ప్రసన్న కథనం

వ్యాసకర్త: శంకగిరి నారాయణస్వామి, బ్లూం ఫీల్డ్ హిల్స్, మిషిగన్, యు.ఎస్.ఏ

*******

మనవాళ్ళు అమెరికా వచ్చాక, కొత్త జీవితపు అనుభవాలని అక్షరాల్లో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, యాభై ఏళ్ళకి పైగా. ఈ రచనల్లో, విడిచి వచ్చిన భారత దేశం గురించిన నాస్టాల్జియా (సంక్రాంతికి పతంగులు, అమ్మ వండి పెట్టిన సున్నుండలు) ఎక్కువ పాళ్ళలోనూ, అమెరికాలో ఎదురైన వింత అనుభవాలు (ఇక్కడి వారు మన పేర్లని పలకలేక ఖూనీ చెయ్యడం, పిజ్జా మీద ఏ టాపింగ్ ఆర్డర్ చెయ్యాలో తెలియక తికమక పడడం) మరి కొన్ని పాళ్ళలోనూ, అమెరికా సామాజిక జీవన విధానాల గురించి అతి కొద్ది పాళ్ళలోనూ రాస్తూ వచ్చారు. 

రచయిత్రి శ్రీనిధి (ఇక్కడ కబుర్లు చెబుతున్న అమెరికా అమ్మాయి) ఇప్పటికి వచ్చిన అమెరికా కథనాలన్నిటికీ భిన్నంగా ఒక కొత్త దృక్పథంతో ఈ కబుర్లు చెప్పుకొచ్చారు. మొట్టమొదటి కథలోనే తానేమిటో చక్కగా పరిచయం చేసుకున్న రచయిత్రి, ఈ శీర్షిక 24 అధ్యాయాలనూ – కాసింత అమాయకంగా, బోలెడు తెలివిగా, పిసరంత గడుసుగా, చాలా చమత్కారంగా – నిర్వహించు కుంటూ వచ్చారు.  శ్రీనిధి నాస్టాల్జియాని స్మరించుకోవడంతోనో, ఇక్కడి విషయాలను చూసి అబ్బుర పడడంతోనో ఆగిపోలేదు ఈ రచనల్లో. ఆయా సంఘటనల మధ్య కార్యకారణ సంబంధాలను అన్వేషించారు.

ఈ యాభయ్యేళ్ళలోనూ – దీనికి దోహదం చేసిన కారణాలు ఏవైనా – అమెరికా తెలుగు వారికి (బహుసా మిగతా భారతీయులకి కూడా) సంబంధించి జరిగిన ముఖ్యమైన పరిణామం ఒకటుంది. రచయిత్రి మాటల్లోనే – 

“చిన్నతనంలో ఎంతో అబ్బురంగా, స్వర్గానికి మరోపేరుగా తలచిన దేశం. అక్కడి విశేషాలు, వస్తువులు, అక్కడినుంచి వచ్చిన మనుషులూ, అందరూ ఎంతో గొప్పవారనీ, దేశంలో ఎంతటి పేరున్న గుడి వారైనా పూర్ణ కుంభంతో స్వాగతం పలికేటంత వి.వి.ఐ.పీలు అనీ అనుకునే రోజుల నుండీ … ఆ వదినా మా పిల్లకి ఆవకాయ్ పట్టడానికి సాయానికి అమెరికా వెళ్తున్నాను దార్లో మీ అబ్బాయికి  ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వు, ఇచ్చేసి వస్తాను అనే రోజుల్లోకి వచ్చేసాము. “

దూరంగా ఉన్న మనుషులను దగ్గర చెయ్యడానికంటూ ఏర్పడిన సోషల్ మీడియా – ముఖ్యంగా వాట్సాప్ – ఇక్కడి జీవితాల మీద భారతదేశంలో ఉన్నవారు ఓ కన్నేసి ఉంచడానికి ఓ దుర్భిణీలా ఎలా మారిపోయిందో అని చెణుకులు వేశారు రచయిత్రి. ఉద్యోగాన్వేషణ, పిల్లల పెంపకం, మితిమీరిన కొనుగోలు పైత్యం, పర్యావరణ విధ్వంసం, అదుపు దప్పిన వృధా – ఇలాంటి చిన్నా పెద్దా సమస్యలను గురించి ఆత్మ పరిశీలన చేసుకున్నారు. మొట్టమొదటి సారి అమెరికా గడ్డ మీద కాలు పెట్టినప్పటి నించీ, దాదాపు పదేళ్ళ జీవన యానంలో ఒక మంచి కెరీర్లో కాళ్ళూనుకుని, ఒక ఇల్లు కొనుక్కుని స్థిరపడే పరిణామంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలని సునిశిత దృష్టితో పరిశీలించి,  చక్కని నుడికారంతో అక్షరబద్ధం చేశారు. డాలర్లని పదులు వందల స్థానం లోనించి దింపి ఒకట్ల స్థానంలో చూడ గలగడం, వీసాలలో తర తమ భేదాలు, రెండు గిన్నెలూ నాలుగు గరిటలూగా మొదలైన సంసారం రెండు బెడ్రూముల అపార్ట్ మెంట్ ని అధిగమించి నాలుగు బెడ్రూముల ఇల్లంతా విస్తరించడం వంటి పరిణామాలను ఆమె దృష్టితో మనం చూస్తాం. 

సందర్భోచితంగా సామెతలు పొదుగుతూ, పురాణాల రిఫరెన్సు నించీ లేటెస్ట్ హాలీవుడ్ బాలీవుడ్ పాప్ న్యూస్ రిఫరెన్సుల వరకూ సరసోక్తుల పరిమళాలు వెదజల్లుతూ ఈ రచన సాగించారు శ్రీనిధి. వయ్యారమైన తెలుగు వాక్యం, తియ్యటి తెలుగు నుడికారంతో పాటు, గిలిగింతలు పెట్టే హాస్యం కూడా శ్రీనిధి రచనకి ఒక ముఖ్య లక్షణం. విమర్శ అయినా, చెణుకు వెయ్యడం అయినా, ఆత్మ పరిశీలన అయినా, ఆఖరుకు వేదాంతమైనా, చారులో ఇంగువ తగిలించినట్టు హాస్యపు పోపు ఘుమఘుమ ఈ రచనల్లో గుబాళించింది. అనురక్తుడైన భర్తతో, ముద్దులు మూటగట్టే కూతురితో ముచ్చట గొలిపే సంసార దృశ్యాలు కూడా మనకి కనువిందు చేస్తాయి. 

అయితే, కాస్త పరిశీలనగా చదివే పాఠకులకి అక్కడక్కడా ఆ అక్షరాల గొంతులో ఒక సన్నటి విషాదపు జీర వినబడుతుంది – హెచ్4 భార్యగా, అధిక విద్యావంతురాలై ఉండి కూడా ఈ పరదేశ ప్రభుత్వపు చట్టాల మూర్ఖత్వం వల్ల ఉద్యోగం చెయ్యలేక పోవడం, తద్వారా మంచి సామర్ధ్యాన్ని అలవరుచుకుంటూ పెరిగిన అమ్మాయిలు ఒక్కసారిగా నిస్సహాయులు ఐపోవడం – ఒక కాదనలేని నిజం. తనలాంటి ఎన్నో వేల మంది పెళ్ళి చేసుకుని వలసవచ్చిన భారతీయ సంతతి వనితల హృదయ వేదన ఇది. అంతటి భారమైన విషయం మాట్లాడుతూ కూడా, కంట్లో తొంగి చూసిన కన్నీటి బిందువుని రెప్ప దాటనీయకుండానే లోపలికి పంపేసి, గొంతు వణికించిన దుఃఖపు జీరని మింగేసి, ఏమీ జరగనట్టు చిర్నవ్వు చిందించగల ధీర గుణం శ్రీనిధిది.

వర్గీకరణపరంగా ఇటువంటి రచనలకు ఒక లేబుల్ అతికించడం కష్టం. కథలు అనుకోవచ్చు, వ్యక్తిగత కథనాలు అనుకోవచ్చు, వ్యాసం అన్నా తప్పులేదు. వార మాస పత్రికలు తెలుగులో విరివిగా వస్తున్న కాలంలో ఇలాంటి రచనలను ఫీచర్ అనీ, కాలమ్అనీ అంటూ ఉండేవారు. రచన ఒక లేబుల్ కి కట్టుబడి ఉండనవసరం లేదు అనే సాంప్రదాయం తెలుగు బ్లాగులతో మొదలయింది. బ్లాగు ద్వారానే అక్షరాభ్యాసం చేసిన శ్రీనిధి, అడపా దడపా కొన్ని కథలు రాసినా, వాటిల్లో కొన్నిటికి పలు ప్రశంసలు అందుకున్నా, ఇలా నిర్వచనానికి కట్టుబడని వచనంతోనే పేరు పొందడం, తన తొలి పుస్తకం తీసుకు రావడం సముచితమే.

ఈ తొలి పుస్తకంతో వేస్తున్న అడుగు శ్రీనిధిని తెలుగు సాహిత్యంలో ఉన్నత శిఖరాలకి దారి తీయాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.    

You Might Also Like

Leave a Reply