మరో సామాన్యశాస్త్రమ్
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(ఆర్వీ సుబ్బు రచించిన ‘మన హీరోలు’ (ఛాయా బుక్స్ ప్రచురణ) కోసం రాసిన ముందుమాట)
మనకు హీరోలంటే కేడీలు స్టేట్ రౌడీలు డాన్ లు రాక్షసులు కిరాతకులు లోఫర్లు పోకిరీలు జులాయిలు జుట్టుపోలిగాళ్ళు. మీసాలు మెలేసి తొడలు కొట్టి టాటా సుమోలు పైకెగిరేలా వింత వింత ఆయుధాలతో తెర మీద విచ్చలవిడిగా చిందులేసేవాళ్ళు. ఆకు రౌడీల్లా చెవులు చిల్లులు పడే అరుపులు కేకలతో డాల్బీ సౌండ్ బాక్స్ లు బద్దలుకొట్టేవాళ్ళు. హీరోయిన్ పిర్రలు లాఘవంగా చరిచి మగతనాన్ని ప్రదర్శించేవాళ్ళు. ఒకప్పుడు ద్వంద్వార్థాలతోనూ యిప్పుడు స్ట్రైట్ గానూ స్త్రీలతో వెకిలిగా ప్రవర్తించే కామాతురులు.
హీరో అనగానే యేర్పడే యింత భీకరమైన జుగుప్సాకరమైన సాంస్కృతిక అవలక్షణాల ఇంప్రెషన్స్ మధ్య సామాన్యుల్ని హీరోలుగా ప్రజెంట్ చేయటం సాహసమే. సామాన్యుల్ని అసామాన్యులుగా, అదే సమయంలో అసామాన్యుల్ని అతిసామాన్యులుగా పరిచయం చేసే ఆ సాహసాన్ని తెలిసే చేస్తున్నాడు ఆర్వీ సుబ్బు. ‘మన హీరోలు’ అని చెప్పటం వల్ల జీవితంలో నిజమైన హీరోలు వీళ్లే అని కూడా అతను నిర్ధారిస్తున్నాడు. వాళ్ళ జీవిత చిత్రాల్ని వుదాత్తంగా వున్నతంగా ఆదర్శీకరిస్తున్నాడు.
చిత్రకారులు పోర్ట్రైట్ నిర్మించడానికి ఎంత కృషి చేస్తారో ఎన్ని డీటెయిల్స్ ని పరిశీలించి పట్టుకుంటారో! కండరాల్లో ఎముకల నిర్మాణంలో ముఖంలో కనిపించే ప్రతి వొంపునీ ముడతల్ని సజీవంగా రూపు కట్టించాలి. జీవిత చిత్రాన్ని రచించే రచయితలు కూడా అంతే జాగరూకులై ఉండాలి. జీవితానికి చెందిన అనేక విషయాలు సేకరించాలి. వాటి నేపథ్యాల్ని తెలుసుకోవాలి. వాటిని క్రమంలో పెట్టుకొని అధ్యయనం చేయాలి. వాటిని కుప్పబోయకుండా వొడబోసి స్ఫూర్తి దాయకమైన అంశాల్ని మాత్రమే తమ పాఠకులకి అందించాలి. వ్యక్తుల నికార్సయిన వ్యక్తిత్వాన్ని చిత్రించాలి. అది రూపొందిన క్రమాన్ని వివరించాలి. అందుకు కారణమైన పరిస్థితుల్ని విశ్లేషించాలి. రేఖామాత్రంగా అయినా యీ పని చేయకుంటే జీవిత చరిత్ర చిత్రణ అసమగ్రం అవుతుంది. తారీకులు ఘటనలు కేవలం బయోడేటా వివరాలు ప్రొఫైల్ నిర్మాణానికి చాలావు. అదొక సజీవమైన బయో స్కెచ్ గా మారాలంటే దానికి ఆత్మీయమైన వొక జర్నలిస్టిక్ టచ్ ఉండాలి. సృజనాత్మకతని జోడించాలి. వీలైతే సున్నితమైన వుద్వేగాలని అద్దాలి. అవసరమైతే కొద్దిగా కవితాత్మక శైలిని ఆశ్రయించవచ్చు. అలా అని అతిశయోక్తులు అప్రస్తుత ప్రసంగాలు చేయకూడదు. వాస్తవదూరమైన కల్పనలకు చోటివ్వకూడదు. దాపరికాలకు తావివ్వకుండా నిజాయితీగా వున్నది వున్నట్టు చెప్పే దిటవు లైఫ్ స్కెచ్ రాసే రచయితకి వుండాలి.
అందుకే రాళ్ల నుంచి వజ్రాల్ని విడదీసినట్టు మట్టిలో మాణిక్యాల్ని వెతికినట్టు పాల నుంచి నీళ్ళని వేరు చేసినట్టు సుబ్బు మనుషుల కోసం నిజమైన మనుషులు కోసం కాళ్లకు చక్రాలు ధరించి రేయింబవళ్ళు వూరూ వాడా పరిభ్రమించాడు. అంతర్జాలాన్ని జల్లెడపట్టాడు. తన సర్వస్వాన్నీ సమాజ హితం కోసమే అంకితం చేసి అంతర్జాతీయంగా వాయిస్ ఆఫ్ హ్యూమానిటీగా పేరొందిన పాలం కళ్యాణ సుందరం, కరోనా లాక్డౌన్ టైంలో లెక్కలేనంతమంది పేషెంట్స్ కి సేవ చేసిన గుడ్ సమారిటన్ లాంటి షేక్ జమీర్ పఠాన్ అల్లాబక్షులు, రియల్ ఎస్టేట్ మాఫియా మృగాల మధ్య పచ్చటి అడవిని సృష్టించిన దుశ్చర్ల సత్యనారాయణ, మెయిన్ స్ట్రీమ్ స్వార్థ రాజకీయాలతో విసిగిపోయి సాధారణ రైతు వుద్యమ కార్యకర్తగా వ్యవస్థలతో పోరాడుతున్న వాజిద్ అలీ, ప్రాణాలకు తెగించి వందలాది జీవితాలను కాపాడిన స్వపన్ దిబ్రామా … యిలా తమదైన పద్ధతిలో సామాజిక ఆచరణలో వున్నవారిని యెందరినో తన రచనలోకి రక్తమాంసాలతో సజీవంగా తీసుకువచ్చాడు.
వ్యక్తుల్ని యెంచుకోవడంలో వారి వ్యక్తిత్వాల్ని అంచనా వేయటంలో వాటిని సమాజానికి అందజేయాల్సిన అవసరాన్ని గుర్తించడంలో ప్రముఖ హక్కుల న్యాయవాది భువనగిరి చంద్రశేఖర్ దగ్గర పనిచేసిన అనుభవం, అది యిచ్చిన సదసద్విచక్షణ, ప్రాపంచిక దృక్పథం సుబ్బుకి యేదో వొక మేరకు దోహదపడి వుండొచ్చు. చంద్రశేఖర్ లా నిజాయితీగా నిస్వార్థంగా ప్రజాక్షేత్రంలో వుద్యమస్ఫూర్తితో పనిచేసే వ్యక్తుల కోసం వెతుకుతూ వుండే క్రమంలో యింతమంది హీరోలను కలిసి వుండొచ్చు ఆ క్రమంలో అవకాశవాదులైన కెరీరిస్టు వుద్యమకారులను సైతం అతను యెదుర్కొని వుండొచ్చు.
జీవిత చిత్రం గీయటానికి సుబ్బు యెంచుకున్న వ్యక్తుల్లో యెంతో వివిధత వుంది. తొంభై ఏళ్ళ వయస్సులో భౌతిక శాస్త్ర పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్ శాంతమ్మ దగ్గర్నుంచి ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే సిద్ధార్థ భార్య మాళవిక హెగ్డే, చెత్తలో చైతన్యాన్ని వికసింప చేయడానికి కృషి చేసిన మాయా ఖోద్వే, రాష్ట్రంలో పేద విద్యార్థుల స్కాలర్ షిప్ ల కోసం పోరుబాట పట్టిన మగ్బూల్ జాన్, స్వచ్ఛంద సేవకే తన కాయాన్నీ కాలాన్నీ వినియోగించే పెరుమాళ్ళ గౌరీ శిరీష, రోగుల ప్రాణాలు కాపాడడానికే జీవితాన్ని అంకితం చేసిన మెటిల్డా కులు, క్లాస్ రూమ్ నే సామాజిక రంగంగా మలుచుకున్న కావూరి జయలక్ష్మి, సంపాదించిన యావదాస్తినీ తాను చదువుకున్న మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం విరాళంగా యిచ్చిన డాక్టర్ ఉమా గవిని, రాజకీయ అవినీతి మాఫియాతో తలపడ్డ బ్యూరోక్రాట్ ఆకురాతి పల్లవి, రెస్క్యూ గర్ల్ స్టెల్లా మేరీ, గిరిపుత్రిక స్వాతి, మైక్రో ఆర్టిస్ట్ నళిని, సీడ్ బాల్స్ చిన్నారి దొబ్బల బ్లెస్సీ వరకు కుల మత జాతి వయో భేదాలకు అతీతంగా అతని దృష్టిని ఆకర్షించడానికి కారణం విశిష్టమైన వారి అసాధారణ వ్యక్తిత్వమే.
ఇలా సుబ్బు చెక్కిన హీరోల్లో రచయితలున్నారు. కళాకారులున్నారు. టీచర్లున్నారు. సైంటిస్టులున్నారు. నర్సులు డాక్టర్లున్నారు. కోవిడ్ వారియర్స్ వున్నారు. ప్రొఫెసర్లున్నారు. స్వచ్ఛంద సేవకులున్నారు. హక్కుల కార్యకర్తలున్నారు. పర్యావరణ ప్రేమికులున్నారు. విద్యావేత్తలున్నారు. మనసున్న మనుషులున్నారు. వీళ్లంతా స్వీయ ప్రతిభతో వ్యక్తులుగా యెదిగిన వాళ్ళూ లేదా నిబద్ధతతో ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజాసేవకు అంకితమైనవాళ్ళూ. అందుకే సుబ్బు తన యీ రైటప్ లను స్ఫూర్తి కథనాలని పేర్కొంటాడు. చాలా సందర్భాల్లో కందుకూరి రమేష్ బాబు సామాన్యశాస్త్రమ్ పేరుతో అందించిన రచనా పరంపర, జయధీర్ తిరుమల రావు తొవ్వ ముచ్చట్లులో చిత్రించిన లైఫ్ స్కెచ్ లు గుర్తుకు వచ్చాయి.
మన చుట్టూ జీవించే వాళ్ళలో మనలోనే మనతోనే అతి సామాన్యులుగా ఆదర్శ జీవితం గడిపే వాళ్ళు వీళ్ళు. వీళ్ళలో ఎవరూ సెలబ్రిటీస్ కాదు. లెజెండ్స్ కాదు. మేమే సెలబ్రిటీస్ – మేమే లెజెండ్స్ అని కొట్లాడుకునే వాళ్ళు కాదు. వీళ్ళెవరూ పదవుల్లో లేరు. సంపన్నులు కారు. వాళ్ళకున్నదల్లా సహజమైన సేవాగుణం. జీవితాన్ని గెలవాలనే సార్థకం చేసుకోవాలనే తపన. అదీ పేరు కోసం కాదు. అలా అని వాళ్ళెవరూ అనామకులు కారు. తమకంటూ ప్రాదేశిక చరిత్ర పుటల్లో వొక పేజీ లేదా కనీసం వొక పేరా అయినా సొంతం చేసుకోగలిగిన వాళ్ళు. ఆ గుణాలే యీ రచయితని వాళ్ళకి దగ్గరకు చేర్చాయని నా అభిప్రాయం.
జీవితంలో కృతార్థత పొందడమంటే, సక్సెస్ సాధించడమంటే అలుపెరుగని ప్రయాణం చేయడమే. ఆ ప్రయాణంలో యెగుడు దిగుళ్ళు వుంటాయి. రాళ్ళు రప్పలు వుంటాయి. కష్టాలు కన్నీళ్లు వుంటాయి. అక్కడ కేవలం విజయాలు మాత్రమే కాదు వోటములుంటాయి. సన్మానాలు సత్కారాలు అవార్డులు రివార్డులు మాత్రమే కాదు హేళనలు అవమానాలు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి జీవితాన్ని జీవితంగా స్వీకరించడమే సామాన్యుల్ని అసామాన్యులుగా చేస్తుంది. గమనమే గమ్యంగా భావించి నడక ఆపని వాళ్ళే హీరోలు. హీరోలు కావడమంటే మనుషులు కావడమే. మౌనంగా నిరాడంబరంగా తోటి మనిషికి సాయం చేస్తూ అతి సాధారణంగా బతకడమే.
సుబ్బు హీరోల్లో ఆదివాసి హక్కుల యోద్ధ సోనీ సోరీ, ఫోటోగ్రఫీ దృశ్యమాంత్రికుడు తమ్మా శ్రీనివాస్ రెడ్డి, సామాన్య శాస్త్ర ప్రవక్త ద్రష్ట కందుకూరి రమేష్ బాబు, కథల కానుగ చెట్టు గోపిని కరుణాకర్, చిత్రకళా నిపుణుడు అరసవిల్లి గిరిధర్, శివంగి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా, రైటర్ కమ్ ఉమెన్ ఫోటోగ్రాఫర్ రావులపల్లి సునీత వంటివాళ్ళ నిలువెత్తు చిత్రాలు వుండటం వల్ల యీ పుస్తకం నాకెంతో ఆత్మీయంగా అనిపించింది.
ఈ ప్రొఫైల్స్ అన్నీ చూసినప్పుడు ఆ యా వ్యక్తుల జీవిత విశేషాలతో పాటు సుబ్బు జీవన విధానం సైతం తెలుస్తుంది. సమాజం పట్ల అతని దృక్పథం స్ఫుటమౌతుంది. అతనిలో ఒక కళాకారుడున్నాడు. ఒక సామాజిక సేవకుడున్నాడు. ప్రకృతి ప్రేమికుడున్నాడు. యువ జర్నలిస్టు వున్నాడు. అన్నిటికీ మించి జీవితాన్ని ప్రేమించే మంచి మనిషి వున్నాడు. వాళ్లే అతనితో ఈ రాతలన్నీ రాయించారు. ఈ జీవన చిత్రాల రచన ద్వారా అతనో ప్రామిసింగ్ రైటర్ గా రూపొందుతున్నాడని నిరూపించే వాక్యాలు అనేకం తారసపడి ఆలోచనకు పురిగొల్పుతాయి. చూడండి:
- న్యాయం చాలా ఖరీదైంది. పోరాటం ఫేస్బుక్ పోస్ట్, కామెంట్ అంత ఈజీ కాదు
- మనిషికి మనిషి చేసే సాయం భక్తి. భక్తి సామాజిక స్పృహ కలిగించాలి
- ఆచరణకు మాటలు అవసరం లేదు
- ఆలోచనలు సరిగా ఉన్నప్పుడు వైకల్యం అంటూ ఏమీ లేదు
- పంచే జ్ఞానం తరతరాలకు ఓ వరం
- నిజమైన అభివృద్ధి అంటే ఎత్తైన భావనాలు మెట్రో నగరాలు కాదు; మారుమూల గ్రామాలకు ఆదివాసి గుడాలకు విద్య వైద్యం వంటి కనీస అవసరాలు తీరటం తీర్చడం
- పూయగానే పరిమళించే పువ్వు ఆర్టిస్ట్ హృదయం ఒకేలాంటివి
- ఒక ప్రశ్న ప్రత్యామ్నాయాన్ని చూయిస్తుంది. ఒక ఆలోచన విపత్తుని నిలవరిస్తుంది. ఒక ఆచరణ భవిష్యత్తుని కాపాడుతుంది
- జ్ఞానం అంటే పంచేది. సాయం అంటే అందించేది. దానం అంటే ప్రతిఫలం ఆశించనిది
- కళాకారుడు తన కన్నులతో చూసే చూపుతో సమాజం పురిటి వాసన మాయమవుతుంది
- సమాజాన్ని చూడలేని కళ అంటే ప్రకృతి అందాలను చూడకుండా చీకటి గదిలో కూర్చోవడం లాంటిది
ఇలాంటివే గాక; ఆ యా అద్భుతమైన వ్యక్తులకు సుబ్బు పెట్టిన ట్యాగ్ లైన్లు ఆ యా స్ఫూర్తి కథనాల మొత్తం సారాన్ని అందిస్తాయి (ఉదా: చెత్తలో విరిసిన చైతన్యం, మనోనేత్రుడు మొ.). ప్రత్యేకించి గమనించండి.
ఈ సజీవ రచన చిత్రాల్లోని వ్యక్తుల్లో 90 శాతం మందిని సుబ్బు ప్రత్యక్షంగా కలిశాడు. దగ్గరగా పరిశీలించాడు. సంభాషణ చేశాడు. ఆ క్రమంలో అతను జీవితం గురించి చాలా నేర్చుకుని వుంటాడు. ఆ అవకాశం నాకు కలగలేదు అని బాధ వుంది. కానీ సుబ్బు తన untold stories ద్వారా యింత మంది హీరోల కటౌట్లని వొకే ప్రాంగణంలోకి తెచ్చి నాకు/మనకు దగ్గర చేస్తున్నాడు. థేంక్యూ సుబ్బూ!
ప్రతి మనిషిలో ఒక వెలుగు ఉంటుంది. దాన్ని కొందరే చూడగలరు. కొందరే వెలికి తీసి ఇతరులకు పంచగలరు. మనిషిలోని వెలుగుని గుర్తించి పదుగురికీ పంచే పనిలో వున్నాడతను. తను చేసే పనిలో ఆర్వీ సుబ్బు మరింత చురుగ్గా వుండాలనీ తన వాక్యానికి మరింత పదును పెట్టాలనీ తన చూపును జీవితం లోతుల్లోకి మరింత నిశితంగా ప్రసరింప చేయాలనీ సామాజిక చలనాన్ని గతి తార్కికంగా అవగాహన చేసుకోవాలనీ తద్వారా లభించే యెరుకతో తన రచనల్లో సాంద్రత నింపుకోవాలనీ ఆశిస్తూ … అతనికి అభినందనలు తెలియజేస్తూ …
సెలవ్.
హైదరాబాద్ ఎ. కె. ప్రభాకర్.
21 జనవరి 2023
Leave a Reply