సనాతనం-రాణి శివశంకర శర్మ
వ్యాసకర్త: అవధానం రఘుకుమార్
********
చాలా కాలం తరువాత తెలుగులో ఒక ఒరిజినల్ రచన చదివిన ఆనందం కలిగింది. శర్మగారు ఎదురుగుండా నిలబడి మాట్లాడినట్టే వుంది. చాలా విషయాల్ని ఒక గుళికల్లో పోసి, ‘‘ఐతే మిమ్మల్ని నిరుత్సాహ పరచడానికి రాశాను’’ అన్న ముగింపు అనేక క్రొత్త ప్రశ్నలను రేకెత్తించేలా వుంది. అంతకుముందే – ‘‘భారతీయ సనాతన దృష్టి లేనిదే నిజమైన ప్రశ్నలు ఉదయించే అవకాశం లేదు. సనాతనం అంటే స్వభావసిద్ధం, స్వయం చలనంతో ఉండే ప్రకృతి ధర్మం’’ అని కూడా అన్నాడు. అందువల్ల రచయిత మనల్నేమీ నిరుత్సాహపరచలేదు. పైగా మొదటి పంక్తి నుండి చివరి పంక్తి దాకా పరిగెత్తించారు.
నిజానికి నేను 1980 లలో కె.ఎమ్. మున్షీగారి ‘‘కాల్ ఆఫ్ వేదాస్’’ అనే పుస్తకం చదివినప్పుడు ఇలాగే ఉత్తేజానికి గురి అయ్యాను. అలాగే దిలీప్ నాయక్` ‘‘పొయెటిక్స్ ఆఫ్ హిస్టరీ’’ కూడా ప్రస్తుతపు శర్మగారి పుస్తకంలోని కొన్ని ఆలోచనలను స్పృశించాయి.
‘‘సనాతనం’’ అనే భారతీయ దృక్పథం, ‘‘ఆదిమ కమ్యూనిజం’’ అనే ఆధునిక మార్క్సిస్టు నిర్మాణం – రెండూ అత్యంత ఊహాజనితాలే అని చాలా కాలంగా నా అభిప్రాయం. రెండూ కల్పనలే! అయితే ఈ పుస్తకం చదువుతూ వుంటే ‘‘కాలం తాలూకు మరో డైమెన్షన్‌లోకి ప్రవేశించినట్టే వుంది.’’ నిజమే ‘‘వేద పురుషులు అనుభూతితో బహుళత్వాన్ని నిలుపుకుంటూ, బహుళత్వంలోని రంగునీ, రుచిని ఆస్వాదిస్తూనే బుద్ధితో ఇంకా చెప్పాలంటే మనోబుద్ధులకి అతీతమైన స్థితిలో ధ్యానంలో ఏకత్వాన్ని అద్వైతాన్ని సాక్షాత్కరించుకోవడానికి ప్రయత్నించారు.’’ కానీ ఆధునికులు ప్రత్యక్ష జ్ఞానం, అనుభవ జ్ఞానం అనే పరిమితులతో కూడిన జ్ఞానాన్నే జ్ఞానంగా భావించడం వల్ల ఈ సనాతనం అంటే అదేదో మృత విషయంగా కనబడుతుంది వారికి.
అయినా ‘‘భారతీయుల దృష్టిలో మృత్యువే జీవితం.’’ ‘‘అసలు విషయం మృత్యువు పట్ల మన దృష్టికోణంలో వచ్చిన మార్పు. ఈ మార్పు వల్ల ‘‘అమరత్వం’’ మిథ్యగా మారింది.’’ ‘‘అమరత్వం గొప్ప ఊహ!’’ ‘‘మృత్యువును అధిగమించినదేదీ లేదు.’’ మరి మృత్యువుని జయించడం ఎలా? అమరత్వం ఎలా? ఈ ప్రశ్నకు సనాతనం చెప్పిన జవాబు – ‘‘జన్మ రాహిత్యం.’’
ఒకచోట శర్మగారు ‘‘నిజానికి సాంఖ్యం ప్రకారం ఈ ప్రపంచం కాస్మోస్ కాదు. కేయాస్’’ అన్నారు. నిజమే దాదాపు ఇలాంటి భావన థెర్మోడైనమిక్స్‌లో కూడా ‘‘ఎంట్రోపీ’’ అనే భావనతో తిరిగి వస్తుంది. ఎంట్రపీ అంటే` ఒక క్లోజ్‌డ్ సిస్టంలో అలజడి, కల్లోలం, ఆటంకం నిరంతరం పెరుగుతూనే ఉంటాయి అన్న భావన. అయితే వైచిత్రి ఏమిటంటే సృష్టి, కల్లోలం ` అంతం విశ్వంలో నిరంతర ప్రక్రియలే.
ఈ రచనలో మొదటి 24 పేజీలు సూర్యుడు చుట్టూతా తిరిగాయి. ‘‘సూర్యవృక్షం’’, ‘‘సూర్యుడే కవి’’. ‘‘సూర్యుడూ-దేశం’’, ‘‘సూర్యుడు- కాలం’’ …ఇలా. ‘‘నిజమే సూర్యుడే కవి’’, సత్యాన్ని సత్యంగా చూసేవాడు, చూపేవాడు. మనం మానవ దృష్టి పరిధి నుంచి బయటపడి సత్యం కోసం వేచివుండాలి. అప్పుడు సత్యం సాక్షాత్కారం అదంతటదే జరుగుతుంది సూర్యోదయంలా’’ అంటారు శర్మగారు.
ఈ చర్చలో నన్ను మరింత ఆకర్షించిన విషయం – ‘‘కదలని కాలం – కదుల్తున్న దృష్టి.’’ ‘‘కాలం సగుణమా? నిర్గుణమా? కాలాలు ఉన్నాయా, కాలాలన్నీ వొకటేనా? కాలానికి విశేషణాలు వున్నాయా లేదా?’’ అన్న ప్రశ్నలతో మొదలయిన ఈ సంవాదంలో అనేక సంక్లిష్టమైన కాన్సెప్ట్స్ వరదలా ముంచెత్తాయి. ‘‘స్థల కాలం అనే పదాన్ని ఐన్‌స్టీన్ సృష్టించాడు’’ అంటూ ‘‘గడియారాన్ని కాలానికి ప్రతినిధి (రిప్రజంటేటివ్) గా మార్చినట్లుగా, దృశ్యాన్ని శబ్దాలకి ప్రతినిధిగా మార్చాం’’ అంటారు. ‘‘శబ్దం నశించి భాష మాత్రమే మిగలడం ఆధునిక హింస.’’ ఇందులో మరో ముఖ్య ప్రతిపాదన ‘‘కార్యకారణ, పరంపర కాదు, కార్యకారణ అభేద్యం మాత్రమే వుంది …’’ అని సాంఖ్యాన్ని ప్రస్తావిస్తూ చెప్పడం.
ఆధునిక పాశ్చాత్య తత్వశాస్త్రం గతి తార్కిక (Dialectical), విశ్లేషణాత్మక (Analytical), ధనాత్మక (Positive) లపై ఆధారపడి నిర్మాణం అయ్యింది. ఇందులో అన్నీ వ్యతిరేకతలు. నిరంతర ఘర్షణలు. నిజానికి ఈ విశ్వం అద్భుతమైన, అనంతమైన ప్రేమ, సహకారం, కలయికల ద్వారా నిర్మితమైంది. ఇది అర్థం కావాలంటే సనాతనమే దాని తాళం చెవి. ‘‘స్వభావం అనేది సనాతనంలో అతి ప్రధానమైన భావన’’ అనే మాటలు కూడా సనాతనాన్ని వివరించే ప్రక్రియ.‘‘భారతీయ తాత్వికులు అందరూ స్వభావ వాదులు.’’ ‘‘దేహం ఏదో ఒకరోజు నశించడం కాదు. ప్రతిక్షణం నశిస్తోంది..’’ ఆధునిక వైద్యశాస్త్రం కూడా మానవ శరీరంలోని ఏ కణం కూడా ఆరునెలలు దాటి వుండదు అంటుంది. అంటే ఎంత పుట్టుక, మరణం అనే మొదలు, తుదిలు కలవర పెట్టినా వాస్తవం ప్రతిక్షణం ఈ శరీరంలోని కణాలు నిరంతరం నశిస్తూ, పుడుతూ ఉంటాయి. ప్రతి కొద్ది కాలం తర్వాత ఇది కొత్త శరీరమే.
అయితే ఒకచోట ‘‘భారత తాత్వికతలోని విభిన్న శాఖల మధ్య ఒక సమానత్వం వుంది’’ అంటూ ‘‘ట్రాన్సెండెన్స్’’ లేదు అంటారు. కానీ నా పరిమిత వేదాంత అవగాహనలో (అంటే నేను శర్మగారిలా సంస్కృత పండితుణ్ణి కాదు.. నా జ్ఞానమంతా ఇంగ్లీషు అనువాదాలే!) ఈ ‘‘ట్రాన్సెండెన్స్’’ (అతీత) భావన వేదాంత, అద్వైతాలలోనే కాక, భక్తి సాంప్రదాయంసలోనూ బలంగా వుంది. ‘‘కాలాతీత విఖ్యాత’’ అనే ఒక భావన. టైం లెస్, ….. అనేది మరో ఆలోచన. వివేకానంద కూడ ఒకచోట పాశ్చాత్య` ‘‘గతి తార్కికత’’ గురించి మాట్లాడుతూ` ‘‘ఈ గతితార్కిక వలయం నుండి ‘‘ట్రాన్సెండెన్స్’’ అవ్వమని చెబుతుంది’’ అద్వైత అంటాడు. అయినా శర్మగారి ఆలోచనలు నన్ను పునరాలోచనలో పడేశాయి.
అంతిమంగా ‘‘ఉపసంహారం’’తో ‘‘మిమ్మల్ని నిరుత్సాహ పరచడానికే నేనీ పుస్తకం రాశాను. మీ ఆశలు అన్నిటినీ భంగపరచడానికే నేనీ గ్రంథం రాశాను.’’ అన్న మాటలలో ఆవేదన, సంక్లిష్టత, అర్థం అవుతోంది. ‘‘సనాతన’’ ని మనం ధైర్యంగా ఒక ఆధునిక పాశ్చాత్య ఖగోళ శాస్త్రజ్ఞుడికి, జీవశాస్త్ర నిపుణుడికి, న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్తకూ సాప్ట్‌వేర్ నిపుణుడికి పరిచయం చేయగలమేమో కానీ, మన ప్రక్కనే వున్న భారతీయుడికి కాదు. ఎందుకంటే భారతీయుడు సహజత్వంతో అంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు. పంతొమ్మిదవ శతాబ్దపు పాశ్చాత్య జ్ఞాన పంజరంలో చిక్కుకున్న చిలుకలు ఇవి. పాశ్చాత్యులు మర్చిపోయినా, వదిలేసుకొని ముందుకు పోయినా … మన స్నేహితులు ఆ కొక్కేలకు ఇంకా వేలాడుతూన్న జీర్ణవస్త్రాలు. అలాగని సంభాషణ ఆపలేము. కొనసాగించవలసిందే.
రాణీ శివశంకర శర్మగారి ‘‘సనాతనం’’ జో ప్రచురణ, సత్తెనపల్లి.
పంపిణీదారు : అనల్ప బుక్ కంపెనీ, సికిందరాబాదు.
కాపీలకు సంప్రదించవలసిన నంబర్లు. 7396666942 / 7093800303.
వెల : రూ.125/-
డా. అవధానం రఘుకుమార్ 9441015709
Leave a Reply