లేడీ డాక్టర్స్

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

****************

ఒక సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ఎందరెందరి సేవలో అవసరమవుతాయి. అందులో ముందు వరుసలో ఉండేది డాక్టర్స్. 

ఈ వారం నేను చదివిన “లేడీ డాక్టర్స్“ పుస్తకం స్త్రీలు డాక్టర్ వృత్తిని చేపట్టేందుకు దశాబ్దాల వెనుక ఉన్న సమాజ పరిస్థితులు, పరిమితులు, ఆలోచనలు ఏమిటన్నది చెప్పింది. లేడీ డాక్టర్ అన్న పదం వెనుక ఉన్న కథను ఊహకి అందని వాస్తవాలతో మన ముందుంచింది.  

కవితారావు గారు 2021లో ప్రచురించిన “లేడీ డాక్టర్స్” ఇంగ్లీషు పుస్తకానికి డా. పి. యస్. ప్రకాశరావు గారి అనువాదం ఈ పుస్తకం. దీనిని డా. చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ వారు ప్రచురించారు. తూర్పు గోదావరి జిల్లా తొలితరం మహిళా వైద్యురాలు డా. చెలికాని కమలమ్మ గారికి పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. కమలమ్మ గారు, రామారావు గారు బ్రహ్మసమాజీకులు. వారు రామచంద్రాపురంలో స్థాపించి వైద్య సేవలందించిన ఆసుపత్రిలోనే ప్రస్తుతం మూడవ తరంలో వారి మనుమడు రామారావు, భార్య కవిత వైద్య సేవలందిస్తున్నారు.

పంతొమ్మిదో శతాబ్దపు సమాజంలో ప్రాంత, వర్గ, కుల, మతాలతో నిమిత్తం లేకుండా తీవ్రంగా పాతుకుపోయిన మూఢ నమ్మకాలు ఆడపిల్ల చదువుకు అభ్యంతరాల్ని పెట్టాయి. 

“లేడీ డాక్టర్” అన్న పదం ఇంగ్లండులో 1870లలో మొదటిసారిగా వినిపించింది. స్త్రీలలో డాక్టర్ విద్య కావాలన్న ఆలోచన పుట్టిందప్పుడే. దానిపై మగవారి నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇలాటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్యను చేపట్టిన స్త్రీలు డాక్టర్లైన తరువాత కూడా అనేక వివక్షలను ఎదుర్కొన్నారు. 

నీతి శాస్త్రం ప్రకారం స్త్రీకి స్వాతంత్రం ఇవ్వకూడదని, ఆమె చదువుకుంటే ఆ స్వేచ్ఛతో కుటుంబ సౌఖ్యాన్ని నాశనం చేస్తుందని హిందూ సమాజం అభిప్రాయపడేది. ఆడవాళ్లు అబలలనీ, తెలివి తక్కువవారనీ గట్టిగా నమ్మింది. దానికి తోడు బాల్య వివాహాలు. ఆడపిల్ల వ్యక్తురాలయేటప్పటికి భర్త మరణించి జీవితాంతం వితంతువుగా జీవించాల్సిన పరిస్థితులుండేవి. రాజమహేంద్రవరంలో పాఠశాల అంటేనే వేశ్యల చదువుకోసమనే అర్థం ఉండేదంటారు వీరేశలింగం గారు.

1840,1850 ప్రాంతాల్లో స్త్రీ విద్య కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా 1849లో ఆడపిల్లల కోసం కలకత్తాలో స్కూలు ప్రారంభమైనా విద్యార్థినుల కొరత ఉండేది. స్వాతంత్రోద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన నాయకులు, బ్రహ్మ సమాజీకులు కూడా స్త్రీ విద్య పట్ల అనేక పరిమితులను విధించారు. “లేడీ డాక్టర్స్” పుస్తకం మన దేశంలోని తొలి మహిళా వైద్యుల గురించే కాక విదేశాలలోని మహిళా వైద్యుల అనుభవాలనూ తెలియజేసింది.

ఇంగ్లండులో 19వ శతాబ్ది మధ్యలో ఉత్తమ సర్జన్ గా పేరు పొందిన డా. జేమ్స్ మిరండా బారీ మరణానంతరం మగ కాదు, ఆడ అన్న రహస్యం బయటపడింది. 1792లో ఐర్లండ్ లో పుట్టిన బారీకి వైద్య విద్య పట్ల ఆసక్తి. వైద్య కళాశాలల్లో మహిళలకు ప్రవేశం లేకపోవటంతో ఆమె పురుషునిగా నటించి విద్యను పూర్తిచేసి, అలాగే జీవించింది.

అమెరికాలో పుట్టి పెరిగిన ఎలిజబెత్ బ్లాక్ వెల్ వైద్య విద్యను చదవబోగా 29 కళాశాలలు తిరస్కరించాయి. జెనీవా మెడికల్ కాలేజీలో ప్రవేశం పొంది, చదువు ముగించినప్పటికీ ఉద్యోగం సంపాదించలేకపోయింది. 1948లో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె బ్రిటిష్ మెడికల్ రిజిస్టర్ లో 1959లో తొలి మహిళా వైద్యురాలిగా నమోదైంది. ఆమె చేసిన పోరాట ఫలితంగా 1868లో మహిళా వైద్య కళాశాల ఏర్పడింది. 1869లో ఎడింబరో విశ్వవిద్యాలయంలో మెడిసిన్ పూర్తిచేసిన మహిళలకు డిగ్రీలను ప్రదానం చెయ్యలేదు. పోరాటాల ఫలితంగానే 1889లో మహిళల వైద్యవిద్యకు చట్టం వచ్చింది.

బ్రిటీషు పాలన కింద భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఆధునిక విద్యాలయాల్ని, వైద్యశాలల్ని తెరిచారు. ప్రభుత్వం తన మనుగడను దృష్టిలో పెట్టుకుని హిందూ ఛాందసుల మనోభావాల్ని నొప్పించదలచుకోలేదు. ప్రభుత్వోద్యోగాలలో స్త్రీలకు స్థానం లేకపోవటంతో ఎలాటి నిధులనూ కేటాయించలేదు. డాక్టర్లైన స్త్రీలకు తక్కువ వేతనాలనిచ్చి, వారిని మగ డాక్టర్ల కంటే తక్కువ స్థాయి కలిగిన వారిగా పరిగణించారు.

మన దేశంలోని కొందరు తొలితరం మహిళా వైద్యుల జీవితాలను తెలుసుకుందాం. 

 డా. ఆనందీబాయి జోషి 1865లో కళ్యాణ్ లో పుట్టారు. బాల్యంలో తల్లి కఠినమైన పెంపకంలో ప్రేమ లభించలేదు. తొమ్మిదో ఏట రెండో పెళ్లివాడైన ఇరవై ఆరేళ్ల గోపాల్ జోషితో పెళ్లి జరిగింది. అతను సంస్కరణ భావాలతో భార్యను చదివించి, కీర్తిని పొందాలనుకున్నాడు. ఆనందీబాయి తండ్రికి స్త్రీ విద్య పట్ల వ్యతిరేకత ఉండటంతో తన భార్యను చదివించేందుకు అభ్యంతరం పెట్టరాదని పెళ్లికి ముందుగానే గోపాల్ షరతు పెట్టాడు. స్త్రీ చదువు చెడు ఫలితాలనిస్తుందంటూ అల్లుణ్ణి హెచ్చరిస్తూనే ఉన్నాడు ఆనందీబాయి తండ్రి.  

ఇంటి పనులతో చదువు కోసం సమయం వెచ్చించట్లేదని గోపాల్ భార్యను తీవ్రంగా కొట్టేవాడు. వదిలేస్తానని బెదిరించేవాడు. 13వ ఏట ఆనందీబాయికి బిడ్డ పుట్టి మరణించాడు. ఆమె బొంబాయిలో మిషనరీ స్కూల్ లో చేరింది. బైబిల్ చదవాలన్న నియమాన్ని చదువు పట్ల ఆసక్తితో ఒప్పుకుంది. బొంబాయి వంటి నగరంలో కూడా స్కూల్ కు వెళ్లేప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. 

బ్రిటన్ స్త్రీలు, ఆంగ్లో ఇండియన్ స్త్రీలు వైద్య విద్య చదువుతున్నారని తెలిసి ఆనందీబాయిని చదివించాలనే ప్రయత్నంలో మిషనరీలకు ఉత్తరాలు రాసాడు గోపాల్. కార్పెంటర్ అనే మహిళా మిషనరీతో ఆనందీబాయి ఉత్తరాలద్వారా స్నేహం సంపాదించుకుంది. ఉత్తరాలలో హిందూ సంప్రదాయాల పట్ల తన అభిప్రాయాలను విశ్లేషణాత్మకంగా రాస్తుండేది. కార్పెంటర్ ఆహ్వానంతో అమెరికాలో వైద్య విద్య కోసం వెళ్లింది. అందుకు దేశీయుల, విదేశీయుల ప్రతిఘటనను ఎదుర్కొంది. తన తిండీ, బట్టా, మతం, సంప్రదాయాలను మార్చుకోనని శపథం చేసింది. 1883లో కలకత్తా నుండి బయలుదేరి, 60 రోజుల ఓడ ప్రయాణంలో శాకాహారం అందుబాటులో లేక పస్తులతోనే ప్రయాణించింది. భారతదేశంలో సంవత్సరానికి 85 లక్షల కాన్పులు జరుగుతూ సుమారు లక్షాపాతిక మంది స్త్రీలు మరణిస్తున్నారని, లేడీ డాక్టర్ల అవసరం వారికుందని తన దరఖాస్తులో చెప్పి వైద్య కళాశాలలో ప్రవేశించింది. 1886లో పట్టా పుచ్చుకుంది. భార్య పై అనుమానంతో అకస్మాత్తుగా అమెరికా వెళ్లిన గోపాల్ ఆమె పట్ల అక్కడివారిలో ఉన్న గౌరవం కళ్లారా చూసాడు. ఆమె కృషితో సాధించుకున్న పేరు గోపాల్ కు అసూయ పుట్టించింది. ఉన్నత విద్య వల్ల స్త్రీ ఇల్లాలుగా, తల్లిగా విధులను నిర్వహించ లేకపోతోందని బహిరంగంగా విమర్శించాడు. 

భారతదేశం తిరిగివచ్చిన ఆనందీబాయి మహిళలకు వైద్య విద్య అందించాలని, మహిళా వైద్య కళాశాల స్థాపించాలని కలలుకంది. 1886లో కొల్హాపూర్ దివాన్ ఆమెకు నెలకు 300 రూపాయలతో ఉద్యోగం ఇచ్చాడు. ఆమె అనారోగ్యం పాలయింది.  ఆయుర్వేద వైద్యం ఫలించక ఆనందీబాయి 1887లో తన ఇరవై రెండో ఏట మరణించింది. ఎన్నో శ్రమలకోర్చి నేర్చిన చదువు భారతదేశ స్త్రీలకోసం ఉపయోగించ లేకపోయింది. ఆనందీబాయి గురించిన వివరాలు ఆమె తన భర్తకు రాసిన ఉత్తరాల ద్వారా తెలిసాయి. 

1862లో డా. కాదంబిని గంగూలీ బ్రహ్మ సామాజీకుడైన వ్రజకిశోర్ బసు ఇంట పుట్టింది. కాదంబిని తండ్రి, ఆయన మిత్రులు 1873లో హిందూ మహిళా విద్యాలయం స్థాపించారు. కాదంబిని గణితం, సైన్స్, ఇంగ్లీష్, చరిత్ర, సంగీతంలలో ప్రావీణ్యం సంపాదించింది.  కలకత్తా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షను మెరిట్ లో పాసైన కాదంబిని నెలకు 15 రూపాయల ఉపకారవేతనం పొందింది. తన 21వఏట అప్పటికే ముగ్గురు పిల్లలున్న విధురుడు ద్వారకానాథ్ అనే మిత్రుడు, తత్త్వవేత్తను పెళ్ళి చేసుకుంది. కాదంబిని కలకత్తా వైద్య కళాశాల పై పోరాటం జరిపి, 1883లో కళాశాలలో చేరింది. 1886లో అనాటమీలో ఫెయిలై వైద్య పట్టాను పొందలేకపోయింది. ఎంబి పట్టా కంటే తక్కువ డిగ్రీని, డాక్టర్ గా ప్రాక్టీస్ చేసేందుకు అనుమతిని మాత్రం పొందింది. 1888లో లేడీ డఫరిన్ మహిళా ఆసుపత్రిలో 300 రూపాయల వేతనంతో డాక్టర్ గా చేరింది. రోగులను ఆకట్టుకుని, వైద్యం ప్రాక్టీస్ చేసేందుకు ఆమె పత్రికల్లో తన సేవల గురించి ప్రకటనలను ఇచ్చింది. 

వైద్య సేవలతో పాటు తన సంతానాన్ని శ్రద్ధగా చూసుకుంటున్న కాదంబిని శక్తిసామర్థ్యాలు సంప్రదాయ వాదుల్లో వణుకు పుట్టించాయి. వంగవాసి అనే పత్రిక ఆమెను పతితగా చిత్రించింది. లేడీ డాక్టర్ అంటే బరితెగించిన ఆడదని మరొక పత్రిక రాసింది. ఉన్నత చదువులు చదివిన స్త్రీకి కూడా వేధింపులు తప్పలేదు. 

బ్రిటీష్ వైద్యుల కంటే తనను తక్కువగా చూస్తున్నారన్నది గమనించి ఎడింబరో వెళ్లి కొద్ది నెలలలోనే మూడు డిప్లొమాలను పొందింది. విదేశీ విద్యార్హతతో ఆమెను డఫరిన్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా నియమించారు. ఇంతటి ప్రతిభాశాలి కూడా అనేకమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చింది.

సంపన్న కుటుంబీకులొకరు తమ ఇంట కాదంబిని సేవలు అందుకుని ఆమెకు తమ సేవకుల పంక్తిన భోజనం వడ్డించారన్నది ఆమెను, ఆమె కుటుంబీకులను బాధకు గురిచేసింది. భారతదేశంలో ప్రాక్టీస్ చేసిన మొదటి భారతీయ మహిళగా ఆమె చేసిన సేవ అపారం. మరణించేవరకు వైద్య సేవలో మునిగిన ఆమె ఎందరో బెంగాలీ స్త్రీలు వైద్య విద్యలో ప్రవేశించేందుకు మార్గదర్శి అయింది.

1864లో బొంబాయిలో పుట్టిన డా. రుక్మాబాయి రౌత్ అణచివేతకు గురైన కులానికి చెందిన స్త్రీ. వితంతువైన ఆమె తల్లి డా. సఖరాం అనే విధురుడిని వివాహం చేసుకుంది. ఆయన వైద్య కళాశాలలో పాఠాలు బోధించేవాడు. ఉదారభావాలున్నవాడైనప్పటికీ రుక్మాబాయి బాల్య వివాహాన్ని ఆపలేకపోయాడు. పదకొండో ఏట రుక్మాబాయికి సఖరాం బంధువైన దాదాజీతో వివాహం జరిగింది. బాల్యవివాహం జరిగినప్పటికీ పెద్దయ్యాక ఆ వివాహాన్ని ఆమోదించటమో, తిరస్కరించటమో అనే స్వతంత్రం ఆడపిల్లకి ఉండాలని సఖరాం నమ్మాడు. 

ఇంగ్లీషు నేర్చుకుని రుక్మా యూరోపియన్ మహిళా స్నేహితులతో కలిసి ఎన్నో విషయాలను అవగాహన చేసుకుంది. హిందూ స్త్రీల పరిస్థితులను మార్చాలన్న సంకల్పం ఆమెకు కలిగింది. దాదాజీ చదువబ్బక చెడు వ్యసనాల పాలయ్యాడు. భార్యను తనతో కాపురానికి పంపవలసిందని కోర్టును ఆశ్రయించగా రుక్మాబాయి భర్తతో తెగతెంపుల్ని కోరుకుంది. కరుడుగట్టిన పురుషాహంకారాన్ని, హిందూ కట్టుబాట్లను ధిక్కరించి, సంస్కరణలు కోరిన ధీర రుక్మాబాయి.   

బాల్య వివాహాల వల్ల ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా అనేక కష్టనష్టాలకు బలవుతున్నారని “టైమ్స్ ఆఫ్ ఇండియా” పత్రికకు ఉత్తరాలు రాసింది. పెళ్లైన ఆడపిల్ల చదువును నిర్ణయించేది అత్తింటివారైతే ఆమెకు చదువుకునే అవకాశమే ఉండదని, అందువల్లే తన జీవితంలోనూ సంతోషం నాశనమయిందని రాసింది. ఆడపిల్ల పెళ్లి వయసు 15సంవత్సరాలుగా ఉండాలని కోరింది. ఆమె హిందూ సంప్రదాయాలను వేలెత్తి చూపి, పోరాటం చెయ్యటం సంప్రదాయవాదులకు కొరుకుడు పడలేదు. 

రుక్మాబాయి కష్టాలతో నిండిన జ్ఞాపకాలను చెరిపేసేందుకు శ్రేయోభిలాషుల ఉత్తరాలను ఎప్పటికప్పుడు కాల్చేసేది. గొప్ప జాతీయ నాయకుడైన తిలక్ సార్వత్రిక విద్యను ఇష్టపడినా ఉన్నత విద్య, ముఖ్యంగా శాస్త్ర విజ్ఞానం అగ్రకుల పురుషులకే పరిమితం కావాలని నమ్మాడు. ఆడపిల్లను చదివిస్తే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, సంప్రదాయ విలువలు నాశనమవుతాయని రుక్మాబాయికి ఎదురు పోరాటం చేసాడు. ఈ వాస్తవం మనకు చరిత్ర పుస్తకాలు చెప్పలేదు.

1885లో రుక్మాబాయి విడాకుల కేసు పిన్ హే అనే బ్రిటిష్ జడ్జి దగ్గరకు వచ్చింది. ఒక యువతిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా భర్త దగ్గరకైనా వెళ్లమని బలవంతం చేయటం అనాగరికమని, కిరాతకమని ఆయన తీర్పు చెప్పారు. తిలక్ వంటి వారు దీనిని వ్యతిరేకించారు. తీర్పు అమలు కాలేదు. రుక్మాబాయి భర్తతో కలిసి ఉండని పక్షంలో ఆరునెలలు జైలు శిక్ష అనుభవించాలన్నారు. ఆమె పోరాటం కొనసాగించింది. వలసవాదులు వలసవాదాన్ని బలపరుచుకుందుకు ఆమెను పావుగా వాడుకున్నారు. సంప్రదాయవాదులు ఆమెపై దుష్ప్రచారం సాగించారు. 

హిందూ పురుషులకు అన్ని స్వేచ్ఛలూ ఉండి, స్త్రీలకు స్వేచ్ఛే ఉండకూడదన్నది అమానుషమని 1887లో క్వీన్ విక్టోరియాకు ఆమె లేఖ రాసింది. ఈ పోరాటంలో అలిసిపోయిన రుక్మా1888లో దాదాజీతో ఒప్పందానికొచ్చి అతనికి రెండువేల రూపాయలు చెల్లించి అతను తనను ఎలాటి ఒత్తిడి చెయ్యకూడదని చెప్పింది. 

పెళ్లికి న్యాయసమ్మతమైన వయసు చట్టం కోసం పోరాటం కొనసాగిస్తున్న తరుణంలో పదేళ్ల బాలిక ముఫ్ఫై అయిదేళ్ల భర్త చేతిలో మానభంగానికి గురై మరణించిన ఘటన 1889 లో జరిగింది. తిలక్ ఆ భర్తను సమర్థించాడు. ఆడపిల్లకు లైంగిక సంపర్కానికి వయసును పది నుంచి పదహారేళ్లకు పెంచాలన్న ప్రజల ఆందోళన ఫలితంగా అది పన్నెండేళ్లకు మాత్రం పెంచబడింది. 

1889 లో రుక్మాబాయి లండన్ వెళ్లి మహిళా వైద్య విద్యాలయంలో చేరింది. 1895లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ అర్హతను పొందింది. 

భారతదేశం వచ్చి బొంబాయి మేడం కామా హాస్పిటల్ లో పని మొదలు పెట్టింది. మహిళావైద్యుల కోసం ఏర్పడిన “డఫరిన్ నిధి” సూరత్ లోని ఒక ఆసుపత్రి నిర్వహణను రుక్మాబాయికి అప్పగించింది. ప్రస్తుతం దానిని రుక్మాబాయి ఆసుపత్రిగా పిలుస్తున్నారు. రుక్మాబాయి జీవితాంతం స్త్రీవాదిగా నిలబడింది. బాల్యవివాహాలు, పరదా సంప్రదాయం వంటి వాటిపై పోరాడింది. సంప్రదాయాలపై ధిక్కారాన్ని గొప్ప వారసత్వంగా ఇచ్చి ఒక రోల్ మోడల్ గా నిలిచిన రుక్మా అనేక అవమానాలు, కష్టాలు భరించి సాహసంతో జీవించింది. “రుక్మా” అంటే “బంగారం” అని అర్థం. 

డా. హైమవతీ సేన్ ఆత్మకథ “నేనొక మహిళను కాబట్టి” ద్వారా హైమవతి జీవితం తెలుస్తోంది. 1920 నుండి 1933 వరకూ రాసిన ఈ ఆత్మకథ దశాబ్దాల తరబడి ట్రంక్ పెట్టెలో ఉండిపోయింది. అందులోని విలువైన సమాచారం ప్రపంచానికి తెలియవలసి ఉందని గుర్తించిన డా. తపన్ రాయ్ చౌదరి హైమవతి బంధువులను ఒప్పించి, తాను అనువదించారు. 

హైమవతికి 9వ ఏట 45ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిగి, 12వ ఏట వైధవ్యం ఏర్పడింది. ఆమె హిందూమతంలోని స్త్రీ, పురుషుల పట్ల ఉన్న ద్వంద్వ ప్రమాణాలపై తీవ్రంగా పోరాడింది. 1866లో బెంగాల్ లో సంపన్న కుటుంబంలో పుట్టింది. ఆమె పుట్టినప్పుడు “అబ్బాయి పుట్టలేదు” అని అందరూ బాధపడినా ఆమె తండ్రి మాత్రం ఆనందంతో తన కూతుర్ని కొడుకుగానే చెప్పుకున్నాడు. 

1872లో బెంగాల్ లో కరువు వచ్చినప్పుడు పేదల పట్ల దయతో తన ఇంట్లోని ఆహారాన్ని పంచిపెట్టేది హైమవతి. గ్రామంలో ప్రబలిన అంటువ్యాధుల నిర్మూలనకు తండ్రి అనుభవజ్ఞులైన డాక్టర్లను గ్రామానికి తీసుకురావటం చిన్నారి హైమపై ప్రభావం చూపింది. హైమ ప్రతిభను గమనించిన పాఠశాల విద్యాశాఖాధికారి హైమ తండ్రితో ఆమెను చదివించాలన్న ఒప్పందానికి వచ్చాడు. ఆమె చదువు ఇంట్లోని స్త్రీలందరికి అభ్యంతరకరమైంది. తొమ్మిదేళ్ల వయసులో 45 ఏళ్ల ఒక విధురుడితో పెళ్ళి జరిగింది. హైమవతి బాల వధువులపై జరిగిన బలవంతపు లైంగిక చర్యల గురించిన వాస్తవాలను తన ఆత్మకథలో చెప్పింది.

ఆ దురదృష్టకరమైన వివాహ సంబంధం హైమ భర్త మరణంతో ముగిసింది. ఆమెకు పుట్టింటి నుంచి కూడా కనీస సానుభూతి దొరకలేదు. వ్యథను మరిచేందుకు పుస్తకాలను ఆశ్రయించింది. ఆమె తండ్రి కూతురి పక్షాన నిలబడ్డాడు. కానీ ఒక సంవత్సరం లోపు హైమ తల్లిదండ్రులు, అత్తగారు మరణించారు. ఆమె సోదరుడు, చిన్నాన్న తండ్రి ఆస్తిని ఆమెకు దక్కనివ్వలేదు. ఒంటరిగా కాశీ వెళ్లిన హైమ దూరపు బంధువులను ఆశ్రయించిం భంగపడింది. కాశీలో జరిగే మోసాలు, వితంతువుల దుస్థితి ఆమె అర్థం చేసుకుంది. ఒక పూజారి భార్యను ఆశ్రయించి కష్టపడి సంపాదించుకుంటూ జీవించింది. “కాశీలోని సత్రాలలో మగవారికి భోజనం పెడతారు, కానీ ఒంటరి స్త్రీలు, వితంతువులు వెళ్తే పెట్టరని” కాశీయాత్ర చేసిన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు రాసారు. 

ఒక బాలికల పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం సంపాదించుకుంది. కాశీలో స్థానిక గూండాలనుంచి తప్పించుకుంటూ కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది. 

తూర్పు బెంగాల్ చేరి వంటపనులు చేయటం మొదలుపెట్టింది. బ్రహ్మ సామాజికులు స్త్రీ విద్యను, వితంతు వివాహాన్ని సమర్థించేవారు. జీవితానికి ఒక రక్షణ ఉంటుందని బ్రహ్మసమాజ ప్రచారకుడైన కుంజబెహారీని హైమవతి తన ఇరవైమూడో ఏట వివాహం చేసుకుంది. హైమవతి మొదటి బిడ్డ విగతజీవిగా పుట్టింది. డా. సుందరీ మోహన్ దాస్, ఆయన భార్య హైమవతికి సహాయంగా నిలబడ్డారు. భర్త ఆధ్యాత్మిక అన్వేషణ పేరుతో ఇంటిని వదిలి తిరుగుతూండేవాడు. 

ఆసుపత్రి సహాయకురాలిగా ఉద్యోగం సంపాదించేందుకు హైమవతి కాంబెల్ వైద్య విద్యాలయంలో చేరింది. పరిమితమైన శిక్షణలో కూడా హైమవతి అన్ని అంశాలూ నేర్చుకుంది. ఆమెకు అందే స్కాలర్షిప్ ను భర్త లాక్కునేవాడు.

మొదటిశ్రేణిలో ఉత్తీర్ణురాలైనప్పటికీ స్వర్ణపతకం ఆమెకు ఇవ్వరాదని అబ్బాయిలు సమ్మె ప్రారంభించారు. గవర్నర్ హైమవతిని పిలిపించి స్వర్ణపతకం అబ్బాయిలలో అర్హత ఉన్నవారికి వదిలి, దాని బదులుగా ఏదైనా కోరుకోమన్నారు. తన చదువు కొనసాగేందుకు అనుమతినివ్వమందామె. స్కాలర్ షిప్ 30 రూపాయలకు పెంచారు. 

హైమవతి చివరిపరీక్షలో ప్రథమ శ్రేణిలో పాసైంది. అయినప్పటికీ యూరోపియన్ డాక్టర్ల కంటే అతి తక్కువ వేతనం ఇవ్వటం ఆమెను కృంగదీసింది. మగవారితో సమాన వేతనాలకోసం పోరాడిన అసాధారణ వ్యక్తిత్వం హైమవతిది.

స్వతంత్ర మనస్తత్వంతో ఉండే హైమవతి ఉద్యోగ జీవితంలో ఎదురైన కష్టాలను, పురుషులు జరిపే లైంగిక హింసను ఆత్మకథలో రాసింది. పేదలకు వైద్యం అందించేది. ఆసుపత్రిలోనూ, ఇళ్ల దగ్గర వైద్యం చేసి నెలకు 300 నుంచి 400 సంపాదించినా భర్త చేతిలోకే వెళ్లేది.

భర్త చేతిలో మానవభంగానికి గురై మరణించిన ఒక బాలిక కేసులో సివిల్ సర్జన్ అవినీతికి పాల్పడి హైమవతికి కూడా తన అక్రమార్జనలో భాగం ఇచ్చాడు. హైమవతి తీసుకోక తప్పని పరిస్థితిలో ఆ సొమ్మును పొరుగువారి కోసం ఖర్చు చేసింది. బాధ్యతలేని భర్తతో దెబ్బలు తింది. పిల్లల బాధ్యతారాహిత్యంతో మరింత కష్టపడింది. 40 ఏళ్లు డాక్టర్ గా పనిచేసింది. భర్త మరణించాక ఎంతో మంది అనాథలను చేరదీసి ధార్మిక కార్యక్రమాల్లో మునిగిపోయింది. 

ఎన్నో సమస్యల మధ్య చదువుకుని జీవిత చరమాంకం వరకూ కుటుంబ బాధ్యతలను ఓర్పుగా నిర్వహించింది. స్త్రీలు కుటుంబం వరకే కాక ప్రజాసంక్షేమం కోసం పనిచెయ్యాలని చెప్పిన హైమవతి తాను అలాటి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపింది. 

డా. ముత్తులక్ష్మీరెడ్డి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో మొదటి సర్జన్. పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ. బ్రిటిష్ ఇండియాలో మొదటి శాసన సభ్యురాలు. ఎన్నో ప్రత్యేకతలున్న ఈమె ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆసుపత్రి పేరుతో చెన్నైలో మొదటి పిల్లల ఆసుపత్రిని ప్రారంభించింది.

1886లో తమిళనాడులో అభ్యుదయవాది అయిన ఒక కళాశాల ప్రధానోపాధ్యాయుని కూతురిగా జన్మించింది. తల్లి దేవదాసి. తండ్రి బ్రాహ్మణ కులస్థుడు. సంప్రదాయ భారత స్త్రీగా జీవించకూడదని తలచిన ముత్తులక్ష్మిలో తెలివితేటలు, ఉన్నత లక్ష్యము ఉన్నాయి. మెరుగైన ఉపాధ్యాయులుంటారని పోరాడి బాలుర పాఠశాలలో చేరింది. 1902 లో మెట్రిక్యులేషన్ పాసైంది. స్త్రీ, పైగా దేవదాసి కులంలో పుట్టిన ఆమెకు కళాశాలలో ప్రవేశం పట్ల అనేక వ్యతిరేకతలు ఎదురయ్యాయి. కానీ సంస్కార భావాలు కలిగిన పుదుకొట్టాయ్ రాజు సహాయంతో కళాశాలలో చేరింది. ఇంటర్మీడియట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించింది. తన చదువు, అభివృద్ధిలో తండ్రి పాత్రను గురించి ఆత్మకథలో రాసింది.

1907లో మద్రాసు వైద్య కళాశాలలో చేరి, అనేక విమర్శలను, ప్రతికూలాంశాలను ఎదుర్కొంది. సర్జరీలో నూటికి నూరు మార్కులు సంపాదించింది. 1912లో మొదటి హిందూ మహిళగా మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి పట్టా పొందింది.

కేన్సర్ వ్యాధి అధ్యయనానికి కొడుకును అమెరికా పంపి, ప్రథమ కేన్సర్ ఆసుపత్రిని ఇండియాలో స్థాపించింది. నిరాశ్రయులైన బాలికల కోసం అన్ని కులమతాలవారి కోసం “అవ్వై హోం అండ్ ఆర్ఫనేజ్” ను స్థాపించింది. అది నేడు 900 మందికి ఆశ్రయాన్నిస్తోంది. 1930లో శాసనసభలో సభ్యురాలై మహిళల ఓటు హక్కుకోసం పోరాడింది. బాలికల వివాహార్హత 16 సంవత్సరాలుండాలని, దేవదాసీ వ్యవస్థను నిర్మూలించాలని బిల్లులను ప్రవేశపెట్టింది. వ్యక్తిగత జీవితం గురించి, శాసనసభ్యురాలిగా తన జీవితాన్ని గురించి రెండు ఆత్మకథలను రాసింది. 1956లో పద్మభూషణ్ పురస్కారం అందుకుంది.

ఈ లేడీడాక్టర్లందరూ వైద్యం చదివేందుకు అనేక నిరసనలు భరించారు. తమ హక్కుల కోసం పోరాడి గెలిచారు. తోటి మగ విద్యార్థుల, తోటి డాక్టర్ల వేధింపులను ప్రతిఘటించారు. తండ్రులో, భర్తలో ప్రోత్సహించగా తమ ఆదర్శాలను ఆచరణలోకి తెచ్చుకుని తర్వాతి తరాల లేడీ డాక్టర్లకు సులువైన దారులను ఏర్పరచారు. వీళ్ల త్యాగాలు వెలకట్టలేనివి.

తొలితరం తెలుగు లేడీ డాక్టర్లలో డా. పద్మశ్రీ హిల్డా మేరీ లాజరస్ 1890లో విశాఖపట్టణంలో జన్మించింది. 1916లో మద్రాసు విశ్వవిద్యాలయంలో డాక్టర్ చదువును, 1917లో లండన్ లో పై చదువును పూర్తి చేసింది.

ఆమె రెండవ ప్రపంచయుద్ధ సమయంలో భారతీయ వైద్యసేవా విభాగంలో వనితా విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యత తీసుకుని తొలి భారతీయ వైద్యులు అని పేరు పొందింది. అనేక గౌరవ హోదాలలో పనిచేసి విశాఖలో స్థిరనివాసం ఏర్పరచుకుంది. శేష జీవితమంతా రోగుల కోసం పనిచేసింది. విశాఖ విక్టోరియా ఆసుపత్రిలో ఆమె గౌరవార్థం “లాజరస్ వార్డు” ను ఏర్పాటుచేసారు. మేరీ లాజరస్ 1942లో కైజర్ – ఇ – హింద్ స్వర్ణ పతకం, 1961లో పద్మశ్రీ అవార్డులను అందుకుంది.

డా. కొమర్రాజు అచ్చమాంబ 1906లో జన్మించింది. దేశం బాగు పడాలంటే ప్రజలకు విద్య, విజ్ఞానం ఉండాలని నమ్మిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు ఆమె తండ్రి. చురుకైన అచ్చమాంబ చదువు పట్ల ఆయన శ్రద్ధ వహించారు. 

వైద్యవిద్య చదివి, యువజనోద్యమాలలో చురుగ్గా పాల్గొందామె. శ్రామికవాడల్లో పెట్టిన ఉచిత వైద్యాలయాల్లో సేవ చేసింది. వైద్యవిద్య కోసం బ్రిటన్ వెళ్లి, స్త్రీ, శిశు వ్యాధినివారణ విషయంలో ప్రత్యేక కృషి చేసి మంచిపేరు సంపాదించింది. ఊపిరి పీల్చుకునే వ్యవధిలేని వృత్తి జీవితం గడుపుతూ, ఆదాయాన్నంతా పేదల కోసం ఖర్చుచేసింది. బ్రతుకుతెరువు వెతుక్కునేవారికి, నర్సులకు వైద్యంలో శిక్షణ ఇస్తూ, హైస్కూలు విద్యార్థులకు కూడా ప్రాథమిక చికిత్సలో శిక్షణ అందించింది. సామాన్య ప్రజానీకం కోసం “ప్రసూతి – శిశుపోషణ” అనే పుస్తకం రాయగా, దీనికి విశేష ఆదరణ లభించింది. 

ఆమె కొంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు. లోక్ సభకు ఎన్నికైంది. వయోజన విద్యకోసం కృషి చేసింది అచ్చమాంబ. నూలు వడికి ఖద్దరు ధరించింది. స్త్రీలు బాగా చదువుకోవాలని, మూఢాచారాలు వదిలి దేశానికి, జాతికి మేలు చెయ్యాలని అచ్చమాంబ గాఢంగా నమ్మింది.     

 స్త్రీలుగా ఎలాటి అస్తిత్వమూ లేని తరంలో తమ హక్కుల కోసం, అభ్యున్నతి కోసం తద్వారా సమాజ శ్రేయస్సు కోసం అరుదైన, అద్భుతమైన పోరాటాలు చేసిన స్త్రీ మూర్తుల గురించి తెలియజేసింది “లేడీడాక్టర్స్” పుస్తకం. చదువరిని ఆ కాలంలోకి తీసుకెళ్లి, ఆ స్త్రీల పోరాటాలతో ఒక చైత్యన్యాన్ని కలిగిస్తుంది. ఈ పుస్తకం జూన్, 2022 లో ప్రచురించబడింది. ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిన ఇంతటి విలువైన పుస్తకం వెల అమూల్యం.

You Might Also Like

2 Comments

  1. C.Ramamurthy

    Plgive the address where lady doctors telugu book avilable

    1. నాదెళ్ల అనూరాధ

      డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ, రామచంద్రాపురం – 533 255,
      తూర్పు గోదావరి జిల్లా.

Leave a Reply