కృష్ణ శతకము- సమీక్షావ్యాసం
వ్యాసకర్త: ఆదూరి హైమవతి
********
శతక సాహిత్యం ఒక్క తెలుగులోనే ఉందటం గర్వకారణం. శత పదం వందను చూసిస్తుంది. శతకము అంటే సాధారణంగా వందలేక 108 పద్యాలతో అన్ని పద్యాల చివర ఒక మకుటంతో , ఒక పదంకానీ చివరి వాక్యం ఒకటిగా గానీ ఉండేలా సాగి సామాజిక విలువలనూ, భక్తినీ, నీతిని, చాటి చెప్పేవిగా ఉంటాయి శతకాలు. తెలుగులో అనేక శతకాలున్నాయి.
కృష్ణశతకము, సుమతీశతకము, భాస్కరశతకము వేమనశతకము, దాశరథీ శతకము ఇలాచెప్పుకుంటూ పోతే చాలా శతకాలున్నాయి. మనం ఈరోజు కృష్ణశతకము గురించీ కొద్దిగాచెప్పుకుందాం.
కృష్ణశతకాన్ని నరసింహకవి రచించారు.
శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీత లోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా
– అంటూ శ్రీకృష్ణపరమాత్మను -ద్వారకలో ఉండే ఓకృష్ణా ! నారద ముని సంగీతంలో మునిగి తేలుతున్న ఓ స్వామీ మమ్మూ కావుము, అంటూ ఆర్తితో శతకం ప్రారంభమవుతుంది. భగవంతుడు ఆర్తభక్తి సులువుగా త్వరగా లొంగి కాపాడుతాడు.
అంతేకాక-
ఓ కృష్ణా!
నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా
– నీవేనాసర్వస్వం , నాతల్లీ, తండ్రీ, గురువు,దైవమూ అంతానీవే, నీవుకాక నన్ను చూసేదేవరయ్యా! అంటే భగవంతునికి సంపూర్ణశరణాగతి ఐతేనే సర్వం తానే ఐ కాపాడుతాడనే హెచ్చరిక మనకు కనిపిస్తుంది .
హరి యను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభా –అంటూ హరి అనే రెండక్షరాలు నాపాపాలన్నీ పోగొట్టి ,నన్ను పునీతుని చేస్తాయి. అలాంటిరెండక్షరాలనూ మరువను అని మరో ప్రార్థన.
నీవు దయామయుడవు, క్రూరాత్ముడగు అజామీళునే మన్నించిన వాడవు, నన్నూకూడా మన్నిస్తావని నమ్ముతున్నాను.
అజామీళుని కథ-
కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తండ్రివద్ద అన్నివేదాలూశాస్త్రాలూ చదివినా యవ్వనంలో చెడు అలవాట్లకులోనై , దుష్టుడై చరించి అనేకమంది బిడ్డలనుకన్నాడు. అతడు చేయరాని పాపాలన్నీ చేసాడు .చివరికొడుకుపేరు ‘ నారాయణ ‘ అనిపెట్టుకున్నాడు.వాడంటే అజామీళునికి అమితప్రేమ , చివరిశ్వాస విడిచేసమయాన కొడుకును ‘ నారాయణా !నారాయణా ! నారాయణా ! ‘ అనిపిలిచి సద్గతినిపొంది, విష్ణుసన్నిధి చేరాడు.ఆఖరి క్షణంలో కొడుకు ను పిలిచినా నారాయణ నామాన్ని పలకడం వలన సద్గతి పొందాడు. అందుకే బిడ్డలకు దైవనామం పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు.
దీనివలన మనం తెలుసుకో వలసీన దేమంటే భగవన్నామాన్ని నిరంత రం స్మరిచేవారికి సద్గతులు తప్పక కలుగుతాయి.చిన్న పద్యంలో ఎంత గొప్ప అర్థం, పరమార్థం దాగివుందో చూడండి.
చిలుక నొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుంబిలిచిన— .
అలాగే తనపెంపుడు చిలుకను శ్రీరామా అని పిలువగా ఆమెకు మోక్షం సిధ్ధించిందని ఈపద్యంలో బోధించాడు శతకకారుడు.
అష్టమి అనేతిధి మంచిదికాదని చాలామంది భయపడతారు ప్రయాణా లూ, ఇంకేమైనా కార్యక్రమాలూ చేయను, అన్నీ కాలస్వరూపుడైన భగవంతునిరూపాలే. కాలమంతా భగవన్మయం.అష్టమి తిధి రోహిణి నక్షత్రం లో జన్మించిన కృష్ణపరమాత్మ దుష్టసంహారం చేసి, సాధుజను లను బ్రోచాడు. ఏతిధులూ, నక్షత్రాలూ చెడువి ఉండవు. చెడుమనస్సు లేకపోతే అంతా శుభమే, మంచే.
మడుగుకు జని కాళింగుని – అనేపద్యంలో భగవంతుని పాదాలు స్మరించి తరించాలనే బోధ ఉంది.
దేవేంద్రుఁ డలుకతోడను
వావిరిగా ఱాళ్లవాన వడిఁ గురియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకులఁ గాచు కొరకై కృష్ణా!
-ఈపద్యంలో భగవంతుడు భక్తు లనుకాపాడాను కొండలు ఎత్తుతాడూ, అవసరమైతే పిండికూడా చేస్తాడు. భగవత్ కృపపొందను కేవలం మనం భక్తికలిగి ఉండి అంతా ఆయనమైద వదిలేయడమే.
అంగన పసుపున ధోవతి
కొంగున నటుకులను ముడిచి కొనివచ్చిన యా
సంగతి విని దయ నొసఁగితి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా!
ఈ పద్యంలో భగవంతునికి ధనిక పేద అనే భేదమేలేదని తెలుస్తున్నది.అంతేకాక సాధారణ మానవులు ధనమో, పదవో రాగానే పూర్వపు స్నేహితులను మరచిపోయినట్లు నటిస్తారు. భగవంతుడు భక్తినిమాత్రమే గమనిస్తాడు. మనం భక్తితో అర్పించేప్రసాదం ఖరీదైనదా! చవుకైనదా అనే తేడాకూడా ఉండదు. కేవలం మనస్పూర్తిగా, భక్తి భావంతో ఇస్తున్నామా లేదా అన్నదే చూస్తాడు భగవానుడు.
గురువువద్ద విద్యాభ్యాస సమయాన తన భాగం అటుకులను తిన్నాడనే కోపం లేక దయతో అనుగ్రహించడం దైవగుణం. సాధారణ మానవులకు హెచ్చరిక , గతాన్ని మరచి ప్రస్తుతాన్ని గమనించి సదా మంచిగామెలగా లని సూచన.
అంతేకాదు మానవులకు బోధించేమరో చక్కని నీతి- భార్యా , భర్తా ఎక్కువ తక్కువలు లేక చర్చించుకుని ఏపనైన ఎలాచేయాలో నిర్ణ యించుకుని చేస్తే తప్పక ఫలిస్తుందనేబోధ. అంగన పనుపున అనే పద్యంతో శతకాకారుడు శ్రీకృష్ణునివద్దకు వచ్చిన కుచేలుడు భార్య చెప్పి, కృష్ణ కారుణ్యాన్ని వివరించి తప్పక అనుగ్రహిస్తాడు వెళ్ళి రమ్మంటే వచ్చి,దైవానుగ్రహమూ ,సంపదలూకూడా పొందగలిగాడు. అంటే కుటుంబంలో పరస్పర అనుకూలత ఉండాలని హెచ్చరిక.
హా వసుదేవకుమారక! కావుము నా మానమనుచుఁ గామిని వేడన్ – ఈ పద్యం చదివేప్పుడు మనం ద్రౌపది భక్తికి సంబంధించిన ఒక సమాచారాన్ని స్మరించాలి. ద్రౌపది అంటే శ్రీకృష్ణునికి చాలాప్రేమ, ఆయన అష్టభార్యలకు ఒకపెద్ద అనుమానం. స్వంత సోదరి ఐన సుభద్రకంటే ద్రౌపదిని ఎందుకు ఈయన అంత ఎక్కువ ఇష్టపడుతున్నడో అని. సర్వ హృదయవాసి ఐన పరమాత్మను అడగాలా!మన హృదయం లో భావన రాగానే ఆయనకు తెలిసిపోతుంది. అష్టభార్యలను పిలిచి సంక్రాంతి పండుగకు ద్రౌపది ని తమ ఇంటికి పిలుచుకురమ్మని కోరతాడు.వారు ద్రౌపది ఇంటికి వెళ్లేసరికి ఆమె అతిపొడవైన తనకురులను తలస్నానం చేసి ఆరబెట్టుకుంటున్నదిట.కృష్ణుని అష్టభర్యలూ వెళ్ళి ద్రౌపది జుట్టు ఆరబెట్టి చిక్కుతీసి జడవేస్తామని అడగ్గా, కాదనలేక అంగీకరిస్తుందిట. వారు ద్రౌపది జుట్టుతాకగానే ప్రతి వెంట్రుకనుండీ ‘కృష్ణ కృష్ణ ‘ అని కృష్ణ నామం వినిపిస్తున్నదిట.వారికి ఆశ్చర్యం వేసిందిట. అందుకే ద్రౌపదికి కృష్ణ అనేపేరు వచ్చిందిట. అంతాకలసి ద్రౌపది ని తోడ్కొని ఇంటికి వచ్చేసరికి కృష్ణుడు మాయామానుష విగ్రహుడుకదా! సంక్రాంతి అని చెఱకుగడ నోటితో చీల్చుకుని తింటున్నాడుట. ద్రౌపది రాగానే చిఱునవ్వుతో ఆహ్వానించాడుట. ఈలోగా ఆయన నోటితో ఒలుస్తున్న చెఱుకుగడ వ్రేలికి తగిలి వ్రేలు చీలి రక్తం వచ్చిందిట. భార్యలంతా దాసీలను రక్తం కారకుండా వ్రేలికి కట్టను గుడ్డతెమ్మని కేకలేశారుట. అక్కడ ఉన్న ద్రౌపది తన చీర చెంగు బర్రునచించి అక్కడే ఉన్న నీటి పాత్రలో ముంచి కృష్ణుని వ్రేలికి చుట్టిందిట. అది చూసి అష్ట భార్యలూ ఆశ్చర్య పడ్దారుట. భగవంతుడు మానవులచేత తన, భక్తులచేత ముందు ఒక మంచికార్యం చేయించి, వారి ఖాతాలో ఉంచి కష్టం వచ్చినపుడు దానికి వేలవేల రెట్లు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.ఇదే ద్రౌపది విషయంలో జరిగింది. వ్రేలికి చీర చెంగు చింపి చుట్టించి , కౌరవసభ లో ఆమెకు జరుగబోయిన అవమానాన్ని అక్షయ వలువలు ప్రసాదించి కాపాడాడు. అందుకే ఓపిక, ధనమూ, వయస్సూ ,శక్తీ ఉన్నపుడే దానధర్మాలూ, పేదలకు, ఆపదలో వారికీ కష్టకాలంలో సేవ, సహాయమూ చేసి మన దేవుని బ్యాంక్ ఖాతాలో జమచేసుకోవాలి. ఎస్.బి.ఐ లోనో హె.డి. ఎఫ్.సీలో నో కాదు. దైవం బ్యాంక్ లో సేవాధనాన్ని జమచేసుకోవాలి .
భక్తితో ప్రార్థిస్తే ఎక్కువ తక్కువ భావాలు లేక సర్వస్యశరణాగతి ఐనవారికి ఏవిధమైన సేవచేయనైన భగవంతుడు వెనుకాడడు.
దీనికిఉదాహరణ కృష్ణుడు అర్జునుని రథ సారథిగా కురుక్షేత్రంలో రథం ముందుకూర్చుని దుర్జనులను సంహరించను,సహకరించాడు.కనుక భగవంతుడు భక్తికి మాత్రమే వశుడౌతాడని మనం విశ్వసించాలని ఈపద్యం బోధిస్తున్నది.
భక్తుల బ్రోవను భగవంతుడు ఏమి చేయనూ వెనుకాడడు. బ్రహ్మాస్త్రం అభిమన్యుని కుమారుని ఉత్తర గర్భంలోనే చంపేయను వచ్చినపుడు అక్కడికే సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆగర్భస్త శిశువునుకాపాడి పాండవ వంశాన్ని నిలుపుతాడాయన. గొంతెత్తి ఆయన నామాన్ని పలుకుతూ కళ్లారా ఆయన రూపాన్నీ మనస్సులో నిల్పుకుని ఉండటమే భక్తుల కర్తవ్యం.
భక్తులకోసం ఏమైనాచేస్తాడు భగవంతుడు. రాక్షసులు, దేవతలు మంధర పర్వతాన్ని పాలసముద్రంలో ఉంచి అమృతంకోసం చిలికి నపుడు వారి ప్రార్థనమేరకు ఆపర్వతం సముద్రంలోమునిగిపోకుండా తాబేలు రూపంలో మోసిన నీవు ఓ దేవా! భక్తుల ప్రార్థన మన్నించి ఎలాం టిసహాయం చేయనైనా వెనుకాడవుకదా! అంత భక్తిని మనం కలిగి ఉంటే ఎంతటి కష్టాన్నీనా ఆయన తప్పక తీరుస్తాడు. ఒక పువ్వో ,ఫలమో సమ ర్పించి ‘దేవుడు కనిపించడేం!’ అనుకుంటే లాభంలేదు.ఆయనకూ పూలూ, పండ్లూ అవసరంలేదు. స్వఛ్చమైన హృదయయన్నే ఆశిస్తాడు.
దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండు సుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వరయ్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా!
బాల భక్తుడైన ప్రహ్లాదునకు, నీవే సర్వమూ అనీ భావించి శరణాగతులైన పాండవులకూ,నీనామ స్మరణమేచేస్తూ శిలలా పడిఉన్న అహల్యనూ బ్రోచిన ఓ దేవా! నీవేనాకూ దిక్కు.వారంతటి భక్తుడినికాకపోయినా నిన్నేశరణు వేడేవాడిని.ఈ పద్యం మనకు ఏమి బోధిస్తునంది! నిరంతరం నీకు నచ్చిన నీ మనసు మెచ్చిన భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించమని.
పాలను వెన్నయు మ్రుచ్చిలఁ ఱోలను మీ తల్లి గట్ట రోషముతోడన్ – ఈపద్యంలో వెన్న దొంగిలించాడని గొల్లవనితలు యశోదమ్మకు ఫిర్యాదుచేయగా రోషంతో యశోదమ్మ రోటికి కట్టగా దాన్ని లాక్కుంటూ వెళ్ళి మద్దిచెట్లను పడగొట్టి యక్షుల శాపవిమోచనం చేసిన లీలావినోదీ ఓదేవా! నన్నూ అలా ఉధ్ధరించి ఈ ప్రపంచంలో నేను తెలిసో తెలియకో చేసిన పాపాల నుండీ విముక్తిగావించు ప్రభూ!
ఇక్కడ వెన్న అంటే మహాభక్తులైన గొల్లల హృదయమనే వెన్న అన్నమాట.
దండమయా! విశ్వంభర!
దండమయా! పుండరీక దళనేత్ర హరీ!
దండమయా! కరుణానిధి!
దండమయా! నీకు నెపుడు దండము కృష్ణా!
-ఈ కృష్ణా! నిరంతరం నీనామం స్మరిస్తూ నీపాదములకు వందనం చేసుకుంటాను, నన్ను దయచూడుము, దండం పెట్టడం అంటే కేవలం చేతులు జోడించడం కాదు, పంచ జ్ఞానేంద్రియాలనూ, పంచ కర్మేంద్రియాలనూ, పంచకోశాలూ, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, మనస్సు కలిపి జీవాత్మతో జోడించి 21 అంశాలనూ పరమాత్మకు సమర్పించడం. అలాచేసే దండం ఒక్కటిచాలు.
అనుదినము కృష్ణశతకము
వినిన పఠించినను ముక్తి వేడుకఁ గలుగున్
ధనధాన్యము గోగణములు
తనయులు నభివృద్ధి బొందుఁ దద్దయ కృష్ణా
– అంటూ శతక కర్త కృష్ణనామమహత్వాన్ని ఉటంకిస్తూ ముగించారు.
భారద్వాజసగోత్రుఁడ
గారవమున గంగమాంబ కరుణాసుతుఁడన్
పేరు నృసింహ్వాయుఁడను
శ్రీరమయుత! నన్నుఁ గావు సృష్టిని కృష్ణా!
— చివర్లో తన గోత్రనామాలను , తల్లితండ్రులనామాలను చెప్పుకుని భగవంతునికి అర్పణచేశారు శతక కర్త నరసిం హకవి. మనం వారికెంతో ఋణపడి ఉన్నాం, ప్రతి పద్యం లో కృష్ణ మహత్వాన్నీ , భక్తులనామాలనూ, భగవంతుని కృపకు పాత్రులైనవారినీ ఉదహరిస్తూ వారిలా మనలనూ భగవదనుగ్రహానికి నోచుకోమని వివరించారు.
ఈనాడు బాలబాలికలకే కాక మానవులందరికీ , పరుగెత్తేకాలంతోపాటు పరుగులుపెడుతూ శతకలాగురించిన అవగాహనలేకపోడం విచారకరం. పుస్తకం.నెట్ వారు ఇలా శతకాల గురించీ కొంత తెలియజేయ సంకల్పించడం ముదావహం.
భగవత్ కృపతో మరికొన్ని శతకాలలోని నీతులనూ, ధర్మాలనూ మానవతావిలువలను తెలుసుకుని, ఆచరించను ప్రయత్నిద్దాం.
[వికీసోర్సు లో కృష్ణశతకం ఇక్కడ చదవవచ్చు -పుస్తకం.నెట్]
Leave a Reply