పగులు- తాడికొండ కె. శివకుమార శర్మ

వ్యాసకర్త: నాదెళ్ళ అనురాధ

***********

 తాడికొండ కె. శివకుమార శర్మ గారు రాసిన “పగులు” 2022 సంవత్సరం ఆటా నవలల పోటీలో బహుమతి పొందిన నవల. 

క్లుప్తంగా …

కథా నాయకుడు శశి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తండ్రి అతనికి చిన్నప్పటినుంచీ రామాయణ భారతాలను, భగవద్గీతను చదివించటంతో పాటు సంస్కృత శ్లోకాలకు అర్థాలను విడమర్చి చెప్పి వాటి పట్ల ఆసక్తి, అవగాహన కలిగించాడు. చదువు కుంటే అందే ఉన్నత జీవన ప్రమాణాలను గురించి తల్లి చెపుతుంది. అక్క డాక్టర్. తనతో పాటు చదువుకున్న వ్యక్తిని ఇష్టపడి పెద్దల ఆమోదంతో పెళ్లిచేసుకుంటుంది. 

శశి ఇంటర్ మీడియట్ చదువుతుండగా కాలేజీ కి వెళ్లే దారిలో నిత్యం ఎదురయ్యే ఒక అమ్మాయి పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఆమె తమ కాలేజీలోనే చదువుతున్న కిశోర్ చెల్లెలు శిరీష అని స్నేహితుడి ద్వారా తెలుసుకుంటాడు. ఒకరోజు స్నేహం చెయ్యాలనుందంటూ ఆమెకు చెప్పేస్తాడు. ఆమె తిరస్కరిస్తుంది. పైగా మరునాడు ఆమె అన్నయ్య నుంచి వచ్చిన బెదిరింపును శశి స్నేహితుడు మోసుకొస్తాడు. అతని మనసులో ఆమెపట్ల ఏర్పడిన తొలి ప్రేమ గాఢంగా నిలిచిపోతుంది.  

చదువులో రాణిస్తూ అంచెలంచెలుగా మద్రాసు ఐ. ఐ. టి. నుంచి మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్తాడు. ఐ. ఐ. టి. లో ప్రొఫెసర్ స్వామినాథన్ తో సాన్నిహిత్యం అతనిలోని విద్యార్థికి మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. అమెరికా లో అవకాశాలు అతనిలోని విజ్ఞాన తృష్ణని ఇంకాఇంకా పెంచుతూనే ఉంటాయి. అతని ఆసక్తిని అర్థంచేసుకుని ప్రోత్సహించే మిత్రులు, ప్రొఫెసర్లు దొరుకుతారు. చదువులో మునిగిపోయినా శిరీష ఆలోచన అతన్ని వెన్నంటే ఉంటుంది. ఐ. ఐ. టీ. లో ఉండగా ఒక మిత్రుడు ప్రొఫెసర్ కూతుర్ని ఇష్టపడి, తను ఆమెను తప్పక పెళ్లి చేసుకుంటానని, తనలాటి తెలివైన విద్యార్థిని ఆమె తండ్రి కాదనడని ఆత్మ విశ్వాసంతో చెప్పటం శశికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

చిన్ననాటి మిత్రుడు శిరీషకి పెళ్లి కుదిరిందంటూ రాసిన ఉత్తరం శశిలో గుబులు పుట్టిస్తుంది. స్నేహితురాలు మేరీ ఇచ్చిన ప్రోత్సాహంతో ధైర్యం చేసి శిరీష తండ్రి డా. గోపాలరావు గారికి ఉత్తరం రాస్తాడు. శిరీష పట్ల తన ఇష్టాన్ని, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనని తెలియచేస్తాడు. అతని చదువు పట్ల గోపాలరావు గారి కుటుంబానికి అవగాహన లేక కొంతకాలం తాత్సారం చేసినా పెళ్లి జరిపిస్తారు. ముందునుంచి శశి పట్ల ఒక నిరసన భావం, అతని కుటుంబం పట్ల చిన్న చూపు గోపాలరావుగారు, ఆయన భార్య సీతగారు వ్యక్తపరుస్తూనే ఉంటారు. 

ఒక సినిమాలో చూసిన రొమాంటిక్ దృశ్యం అతని మనసును హత్తుకుంటుంది. దానిని అనుకరిస్తూ పెళ్లిలో శిరీషని ఎత్తుకుని గిర్రున తిప్పాలనే ప్రయత్నంలో అనుకోని ప్రమాదం జరిగిపోతుంది. ఆ వేదిక మీదనుంచే అతని కలలకూ, భవిష్యత్తుకూ పగులు ప్రారంభం అవుతుంది. చిన్న పగులు. సరిచేసి అతికించి ఉంటే దానిని అధిగమించే అవకాశం ఉండేది. అలాటి ప్రయత్నం అతని ఒక్కడివల్లా సాధ్యం అయ్యేది కాదు. ఏళ్ల తరబడి అది మరింత పెద్ద పగులుగా మారి శశి జీవితం పట్ల కన్న కలని భగ్నం చేస్తుంది.

కథను మరింత వివరంగా చూద్దాం…

ప్రేమించే కుటుంబ సభ్యుల మధ్య, మనసుకు దగ్గరైన స్నేహితుల మధ్య శశి అందమైన బాల్యాన్నిఅనుభవించినవాడు. జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని, ప్రేమని పెంచుకుంటాడు. ప్రతి సందర్భంలోనూ అతని గొంతులో సినిమా పాట కూనిరాగమయ్యే భావుకత. 

చదువులో రాణిస్తూ మద్రాసు ఐ. ఐ. టి. లో చేరతాడు. ప్రొఫెసర్ స్వామినాథన్ గారితో తన సందేహాలు నివృతి చేసుకుంటుంటాడు.

హైడ్రోజన్ కన్నా బరువైన మూలధాతువుల్లో న్యూక్లియస్ లో ఒకటికన్నా ఎక్కువ ప్రోటాన్లుండి, అవన్నీ సజాతి ధృవాలైనపుడు వికర్షించుకోకుండా ఎలా ఉన్నాయని అడిగినప్పుడు ఆయన సజీవమైన ఉదాహరణ చెపుతారు. బయటకు వేర్వేరు రూపాలలో కనిపించే భార్యాభర్తల మధ్య పిల్లల రూపంలో స్ట్రాంగ్ న్యూక్లియర్ శక్తులు పనిచేసి కుటుంబాన్నిపట్టి ఉంచేందుకు తోడ్పడతాయని చెపుతారు. ఇలాటి కారణాలతో కాక తన సహచరితో అన్యోన్యమైన జంటగా బ్రతకాలని స్వప్నిస్తాడు.

ఆయన ద్వారా విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచనా విధానమనీ, అది తెలియనిదాన్ని ఎలా తెలుసుకోవాలో నేర్పే ఉపకరణమని శశి వింటాడు. ఆయన మాటల్లోనే అభిషేక మంత్రాలనీ, శాంతి మంత్రాలనీ కూడా కవిత్వంలా ఆస్వాదించవచ్చని తెలుసుకుంటాడు. అయితే మంత్రాలను చెప్పే పూజారులైనా మనస్ఫూర్తిగా ఆ పని చేస్తారా అని అడిగినప్పుడు,

మన మాటలు, చేతలు ఎదుటివాళ్లకి మనమేమిటో అవగాహన ఇస్తాయి. కానీ మనలోపల ఎంత చీకటుందో, ఎంత రాక్షసత్వముందో మనక్కూడా తెలిసే అవకాశం లేదు. ఒక్కక్క పరిస్థితిలో మన గురించిన ఎరుకకి మనమే ఆశ్చర్యపోతుంటాం అంటారాయన.

చిన్ననాట తలిదండ్రులు నేర్పిన ఆధ్యాత్మికను ఆలోచించే వయసు వచ్చేక వదిలేస్తాడు. తల్లి ఆక్షేపిస్తే ఆమెను తృప్తి పరిచేవిధంగా ప్రవర్తిస్తాడు. స్వామినాథన్ గారు చెప్పిన హోలోగ్రాం అవగాహనకొస్తుంది. పైకి కనిపించేది కాక లోపల కనిపించని డొల్లతనం అందులో ఉంటుందన్నది అర్థమవుతుంది. నిత్య జీవితంలోనూ, చదువు, పరిశోధనల్లోనూ స్వామినాథన్ గారి మాటలను అన్వయించుకుంటూంటాడు. పై చదువుల కోసం అమెరికా వెళ్తాడు.

ఐన్ స్టీన్ పనిచేసిన యూనివర్సిటీ చూసేందుకు ప్రిన్స్ టన్ వెళ్లిన శశిలో అకస్మాత్తుగా భౌతికశాస్త్రంలో పి. హెచ్. డి చెయ్యాలన్న కోరిక కలుగుతుంది. అక్కడ పరిచయమైన నీల్ స్నేహంగా మాట్లాడతాడు. శశికి కలిగిన ఆలోచనను ప్రోత్సహిస్తాడు. 

విద్యార్థి జీవితంలో పరిచయమైన మేరీ అతనికి మంచి స్నేహితురాలవుతుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ జార్జ్ ఒక పియానిస్టు. అతని వల్ల గర్భవతి అవుతుంది. శశి, మేరీల స్నేహాన్ని గురించి జార్జ్ తప్పుగా మాట్లాడతాడు. మేరీ జార్జ్ ప్రవర్తన నిరసించి అతనికి దూరంగా జరుగుతుంది. ఉద్యోగంలో చేరి బిడ్డను కంటుంది. జార్జ్ శశి పట్ల అకారణ ద్వేషాన్ని పెంచుకుంటాడు. శశి జీవితం విషాదగీతంగా ముగిసేందుకు జార్జ్ ఈర్ష్యాద్వేషాలు కారణమవుతాయన్నది ఎవరూ ఊహించలేనిది. 

మేరీ సాయంతో ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో తాను పి. హెచ్. డి చెయ్యాలనుకుంటున్నట్టు ప్రొఫెసర్ కి ఉత్తరం రాస్తాడు. తనకున్న అర్హతలతో అనుకున్నది సాధిస్తాడు. తను ప్రేమిస్తున్న శిరీషకి పెళ్లి కుదిరిందన్న విషయం మేరీకి చెప్పినప్పుడు ఆమె ప్రోత్సాహంతోనే శిరీష తండ్రికి తన మనసులో మాట తెలియజేస్తాడు. అది అతని పెళ్ళికి దారి తీస్తుంది. ఇలా శశి జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో మేరీ వెన్నంటి ఉంటుంది.                          

                       వ్యక్తిత్వం ఏర్పడుతున్నలేత వయసులో శిరీష పట్ల కలిగిన ఆకర్షణ ఏళ్లు గడుస్తున్నకొద్దీ మరింత బలపడుతుంది. తామిద్దరికీ ఒకరినొకరు అర్థం చేసుకునే దగ్గరతనం పెళ్లి ముందు సాధ్యం కాదని తెలుసు. ఆమెను పెళ్లి చేసుకునే ప్రయత్నం తన పెద్దవాళ్ల ద్వారా కాక తనంత తానుగా మర్యాదపూర్వకమైన లేఖ రాయటం ద్వారా ఆమె తండ్రిని సంప్రదిస్తాడు. ఆమె తల్లిదండ్రులు అప్పటికే కుదిరిన సంబంధం కాక తనతో పెళ్లికి ఒప్పుకోవటానికి కారణం శిరీష తన పట్ల సుముఖత చూపటమే అన్నది అతన్ని ఆనందంలో ముంచేస్తుంది.  

శశి చదువు విషయంలో తమను మోసం చేసాడంటూ శిరీష తల్లి మొదటే అతని పట్ల ఒక వ్యతిరేకతను వ్యక్తపరుస్తుంది. అతని తిరుగు ప్రయాణానికి వీసా అవసరమన్నది ఆ భావానికి బలాన్నిస్తుంది. ఇంజనీరింగ్ కి ఉన్న ఉదోగ అవకాశాలు భౌతికశాస్త్రానికి లేవన్నది వారి భావం. అందుకే తాంబూలాలు పుచ్చుకుందుకు కూడా సమయం తీసుకుంటారు శిరీష తల్లిదండ్రులు. శశి తల్లిదండ్రులు మౌన ప్రేక్షకులే అవుతారు. శిరీషకి ఉత్తరం రాస్తూ మొదటి ప్రేమలేఖ రాసేందుకు పడే పాట్లన్నీ పడతాడు. తన చదువు, ప్రొఫెసర్లు, తనకు తెలిసిన భౌతికశాస్త్ర విషయాలు గురించి రాస్తాడు. శిరీష జవాబులో తన ఉత్తరానికి ఆమె తల్లి చేసిన విమర్శ గురించిన వాక్యం కాక మరొక వాక్యం మాత్రం ఉండటం అతనికి అసంతృప్తినిస్తుంది.

పెళ్లి పీటల మీద శిరీషతో ఒక జీవితకాలపు మధురానుభవాన్నిపొందే ప్రయత్నంలో ఆమెకు తీవ్రమైన బాధను, మరచిపోలేని ఒక విషాద స్మృతిని మిగుల్చుకుంటాడు. అది జీవితాంతం ఒక పీడకలై వెంటాడుతుంది. 

మనకంటూ ఫ్రీ విల్ అనేది లేదంటూ, భౌతికశాస్త్రం సమీకరణాలు నిర్దేశించిన దారిలో మన ప్రవర్తన, జీవితాలు నడుస్తుంటాయన్న విషయాల్ని సశాస్త్రీయంగా తెలుసుకుంటూ తన జీవితంలో ప్రతి సన్నివేశాన్ని తరచి తరచి చూసుకుని బేరీజు వేసుకునేట్టు చేస్తుంటాయి. సాధారణ మనిషి నమ్మేది విధి అంటుంది తల్లి. సమీకరణాల నిర్దేశనం ప్రకారమైనా, తల్లి చెప్పిన విధి అయినా జరిగినదానిలో తన పాత్ర ఎంతన్నది అతడిని నిత్యం సలుపుతూనే ఉంటుంది. 

ఇంజనీరింగ్ నుంచి భౌతిక శాస్త్ర పరిశోధనకి మారటం శశి భౌతిక శాస్త్రం పట్ల, ఐన్ స్టీన్ పట్ల పెంచుకున్న మక్కువకు కారణం. అది అత్తవారి ఇంట అతన్ని తేలిక చేసి, బ్రతకటం నేర్వని వాడిగా ముద్రవేసింది. పెళ్లిలో జరిగిన ప్రమాదంతో శిరీష కొన్నాళ్లు మంచానికి పరిమితమై తల్లిదండ్రుల దగ్గర ఉండిపోతుంది. ఆమెతో ఫోన్ లో మాట్లాడేందుకు కూడా అత్తమామలు అవరోధాలవుతారు. కొత్త జంట జీవితంలో పగులు ఏర్పడుతుంది.

బావమరిది కిశోర్ పెళ్లికి శశికి సరైన పిలుపు రాదు. ఆ పెళ్లికి వెళ్లొచ్చిన అతని తల్లి శిరీష పెళ్లికాగానే శశితో అమెరికా వచ్చుంటే తన అన్నయ్య పెళ్లికి రాలేకపోయి ఉండేదంటుంది. ఉన్నదాని గురించి కాక లేనిదాని గురించే ఆలోచించడం మానవ స్వభావం కాబోలనుకుని శశి తాత్త్వికంగా నిట్టూరుస్తాడు. ఆమె అసలు అమెరికా వస్తుందా అని నిరాశ పడుతుండగా ఆమె ప్రయాణం గురించిన కబురతన్ని ఆ తాత్త్వికతలోంచి బయట పడేస్తుంది. ఎయిర్ పోర్ట్ లో ఆమెను ఎలా రిసీవ్ చేసుకోవాలని, తన ప్రేమని ఎంత అందంగా ఆమెకు వ్యక్తపరచాలని తెగ ఆలోచిస్తాడు. తీరా ఆమెను వీల్ చెయిర్లో చూసి దుఃఖపడతాడు. ఆమె కళ్లల్లోని తిరస్కార భావం బడలిక వల్లే అని సర్దుకుంటాడు.

కమ్మని పాటలాంటి జీవితాన్ని కలలు గన్న శశి జీవితం దానికి పూర్తి భిన్నంగా తయారవుతుంది. తల్లితో నిత్యం ఫోన్ సంభాషణలతో ఆమె నిర్దేశించిన విధంగానే తయారవుతుంది శిరీష. శశి జీవితం నిశ్శబ్ద సంగీతంలో మునిగిపోతుంది. అతనిలో తన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదన్న నిరాశను కలిగిస్తూంటుంది. అనుక్షణం జీవితాన్ని భౌతికశాస్త్ర సూత్రాల ఆధారంగా అన్వయించుకునే శశి తన సమస్యలకు పరిష్కారం తన చేతిలో లేదన్నది గ్రహిస్తూనే వచ్చాడా? 

శిరీష పెళ్లికి రాలేకపోయిన బాబాయ్, పిన్ని ఆమెను అమెరికాలో కలుసుకుందుకొస్తారు. వారి సంసార జీవితం గురించి అవగాహన కొచ్చిన పిన్ని శిరీష తల్లి మాటలకు ప్రభావితురాలవు తోందని గ్రహించి ప్రేమించిపెళ్లి చేసుకున్నభర్తకి దగ్గరవమని సున్నితంగా చెపుతుంది. శశి, శిరీషల జీవితంలోకి ఇద్దరు పిల్లలు వస్తారు. శిరీష పిల్లలని చూసుకోలేదన్న కారణంతో ఆమెతల్లి పిల్లలను ఇండియాలో పెంచుతుంది. పిల్లల పసితనాన్ని, వాళ్లతో ఆ తొలి రోజుల్లో ఏర్పడే బాండ్ ని మిస్ అవుతున్నాడని శశి బాధ పడతాడు. శిరీషలో ఏ మార్పూ ఉండదు. తెలవారి లేస్తూనే ములుకుల్లాటి మాటలతో భర్త ప్రతి చర్యకూ స్పందిస్తుంటుంది. వారి మధ్య ఏళ్ల తరబడి నిశ్శబ్దం గడ్డకట్టుకు పోతుంది. పగులు మరింత పెరుగుతూనే ఉంటుంది వారి జీవితాల్లో. 

ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు అత్తమామలు కాక తన తల్లిదండ్రులే వచ్చి సాయం చేస్తారు. వారిపట్ల శిరీష నిర్లక్ష్య వైఖరి మౌనంగా వారితో పాటు భరిస్తూ కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. 

చదువు పూర్తి చెయ్యలేకపోయిన బావమరిది కొన్ని కంప్యూటర్ కోర్సుల సాయంతో అమెరికా వచ్చి బిజినెస్ పెడతాడు. ఆస్తులు కూడబెడతాడు. శశి అత్తమామలకు ఇది శశిని చిన్నబుచ్చేందుకు మరింత అవకాశమిస్తుంది. 

ఆరేళ్ల మీరా, రెండేళ్ల సియస్ అమెరికా జీవితానికి అలవాటు పడేందుకు శశి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాళ్లకి కావలసిన భౌతిక అవసరాలు చూడగలుగుతున్నా, ఉద్యోగపు ఒత్తిళ్లతో పిల్లలకు దగ్గర కావటం సాధ్యం కావట్లేదని బాధ పడతాడు. మీరా ముందునుంచీ వయసుకు మించిన గాంభీర్యంతో ఉంటుంది.

కుటుంబ జీవితం ఇంత నిరాశాజనకంగా ఉన్నా కెరీర్ లో తనకు ఇష్టమైన పరిశోధనల్లో తలమునకలుగా ఉంటాడు శశి. తన వయసు జంటలు చేతిలో చెయ్యేసుకుని ఎదురైనప్పుడు తన జీవితంలో వెలితి స్పష్టంగా ఫీలవుతుంటాడు. 

ఒక సందర్భంలో అమెరికా ప్రయాణం శిరీషకి ఎలాటి శారీరక బాధను ఇవ్వలేదన్నది శిరీష, ఆమె తల్లి సంభాషణలో శశికి అర్థమవుతుంది. మొదటిసారి శిరీష అమెరికాలో కాలుపెట్టినప్పుడు వీల్ ఛైర్ లో కనిపించిన దృశ్యం గుర్తొస్తుంది శశికి. తనను నేరస్థుడిగా నిలబెట్టేందుకే శిరీష వీల్ ఛైర్ లో వచ్చిందన్నది అతన్ని కృంగదీస్తుంది. ఆ సందర్భంలో కూడా శిరీష తనను తాను సమర్థించుకుంటుంది. తిరిగి అలాటి సన్నివేశం వస్తే వీల్ ఛైర్ లో కాక నడిచి వచ్చి అది నడుంనొప్పిని తీవ్రతరం చేసిందని శశిని మరింత హింసించగలను అనుకుంటుంది. పెళ్లి ప్రస్తావన సమయంలో అతని పట్ల కలిగిన ప్రేమను తల్లి మాటలు పూర్తిగా తుడిచిపెట్టేయటంతో అతన్ని ఒక శత్రువుగానే చూస్తుంది శిరీష. అతని ప్రేమలోని నిజాయితీని గుర్తించలేని మూర్ఖత్వంలోకి ఆమె వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పిల్లల జీవితాల్లో సంతోషం కోరుకుంటారు. కానీ కుటుంబ జీవితంలోకి ప్రవేశించిన జంట మధ్య వైరాన్ని పెంచి పోషిస్తూ ఆ కుటుంబం విచ్ఛిన్నమయ్యేందుకు కారణమయ్యే క్రూరమైన పెద్దరికాల్ని ఏమనాలి? 

ఎప్పుడో 2007 లో అనుకుంటాను, పూణే లో ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ ని ఎప్పటికీ మర్చిపోలేను. సిటీలో పెరుగుతున్న విడాకుల కేసులు, సింగిల్ పేరెంట్స్ కి ముఖ్యమైన కారణం పెళ్ళిళ్లైన పిల్లల జీవితాల్లో వారివారి తల్లిదండ్రుల అతి జోక్యం అన్నది. అది ఇప్పటికీ కాదనలేని వాస్తవ సమస్య.

శిరీష పెద్ద ఇల్లు కొనమని పట్టు పట్టడంతో, ప్రయత్నంతో ఒక ఇంటిని ఖాయం చేస్తాడు శశి. ఆ ఇంటి మూలాధారంలోనే పగులుందని తెలుసుకుంటాడు. దానికోసం ఎంతో ఖర్చుపెట్టి భార్య విమర్శకి మరింత గురవుతాడు. ఆ పగులు ఇంటికి ఎలాటి నష్టం కలిగిస్తుందో అన్నది అతని మనసులో దృఢంగా ఉండిపోతుంది. నిత్యం వాకింగ్ ముగించుకొచ్చి డ్రైవ్ వే మీద నిలబడి ఆ పగులును పరిశీలనగా చూస్తుంటాడు.

శిరీష నడుం నొప్పితో బాధ పడుతూ ఇంటి బాధ్యతలను, పిల్లల బాధ్యతను పూర్తిగా శశి మీదే పెడుతుంది.

నాసా లో ఉద్యోగంలో చేరే రోజు తనతో పనిచేసే ప్రభాకర్ నిలబడి పనిచెయ్యటం గమనిస్తాడు శశి. అతనూ శిరీష పడే లాటి నొప్పిలాటిదే భరిస్తున్నాడని అర్థమవుతుంది. సర్జరీ వలన పూర్తి రిలీఫ్ దొరుకుతుందన్న గ్యారంటీ లేకపోవటం వల్ల, కూతురు చదువు పూర్తయ్యేవరకూ సర్జరీని వాయిదా వేస్తుంటాడు ప్రభాకర్. కొంత ఫిజియో థెరపీతో దినచర్యను నడుపుకుంటూంటాడు. 

శిరీష ఫిజియో థెరపీకి ఒప్పుకోవకపోవటంతో శశి నిస్సహాయుడవుతాడు. శిరీష పిల్లల చదువుల గురించి తన అన్నయ్య పిల్లలతో పోల్చుకుని పోటి పడుతుంటుంది. కూతురు మీరా తన స్నేహితులను ఇంటికి తీసుకొచ్చిన సందర్భంలో విసుక్కుంటుంది. మీరా డాక్టర్ కావాలని ఆమెపై ఒత్తిడి చేస్తుంది. కానీ తల్లి పట్ల వ్యతిరేకతతో ప్రవేశ పరీక్షలో మీరా కావాలనే అర్హత పొందదు. సోషియాలజీలో చేరుతుంది. ఆ చదువుకు మంచి ఉద్యోగం రాదని శిరీష ఆగ్రహిస్తుంది. మీరా తల్లి మాటలను ఖాతరు చెయ్యదు. స్నేహితులు లేకుండా ఒంటరిగా పెరుగుతుంది. తండ్రికి, తల్లికి దగ్గర కాలేకపోతుంది. ఏ ఆటలాడేందుకూ కూతురిని అనుమతించదు శిరీష. మీరా పియానో నేర్చుకుని దానిలో ఒక స్థాయికి చేరుతుంది. 

మంత్రాలను చదవటం ఎందుకు, వాటి అర్థాలు ఎందరికి తెలుస్తాయంటూ తండ్రిని ప్రశ్నిస్తాడు శశి. అది వ్యక్తిగతమైనది కనుక వద్దని చెప్పటానికి ఇతరులకి అర్హత లేదంటారు రాఘవరావు గారు. కొడుకు చేసే భౌతిక శాస్త్ర పరిశోధనల ఫలితాలు సామాజికమే అయినా, అవి సామాన్యులకు ఎంత దగ్గరైనా వారు నడిచే దారిని మార్చలేము కదా అంటారాయన. అవతలివాళ్ల నమ్మకాలని తప్పని నిరూపించి వారిని మార్చే ప్రయత్నం కంటే తన గురించి తెలుసుకునేందుకు ప్రతివారూ ప్రయత్నిస్తే ప్రపంచంలో శాంతి దొరుకుతుందంటారు. ఇక్కడ తండ్రీ కొడుకుల సంభాషణ ఎంతో ఆసక్తిగా నడుస్తుంది.

దేవుడు లేడన్న శశి తనతో గుడికి వస్తాడని మేరీతో చెపుతున్న శిరీషకి సమాధానంగా శక్తిని దేవుడికి పర్యాయపదంగా వాడితే అది థర్మో డైనమిక్స్ కి మొదటి సూత్రం అవుతుందంటాడు శశి. పురుష సూక్తం దేవుడిని గతంలో ఉన్నవాడు, భవిష్యత్తులో ఉండేవాడు అంటుంది. ఐన్ స్టైన్ చెప్పిన బ్లాక్ యూనివర్స్ సారాంశం ప్రకారం గతం, వర్తమానం, భవిష్యత్తు ఎప్పుడూ కలిసే ఉంటాయని చెపుతూ తాను శిరీషతో గుడికి వెళ్లినప్పుడు మంత్రాలను అర్థం చేసుకుంటూ, తనకు తెలిసిన అంశాలను సమన్వయం చేసుకుంటానని అంటాడు.

ఇండియా వచ్చి చాలా ఏళ్లైందని, రమ్మని అక్క మాధురి చెప్పేవరకూ తనకెందుకు తోచలేదా అనుకుంటాడు శశి. తల్లిదండ్రులు సంతోషపడతారు పిల్లల్ని, మనుమల్ని చూసి. శిరీష అత్తవారింట కాలు పెట్టనని నిర్మొహమాటంగా చెప్తుంది. తన అక్క కుటుంబాన్ని వారి మధ్య ఉన్న మమతానురాగాల్ని చూసి తన కుటుంబంలో లోటు మరీ మరీ తలుచుకుంటాడు శశి. భార్య, పిల్లల మధ్య ఉన్న దూరం గ్రహించినా, తనూ ఉద్యోగ బాధ్యతలతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతోందని బాధ పడతాడు. కుటుంబమంతా కలిసి కూర్చుని భోజనం చెయ్యాలన్న ఆశ శశికి తీరదు. 

హైదరాబాదులో శశి బాల్య మిత్రుడు రవిని కలుస్తాడు. అతని భార్య జాస్మిన్ పెళ్లి తర్వాత రవి పేరుకి సరిపోయేలా కమల అని పేరు మార్చుకుంటుంది. కులమతాల పట్టింపు లేకుండా, భర్తను పోగొట్టుకున్న కమల తనకన్నా పెద్దదైనా, ఆమెను ఆమెకొడుకుతో సహా స్వీకరించి రవి పెళ్లిచేసుకున్నాడని తెలిసిన శిరీష తనకి ఆవిషయం చాలా ఏవగింపు కలిగించిందంటుంది. కూతురితో తన అభిప్రాయం చెప్పినప్పుడు మీరా అసహనంగా వింటుందామాటలు. 

డార్క్ ఎనర్జీ అంటే బిగ్ బాంగ్ అయిన తర్వాత గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో వర్తించే వికర్షణ శక్తి అన్న సంగతి ఆలోచిస్తూ శశి తనకీ శిరీషకీ మధ్య ఏర్పడిన డార్క్ ఎనర్జీ గురించి పరిశోధనలు అవసరమే లేదని, దాని ఫలితాలు కంటికి ఎదురుగానే కనపడుతున్నాయని అనుకుంటాడు.

మీరా చదువు విషయంలో జోక్యం చేసుకోబోతున్న శిరీషతో నాలుగ్గోడల మధ్యా పరిమితం కాక బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయంటుంది మీరా. భర్త మూలంగానే తను ఇంటికి పరిమితం కావలసి వచ్చిందని శిరీష అన్నప్పుడు ఆమెతో ఎవరు ఏమి చర్చించాలన్నా భర్త తన నడుం విరగ్గొట్టాడన్న విషయంతో చర్చని ముగిస్తుందని మీరా నిష్కర్షగా అంటుంది.

శశి తండ్రి మరణం కూతురు మాధురి ఇంట్లో సంభవించినపుడు శశి తను తల్లిదండ్రుల కోసం ఏమీ చెయ్యలేకపోయానని బాధ పడతాడు. అతను తల్లిని అమెరికా తీసుకొస్తాడేమో అంటూ శిరీష తల్లి అన్నప్పుడు ఆవిడకి చేసేవాళ్లెవరూ ఇక్కడ లేరంటుంది శిరీష. అత్తగారిని తీసుకురావద్దన్న భార్య మాటకి తల్లిని తీసుకొచ్చి విడిగా అద్దె ఇంట్లో పెడతాడు శశి. “మరి రోజుకొకసారైనా కనపడ్తావా” అని అడిగిన తల్లి రుక్మిణమ్మ ప్రశ్నకి శశి మనసు విలవిలలాడుతుంది. ప్రతిరోజూ తల్లి దగ్గర గడిపే క్షణాలు అతనికి ఒక ఓదార్పునిస్తుంటాయి. తల్లి అతని సంసార జీవితంలో లోటు గ్రహిస్తుంది. శిరీష ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకైనా కొడుకుని ఆమెతో తెగతెంపులు చేసుకునే ఆలోచన ఉన్నట్టు ప్రవర్తించమంటుంది. శశి నవ్వుతాడు తల్లి మాటలకి. ఆ మాట వింటే ఆవిడే అతని తలలో అలాటి బుద్ధి పుట్టించిందని శిరీష భగ్గుమంటుందంటాడు. ఆవిడ కూడా ఇండియాలో శశి అక్క దగ్గర ఉన్నప్పుడే మరణిస్తుంది.

మీరా చదువు పూర్తై పార్ట్ టై బ్యాంక్ ఉద్యోగం లో చేరటంతో శిరీష అసంతృప్తిని ప్రదర్శిస్తుంది.  ఏళ్ల తరబడి ఆమె వైఖరిని ఓర్పుగా భరిస్తున్నా ఒక దశలో భార్య సంభాషణ తనలో చిరాకుని కలిగిస్తోందని గమనించి శశి ఆశ్చర్యపోతాడు. మెదడు ఒక నిర్ణయం తీసుకున్నాక అది గ్రహింపుకి రావటానికి కొంత సమయం పడుతుందన్నది పరిశోధనలో బెంజమిన్ లిబెట్ చెప్పటం గుర్తొస్తుంది. తన చిరాకు కి కారణం ఎన్నేళ్ల విసుగు ఫలితమో అనుకుంటాడు.

మీరా ప్రవర్తనలో మార్పు గమనిస్తాడు. తన పర్స్ లో డబ్బు మాయమవటాన్ని కూడా గమనిస్తాడు. ఆమె డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటుందని నమ్మకంగా అనుకుంటాడు. అడగేందుకు సంశయిస్తాడు. ఇరవైఏళ్లు దాటిన కూతురి గురించి తానెందుకు బాధ పడాలి అని కూడా అనుకుంటాడు. 

తన శరీరంలో పోగైన అణువుల సముదాయం మెదడులో ఏ మూల నుంచో తయారవుతున్నాయో తెలియని ఆనందాన్నీ, విచారాన్నీ, భయాన్నీ, సంక్షోభాన్నీ తన ఇష్టం వచ్చిన రీతిలో నిర్దేశిస్తూ నడిపిస్తూంటుంది అనుకుంటాడు. అపజయాలని విచారంతోనూ, పిల్లల విజయాలను ఆనందంగానూ స్వీకరించకుండా ఉండలేకపోవటానికి కారణం తనలో ఫ్రీ విల్ ఉండడం వలనా లేక యూనివర్స్ ఆడించినట్లు తనలోని పరమాణువుల పోగు ఆడటం వలనా అని కారణం వెదకాల్సిన అవసరం లేదనుకుంటాడు శశి. మీరా గురించి ఆందోళన అతన్ని వదలదు. 

ఎదురింటి పీటర్, మిషెల్ శశి ప్రతిరోజూ నడక పూర్తిచేసుకుని వస్తూ డ్రైవే మీద కొన్ని నిముషాలు నిలబడి పోతున్నాడని శిరీషకి చెపుతారు. ఇంటి పునాదిలో ఉందన్న పగులును పరిశీలించటం అలవాటుగా మారుతుంది శశికి. ఈ మధ్య కాలంలో శశి అలా నిలబడి ఏదో గొణుక్కుంటున్నాడని చెపుతాడు పీటర్. సియస్ (శశి కొడుకు) కూడా తండ్రిని ఆ స్థితిలో చూస్తాడు. శశితో ఆ విషయం ప్రస్తావించినపుడు శశి తనకు తెలియని తన గురించి విని విస్తుబోతాడు. పైగా ఆ సమయంలోనూ బ్లాక్ హోల్ గురించి అతని మనసు ఆలోచిస్తుంది. హోలోగ్రాఫిక్ ప్రిన్సిపుల్ ప్రకారం బ్లాక్ హోల్ తన సమాచారాన్ని ఉపరితలం మీద ఉంచుతుంది. కానీ తన అనుభవంలో బ్లాక్ హోల్ కి కూడా తెలియకుండా దానిలో అంతర్లీనంగా సమాచారం ఉంటుందన్న ప్రతిపాదన చెయ్యవచ్చనుకుంటాడు. అలాటి స్థితిలోనూ అతనిలో భౌతికశాస్త్రం గురించిన ఆలోచనలే. 

శిరీష అతని పరిస్థితికి ఏడుస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతని ప్రేమలోని నిజాయితీ తెల్సీ అంత నిర్దయగా ప్రవర్తించిన శిరీష పట్ల పాఠకుడిలో అసహనం కలగక మానదు. ఒక తప్పు, అదీ అప్రయత్నంగా జరిగినప్పుడు దాని వలన నష్టపోయిన వారితో సమానంగా గుండెకోతను భరిస్తూ, కళ్లెదుటే నిత్యం అపరాధబావంతో మసలుతూ క్షమను కోరిన వ్యక్తిని, అదీ మనసా వాచా కర్మణా ప్రేమిస్తున్నానన్న వ్యక్తిని అంతగా తృణీకరించటం క్షమార్హం కాదనిపిస్తుంది. 

మీరాకి తల్లీపిల్లల బొమ్మను క్రిస్మస్ కానుకగా సియస్ ఇవ్వటం శశికి ఒక సూచనగా తోస్తుంది. సెలవులకి వచ్చిన కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ ని అబార్షన్ చేయించుకొమ్మనటం శశి వింటాడు. అలా చెయ్యద్దని, కొడుకు బిడ్డని తాను పెంచుతాననీ చెపుతాడు. శారా బిడ్డని కనాలని అనుకోవట్లేదని సియస్ విసుక్కుంటాడు. పైగా శారా గర్భంలో ఉన్నది శశి మొదటి గ్రాండ్ కిడ్ కాదంటాడు. స్వంత పిల్లలనే పెంచని నువ్వు ఈ పిల్లనెలా పెంచగలవన్న విమర్శ శశి సున్నితమైన మనసును బాధిస్తుంది.

ఆ సమయంలోనే మీరా అబార్షన్ చేయించుకుందన్న విషయం తెలుస్తుంది శశికి. తను గత కొంత కాలంగా అనుమానిస్తున్నట్టుగానే మీరా ఏదో సమస్యలో ఉందన్నది నిజమే అనుకుంటాడు. దానికి కారకులెవరన్నప్పుడు తన స్కూల్ లో పియానో మాస్టర్ జార్జ్ అని చెపుతుంది. శశి వణికిపోతాడు. మేరీ బాయ్ ఫ్రెండ్ గా పరిచయమైన జార్జ్ తనపై అనవసర ద్వేషాన్ని పెంచుకుని తన కూతురి జీవితంతో ఆటలాడుకున్నాడన్నది శశిని వివశుడిని చేస్తుంది. 

శిరీష ఆగ్రహంతో, దుఃఖంతో కూతురిపై చెయ్యి చేసుకుంటుంది. ఎప్పుడో జరిగిన ఒక పొరబాటుకు తండ్రిని జీవితాంతం సాధిస్తూ ఇంటిని, పిల్లల బాధ్యతను తప్పించుకున్న తల్లిని మీరా విమర్శిస్తుంది. తమని ఇండియా పంపి ఇక్కడ తండ్రితోనైనా జీవితాన్ని ఆస్వాదించలేదని, పెరిగి పెద్దవుతున్న తనకు ఒంటరితనం ఒకటే తోడైందని ఏడుస్తుంది. శశి జార్జ్ మీద కోపంతో ఉన్నపళాన ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతాడా సాయంవేళ చలిలో. పీటర్ పరుగెత్తుకొచ్చి బయటకు పిలుచుకెళ్తాడు ఇంట్లో వారందరినీ. శశి జీవనయానం సమాప్తమవుతుంది. 

ప్రతి సన్నివేశానికీ, సందర్భానికీ ఒక తియ్యని పాటను కూనిరాగం తీస్తూ భవిష్యత్తు పట్ల కమ్మని కలలతో జీవితాన్ని ప్రారంభించిన భావుకుడు ఆ కుర్రవాడు. ఎన్నెన్నో కలలతో జీవితాన్ని ప్రారంభించిన శశి తన కుటుంబంలో ఎవరికీ ఏమీ కాలేని అశక్తతతో, నిరాశతో మరణించటం పాఠకుల మనసును మెలిపెడుతుంది. చక్కని కుటుంబవాతావరణం, తెలివితేటలు, ప్రోత్సహించే ఉపాధ్యాయులు, మనసెరిగిన స్నేహితులు, కలగని సాధించుకున్న విద్య, ప్రేమించి స్వంతం చేసుకున్న భార్య, ప్రాణంలా పెంచుకోవాలనుకున్న పిల్లలు…ఒక నిండు జీవితం ఒక్క పొరబాటుకు అంత మూల్యం చెల్లించాల్సి రావటం విధేనా? లేక అణుసముదాయాల నిర్దేశనా? 

శశి పాత్ర అపురూపంగా అనిపిస్తుంది. అనుక్షణం అతని ఆలోచనలు, అంతర్మథనం ఒక మనో వైజ్ఞానిక చిత్రాన్ని పాఠకుడి ముందు నిలబెడుతుంది. అతనిలోని భావుకత, విజ్ఞాన తృష్ణ, ప్రేమించే మనసు… ఇన్నీ తన జీవితానికి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. కోరుకున్న అమ్మాయి జీవితంలోకి వస్తూనే అతడిని ఓ నేరస్థుడిగా ముద్ర వేసి అది అనుక్షణం గుర్తుకు తెస్తూ, తమ జీవితాల్లోకి తెచ్చుకున్న పిల్లలను కూడా నిర్లక్ష్యం చేసి కుటుంబం యావత్తునూ క్షోభకు గురిచేసింది. ఆమె పట్ల అపారమైన ప్రేమతో, తన కారణంగా ఆమె పడుతున్న బాధకు తానూ దుఃఖపడుతూ ఓర్పుగా ఆమెలో మార్పు కోసం చూసిన అతనికి నిరాశే మిగిలింది. అతని ఓర్పు అతని అసహాయతగా మిగిలిపోయింది. 

నవల పూర్తి అయ్యేసరికి ఒక విషాద రాగం పాఠకుడిని చుట్టుకుంటుంది. శశి పాత్ర మనసులో గాఢంగా నిలిచిపోతుంది. తియ్యని పాటలు, సంస్కృత శ్లోకాలు, వాటి విశ్లేషణా, విజ్ఞానశాస్త్రం పట్ల ఉన్న అపారమైన కుతూహలం, అందరిలాగానే ఒక అందమైన ప్రేమైక కుటుంబాన్ని కలవరించిన శశికి జీవితంలో ఏం దక్కింది? దీనికంతకూ కారకులెవరు? శశి చెప్పినట్టు ఈ సంఘటనలకూ, సమస్యలకూ కారణం ఎవ్వరిదీ కానేకాదా? దీనికి ఎవరి నిమిత్తమూ లేనేలేదా? పాఠకుడు పుస్తకం మొదలు చివరి వరకూ శశితో కలిసి అతని జీవితానుభవాల్ని తనవిగానే అనుభూతిస్తాడు. అంత అమాయకంగా తెల్లనివన్నీ పాలని నమ్మే అతని కలలు భగ్నం అయిన తీరు చూసి కంట తడి పెట్టక మానడు. సాధారణ పాఠకుడు కూడా అర్థం చేసుకునే విధంగా నవలలో జరిగిన వివిధ చర్చలు, ఇచ్చిన వివరణలు ఒక మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతిని చాలా కాలం పాటు మనకు మిగులుస్తాయి. అందమైన, ఆలోచింపజేసే నవలను అందించిన శ్రీ శివకుమార శర్మ గారికి అభినందనలు. 

ఈ పుస్తకం జూలై, 2022 లో ప్రచురించబడింది.

You Might Also Like

One Comment

  1. అట్లూరి Anil

    నవలని చదవాలి అనిపించేటట్టుగా రాశారు.

Leave a Reply