కొత్త స్వరాల అన్వేషణలో …
(an appeal )
ఇదంతా వొక ఆందోళన జీవి గోల. వద్దనుకునే పాఠకులు యీ పేజీలు తప్పించి నేరుగా లోపలి కథల్లోకి వెళ్లిపోవచ్చు.
***
చుట్టూ చీకటి. దారి అగమ్యం. చేతిలో దిక్సూచి లేదు. ఎక్కడ యెలా మొదలు కావాలో తెలీదు. అంతా యెగుడు దిగుళ్ళు. నడక ప్రతి అడుగులోనూ సంశయం. వెతుకులాట దేనికోసమో యేర్పడదు. కాళ్ళకి చుట్టుకునే తీగపై ఆశ. అది పామేమోనని భయం. కొన్నిటిని గుర్తించి నిర్వచించుకోవడం దగ్గరే మొదటి గండం యెదురవుతుంది. కొన్ని లేవని బెంగ. దూరంగా వొక వొంటరి చుక్క మెరుస్తుంది. అది వేకువ రాకడని తెలుపుతుంది. చూపు తేటబడుతుంది. దారి గోచరిస్తుంది.
అకస్మాత్తుగా ఆగిన కథో జీవితమో వొక ఆసరాతో మళ్ళీ మొదలౌతుంది. ఇదొక నిరంతర ప్రయాణం.
***
కొత్త తరం పాత తరం భుజాల మీద కూర్చుని చూస్తుంది కనకనే యెక్కువ దూరం చూడగలుగుతుంది – ఇవే మాటలు కాదు గానీ తన జీవితానుభవం నుంచి యిటువంటి అర్థం వచ్చే మాటలే అంటాడు ఐజాక్ న్యూటన్. మన యెదుగుదలకూ పురో గమనానికీ మనకంటే పెద్దవాళ్ళు అంతకుముందే నిర్మించిన దారి వొకటి వుంది కాబట్టి ఆ దారిలో నడవడం తేలిక అని ఆయన వుద్దేశ్యం. అయితే పాత దారుల్లో నడవడమో వాటిని పొడిగించుకోవడమో మాత్రమే చేస్తే కొత్త దారులు యెప్పుడు యెలా పరుచుకుంటాయి అన్నది పెద్ద ప్రశ్న. శాస్త్ర సాంకేతిక రంగాల్లో న్యూటన్ మాటల్ని కొంతవరకు అంగీకరించవచ్చేమో గానీ సృజనాత్మకతకి నెలవైన సాహిత్య కళా రంగాలకి పూర్తిగా అన్వయించుకోలేం. నిజానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సైతం సృజనాత్మక ఆలోచనలే నూతన ఆవిష్కరణలకు దారితీస్తాయి. తాతపాదులు తవ్విన బావి నీళ్లు పానయోగ్యమా కాదా అని చూసుకోకుండా కుళ్ళిన నీళ్ళే తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అదే సందర్భంలో గత కాలపు సంచిత జ్ఞానాన్ని అనుభవ ఫలితాల్ని తిరస్కరించడమో త్యజించడమో కూడా తప్పే అవుతుంది. మనతోనే మొదలైంది; మనమే ‘పుడింగులం’ అని ప్రచారం చేసుకొనే సాహిత్య రాజకీయాలు నిలవ్వు. గెలవ్వు. కొత్తదనాన్ని కోరుకునే రచయితలు వర్తమాన స్థలకాలాల్లో వొదిగి వుండాలి. నేల విడిచి సాము చేయకుండా వాస్తవ పరిస్థితులకి కట్టుబడి వుండాలి. భూత భవిష్యత్తులకు వర్తమానమే వారధి.
కొత్త శతాబ్దంలో రెక్క విప్పుకున్న నలభై మంది యువ రచయితల నలభై ‘ఉత్తమ’ కథల్ని యెంపిక చేసి వాటిని చదివి అభిప్రాయం చెప్పమని మిత్రుడు వేంపల్లి షరీఫ్ అడిగినప్పుడు వాళ్లలో యెంతమంది కొత్తగా చెబుతున్నారు, యెంత మంది వర్తమానంలో నిలబడి భవిష్యత్తులోకి ‘ఎక్కువ దూరం చూడగలుగుతున్నారు’, వర్తమానంలో చుట్టూ వున్న సమాజంలో వాళ్లని bother చేస్తున్న అంశాలు యేవి, వాటి పట్ల వారి దృక్పథం యేంటి … యీ విషయాల మీదే యెక్కువ దృష్టి పెట్టాను. కొత్త శతాబ్దంలో మొత్తం సమాజం యెదుర్కొంటున్న సవాళ్లు యేమిటి, అవి సాహిత్యంలో యే మేరకు ప్రతిఫలిస్తున్నాయి, రచయితలు భిన్న సమూహాల జీవితాల్ని కేవలం యథాతథంగా చిత్రించడం దగ్గరే ఆగిపోతున్నారా, గుణాత్మకమైన మార్పుకు దోహదం చేసే చలనాన్ని తమ రచనల్లో విశ్లేషణాత్మకంగా విమర్శనాత్మకంగా చూసి కళాత్మకంగా వున్నతీకరించగలుగుతున్నారా … వంటి అంశాల పైకే నా మనసు పోయింది. అందుకు నా కారణాలు నావి.
సమాజంలాగానే సాహిత్యం కూడా నిత్యం చలనశీలంగా ఉండాలి. సాహిత్యకారుడు తాను జీవించే పరిసరాల్లో జరిగే మార్పుల్ని నిశితంగా పరిశీలించాలి. వాటికి కార్యకారణ సంబంధాన్ని మూలాల్లోకి వెళ్లి విశ్లేషించుకోవాలి. అభివృద్ధి నిరోధకమైనదాన్ని తిరస్కరించాలి. జీవితాన్ని మెరుగుపరచుకోడానికి దోహదం చేసే దారుల్ని ఆవిష్కరించుకోవాలి – అని బలంగా విశ్వసించే తరం నాది. సాహిత్య రచన సామాజిక ఆచరణ అని నమ్మే నా మాటలు కొత్త తరం రచయితల్లో కొందరికి రుచించకపోవచ్చు. సాహిత్య ప్రయోజనం – సామాజిక బాధ్యత – ప్రాపంచిక దృక్పథం వంటి మాటలు వారి చెవికి యింపుగా వినిపించకపోవచ్చు. అవి కాలం చెల్లిన ఆలోచనలుగా కూడా తోచవచ్చు. మరి కొందరు వొక దృక్పథం కలిగి వుండటమే సాహిత్య నేరంగా భావిస్తూ వుండొచ్చు. అనిబద్ధత దృక్పథ రాహిత్యం వుత్తమ సాహిత్య గుణాలుగా ప్రచారం చేసేవారు తక్కువేం కాదు. దృక్పథం సృజనాత్మకతకు ఆటంకంగా పరిణమిస్తుందని వాదించే వారు కూడా వున్నారు. నిజానికి దృక్పథం జీవితాన్ని అర్థం చేసుకుని రచనలో స్పష్టతని సాధించడానికి దోహదం చేసే అంశమే గాని అడ్డు కాదు. సత్యావిష్కరణకే కాదు కళాత్మక అభివ్యక్తి కూడా సరైన దృక్పథం తోడ్పడుతుంది అని నా నమ్మిక
***
దృక్పథ బలంతో, వస్తు రూప వైవిధ్యంతో రాస్తోన్న ‘యువ’ రచయితల చేతిలో తెలుగు కథ కొత్త పుంతలు తొక్కింది అని యీ సంకలనంలో కనీసం వొక డజను కథలన్నా రుజువుచేస్తాయి. ఆ విధంగా తెలుగు కథకి మంచి భవిష్యత్తు వుందని ‘యువ’ హామీ యిస్తుంది. నచ్చిన కథలన్నిటినీ యిక్కడ ప్రస్తావించడం కుదరని పని. మచ్చుకు స్థాలీ పులాకంగా వాటిలో కొన్ని మెతుకులు పట్టి చూద్దాం:
ఆధునిక భావజాలాలకి అనుగుణంగా పౌరాణిక పాత్రలతో పున:కథనాలు మనకు కొత్త కాదు గానీ బేతాళ పంచవింశతి కథలోని వొక పాత్ర తిరగబడితే, అది స్త్రీ పాత్ర అయితే, అన్న వూహతో చైతన్య పింగళి సంధించిన ‘మనసిజ విల్లు’ స్త్రీ పురుష శృంగార అనుభవవంలో మనశ్శరీరాలు నిర్వహించే పాత్రపై నిశ్చిత నిశ్చయాలని ఛేదిస్తుంది. నిల్వనీటిలా పాచిపట్టిన ఆలోచనల్ని మూలాల్లోకి వెళ్లి ప్రశ్నిస్తుంది. స్త్రీ మానసిక శారీరిక అవసరాల్ని తమదైన కోణం నుంచి నిర్వచించి నిర్ధారించి శాసించే పురుషస్వామ్యంపై చెంపపెట్టు యీ కథ. తలపులు తలలోనే పుడతాయి కాబట్టి శిరస్సే వుత్తమాంగమనీ శరీరం తుచ్ఛమనీ దాంపత్యంలో దైహిక సుఖాలకు ప్రాధాన్యం లేదనీ తీర్మానాలు సిద్ధాంతాలు తయారు చేసిన నీతివాదులకు దీటైన సమాధానం కూడా. సున్నితమైన హాస్యాన్ని సునిశితమైన వ్యంగ్యాన్నీ మేళవించి స్త్రీ లైంగికత చుట్టూ అల్లిన మిత్ ని బద్దలుకొట్టడమే ప్రధాన కథాంశంగా స్వీకరించి దాన్ని నిర్వహించిన తీరు మెదడుకు గిలిగింతలు పెడుతూనే ఆలోచింపజేస్తుంది. కథలోంచి కథలోకి నడిపిన అంత: కథన శిల్పం అమోఘం. కథల్లోపలి పాత్రల్ని collage చేసి వాటి మధ్య ఘర్షణని సృజిస్తూ వొక సారాన్ని రాబట్టే టెక్నిక్ ముచ్చటగొలుపుతుంది. దృక్పథం వస్తు రూపాల్ని యెంత తేజోవంతం చేయగలదో చెప్పడానికి యీ కథని దృష్టాంతంగా చూపవచ్చు. ఆధునికానంతరకాలంలో సమాధానాలే కాదు అసలు ప్రశ్నలే విమర్శకి గురౌతాయి. కథలో విక్రమార్కుడి అవకతవక సమాధానం బేతాళుడి తప్పుడు ప్రశ్న నుంచే పుట్టింది. ప్రశ్నలే ప్రశ్నకు గురయ్యే భావజాల వినిర్మాణం యిది.
వర్చ్యువల్ రియాలిటీ వికృత రూపాన్ని వినూత్న కథనంతో ఆవిష్కరించిన మరో కథ పూర్ణిమ తమ్మిరెడ్డి ‘ఎడిట్ వార్స్’. సంకలనంలో నాకు బాగా నచ్చిన యీ కథ రూపంలోనూ సారంలోనూ అన్ని విధాలా అత్యాధునికమైనది. సత్యానంతర కాలంలో సత్యం యెంత పెళుసుబారిపోయింతుదో అద్భుతంగా ఆవిష్కరించిన యీ కథ సమకాలీన అధికార రాజకీయ క్రీడకి దర్పణం పట్టింది. మీడియా సాక్షిగా manufacturing and manipulation of truth గ్లోబలీకరణ చెందింది. అయితే దాన్ని మన దేశపు పరిస్థితులకు అన్వయిస్తూ వొక శ్వేత విషాద బీభత్సాన్ని రచయిత కళ్ళ ముందు నిలబెట్టిన తీరు అపూర్వం. ది కార్వాన్ అన్న పత్రికలో ది ఎడిట్ వార్స్ పేరుతో వచ్చిన వాస్తవిక కథనాన్ని (వికీ పీడియా అర్బన్ నగ్జలైట్స్ తో నిండి హిందూ మతంపై దాడి చేస్తుందని కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లాంటి వాళ్ళు ఆరోపించిన నేపథ్యంలో) ఆధారం చేసుకుని పూర్ణిమ సాంకేతిక రంగంలో తన అనుభవానికి సృజనాత్మకతని జోడించి యెంతో సంయమనంతో ప్రతీకాత్మకంగా కథ నిర్వహించింది. సత్యం వక్రీకరణకి గురౌతున్న క్రమం పట్ల రచయిత్రి క్రోధం యీ కథకు ప్రాణం. కథలో రచయిత తాటస్థ్యాన్ని పాటించడానికి ప్రయత్నించినప్పటికీ తనదైన దృక్పథాన్ని దాచుకోలేకపోవడం గమనిస్తాం. ఒకటి రెండు సందర్భాల్లో రచయిత కంఠస్వరం అనివార్యంగా బహిర్గతమౌతుంది. ఫాసిస్టు పాలనలో అసత్యం సత్యంగా చెలామణి కావడానికి యెన్ని యెత్తుగడలు వేయగలదో యెన్ని అవతారాలు యెత్తగలదో నిరూపించడానికి ఆమె కనపడీ కనపడని వ్యంగ్యాన్ని ఆశ్రయించారు. ప్రయోగం దృక్పథం రెండూ యెటువంటి పొరపొచ్చాలు లేకుండా జంటగా సహజీవనం చేయగలవని చెప్పడానికి యీ కథ మంచి ఉదాహరణ. వస్తు స్వీకరణలోనే కాదు కథా నిర్మాణంలో సైతం కొత్త రచయితలు యెంత జాగరూకత వహించాలో చెప్పడానికి యీ కథని వొక పాఠ్యాంశంగా స్వీకరించవచ్చు.
స్త్రీ పురుష సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని కొత్త రచయితలు యెలా చూస్తున్నారు – ప్రేమలు కలయికలు విడిపోడాలు ప్రీ, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ సహజీవనం పెళ్లి మల్టిపుల్ రిలేషన్స్ … వీటి పట్ల స్థిరీకృతమైన విధి నిషేధాల విషయమై తమ కథల్లో యెలా స్పందిస్తున్నారు – యే విలువల్ని ప్రతిపాదిస్తున్నారు – యే ధోరణుల్ని వున్నతీకరిస్తున్నారు? ఇటీవల సాహిత్య చర్చల్లో ప్రధానంగా ముందుకు వస్తున్న ప్రశ్నలివి ( ఇన్ ద మూడ్ ఫర్ లవ్, నువ్వెళ్ళిపోయాకా, తొలి ప్రేమ కథలు మొ. సంకలనాలు యీ చర్చని మరోసారి ముందుకు తెచ్చాయి). కాడ మల్లి (మెహర్), శీలానగర్ రెండో మలుపు (మిధున ప్రభ), మధురానగర్ మెట్రో స్టేషన్ (మొహమ్మద్ గౌస్), సీత కనబడింది (నాగేంద్ర కాశి), తన్మయి (ఉషాజ్యోతి బంధం), ఇంత సౌఖ్యమని … (రవి మంత్రిప్రగడ), చెరువు – చింత చెట్టు(స్వాతికుమారి బండ్లమూడి), ఊర్మిలక్కతో సెక్స్ (చిన్ని అజయ్) … యిలా యీ వస్తువుకి ‘యువ’ కథా సంకలనంలో కూడా సింహభాగమే లభించింది. వీటిలో మెహర్ ‘కాడ మల్లి’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. స్త్రీ పురుషుల మధ్య కలయిక బ్రేకప్ యెడబాటు యెంత హుందాగా గౌరవప్రదంగా ప్రజాస్వామికంగా వుండాలో తెలియజెప్పే యీ కథ నిర్మాణ పరంగా సాంద్రంగా వుండటమే కాదు గంభీరంగా కూడా వుంటుంది. రచయిత కథలో చెప్పిన విషయాల కంటే చెప్పని విషయాలే పాఠకుల్ని యెక్కువ ఆలోచింపజేస్తాయి. కథలో మౌనం మాట్లాడుతుంది. దేహ భాష పాత్రల అంతరంగాల్లోకి తొంగి చూసేలా చేస్తుంది. వాక్యాల మధ్య ఖాళీలు అర్థ గౌరవాన్ని పెంచుతాయి. చదివిన ప్రతిసారీ సంభాషణల్లో కొత్త వుద్వేగాలు స్ఫురిస్తాయి. కథ ఉత్తమ పురుషలో పురుష పాత్ర చెబుతుంది కానీ యిది నిజానికి ఆమె కథ. అలా నిర్వహించడంలోనే రచయిత ప్రతిభ కనపడుతుంది. సహజీవనం లో commitment loyalty adultery morality వంటి అనేక విషయాల్ని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించకుండా చాలా subtle గా చర్చకు పెడుతుంది. కథని ఆద్యంతం పరిమళ భరితమైన ఓపెన్ స్టోరీగా నడపడం యెలాగో ‘కాడ మల్లి’ ని చూసి నేర్చుకోవచ్చు.
మాంత్రిక వాస్తవికత సామాజిక వాస్తవికత కలెగల్సిన తన పూర్వికుల కథ చెప్పి సరికొత్త కథకి పురుడు పోసిన యువ కథకుడు రమేష్ కార్తీక్ నాయక్. ‘పురుడు’ పరిణామంలో చిన్నదైనా వస్తు పరంగా రూపపరంగా శతాబ్దాల చరిత్ర సంస్కృతుల్ని పరిచయం చేసింది. లంబాడీ తండాల్లో బిడ్డని కనడానికి వంద సంవత్సరాల కిందటి పరిస్థితులు యిప్పటికీ వుండటమే సమకాలీన విషాదం. జానపద మౌఖిక కథా శిల్పాన్ని సమకాలీన కథకి అన్వయించడం ద్వారా గొప్ప శిల్పాన్ని సాధించాడు రమేష్. రచయిత వాడిన భాష, సామాజిక సాంస్కృతిక వాతావరణం పురుడు కథని విశిష్టంగా తీర్చిదిద్దాయి. బంజారా జీవితాన్ని చిత్రించిన కథలు యింతకు మునుపు (చూ. ఇప్పపూలు – గిరిజన సంచార జాతుల కథలు) వచ్చినప్పటికీ యింత రూప వైవిధ్యం, సాంస్కృతిక వాస్తవికత ఆ కథల్లో కనిపించదు. వాస్తవికతని ఆశ్రయించడం అంటే కాల్పనికతకి చోటు లేకుండా చేయడం అని కొందరు భావిస్తారు. వాస్తవికత కాల్పనికత – యీ రెండిటినీ పరస్పరం విరుద్ధమైన ద్వంద్వంగా భావించడం వల్ల వచ్చిన చిక్కు ఇది. కాల్పనికత అంటే సృజనాత్మకతే అని నిరూపించడానికి ‘పురుడు’ వంటి కథలు రావాల్సిన అవసరం యెంతైనా వుంది. దేశీ మౌఖిక కథన రీతుల్ని స్వీకరించడం ద్వారా ఆధునిక కథ మరింత పరిపుష్టమౌతుంది. భిన్న అస్తిత్వ సమూహాలకు చెందిన జీవితం, ముఖ్యంగా ఆదివాసీ జీవితం, సాహిత్యంలోకి యెక్కని లోటు యిప్పటికీ సాహిత్య విషాదమే. ఖాళీలని పూరించే దిశగా జరిగే ప్రయత్నాలు మరింత బలపడాలి, అందుకు యువ రచయితలు కృషి చేయాలని నాకు మరోసారి అనిపించింది.
మైనారిటీ అస్తిత్వ నేపథ్యం నుంచి వెలువడ్డ మానస ఎండ్లూరి ‘ఒకరోజు’, హుమాయూన్ సంఘీర్ ‘హరామ్’ కథలు యీ సంకలనానికి నిండుదనం తెచ్చాయి. మొదటిది దళిత క్రిష్టియన్ సంస్కృతిని మృదువైన హాస్యంతో విమర్శనాత్మకంగా పరిశీలిస్తే, రెండవది ముస్లిం మతంలోని విశ్వాసాల్ని మానవీయత గీటురాయి మీద హేతుదృష్టితో పరీక్షించింది. మత సామరస్యాన్ని బోధించే కథలు కొన్ని (షేక్ షబ్బీర్ హుస్సేన్: మా వూరి శివుడు, మేడి చైతన్య: సాయిబోల్ల పిల్ల) యీ సంకలనంలో చోటుచేసుకున్నాయి. అసహనం విద్వేషం పునాదిగా రాజకీయాలు నడుస్తున్న కాలంలో వాటి అవసరాన్ని సంపాదకుడు సరిగానే గుర్తించాడు. వందల కథలు వొడపోసి కథలు కూర్చడంలో సంపాదకుడి దృష్టికోణాన్ని పట్టిచ్చే యిలాంటి సందర్భాలు కొన్ని వుంటాయి.
40 యేళ్ల లోపు వాళ్లు అంటే మరీ అంత యువతేం కాదు. కొందరు సీజన్డ్ రైటర్స్ గా స్థిరపడ్డారు కూడా. కాబట్టి వాళ్లని ఇప్పుడే కలంబట్టిన రచయితలుగా గుర్తించలేం. వాళ్ల చేతుల్లో కథ యెన్ని కొత్త పోకడలు పోయిందో గ్రహించడానికి పైన పేర్కొన్నవి కొన్ని తార్కాణాలు మాత్రమే. లోతుగా అధ్యయనం చేస్తే మరిన్ని దృగంశాలు గోచరించవచ్చు.
***
ఈ సంకలనంలో చోటు చేసుకున్న కథలన్నీ వుత్తమమైనవేనా అంటే కాపోవచ్చు. కొన్ని కథలు కాబోయి కాలేకపోయినవీ కొన్ని కథల చట్రంలోకి యిమడనివీ వుండొచ్చు. అయితే మూస బద్దలు కొట్టి కొత్తగా రాయాలనే తపన మాత్రం చాలా మందిలో కనపడుతోంది. రూప ప్రయోగం చేయాలనే ఆలోచన కొందరిలోనైనా కనిపిస్తుంది. నిద్ర చావు అభావం వంటి మార్మిక జీవిత రహస్యాల్ని వ్యాఖ్యాన రహితంగా విలోమ అసిత్వ కథనంలో నిర్వచించిన ధీరజ్ కాశ్యప్ – డెఫినిషన్స్, ఆధునిక సాంకేతికతని సైన్స్ ఫిక్షన్ లో మేళవించి మానవీయ విలువల్ని ప్రతిపాదించిన కుప్పిలి సుదర్శన్ – హెల్పింగ్ డోమ్, హిపోక్రసీ వంటి అమూర్తభావనని పాత్రగా రూపు కట్టించి మనిషిలోని స్వార్థాన్ని అక్షరాల్లోకి తర్జుమా చేసిన పాణిని జన్నాభట్ల – ఎయిత్ సిన్, ఆర్థికావసరాలకూ లైంగిక నైతికతకీ మధ్య యేర్పడే ఇన్ డీసెంట్ ఘర్షణని కొన్ని ఘటనల ద్వారా పాత్రల మనోగతం ద్వారా యాంటీ క్లైమాక్స్ ద్వారా బహిర్గతం చేసిన రిషి శ్రీనివాస్ – నిషిద్ధాక్షరాలు, ఆకస్మికతని దైనిక జీవితంలో యాంత్రికంగా మలచుకునే నగర ప్రేమని గ్లూమీగా చిత్రించిన మహమ్మద్ గౌస్ – మధురా నగర్ మెట్రో స్టేషన్, సంప్రదాయ కథా నిర్వచనాల్ని తిరస్కరించి ప్రీ మ్యారిటల్ రిలేషన్ లోని బలమైన వుద్వేగాన్ని మ్యూజింగ్స్ రూపంలోకి మలచిన ఉషా జ్యోతి బంధం – తన్మయి కథల్లో చేసిన ప్రయోగాలు గమనార్హం.
ప్రయోగాలు రూపపరంగానే కాదు; వస్తుపరంగా కూడా ఉంటాయి. సంచలనాత్మకంగా వుండే వస్తువుతోనే కొందరు షాక్ ట్రీట్మెంట్ యివ్వడానికి ప్రయత్నిస్తారు. చేయితిరిగిన రచయిత వంశీధర రెడ్డి ‘కీమో’, కొత్తగా కలం పట్టిన చిన్ని అజయ్ ‘ఊర్మిళక్కతో సెక్స్’అటువంటి కథలే. ఆ కథల్లో వాళ్ళు చేసిన లైంగిక సంబంధాల ప్రస్తావన గగుర్పాటు కలిగిస్తుంది. వంశీ కథ జీవితానికి చెందిన పరాయీకరణ వంటి యితరేతర పొరల్లోకి చూపు ప్రసరింపజేస్తే, అజయ్ కథకి సారం, కేంద్ర బిందువు సెక్సే అన్నది గమనార్హం. sex ని ఒక biological psychological need గా ప్రతిపాదించగలగడంలో రచయిత యే మేరకి సఫలమయ్యాడో కథ చదివితేనే తెలుస్తుంది. కొత్త కథకుల చూపు విలక్షణమైన వస్తువులవైపు ప్రసరిస్తుంది అనడానికి యివి వొకట్రెండు వుదాహరణలు. అయితే యెటువంటి ప్రయోజనం లేకుండా కేవలం ప్రయోగం కోసమే ప్రయోగం చేయడం పట్ల రచయితలు అప్రమత్తంగా ఉండాలి. అవసరం మేరకు చేసే ప్రయోగం కథకి కొత్త ప్రాణం పోస్తుంది. ప్రయోగం సారాన్ని మింగేయకూడదు. ప్రయోగం కథకి బరువు కాకూడదు. పాఠకులకు చేరువ కావడానికి వుపయోగపడాలి. ప్రయోగమే కథ కాకూడదు. పాత సామెత మరోసారి చెప్పుకోవాలి : కంటికి సరిపడే కాటుక మాత్రమే పెట్టుకోవాలి. కన్ను పోయేంత కాటుకలా కథకి కీడు చేసే ప్రయోగం కూడదు.
కథానుగుణమైన భాష వాడటంలో కొత్త రచయితలు అప్రమత్తంగా వున్నారు. తమ ప్రాంతీయ సామాజిక మాండలికాలని స్వేచ్ఛగా వుపయోగించుకుంటూ గడ్డం మోహన్ రావు, నస్రీన్ ఖాన్, ఉప్పులేటి సదయ్య, రమేష్ కార్తీక్ నాయక్, కందివనం స్ఫూర్తి, హుమాయూన్ సంఘీర్ (తెలంగాణా భాష) ఇండ్ల చంద్రశేఖర్ (ఒంగోలు భాష) మిథున ప్రభ (విశాఖ భాష) సురేంద్ర శీలం (కర్నూలు భాష) కె వి మేఘనాథ రెడ్డి (చిత్తూరు భాష) [1] వంటి రచయితలు వాడిన కథన భాష వారి కథలకి గొప్ప స్థానీయతనీ విశ్వసనీయతనీ సాధించింది. కథలో భాష పట్ల యువ కథకుల ప్రజాస్వామిక దృక్పథం చాలా హృదయస్పర్శిగా అనిపిస్తుంది. వివిధ సామాజిక వర్గాల భిన్న ప్రాంతాల భాష కథలోకి రాకపోవడం వల్ల తెలుగు కథ యెంత గడ్డకట్టిపోయిందో కొత్త దశాబ్దంలో సైతం రచయితలు గుర్తిస్తున్నందుకు సంతోషం కలుగుతుంది. కథకి స్వీకరించిన యితివృత్తమే దాని రూపాన్నీ కళాత్మక వ్యక్తీకరణనీ నిర్దేశిస్తుంది అన్న యెరుక యీ రచయితల్లో వుంది. ‘యర్రావు దూడ’ కథ నిర్వహణలో రచయిత శ్రద్ధని గమనించండి. మీరూ వొప్పుకుంటారు. [2]
***
ఈ సంకలనం చదివే క్రమంలో యేర్పడ్డ కొన్ని పరిశీలనలు బుల్లెట్స్ రూపంలో పంచుకుంటాను. అవి స్టేట్మెంట్స్ లా కనిపించవచ్చు. వాటిని విభేదించడానికి అవకాశం వున్న అభిప్రాయాలుగా మాత్రమే చూడాలి.
- మూస కథా నిర్మాణ పద్ధతుల్ని బద్దలు కొట్టి కథని కొత్తగా చెప్పాలనే ఆలోచన చాలా మంది యువ రచయితల్లో కనిపిస్తుంది. అది బలంగానూ బలహీనతగానూ పరిణమించింది అనడానికి రెండు రకాల వుదాహరణలూ వున్నాయి.
- కథని వుద్వేగపు జ్ఞాపకాల అలల్లా ముందుకీ వెనక్కీ నడిపే పాత టెక్నిక్ మీదే యింకా రచయితలు యెక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఈ టెక్నిక్ లో గత వర్తమానాల మధ్య పాత్రల ఆలోచనలు గడియారం లోలకంలా కదులుతూ వుంటాయి. పాఠకుల్ని ఆకట్టుకోవడం తేలిక. అయితే రచయితకి కాలిక స్పృహ లేకుంటే విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం వుంది.
- దృశ్య ప్రధానమైన కథలు రాయడానికి రచయితలు మొగ్గుచూపుతున్నారు (ఇందుకు సినిమా ప్రభావం బలంగా వుండటం వొక కారణం కావచ్చు. ఒకప్పుడు నాటక రచయితల్లా యిప్పుడు కథకులు సినిమా రంగంలో కెరీర్ కోసం ఆశ పడుతున్నారు. షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ స్టూడియోలు సిబ్బంది సెటిలైట్ ప్రసారాలతో పని లేని సొంత చానళ్లు సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేసే అవకాశాలు ఒటిటిలు … యిలా సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల ప్రభావం కథ రూపంపై పడుతూ వుంది).
- సింగిల్ పాయింట్ కథలు ఎక్కువ. మల్టీ లేయర్డ్ కథలు తక్కువ. సింగిల్ పాయింట్ కథల్ని నిరాకరించడం నా అభిమతం కాదు. కథ జీవితంలోని, సమాజంలోని అనేక పొరల్ని స్పృశించాలి, వ్యాఖ్యానించాలి. ప్రతి పొరలోనూ అనేకార్థాలు గోచరించాలి. చదివిన ప్రతిసారీ కొత్త కోణాలు ఆవిష్కారం కావాలి.
- కథలో లోతు కన్నా విస్తృతి యెక్కువ కనిపిస్తుంది. విడ్త్ డెప్త్ రెండూ వున్న కథలే కాలానికి నిలబడతాయి. విస్తృతి పరిశీలన ద్వారా లభిస్తుంది. లోతు అధ్యయనం ద్వారా సాధించాలి.
- సాహిత్యాన్నీ జీవితాన్నీ సమాజాన్నీ అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే ఉత్తమ కథ రూపొందుతుంది. అధ్యయనం ద్వారా కథా రచనలో పరిణతి సాధించిన కథకులూ అధ్యయనం లేమితో తేలిపోయిన కథకులూ యిద్దర్నీ ఈ సంకలనంలో గమనించగలం.
‘ప్రతీ పదం ఆచితూచి రాయాలి. ప్రతీ అక్షరాన్ని పట్టిపట్టి చూసి చూసి తడబడిన, పొరబడిన వాటికి సర్దిచెప్పి సరిచేయాలి… భావావేశంలో అదుపు తప్పి ఆవేశపడుతున్న పదాలను వెనక్కి లాక్కొచ్చి కాసిన్ని మంచినీళ్ళు తాగించాలి. బెరుకుగా వెనక్కి దాక్కుండిపోతున్న నిజాలని ముందుకు చొచ్చుకొచ్చేలా తోయాలి.’
పై మాటలు యీ సంకలనంలోనే వొకానొక కథలో నిజం పట్ల ఉండాల్సిన నిబద్ధత గురించి భిన్న సందర్భంలో వాడినప్పటికీ కథా రచనకి సైతం వాటిని అన్వయించుకోవచ్చు. మంచి కథ పుట్టువుకి సృజనాత్మక శక్తి యెంత అవసరమో అధ్యయనం, సాధన (వ్యుత్పత్తి, అభ్యాసాలు) కూడా అంతే అవసరమని నిరూపించే తావులు అనేకం. కొత్తగా రాస్తున్న రచయితలకే కాదు; అధ్యయనం అందరికీ అవసరమే. సొంత గొంతుకు అధ్యయనం ఆటంకమని కొందరు భావించవచ్చు. కానీ అది నిజం కాదు. అధ్యయనం చూపుని విశాలం చేస్తుంది. ఆలోచనల్లో పరిణతికి దోహదం చేస్తుంది. రచనా నైపుణ్యాల్ని పెంచుతుంది. స్వీయ అనుభవ పరిధిని అధిగమించి రచన చేయాలంటే అధ్యయనం అనివార్యం. కాదన్నవాళ్ళని యే కాలమూ కాపాడదు.
- కొత్త రచయితల కథల్లో గ్రామీణ జీవితం, నేపథ్యం వెనుకతట్టు పట్టాయన్న బెంగ నన్ను పీడిస్తూ వుండేది. ఆ బెంగని యీ సంకలనం కొంతవరకు తీరుస్తుంది. అయితే యిటీవలి రచయితల్లో యెక్కువ భాగం అర్బనైజ్ అవ్వడం చూస్తాం. ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలకు చెందిన వాళ్లైనప్పటికీ సగం మందికి పైగా హైదరాబాద్ లో సెటిలై వున్నారు. ఆ మేరకు తెలుగు కథ నాగరిక వేషం ధరిస్తోంది అని చెప్పడానికి యీ సంకలనంలో కథలు సాక్ష్యంగా నిలుస్తాయి. కథ అర్బనైజ్ అవడం తప్పు అని చెప్పడం లేదు. ఆర్థిక సామాజిక సాంస్కృతిక అసమానతలతో నిండి వున్న నగర జీవితం వైవిధ్య భరితం. అనేక వైరుధ్యాలకీ సంక్లిష్టతలకీ నెలవు. వాటిని కథల్లోకి తీసుకురావడంలో యింకా వెనకబడే వున్నాం. అర్బన్ జీవితంలోని స్త్రీ పురుష సంబంధాల దగ్గరే ఆగిపోతున్నామా అని ప్రశ్నించుకోవాలి.
- ప్రింట్ పత్రికల అవసరాలకు అనుగుణంగా నిడివి తక్కువ కథల రాకతో పెద్ద కథలకు తావులేకుండాపోయింది. అందువల్ల కథకి క్లుప్తత గాఢత వంటి లక్షణాలు కలిగాయి కానీ వొక తరం కథకుల్లో పెద్ద కథని నిర్వహిచలేని తనం యేర్పడింది. దాన్ని అధిగమించడానికి సొంత బ్లాగులూ వెబ్ పత్రికలూ తోడ్పడినప్పటికీ ప్రింట్ పత్రికల నిబంధన ప్రభావం నుంచి కథకులు పూర్తిగా బయటపడలేక పోతున్నారు.
- ఎక్కువ శాతం నాన్ సీరియస్ పాపులర్ రైటింగ్ మీదే దృష్టి పెట్టినట్టు గమనించగలం. ఇది యీ మధ్య కాలంలో వచ్చిన పెద్ద మార్పు. నాబోటి వాళ్లకు దీన్ని జీర్ణించుకోవడం కష్టంగానే వుంటుంది. కొందరు శుద్ధ కథా వాదులు అంగీకరించకపోవచ్చు – కథ కాలక్షేప వ్యాపకం కాదు. అదొక సామాజిక ఆచరణ.
దేశ వ్యాప్తంగా రాజకీయ అవసరాల కోసం సమాజంలోని వైవిధ్యాన్ని విభిన్నతనీ భగ్నం చేసే కుట్రలు యెన్నో జరుగుతున్నాయి. మనుషుల మధ్య వెల్లివిరియాల్సిన సహోదర భావాన్ని ధ్వంసం చేసే మధ్య యుగాల మత మౌఢ్యం, కులాధిపత్య క్రూరత్వం రాజ్యమేలుతున్నాయి. తిండి బట్ట కట్టు ప్రతిదీ ఆంక్షలకు గురౌతుంది. ప్రజాస్వామికమైన నిరసన తెలియజేయడానికి స్వేచ్ఛ కొరవడుతోంది. జీవించే హక్కు సైతం ప్రశ్నార్థకమౌతుంది.
ఇక్కడ బతకడానికి పల్లెల నుంచి సిటీకొచ్చిన పేదా బిక్కీ బిందెడు నీళ్ల కోసం యుద్ధాలు చేయాలి (చందు తులసి – నీళ్ల బిందె). నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి జర్నలిస్టులు జీవితాల్ని పణంగా పెట్టాలి (పూర్ణిమ – ఎడిట్ వార్స్). నచ్చిన తిండి తినడానికి చావుకి సిద్ధం కావాలి (ఉప్పులేటి సదయ్య – ఉడో). పండిన పంటకి సరైన ధర కోసం రైతులు తెగించి సమ్మెలు కట్టాలి (చరణ్ పరిమి – పొగ). సొంత నేలమీద నిలవ నీడ కోసం నిర్వాసితులు పునరావాసం కోసమో పరిహారం కోసమో దశాబ్దాలుగా కంపెనీలతోనో వాటి దళారీ సర్కారుతోనో తెగని పోరాటం చెయ్యాలి (నస్రీన్ ఖాన్ – కొత్త పొద్దు). గూడేల్లో చెరువులు కుంటలు బావులే కాదు నీళ్ల పంపులు సైతం కులం కారణంగా అస్పృశ్యమౌతాయి (రాజా అంబటి – గ్రీవెన్స్). వేళ్ళమీద లెక్కబెట్టగలిగినంతమంది మాత్రమే యిటువంటి సమకాలీన సమస్యల్ని యితివృత్తాలుగా స్వీకరించడం చూస్తే ఆశ్చర్యం కలిగింది. కొంపలు తగలడుతుంటే ఫిడేలు రాగాలు తీసే విషాద సౌందర్యం ప్రమాదభరితమేనేమో!
ఏది యేమైనా యివి యివాళ్టి కథలు. వర్తమాన కథా చరిత్రకి సాక్ష్యాలు. భవిష్యత్ కథ యీ రచయితల చేతుల్లో వుంది. అది యెటు నడుస్తుందో అధ్యయనం చేయడానికి వొకచోట అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో మంచి చెడ్డల నిర్ణయం విజ్ఞులైన పాఠకులదే.
***
ఏడెనిమిదేళ్ల క్రితం లా మకాన్ సెమినార్ హాల్లో కొంతమంది కొత్త రచయితల మధ్య ‘యువ కథకుల కథనరీతుల’ గురించి ముచ్చటించే అవకాశం కల్పించాడు వేంపల్లె షరీఫ్. అప్పటి వాళ్లలో కొందరు ఆగిపోయారు. మరి కొందరు కొనసాగుతున్నారు. కొద్దిమంది చేతికి అందనంత యెత్తు యెదిగి అబ్బురపరుస్తున్నారు. మళ్లీ యివాళ 40 మంది రచయితల కథలకు చేరువయ్యే అవకాశం అతనే కల్పించాడు. నన్నిలా యెప్పటికప్పుడు సమకాలీనం చేస్తున్నందుకు ఆత్మీయ మిత్రుడు షరీఫ్ కు నెనర్లు.
కొత్త దారులు వెతుక్కుంటూ పయనిస్తున్న రచయితలకి అభినందనలు. దేశంలో వివిధ భాషలకి చెందిన 40 యేళ్ళ లోపు రచయితల కథలతో ఇంగ్లీషు లో A Case of Indian Marvels, తెలుగులో యీ ‘యువ’ కథా సంకలనం దాదాపు వొకే కాలంలో వెలువడటం యాదృచ్ఛికం కాదేమో !
ఇది కథలు రుతువు. కథకుల కాలం. కొందరైనా కాలానికి యెదురీది ముందుకు సాగుతారనే ఆశ.
జీవితంలో కొత్త ఘటనలేవీ జరగనప్పుడు గతంలోనే జీవిస్తాం. కొత్తగా మాట్లాడుకోడానికి యేం లేనప్పుడు పాత కబుర్లే చెప్పుకుంటాం. ఇప్పుడు కాసేపు కొత్త కథలు చదువుదాం – కొత్త స్వరాలు విందాం.
సెలవ్.
కాలిఫోర్నియా, ప్రేమతో,
సెప్టెంబర్ 17, 2022 ఎ. కె. ప్రభాకర్
add
add
Leave a Reply