నా 2022 పుస్తక పఠనం
మామూలుతో పోలిస్తే 2022 లో నేను చాలా కథల పుస్తకాలు చదివాను. తెలుగు నుండి ఆంగ్లం లోకి కథలని అనువాదం చేయడం మొదలుపెట్టడం ఇందుకు కారణం. దీనితో ఇక మామూలుగా నేను ఎక్కువగా చదివే తరహా వ్యాసాలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు వంటివాటికి టైము లేకపోయింది. అయినా మధ్యమధ్య కొన్ని చదివా. గుడ్ రీడ్స్ వెబ్సైటు ప్రొఫైల్ పోయిన ఏడాది చివర్లో డిలీట్ చేశాను. కనుక ఈ జాబితాకి నేను నా కినిగె, కిండిల్ పర్చేస్ హిస్టరీ, లైబ్రరీ వాళ్ళ బారోయింగ్ హిస్టరీ, “చదువు” ఆప్ లో ఉన్న హిస్టరీ, చివరగా నాకు గుర్తు ఉన్న ఇతరత్రా పుస్తకాలు ఏవైనా ఉంటే అవీ – వీటిమీద ఆధారపడ్డా. వెబ్జీన్ లలో చదివిన కథలు వగైరాలని లెక్కించడం లేదు.
తెలుగు
కథలు:
- రూపాయి చెప్పిన భేతాళ కథలు – అరిపిరాల సత్యప్రసాద్ – ఇది నాకు బాగా నచ్చిన పుస్తకం. కథలంటే ఇక్కడ ఇది కాల్పనిక సాహిత్యం లోకి చేర్చాలా వద్దా? అన్న సందేహం ఉంది కానీ బహుశా తెలుగులో ఇలాంటిది ఒక పుస్తకం లేదేమో!
- కేన్యా టు కేన్యా – అరి సీతారామయ్య కథలు ; ఆ నేల, ఆ నీరు, ఆ గాలి – వేలూరి వెంకటేశ్వర రావు కథలు – ఇమిగ్రెంట్ జీవితాల గురించిన అంశాల కోసం వెదుకుతూ ఉంటె పై రెండూ ఎవరో చెబితే చదివాను. కొన్ని కథలు బాగున్నాయి. సీతారామయ్య గారి కథల్లో అయితే కథాంశాలు దాదాపు అన్నీ నచ్చాయి, కానీ కథనం నన్ను అంత ఆకట్టుకోలేదు.
- కించిత్ భోగో భవిష్యతి – వేమూరి వెంకటేశ్వర రావు కథలు – దాదాపు అన్ని కథలూ నాకు నచ్చాయి. అసలు ఈ కథలు ఇంకొంచెం ఎక్కువమంది చదువరులని చేరాల్సినవి. ఇందులో టైటిల్ కథని నేను ఆంగ్లానువాదం చేశాను. అవుట్లుక్ పత్రికలో వచ్చింది.
- Z సైన్స్ ఫిక్షన్, మరికొన్ని కథలు – డాక్టర్ చిత్తరువు మధు ; సైన్స్ ఫిక్షన్ కథలు – కస్తూరి మురళీకృష్ణ – తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ కథలు. రెంటిలోనూ నాకు కొన్ని కథలు నచ్చాయి.
- ఆ అరగంట చాలు – కస్తూరి మురళీకృష్ణ – హారర్, థ్రిల్లర్ తరహా కథలు. దాదాపు అన్ని కథలూ చాలా నచ్చాయి.
- సిక్కెంటిక కథలు – జిల్లెళ్ళ బాలాజీ – నాదస్వరం వాయించే కుటుంబాలు, మంగలి పని, సవరాలు చేసేవారు, ఇలాంటి నేపథ్యాలతో ఉన్న కథలు. మొదటి ఐదారు కథలు నాకు కొత్తగా అనిపించి నచ్చాయి. ఇందులో “సిక్కెంటిక” కథని నేను ఆంగ్లానువాదం చేశాను. అవుట్లుక్ పత్రికలో వెబ్ ఎడిషన్లో వచ్చింది.
- గజ ఈతరాలు – గొరుసు జగదీశ్వరరెడ్డి కథలు – ఈ కథలు కూడా నాకు పరిచయం లేని నేపథ్యాలు కలవి కనుక ఆపకుండా చదివించాయి.
- అగ్రహారం కథలు – వేదుల సుభద్ర (ఆడియో బుక్ – దాసుభాషితం ఆప్)
- బాహుదా – బూదూరి సుదర్శన్ కథలు
ఇవి రెండూ భిన్న కథాంశాలవే అయినా ఒకటి కామన్. అమరావతి కథలు, పసలపూడి కథలు ఇలాగ ఒక ప్రాంతంలోని జీవితాల కథలు. బాహుదా లో అయితే కొన్ని పాత్రలు కూడా రిపీట్ అయినట్లు అనిపించాయి. బాహుదాలో ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్నది తిరుపతి, చిత్తూరు ప్రాంతాల భాష.
ఢావ్లో – రమేశ్ కార్తీక్ నాయక్ కథలు – తెలుగు రాష్ట్రాల్లోని బంజారాల జీవితాల చుట్టూ అల్లిన కథలు ఇవన్నీ. రచయిత వర్ణనలు కళ్ళకి కట్టినట్లు ఉండడంతో కథలు మామూలుగా చదివేవాటికంటే పెద్దగా ఉన్నా అట్టే ఇబ్బంది పెట్టలేదు. అన్నింటిలోకీ చిన్నదైన “పురుడు” కథకి నేను చేసిన ఆంగ్లానువాదం ఒక అమెరికన్ సాహితీ పత్రికలో వచ్చింది ఈ ఏడాదే.
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు – ఈ కథలలో కొన్ని మంచి ప్రయోగాత్మకమైన కథలు ఉన్నాయి. కొన్ని ఇప్పటికీ సమకాలీనంగా అనిపించినవి ఉన్నాయి. కొన్ని అంత నచ్చని కథలూ లేకపోలేదు కానీ దాదాపు రచయిత మరణించిన అరవై ఏళ్ళకి ఇలాంటి పుస్తకం ఒకటి రావడం మంచి విషయం. ఇలాంటివి మరిన్ని వస్తే బాగుండు. ఇందులో కూడా ఒక కథ నేను అనువాదం చేశాను “ఇదిప్పుడు మనదేశమే” అన్నది. అది కూడా అవుట్లుక్ పత్రిక వెబ్ ఎడిషన్ లో వచ్చింది.
- కొత్తకథ 2022 (వివిధ రచయితలు)
- ఆనాటి వాన చినుకులు – కథలు (వివిధ రచయితలు)
- ఉంటాయి మాకు ఉషస్సులు – నంబూరి పరిపూర్ణ కథలు
- రోబో బుద్ధ – రాణి శివశంకరశర్మ కథలు
కొన్ని కథలు ఆకట్టుకున్నాయి.
- ఇసుక – సడ్లపల్లి చిదంబరరెడ్డి కథలు
రాయలసీమలోని రైతుల జీవితాల చుట్టూ తిరిగే కథలు. కొన్ని చాలా నచ్చాయి.
నవలలు
- అంతర్జ్వలన
- నేహల – సాయి బ్రహ్మానందం గొర్తి నవలలు. ఒకటి సాంఘికం, ఒకటి చారిత్రకం. రెండూ ఆపకుండా చదివించాయి.
- మూగవాని పిల్లనగ్రోవి – కేశవరెడ్డి . చిన్నదే అయినా బక్కిరెడ్డి పాత్ర చాలారోజులు వెంటాడింది.
- ఏది సత్యం – శారద (ఎస్ నటరాజన్) – బాగా బోరు కొట్టింది నాకు.
- పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా – త్రిపురనేని గోపీచంద్. పదిహేనేళ్ల క్రితం చదివాను. ఇపుడు రీరీడ్. ఇప్పుడు కూడా బాగా ఆకట్టుకుంది
- చాతక పక్షులు – నిడదవోలు మాలతి. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా వెళ్ళిన తెలుగు వారి నేపథ్యంతో వచ్చిన నవల. కొన్ని పరిశీలనలు ఇప్పటికి కూడా వర్తిస్తాయని అనుకుంటున్నా. చిన్న నవల, ఆపకుండా చదివించింది.
- చంద్రగిరి శిఖరం – బిభూతిభూషణ్ బందోపాధ్యాయ బెంగాలీ నవల కి కాత్యాయని గారి తెలుగు అనువాదం – ఆ వర్ణనలూ, కథా అంతా ఆపకుండా చదివించింది ఈ నవల. కాత్యాయని గారి అనువాదం బాగుంది.
- దూరాంతరం – బిభూతిభూషణ్ బందోపాధ్యాయ బెంగాలీ నవల కి దండమూడి మహీధర్ గారి తెలుగు అనువాదం – పోను పోను కొంచెం బోరు కొట్టేసింది ఈ నవల. అనువాదం బాగుంది.
ఇతరాలు
“ఒక దీపం – వేయి వెలుగులు; నంబూరి పరిపూర్ణ జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వం” – పరిపూర్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వందకి పైగా వ్యాసాలతో వచ్చిన పుస్తకం. నేనూ ఒక వ్యాసం రాశాను. కొన్ని చాలా మంచి వ్యాసాలున్నాయి ఇందులో.
కావ్య దహనోత్సవం వేలూరి వెంకటేశ్వర రావు -ఇది ఒక ప్రయోగాత్మకమైన పుస్తకం. నాకు భలే నచ్చింది.
ఇంగ్లీష్:
Non-fiction:
- Jeena hai tho marna seekho – The life and times of George Reddy, Gita Ramaswamy – 70లలో హత్యకి గురైన విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి జీవిత కథ. కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా, పుస్తకం అంత ఆకట్టుకోలేదు. కానీ, జార్జిరెడ్డి సినిమా వచ్చినపుడు చూసాను. దాని కంటే వివరంగా తెలిసింది దీనివల్ల ఆయన గురించి.
- Land, Guns, Caste, Woman – the memoir of a lapsed revolutionary, Gita Ramaswamy – గీతా రామస్వామి గారి ఆత్మకథ. నాకు హైదరాబాదు బుక్ ట్రస్ట్ వల్ల మాత్రమే పరిచయం కనుక ఇదంతా కొత్తగా అనిపించింది. పుస్తకం అక్కడక్కడా మరీ వివరంగా ఉండి బోరు కొట్టించినా, స్పూర్తిని కలిగించేది.
- Day to Day economics – Satish Deodhar – సామాన్య ప్రజానికానికి ఎకనామిక్స్ పాఠాలు. ఒక ఐఐఎం ప్రొఫెసర్ రాసినవి. కొంచెం పాత పుస్తకమే అయినా బాగుంది.
- Where I’m reading from – Tim Parks (Re-read) – ఇది ఒక ఐదారేళ్ళ క్రితం చదివాను. అయితే ఈయన అనువాదం గురించి రాసినవి కొన్ని మంచి వ్యాసాలు ఉన్నాయని మళ్ళీ చదివా ఈ ఏడాది. చాలా మంచి పుస్తకం.
- I remain in darkness – Annie Ernaux/Tanya Leslie -ఇటీవలే నోబెల్ సాహిత్య బహుమతి పొందిన రచయిత్రి తల్లి చివరి రోజుల్లో జీవితం గురించి రాసిన డైరీ లాంటిది. బహుశా ఇలాంటివి పుస్తకాలు గా రాకుండా ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. రచయిత్రి ప్రతిభ ని తప్పుబట్టక్కర్లేదు కానీ అవతలి మనిషి గురించి అంత గ్రాఫిక్ వివరణ వాళ్ళ అనుమతి లేకుండా ఇవ్వడం ఎంత వరకూ సబబు? అనిపించింది.
- Dear Ijeawele, or A Feminist Manifesto in Fifteen Suggestions – స్నేహితురాలికి ఉత్తరాల లాగా రాసినవి. నాకు నచ్చింది ఈ పుస్తకం.
- A Nation worth reading about – Rick Mercer – కొన్నేళ్ళ క్రితం నాటి కెనడా సామాజిక, రాజకీయ అంశాల గురించి చిన్న చిన్న వ్యాసాలు. బానే ఉంది.
- A place within: Rediscovering India by M.G.Vassanji – రెండు తరాల క్రితం గుజరాతు నుండి ఆఫ్రికా ప్రాంతాలకి వలస వెళ్ళి, పై చదువులకి కెనడా వచ్చి అక్కడే స్థిరపడి రచయితగా పేరు తెచ్చుకున్న ఎం.జీ.వస్సంజీ పూర్వీకుల దేశమైన ఇండియా కి వెళ్ళినప్పటి అనుభవాల వ్యాసాలు ఇవి. వలస వెళ్ళినవారి ఆలోచనలు, తిరిగి వచ్చినపుడు మారిపోయిన సమాజం గురించిన ఆలోచనలు, మధ్య మధ్య ప్రముఖులని కలిసిన అనుభవాలు – ఇలాంటివన్నీ ఆపకుండా చదివించాయి. నాకు చాలా నచ్చిందీ పుస్తకం.
- Numbers don’t lie: 71 stories to help us understand the modern world – Vaclav Smil – ఇది IEEE Spectrum లో చాలా రోజుల పాటు నడిచిన కాలం (ఇప్పుడూ వస్తోంది). కొన్ని వ్యాసాలు ఆసక్తికరంగా ఉంటే కొన్ని కాకిలెక్కల్లా అనిపించాయి (సారీ, ఈయనెంత గొప్ప రచయితైనా నా అభిప్రాయం ఇది.)
- “Relax: A Guide to Everyday Health Decisions with More Facts and Less Worry” (by Timothy Caulfield) – సమకాలీన జీవితం గురించి ఉపయోగకరమైన పుస్తకం.
Fiction:
- Taranath Tantrik, and other tales from the supernatural – Bibhutibhushan – ఈ ఏడాదే కొత్తగా వచ్చిన ఆంగ్లానువాదం ఇది. ఈయన కథలు కూడా రాశాడని తెలియదు నాకు. కొత్తగా, ఆసక్తికరంగా ఉన్నాయి.
- Temsula Ao’s short story collections: Tombstone in my garden, Laburnum for my head – నాగాలాండ్ లోని జీవితాల నేపథ్యంలో రాసినవి. కొన్ని కథలు చాలా నచ్చాయి. తెలుగు లోకి అనువాదం చేయాలని కూడా అనిపించింది. పర్మిషన్ కోసం మెసేజి చేసిన కొన్నాళ్ళకే రచయిత్రి మరణించారు. గతంలో ఈవిడ ఆత్మకథ చదివాను 2020లో. ఇతర రచనలు కూడా ఏవైనా చదవాలిక.
- How to pronounce knife – Souvankham Thammavonga (short stories) – లావోస్ దేశం నుండి కెనడా వలస వచ్చిన వారి జీవితాల చుట్టూ అల్లిన కథలు. కొన్ని బాగున్నాయి.
- Killer, come back to me – the crime stories of ray bradbury – గొప్పగా రాశాడు అసలు ఈయన ఈ కథలు. సగానికి పైగా కథలు చాలా నచ్చాయి.
- Taaqtumi – an anthology of Arctic Horror Stories – కెనడియన్ మూలవాసి రచయితలు రాసినవి. దాదాపు కథలన్నీ చాలా బాగున్నాయి. కొన్ని భలే భయపెట్టాయి.
- The accidental further adventures of the hundred year old man – Jonas Jonasson – నవల. ఈ రచయిత ఇతర నవలల్లాగే ఉంది. ఆ కారణానికే అవి నచ్చినా ఇది బోరు కొట్టింది.
ఇంకా చదువుతున్నవి:
ఇవి కథల సంకలనాలు, అప్పుడోటీ ఇప్పుడోటీ చదువుతున్నాను. మూడూ బాగున్నాయి ఇప్పటిదాకా.
- What we fed to the manticore – Talia Lakshmi Kolluri
- The Greatest Telugu Short stories ever told – various authors; Dasu Krishnamoorthy, Tamraparni (translators from Telugu)
- The Shehnai Virtuoso and other stories – Dhumketu (Gujarati author)/Jenny Bhatt (Translator)
Anil అట్లూరి
దాదాపు ఇక్కడున్న తెలుగు సాహిత్యం అంటే కధలు, నవలలు అన్నీ చదివినవే. బాహుద సుదర్శన్ కథలు, చాతక పక్షులు, చంద్రగిరి శిఖరం, దూరాంతరం చదవాలి. ఇక ఆంగ్ల సాహిత్యం …. అది మరో ప్రపంచం .