సుమతీ శతకము

వ్యాసకర్త: ఆదూరి హైమవతి

******** 

సుమతి అంటే మంచి బుద్ధి కలవారు అని  అర్థం, అని అందరికీ తెలిసిందే!. అని అందరికీ తెలిసిందే! అసలు బుధ్ధి అంటే మతి . ఇది సరిగా ఉంటే అంతా బాగుంటుంది, వారికే కాక చుట్టూ ఉన్నవారికి సైతం అంతా బాగుంటుంది.అందుకే బద్దెన కవి సమాజాన్నంతా , లోకాన్నంతా, బాగుచేసి అంతా సుఖశాంతులతో ఉండాలనే సత్  సంకల్పంతో  ఎంతో మంచి  భావనతో చేసిన ఈ సుమతీశతకం  మానవాళికి మంచి మిత్రుడని భావించాలి. 

తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. చాలా శత  కాలు మనకు తెలుగులో ఉన్నాయి, ఎంతోమంది కవులు మానవాళి మంచి కోసం ఎన్నోశతకాలు రచించారు. ఐతే ఎంతోమంది ఇష్టపడే శతకాలలో సుమతీ శతకం ఒకటి. దీనిని బద్దెన   కవి రచించాడు.  సులువైన, చిన్న చిన్న పదాలతో అల్లిన పద్యాలలో ఎంతో గొప్ప నీతులు చెప్పారు కవి. తెలుగు వారి జీవితంలోనూ, భాషలోనూ సుమతీ శతకనీతులు భాగాలై పోయాయి. చిన్న పిల్లలకు పూర్వం ప్రాథమిక తరగతుల్లోనే ఈ సుమతీ శతకాన్ని నేర్పేవారు.

 పసివయస్సులో మంచి మాటలు మనస్సుకు హత్తు కుంటే  ఆ తర్వాత వాటిని జీవితంలో పాటించి  మంచి వారుగామసలే అవకాశం ఉంటుంద ని పూర్వం విద్యా శాఖవారు అలా  రూపొందించారు.        

సుమతీ శతకంలోని కొన్ని పద్యాలు ఆనాటి సామాజిక పరిస్థితిని గురించీ చెప్పబడ్డాయి. కొన్ని పద్యాలు ఏనాటికీ మానవులు ఆచరించాల్సిన నీతు లు   బోధిస్తున్నాయి. సుమతీ శతకం 108 నీతి పద్యాల సుమమాల. ఒక మారు కవిహృదయంలో ప్రవేసించను ప్రయత్నిస్తూ  ఆయన చెప్పిన నీతిపద్యాలను చూద్దాం. సరే మనం శతక కారుని మనస్సు  లోకి ప్రవేశించి కొన్ని పద్యాలను చూద్దాం.

బద్దెనకవి తన ఇష్టదైవం కావచ్చు భగవంతుని నామాన్ని ఉటంకిస్తూ వ్రాయటం మొదలుపెట్టారు. 

శ్రీ రాముని దయ చేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా

ధారాళమైన నీతులు

నోరూఁరఁగ జవులు పుట్ట నుడివెద సుమతీ!

నారాముడైన భగవంతుని దయతో అందరినోటా పలికి ప్రసిద్ధి చెందేలాగున నీతులను వ్రాయను మొదలుపెడుతున్నాను.- అంటూ శతకం మొదలుపెట్టారు.  

అక్కఱకు రాని చుట్టము

మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా

నెక్కినఁ బాఱని గుఱ్ఱము

గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !

 సాధారణంగా పూర్వం నుండే చుట్టాలు అంటే బంధుజనం అవసరానికి సహకరిస్తారనే విశ్వాసం ఉండేది. ఆపదలో భగవంతుని ప్రార్థిస్తే మొర ఆలకించి ఇబ్బంది తీరుస్తాడని ప్రార్థించడం జరుగుతుంటుంది. పూర్వం ఈ శతక రచన కాలానికీ, అంతకు పూర్వమూ గుఱ్ఱాలపై యుద్ధం చేసేవారు. ఆ యుద్ధసమయాన తానెక్కి ఉన్న గుఱ్ఱం తాను చెప్పినట్లు నడుస్తూ సహకరించనిచో పైమూడింటినీ వదిలేయాలని కవిచెప్తున్నాడు.అంటే మనకు ఆపదలో సహకరించనివారు ఉన్నా లేకున్నా ఒకటే అని ఆయన చెప్తున్నారు.

అడిగిన జీతం బియ్యని

మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌

వడి గల యెద్దులఁ గట్టుక

మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!

ఎవరైనా కొలువు అంటే ఉద్యోగం చేసేది జీతంకోసమే. అదే కదా జీవ నోపాధి, మరి అవసరమైనపుడు జీతం సొమ్ము ఇవ్వలేని వాని వద్ద పని చేయడం వృధాకదా! దానికంటే పొలందున్నుకుని బ్రతుక వచ్చంటాడు కవి.ఆ రోజుల్లో అందరికీ కాస్తోకూస్తో పొలం ఉండేది దానిని దున్ను కుని ఏదో ఒక పంట వేసుకుని జీవించేవారు. ఈ ఆధునిక కాలంలో   పంట పొలాలన్నీ నీరులేక బీడు  భూములైపోయాయి, కొన్ని అపార్ట్ మెట్స్ గా వెలిశాయి. మరికొన్ని ప్రమాదకరమైన కర్మాగారాలుగా కూడా రూపొందాయి.  

అధరము గదలియుఁ గదలక

మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ

నధికార రోగపూరిత

బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ —

మాట్లాడితేనే నోటి ముత్యాలు రాలిపోతాయన్నట్లుగా ఏమి అడిగినా  మౌనంగా ఉండే అధికారమనే రోగంతో .చెవిటీ, అంధత్వమూ ఉండే శవం వంటి వానివద్ద  పనిచేయడం పాపం అంటూ అధికార మదంతో ఉండే అధికారుల గురించీ వ్యాఖ్యానించాడు కవి.

అప్పిచ్చు వాఁడు వైద్యుఁడు

నెప్పుడు నెడతెగక పాఱు యేఱును ద్విజుఁడున్‌

జొప్పడిన యూర నుండుము

చొప్పడ కున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!

ఈ రోజుల్లో ఈ పద్యం చదవడం గురించీ చాలా తమాషా హ్యాస్యాలున్నాయి. మొదటి వాక్యంలో అప్పిచ్చువాడు, అనే పదం పక్కన , కామా పెట్టకపోతే అప్పిచ్చే వాడే వైద్యుడనీ, అప్పిచ్చే వైద్యుడని  చదివే వారు చాలామంది ఉన్నారు. ఈ కాలంలో తెలుగు , తెలుగు పదాల అర్థాలు తెలిసినవారే తక్కువైపోడం చాలాబాధాకరం. తెలికపోడం కన్నా , అర్థం మారేలాగా తప్పుగా చదవడం చాలా తప్పు. 

అవసరానికి అప్పుపుట్టని తావులోనూ,వైద్యుడు లేని గ్రామం లోనూ, నీరు అనునిత్య లభ్యంకాని చోట, మంచీ చెడూ, శుభం ,అశుభం చెప్పే పురో హితుడు [ పురహితాన్ని కోరేవాడు ] లేని  గ్రామంలో ఉండకూడదు’. అని చెప్తున్నాడు శతక కర్త.  అవసరానికి ఆదుకునే వారే మన ఆప్తులు కదా! అలాంటి వారు లేనిచోట ఉండట ,అత్యవసరకాలంలో మనకు సాయం చేసేవారు లేనిచోట నివసించడం  తగదు.       

  అల్లుని మంచితనంబును

గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమున్‌

బొల్లున దంచిన బియ్యముఁ

దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!-

 ఆనాటి సమాజంలో అల్లునికి అంత గొప్ప ఫేం లేదు. ఈరోజుల్లో అల్లుడు అంటే ఒక కొడుకులాగా కుటుంబంలో ఇమిడిపోయి అత్తమామలకు చేదోడు వాదోడుగా ఉంటు న్నాడు.ఆనాటి సమాజంలో అల్లుడు ఎన్ని సంవత్సరాల నాడు పెళ్ళైనా కొత్త అల్లుడిగానే గౌరవించాల్సి రావడం వలన ఆ ఇబ్బందిని శతకకారుడు ఇలా చెప్పి ఉండవచ్చు. అందుకే శతకాలు ఆనాటి సమాజపు తీరుతెన్నులను తెలియ జేస్తాయని చెప్పు కున్నాం.ఆకాలంలో వృత్తి ధర్మాలను పాటించడం వలన ‘విద్య కొందరి వరకే’ అనే నియమం ఉండి ఉండవచ్చు.అందుకే కవి ఆనియమాన్ని ఇక్కడ ఉటంకించాడని మనం భావించాలి.ఇక మహిళలు అనేకానేక ఇబ్బందులు తప్పించుకోను, ఇంటి పరిస్థితుల రీత్యాకావచ్చు, ఉమ్మడి కుటుంబాలలోని అవస్తలవలన కావచ్చు మాట మార్చి చెప్పవలసి వచ్చి  ఉండవచ్చు. దానిని కవి ఇలాచెప్పి ఉండవచ్చు. 

 పొల్లు గింజలను అంటే బొత్తిగా గింజల పట్టని లేత వడ్లను దంచితే ఏమాత్రం  సరైన బియ్యం రావు. బాగా గింజపట్టి  ముదిరాక మాత్రమే పంటకోసి ఎండబెట్టి రాల్చితే మంచి ఒడ్లు రాలుతాయి, వాటిని దంచితే మంచి బియ్యం వస్తుంది. లేకపోతే శ్రమ అంతా వృధా  అంటాడు కవి.   

ఆఁకొన్న కూడె యమృతము

తాఁకొంకక నిచ్చు వాఁడె దాత ధరిత్రి న్‌

సోఁకోర్చు వాఁడె మనుజుఁడు

తేఁకువ కల వాఁడె వంశతిలకుఁడు సుమతీ!

ఆకలైనపుడు ఏమితిన్నా చాలా రుచిగా ఉంటుంది.అంటే బాగా ఆకల య్యాకే భోజనం చేయాలి, లేకపోతే అది కడుపు లోకి పోయాక అరగక నిలవ ఉండి ఎన్నో రోగా లకు కారణమవుతుందని మనం గ్రహించాలి. దానం చేసేప్పుడు అవసరం గ్రహించి మనసారా అవసరానికి తగినట్లు దానం చేసేవాడే ఉత్తముడు.కష్టములు కలిగిన పుడు దిగాలు పడక ధైర్యంగా ఎదుర్కొని నిలిచేవాడే శ్రేష్టు డైన వ్యక్తి. అంటాడు కవి. అంటే ఆకలైతేనే తినాలి, దానం చేసేప్పుడు ఆ అవసరానికి తగినట్లు చేయాలి. పెళ్ళి చేయాలని ఒకపేదసహాయానికి వెళితే ఒక రూపాయి ఇవ్వడం దానం కాదు, కనీసం భోజనాలకో, పెళ్ళికూతురికీ పెళ్ళికొడు క్కూ బట్టలో అలా ఏదో తగినంత సాయం చేయడం అనేది నేర్చుకోవాలి. కష్టాలు వచ్చినపుడు భయ పడక ఎదురునిల్చి పోరాడాలి. అదే మంచి వ్యక్తిత్వం.

ఇమ్ముగఁ జదువని నోరును

‘నమ్మా’ యని పిలిచి యన్న మడుగని నోరు న్‌

దమ్ములఁ బిలువని నోరును

గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

ఇంపుగా పఠింపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమానం సుమా!

ఈ పద్యంలో కవి ఒకమానవుడు ఎలా విలువలు కలిగి ఉండాలో వివరిం చాడు.చదివేప్పుడు మనసుపెట్టి చక్కగా మనసుకు పట్టేట్లు చదవాలి. ఏదో నేఉ గితాపారాయణా చేశాను పది మాల్రు అంటే ఏమిలాభం. గీతా పారాయణ లో కనీసం ఒక్క శ్లోకాన్నోశ్లొకార్థాన్నో అచరిచ్మడం ముఖ్యం. కనుక చదిఏది మనసుకు పట్టిందుకుని చదవాలి. కనంతల్లిని ప్రేంగా, గౌరవంగా ‘ అమ్మా ‘ నైపిలుస్తూ ఆమెను సంతోష పెట్టాలి.ఆమె అశీర్వా దం పొందుతూనే ఉండాలి. తల్లి ‘అమ్మా ఆకలవుతున్నది అన్నం     పెడతావా!’  అనిఅడిగితే ఎంత సంతోషిస్తుందో ఒక తల్లికే బాగా తెలు స్తుంది. ఇక కుటుంబంలోని వ్యక్తులతో ఎలా కలసి మెలసిఉండాలో ‘ తమ్ముల బిలువని నోరును ‘ అని ఉంటంకిస్తూ కుటుంబ సంబంధాలను, తమ్ముల బిలువని నోటిని కుమ్మరి మట్టికోసం త్రవ్విన గుంటతోపోల్చాడు   కవి. అంటే సొదరులతో కలివిడిగా ఉండాలనీ, అలాఉంటే నే తల్లికూడా సంతోషిస్తుందని  అంతరార్థం . 

ఉత్తమ గుణములు నీచున

కెత్తెఱఁగున గలుగ నేర్చు నెయ్యెడలం దా

నెత్తిచ్చి కఱఁగి పోసిన

నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!

మంచి గుణములు కలవాడే మహిలో గుర్తింపబడతాడు.నీచుడు అంటే అధముడు లేక తుంటరి రివాడు మంచి గుణాలను కలిగి సభ్యసమాజం లో గుర్తింపు పొందను ఇష్టపడక , చేతకాక మంచిగుణములను ఆచరించ లేడు.ఇత్తడిని ఎన్నిమార్లు  కరగించినా బంగారంగామారడు ,  అలాగే మంచిగుణములు నేర్చుకోవాలనే ఆశక్తి లేనివాడు ఎన్నిమార్లు తెలియ పరచినా ఇత్తడి లాగే   మిగిలిపోతాడు.  

ఉదకము ద్రావెడు హయమును

మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌

మొదవు కడనున్న వృషభముఁ

జదువని యా నీచుఁ జేరఁ జనకుర సుమతీ!

కవి ఆకాలంలోని పరిస్థితులను అనుసరించి ఈశతకాన్ని వ్రాసినా నేటికీ నిత్య సత్యాలు మనకు అవగతమవుతాయి బాగా దాహంతో ఉన్న గుఱ్ఱము  నీరుత్రాగేప్పుడు కదిలిస్తే దానికి కోపం రావచ్చు.ఏజీవికైనా ఆకలి, దాహం సహజం ఇక్కడ మనం   గుర్తించవలసినది అన్ని జీవుల లోని సహజ అవసరాలను. ఏనుగును, ఆసమయంలోని స్వభావాన్ని తెలుసుకుని దానిని కదిలించాలి. లేకపోతే దూరంగా ఉండాలి. ఆవు వద్ద  ఉన్న ఆబోతు వద్దకు వెళ్ళడం అంటే  చదువు, సంస్కారం లేని గుణహీనులతో స్నేహమో, సంభాషణో చేయాలని కోరుకోడమంత తెలివితక్కువ తనమన్నమాట.    

ఎప్పటి కెయ్యది ప్రస్తుత

మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్‌

నొప్పింపక తానొవ్వక

తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ!

తప్పించుకోడం ఎక్కడ ఎప్పుడు చేయాలో వివరించ బడింది ఇక్కడ. ముందు మనం మాట్లాడే విధానం నేర్చుకో వాలి. ఇతరులమనస్సులు బాధించకుండామాట్లాడటమే ఉత్తమ  లక్షణం . చాలా పండితుడై ఉండ వచ్చు. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకవచ్చు , ఐతే అతని మాటలు  ఇతరు లను బాధిస్తే ఆపాండిత్యమూ,  సత్యవ్రతమూకూడా వృధా. 

సత్యాన్న ప్రమది తవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం,

కుశలాన్న పరమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం,

స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం,

దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం,

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, 

అతిథిదేవో భవ.

అనేది మన సంస్కృతి.

సత్యమార్గం నుండి మరలకుము,ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకు.  ధర్మ మార్గం నుండి  , ఆత్మ సంరక్షణ నుండి , స్వాధ్యాయ ప్రవచనాల నుండి  , దేవ పితృ కర్మల నుండి మరలకుము, తల్లీ, తండ్రీ, గురువు, అతిథిలను దైవ సమానులుగా భావించి పూజించు. మొదలైనవి  తైత్తరీయ శిక్షావల్లిలో   గురువులు శిష్యులకు బోధిస్తారు. ఐతే దీనిలోనూ కొంత ఆలోచన, అనుస రించేప్పుడు కాస్తంత యోచన ఉండాలి . అన్నింటికంటే ముఖ్యమైనది ఇతరులను బాధించకపోవడం.  

ఒక ఋషి కుటీరం వద్దకు ఒక దొంగవచ్చి పూలగుట్టల్లో  దాక్కుంటాడు. అది ఋషి గమనిస్తాడు. ఈలోగా అతడిని వెతుక్కుంటూ రాజ భటులు వస్తారు.వారు ఆఋషిని అడుగుతారు, ‘దొంగేమైనా ఇటువచ్చాడా?’ అని, ఋషి చెప్తే అతడిని పట్టుకుపోయి దొంగతనం చేసినందుకు మరణ శిక్ష విధిస్తారు, తెలీదంటే  అసత్యదోషం అంటుతుంది .అందుకని ఆఋషి తెలివైన సంస్కార వంతుడు కనుక “ చూసేవి చెప్పలేవు, చెప్పేది చూడ లేదు, చూసేవి చెప్పలేవు, చెప్పేది చూడ లేదు”అన్నాడు. వారు అతనికి మతి భ్రమించి మాట్లాడు తున్నాడని వెళ్ళిపోతారు. ఆదొంగ బయటికి వచ్చి తనప్రాణం కాపాడిన ఆఋషి  శిష్యుడైపోయి తన జీవన విధానాన్ని మార్చేసుకుంటాడు.కనుక సత్యం చెప్పడంలోనూ ఔచిత్యం పాటించాలి.  సత్యం యొక్క మహిమను కూడా మనం ఇక్కడ గమనించాలి.

ఉడుముండదె నూఱేండ్లును

బడియుండదె పేర్మిఁ బాము పదినూఱేండ్లున్‌

మడువునఁ గొక్కెర యుండదె

కడు నిలఁ బురుషార్థపరుఁడు గావలె సుమతీ!

ఇతరులకు సహకరించనివారూ, ఇతరులకు స్నేహితులుగా ఉండ లేనివారు వృధాజీవులు. ఎలాగంటే ఉడుము అనే పాకే జీవి  నూరేళ్ళు బ్రతకవచ్చు, ఏమిలాభం? పెద్దపాము , కొండచిలువకావచ్చు మరొకటి కావచ్చు, ఇంకోరిని బాధిస్తూ ఎక్కువకాలం బ్రతికినా ఉప యోగమే ఉండదు. మడుగులో అంటే నీటిలో కొంగ అక్కడ ఉన్న జీవులను చేప లనూ జలగలనూ ఇంకా నీటి జీవులనూ పట్టుకుని మ్రింగుతూ ఎంత కాలం జీవించినా ఏమిలాభం?  వాటి జీవితాలన్నీ నిరుపయోగములే. ఇతరులకు ఉపకరించని జీవితాలు వృధాజీవితాలే. మానవుని జీవితం అలా కాకుండా ధర్మార్థకామమోక్షములను ఆచరిస్తూ  ఉంటేనే  సఫలం, లేదా ఎంత కాలం బతికున్నా వృధా వృధా వృధా.మనం ఈ పద్యం నుండీ గ్రహించవలసినది ఏమంటే—- ‘పరోపకారార్థం ఇదంశరీరం’. పరులకు ఉపయోగపడని శరీరం ఉండీలేనట్లే. కేవలం తిననూ, నిద్రిం చనూకాదు శరీరం మనకు భగవంతుడు ఇచ్చినది .ఇతరులకు సహకరించనే అనిగ్రహించాలి.

పరోక్షంగా గొప్ప నీతిని అందించిన  శతక కారుడు మహానుభావుడే!    

కవి ఆనాటి  సమాజ విషయాలను  ప్రస్తావించారు. 

ఐతే ఛత్రపతి శివాజీ తన పెంపుడు ఉడుము నడుముకు త్రాడు కట్టి  పైకి వదలగా అది కోట బురుజు  పైకెక్కి అక్కడ గోడను గట్టిగా పట్టుకోగా శతృ అభేద్యమైన శతృవు కోటపైకి శిపాయిలు ఆత్రాడు పట్టుకుని పాకి వెళ్ళి వారిని జయిస్తారు. అందుకే గట్టి నిర్ణయాన్నిఉడుము పట్టు అనే సామెత తో పోలుస్తారు. 

ఎప్పటి కెయ్యది ప్రస్తుత

మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్‌

నొప్పింపక తానొవ్వక

తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ!

ఈ పద్యంలోనూ లోకంలో మానవులకు హెచ్చరిక చేశాడు కవి. ఇతరుల మనములు నొప్పించక,చాకచక్యంగా మాట్లాడాలని. ఇతరులనూ బాధిం చక, తానూ బాధపడక  లౌకికంగా , జీవించాలని సూచన.   

ఏఱకుమీ కసుగాయలు

దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ

పాఱకుమీ రణమందున

మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

 పండని కాయలు అంటే కసుకాయలు , పిందెలు , వాటిలో పసరు ఉంటుంది. అవితినడం వలన అనారోగ్యం పాలవుతారు, అంతేకాక  అవి పెద్దవై పండి కమ్మని రుచితోకూడిన పండ్లను మానవులకు అందిస్తాయి, అలా పెరగనీయక పిందెలుగా ఉన్నపుడే కోయడం పాపంకూడా కదా! అందుకే పిందెలుకోయకూడదనిఅన్నాడు కవి.  బంధువులను దూషించ రాదు. రక్తసంబంధీకులూ, సగోత్రాలవారూ ఐన బంధువులను చీదరించ డం, దూషించడం చాలానేరం, పుణ్యాకార్యాలకూ, కర్మక్రతువుల సమయా న  వచ్చేవారు  వారే.అలాంటి వారిని దూషించడం నిన్ను నీవుదూషించు కున్నట్లే , అసలు ఎవ్వరినీ దూషించరాదని చెప్పుకుంటూ బంధుజను లను దూషించడం ఇంకాపాపం అంటాడు కవి.పూర్వం సైనికులు , నేడు కూడా మన సరిహద్దులను కాపాడే వీరజవాన్లు ఎంత ఆపద, కష్టం వచ్చి నా కూడా తమ విధినిర్వహణలోనే ఉంటూ, ఒక్కోమారు మరణాలకూ గురవుతారు. ఐనాకూడా  యుద్ధం నుంచి వెనుతిరిగి రారు . అది వారి వృత్తి, విధి, ధర్మం .ఇక’ పెద్దల మాట పెరుగన్నపు మూట’ అంటారు కదా! ఎంతో అనుభవంతో చెప్పేపెద్దల మాటలను తప్పక పాటించి, ఆపద లను తప్పించుకోడమో, ప్రమాదాల బారినపడకుండా ఉండటమో,మంచి విధానాలను రూపొందించుకోడమో,మంచి నిర్ణయాలు తీసుకోడమో చేయా లి, వారు తమజీవిత మంతా అనుభవించీ, చూసీ అనేకవిషయలు ఎరిగి చెప్తారు, కనుక పెద్దలమాట తప్పక విని తీరాలీ అని కవి చెప్తున్నారు.    

ఓడల బండ్లును వచ్చును

ఓడలు నాబండ్లమీఁద నొప్పుగ వచ్చు న్‌

ఓడలు బండ్లును వలెనే

వాడంబడుఁ గలిమి లేమి వసుధను సుమతీ!

ఎంతో గొప్పసందేశం ఈ పద్యంలో ఉంది. ధనికులమని గర్వించరాదనీ, పేదలమనీ బాధపడరాదనీ చెప్పేందుకే ,’కలిమి లేములు కావడి కుండ ల’ని వివరించనే, పూర్వం, నేడుకూడా కార్లు సముద్రం మీదనుండీ ఇతరదేశాలనుండీ, మరొకదేశానికి రవాణ ఐవస్తాయి . ఓడల విడి భాగా లను ఒకచోట తయారు చేసి, బండ్లు అంటే ఇక్కడ కేవలం ఎద్దులబండ్ల నికాదు, వాహనాలు అని గ్రహించాలి. పెద్ద ట్రక్కులమీద ఓడల విడి భాగా లు రవాణాఐ   వచ్చి ఓడను సముద్ర తీరాన రూపొందిస్తారు. అవి ఒక దానికి ఒకటి సహకరించుకుంటున్నాయి. అలాగే ధనం ఇప్పుడు ఉండ వచ్చు, మరొకరోజు పోవచ్చు, పేద ధనికుడు కావచ్చు. కనుక దేనికీ విర్ర వీగక అన్ని సమయాల్లోనూ వినయ విధేయతలతో, ఏది ఉన్నా అది భగవత్ ప్రసాదంగా భావించాలని సూచిస్తున్నాడు.  

కనకపు సింహాసనమున

శునకముఁ గూర్చుండఁబెట్టి శుభ లగ్నమునం

దొనరఁగఁ బట్టము గట్టిన

వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

హీనుఁడు అనగా మంచి స్వభావము లేనివానిని ఎంత గౌరవించిన తన నీచస్వభావమును మార్చుకోడు.అందుకే కవి అలాంటి వారిని ఒక కుక్క తో పోల్చాడు. కుక్క ఎలాంటి వారినైనా కానీ చూడగానే మొరిగి భయపెడు తుంది.కరవను మీదకొస్తుంది.అలాగే ఎంత గౌరవస్థానంలో ఉన్నా గుణ హీనూడు గొప్పవారిని గుర్తించి గౌరవించలేడు  ఒక వ్యక్తి ఎలాంటి గొప్ప స్థితి లో ఉన్నా  కూడా పదవి గర్వంతో విర్రవీగక ఉత్తములను గౌరవించా లని అన్యాపదేశం.  

కమలములు నీటఁ బాసినఁ

గమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్‌

దమ తమ నెలవులు దప్పినఁ

దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

ఏపువ్వు వికసించాలన్నా సూర్యుని ఎండ అవసరం. నీటిలో పుట్టిన కమలం సూర్యుని ఎండకే వికసిస్తుంది.ఐతే తనస్థా నమైన నీటిని విడచి బయటికి వస్తే అదే సూరుని ఎండకు కమిలి వాడి పోతుంది. అలాగే తమ స్థితిలో, తమతావులో తమ ఇంట తాము ఉంటున్నంతకాలం అంతా స్నేహితులుగానే ఉంటారు.ఎప్పుడైతే తమ తావు వదలి బయటికి వస్తారో, అప్పుడు  ఎంత గొప్ప స్నేహితులైనా తక్కువగా చూస్తారు. తమమీద బాధ్యతపడుతుందేమో, తమ సహాయం   అడుగుతారేమో అనే భావనతో పాటుగా ,ఉనికిపట్టు, కోల్పోవడం చేతకాని తనంగా భావించి హీనంగా చూస్తారు. అంటే ఎవరి స్థాయిలో,స్థానంలో వారుంటేనే గౌరవం లభిస్తుందని  భావన. 

కాదుసుమీ దుస్సంగతి

పోదుసుమీ కీర్తికాంత పొందినపిదపన్‌

వాదుసుమీ యప్పిచ్చుట

లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

ఈ పద్యంలో చివరి వాక్యం  కొంత వివాదా స్పదంగా ఉన్నట్లు  అనిపి స్తుంది.ఐతే ఆనాటి అంటే కవికాలం నాటి సాంఘీక పధ్ధతులు మనకు అవగాహన లేవు కనుక ఆయన ఆనాటి విషయాలను ఇక్కడ ఈ సుమతీ శతక పద్యాలలో పొందుపరచి నట్లు మనం భావించాలి . 

 చెడు స్నేహం వద్దనడం ఏకాలానికైనా సరిపోతుంది. చెడు  వారితో ఉంటేనే మంచి వారికీ అదే ముద్ర పడుతుంది కదా! తాటి చెట్టు క్రింద పాలుత్రాగినా తాటి కల్లే అనుకుంటారు. అలాగే దుష్టుల సమీపాన ఉన్నా మనలనూ దుష్టులుగానే సమాజం భావిస్తుంది సుమా ! అన్నాడు కవి.  బాగానే ఉంది.ఒకమారు మంచి పనులు, సమాజసేవ, తోటివారికి సాయం చేస్తే ఆపుణ్యం ఏనాటీకీ పోదు, ఆమంచిపేరు, ఆసాయం పొందినవారి మనస్సులో శాశ్వతంగా నిల్చి ఉంటుంది. అందుకే ‘హెల్ప్ ఎవర్. హర్ట్ నెవర్ ‘అన్నారు .ఇక అప్పు ఇవ్వడం అంటే శతృత్వం కొని తెచ్చుకోడ మే. ఇస్తే ఊరికే దానధర్మంగా భావించి ఇవ్వాలి కానీ, అప్పిచ్చి తనకు మాలిన ధర్మంచేసి ఆతర్వాత ఇచ్చిన వారు తిరిగి ఇవ్వక మనకు అవస రానికి సొమ్ములేక ఇబ్బంది పడవలసి వస్తుంది ,అప్పు తీసుకున్నవారు ఇవ్వాలనే ఉద్దేశ్యం  ఉన్నా లేకున్న అడిగినందుకు తప్పక   స్నేహం, సాయం మరచి విరోధుల్లా చూస్తారు. ఇక చివరి వాక్యం కాస్తంత వివాదా స్పదం.  స్త్రీల విషయంలో మనకు అనిపించే కువిమర్శగా చెప్పుకో వచ్చు. ఐతే ఆకాలంలో ఎక్కువమంది వేశ్యాగృహాలకు వెళ్ళి వారి అస్థి పాస్తులనంతా వృధా చేసుకుని బైరాగులైపోయిన వారున్నారు, వేమనే దానికి  ఉదాహరణ.ఆతర్వాత ఆయన బైరాగిగా మారి వేమన శతకం వ్రాశాడు, తన స్వానుభవాలతో. ఐతే ఇంటి ఆడపడుచులూ, గృహిణులూ, శ్రీమతులు అంటే భార్యల  విషయంలో ఈ వాక్యం  వర్తించదు, అనిమనం భావించాలి.    

కులకాంత తోడనెప్పుడుఁ

గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ

కలకంఠికంట కన్నీ

రొలికిన సిరి యింటనుంట నొల్లదు సుమతీ!

 ఈ పద్యంలో కవి భార్య విషయంలో ఎంత మర్యాదగా, నియమబధ్ధంగా , జాగ్రత్తగా ఉండాలో వివరించాడు.  

భార్యతో ఎప్పుడూ తగాదా వేయ కూడదు.అంటే ఆమె నిరంతరం కుటుం బాన్నీ, యజమానినీ గురించి ఎంతో జాగ్రత్త వహిస్తుంటుంది. వారి శ్రేయ స్సునే కోరుకుంటుంటుంది. అలాంటి ఆమెతో వివాదాలు పడకూడదు, బాధపెట్టకూడదు. ఆమెమీద  నేరారోపణలు అసలు చేయకూడదు.  ఇంటి  ఇల్లాలు కంట నీరు కింద పెడితే ఆ ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు. అంటే భార్యను  ఒక మహాఇల్లాలుగా,  ఉత్తమురాలుగా పోల్చాడు కవి. అందరికంటే ఉత్తమ స్నేహితురాలు , హితురాలు భార్య, కుటుంబాన్ని కూడగట్టి అందరి శ్రేయస్సూ చూసే మహిళ ఆ ఇంటికి  ఒక దేవత .

కూరిమిగల దినములలో

నేరము లెన్నఁడును గలుగ నేరవు మఱి యా

కూరిమి విరసంబైనను

నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

ఈ పద్యం చిన్నపిల్లల నోట కూడా పలుకుతుంది .ఎంతో మంచి స్నేహి తులైనా కొద్దిగా స్నేహం చెడితే ఇంతకుముందు అతనిలో మంచిగా కనిపించిన ఉత్తమ గుణాలన్నీతప్పుగా అనిపిస్తాయి.అందుకే మంచి స్నేహితులతో ఎన్నడూ స్నేహం చెడిపోయేంత దూరం పోకుండా సజావు గా, చక్కగా , తగినంత సమయ సందర్భాలు పాటిస్తూ ప్రవర్తించాలి.

చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైనయట్లు పామరుఁడు దగన్‌

హేమంబుఁ గూడఁ బెట్టిన

భూమీశుల పాలఁ జేరు భువిలో సుమతీ!

చీమలు తమ వర్షాకాలపు జీవనం కోసం ఆహారాన్ని తెచ్చు కుని తాముకష్టపడి ,కట్టుకున్న మట్టి పుట్టలో దాచు కుంటాయి. వాటిని బాగా గమనించిన పాము ఆపుట్టలో దూరి తన నివాసంగా మార్చుకుని ఆచీమ లనే తినేస్తుంటుంది . అజ్ఞాని,లేక దురాశాపరుడు అనేక విధాలుగా కష్టపడి సంపాదించి , కూడబెట్టి, దానధర్మాలు చేయక తినక ,దాచిన సొమ్ము దొంగలపాలో , సంపాదనకు తగిన ప్రభుత్వ శిస్తు కట్టలేదని ప్రభుత్వంపాలో అవుతుంటుంది.

కనుక ఉరికే ధనాన్ని దాయడం, మట్టి గడ్డలను దాచుకున్నట్లే , దాన ధర్మా లతో వాటికి మంచి స్థాయి కల్పించి మానవులూ పుణ్యాన్ని సంపా దించుకోవాలని అంతరార్థం.     

తన కోపమె తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ

దన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

ఈ శ్లోకంలో కవి మన గుణాలేమన శతృవులూ మిత్రులూ అని వివరిం చారు. ఎవరికైనా వారి ప్రవర్తనే, స్వభావాలే మంచినీ చెడునూ కలిగి స్తాయని భావం.

  కోపం కలిగినపుడు మానవుని శరీరం ఉద్రేకంతో కంపించిపోతుంది. ఒక్కోమారు హృదయ స్పదంన పెరిగి గుండెపోటు కూడా రావచ్చు. ఎదుటి వారిని  నోటికొ చ్చి నట్లు మాట్లాడితే అంతా దూరమైపోతారు. ఎవ్వరూ పలకరు, మాట్లాడరు. కోపమునకు మనం దూర్వాసుని కథనూ, కౌశికుని కథనూ, విశ్వామితృని కథనూ గుర్తు తెచ్చుకోవాలి.  

   తన శాంతమే తనను రక్షిస్తుంది. ఎవరైతే కష్టంలోనూ , బాధలోనూ  దుఃఖంలోనూ ఓర్పుతో ఎవ్వరినీ దూషించక, కారణం మరొకరిమీద రుద్దక సహనంతో ఉంటారో వారు అందరిచే గౌరవింపబడతారు.  హరిశ్చంద్రుడు సత్యంకోసం రాజ్యాన్ని వదిలేసినా ఓర్పుతో అన్నీ సహించి చివరకు దేవ తల మెప్పుపొందాడు.   తన దయయే తనకు చుట్టము అంటే ఎవరైతే దయతో దాన ధర్మాలూ ఇతరులకు సహాయమూ చేస్తారో వారు అందరి మన్ననలనూ పొంది అంతా వారికి  స్నేహితులైపోతారు. అవసరానికి   సహకరిస్తారు .   ఆనందం అనేది ధనధాన్యాలవల, మేడలు, కార్లవలనా రాదు, మనస్సులో సంతృప్తి భావన ఉంటే గుడిసెలో ఉండేవాడైనా  సంతోషంగా ఉంటాడు.గంజిత్రాగినా కుటుంబంతో చెట్టుక్రిందైనా హాయిగా  ఉంటాడు, అదే స్వర్గంగా భావిస్తాడు.ఎవరి  దుఃఖం వారికి నరకతుల్యం, అంటే ఎంత ఉన్నా ఇంకాకావాలనే కోరికతో నిరంతరం ఇతరులతో   పోల్చుకుంటూ  బాధపడేవారు పెద్ద మహల్లో నివసించినా బాధపడుతూ నే ఉంటారు. ‘తృప్తించెందనిమనుజుడు సప్త ద్వీములనైన చక్కం బడునే ‘ అనేది  ఆర్యోక్తి.ఈ పద్యంలో కవి   చక్కగామనస్సును  స్వాధీన పరచు కుని, సుఖశాంతులు కావాలంటే తృప్తిగా జీవించాలని  చిన్న పదాలతో గొప్ప అర్థాన్ని కూర్చి వివరించారు.         

న కలిమి యింద్ర భోగము

తన లేమియె సర్వలోక దారిద్ర్యంబు\న్‌

దన చావు జగత్ప్రళయము

తను వలచినదియె రంభ తథ్యము సుమతీ

మానవులు సాధారణం అంతా తమ గొప్పదనాన్నీ తమ దుఃఖాన్నీ తమ భావనలనూ మాత్రమే గొప్పవిగా అంతా గుర్తించి సానుభూతో, అంగీకార మో, ఆమోదమో, గొప్పో చూపాలని భావించే మూర్ఖులగురించిన పద్య ఇది.   

తన సంపదో , ధనమో ,భవనాలో ,నగలో అదే చాల  గొప్పవి. ఇతరుల కన్న  తానే గొప్ప సంపన్నుడు అనేభావన.    తన దారిర్ద్యం   లోకంలో మరెవ్వరూ అనుభవించనంత కష్టం , మరెవ్వరికీ ఇంత బాధ లేదు అనేభావన,  తనమరణం ఇక లోక ప్రళయంలో,లోక మంతా  మునిగి పోయేంత  ప్రమాదకరమైనది, తాను చస్తే ఇక  లోకమే లేదను కునే పరమ మ్మూర్ఖత్వం.తాను ప్రేమించిన మగువ ఎలాఉన్న అంతా   ఆమె రంభతో సమానమని అం గీ కరించాలనే తెలివితక్కువ కోరిక  . ఈ విధము గా జీవించేమానవులు లోకంలో ఉన్న అందరికంటే కడు ముర్ఖు లు అనవచ్చు.    

తన వారు లేని చోటను

జనవించుక లేనిచోట జగడము చోటన్

అనుమానమైన చోటను

మనుజున కట నిలువదగదు మహిలో సుమతీ!  –

తమను ఆదరించే అసలైన బంధువులు లేనిచోట, అంటే అవసరానికి  మాటసాయం   లేక మరేసాయమో చేసే బంధువులు లేనిచోట మనం ఉంటే   మనలను ఆదుకునేవారే ఉండరు. మనకు  సౌకర్యము లేక మన మాట    పట్టించుకునేవారు లేనిచోట,ఎవరైనా తగవులాడు కుంటుం టే , వారు మనలను  తమకు సహకరించమని అడగవచ్చు, లేక వారి పోట్లాట కొట్లాటగా మారితే రక్షకభటులు  అక్కడ ఉన్న వారిని సాక్ష్యం చెప్పను తీసుకెళతారు,అనవసరమైన గొడవలో ఇరుక్కుని ఇబ్బందిపడవలసి రావచ్చు,ఎక్కడైతే మర్యాద, గౌరవం లోపిస్తుందో అక్కడ ఒక్క క్షణమైనా ఉండకూడదు. తక్కువ గౌరవం ఇండేచోట ఎక్కువసమయం కాదు అసలు ఉండకూడదు.      

తలనుండు విషము ఫణికిని

వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్‌

తల తోఁక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

మూర్ఖులు,దుర్జనులు, నీచులు, అధములు ఇలా ఎన్నిమాటలైనా చెప్పు కోవచ్చు సంస్కారము లేనివారిని గురించీ , వారెలా ఉంటారంటేపాము, తేలుకంటే ప్రమాదకారులు.  పాము విషపూరితమైనదై నా దాని నోట్లోనే విషం ఉంటుంది. దానికి ప్రాణ భయం కలిగితనే ఎవరినైనా కాటేస్తుంది. ఇక తేలుకు కొండేలో అంటే తోకలోనే విషముంటుంది.  దుర్మార్గునికి ఒళ్ళంతా విషమే ఉంటుంది.  విచక్షణాజ్ఞానంకల మానవుడు దురాత్ముడై జంతువులకంటే నీచంగా తోటివారికి చేటు చేస్తాడు.  కనుక దుర్మార్గుల దగ్గర ఉండకూడదు. వారితో స్నేహం చేయకూడదు, అనే విషయాన్ని ఎంతో సులువైనమాటలతో సూక్ష్మాతి సూక్ష్మంగా  వివరించడంలోకవి చాతుర్యం బయల్పడుతున్నది.           

ధనపతి సఖుఁడై యుండియు

నెనయంగా శివుఁడు భిక్ష మెత్తఁగవలసెన్‌

దనవారి కెంత కలగినఁ

దనభాగ్యమె తనకుఁగాక తథ్యము సుమతీ!

ఈ పద్యంలో ఎవరికున్న ఆస్థిపాస్థులతో వారు తృప్తిచెంది ఆనందగా జీవించాలనే సందేశం ఉంది. మరొకరికి ఉన్నసంపదను చెప్పుకుంటూ వారు మన ఆప్తులని ఎంత చెప్పుకున్నా అదిమనదికాదు.    

గొప్ప ధనవంతుడైన కుబేరుడు మిత్రడుగా ఉన్నా శివునికి బిచ్చం ఎత్త వలసి వచ్చింది. కనుక తాను సంపాదించుకున్న ,తన దగ్గరున్న  భాగ్య మే  తనది కానీ ఇతరులది తనకే మాత్రం   సహకరించదు .  ఇక్కడ శివుడు బిచ్చమెత్తడం అనేదానికికాదు ప్రాధాన్యత . అంతగొప్ప వాడైన, సృష్టి ,స్థితి, లయకారకుడైన శివుడు ఒక్క మాట చెప్తే కుబేరుడు ఎంత ధనాన్నైనా ఇస్తాడు. కానీ అదిపరులదే కదా!  అందుకనే మన సంపాదన  మనతృప్తిని మించిన సంతోషం మరెక్కడా  లభించదని చెప్తున్నాడు  బద్దెన కవి.   

నీరే ప్రాణాధారము

నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌

నారియె నరులకు రత్నము

చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!

పంచభూతాలలో ఒకటైనదీ,మానవ మనుగడకూ, సకల జీవులకూ ప్రాణా ధారమైనదీ ఐన నీటి గురించీ కవి మానవు లందరికీ ఒక హెచ్చరిక చేస్తు న్నాడు.    

  నీరు ఏవిధముగా  జీవులన్నింటికీ ఎలా ప్రాణాధారమో, అలాగే  మంచి మాటలు మాట్లాడటం వలన మానవుని సంస్కారం బయల్పడుతుంది. దానివలన అతనికి గౌరవమూ, ఉన్నత మర్యాదా కలుగుతాయి. మానవు నకు మర్యాదను మించిన జీవనమేముంటుంది? ఇక మహిళ ఏవిధంగా పురుషునికి అన్నివిధాలా సహకరిస్తూ, తల్లిలా, ఒక సలహాదారునిలా, సర్వ సౌకర్యాలకూ ఆధారమో చెప్తూ , మహిళ గౌరవాన్నీ రెట్టింపుచేశాడు బద్దెన కవి. ఇక మగువ  చీర కట్టులో పొందే గౌరవమూ, లభించే మంచి గుర్తింపూ , భారతీయ సంస్కృతీ  గురించీ ప్రస్తావించాడు కవి.    

పగ వలదెవ్వరి తోడను

వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్‌

దెగనాడవలదు సభలను

మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!

పగ అంటే విరోధము,శతృత్వము ఎవరితోనూ పనికిరాదు. విరోధము అనేది విషంతో సమానం. అందరితో మంచిగా, స్నేహంగా మెలగడమే మానవత్వం.ఎవరికైనా ఏసమయం లోనైనా ధనబాధ,  ఐశ్వర్యలేమి కలుగ వచ్చు. దారిర్ద్య్రం అనేది సంభవించవచ్చు.

పాండవులు అడవులపాలై ఎంతో బాధపడ్డా ఏమాత్రం కుంగిపోక, ధైర్యం కోల్పోక భగవంతుని నమ్ముకుని అన్ని కష్టాలనూ ఎదుర్కున్నారు. కనుక లేమి అనేది మనధైర్యాన్ని పెంచే ఒక పరీక్షగా భావించాలి.  విచారించ కూడదు. పరీక్ష ఉంటేనే పైతరగతులకు వెళ్లేది, అలాగే కష్టకాలంలో, భగవంతుని స్మరించడం ఎక్కువవుతుంది.

  దీనికి కుంతి కధ స్మరించాలి. కుంతి తనకు నిరంతరం కష్టాలనిమ్మని కోరింది కృష్ణుని,ఎందుకూ కష్టంలో భగవంతుని ఎక్కువ స్మరిస్తామనీ, మరువమనీనీ. 

 ఇక మానవులంతా నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన నీతి సభలో ఎవరినీ దూషింపకూడదు. కానీమనం చూస్తుంటాం,నేడు చట్ట సభల్లోనూ, పార్ల మెంట్ అసెంబ్లీ వంటి సభల్లో ఒకరినొకరు నేరుగా నేరారోపణలేకాక దుర్మార్గపు మాటలతో దూషించుకుంటూ పరస్పర గౌరవం కోల్పోయి కేవలం అవిద్యావంతుల్లా ప్రవర్తించడం, సంస్కార హీనంగా మాటలు బాణాల్లా విడువడం  మనం చూస్తూనే ఉన్నాం. చివరిగా కవి చెప్పేది స్త్రీకి తన బాధలూ, కష్టాలూ, ఇబ్బందులూచెప్పక ధైర్యంగా ఉండాలనీ, ఆమె మనసు బాధపడేలా  చేయరాదనీ మనం అర్థంచేసుకోవాలి.  

పరుల కనిష్టము సెప్పకు

పొరుగిండ్లకుఁ బనులులేక పోవకుమెపుడున్‌

బరుఁ గవిసిన సతి గవయకు

మెఱిఁగియు బిరుసైన హయమునెక్కకు సుమతీ!

  సుమతీ శతకనీతులు మానవాళిలో అలా అలా వ్యాపించి పోయాయంటే ఎంతటి  గూడార్థాలనూ, అత్యంత ముఖ్యమైన నీతులనూ ,మానవులు పాటించాల్సిన  విషయలనూ, చెప్పడం వల్లే బద్దెనకవి ఈనాటివరకూ గుర్తుండిపోతూ నిరంత స్మరణీయుడైనాడు. 

ఎవ్వరినీ కష్టపెట్టకూడదు. అనేది   ఎంతగొప్పనీతి, మానవతకు నిదర్శ నం .మహనీయతకు చిహ్నం. ధర్మరాజును ఈసందర్భంగా  గుర్తు చేసు కోవాలి. ఎవ్వరినీ బాధించని విధంగా మాట్లాడే వాడు.  అలాగే  శ్రీరామ చంద్రుడు మృధుభాషి.అందరిలో ఉండేపరమాత్మ ఒక్కడే అని విశ్వసిస్తే ఎవ్వరిని బాధించినా  భగవంతుని బాధించినట్లే అని భావించి మృధుభా షణ అలవడుతుంది. . ఇక కాలక్షేపానికి ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళి బాతాఖానీ వేసి, వారిపని చెడగొట్టి, పిచ్చి పనికి రానిమాటలతో మనస్సు నింపుకుని, ఆ ఆలోచనలతో మనస్సు చెడి, జీవితకాలాన్ని వ్యర్ధపరచడం పనికిరానిపని, ఏ పనీ లేకపోతే హాయిగా సద్గ్రంధ పఠనమో, భగవత్ చింతనో చేసుకోవచ్చు . అత్యంత ముఖ్యమైన నీతి, వంటరిగా ఉన్న  సమయంలో ఏస్త్రీనీ  ఒంటరిగా కలసి మాట్లాడకూడదు.అంటే ఇతరుల భార్యను ఏపనిమీద వెళ్ళినా, అతను లేనపుడు వెనక్కు వచ్చే యాలి, కూర్చుని మాట్లాడితే అపార్థాలకు తావు వస్తుంది.ఇక చివరి వాక్యం  ఆరోజుల్లో చాలామంది గుఱ్ఱాలమీద ప్రయాణం చేసేవారు, కాస్త ధనము న్న వారికి ప్రయాణ సాధనం  గుఱ్ఱమే. అందుకని  పొగరుబోతైన గుఱ్ఱాన్ని ఎక్కవద్దు అని చెప్తున్నాడు కవి. అది తనపై ఎక్కినవారిని క్రిందపడేసే స్వభావం ఉన్నదికనుక ప్రమాదాలు కలిగే  అవకాశం ఉంటుందని కవి భావన.    

పాలను గలసిన జలమును

బాల విధంబుననె యుండుఁ బరికింపంగాఁ

బాల చవిఁ జెఱచుఁ గావున

బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!

పాలు ఎల్లగా ఉంటాయి  ఎన్ని నీళ్ళుకలిసినా రంగు మారదు. కానీ రుచిమారుతుది. మంచివారు నిరంతరం మంచిగానే ఉంటారు. వారిలో ఏనాటికీ మార్పురాదు.అందుకనేపాల స్వఛ్చతను మంచి తనంతో పాల్చడం కద్దు.సాధారణంగా పాలు అమ్మేవారు పాలలో ర్మ్గుమారదు కనుక నీరు కలిపి అమ్ముకుని, అదనపు సొమ్ము గడిస్తుంటారు. ఐతే స్వచ్చమైన పాలరుచి నీరు కలిసే కొద్దీ మారుతుంటుంది.కవి అంటారూ మంచివారు చెడ్దవారితో కలసినపుడు వారి చెడుప్రవర్తన మంచివారిపై రిఫ్ లెక్టై చూసేవారంతా మంచివారినీ చెడువారితో కల్పి చెప్పు కుంటారు. కర్ణుడు స్వతహాగా మంచివాడైనా కౌరవులతో చేరి  తన మంచితనానికి మసిపూసుకున్నాడు.   

  కనుక ఏతావాతా చెప్తున్నదేమంటే  చెడ్డవారితో స్నేహం స్వంత గౌర వాన్ని కూడా పోగొడుతుందని గుర్తుంచుకుని, చెడువారికి కాస్తదూరంగా ఉండను ప్రయత్నించాలి.  

బలవంతుఁడ నాకేమని

పలువురతో నిగ్రహించి పలుకుట మేలా?

బలవంతమైన సర్పము

చలి చీమల చేతఁ జిక్కి చావదె సుమతీ!

బలము అనేది శారీరకబలమే కాక, మేధాబలమూ, ధనబలమూ, కుల బలమూ, మంది బలమూ ఇలా అనేకం ఉంటాయి .ఎన్ని బలాలున్నా ,ఒక్కోమారు అన్నీ కలసిరాక వంటరి ఐపోయే ప్రమాదం  ఉంటుంది. ఆసమయంలో ఆబలాలెన్ని ఉన్నా ఆ సమయానికి పనికి రావు . అందుకే బలముందని విర్రవీగరాదు అని అంతరార్థం   

ఉదాహరణగా పాము చాలా బలం ఉందనే భ్రమతో చీమల పుట్టను ఆక్ర మిస్తే, చిన్న జీవులైన చీమలు ఐకమత్యంతో తమ నివాసాన్ని ఆక్రమించి న పామును  చుట్టుముట్టి చంపేస్తాయి. ఆపాము బలం ఏమైందీ అనేది ప్రశ్న! ఇక్కడ  ఐకమత్యాన్నికూడా ఉటంకించాడు కవి.ఎవరికైనా ఐక మత్యం ఉంటే  అవలీలగా ఎవరినైనా జయించవచ్చు.       

కనుక బలమనేది భ్రమింపజేసే ఒక వెర్రితనం.’ నాకేం భయం నాకు బలముంది, ఎవరినైనా జయించగలను ‘అనుకుని విర్రవీగితే  విరోధం  తెచ్చుకుని, చివరకు అవమానాల పాలుకావలసి వస్తుంది. ఆ ఎగురు బాటు అపకారం కలిగిస్తుది, ప్రమాదం తెచ్చిపెడుతుంది. కనుక బలం ఉందని విర్రవీగడం అహంకరించడం, మిడిసిపడటం   మంచిదికాదని అర్థం.   

మాటకుఁ బ్రాణము సత్యము

కోటకుఁ బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్‌

బోటికిఁ బ్రాణము మానము

చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

సత్యాన్ని గురించీ కవి ప్రవచించడం ఈ పద్యంలో గొప్పదనం.సత్యం యొక్క స్వరూపం అమోఘమైంది. 

 మానవునికి సత్యం ప్రాణంగా భావించి ఆచరిస్తే గౌరవాదరాలు పొంద గలడు.హిందూ సాంపదాయంలో సత్యానికున్న విలువ మరిదేనికీ లేదు.

పూర్వమేకాక ప్రస్తుతకాలంలోనూ రాజులకు, అంటే పాలకులకు కోటను కాపాడను లేక రాజ్యాన్ని రక్షించుకోను మంచి సైన్యం  ఉండాలి. అలాంటి ధీరులూ , చాకచక్యం గలవారూ, దేశభక్తి పరులూ, ఐన సైనికులుంటే  రాజ్య భద్రతకు ముప్పుండదు. ఇక అతివకు అభిమానమే ధనము, ప్రాణమూ కూడా. అలాగే ఏ ఉత్తరానికైనా చివర వ్రాసినవారి సంతకం లేకపోతే దానికి చెల్లుబాటే ఉందదు. ఏదైనా బ్యాంకు చెక్కు రాస్తే చివర సంతకం ఉంటేనే  కాషవుతుందికదా!   ఈ పద్యంలో ఎవరెవరికి ఏవి ముఖ్యమో వివరించడం జరిగింది.  

లావు గలవాని కంటెను

భావింపఁగ నీతిపరుఁడు బలవంతుఁడౌ

గ్రావంబంత గజంబును

మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ

ఈపద్యంలో కవి శారీరక బలంకాక మానశిక బలం తెలివి , చాకచక్యం గురించీ చక్కగా చెప్పారు.ఇక్కడ బలం అంటే బుధ్ధిబలం అనే అర్థతో గోప్యంగా పద్యం చెప్పారు. పెద్దశరీరం ఎంతోబలం ఉన్నఏనుగును సాధారణమానవుడు   మావటీ వాడు దాని బలహీనమైన ప్రదేశాన్నిబుధ్ధి బలం తో తెలుసుకుని   ఆమూపుమీద దాన్ని తన ఆయుధంతో పొడిచి వశపరచుకుని ,     లోబరుచుకుని , పైకిఎక్కుతున్నాడు .  ఇక్కడ ఏనుగుకంటే మావటీవాడే బలవంతుడని తేలుతున్నది. ఏబలం అదీ బుధ్ధిబలం.దేహబలానికంటే బుద్ధిబలం గొప్పదని నిరూపణైంది.కనుక  బుద్ధిబలం కలవాడే నిజమైన  బలవంతుడు.  

వినఁదగు నెవ్వరు సెప్పిన

వినినంతనె వేగపడక వివరింపఁదగున్‌

గని కల్ల నిజముఁ దెలిసిన

మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ!

ఎవరేం చెప్పినా వినవచ్చు.ఐతే తన తెలివితో విచక్షణాజ్ఞానంతో నిర్ణ యించుకోవాలి. అదే  మేధాతనము.వినీ,ఆలోచించి,  విచక్షణచేసి  నిర్ణ యం తీసుకోవాలి .ఆలోచించి నిజానిజాలనూ, మంచిచెడులనూ వేరు చేసి,  ఆచరించాలి.ఈపద్యం సర్వ లోక విదితం.

సిరి దా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరి దాఁ బోయిన బోవును

కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

  సిరి అంటే సంపద కలసి రావడం, పూర్వజనం సుకృత ఫలం వల్ల మనం చేసే పనులు కలసిరావడం అనేది జరుగుతుంటుంది.ఏపనులు చేసినా కొన్ని సమయాల్లో ఏమి  నుకూలంగా నేరవేరదు. మన జన్మ సుకృతంకొద్దీ మనం దాన ధర్మాలు చేసి ఉంటే చిన్నపనైనాసక్రమగా జరిగి కలసి వస్తుంది, దీన్నే కాలం కలసిరావడం అంటారు.   కొబ్బరి కాయలో  నీరు ఎవరు పోస్తారు. దానంతట దే చేరుతుంది. అలాగానే  మన పుణ్యకర్మం సరిగాలేకపోతే , గత జన్మలో ఏనాడూ ఎవ్వరికీ కాసైన ఇచ్చి ఉండక పోతే కలసి రావడం మాట అలాఉంచి ఉన్నదేపోతుంది. ఎలా గంటే వెలగపండును ఏనుగు మింగుతుంది, బయటికి విసర్జించి నపుడు పండుఆకారం  అలాగే ఉంటుంది  కానీ లోపలి గుజ్జు పదార్థం ఉండదు. ఆవిరై పోతుంది. కనుక నిరంతరం మంచే చేయాలి, చేతనైన సాయం చేయాలి, దానధర్మాలు చేయాలి,కనీసం మాట  సాయమైనాచేయాలి – అని అంతరార్థం.    

పుత్త్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడే పుట్టదు జను లా

పుత్రునిఁ గనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ .

 కుమారుడు అంటే కొడుకు పున్నామ నరకం నుండీ కాపాడే వాడనే  ఊహ ఒకటి ఉంది. ఐతే సంతానం పుత్రులైనా, పుత్రికలైనా  సద్గుణ సంపన్ను లైతే తల్లి తండ్రులను కడదాక  చూడటం జరుగుతుంది. దుర్మార్గుడైన కుమారుడు ఉండీ లేనట్లే. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అని విన్నాం కదా!ఐతే ఇక్కడ సంతానం కలగడం కాక ,ఆ సంతానం విజ్ఞాన వంతులు, విద్యావంతులు, మేధా వంతులు గానూ తయారై   సమాజంలో మంచి వారు గా గుర్తింపు పొంది , ఫలానా వారి సంతానం ఉత్తములు, అని చెప్పుకుంటే విని తల్లి తండ్రులు సంతసిస్తారు . కనుక సత్సంతానమే కోరదగినదీ, ఆనందాన్నిచ్చే దీనీ.  ఈ పద్యంద్వారా తెలుసుకో  వలసిన దేమంటే ,  సంతానం సత్ప్రవర్తనతో  తల్లి తండ్రులను సంతోష పెడి తేనే ఋణంతీర్చుకున్నట్లు అని.

 ఏతావాతా  ఈ సుమతీశతక నీతులు ఒకకాలానికి మాత్రమే చెందినవి కావనీ అర్థమవుతున్నది. సర్వకాలాల్లోనూ చదివి, గుర్తుంచుకుని ఆచరిం చి సన్మార్గంలో నడవను చీకటిలో వెలుగునిచ్చే టార్చీలైట్ వంటివి సుమతీశతక నీతులు. 

                       బద్దెనకవికి ప్రణామాలు అర్పిద్దామా! 

                                  ******

You Might Also Like

Leave a Reply