“నాలోని రాగం క్యూబా” పుస్తక పరిచయం

వ్యాసకర్త: కాళ్ళకూరి శేషమ్మ

**********

ఈ పుస్తకానికి కన్నడం మూలం జి.ఎన్.మోహన్. తెలుగు సేత సృజన్. కర్నాటక సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పుస్తకం. 2015 సం।। ముద్రణ.

ఇటీవల ఈ పుస్తకాన్ని చదివే అవకాశం కలిగింది. 114 పేజీలు గల యీ పుస్తకంలో క్యూబా దేశాన్ని కొలంబస్ చేరుకున్నది మొదలు ఆ దేశాన్ని, అందలి ప్రజలను వలస రాజ్యాలు పీడించిన వివరాలు, అక్కడి ప్రజల చైతన్యం, పోరాట పటిమ, మొక్కవోని విశ్వాసం, నిజాయితీ, దేశభక్తి – తమ స్వాతంత్ర్యం కోసం, ఉనికిని కాపాడుకొనుట కోసం వారు శ్రమించి, తపించి విజయపథాన్ని నడచిన నిరాడంబర నిజాయితీ – ఈ విశేషాలన్నీ అబ్బురపరచేయి. మోహన్ గారు స్వయంగా క్యూబా వెళ్ళారు. అక్కడ పర్యటించి, ఆ ప్రజలతో మమేకమయి, వారి ద్వారా వారి జీవనపోరాటాన్ని జీవిత విలువలను తెలుసుకున్నారు. ఆ అనుభూతులను గుండెల నిండా నింపుకుని, ఆప్రజలకు జోహారులర్పించి, వందనం చేసే స్థితికి చదువరులను తీసికొని వెళ్ళారు.

క్యూబా – ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటి. ఉత్తర అమెరికా ఖండంలో అమెరికా (యు.యస్.) దేశానికి 90 కిలోమీటర్ల చేరువలో వున్న ద్వీపం. 1,10,860 చ।। కి।।మీ వైశాల్యం, 113 మిలియన్ల జనాభా కల్గిన క్యూబాకు రాజధాని హవానా, ప్రజలు మాట్లాడే భాష స్పానిష్. 15వ శతాబ్దం నుండి 20వ శతాబ్ది వరకు పరాయి పాలనలో పీడనకు గురి అయి, అస్తిత్వం కోల్పోయింది. స్పెయిన్ కు వలసగా బలైపోయినది మొదలు – ఈ దేశం సంపద సర్వం సహా దోపిడీకి గురి అయింది. తర్వాత స్పెయిన్ క్యూబాను అమెరికాకు అమ్మేసింది. ఇలాంటి కీలక రాజకీయ ఆర్థిక సర్దుబాట్లు జరిగినపుడు స్థానిక ప్రజల ప్రమేయం ఏమీలేదు. వారు బానిసలు కదా వలసపాలనలో! – మంచి రోజులు రావాలంటే నాయకులుండాలి. ఇద్దరు గొప్ప నాయకులు చెగువేరా, ఫిడెల్ కాస్ట్రో – వీరు తమ దేశ ప్రజలను జాగృతం చేసారు. ఆ త్యాగాలు, పోరాటాలు మోహన్ గారు పుస్తకంలో వివరించారు. సృజన్ గారి తెలుగుసేత కూడా మూలానికి న్యాయం చేసి, స్పూర్తిదాయకంగా సాగింది. ఆద్యంతం, ఆవేశంతో, ఆనందంతో, ఆశ్చర్యంతో పుస్తకాన్ని చదివించింది. ఒక్కోసారి, మరల, మరల చదివే స్థాయికి ఆ పోరాట విలువలను చెప్పారు.

పుస్తకంలో ఆకట్టుకొన్న విషయాలు. 1) క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో మాటలు – అవి – నిజాయితీతో కూడి అప్రజలను ప్రభావితం చేసి, ఆచరణలో పెట్టేలాగ చేసాయి. ఆ పలుకులను విన్నప్పుడు హా “కాస్ట్రో ఎంత గొప్ప నాయకుడు, తన దేశమంటేను, ప్రజలంటేను ఎంత ప్రేమ” అనిపిస్తుంది. అంతేకాదు అలాంటి ఆచరణీయమైన సందేశాలిచ్చే నాయకులు మనందరికీ కావాలి. ఉంటే మన దేశాలు బాగుపడతాయి అనిపిస్తుంది. 2) ప్రజల చైతన్యం, త్యాగం, వారు అగ్రరాజ్యమైన అమెరికాకు తలవంచకుండా, ధైర్యసాహసాలు చూపి తెగువతో సాయుధ పోరాటం చేసారు. ఇవి మనకు ఆప్రజల పట్ల ప్రేమను పెంచుతాయి. 3) క్యూబాల విప్లవానంతరం, విద్య, వైద్యం, క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానం – ఇలాంటి కీలక అంశాలకు లభించిన ప్రాముఖ్యము. 4) క్యూబా లో మహిళలశక్తి – వారు సామాజిక, విద్య, వైద్య, రాజకీయ రంగాలలో అత్యున్నత స్థాయి చేరుకున్నారు. 5) ఇచ్చట ప్రజాప్రతినిధుల ఎన్నికల విధానం ఏమాత్రం ప్రలోభం, లంచాలు లేవు.

ఈ కీలక అంశాలతో పాటు ఈదేశం చెఱకు పంటకు, తాటిచెట్లకు, ప్రకృతి శోభకు వినుతి చెందింది. క్యూబాను “షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ (The Sugar bowl of the World) ప్రపంచపు పంచదార గిన్నె అంటారు. ఇవన్నీ మనకు తెలుస్తాయి. 1492వ సంవత్సరం అక్టోబరు 12వ తేదీన కొలంబస్ ఈ దీవిపై కాలు పెట్టాడు. ఆ సౌందర్యాన్ని చూసి “మనిషి కనులెన్నడూ చూడని అద్భుత సౌందర్య ద్వీపం” అని అన్నాడు. దురదృష్టం క్యూబా ప్రజలది. దౌర్భాగ్యం అనాడు ప్రారంభమయింది. ఆ దీవిలో హాయిగా నివసిస్తున్న స్థానిక ఆదివాసులను స్పెయిన్ వలస పాలకులు గాడిద చాకిరీకి లోను చేసారు. నిలువనీడ లేకుండా తరిమారు. కొందరు మరణించారు. ఎందరో దేశాన్ని వదలి పోయారు. అయితే స్పెయిన్ అక్కడ కష్టించి పనిచేయడానికి ఆఫ్రికన్ల పై కన్ను వేసింది. ఆ నీగ్రో బానిసలు చెరకు తోటల్లోను, గనులలోను శ్రమించారు. వారు వారి శ్రమకు పొందిన ఫలితం నిండుసున్న వాళ్ళ కళ్ళ ఎదుటనే, పంచదార, పొగాకు, పళ్ళు, సర్వం సహా ఉత్పత్తులు స్పెయిన్ చేరుకునేవి. స్థానికుల బ్రతుకు హీనం, అర్థాకలి, అవిద్య, అనారోగ్యం , పీడన ఇవి వారి వాటా. 1819 నుండి 1855 వరకు ఇదే తీరు. ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధించారు. పాలకులు – వ్యాపారం చేయరాదు. నలుపు తెలుపు నడుమ వివాహాలు నిషిద్ధం, అతిథులను ఇంట్లో ఉండనీయరాదు. సైన్యం అనుమతి లేనిదే స్థానికులు ఎక్కడికీ ప్రయాణం చేయకూడదు.

90 కిలోమీటర్లు ఎగువనున్న అమెరికా ఇందంతా గమనిస్తోంది. అక్కడ వాళ్ళ పంచదార ఫ్యాక్టరీలు మూతపడినవి. – వారి కళ్ళు క్యూబా పై పడినవి. స్పెయిన్ సైన్యాన్ని ముట్టడించి, ఓడించి క్యూబాను అమెరికా వశపరచుకొన్నది. 1898 డిశంబరు 10న పారిలో ఒప్పందం జరిగి స్పెయిన్ క్యూబాను అమెరికా హస్తగతం చేసింది. క్యూబా మరో అగ్రరాజ్యపు ఉక్కు సంకెళ్ళలోకి చిక్కింది.

ఉత్తర దిశ నుండి దక్షిణానికి ఎగిరే పక్షులకు నిలయంగా, అమెరికా ఖండపు తాళం చెవిగా, క్యూబాను వర్ణిస్తారు. కారణం దీని వునికి కీలకం. ఆతాళంచెవి పట్టుకుంటే ఏఖండపు తలుపులైనా తెరవచ్చు అని భావం. స్పెయిన్ వలసగా ఉండగానే ప్రవేశించిన అమెరికన్లు, స్పెయిన్ క్యూబాను వదిలిపెట్టేసరికి 70 శాతం పంచదార అవసరాలకు క్యూబా పై ఆధారపడ్డారు. పైగా, క్యూబాను కనుక ఏదైనా తన శత్రురాష్ట్రం ఆక్రమిస్తే తన వునికి కూడ ప్రమాదమనే భయం కూడ వారికి కలిగింది.

రాజధాని హవానాలో ధనికుల జీవితాలకు లోలోపలి సామాన్యుల బ్రతుకులకు పొంతన లేదు. విద్యుత్తు లేదు. ఇక్కడ గుర్రాలే వాహనాలు, మునిగే రోడ్లు, నీరు కారే గుడిసెలు. ఇదీ తీరు. ఒక ఎకరం పొలం ఒక డాలర్ విలువ కట్టి అమెరికా వ్యాపారులు ఈ దేశంలో మూడోవంతు భూమి ఆక్రమించారు. పంచదార పరిశ్రమే అతి పెద్ద ఆర్థిక వనరు. అది ఎగుమతి చేసి, మిగతా నిత్యావసరాలు దిగుమతి జరిగేది. ఇతర పంటల వల్ల ఏంలాభం లేదు. సామాన్యుల ఆహారం సంగతి వారికి అనవసం – అంచేత అవి పండే భూములు బీడులయ్యాయి. ప్రజలకు భూమిలేదు. తిండీ లేదు. – నాలుగేళ్ళ తర్వాత తనకు అనుకూలంగా వుండే ప్రభుత్వాన్ని క్యూబాలో నెలకొల్పి అమెరికా తప్పుకుంది. 1902 నుండి 1916 వరకు పీడన పెరిగింది. ఇంకా 1924 దాకా కొనసాగింది. ప్రజల్లో చైతన్యం మొదలయింది. “అమెరికా చేతిలో బొమ్మలాంటి రాజ్యాంగం మాకు వద్దు” – అనే నినాదాలు పెరిగాయి. విద్యార్థులు, కార్మికులు, రైతులు కదలి వచ్చారు. అయినా ఎన్నికలు జరిగిన ప్రతి పర్యాయం ప్రజల హితాన్ని కాలరాసే రాక్షసులే ఎన్నిక అయ్యారు. వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చిన విప్లవకారులపై వారు సైన్యాన్ని వదిలారు. ప్రజల సామూహిక సమాధి జరిగింది. దేశం శవసముద్రంగా మారింది. ప్రజలు పార్లమెంటును త్యజించారు. ప్రజలకు కొత్త సందేశం, పాలకులకు హెచ్చరిక, మార్పు వచ్చాయి. అవి అందించిన నాయకుడే ఫిడెల్ కాస్ట్రో. ప్రతిరోజు తుపాకీ చేతపట్టుకుని, తర్ఫీదు ఇప్పించి, ప్రజలను పోరాటానికి సిద్ధపరచారు. అతనితో చేయి కల్పిన మిత్రుడు చెగువేరా. ప్రతిఘటన పద్దతిగా సాగి, యీసారి విజయవంతమైంది. “కలలు కనని వారితో విప్లవం సాధ్యపడదు”. కలలు కన్నవారు తుపాకీ పట్టారు. 1959 జనవరి 1వ తేదీన క్యూబాకు స్వతంత్రం వచ్చింది.

ఫిడెల్ కాస్ట్రో:

రెండవ ప్రపంచ యుద్ధానంతరం సోవియట్ యూనియన్ ఒక గొప్ప దేశంగా, కమ్యూనిష్టు సిద్ధాంతాలను ప్రచారం చేసి, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి ఆర్థికంగా, అధికార దేశంగా అమెరికాకు దీటుగా, మహాశక్తిగా అవతరించింది. వీరి సహాయాన్ని అర్థించేడు కాస్ట్రో. నాటి నుండి క్యూబా పంచదారను సోవియట్ యూనియన్ కొనడం మొదలయింది. ఇది నచ్చని అమెరికా క్యూబా పై అవరోధాలు ఉధృతం చేసింది సోవియట్, చైనా, ఇంకా కొన్ని దేశాలు క్యూబాకు అండగా నిలిచేయి. 1980ల్లో సోవియట్ యూనియన్ పతనం క్యూబాకు ఆశనిపాతమైంది. కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కాస్ట్రో అమెరికా సామ్రాజ్య వాదానికీ, పెట్టుబడి వ్యవస్థతోను ఢీకొట్టేడు. తన ప్రజలను సిద్ధపరచాడు పోరాటానికి – “నేను కట్టుకున్న దుస్తులు నాలుగేళ్ళు వాడుకోవచ్చునా” అన్నాడు. “ఐదేళ్ళు కూడా వుపయోగించవచ్చు” అన్నారు ప్రజలు. ప్రతి కుటుంబంలోని పెద్దలు పొదుపు పాటించారు. వాహనాలు వదిలి కాలినడకతో పని ప్రదేశాలు చేరారు. పిల్లల్ని బడికి పంపారు. అచ్చటి ప్రజలకు పాలు అపురూపం, బన్ను ఓ ప్రత్యేక అరుదైన ఆహారం! భారత్ పంపిన గోధుమల గురించి కాస్ట్రో “వీనితో నాదేశ ప్రజలందరికీ ఒక వారంపాటు అత్యంత ఉత్కృష్టమైన బ్రెడ్ ఇస్తాను” అన్నాడు.

“క్యూబాలోని ప్రతి ఒక్కరూ నేడు చరిత్ర నిర్మిస్తున్నారు. కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ, మన మంచితనం ఎక్కువవుతుంది” అన్నాడు. “ప్రతి గ్రాము పాలకోసం, మందు సీసాకోసం, స్కూలులో పిల్లల చేతిలో పుస్తకాలకోసం, అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా పోరాడుదాం” అన్నాడు. “క్యూబా జెండా నిలపడం కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతాం” అన్నాడు. .

జనం సంవత్సరాల తరబడి చిరిగిన చొక్కాలతోను, ఒక దశాబ్దం పాటు ఒక జత బూట్లతోను బ్రతికారు. ప్రజలకు “జీవించే హక్కు” (Right to live). కల్గించడానికి కంకణం కట్టుకున్నాడు. “దున్నేవాడిదే భూమి; భూమిలేని వారికి భూమి, ఇల్లు లేనివారికి ఇల్లు – ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. “నాదేశపు ప్రజలారా, మన పిల్లల బస్సులకోసం మీ వాహనాల ఇంధనం తీసి ఇవ్వండి” అన్నాడు. ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రజ్ఞులు ప్రతిదినం పనిప్రదేశాలకు కాలినడకన, సైకిళ్ళమీద చేరుకున్నారు.

చెరకు తోటలు దున్నడానికి ట్రాక్టర్లకు ఇంధనం లేదు. పైరు కోతలకు యంత్రాలున్నాయి. కాని విడిభాగాలు దొరుకుట లేదు. ధాన్యాలు పండించడానికి కీటక నాశకాలు, ఎరువులు లేవు. అయినా క్యూబా అధైర్యపడలేదు. ఎద్దులతో పొలాలు దున్నించారు. బడిపిల్లలు పంటలు కోసారు. శాస్త్రవేత్తలు ఒకే చెట్టు నుండి అనేక రకాల పంటలను పండించే అంశాల పై పరిశోధనలు మొదలు పెట్టారు.

“ఆకలితో చావమన్నారు. ఉన్నది పంచుకు తినడం నేర్చుకున్నాము. రోగాలతో క్రుంగుతూ చావమన్నారు, ఆకులతో ప్రాణాలు కాపాడుకున్నాం. మా గొంతులను నులమడానికి ప్రయత్నించారు. అవి ప్రతిధ్వనిలా మోగాయి గుండెల్లో” అన్నాడు కాస్ట్రో.

అమెరికా అణచివేత నిర్లజ్జగా సాగింది. పరిశ్రమలు మూల పడినవి. అయితే నిరాశ చెందకుండా “చిమ్నీ లేని కర్మాగారం క్యూబా” అనే నినాదంతో పర్యాటక పరిశ్రమ అభివృద్ధి పొందినది.

“మేఘాలున్నాయి – అన్నంతమాత్రాన ఆకాశంలో సూర్యుడు లేడంటారా? మేఘాలు వర్షిస్తూ నేలకొరిగితే అక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కో సూర్యుడున్నాడు” అన్నాడు కాస్త్రో. అమెరికాలోని “పాస్టర్స్ ఆఫ్ పీస్ సంస్థ” క్యూబా పిల్లల కోసం, వారి విద్యాభివృద్ధి కోసం 45 కంప్యూటర్లను సేకరించింది. అమెరికా ప్రభుత్వం వాటిల్ని క్యూబా చేరనివ్వకుండా వెనక్కు తీసుకుంది. “పిల్లల కోసం కాదు అవి. క్యూబా మిలటరీ పరిశోధన కోసం అడిగింది” అన్నారు. అమెరికన్ కస్టమ్స్ అధికారులు. కానీ పాస్టర్స్ సంస్థ గట్టిగా ప్రతిఘటించింది. అమెరికాలోని చర్చి సంస్థలు క్యూబాలో సంచరించి, అక్కడి ప్రజలలోని మానవత్వాన్ని, ప్రేమనూ చూసి, క్యూబా ఏమిటో అమెరికాకు వివరించారు. అది చూసి ఆసంస్థ అధినేత రెవరెండ్ వాకర్ పై హత్యా ప్రయత్నం చేసారు. చర్చి ముంగిళ్ళలోని వాహనాలు ధ్వంసం చేసారు. అయినా క్యూబన్ల కోసం జరిపే ఉత్సవాలను పాస్టర్స్ సంస్థ ఆపలేదు! “అమెరికా అనుమతి మాకు అక్కర లేదు” అని వాకర్ ఉద్ఘాటించారు. ఊరేగింపు ప్రత్యేకత ఏమిటి అంటే – క్యూబన్ పిల్లలకు మందులు, నాలుగు స్కూల్ బస్సులు, వందలాది వీల్ చైర్లు, కంప్యూటర్లతో ఆధునీకరించబడిన సంచార గ్రంధాలయాలు, పాల పౌడర్, అంధ, చెవిటి బాలలకు పరికరాలు, 50 వేల కళ్ళద్దాలు, ఇంకా పిల్లలకు బొమ్మలు – ఈ ఊరేగింపు క్యూబా చేరినపుడు అచ్చటి స్థానికులకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. అమెరికాలోని మత పెద్దలంతా క్యూబాకు బాసటగా నిలిచారు. ప్రపంచంలో పలుదేశాల మద్దతు, సానుభూతి క్యూబాకు లభించాయి.

“ఎక్కువమంది ప్రజలు ఆమోదించే అభిప్రాయం రాజుశక్తి కన్న బలమైనది. ఎన్నో నూలు పోగులతో చేయబడిన తాడు సింహాన్ని కూడా కట్టి పడేస్తుంది” అన్నాడు ఫిడెల్ కాస్ట్రో. ఈ పుస్తక రచయిత క్యూబా సందర్శించాడు. వెళ్ళేటప్పుడు తన సూట్ కేసులో సబ్బుబిళ్ళలు తీసికొని వెళ్ళాడు. క్యూబాలోని రేషన్ కార్డు గమనిస్తే అందులో సబ్బుబిళ్ళల దాఖలాలేవీ లేవు. నెలకొక సబ్బు బిళ్ళ వారికి లభించడం అపురూపం. ఇది విని, భారతావని నలుమూలల నుండి సబ్బుల సెలయేరు పొంగి క్యూబా చేరింది. ఇండియా పట్ల కూబన్లకు స్నేహం, ప్రేమ మెండుగా వున్నాయి. అక్కడి ప్రైమరీ స్కూలు మాస్టార్లు వాల్మీకి రామాయణం, రవీంద్రనాధ టాగూరు కవిత్వం గురించి మాట్లాడారని రచయిత మోహన్ చెప్పారు.

“సౌహార్ధత అనేది రక్తదానం వంటిది. నలుపు, తెలుపు, ఆస్తికుడు, ఆడ, మగ, పేద, ధనికుడు – ఇలాంటి భేదం వుండదు. ప్రాణాలు కాపాడడానికి ఇచ్చే ప్రతిరక్తపు చినుకూ ఎరుపే” అన్నాడు కాస్ట్రో.

క్యూబా అక్షరాస్యతలో సాధించిన ఘనవిజయాలు:

“అక్షరాలు నేర్చిన యువకుల్లారా, మీ తల్లిదండ్రులను అక్షరాస్యులుగా చేయండి. కొండల్లోకి, పర్వతాల్లోకి, అడవుల్లో లోయల్లోకి దూసుకుపొండి” అన్నాడు కాస్ట్రో. కేవలం ఒక్క సంవత్సరంలోనే అక్షర వెలుగు విజయం సాధించింది. నికెల్ తీసే కార్మికులు, పైనాపిల్ పండించే రైతులు, తైలం తీసే కార్మికులు, కొండల్లో ఇల్లు కట్టుకున్నవారు, తాటిచెట్ల లోయలలోని వారు, చేపలు పట్టేవారు, చెరకు రైతులు అందరూ అక్షరాలు నేర్చేరు ఒక్క సంవత్సరంలోనే!!!,

నిరక్షరాస్యత అనే అంధకారం మధ్య కొత్త సూర్యుడు ఉదయించాడు. క్యూబా గొప్పగా గర్వంగా భావించే ఆస్తులలో ఒకటిగా అక్షరాస్యత చేరింది. ప్రపంచం అబ్బురపడింది! క్యూబన్ల ఆత్మవిశ్వాసం పెంచడానికి, అక్షరాస్యత విలువలను బోధించి “ఒక్క దీపం, వంద పుస్తకాలు” అనే నినాదం ఇచ్చాడు కాస్ట్రో. చేతిలో చిరుదీపంతో వందలాది యువకులు పల్లెల వైపు అడుగులు వేసి అక్షరమనే ఆయుధాన్ని వారికి ఇచ్చారు. ‘చదువు సైన్యం” క్యూబా లోపల మూలమూలలా ప్రవేశించింది. ప్రపంచం ముక్కు మీద వేలు వేసికొని ఆశ్చర్యపడింది. ఇప్పటికీ హవానాలో “సాక్షరతా ప్రచార మిషన్” వుంది. విప్లవానికి ముందు 23.6 శాతం వుండేది అక్కడ అక్షరాస్యత; పిల్లలకు పాఠశాలలుగాని, టీచర్లకు వుద్యోగాలు గాని లేవు.

కాస్ట్రో ప్రభుత్వం నేలలో పంటని తీసే ముందు “తమనితాము పండించుకొనే” పనికి ప్రాముఖ్య మిచ్చింది. “మీకు తెలిస్తే నేర్పండి, తెలియక పోతే నేర్చుకోండి” అనే నినాదం మారుమోగింది. లక్షలాది జనం సాక్షరతా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆశ్చర్యమేంటే క్యూబాలో కన్న అమెరికాలోనే నిరక్షరాస్యులు ఎక్కువమంది ఉన్నారు. ఇక్కడ కనీసం 9వ తరగతి వరకు చదువుకున్న వారు 98.22 శాతం! ప్రతి 37 మంది విద్యార్థులకు ఒక టీచరు, అన్ని దశల్లోనూ వుచిత విద్య. 2015 నాటికి క్యూబాలో 47 విశ్వవిద్యాలయాలు, 12,250 పాఠశాలలున్నాయి. విద్యవల్ల ప్రయోజనాలెన్నో! క్యూబా పంచదార పరిశ్రమను దెబ్బకొట్టడానికి చట్టాలు జారీ చేసినపుడు, చెరకు కోసేవాహనాలకు ఇంధనం లేదు. దున్నడానికి ట్రాక్టర్లు లేవు. అప్పుడు విద్యార్థులు దేశం కోసం నిలబడ్డారు. “ఇప్పుడు బడిపొలం దగ్గర” అనే కొత్త కార్యక్రమానికి కాస్ట్రో శ్రీకారం చుట్టాడు. ఒక నెల

రోజులు విద్యార్థుల చెరకు కత్తిరించారు. పొగాకుతో సిగార్లు చుట్టారు. పంచదార తయారీకి గానుగలు తిప్పారు. బియ్యం మోసారు. ఫైనాపిల్ పంట కోసారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతోంది. ఆత్మాభిమానపు ఊపిరి పొలాల్లో కనబడింది. పిల్లలు పొలం పన్లు చేస్తుంటే పెద్దలు భోజనం తీసికొని పొలాలు చేరారు.

అరచేతి ఆరోగ్యం :

“పాపాయి తల్లి గర్భంలో వున్నపుడే మా దేశంలో ఆరోగ్యం గురించి తీసికోవాల్సిన జాగ్రత్తలు ప్రారంభం. తర్వాత 75 సంవత్సరాలపాటు ఆరోగ్యవంతమైన జీవితం గ్యారంటీ. ఇదీ నినాదం. అలా ప్రజల ఆరోగ్యాన్ని అరచేతిలో పెట్టుకుని పోషించి, “క్యూబా 21వ శతాబ్దపు గమ్యాన్ని సాధించింది” అనే సర్టిఫికెట్ ను ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ద్వారా పొందినది. ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు డాక్టర్లు ఇంటికి వస్తారు. ఆరోగ్యం గురించి ఆరా తీసి తగిన మందులు ఇస్తారు. ‘ఇంటి వైద్యం’ అంటే డాక్టర్లే ఇంటికి వచ్చి చేసే వైద్యమని అర్థం. ప్రతి 120 ఇళ్ళకు ఒక డాక్టర్. డాక్టర్ కూడ అక్కడే నివసిస్తారు. “మన దేశంలో వైద్య సేవ సాంఘికమైనది” అన్నాడు కాస్ట్రో. ఆరోగ్యానికి సంబంధించి ఇతర దేశాల్లో వలె అక్కడ స్వార్థంకాని, డబ్బు దురాశగాని వుండవని భావం. మందులున్నది మానవ ప్రాణం కాపాడుటకే.

క్యూబా విప్లవ సమయంలో కొందరు వైద్యులు అమెరికా వెళ్ళి స్థిర పడ్డారు. తర్వాత ఒక్కరూ దేశం వదలి వెళ్ళలేదు. 2015 నాట్కి అక్కడ 54,000 మంది ఫిజీషియన్లు, 8830 దంత వైద్యులు, 71,730 నర్సులు, 54,600 వైద్య సాంకేతిక నిపుణులు వున్నారు. ఫారిన్లో వైద్యులు లలు గడిస్తున్నారు. కానీ క్యూబాలో??? ఎందరికో కార్లు లేవు. అయినావారు తమ దేశం వదలి వెళ్ళుటకు ఇష్టపడరు. అందుకే UNICEF డైరెక్టర్ “క్యూబాలా ఇతర దేశాలు ఆరోగ్య కార్యక్రమాలు చేపడితే ప్రపంచంలో – ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో 80 వేలమంది పిల్లల్ని మరణం నుండి కాపాడకలిగేవారు” అన్నారు. టీవీ, కార్లు తయారీ జపాన్ తోను, విమానాలకు కావాల్సిన సామగ్రి తయారీకి అమెరికాలతో పోటీ పడటం మాకు సాధ్యం కాదు. అలాగే పంచదార జైవిక సాంకేతిక పరిజ్ఞానంలో (Bio-Technology) క్యూబాతో పోరాడి గెలవడం ఎవరికీ సాధ్యం కాదు” అంటారు కాస్త్రో.

క్రీడలు :

‘హవానా విప్లవ చౌరస్తా (కూడలి) నుండి నేరుగా అమెరికా వైట్ హౌస్‌కి జావలిన్ విసిరేవారు మాలో వున్నారు. ఇది క్యూబా అమెరికాకు విసిరిన హెచ్చరిక.

విప్లవానికి ముందు ఒక్క బంగారు పతకమైనా నెగ్గని క్యూబా, తర్వాత క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఆహారం, పళ్ళు, పాలు లేనప్పుడు కూడ ఈ విషయంలో వెనుకంజ వేయలేదు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ లో 14వ స్థానం, 1976లో మాంట్రియల్ లో 8వ స్థానం కైవసం చేసుకుంది. 1980లో 4వ ర్యాంక్ పొంది, ఆ తరువాత ఒలింపిక్స్ రాజకీయాలతో విసుగు చెంది కొంతకాలం పోటీకి దిగలేదు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో 172 దేశాలు పాల్గొనగా క్యూబా 5వ స్థానం దక్కించుకుంది. అంతకు ముందు 1991లో హవానాలో జరిగిన Pan American International Competitions లో 140 బంగారు పతకాలు కైవసం చేసికొనగా, అమెరికాకు దక్కినవి 130. అమెరికాకు క్యూబా పట్ల అసూయ, ద్వేషాలు తగ్గలేదు. వారి క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలకు వెళ్తే డబ్బు సంచులు ఎరచూపి తమ వైపు లాగుకొనే ప్రయత్నాలు చేసింది! అలా పరిశీలిస్తే క్యూబా ఆటగాళ్ళు పతకాలతోపాటు, మనోధైర్యంతో అమెరికా ధన ప్రలోభాన్ని జయించవలసిన స్థితి!! క్యూబా తన క్రీడా విజయాలను ఇతర పేద దేశాలకు పంచింది. అక్కడ దాదాపు 30 పేద దేశముల ఆటగాళ్ళకు క్రీడల్లో సాంకేతిక సాయం అందించి, 250 పైగా క్రీడాకారులకు తర్ఫీదు (Training) లభింపచేస్తున్నది. క్రీడలకోసం క్యూబా తన బడ్జెట్ లో 1028 మిలియన్ పెసోలను కేటాయిస్తున్నది. ఇందుకు నాంది వారి రాజ్యాంగంలోని సూత్రము – “క్రీడలను ప్రతి వొక్కరి హక్కు” గా భావించాలని, “చూసి నేర్చుకో, చేసి తెలుసుకో” అని బోధిస్తున్నది.

స్త్రీల స్థానం :

ఈ దేశంలో స్త్రీపురుషులిర్వురూ సమానమనే సిద్ధాంతం నమ్మారు. ఫిడెల్ కాస్ట్రో నిశ్శబ్దంగా జరిగిన ఈ మార్పును “విప్లవం లోపలి విప్లవం” అని వర్ణించేడు. విప్లవం ఆవిర్భావం ఎంత కష్టమో పురుషాధిక్య సమాజాన్ని మార్చడం కూడ అంతే కష్టమని భావం. పేదరిక నిర్మూల, అక్షరాస్యత పెంపు, ఆరోగ్యంపై శ్రద్ధ, క్రీడలు, వృద్ధులకు అండదండలు ఇవన్నీ సరిగా నిర్వహించబడాలంటే మహిళ పాత్ర ఎంత వున్నదో అర్థమవుతుంది. అమె నిరంతరం పనులతో, జీతంలేని శ్రమతో కూడిన పనులు చేసే బానిస కాదు. పురుషులకు తన ఆలోచనలు చెప్పి, అభివృద్ధిలో పాల్గొన్నది. నేడు క్యూబాలో సాంకేతిక సిబ్బందిలో 60 శాతం మహిళలు, వారికి పురుషులతో సమానంగా జీతాలు. స్త్రీ కేవలం ఉద్యోగం చేయడంతోనే సరిపెట్టుకోలేదు. తన అభిప్రాయాలకు రూపం స్త్రీ ఇస్తున్నది. ఆదేశాభివృద్ధికి ప్రతిదశలో ఆమె తన అభిప్రాయం, ఆలోచనలను, ప్రణాళికలను వ్యక్తపరుస్తున్నది. మహిళలు అధికారపు చుక్కాని పట్టేరు. ప్రజా ప్రతినిధులయ్యారు. అన్ని రంగాల్లో తమ ప్రభావం చూపుతున్నారు. రాజకీయాల్లో సైతం ఇచ్చటి మహిళలు ముందున్నారు. యావత్తు ప్రపంచంలో స్త్రీ రాజకీయవేత్తల సంఖ్య 10 శాతం, అది క్యూబాలో 28 శాతం. వారికి తమ శరీరం మీద కూడ హక్కు వున్నది. పెళ్ళి వయస్సు, భర్త ఎంపిక పిల్లలను కనుట, ఇవన్నీ మహిళలే నిర్ణయిస్తారు. ఇది సాధ్యమవడానికి ప్రధాన కారణం స్త్రీ విద్య, పురుషులతో సమానంగా – లభిస్తున్నది. అన్ని రంగాల్లో మహిళలున్నారు. పరిశోధన రంగంలో 42 శాతం, విజ్ఞాన రంగంలో 43 శాతం, ఉన్నత విద్యలో 45 శాతం; అధ్యాపకులుగా 59 శాతం మహిళలే. ఈ సంఖ్య ఏమాత్రం తగ్గరాదని ప్రభుత్వం హెచ్చరించింది కూడ. నేడు క్యూబా జనాభాలో మహిళల శాతం 49.7. వీరిలో 61 శాతం సాంకేతిక నిపుణులు, వైద్యులు 88, ఉపాధ్యాయులు 46 శాతం ఉన్నారు. కాలేజీల నుండి పట్టా పొందే (డిగ్రీ) మహిళల సంఖ్య పురుషుల సంఖ్య కంటే అధికం.

ఎన్నికలు, నిర్వహణ :

“ఇక్కడ ఎన్నికల కోసం ఒక వ్యక్తి 25 డాలర్లు కూడ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అమెరికాలో ఒక వ్యక్తి 2.5 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాడు” అని ఫిడెల్ కాస్ట్రో చెప్పాడు. నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ది పీపుల్స్ పవర్ కు 5 సంవత్సరాలకొకసారి, మునిసిపాలిటీలకు ప్రతి 2.5 సంవత్సరాలకు, ఎన్నికలు జరుగుతాయి. 16 సంవత్సరాలు పైబడిన వారికి ఓటు హక్కు వున్నది. రహస్య ఓటింగ్, బహిరంగంగా పోల్ అయిన వోట్లు లెక్కించడము – విశేషాలు. 1976లో కొత్త రాజ్యాంగాన్ని రూపొంచించారు. నాడు కార్మికులు, రైతులు కూడ చర్చలలో పాల్గొన్నారు. నాటి నుండి నేటి వరకు ఎన్నికలు జరుగుతూనే వున్నాయి. అభ్యర్థులను ప్రజలే ఎంపిక చేస్తారు. ఈ మొత్తం కార్యకలాపాలలో ఓటరు శక్తిమంతుడు. ఎన్నికలు అయిపోయేక ఒకవేళ ఆ ప్రతినిధి సరైన వ్యక్తి కాడు అని తెలిస్తే, అతడిని నిలదేసే హక్కు వుంది! వెనక్కు పంపే అధికారం వుంది. “Right to Recall”

ముగింపు:

ఆహా! ఒక దేశం సామ్రాజ్యవాదపు ఉక్కుపాదం క్రింద నలిగి, పెద్ద గోతులో పడింది. కాని, విప్లవ స్ఫూర్తితో అత్యంత ధనిక రాజ్యమైన అమెరికాతో ఢీకొట్టి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి – చూస్తూండగా ఎన్నో రంగాలలో మహత్తరమైన అభివృద్ధి సాధించింది. ప్రజాస్వామ్యమని విజ్ఞవీగే అనేక దేశాల నాయకులు, అందలి ప్రజలు గ్రహించి, తమ ప్రతినిధుల ఎంపిక, ప్రభుత్వం పనితీరులపై బాధ్యతాయుతంగా వుండాలి. క్యూబా! జిందాబాద్.

నిజమే జి.ఎన్.మోహన్ గారి పుణ్యమా అని – వారికి ఒక్కరికే కాదు – “నాలోని రాగం క్యూబా”, సమస్త మానవాళికి తారకమంత్రం కావాలి. అప్పుడు నిజమైన విలువలతో కూడిన జీవనం మనకు లభిస్తుంది. – ఆమంచి రోజుల కోసం శ్రమిద్దాము.

కాళ్ళకూరి శేషమ్మ.

మొబైల్: 9978913051.

పుస్తకాల కొరకు సంప్రదించవలసిన చిరునామా:

దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్,

తెన్నీరు – 521 260.

మొబైల్: 99890 51200

mdevineni@gmail.com

You Might Also Like

Leave a Reply