కాశీభట్ల వేణుగోపాల్ “అసంగతం”

వ్యాసకర్త: శివ అయ్యలసోమయాజుల

*******

పోయిన వారం ఒక పుస్తకం పార్సెల్ వచ్చింది. తీరా చూస్తే అందులో కాశీభట్ల వేణుగోపాల్ “అసంగతం” నవల ఉంది మరియు పుస్తకం ఆయన దగ్గర నుండే వచ్చింది కూడా! తీరా మొదటి పేజీ తిరగేసి చూస్తే ” సాహితీ ప్రేమ శంకరంకు అభిమానంతో-కాశీభట్ల” అని వ్రాసి పంపారు.గత రెండేళ్ళుగా ‘అన్నా’ నీ కొత్త పుస్తకం ఎప్పుడు? అని ఆయన్ని నేను పదే పదే అడుగుతూ ఉండడం, దానికి ఆయన ‘నాకే తెలేదు ‘ అని జివాబివ్వడం జరుగుతూ ఉండేది. అంతలో నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ క్రొత్త పుస్తకం చేతిలో పడింది. ఏది ఏమైనా, చేతిలో పడ్డ దగ్గర నుంచి సమయం కల్పించుకొని అతి కుతూహలంతో పూర్తిగా చదివాను.

ఆయన మిగతా నవలల్లో లానే ఇందులో కూడా కథ మొత్తం ముఖ్యంగా నాలుగైదు పాత్రల చుట్టూనే నడుస్తుంది. ప్రథాన పాత్ర లేదా కథకుడు యాభై ఏళ్ళు దాటిని వ్యక్తి. బార్లలో, హోటల్లలో హిందుస్తానీ పాటలు పాడుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. స్వచ్ఛమైన సౌందర్యాన్వేషి, తెరలు లేకుండా అందాన్ని ఆశ్వాదిస్తూ ఉంటాడు. సమాజము,  కట్టుబాట్లు, నీతి, నీయమాలు, దైవం మీద నమ్మకం వంటి వాటి మీద అంతగా ఆసక్తి చూపడు.

కథకుడు జరిగబోయే, జరిగిన లేదా జరుగుతూ ఉన్నా సందర్భాల మీద మానసిక విశ్లేషణ చేసుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్న మాటలు, ఆలోచనలు చాలా మట్టుకు పాఠకుడిని మరింత ఆలోచింప చేస్తాయి. కొన్ని చోట్ల నిక్కఛ్చిగా మనలో ఉన్న అంతరంగాన్ని పట్టుకొని నిలదీస్తాడు. కొన్ని వాక్యాలు సూటిగా మనలని ప్రశ్నిస్తాయి, మనకి మనమే సమాధాన పరుచుకొనే లేని లేదా సమాధానాలు ఇవ్వలేని సందర్భాలు గానీ మనకు జరిగిఉంటే వాటిని మరలా స్పృశింపజేస్తాడు. కథ మొత్తం ప్రతీ మనిషి రోజువారి జీవితంలో జరుగుతున్న నిత్య సంఘటనల చుట్టూనే నడుస్తుంది. వాటికనుగుణంగా మనలో మనకి మనమే నిర్మించుకున్న అంతరంగ సన్నివేశాలు, భావ విశ్లేషణ మరియు మానసిక విశ్లేషణే కథా స్వరూపంగా కాశీభట్ల వేణు ఎంచుకున్నారు. పాత్రలు సన్నివేశాలు అందుకు అనుగుణంగా నిర్మించ బడ్డాయి.నిద్ర, ఆహారం మరియు మైథునం కోసం మనుషులు పడే ఆరాటం ప్రస్ఫుటంగా పాత్రల చిత్రీ కరణలో కనిపిస్తాయి.స్త్రీ మీద పురుషుడికి ఉన్న సహజ కామన, లేదా స్త్రీకి పురుషుడిపై కల సహజ వాంఛ, దానిని స్థిర పరుచుకోవటానికి అనాదిగా మనుషులు ఏర్పరుచున్న సమాజ నిర్మాణం తద్వారా ముడిపడే అడ్డంకులు అంతర్లీనంగా పాత్రల ద్వారా స్ఫురిస్తాయి.

కథకుడు “నేను” లేదా “నా” అనే అస్తిత్వపు లక్షణాలని అర్థం చేసుకోవటానికి పడే తీవ్ర ప్రయాస ప్రతీ చోట పాఠకుడిని గట్టిగా పట్టుకుంటాయి. అనాది కాలం నాటి అదే చిక్కు ప్రశ్న “నేను” అన్నదానికి అర్ధం ఏమిటి? లేదా జీవితానికి ఒక అర్ధం ఉందా? అన్న ఈ ప్రశ్నల వేట, వాటి సమాధానాల కోసం కథకుడి అన్వేషణ అంతర్లీనంగా ఈ నవలలో కొనసాగుతూ ఉంటుంది. చివరకి జీవితం ఒక అసంగతమని, అసందర్భమని,  అస్తవ్యస్తమైనదని,  అసమంజసమైనదని అదే అసంగతం గా భావిస్తాడు. జీవితంలో ప్రతీ నిముషం మనకి మనం నిర్ముంచుకున్న ప్రపంచాలలో మనం జీవిస్తూ ఉంటామని అవి పుడుతూ గిడుతూ ఉంటాయని, జీవితం కొన్ని వేల కోట్ల ఆలోచనలు అర్ధరాహిత్యంగా అస్తవ్యస్తంగా కలిపి కుట్టేసిన పేజీల పుస్తకమని, ఓ శిధిల ప్రహేళికా గ్రంధంగా వ్యాఖ్యానిస్తాడు.. మొత్తం మీద నాకు ఈ పుస్తకం చదువుతూన్నంత సేపూ “వశిష్ఠగీత” లో వశిష్ఠుడు రాముడుకి చెప్పినట్లు “జీవితం ఎవరికి వారు నిర్మించుకున్న చిత్త భ్రమ గానే అనిపిస్తూ వచ్చింది!”

చివరిగా ఇది ఒక మానసిక విశ్లేషణా రచన.మనలో నడుస్తున్న అర్థంకాని అంతరంగ కోలాహలాన్ని తలిపి తట్టే ఒక నవల. కాశీభట్ల వేణుగోపాల్ గారి మిగతా నవలల్లో లానే ఇందులో కూడా హిందూస్తాని రాగాల ప్రస్తావన, మద్యం మీద ఆయనకున్న అభిరుచి తిరిగి తిరిగి కనిపిస్తూనే ఉంటుంది. ఆయన మిగతా నవలల్లోలానే ఇందులో కూడా పాత్రల మీద పాఠకుడు ఏర్పరుచుకొనే ఆసక్తి లేదా ఆ కుతూహలానికి ఆశక్తితో ఏర్పరచుకున్న ప్రశ్నలకు సమాధానాలు పూర్తికి కనిపించవు.వాటిని పాఠకుడి ఆలోచనల మీదనే రచయిత వదిలివేశారు. ఏమో అది మాత్రం నాకు కొంత వెలితిగా అనిపిస్తుంది. చివరకి వచ్చేసరికి రచయితలో త్వరగా ముగించేయాలన్న ఆత్రం వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది! బహుశా కారణాలు అనేకం అయి ఉండవచ్చును! అయినా, ఇది ఆయన రచన ఆయన ఇష్టం. ఒక పాఠకుడిగా ఇది నా స్వంత అభిప్రాయం మాత్రమే. తెలుగులో ఇటువంటి రచనలు అరుదు. కానీ, ఉన్నజాబితాలో కాశీభట్ల వేణుగారి ఈ నవలనుకూడా తప్పకుండా చేర్చవలసిందే మరి!

You Might Also Like

Leave a Reply