తమిళనాట తెలుగునుడి పల్లెకతలు
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
*********
తమిళనాట తెలుగునుడి పల్లెకతలు: 1. కుటుంబ కథలు
సేకరణ డా. సగిలి సుధారాణి
భూగోళమంతా నైసర్గికంగా, రాజకీయంగా, సంస్కృతీ పరంగా, భాషాపరంగా అనేక సమాజాలుగా విడిపోయి చాలాకాలమే అయింది. అయితే ఈ విభజనలు మనిషిని కట్టి పడెయ్యలేకపోయాయి. ఉపాధి, జీవికలకోసమో, వ్యాపార వ్యవహారాల కోసమో మనిషి వలసదారి పడుతూనే ఉన్నాడు. స్వంత ఊరిని, మనుషుల్ని వదిలి వెళ్లినా తనదైన అస్తిత్వానికి పునాదులైన భాషా సంస్కృతుల్ని మాత్రం తన స్వంతమని అక్కున చేర్చుకునే ఉన్నాడు. తరం తర్వాత తరానికి తన వారసత్వాన్ని అందిస్తూనే ఉన్నాడు. అది తను కాపాడుకోవలసిన సంపదగా భావించి, గర్విస్తుంటాడు.
అయితే కొత్తగా స్థిరపడిన ప్రాంతపు జీవన విధానం, అలవాట్లు ఎంతో కొంత అతని జీవనశైలి మీద ప్రభావం చూపక మానవు. వాటిని తమ రోజువారీ జీవితాలకు కూర్పుగా మాత్రం స్వీకరిస్తాడు. ఎన్నాళ్లక్రితమో వదిలి వచ్చిన స్వంత ఊరిని, మనుషులని, సంప్రదాయాలని కన్నతల్లి ని ప్రేమించినంతగానూ ప్రేమిస్తాడు. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఈ కొత్త ప్రదేశాన్ని, కొత్త మనుషుల్ని అభిమానించేందుకు అభ్యంతరం అనుకోడు.
కొత్త తరాలకు తమ పెద్దలు వలస వచ్చిన ప్రాంతమే స్వంతమైపోతుంది. అయినా ఇంట బలంగా కనిపిస్తూ, వాడుకలో ఉన్న పద్ధతులు కి అలవాటు పడక తప్పదు. రెండు ప్రాంతాలు, రెండు సంస్కృతులు, ఒక్కోసారి రెండు భాషలు…ఇవన్నీ జీవితపు తొలినాళ్లలో కొంచెం అయోమయాన్ని సృష్టించినా, రెండింటి ప్రయోజనాలతో మరింత మేలునే పొందుతుంది కొత్తతరం.
ఇలాటి ఒక భాషా సంబంధమైన అనుబంధం ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి వలస వెళ్లిన వారిలో కనిపిస్తుంది. తాతతండ్రులు సగర్వంగా అందించిన విలువలను, భాషా సంప్రదాయాలను అంతే గౌరవంతో స్వంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది కొత్త తరం. వీరి జీవితాలు కొత్త అనుభవాలతో, కొత్త జ్ఞానంతో మరింత విస్తరిస్తాయి. అదొక అందమైన మేళవింపవుతుంది.
“తమిళనాట తెలుగునుడి పల్లెకతలు” పేరుతో డా. సగిలి సుధారాణి సేకరించిన కుటుంబ కథలను చదవటం ఒక కొత్త అనుభవం.
ఎప్పుడో ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళప్రాంతానికి తరలివెళ్లి స్థిరపడిన తెలుగువారు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భాషను ప్రేమగా స్వంతం చేసుకుని, అనుసరిస్తూ, స్థానిక భాష తాలూకు ప్రభావాలనుంచి కాపాడుకునే ప్రయత్నం చూస్తే గర్వంగా తోస్తుంది. వీరికి తెలిసిన భాష స్వచ్ఛమైన తెలుగు భాష. తెలుగునాట తెలుగు భాష ప్రాంతాలవారీగా కాలంతోపాటు అనేక మార్పులకు లోనవుతూ వచ్చింది. అందువల్ల తమిళనాట తెలుగు ప్రజలు వాడే తెలుగు భాష నుండి ఇది వేరుగా, భిన్నంగా కనిపిస్తుంది. డా. సగిలి సుధారాణి ఈ కుటుంబ కథలను తమిళనాట పల్లెల్లోకి వెళ్లి అక్కడి వారినుండి మౌఖికంగా సేకరించారు.
సృజనాత్మక సాహిత్యం, అనువాద సాహిత్యం కాకుండా యదార్థ జీవితాన్ని ప్రతిబింబించే మౌఖిక సాహిత్యాన్ని గ్రంథస్థం చెయ్యటం చాలా క్లిష్టమైన పని. జానపద సాహిత్యంగా చరిత్రలో ఎప్పటినుంచో ఉన్నదే ఇది. “ఇలాటి విషయం పట్ల పరిశోధన పట్టుదల కలిగిన వారు మాత్రమే చెయ్యగలరంటూ” మద్రాసు విశ్వవిద్యాలయం ప్రాచార్యులు శ్రీ జి. వి. ఎస్. ఆర్. కృష్ణమూర్తి గారు ముందు మాటలో సుధారాణిగారి కృషిని ప్రశంసించారు. ఈ పుస్తకం తోడ్పాటు లేకుండా సమగ్ర తెలుగు నిఘంటువు రూపొందించడం సాధ్యం కాదంటారాయన.
పుస్తకాన్ని ప్రచురించిన ఆర్ట్స్ & లెటర్స్ అధ్యక్షులు శ్రీ చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారు తన ముందుమాటలో తెలుగురాష్ట్రాల బయట ఉన్న తెలుగువారు తెలుగును తమదైన యాసతో మాట్లాడుకుంటారని, వారి నాలుకల మీద తెలుగుపాట, మాట బతికే ఉన్నాయంటారు. దక్షిణాది పల్లె జనాల బతుకు తీరుకు ఈ కథలు అద్దం పడతాయంటారు.
జనాలు నోటిద్వారా మాత్రమే ముందు తరాలకు అందిస్తున్న జానపద కథల్లోని భాష కాలంతో పాటు కొంతవరకు మారినా వలస వెళ్లినవారి అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాయి ఈ పుస్తకంలోని కథలు. ఇవన్నీ కేవలం మౌఖికంగా అందుతున్నవే. వలస వెళ్లిన తెలుగువారిలో చాలామందికి తెలుగు చదవటం, రాయటం రాకపోయినా వ్యవహారంలో మాత్రం తమ భాషను సజీవంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యటం ప్రశంసనీయం.
డా. సుధారాణి తన పరిశోధనలో భాగంగా తమిళనాడులోని అనేక ప్రాంతాలలో, జిల్లాలలో తెలుగువారి సంస్కృతి వందల సంవత్సరాలుగా బలంగా నిలబడి ఉందని తెలిసి ఆయాప్రాంతాలలో పర్యటించి సేకరించిన కథలే ఇవి.
ప్రధానమైన తెలుగు ప్రాంతం నుండి వెళ్లిన సుధారాణి మాట్లాడే తెలుగు మేలైనదని, తమ తెలుగు వేరుగా ఉందని, మంచిది కాదని అక్కడి వారు న్యూనతాభావంతో నోరువిప్పి మాట్లాడేందుకు కూడా సంశయించినపుడు పరిశోధకురాలు వారిలోని ఆ భావాన్ని పోగొట్టి, స్నేహభావంతో వారితో కలిసిపోయారు. తనకు తెలిసిన కథలను వారికి చెపుతూ వారిని తమ కథలను చెప్పేలా ప్రోత్సహించారు. ఈ ప్రయత్నంలో అనేక వ్యప్రయాసలకు ఆమె లోనయ్యారు. ఎక్కడో తెలుగు నేలకు దూరంగా వందల సంవత్సరాలుగా జీవిస్తూ కూడా తమ అస్తిత్వం తెలుగువారేనన్నది నమ్ముతున్నవారిని, వారి జీవితాల్ని వారి నోటిద్వారానే బయట ప్రపంచానికి చెప్పించారు. ఇది సాధారణ విషయం కాదు.
ఈ కథలన్నీ కుటుంబ కథలే. తల్లీపిల్లలు, భార్యాభర్తలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అత్తాకోడళ్లు మధ్య కుటుంబాల్లో ఉండే నిత్య సంఘర్షణను చెపుతాయి. ప్రాంతాలు వేరైనా మనుషుల మధ్య రాగద్వేషాలు ఎంత సహజంగా ఉంటాయో, వాటిలో సారూప్యతలను చెప్తాయి ఈ కథలు. తమిళనాట స్థిరపడిన ఈ ప్రజలు వినిపించిన కథల్లోని తెలుగు మనకు ఇక్కడ ప్రధాన స్రవంతిలో వినిపించే తెలుగుకు కాస్త భిన్నంగా ఉందన్నది, ఉంటుందన్నది అసహజమేమీ కాదు.
“అణ్ణ తంబి బందం” కథ అన్నదమ్ముల మధ్య అపురూపమైన బాంధవ్యం చెపుతుంది. “నల్ల తంగాళ్” కథలో పేదరికంలో దీనస్థితిలో ఉన్న స్త్రీ తన అన్న ఇంటికి వచ్చినప్పుడు వదిన ఆమెను అవమానించి పంపుతుంది. ఆమె అవమానంతో బావిలో దూకి చనిపోతుంది. అది తెలిసిన అన్న దుఃఖంతో తన భార్యతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటాడు.
తమిళనాట ప్రచారంలో ఉన్న జపాన్ కథ “పెద్దవాళ్ల మాట చద్దన్నం మూట”. ఈ నానుడి మనవైపు కూడా ప్రాచుర్యం పొందినది.
ఒక దేశాన రాజు తన రాజ్యంలో ఎనభైసంవత్సరాలు పై బడిన వారు జీవించటం అనవసరమని, వారిని బలవన్మరణం నిమిత్తం ఊరి బయట వదిలివేయాలని చాటింపు వేస్తాడు. ప్రజలంతా రాజు మాటను పాటిస్తారు. కానీ ఒక యువకుడు తన తాత పట్ల ఉన్న ప్రేమతో రహస్యంగా తాతను ఇంటి సొరంగంలో దాచి పెడతాడు.
ఆ ఏడాది రాజు ఎప్పటిలాగే తన పుట్టినరోజున ఒక పరీక్ష పెట్టి, నెగ్గినవారికి ఒక కానుక ప్రకటిస్తాడు. రాజు అడిగిన ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయినా యువకుడు తన తాత చెప్పిన జవాబును చెప్పి బహుమతి గెలుచుకుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక రాజు ఆ యువకుని అడుగుతాడు అతనికి సరైన సమాధానాలు అంత కచ్చితంగా ఎవరు చెపుతున్నారో చెప్పమని. యువకుడు తన తాత గురించి చెపుతాడు.
ఆ మాటలకి రాజు ఆలోచనలో పడతాడు…పెద్ద వయసు వాళ్ల సలహాలు ఎంతో ప్రయోజనం ఉన్నవని గ్రహించి తాను రాజ్యంలో ఇదివరకు పెద్దవారి పట్ల చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటాడు.
“తనదాకా వస్తే” కథ లో ఒక కుటుంబంలో మరణించిన పసివాడి గురించి వాడి పెద్దలు ఆ పసివాడి బదులు తమకి ఆ మరణం రాకూడదా అని దుఃఖిస్తారు. ఈ మాటలు పరదేశి రూపంలో వచ్చిన భగవంతుడు విని నవ్వుకుంటాడు. ఇంటిలో వారిని, సానుభూతి చూపిన ఎందరినో ఆ మరణాన్ని పిల్లవాడి బదులు తాము తీసుకుంటారా అని పరదేశి అడుగుతాడు. అందరూ కుడా మరణానికి సిద్ధంగా లేమని దాటవేస్తారు. ఈ నానుడి కూడా మనకు అత్యంత ప్రచారంలో ఉంది.
“మిడతంబొట్లు” కథలో పనిపాటలేని “బొట్లు” అనేవాడు తనకు తోచినట్టుగా అప్పటికప్పుడు జోస్యం చెప్పి అదృష్టవశాత్తూ అది నిజమవుతూండటంతో రాజుగారికి దగ్గరవుతాడు. కానీ ఎప్పటికైనా తను చేసే మోసం తనకు ముప్పు తెచ్చిపెడుతుందని గ్రహిస్తాడు. ఈ కథ మనవైపు ఉన్నదే.
తాము కోరుకునే మజ్జిగను తలచుకుంటూ నిద్రపోయిన దంపతులు కలను కని, తాము ఆవును కొని పుష్కలంగా పాడిని కలిగి ఉన్నట్టు, బంధువులకు కూడా ఇవ్వబోయినట్టు, అక్కడ వాళ్లకి ఒక సమస్య ఎదురైనట్టు “కలల లోకంలో మజ్జిగ” కథలో చూడవచ్చు. ఇటువంటి కథనూ విని ఉన్నాం.
“పణియార వాన”, “తేలు కుట్టిన దొంగ”, “గయ్యాళి అత్త”, “నానే సెప్పాల”, “ఆశ అత్యాశ” వంటి కథలు మనవైపు కూడా ప్రచారంలో కథలుగా చెప్పుకున్నవే. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. కానీ, దాదాపు అన్ని కథలూ మనకు పరిచయమున్నవే.
ఆ దక్షిణాది ప్రాంతంలో తెలుగువారి నోట ఇప్పటికీ వాడుకలో ఉన్న పదాలను కొన్ని చూద్దాం. వీటిపై అక్కడి ప్రాంతీయ భాష తాలూకు ప్రభావం లేకపోలేదు.
“పనక్కారి” (ధనవంతురాలు), “సద్దు” (శబ్దం), “ముడియాదు” (కుదరదు), “పక్వంగా” (జాగ్రత్తగా), “వెళియ” (బయట), “దబ్బరం” (అబద్ధం), “కొండు” (తీసుకుని), “ఉదవి” (సాయం), “వలక్కం” (అలవాటు), “పరిసు” (కానుక), “అరివిప్పు” (చాటింపు), “కొండపోయి” (తీసుకెళ్లి), “కవల” (బాధ), “తొళి” (వృత్తి), “వాక్కు” (జోస్యం), “ఎనకల” (అప్పుడు), “సేమిరి” (తోడు పెట్టటం), “పెద్దలమనిషీ” (గర్భం), “ముడియాదు” (కుదరదు), “తూక్కుని” (ఎత్తుకునిపోవు), “వెల్లం” (బెల్లం), “సెలవు” (ఖర్చుపెట్టు), “తొళి” (పని)….
ఈ విధంగా అనేక పదాలను పుస్తకంలోని కథల ద్వారా తెలుసుకుంటాం. ఇవన్నీ ఆ ప్రజలకు తెలుగు పట్ల ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తాయి. చదవను, రాయను రాకపోయినా భాషను వాక్కుగా బతికించుకునే వారి ప్రయత్నం అభినందించదగ్గది.
రచయిత్రి ఈ కథల సేకరణకు తనకు తోడ్పడిన వారందరికీ కృతజ్ఞతలు చెపుతూ ఒక విషయం రాసారు-
“నా కథల సేకరణకు మీరందించిన సహాయానికి ఏమిచ్చి ఋణం తీసుకోను” అని కథలు చెప్పిన దక్షిణాది ప్రాంతీయ ప్రజలను అడిగినపుడు వారు చెప్పిన జవాబు-
“ఆవల నుండీ ఈవలకు వచ్చి ఇప్పటికైనా మమ్మల్ని తెలుగువారిగా గుర్తెరికి వచ్చిరి. అదేమాకు నిండా సంతోషం” అంటూ రచయుత్రిని తమస్వంత ఇంటి ఆడపడుచుగా పసుపుకుంకుమలతో సాగనంపారట. వారి సంస్కారం గొప్పగా అనిపించింది. తమ పట్ల శ్రద్ధ తీసుకుని పరిశోధనకు పూనుకున్న సుధారాణి గారి పట్ల అమితమైన ఆదరణ చూపించారు. అదే జరగని నాడు నెలల తరబడి ఆ ప్రాంతాల్లో పర్యటించి తన పరిశోధనను పూర్తి చేసుకోగల అవకాశం ఉండేదే కాదు రచయిత్రికి. ఒక అరుదైన పరిశోధన, అపూర్వమైన తోడ్పాటు మనకు ఈ పుస్తకం అందేందుకు సాయపడింది.
ఈ పుస్తకం ఆసక్తికరంగా చదివిస్తుంది. మన భాషను మాట్లాడే మన తెలుగువారి పరిచయం కలుగుతుంది.
శ్రీ మోషే గారి పుస్తకం ముఖచిత్రం ఆలోచనాత్మకంగా ఉంది.
పుస్తకం లోపలి చిత్రాలను విశ్వ ప్రసాద్ గారు చిత్రించారు.
పుస్తకాన్ని ముద్రించినవారు ఆర్ట్స్ అండ్ లెటర్స్.
ప్రచురణః ఆగష్టు, 2017
ధరః 99 రూపాయలు
Leave a Reply