి పాతిక సంవత్సరాలపాటు కాంగ్రెస్ సభ్యులుగా ఉండి దేశసేవ చేస్తూ, కులమత భేదాలు పాటించక అందరికీ విద్యాదానం చేసారు. వారికి భారతీయ సంస్కృతిపై అపారమైన భక్తిశ్రద్ధలు. ప్రాచీన ధర్మాలను ఉద్ధరించాలని, అస్పృశ్యులను శుద్ధి చేసి కలుపుకోవాలని వారి నిర్ణయం.  ప్రజలలో ఇప్పటి పరిస్థితిపై వెగటు పుట్టి మన ప్రాచీన సంస్కృతిపై అభిరుచి కలుగుతుందన్నది వారి విశ్వాసం.

1902లో జన్మించిన శ్రీ స్థానం నరసింహారావు గారు చిన్ననాటినుంచే సంగీతమన్నా, ప్రాచీన సాహిత్యమన్నా, చిత్రకళ అన్నా అభిరుచి ఉండేది. 19 ఏళ్లు వచ్చేటప్పటికి వర్తమాన చిత్రకళలోనూ, ఫోటోగ్రఫీలోనూ ఒక స్థాయిని సాధించారు. సామాన్య ఉపాధ్యాయునిగానో, చిత్రకళోపాధ్యాయునిగానో జీవించదలచిన స్థానం వారికి అనుకోకుండా వచ్చిన చంద్రమతి వేషధారణతో, తిరుపతి వేంకటకవుల ఆశీఃప్రభావంతో జీవితస్థాయి మారిపోయింది.

ఒకసారి మూడురాత్రులు వరుసగా నాటకాలు వేసిన సందర్భంలో స్థానంవారు మూడోరోజు రాత్రి కృష్ణతులాభారం నాటకం వేయడం జరిగింది. నారదుడు సత్యభామతో సంభాషిస్తున్న ఘట్టం. అలసి ఉన్న స్థానంవారు చంద్రమతి వేషంలో నారదుడు చెబుతుండగా ఆవులించారు. స్థానం వారిని ఎలాగైనా తప్పు పట్టుకోవాలని చూస్తున్న తోటి నటులు ఆ మర్నాడు ఆ విషయం గురించి ప్రశ్నించి తప్పు కట్టమని కోరారు. సత్యభామ సౌభాగ్య గర్వం, అజాగ్రత్త చూపడం అవసరం కనుక అలా ఆవులించడం ఒప్పే అవుతుందని స్థానంవారు సమర్థించుకున్నారు. ఈ విషయం గురించి “ఆనాటి నా ఆవలింత” అనే వ్యాసం ఆంధ్రప్రభలో వారే రాసారు. 38 సంవత్సరాల నటజీవితంలో 16 వందల ప్రదర్శనలు జరిపారు. వారి స్వీయచరిత్ర “నటస్థానం.”

1905లో జన్మించిన శ్రీ నీలంరాజు వేంకటశేషయ్య గారు ద్వితీయ ప్రపంచయుద్ధ సమయంలో “ఆంధ్రపత్రిక” ప్రత్యేక ప్రతినిధిగా ఆగ్నేయాసియా దేశాలలో పర్యటించి యుద్ధ వార్తలు పంపారు. అప్పటి తెలుగు పత్రికా రచయితలకు ఎవరికీ లేని, ఆయనకు ప్రత్యేకంగా ఉన్న అర్హత – తెలుగు షార్ట్ హ్యాండ్ యోగ్యతాపత్రం. రామదాసు ధ్యానమందిర నిర్మాణం, వాగ్గేయకార వార్షికోత్సవం ఏర్పాటు వంటి రెండు కలలను కని అత్యంత విజయవంతంగా ఆ కలలను నిజం చేసుకున్న లౌక్యులు శేషయ్యగారు. వారి లౌక్యం ప్రశాంతగంభీరం, పరోపకార పరాయణం. రాయలసీమ కరువుకాటకాలకు, తుఫాను వరద బాధితులకు నిధులు సేకరించిన ఆంధ్రప్రభ ద్వారానే భద్రాద్రి రామాలయ పునరుద్ధరణకూ నిధిని సేకరించారు. వారు సహజ శాంత గంభీరులు. గాంధీజీ అనుయాయులు. శేషయ్యగారి రెండవ కుమారుడు శ్రీ నీలంరాజు మురళీధర్ “ఆంధ్రప్రభ” ఫోటోగ్రాఫర్ గా “మరపురాని మనీషి” శీర్షికకు శ్రీ తిరుమల రామచంద్రగారితో కలిసి ప్రముఖుల ముఖాముఖీలో పాల్గొని, అమూల్యమైన ఫోటోలను అందించారు.

శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారు కూచిపూడి నాట్యకళా ప్రచారం చేసి, దానికి విశ్వవిఖ్యాతి చేకూర్చడమన్నది తన లక్ష్యంగా చేసుకున్నారు. బందావారి నటనను రంగస్థలం పై చూసిన బళ్లారి రాఘవగారు తన వారసుడొచ్చాడని ఆనందంగా ప్రకటించారు. తల్లి సుందరమ్మగారి పుణ్యాన పాట అంటే చిన్ననాడే వారికి సరదా ఏర్పడింది. కళాశాలలో ఉండగానే నాటక కళపట్ల ఉత్సాహం చూపారు. చెన్నపురిలో న్యాయవాది పట్టా పుచ్చుకున్న తర్వాత ఏలూరులో వకాల్తా పుచ్చుకుని రెండేళ్లపాటు బాగా ఆర్జించారు. కానీ కళ వారిని ఊరుకోనివ్వలేదు. “ప్రభాత్ థియేటర్స్” అనే నాటక సమాజాన్ని స్థాపించి, నాటకాలు ఆడారు. ఇరవై అయిదేళ్లు నాటక సమాజం నడిపారు. విదేశాలలో పర్యటించి అక్కడి నాటకరంగాలు పరిశీలించి వచ్చారు. పదేళ్లు సినిమా జీవితమూ సాగింది. కూచిపూడి నాట్య సంప్రదాయ సముద్ధరణం కోసం సిద్దేంద్ర కళాక్షేత్రం పేరుతో కూచిపూడిలో నాట్య పాఠశాల స్థాపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక ప్రయోక్తగా పనిచేసారు.

1908లో జన్మించిన శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అద్దంలో కొండలాగ, నివురులో నిప్పులాగ, కుండలో దీపంలాగ ఉంటూ న్యాయానికి, ధర్మానికి పట్టుగొమ్మగా ఉన్న ఇద్దరు ముగ్గురు ఆచార్యులలో ఒకరు. ఖండవల్లివారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేసిన సేవ తెనుగుకు, తెనుగువారికి సుదీర్ఘకాలం పాటు అనేక ఫలాలను అందించేందుకు కారణభూతమైంది. వారు ఆచార్య పదవి చేపటిన తరువాత ఎం.ఏ. తరగతిలో సంస్కృతం, ద్రావిడ భాషల్లో ఏదో ఒకటి తప్పక తీసుకునే ఏర్పాటు చేసారు. తెనుగును సెకండ్ లాంగ్వేజ్ చేయడం కోసం అకడెమిక్ కౌన్సిల్తో పోరాడి గెలిచారు. పిహెచ్.డి. పెట్టించారు. విద్యార్థులలో తెలుగంటే మాతృభాష అన్న మమకారం కలిగించారు. వీరు అత్యంత నిరాడంబరులు. వీరికి హాకీ, ఫుట్ బాల్, ఈత పట్ల మక్కువ. కొమర్రాజువారు మొదలుపెట్టిన “విజ్ఞాన సర్వస్వం” పూర్తి చెయ్యాలన్న సంకల్పంతో ఐదారు నెలలలో సిద్ధం చేసారు. కానీ అది ముద్రణకు ఇచ్చేలోపు పోగొట్టుకున్నారు. దేశం స్వతంత్రం అయిన తరువాత ఈ పనికి మళ్లీ పూనుకున్నారు.

శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి గారు పెళ్లినాటికి రెండవ ఫారం చదువుతున్నారు. ఆమె అత్తవారింటికి వెళ్లి హైదరాబాదులోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్ లో చేరారు. మెట్రిక్యులేషన్ సమయానికి బిడ్డతల్లిగా పరీక్షలకు వెళ్లలేకపోయారు. భర్త ప్రోత్సాహంతో పాటు తన జిజ్ఞాసతో ఎంతో అధ్యయనం చేసారు. అప్పటి తెలంగాణాలో హిందూ మధ్య తరగతి మహిళల కోసం ముఖ్యంగా తెలుగువారి ప్రగతి కోసం ప్రత్యేకంగా ఒక సంస్థ నెలకొల్పడం అవసరమని తోచి శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారిగారితో కలిసి 1934 లో “ఆంధ్ర యువతీ మండలి” స్థాపించారు. కానీ సభ్యురాండ్రను చేర్చడం మహా యజ్ఞమైందని వారంటారు. ఇల్లిందలవారి కార్యదక్షత ఆంధ్రయువతీ మండలికే పరిమితం కాలేదు. అనేక సంఘాలలో సభ్యులుగా ఉంటూ ఎన్నో నూతన పథకాలు సూచించారు, ఆచరణలో పెట్టించారు. వారు రచనను రచన కోసం కాక సంఘసేవలో సాధనంగా, అజ్ఞానాన్ని పోగొట్టే కరదీపికగా భావించారు. రచయిత ఏం చెప్పినా కాలానుగుణంగా చెప్పాలంటారు. విశ్వనాథవారి పుస్తకాలు వారిని ప్రభావితం చేసాయి. ముట్నూరి కృష్ణారావుగారి సంపాదకీయాలు కర్తవ్యోన్ముఖురాలిని చేసాయని వారంటారు.

1917లో జన్మించిన శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు బి.ఏ. పట్టా పుచ్చుకున్న తర్వాత రెండేళ్లు గ్రథాలయోద్యమంలో, మరి రెండేళ్లు యువజన కాంగ్రెస్ లోనూ పాల్గొన్నారు. ప్రజాసేవకు న్యాయవాది కావటం అవసరమనుకున్నారు. ఆంధ్ర రాష్టం ఏర్పడిన వెంటనే “తెలంగాణములేని ఆంధ్రరాష్ట్రము అసమగ్రము. ఆంధ్రజాతి సర్వాతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రనాయకులు ఏ ప్రాంతము వారైనను బద్ధకంకణులై కృషి చేసి రాష్ట్రమును సమగ్రము గావించి విశాలాంధ్ర సాధనకు దీక్ష వహించవలసియున్నది.” అని ఘోషించిన వారిలో తొలిబంతి వారు వీరు. కేంద్రపభుత్వం దృష్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం పై పడి, దానిని హిందీ విశ్వవిద్యాలయంగా పరకాయం చేయబూనినపుడు తెలుగునాట ఉద్యమం చెలరేగింది. కేంద్రప్రభుత్వ ఆలోచనను ప్రతిఘటిస్తూ ఒక ప్రతిఘటన సంఘం ఏర్పడింది. దాని సమావేశకర్త శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు తన తెలివితేటలతో, వ్యవస్థాపన పాటవంతో ఉద్యమాన్ని సఫలం చేసారు. భారతీయ సంస్కృతిలో విశ్వజనీనత ఉందని, దానిని మనం రక్షించుకోవాలని ఆయన నమ్మారు. అదే మన సంస్కృతిని శాశ్వతం చేస్తుందంటారు.

మల్లాది కృష్ణానంద్ గారు అందించిన జీవిత చిత్రాలుః

1876లో జన్మించిన శ్రీ పింగళి వెంకయ్య గారు భారత జాతీయ పతాక సృష్టికర్త. వారు 1906లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో బ్రిటీషువారి జెండా ఎగురవేస్తే ఎంతో ఆందోళన చెందారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో భారతీయులకు ప్రత్యేక జెండా కావాలన్న పింగళివారి ప్రతిపాదన ఆమోదించారు. ఎందరో ప్రముఖ నాయకులతో సంప్రదించి తన అనుభవాలను క్రోడీకరించి 1916లో “A National Flag for India” అనే పుస్తకాన్ని రాసారు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీజీ పింగళివారిని జెండా రూపొందించవలసిందిగా కోరారు. మూడు గంటల వ్యవధిలో మూడు రంగుల జెండాను రూపొందించారు. కేసరి రంగు ధైర్యసాహసాలకు, తెలుపు శాంతి, సత్యాలకు, ఆకుపచ్చ విశ్వాస, శౌర్యాలకు ప్రతీకలుగా రూపొందింది. స్వాతంత్ర్యపోరాటంలో ఎన్నోఆందోళనలలో పాల్గొని నిస్వార్థంగా సేవలు అందించారు. వ్యవసాయ, ఖనిజ శాస్త్రవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహు భాషాకోవిదుడుగా, జాతీయవాదిగా ప్రఖ్యాతి పొందారు.

1878లో జన్మించిన శ్రీ వజ్ఝల చినసీతారామశాస్త్రి గారు తెలుగువారి కోసం, తెలుగుభాషా చరిత్ర కోసం పరిశోధనలు చేసి, జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంస్కృతాంధ్ర కవి, వ్యాకరణ పరిశోధకుడు. వ్యాకరణశాస్త్రంతో పాటు, సంస్కృత కావ్య నాటక గ్రంథాలను, జాతక ముహూర్త సిద్ధాంత భాగాలను, లీలావతీ జీజ గణితం, తర్క, వేదాంత, ధర్మశాస్త్రాలను తమ కుటుంబంలోని పెద్దల దగ్గర శిష్యరికం చేస్తూ నేర్చుకున్నారు. అష్టావధానాలు, శతావధానాలు చేసారు. తిరుపతి వెంకటకవులు మొదలుకుని నేటి ఆధునిక పండితుల దాకా కొన్ని వందలసార్లు భాషా శాస్త్ర చర్చలలో ఎదురొడ్డారు. వీరిని మూర్తీభవించిన సజీవ వ్యాకరణ శాస్త్రంగా నాటి సమకాలీన సంస్కృతాంధ్ర పండితులు కొనియాడారు. తెలుగు సాహిత్యానికి అనన్యమైన సేవలు అందించారు. దక్షిణాది భాషలైన తెలుగు, మళయాళం, కన్నడ, అరవం భాషలు, వాటి వ్యాకరణం క్షుణ్ణంగా నేర్చుకుని “ద్రావిడ భాషా పరిశీలనం” – రెండుభాగాల ఉద్గ్రంధాన్ని రాసారు.

1881లో జన్మించిన శ్రీ బాలాంత్రపు వేంకటరావు గారు సుప్రసిద్ధులైన వేంకట పార్వతీశ్వర కవులలో పేరును బట్టి, వయసురీత్యా కూడా ప్రథములు. రెండవవారు శ్రీ వోలేటి పార్వతీశంగారు. “కవిరాజ హంసలు”, “కవి కులాలంకారులు” అనే బిరుదులతో నవ్య కవిత్వ యుగకర్తలుగా ఈ జంట కవులు కీర్తి గడించారు. తిరుపతి వేంకట కవులు తెలుగువారి పద్యానికి ఎంత ప్రచారాన్ని తెచ్చిపెట్టారో, వేంకట పార్వతీశ్వర కవులు “ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల” ను స్థాపించి గద్యానికంత ప్రచారం చేసారు. జంటకవులుగా వీరు అనేక నవలలు రాయడమే కాక సాంఘిక, చారిత్రక, అపరాధ పరిశోధనా నవలలను బెంగాలు, కన్నడ భాషలనుండి అనువదించారు. యువతకోసం, పిల్లలకోసం అనేక పుస్తకాలను రచించారు.  వీరు రచించిన “ఏకాంతసేవ” వంటి కావ్యం తెలుగుసాహిత్య చరిత్రలోనే మరొకటి లేదని శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటారు. ఆత్మ – పరమాత్మ కొరకు అనుభవించే సాంగత్యకాంక్ష ఇందులో ముగ్ధ మనోహరంగా వర్ణించారు.

1890లో జన్మించిన శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గారు “గ్రంథాలయోద్యమ పితామహుడి” గా ఆంధ్రులందరికీ సుపరిచితులు. వీరు సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, పత్రికాసంపాదకులు. గ్రంథాలయాలను ప్రజల విశ్వవిద్యాలయాలుగా పేర్కొంటూ వాటి స్థాపనకు, అభివృద్ధికీ జీవితాంతం కృషి చేసారు. 1911లో తొలుతగా విజయవాడలో రామమోహన గ్రంధాలయాన్ని నెలకొల్పారు. అలాగే ప్రథమంగా 1914లో ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభలను విజయవాడలో నిర్వహించి, గ్రంథాలయ సంఘాన్ని, దాని తరఫున “గ్రంథాలయ సర్వస్వం” అనే పత్రికను నిర్వహించారాయన. ఈ పత్రిక నేటికీ ప్రచురణ పొందుతున్నది. 1919లో “అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘా” న్ని స్థాపించి, “ఇండియన్ లైబ్రరీ జర్నల్” అనే ఆంగ్ల పత్రికను నిర్వహించారు.

1892లో జన్మించిన శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి ప్రసిద్ధ గీతం “ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము” నేటికీ తెలుగునాట ప్రతిధ్వనిస్తూనే ఉంది. వీరి గీతాలు జాతీయభావాన్ని, ఉద్వేగపూరిత చైతన్యాన్ని ప్రజలలో కలిగించాయి. ఠాగూర్ “గీతాంజలి చదివి, శాంతినికేతన్ లో కొంతకాలం ఉండి అనేకమంది కవిపండితుల సాహిత్యాన్ని అధ్యయనం చేసారు. కాశీలో వివిధ శాస్త్రాలు అభ్యసించారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేసారు. ఆశుకవిత్వం, అవధానాలు చేసారు. అనేక కావ్య సంపుటాలతో పాటు శంకరాచార్యులవారి “భజగోవిందం”, “సౌందర్యలహరి” శ్లోకాలను ఆంధ్రీకరించారు. 1965లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రాయప్రోలువారు తెలుగు సీమ సొగసు, భాషా సౌకుమార్యం, భావ గంభీరతలను రమణీయంగా గానం చేసిన మహాకవి. భావ కవిత్వ యుగకర్త.

1892లో జన్మించిన శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు గొప్ప తెలుగుకవి, కథకుడు, నవలా రచయిత, తత్త్వవేత్త, బహుభాషా పండితుడు, అన్నింటిని మించి గొప్ప జాతీయవాది, గాంధీజీ అనుయాయులు. సాంఖ్య, యోగ, తర్క, వేదాంత శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించారు. ఖగోళ, భూగోళ శాస్త్రాలను శోధించి సాధికారమైన గ్రంథాలు రాసారు. అనేక అనువాదాలు చేసారు. తొలినాటి తెలుగు కథానికలకు రూపు రేఖలు తీర్చిదిద్దారు. ఆయన రచనలు ఒక అద్వితీయ సందేశాన్నిచ్చేవిగా ఉండి, ఆయన నిరాడంబరత, నిష్కలంక జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. 19 సంవత్సరాల వయసులో సంపూర్ణ శతావధానం చేసారు. తిరుపతి వేంకట కవులలోని తిరుపతి శాస్త్రిగారి సంతాపసభకు వెళ్తూ తను శ్రమించి తెలుగులో రాసిన అలంకార శాస్త్రగ్రంథాలు, నాటకాల రాతప్రతులు, ఇంకా అనేక అమూల్య గ్రంథాలను పోగొట్టుకున్నారు. కొద్దిరోజులకే స్వగ్రామంలోని ఇంట్లో పదిలంగా భద్రపరచుకున్న తన సొంత గ్రంథాలయం అగ్నికి ఆహుతైపోయింది. ఈ వాజ్ఞ్మయ తపస్వి మరెన్నో అమూల్య రచనలు చేసారు.

1896లో జన్మించిన శ్రీ ఖాసా సుబ్బారావు గారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి శిష్యులు. గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, మొదటిసారి జైలుశిక్ష అనుభవించారు. కొద్దికాలం అధ్యాపక వృత్తిలో ఉన్నా జీవితాంతం గొప్ప జర్నలిస్టుగానే పనిచేసారు. “ఇండియన్ ఫైనాన్స్”, ఫ్రీ ప్రెస్ జర్నల్”, ఇండియన్ ఎక్స్ప్రెస్” లలో పనిచేసారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ జైలుకెళ్లారు. “స్వతంత్ర” వారపత్రికను స్వయంగా ప్రారంభించారు. సామాన్య ప్రజల బాగుకోసం, వారి ఉన్నతి కోసం “స్వరాజ్య” లో శ్రీ ఖాసా ప్రత్యేక శీర్షిక “సైడ్ లైట్స్” ను తన కలం పేరు “ఖాసా” గా జీవితాంతం రాసారు. గొప్ప మానవతావాది. అభ్యుదయ ఆశయాలు గల ఖాసా ఆంధ్రులకు ప్రాతఃకాల స్మరణీయుడు.

1903లో జన్మించిన శ్రీ ఆచంట జానకిరాం గారు “జీవితం ఎంతో అందమైనది. జీవితంలో మరెంతో మాధుర్యం ఉంది. ఆ మాధుర్యాన్ని అనుభవించడమే మన విధి” అంటారు. వీరు గొప్ప సౌందర్యోపాసకుడు, సాహితీవేత్త, విమర్శకుడు, చిత్రకారుడు. స్నేహం ఒక గొప్ప సంపదగా భావిస్తారు. ఆకాశవాణిలో పనిచేసే రోజుల్లో అనేక వినూత్న కార్యక్రమాలు రూపొందించారు. ప్రముఖ సాహితీవేత్తలందరిచేత రేడియోలో ప్రసంగాలు ఏర్పాటుచేసారు. ఛాన్సలర్ హోదాలో విశ్వకవి మద్రాసు కళాశాలకు వచ్చినప్పుడు తాను వాలంటీర్ గా పనిచేస్తూ రవీంద్రునికి సన్నిహితంగా ఉన్నారు. గాంధీజీ ప్రవచనాల పట్ల వారెంతో ప్రభావితుడినయ్యానంటారు. నాటి ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులను వివరిస్తూ “సాగుతున్న యాత్ర”, “నా స్మృతి పథంలో” అనే గ్రంథాలు రాసారు. భారతీయ పరిరక్షణ కోసం తపిస్తూ, భారతీయతను ప్రతిబింబిస్తూ ఎన్నో రచనలు, చిత్రాలు రూపొందించారు. వీరి భార్య శ్రీమతి ఆచంట శారదాదేవి తిరుపతిలోని పద్మావతీ మహిళా కళాశాలలో తెలుగు శాఖ అధిపతిగా పనిచేసారు.

1905లో జన్మించిన శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ద్రావిడ భాషలన్నింటిలోనూ, ఇతర భారతీయ భాషలతో పాటు ఫ్రెంచి, గ్రీకు, జపనీస్, జర్మన్, లాటిన్, చైనీస్ వంటి అనేక పాశ్చాత్య భాషలలో కూడా పాండిత్యం కలవారు. ఖగోళ, జ్యోతిష్య, చిత్రలేఖన, తర్క, న్యాయ, వేదాంత, అలంకార, వ్యాకరణ, సంగీత, నాట్య శాస్త్రాలనూ అధ్యయనం చేసారు. ఉర్దూ నేర్చుకుని, ఖురాన్ ను పఠించారు. బైబిల్ ను కూడా చదివారు. కృష్ణాపత్రిక లో పనిచేసినపుడు సమకాలీన కవిపండితులపై ఆయన రాసిన వ్యాసాలు ఇప్పటికీ అనన్య సామాన్యంగా కనిపిస్తాయి. 1945లో సినీరంగ ప్రవేశం చేసి అజ్ఞాత రచయితగా ఎందరికో కీర్తి తెచ్చిపెట్టారు. “చిన్నకోడలు” చిత్రానికి మాటలు రాయడంతో సినీకవిగా పరిచయమయ్యారు. వీరి సాహిత్య ప్రక్రియల్లో చిన్నకథలు ప్రధానమైనవి. వీరి “డు – ము – వు – లు” కథ 14 భారతీయ భాషల్లోకి అనువదించబడింది.

1907లో జన్మించిన శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ గారు ఆకాశవాణిలో భద్రాద్రి శ్రీరామ కళ్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 16సంవత్సరాలు నిర్విఘ్నంగా నిర్వహించారు. గంభీరమైన శైలితో ధారాళంగా ఉపన్యసించగల దిట్ట. సంస్కృతాంధ్ర కవి. ఉద్యోగ నిర్వహణలో ఎంతో నియమనిష్టలతో ఉండేవారని, నిర్మొహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడేవారని పేరు. తెలుగులో తొలిసారిగా “భువనవిజయం” రూపకాన్ని రూపొందించారు. సంస్కృతంలోని అలంకారశాస్త్రాన్ని తెలుగులో అనువదించేందుకు వీరు పూనుకున్నారు. అనేక బిరుదులను పొందారు. ఆంధ్ర ప్రతాపరుద్రీయం, ధ్వనిసారము, నాట్యవేదం, కావ్యప్రకాశము వంటి అనేక గ్రంథాలను రచించారు.

1910లో జన్మించిన శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అభ్యుదయ యుగానికి నాందీ ప్రస్తావన చేసిన మహాకవి. తనపై ప్రభావం చూపిన ఆంధ్ర కవులు శ్రీ రాయప్రోలు, శ్రీ విశ్వనాథ, శ్రీ దేవులపల్లి గా చెపుతారు. వీరి “మహాప్రస్థానం” అఖిలాంధ్ర కీర్తి తెచ్చిపెట్టింది. ఆకాశవాణిలో, సైన్యంలో, ఆ తర్వాత నాటక సమాజాలలో పనిచేసారు. అభ్యుదయ రచయితల సంఘం స్థాపనలో, విప్లవ రచయితల సంఘంలో శ్రీశ్రీ ప్రముఖ పాత్ర వహించారు. రాజాలక్ష్మీఫౌండేషన్ వారి తొలి సాహితీ పురస్కారం వీరికి దక్కింది. ధనికస్వామ్య దురాశా పిశాచానికి బలియై అల్లాడుతున్న పేదల వాణిని వినిపించిన విప్లవకవి వీరు. సమత్వం, మానవత్వం, స్వాతంత్ర్యం ఆయన కవితా ఉద్యమ లక్ష్యాలు. నేటికీ వీరి కవిత్వం సాహితీప్రపంచంలో అత్యంత ఆదరణ పొందుతున్నది.

1910లో జన్మించిన శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు నవలా సాహిత్యంలో క్రొత్త అధ్యాయాలను ప్రారంభించారు. కథకుడు, వ్యాసకర్త, నాటక రచయిత, చిత్ర దర్శకుడు. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారి కుమారుడు. మొదట వీరు భౌతికవాది, హేతువాది. మార్క్సిజంలోని సాంఘిక న్యాయసూత్రం ఆయన్ని ఆకర్షించింది. వీరు స్వాతంత్ర్య సమర యోధులు. ఆయన రచనాశైలి సున్నితంగా, సూటిగా, సంక్షిప్తంగా ఉంటుంది. వారి రచనలు నూతన స్ఫూర్తిని, ఆలోచనారీతిని అందించేవిగా ఉంటాయి. వీరి ప్రఖ్యాత నవల “అసమర్థుని జీవితయాత్ర”. అరవిందుని దర్శించి, వారి లైఫ్ డివైన్ వంటి గ్రంథాలను అధ్యయనం చేసారు. “పోస్టు చేయని ఉత్తరాలు” పేరున భౌతికవాదం – ఆధ్యాత్మిక వాదాలలో దేన్నీ త్యజించకుండా చక్కని రచన చేసారు. వీరి “పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా” నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందింది.

1912లో జన్మించిన శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో 27సంవత్సరాలు ఉపన్యాసకులుగా, రీడరుగా, ఆచార్యులుగా, తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసారు. నడిచే విజ్ఞాన సర్వస్వంగా, వినయశీలిగా, ఆదర్శ ఆచార్యునిగా, సమకాలీన సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్నారు. తిరుపతి వేంకటకవులలో ఒకరైన శ్రీ దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు వీరికి పినతండ్రి. ప్రముఖ కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆర్థిక పరిస్థితులు బాగాలేని దివాకర్లవారికి తమ ఇంట వసతి ఏర్పాటు చేసి, వారాలు చేసుకుని చదువుకునేందుకు సహాయం చేసారు. విశ్వనాథ “ఏకవీర” నవలను డిక్టేట్ చేస్తుంటే దివాకర్లవారు రాసిపెట్టారు. స్వయం ప్రతిభతో అనేక పదవులు చేపట్టారు. వీరిది “ఫోటోగ్రాఫిక్ మెమొరీ” అని నార్ల వెంకటేశ్వరరావుగారంటారు. ప్రాచీన కవుల్లోన్ని మాధుర్యాన్ని, కవుల నైపుణ్యాన్ని తన రచనలతో, ప్రసంగాలతో తెలుగువారికి పంచిపెట్టీన దివాకర్ల జీవితాంతం ఆంధ్ర వాజ్ఞ్మయ వికాసానికి కృషి చేసారు.

1913లో జన్మించిన శ్రీ తిరుమల రామచంద్ర గారుగొప్ప పండితుడు, రచయిత, పరిశోధకుడు, భాషాతత్త్వవేత్త, విమర్శకుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. గాంధీజీ పిలుపు మేరకు ఉద్యమాల్లో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. భగత్ సింగ్ ను, మరికొంతమందిని ఉరితీసిన తరువాత బ్రిటీషు ప్రభుత్వం బనాయించిన కేసులో ముద్దాయిగా మద్రాసు కోర్టులో వీరిని విచారించారు. ఏడు దశాబ్దాలపాటు పలు సాహిత్య, సంగీత, నాటక, సాంస్కృతికరంగాల్లో ఎంతో సేవ చేసారు. తన లక్ష్యం మానవత్వమని చెపుతారు. తెలుగు భాషతో పాటు సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు ల్లో పాండిత్యం సంపాదించారు. “లిపి పుట్టుపూర్వోత్తరాలు”, హిందువుల పండుగల పూర్వాపరాలు” మొదలైనవి వారి ప్రముఖ రచనలు. “మరపురాని మనీషి” వంటి శీర్షిక కోసం చేసిన ఇంటర్వ్యూలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయి. చివరి రోజుల్లో రాసిన “హంపీ నుండి హరప్పా దాకా” 1947కు పూర్వం నాలుగు దశాబ్దాల స్వీయ అనుభవాలు తెలియజేస్తుంది. వీరు సాహితీ జ్ఞాని. అనేక బిరుదులతో వారిని ఎన్నో సంస్థలు గౌరవించాయి. తానొక నిత్య విద్యార్థినని చెప్పుకునేవారు.

1916లో జన్మించిన శ్రీ బుచ్చిబాబు గారి అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. జీవితంలో ప్రేమించలేకపోవడమే గొప్ప విషాదం. ప్రేమించి విఫలం కావడం కాదని – అంటారు వీరు. సాహిత్యంతో పాటు సంగీతం, అభినయం, చిత్రలేఖనంలలో చక్కని పరిజ్ఞానం బుచ్చిబాబుకు సాధికారంగా ఉంది. మానవ జీవితంలోని సౌందర్య తృష్ణ, సామరస్యం, కరుణ, విషాదం, ఉల్లాసం, వేదన, వాంఛ, వీటి స్వరూప స్వభావాలను విశదంగా, నిశితంగా తన రచనలలో వ్యాఖ్యానించారు. వీరు రాసిన ఏకైన నవల “చివరకు మిగిలేది” తాత్త్విక జిజ్ఞాసతో కూడిన గంభీరమైన నవల. మానవ జీవితానికి పరమార్ధం, మానవ సంబంధాలు, అనుబంధాలు, ఎలా ఒకరికి ఒకర్ని దగ్గర పరుస్తున్నాయో, శాసిస్తున్నాయో ఈ నవలలో సునిశితంగా విశ్లేషించారు.

1920 లో జన్మించిన శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి కావ్యాలంకారాలు, వ్యాకరణ శాస్త్రాన్ని చిన్నతనంలోనే కూలంకషంగా అధ్యయనం చేసారు. “స్వప్న వాసవదత్తం”, “రత్నావళి” సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువదించారు. వీరి “ఆంధ్ర పురాణం” విశేష ఖ్యాతిని పొందటమే కాక రాష్ట్ర అకాడమీ పురస్కారం కూడా పొందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం “కళాప్రపూర్ణ” బిరుదుతో గౌరవించింది. రాజమండ్రిలో వీరేశలింగం గారి హైస్కూలులో పనిచేసారు. సాహిత్య మాస పత్రిక “ఆంధ్రి” సంపాదకులుగా తెలుగు సాహిత్య విలువల పరిరక్షణకు విశేష కృషి చేసారు.

 45 మంది మన ఆంధ్రదేశపు ప్రముఖుల జీవితవిశేషాలను, సమాచారాన్ని 300 ఛాయాచిత్రాలతో పాటుగా ఒక్కచోట అందించిన ఈ విలువైన, అరుదైన పుస్తకం చదవటం సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది. పుస్తకంలోని విషయాలను రచయిత శ్రీ తిరుమల రామచంద్రగారి మాటల్లోనే ఈ పరిచయంలో ఇవ్వటం జరిగింది.

పుస్తకం అజో – విభో ప్రచురణ, హైదరాబాదు.

మొదటి ప్రచురణః 2001

వెలః 300 రూపాయలు/- లేదా 30 డాలర్లు

You Might Also Like

Leave a Reply