‘‘జీవన సంధ్య’’ – షేక్ అహ్మద్ బాషా కథలు

వ్యాసకర్త: కాళ్ళకూరి శేషమ్మ

************

షేక్ అహ్మద్ బాషా గారు వ్రాసిన కథల సంపుటి ‘‘జీవన సంధ్య’’ అనే పుస్తకం శ్రీ దేవినేని మధుసూదన్ గారు పంపేరు. ఇంతమంచి కథలు ఆపకుండా చదివించేసి, హృదయాన్ని పరవశింపచేసేయి. గుండె నిండా అనేక భావాలు – ఆనందం విస్మయం, విషాదం, వేదాంతం, తపన – అన్నీ ముప్పిరిగొని, గుండె భారమయింది.

ఇంతమంచి కథలన్నీ ఒక చోట చేర్చి ప్రచురించిన వారి కుటుంబ సభ్యులకు, ముందు మాటను వ్రాసిన ‘విహారి’ గారికి ప్రచురణ కర్తలకు కృతజ్ఞతలు.

ఈ పుస్తకంలోని సింహభాగం కధలు జర్నలిజంలో విలువలకు పెద్ద పీటవేసి, ఉత్తమ రచనలను, సమాజానికి పనికి వచ్చే, ప్రేరణ నిచ్చే అంశాలను ఆదరించి, అనుసరించ తగినవి ఎంపిక చేసి ప్రచురించే రామోజీ గ్రూప్ ఫౌండేషన్ వారి పత్రికల్లో వచ్చినవే, కథల విషయంలో ఇదే ఒక గొప్ప సర్టిఫికేట్! అని మనం భావించవచ్చు.

పుస్తకంలో ఇరువది కథలున్నాయి. కొన్నింటిని ఎంపిక చేసి వానిని సమీక్షించే ప్రయత్నమిది. ఎంపిక కష్టమే -కాని మరీ మనస్సును లాగిన కథలను విశ్లేషించుట జరిగింది.

పుస్తకానికి మకుటం — మొదటి కథ ‘‘జీవనసంధ్య’’. అత్యంత సహజంగా మధ్యతరగతి కుటుంబాల బాంధవ్యాలు – దంపతుల అన్యోన్యత, సంతానానికి తమ తల్లిదండ్రులపై గల ప్రేమాభిమానాలు అద్ధంలో ప్రతిబింబంలా కన్పించాయి. నిత్య జీవితంలో కూరగాయల అరసరం, విశిష్టత, వాని ఎంపిక వైవిధ్యం వీనితో పాటు ఆ తండ్రి తాపత్రయం- తన కుటుంబ సభ్యులకు మంచి ఆహారం లభించాలనే తపన, కళ్లకు కట్టినట్లు సాగింది కథ.

‘‘ఓకే టాక్సీ’’ – ఈ కథ మానవ సంబంధాలను సునిశితంగా పరిశీలించేలా రచించారు. ‘‘ధన మూల మిదం జగత్’’ – డబ్బులో సగం అగచాట్లు, అఱ్ఱులు చాచి సానా పాట్లు పడి, ఆత్మీయబంధాలనూ బాంధవ్యాలను తెంచుకొని మనిషి తన చుట్టూ అడ్డుగోడలు కట్టేసుకుని స్వార్థ పూరితుడయి – పనులు సాధించుకొని గర్విస్తున్న రోజులివి. అయితే ఇక్కడ రచయిత  మహోన్నతమైన విలువలకు పట్టంకట్టి, ఆస్వార్ధాన్ని తుత్తునియులు చేసిన విధానం చదువరుల మనస్సులకు విశేషానందం ఇస్తుంది టాక్సీ నడిపే రాజు భలేచోదకుడు. కారును చక్కగా, జాగ్రత్తగా నడపగలడు, గమ్యం చేర్చగలడు, చెవులకు కూడపని చెప్పగలడు, ‘‘జీవితాన్ని ‘‘చదివి’’ గుణపాఠాలు నేర్వగలడు- అబ్బో రాజు’ సామాన్యుడు కాడు! భార్యాభర్తల సంభాషణ ప్రస్తుత సమాజంలో వయోవృద్ధుల ఎదుర్కొంటున్న బర్నింగ్ టాపిక్, 1980ల్లను 90ల్లోనూ వరకట్నం – వరకట్న చావులు -రెవెలుకు ఇప్పుడు ఇవి చేరుకున్నాయి‘ ‘ సీనియర్ సిటిజన్లండీ’’!- ఇది వారికి ముద్ర – వారిపని అయిపోయింది-సంపాదించారు, పెళ్లి చేసికొని బిడ్డలనుకన్నారు, సరే – పెంచేరు, పోషించేరు -విద్యాబుద్ధులు చెప్పించేరు పొదుపులేని ఆస్తులు కూడబెట్టేరు.

ఇదేకాక – అవసరాలకు- అన్నిరకాల చాకిరీలు చేసేరు. వాళ్లు తమ విధి నిర్వహణ చేసేరు-ఇవన్నీ మామూలు ఆఫ్టరాల్ రొటీన్!- అయితే నేటి యువత విస్మరించేవి ఏమంటే – తమ పెద్దల పట్ల బాధ్యత ఎలా చూపాలి, Burdon గా, తమ స్వతంత్రాన్ని హరించే శత్రువులుగా – పోనీ parasites గా చూడరాదు కదా.

ఈ విషయంలో కోడలే కాదు, కూతురు కూడా ఏ మాత్రం తగ్గుటలేదు కూతురు కూడ తల్లిని వంటమనిషిగా, కాపలాదారుగా పనిమనిషిగా వాడుకుంటున్నది. తండ్రిని కూరగాయలు, కిరాణా, పాలు పెరుగు తేడానికి, పిల్లల్ని స్కూలుకు, ట్యూషన్లకు, పార్కులకు తీసికొని వెళ్లే సేవకునిగా వాడుతున్నది. మానవత్యపు విలువలు చరమాంకం చేరుకుంటున్నాయి. ఈ విషయంలో కూడ రచయిత ఆశాభావంతో కథ నడిపేరు. చివరికి డైవర్ రాజు తన తల్లిని టాక్సీ ఎక్కించుకుని, ఇంటికి తెచ్చి ‘‘ఇక్కడ నించి అమ్మ ఇక్కడే వుంటుంది’’ అని గట్టిగా భార్యతో చెప్పడం ‘ఓకే టాక్సీ’ కథకు హైలైట్?

నేటి సమాజంలో యువతకు డబ్బు వుంది. ఏదో విధంగా సంపాదిస్తున్నారు. కొందరికీ పెద్ద ఇళ్లు కూడ వున్నాయి. కాని వాళ్ళ మనస్సు హృదయాలు ఇరుకుగా వున్నాయి. మార్పు వస్తే మంచిదే. ‘‘ఒకే టాక్సీ’’లో రాజు తల్లి తినీ, తినక, మనవల కోసం డబ్బు దాచి, అందించడం హృదయాన్ని కలచివేసింది.

‘ఉత్తరం’ కథ ఓ కనువిప్పు, కాంక్రీటు అడవుల్లా ఇళ్ల స్థలాల్లో ఒక అంగుళం మిగల్చకుండా నిర్మించేసి అద్దెల రాబడికి ప్రధానం చూపేవారు ఎందరో! చెట్లు ప్రాణికోటికి జీవనాధారాలు. పచ్చదనం ఇచ్చి శబ్దాది అనేక కాలుష్యాల నుంచి రక్షించి స్వచ్ఛ గాలినిస్తాయి.. ఏ ACలూ దిగదుడుకు కదా ఆగాలి ముందు? అలాంటి కల్పతరువులను దూరం చేసుకునే బ్రతుకులు దుఃఖభూయిష్ఠాలు. దీన్ని ‘ఉత్తరం’ ద్వారా కథలో చూపడం ఎంతో అందంగా వున్నది.

‘‘వీడ్కోలు’’ కథ ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి కట్టెదుట నిలిపింది. అతడొకశిల్పి – ఫిలాసఫీలో గురువును దైవమని, అంధకారం నుండి వెలుగును చూపే కరదీపిక అని, ఒక దీపం నుండి మరో దీపం వెలిగించే వత్తి అని, వీధిలో వరుసగా నెలకొల్పిన స్తంభాలపై నున్న దారి దీపమనీ చెప్తారు. ఉత్తమ విలువలు పిల్లలకు నాటుకోవాలంటే ఉపాధ్యాయుని వల్ల మాత్రమే సాధ్యం! కధ హృదయలగమం ‘‘సందేశం’’ కధ ‘వీడ్కోలు’కు సమాంతరంగా నడిపేరు బాషాగారు.

అమాయక యువకుడు – మట్టి ముద్ద లాంటివాడు. అద్భుతం జరిగింది! అతని జీవితం – ఓ మహనీయుని దృష్టిలో పడటం భాగ్యం! ఇంకేముంది. యువకుడు మంచి వ్యక్తిగా మలచబడి  మంచి పోలీస్ ఆఫీసర్ అయేడు. అంతేకాదు, ఉత్తమ విలువలున్న వ్యక్తి గా బాధ్యతగల అధికారిగా అందరి ప్రశంసలూ పొందేడు.

‘‘బాబోయ్ హాస్పత్రి’’- ఒక మనిషి రాక్షసుడయి విజృంబిస్తే ఎంత నాశనమవగలదు? ఎందరు అమాయకులు బలి అవుతారు ‘‘వైద్యో నారాయణో హరిః’’ అన్నది ఆర్యోక్తి. పాశ్చాత్యులు కూడ! ‘‘హిప్పోక్రేట్స్’’ విగ్రహం వద్ద వైద్యకళాశాలలో ప్రవేశించిన విద్యార్థుల చేత ప్రమాణం చేయిస్తారు – ఆవృత్తి పవిత్రమైనదని, – విలువలు కాపాడుతామని, అంకితభావంతో పని చేస్తామని, అట్టివారికి మాత్రమే వైద్యులమే అర్హత! అదే అదీ ఆవృత్తి స్థాయి.

వెనకటిరి ఒకచోట చదివేను ‘‘నువ్వు హైదరాబాద్ ఎందుకు వెళ్లేవూ’’ అని ఓ కస్సన్న మరో బుస్సన్నను అడిగితే ‘‘ఏముందీ కాస్సేపు ఎండలో కూర్చుని గాలి పీల్చుకోడానికి అన్నాడట’’…. డబ్బు సంపాదించడానికి, కోట్లు కూడబెట్టడానికి ఈ మార్గాన్నే ఎంచుకోవాలా? రోగులను అమాయకులను చేసి వారి అవయవాలను తొలగించి దొంగిలించి వ్యాపారం చేయాలా? పవిత్రమైనవృత్తిని ఇంత దిగజార్చాలా? వద్దు బాబోయ్ వద్దు.

‘‘న్యాయం గెలిచింది’’ – మరో గొప్ప ఇతివృత్తం. పుస్తుతం ఇది Hot topic. తల్లిదండ్రుల సిరి సంపదలతో, పలుకుబడితో అధికార దర్పంతో, వాళ్ళు చేసే గారాబాలతో పిల్లలు ఎలా తయారవుతున్నారు! ప్రాణాలను తృణప్రాయంగా చూస్తున్నారు. క్షణికమైన ఆవేశ ఆనందాల కోసం వెంపర్లాడుతున్నారు అట్టి యువత (ఆడపిల్లలు కూడాను) నిర్లజ్జగా దొంగతనాలు చేస్తున్నారు పైగా అదో chivalry – challenge – sport -అని భావిస్తున్నారు. నేను B.Ed లో వుండగా, (1983-84) మాసైకాలజీ మేడమ్ ఓ సంఘటన గురించి చెప్పేరు. ఒక బంగ్లాలో ఒక ఉదయం-చిరుచీకటి వేళ ఓ యువకుడు పోర్టిలోలోని కారు టాంక్ నుండి ఓ pipe ద్వారా పెట్రోలు 2,3 టిన్నులలో నిండి పట్టుకున్నాడని, గోడ దూకడానికి ముందు దొరికిపోయేవాడో మనకు. తీరా ఆ పిల్లవాడు ఆ వీధి చివర బంగ్లాలో కోటీశ్వరుడైన ప్రముఖవ్యాపారవేత్త ‘ముద్దులకొడుకు’ – అని! ఆహా! ఈనలభై సంవత్సరాల కాలంలో ఇలాంటి నేరాలు ఇంతలు ఇంతలయ్యేయి. ఇదోహీరాయిజం! ఆ డబ్బు మీద మాదకద్రవ్యాలకు వాడి, యువత నిర్వీర్యమవుతోంది – బాటసారులైన మహిళల మెడల్లో గొలుసులు లాగడము, సెల్‌ఫోన్లు, ఉంగరాలు గడియారాలు – అన్నీ – విలువైనవి వారి వశమే ! ప్రస్తుతం పెద్దలు తలలు పట్టుకోవాల్సిన అంశం ఇది well done బాషాగారూ. ‘‘వైద్యోనారాయణో హరిః’’ రమ్యంగా రమణీయంగా నడిపేరు ఆదర్శవంతమైన వైద్యుడు, ప్రముఖ హృద్రోగ నిపుణుడు, వయోవృద్ధుల ఆరోగ్యానికి శ్రీరామరక్ష. వారి మాటలన్నీ ఓర్పుతో విని విసుక్కోకుండా వృత్తి నిర్వహణ చేసిన డాక్టరుగారు. అప్పుడప్పుడు సహనం కోల్పోవడమూ సహజమే! చివరికి, తన గురించి తన పేషంటు చెప్పిన తుంచి మాటలు విస్మయానికి గురిచేసేయి. వృత్తి పట్ల మరింత నిబద్ధత, ఆరాధన పెంచుకున్న ఈ వైద్య నారాయణునికి నమస్తే! –

‘వరదలు’ కథ – ఇతివృత్తం నేడు ఎంతో relevant, ఇదో పెద్దసమస్య; నగరాలు పెరిగి పోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చిన్న చెరువులూ మూసేసి ఇండ్లస్థలాలుగా చూపి అపార్టుమెంటులు, కాలనీలు, భవనాలు నిర్మిస్తున్నారు.

డ్రైనేజి సిస్టమ్ ఉండదు. వర్షం నీరు పోయేదారేలేదు. చెన్నై అంతే – హైదరాబాదు కూడ అంతే – ఇలా నగరాలు పెరుగుతూ అదే బాటలో వున్నాయి. అక్కడ నిర్మాణానికి అనుమతి ఎవరిచ్చేరు? నియమ నిబంధనలు ఉండవా? పన్నులు చెల్లిస్తూ ఇంట్లో చెట్ల ఆకులు, బొమ్మలు, వీధిలో వేస్తే వందరూపాయలు జరిమానా! పెద్ద అరుపులు! మరి వారి తప్పులు తెలియవా ప్రతిసంవత్సరం వర్షాకాలం వస్తే జనమంతా భయం గుప్పెట్లోనే సామాన్యులూ, ధనికులూ కూడా నరకం చూస్తున్నారు తుఫానుల సమయంలో! కథలో మానవత్వపు విలువలు మూర్తీ భవించేయి. నిరుపేదలు అనుకున్న దారిలో గల మానవతా విలువలు, తెగింపు, ధైర్యం, నిస్వార్థం త్యాగబుద్ధి – ఆహా – ‘మానవుడు మహనీయుడని’ జోహార్లు చెప్పక తప్పదు. బంగ్లాలో నివసిస్తున్న పెద్ద మనుష్యులకు, వారు చేసిన సాయం గొప్పది. సైకాలజీలో ఉన్నతవిద్య పొంది ఉద్యోగం నిర్వహిస్తున్న మహిళ జీవితాన్ని, విలువలను – ఇలా సూటిగా నిజాయితీగా చెప్పడం ఈ కథకు ఆయువుపట్టు!

‘‘కాకి బంగారం’’ ఈ కథలో రైతు ఆడబిడ్డ వేరే బంగారం. ఆమె అసలుసిసలైన 24 కేరట్ల బంగారం! రైతు కష్టించి ఆరుగాలాలూ కృషిచేస్తేనే మహారాజు కూడా కడుపునిండా తిని నిద్రపోగలడు. ఈ వాస్తవాన్ని వారు గ్రహిస్తున్నారా? ఏడువారాల నగలూ ధరిస్తారు మంచిదే కాని ‘‘బంగారాన్ని’’ పండించే రైతు స్ధితి చూడాలి కదా! జాతికి వెన్నెముక రైతు. – చిన్న కథ, పెద్ద సందేశం.

పెంపకం:- ఇది న్యాయం గెలిచింది కథకు మూలంలా తోచింది. నేటి యువత తప్పుదోవలో వెళ్తున్నారంటే కారణం ప్రాథమికంగా తల్లిదండ్రులే! వారి జీవనశైలిలో మార్పులు, వ్యష్టి కుటుంబాలు, తండ్రికి దురలవాట్లు – ఒకరులేక ఇద్దరు పిల్లలు – అతి గారాబం పిల్లల్ని ఏ విధంగానూ క్రమశిక్షణలో పెట్టకపోవడము;- పైగా విపరీత ధోరణిలో స్నేహాలు:- జన జీవనం పూర్వం విలువలు కోల్పోయింది. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు – వచ్చేక పిల్లలు స్నేహాలపేర ఎన్నో అనర్ధాలు కల్గుతున్నాయి  ‘‘Demonstration effect!’’ స్నేహితులు, రోజులో కొత్త bike, Car, gadget, cell phone, play stations, Vide games parting, జల్సాగా groups going to hotels – ఖర్చులూ పెరిగేయి. పిల్లల పొగరు, అహంకారము పెరిగేయి. తల్లిదండ్రుల చేతులు దాటి పోయేరు. ఇలాంటి వ్యవస్థలో వారి పెంపకం కత్తి మీద సాము – పరిష్కారాలు ఏమిటి? సభ్య సమాజం ఆలోచించవలసిన జటిల సమస్య ఇది.

ధ్యానం కథలోని విషయ వివరణ, కధనమూ కూడ రచయిత ఆలోచనా సరళి పరిణితిని తెల్పుతున్నది. నమస్కారమండి. ధ్యానమంటే ముక్కుమూసుకోవడమా, అడవుల్లో ఆకులు అలముల తినడమా, కుటుంబంతో, ధర్మపత్నితో బంధం నెట్టి పారిపోవడమా?- బలేపశ్నలు –‘‘ఎక్కడోలేడులే దేవుడూ, నువ్వెక్కడుంటె అక్కడే వున్నాడు’’ అనే పరమసత్యాన్ని అందించేరు. మానవునిగా పుట్టినందుకు మమతానురాగాలను పంచి, ప్రకృతిని పరిరక్షించడమే ధ్యానం అన్నముక్తాయింపు అద్భుతం.

‘‘ఫిల్టర్ కాఫీ’’- ఇది కథ కాదు జీవిత సత్యం! అది తాగిన వారికే తెలుస్తుంది ఆ రుచి! ఇక ‘‘అలవాటు’’ వుంది చూసేరూ-ఇది ఒక బలహీనత, కాని అదే బలం, ఉత్తేజం, తృప్తి కూడాను. ఫిల్టర్‌లో తగిన కాఫీ పొడి వేసి, లెవెలుకు సర్ది ఆదిమ్మను నొక్కినీరు మసిలించి తగిన కొల్త మాత్రమే పోసి అది దిగాకే అప్పుడే పొంగిన పాలు, పంచదారలతో కలిపి సేవిస్తే- అది అమృత తుల్యం.

సుప్రభాతం దివ్యంగా వుంది-ఆరోజు హాయిగా గడుస్తుంది.. ఇక్కడు పెద్దాయనకు చిక్కు భార్య మారణం. వంట ఇంట్లోకి వెళ్లలేడు; అది కోడలి సామ్రాజ్యం కదా. పాపం, ఇంత చిన్న అలవాటు ఎన్నివి మధ్యలకు దారితీసిందో, నాకళ్లు వర్షించేయి; బాధతో- నాకూ ఉంది అలవాటు . ‘‘ఏప్రిల్ ఫూల్’’ కధ – ప్రభుత్వోద్యోగుల్లో నరనరాల్లో ఇంకిపోయిన వలసరాజ్య పాలనలోని లంచాల కొనసాగింపు – అరే బాబూ! అది పరాయి పాలన – తలాపాపం తోలాపిడికెడు. సరే, దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నేళ్లయింది? రెవెన్యూ డిపార్టుమెంటుకు ఏనుగు చర్మం. ఓ సామెత గుర్తొచ్చింది ‘‘కంసాలి తన భార్య మంగళ సూత్రం గొలుగులో కూడ బంగారం కల్తీ చేస్తాడు’’. ఈ జాడ్యానికి అతీతంగా జాతి ఎదిగేది ఎన్నడో!

ముఖచిత్రమే అద్భుతంగా వుంది. మధ్యతరగతి మధురిమలు ఉట్టిపడ్డాయి. కధలన్నీ ఆణిముత్యాలు. ఆనందంతో చదువరులు నెమరువేసివాని, మళ్లీ చదువుతారు.

శ్రీ దేవినేని  మధుసూదన్ గార్కి మరోసారి, వారికి పుస్తకాల పట్ల గల అనురాగం, ఎంపికకు జోహార్లు అందిస్తున్నాను.

You Might Also Like

Leave a Reply