విరాట్

వ్యాసకర్త: పింగళి చైతన్య

*******

అత్యంత సన్న పుస్తకం ఏదా అని వెతికి, ‘విరాట్’ తీశాను.  ఎక్కాల పుస్తకం కూడా సన్నగానే ఉంటుంది కదా. ‘కర్మ’ కొద్దీ చచ్చే వరకు ఎక్కాలతో పని పడుతూనే ఉంటుంది. విరాట్ కూడా అంతే. 


మొదటి సారి ఎప్పుడో చదివానో గుర్తు లేదు. పట్టాల మీద మనం నడుస్తున్నా, రైలే పక్కకి పోవాలి అనుకునే ధీమాలో ఉన్న ఫేజ్ అని మాత్రం గుర్తుంది. రెండోసారి చదివింది ఒక అయిదేళ్ళ క్రితం. ఎవరో గుర్తు చేసారు విరాట్ ని. అప్పుడు తిరగేసినట్టు చదివా. ఇప్పుడు మూడోసారి. ‘ఏమి రాసాడురా..’ అనుకున్నా మూడు సార్లు కూడా. కాపోతే మోడ్యులేషన్లోనే చాలా మార్పు. 


Indian philosophy , భగవద్గీత చదివిన, విన్న వాళ్ళకి ‘విరాట్’ చెప్పే విషయం కొత్త కాదు.  ఫిలాసఫి అనే పెద్ద పదం దాకా ఎందుగ్గాని , బియ్యంలో రాళ్ళేరుకునేప్పుడు మాట్లాడుకునే మెట్ట వేదాంతం మాటలు విన్న వాళ్ళకి కూడా ‘విరాట్’ లో చెప్పే విషయం  ఏమాత్రం కొత్తది కాదు. భారతదేశంలో చాలా మందికి పరిచయం ఉన్న ‘విషయమే’. కర్మ, అకర్మ, కర్మ ఫలితము చుట్టూ అనేక కథలు, భక్తి పాటలు, జానపదాలు, పురాణాలు, ప్రవచనాలు వేల సంవత్సరాలుగా ఉంటూనే ఉన్నాయి. విన్నప్పుడల్లా మెట్ట వేదాంతం అని, చేతకానితనం అని, పిరికితనం అని మనం వాదించే ఉంటాం. చెప్పే వాళ్ళ మీద కయ్ మని ఒంటికాలు మీద గొడవకి వెళ్ళే ఉంటాం. 

కాని విచిత్రం.. విరాట్ చదువుతున్నప్పుడు నోరెళ్ళబెడతాం. awe struck అయి ఉంటాం. చదువుతున్నంత సేపూ తప్పు ఒప్పులు – ఒకదాన్ని ఒకటి మాయం చేసే magic show మన బుర్రలో నడుస్తుంటుంది.  hat లో నుండి rabbit ని తీసినట్టు, లాఠి నుండి రిబ్బన్ ని తీసినట్టు బుర్రలో ఎవేవో వేటి వేటినో తీసి బైట పెడుతుంటాయ్ . అయితే ఈ magic show లో ఉన్నవి magic words కావు. ‘ఖాళీలని పూరింపుము’ అన్న చోట మనం పదాలు రాస్తుంటాం కదా.  అలా  ఫాసిజం గుప్పిట్లో చిక్కిన కాలం – బతుకులో మిగిల్చిన ఖాళీలని పదాలతో పూడ్చుకుంటూ వచ్చిన రచయిత సంఘర్షణ, తాత్వికత విరాట్ రూపంలో చేసే magic. 
కథ చిన్నదే. విరాట్ అనే గొప్ప వీరుడు శత్రువుల నుండి తన రాజ్యాన్ని కాపాడతాడు. కాని ఆ యుద్ధంలో సొంత అన్ననే చంపేశాడు అని తెల్లారాక శవాలు చూస్తున్నప్పుడుగాని అర్థం కాదు విరాట్ కి. ఆ కళ్ళు తనని వెంటాడుతున్నట్టే ఉంటుంది విరాట్ కి. రాజు గారు వచ్చి ‘సేనాపతి’ని చేస్తా అంటే, యుద్ధం చేసి పాపాలకి ఒడిగట్టలేను అని న్యాయధికారి అవుతా అంటాడు. రాజు గారికి విరాట్ మీద ఉన్న అభిమానంతో సరేనంటాడు. ఒక కేసు విచారణలో న్యాయాధికారిగా ఉంటూ ధర్మానికి కట్టుబడ్డా అన్న భ్రమలో ఎన్ని పాపాలు చేసాడో అర్థం చేసుకుంటాడు.

‘అధికారం క్రియని కోరుకుంటుంది’ అని, క్రియ అనేది ఎటు తిరిగీ పాపం చేయిస్తుందని గ్రహించి, ఆ పదవి నుండి స్వేచ్ఛ ఇమ్మని రాజుగారిని అడిగుతాడు. విరాట్ పట్ల ఉన్న గౌరవం వల్ల సరేనంటారు రాజు గారు. ఇంటి వద్దే ఉండి, పెద్దలు రాసినవి అధ్యయనం చేస్తూ ఉంటాడు విరాట్ . ఒకసారి బానిసని కొడుతున్న కొడుకుని అడ్డుకున్నప్పుడు జరిగిన వాదం, సంఘర్షణ వల్ల – కుటుబం లో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు క్రియ నుండి బైటపడలేను అనుకుంటాడు.  అడవికి వెళ్ళిపోతాడు. కొన్ని ఏళ్ళ తరువాత నగరంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఒక స్త్రీ అతన్ని ద్వేషంతో చూస్తుంది. పరిచయమే లేని ఆ స్త్రీకి తన మీద ఎందుకు అంత కోపమో అర్థం కాదు. అడుగుతాడు. ఆమె కారణం చెప్తుంది. అది విన్నాక ‘అకర్మ కూడా ఒక కర్మ’ అని గ్రహించి మళ్ళీ రాజుగారి దగ్గరకి వస్తాడు. పని కోసం. మాటల మధ్య రాజు, పేదా, కుక్కా, నక్కా భగవంతుడి దృష్టిలో ఒకటే అనీ; అదనీ ఇదనీ ఏదో చెప్తాడు. రాజు చేసే పని  , సేవకుడు చేసే పని సమానమేనా? అంటే అవును అంటాడు విరాట్. రాజు గారికి కోపం వచ్చి  కాపలా కుక్కలని కనిపెట్టుకుని ఉండే పని అప్పజెపుతాడు . విరాట్ ఆ పనిని చేస్తాడు. మొదట గొప్ప వీరుడు, తర్వాత కాలంలో ధర్మ మూర్తి, ఆ తర్వాత కాలంలో మహా సాధుపురుషుడుగా కీర్తింపబడిన విరాట్ ఒక రోజు చనిపోతాడు. ఎవ్వరికీ పట్టింపే ఉండదు. అతను చూసుకున్న కుక్కలు ఒక వారం ఏడుస్తాయ్. తర్వాత అవీ ఊరుకుంటాయ్ .  ఇంతే కథ. స్తెఫాన్ త్స్వైక్  (stefan zweig ) జర్మన్ భాషలో రాసిన Die Angen der ewigen bruders కథని english లోకి The eyes of the eternal brother పేరుతో అనువాదం చేసారు. దాన్ని తెలుగులో పొనుగోటి కృష్ణా రెడ్డి గారు అనువదించారు .  ఇంగ్లీష్లో, జర్మన్ లో ఈ కథ భవద్గీత శ్లోకంతో మొదలౌతుంది. జర్మన్ భాష నాకేం రాదు కాని, గూగుల్ చేసా. ఏదో కోట్ లా మెన్షన్ చేసి ఉంది కాబట్టి అది ఇంగ్లీష్ లో ఉన్నట్టే భగవద్గీత శ్లోకం జర్మన్ భాషలో ఉంది అనుకుంటున్నా. తెలుగులో ఈ శ్లోకం  లేకుండానే  కథ  మొదలౌతుంది. 


భగవద్గీత శ్లోకం మొదట మెన్షన్ చేసినా, ‘బుద్ధ భగవానుడు ఈ భూమి మీద అవతరించే కొద్ది రోజుల ముందు’ అని కథ మొదలౌతుంది.  ఇంకెక్కడా బుద్ధుని ప్రస్తావన రాదు కాని, action – inaction గురించి నడిచే కథ కాబట్టి, ఇది చాలా కీలకమైన వాక్యం. Hand brake తీసేసినట్టు అన్నమాట. ఇంత ఫిలసాఫికల్ కథని చదివేప్పుడు ..  విలన్ అని తెలీక అతని డెన్ లోకే పోయే కమర్షియల్ సినిమా హీరోని చూసి నెత్తి కొట్టుకున్నట్టు, విరాట్ ని చూసి నెత్తి కొట్టుకుంటాం. అతను ఒకదాని తరువాత ఒకదాన్ని ‘త్యజిస్తుంటే’. 

విరాట్ ని చూసి ముగ్ధులమయ్యి, కళ్ళు కాళ్ళు తేలిపోతున్నా సరే, అన్న చూపులు అతన్ని వెంటాడినట్టు మననీ కొన్ని ప్రశ్నలు వెంటాడతాయి. బానిసని కొడుతున్న కొడుకుని అడ్డుకుని, అలా అడ్డుకోటం కూడా క్రియ అని, every action leads to violence అని అడవికి వెళ్ళిపోయిన విరాట్ కి – తప్పు చేసిన బానిసలని శిక్షించే అధికారిని చేసి ఉంటే ఏం చేసేవాడు? తన అన్న కళ్ళు వెంటాడినట్టు, తన కొడుకు శిక్షిస్తున్న బానిస కళ్ళు అతన్ని ఎందుకు వెంటాడలేదు? ద్వేషంతో చూసిన ఆ స్త్రీ చూపులు మాత్రం ఎందుకు వెంటాడాయి? ‘ఆత్మగ్నానానికి, ప్రపంచ గ్నానానికి తేడా ఉంది’ అని గ్రహించిన విరాట్ కి ‘తనకి సంబంధించిన..’ , ‘తన పట్ల’.. ఇలా ‘తను’ అనేది మిగిలి ఉందని మనకి తగులుతూనే ఉంటుంది. తగాదా కూడా ఉంటుంది . విరాట్ కి కూడా self తగాదా ఉంది కాబట్టి, మనకేం పేచి ఉండదు అప్పటికి. 


కాని చివర్లో రాజు గారితో జరిగిన చర్చ అప్పుడు- ఒకవేళ రాజు కనక ‘అన్ని పనులు సమానమే అంటావా? అయితే పోయి సేనాపతివికా / న్యాయాధికారి కా’ అంటే విరాట్ ఏం చేసేవాడు ? అధికారం క్రియని కోరుకుంటుంది, క్రియ లో పాపం ఉండి తీరుతుంది, నష్టపోయే పార్టి ఎప్పుడూ ఉంటుంది. కుక్కలకి కాపలా కాసే ఉజ్జోగం/ క్రియ వచ్చి బతికిపోయాడు. కర్మణ్యే వాధికారస్తే అని కర్తవ్యం మీద క్లాస్ పీకిన భగత్గీత శ్లోకంతో మొదలైన ఈ కథకి కుక్కలని కాపలా కాసే ఉజ్జోగం ఇవ్వటం కన్వీనియంట్ ముగింపే .  జీవితం అలా కాదే. పని – తప్పొప్పుల ‘ఫలితము’.. ఈ రెండూ చేతులు కలిపి ‘ఒప్పుల కుప్ప వయారి భామ ‘ ఆడుకుంటూ ఉంటాయి. అది కదా సమస్య. అప్పుడే కదా magic show కాస్తా tragic show గా మారిపోయి, మననే కమేడియన్లు చేసి పెడుతుంది. విరాట్ కి కూడా రాజుగారు ఆవేశ పడి జంతువులతో బతికే పని కాకుండా మనుషులతో లింక్ అయిన పనే చెప్పి ఉంటే విరాట్ ఏం చేసి ఉండేవాడు ? అనేది తొలుస్తూనే ఉంటుంది. జవాబు  చెప్పే పని ఫిలాసఫర్లు , రైటర్లు పెట్టుకోరు. స్తెఫాన్ త్స్వైక్ కూడా పెట్టుకోలేదు.  పెట్టుకునే రకం కాదు అని ఆయన కథలు ఏవి చదివినా తెలుస్తుంది . ఆయన కథలు అన్ని ఇంగ్లీషులో ఉన్నయి. మన అదృష్టం కొద్దీ పొనుగోటి కృష్ణారెడ్డి గారు అనువాదం చేసారు. పేరుకు తగ్గట్టు పుస్తకాలని వేసే ‘మంచి పుస్తకం’ వాళ్ళు 25 రూపాయలకే ఇస్తున్నారు.

You Might Also Like

One Comment

  1. K. Suresh

    ఇప్పుడు ఈ పుస్తకాన్ని నవోదయ బుక్ హౌస్ వాళ్లు అందిస్తున్నారు. https://www.telugubooks.in/products/virat?_pos=1&_sid=bae492579&_ss=r

Leave a Reply