“శ్రీదోసగీత” కథలు – ఆప్తవచనం

వ్యాసకర్త: రావి ఎన్. అవధాని

*******

నేతి సూర్యనారాయణ శర్మగారి కలం నుండి జాలు వారిన 18 కథల సంపుటి శ్రీదోసగీత. ఈ కథాసంపుటిలోని కథలు 2004 నుండి 2021 
మధ్య కాలంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి, మరియూ ఆకాశవాణి ద్వారా ప్రసారితమైన  వారి కథల నుండి ఎంపిక చేసి కూర్చినవి.

కాదేదీ కథకు అనర్హం! అనే  నానుడిననుసరించి  శర్మగారు కథాకథనానికి ఎంపిక చేసుకున్న ఇతివృత్తాలు నాసిక, నాలుక, నఖం, చెప్పు ఇత్యాది 
వస్తు వైవిధ్యం గలవి.  సామాజిక, సాంఘిక సాంస్కృతిక, ఆర్థిక రాజకీయ నేపథ్యం గలవి.  రచయిత కథలన్నిటిలో ఒక్క రాజనంది చారిత్రక నేపధ్యం గలది. మిగిలినవన్నీ ఇతివృత్తానికి హాస్యరసం జోడించి కథారచనచేయడం గొప్ప విషయం.  

‘సగం చచ్చి సంగీతం అంతా చచ్చి హాస్యం!’ అన్నట్లుగా గత వంద సంవత్సరాల కాలంలో ప్రాచీన కవులు, రచయితలు సాహసించి 
హాస్య రసం జోలికి పొలేదు. అలాగని ఆంధ్రులలో హాస్యరసం లోపించింది అనలేం.  నూతన దంపతుల చిలిపి కజ్జాలు, బావామరదళ్ళు మేలమాడుకోవడం,  పంటచేలల్లో హాస్యము లాస్యం చేస్తోంది.  హాస్యగాడు వచ్చి బారాబర్లు చేస్తేగాని వీధినాటకాల్లో ముఖ్యపాత్రలు రంగం మీదకిరావు. చోపుగాడు వచ్చి బహుపరాక్ పలికితే గాని యక్షగానాదుల్లో  నాయకులు సభకు వేంచేయరు. బంగారక్క, కేతిగాడు తొంగి చూడందే తోలుబొమ్మలాటల్లో అసలు బొమ్మ తెరమీదకి దిగదు. పగటి భాగోతుల హాస్యం పగ్గాలు వదులైన బాపతే. ఇంతటి హాస్య సమృద్ధి తెలుగువారి జీవితాల్లోనే కాని సాహిత్యంలో హాస్యం అంతగా కనిపించదు. బహుశా నవ్వు నాలుగు విధాల చేటు’  అనేమాట రచయితల్లో వ్యాపించి మందహాస రోచిస్సుల్ని మాత్రం తమ రచనల్లోకి రానీయకుండా దూరంగా ఉంచేరు.   

ఉత్తమ కథానికకు ఉండాల్సిన లక్షణాలు చక్కటి ఇతివృత్తం, వాస్తవికత, ఎత్తుగడ, రచనాశిల్పం, శైలి, సున్నితమైన హాస్యం,  ముగింపు, శీర్షిక.  వీటినే 1. సంక్షిప్తత, 2.  ఏకాంశవ్యగ్రత, 3. నిర్భరత, 4.స్వయంసమగ్రత, 5. సంవాదచాతుర్యం, 6. ప్రతిపాద్యప్రవీణత, 7. ప్రభావాన్విత… అని మరో ఏడువర్గాలుగా కూడా చెబుతారు.

ఇతివృత్తం : ఇతివృత్తం కథకు ప్రాణసమానమైంది. విశాల విస్తృతం వైవిధ్య విలసితం, బహుముఖం అయినది ఇతివృత్తం. కథా వస్తువుగా ఒక సంఘటన, ఒక సమస్య, ఒక సమాజం, ఒక సవరణ, ఒక పరిస్థితి, ఒక ఆలోచన, ఒకపరిష్కారం 
ఇలా ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని కథ రాయవచ్చు.   శర్మగారు తమ కథాకథనానికి నిత్యమూ మనం చూసే సంఘటనలు, పొందే అనుభూతులు, జరిగే వింతలు, సామాజిక సమస్యలు, మానవ స్వభావపు లోతులు మొదలైనవెన్నో ఇతివృత్తాలుగా స్వీకరించారు. 

వాస్తవికత :  కథాకథనానికి ఎంపిక చేసుకున్న ఇతివృత్తాలకు చక్కటి వాస్తవికతను అందించారు. మనుషుల చుట్టూ ఉండే పరిసరాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంస్కృతిక సంప్రదాయాలు, నాగరికత వీటిని ఇతివృత్తానికి జోడించి కథారచన చేయడమే వాస్తవికత.  కథకు వాస్తవికత  సామాజిక జీవితమే ప్రథానము. రచయిత రచనలో సత్యం, సహజత్వం, వుంటే ఆ రచన కొన్ని శతాబ్దాలపాటు మాన హృదయాలను కదిలిస్తూనే ఉంటుంది. శర్మగారి కథల్లో వాస్తవికత నూటుకి నూరుశాతం ప్రతిబింబిస్తుంది. జీవితాన్ని గురించి అవగాహనను కలిగించి విలువలకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని పాఠకులకు వదిలివేయడం ఆధునిక కథాలక్షణం.  

పాత్రచిత్రణ : కథను నడిపించేది కథావస్తువును భరించేది, కథాంశాన్ని సూచించేదీ పాత్రలు. నిత్య జీవితానికి ఒక పాత్రఎంత దగ్గరగా ఉంటే 
అంత నమ్మకం కలుగుతుంది పాఠకుడికి. పాత్రకుండాల్సిన మొదటి లక్షణం ఇదే. 
శర్మగారు కథాకథనానికి ఎంపిక చేసుకున్న పాత్రలు మన నిత్యజీవితంలో ఎదురయ్యేవే. 
మనం రచించ దల్చుకున్న కథకు ఒక రూపంఏర్పడిన తరువాత దానికి జీవం పోయడానికి పాత్రలని నిర్దిష్టం చేసుకోవడం జరుగుతుంది. 

కథలో వాటి స్వరూప స్వభావాలు, పరిణామాలు, స్పష్టంగా రచయిత మనస్సులో రూపుగట్టుకొని ఉంటుంది.

కథ ఎత్తుగడ ; ఇతివృత్తాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో రచయిత మొట్టమొదట ఏ అంశాన్ని ఎత్తుకుంటాడో అది ఆ కథకుఎత్తుగడ. కథా ప్రారంభ వాక్యం. 

కథకు ఏక సూత్రత ప్రధాన లక్షణం. ఈ సూత్రానికి కూడా రెండు కొసలుంటాయి. మొదటిది ఎత్తుగడ, రెండోది ముగింపు. ఈ రెండూ విడివిడి దారపు కొసలు కావు. రచయిత ఈ రెండింటినీ ఎక్కడో ఒక చోట ముడిపెడతాడు. ఉత్సుకత రేకెత్తించే ఆశ్చర్యకరమైన  వాక్యంతో కథను ప్రారంభిస్తే అది పాఠకుడిని ఆకర్షించి హిప్నటైజ్ చేసికథను ఆసాంతం చదివిస్తుంది.  శర్మగారి కథల ఎత్తుగడలన్నీ ఈ కోవకు చెందినవే.

ఉదాహరణకి: మీరేం చెప్పినా వినాలనిపిస్తుంది.  అంతా నిజమేకదా!? (భారతంలో పాఠోళీ ) 

దేశమనగా ముక్కు అని  నిఘంటులో అయినా  అర్థం చెప్పారేమో… నాకుమాత్రం తెలియదు… అన్నాడు వాణీదాసుడు( నాశికా ఉపాఖ్యానం )

చెప్పుకున్న వారికి చెప్పుకున్నంత మహదేవా అన్నారు (చెప్పు అలిగిన వేళ )

‘‘ఈ వేళనుంచీ నీ పేరు మార్చుకో… పద్ధతి మార్గుకో… అసలు నువ్వు మగాడివనే సంగతి మర్చిపో…ఇష్టమైతే రేపే  వచ్చిఉద్యోగంలోచేరిపో…’’ ( మిస్టర్ శ్రీమతి)  

 కథ ముగింపు: కథ ముగింపు పాఠకుడిని ఆశ్చర్య పరచాలి.  కథను పాఠకుడు ఆశించని విధంగా ముగించాలి అంటే కొసమెరుపుండాలి.  అది పాఠకుడిని ఆలోచింపచేస్తుంది. శర్మగారు కథలన్నీ చక్కటి కొసమెరుపుతో పాఠకుల్ని చకితుల్ని చేసే విధంగా రూపొందించారు.

‘‘రోగి నాడి పట్టుకొని వాత, పిత్త, కఫ స్థాయీబేధాలను గుర్తించాల్సిన వైద్యుడు … తన తలను రెండు చేతుల్తోనూ పట్టుకుని సీట్లో  కూలబడ్దాడు’’ (అల్లిక జిగిబిగి)

‘‘అబద్ధమనే అడుసులో కాలుజారి…వంటింట్లో పడ్ద నాకు నాలుగు ముద్దలు రుచికరమైన పప్పే గొప్ప ఓదార్పు నిచ్చింది’’

(నిజం చెప్పాలంటే మంటా అబద్దం చెప్తే తంటా) 

‘‘ఆ వంటకం తింటున్న నీ కళ్ళల్లో ఆనందం చూడ్డమే నా జీవిత పరమార్థం’’ ఏకపక్షంగా ప్రకటించాడతను

‘‘ఉన్న పళంగా కళ్లు తిరిగి పడిపోయింది ఆమె’’  (కష్టపదులు – ఇష్టపదులు ) 

శీర్షిక : చక్కగా ముగించిన కథకి అందమైన పేరు పెట్టాలి. అలంకరించుకున్న ముఖానికి దిద్దుకునే తిలకం వంటిది కథకు పేరుపెట్టడం.  

శర్మగారు తమ కథాసంపుటిలోని కథల కన్నింటికి చక్కని శీర్షికలను అందించారుభారతంలో పాఠోళీ , నాసికా ఉపాఖ్యానం, చెప్పు అలిగిన వేళ,  నవ్యకర్ణామృతం… వగైరా.

హాస్యం : కథలో సన్నివేశపరంగా సున్నితమైన హాస్యం ప్రదర్శించాలి. అందుకోసం రచయిత తనచుట్టూ తిరిగే మనుష్యులను, సంఘటలను, లోతుగా పరిశీలించి ఏ కోణంలో హాస్యం పుడుతుందో ఎ శైలి దానికి ఎఫెక్ట్‌గా ఉంటుందో ఏ మాండలికం నప్పుతుందో ఎంపిక చేసుకోవాలి. కళ్లకి కాటుక నుదుట తిలకం, వంటకంలో ఉప్పు వంటిది హాస్యం ఓ పిసరు ఎక్కువ  తక్కువ అవకూడదు. శర్మగారు తమ కథలన్నిటికీ  సన్నివేశ పరంగా సున్నితమైన హాస్యం అందించారు. 

ఈ సందర్భంలో తెలుగువారి సామెతలు, జాతీయాలు, పలుకుబడులు, నానుడులు,  సందర్బోచితంగా  ధారాళంగా  తమ కథలలో వాడుకున్నారు. 

శ్రీదోసగీతలోని కథలన్నీ హాస్యభరితమైన ఉత్తమ కథలే, పాఠకులను మైమరపిస్తాయి. వీరికథలు ప్రముఖ రచయితలు మల్లాది, శ్రీపాద, 
పురాణం సుబ్రహ్మణ్యశర్మ, యామిజాల, మునిమాణిక్యం వంటి వారికథలతో సరితూగుతాయి.

 ష్టవిధ శృంగార నాయికల్ని గురించిన సరసమైన, రుచికరమైన వర్ణలనుతెలుసుకోవాలన్నా…చతుర్విధ శాకనాయకుల రుచులు ఆస్వాదించాలన్నా నేతి సూర్యనారాయణశర్మగారి శ్రీదోసగీత కథాసంపుటి తెరవాల్సిందే!

శ్రీదోసగీత కథల సంపుటికోసం రచయితను 9951748340 నెంబర్ పై సంప్రదించవచ్చు

You Might Also Like

Leave a Reply