యతి మైత్రి

వ్యాసకర్త: తమ్మినేని యదుకులభూషణ్
(విన్నకోట రవిశంకర్ గారి పుస్తకానికి రాసిన మిత్ర వాక్యం)

*************

కవి యతి కానవసరం లేదు. కారణం కవి మార్గం వేరు. అనుభవాలను సంగ్రహించి , పదశక్తితో వాటిని వడగట్టి, అర్థవంతమైన కవితను సృష్టించి, ప్రపంచం మీదికి వదలడం కవిధర్మం. ఆ తర్వాత- కవిత్వం ద్వారా వచ్చే దూషణ భూషణల విషయంలో యతిమార్గం – నిర్మమమకారంతో జీవించడం – ఎంతో శ్రేయస్కరం.

నక్షత్ర కాంతితో మెరిసిపోయే రాత్రులు , స్వర్ణ సైకత ద్యుతితో వెలిగిపోయే మధ్యాహ్నాలు , పొద్దును స్వాగతిస్తూ పొగమంచులో మునిగిన గడ్డి మైదానాలు, మురిపెంగా తాకి హాయిగొలిపే చిలిపిగాలి – పిల్లల నవ్వులు, ప్రియురాలి దరహాసం, అవధుల్లేని తల్లితండ్రుల కరుణ, స్నేహితుల ఆదరం, గెలుపూ ఓటములు, భయాలు, భ్రాంతులు, ఎదురీతకు వెరవని సాహసం, పడిలేవగల ద్రఢిమ – సకలానుభవాలు కవిత్వంలో ప్రవేశిస్తే గాని మన జీవితం మరింత అర్థవంతంగా మారదు కావున, కవిత్వానికి జీవగఱ్ఱ అనుభవం – అది లేనిది కవిత్వం హుళక్కి .

కవిగా ఎరిగున్న మనిషిని నిజజీవితంలో కలవడం అన్నివేళలా సాధ్యం కాదు. అలా కలవడమే కాదు, ఆ వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడి, ఆ పై కవిత్వం గురించి నిత్యం,చర్చోపచర్చలు చేయడం, ప్రవాస జీవితంలో బహు సకృతుగా జరుగుతుంది. విన్నకోట రవిశంకర్ కవిత్వాన్నే కాదు , జీవితాన్ని దగ్గరగా పరిశీలించే అరుదైన అవకాశం లభించింది నాకు. రవిశంకర్ నిజజీవితంలో సరళస్వభావానికి పెట్టింది పేరు. తన జీవితానికి, కవిత్వానికి మధ్య అట్టే ఎడం లేదు, కనుక అదే సరళత కవిత్వంలోకి ప్రవేశించింది. మూడు పుష్కరాలకు పైబడి తను రాస్తున్న కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి తలబద్దలు కొట్టుకునే అవసరం లేదు. అడ్డగోలుగా, కలగాపులంగా రాసి అదే కవిత్వం అని దబాయించే అధికులకు భిన్నంగా- ప్రసన్నంగా మనసుకు పట్టే కవిత్వాన్ని సృష్టించాడు.

‘మంచు కరిగాక’ కనిపించే మనోహర దృశ్యాల్లో ఒకటి :

“ఒక్క రాత్రిలోనే
ముసలి రూపం దాల్చిన ఇళ్లన్నీ
ఇప్పుడు అక్కడక్కడ నెరిసిన తలలతో
నడివయసు గృహస్తుడిలా కనిపిస్తున్నాయి “

అద్వైతభావనగల కవి దర్శించిన ‘వృక్షచిత్రం’ :

“జలజలా కురిసే వానలో
తలారా స్నానం చేసి
తడిబట్టలతో సిగ్గుల మొగ్గైన
పడుచుపిల్లలా మెరుస్తుంది”

‘మళ్ళీ వసంతం’ లో యౌవనం , ముసలితనం వెలుగు నీడల క్రీడలా చిత్రించిన వైనం :

“పారిపోయే వెలుగు
నీపై పడి మెరిసినప్పుడు
ఎప్పటెప్పటి జ్ఞాపకాలో
నా చీకటి కళ్ళ గుబుర్లలో
మిణుగురులై మెదుల్తాయి”

‘మరుపు’ రాని వాక్యాలు :

“చిన్నప్పటి జ్ఞాపకాలు
శిలాశాసనాలు
నిన్నటి అనుభవాలు
నీటిపై రాతలు “

ఎవ్వరూ తప్పించుకోలేని “కాలగమనం” :

“ స్మృతి పథంలో ఏనాడో కనుమరుగైన వాళ్ళు
మృతివార్తతో మళ్ళీ కళ్ళలో మెదుల్తారు “

రవిశంకర్ కవిత్వాన్ని జాగరూకతతో చదివే పాఠకునికి – అందమైన జలపాతం వెనుక దాగిన రహస్యమయదీప్తిలా- అందులో తప్పక ఒక తలపోత , తాత్వికత పొడసూపుతాయి. ఈ సందర్భంలో, ప్రజాగర పర్వంలోనిది , ‘ శ్రేష్ఠమగు పాండిత్యపు మాట పలుకమ’న్న సాధ్యుల వినతిని మన్నించి – ఆత్రేయమహర్షి ఒసగిన సమాధానం ఒకటి గుర్తుకు వస్తుంది :

“ఏ తత్కార్య మమరాః సంశ్రుతం మే
ధృతిః శమః సత్యధర్మానువృత్తిః
గ్రంథిం వినీయ హృదయస్య సర్వం ,
ప్రియాప్రియే చాత్మ సమం నయీత “

( ‘అమరులారా, చేయవలసినది ఇదియని నేను గురువుల వల్ల విన్నాను- శాంత చిత్తంతో , ఉత్తమాచరణతో, హృదయపు ముడిని విప్పుకుని, ప్రియాప్రియాలను సమదృష్టితో చూడగలగాలి )

అందరూ నిష్క్రమించాక చివరకు మిగిలే ‘ ఆఖరి మనిషి ‘ :

“చిన్నప్పటి గ్రూప్ ఫొటోలో
చిరునవ్వులు చిందించిన వారంతా
ఎవరి ఫొటో వారు వెతుక్కుని
వెళ్ళిపోతారు “

‘.. అన్నిముడులు విడిపోయాక ,
అన్ని తీగలు తెగిపోయాక ,
ప్రపంచంతో కలిపే ఏకైక సూత్రంలా
శుష్కించిన ఒక శరీరం ‘
మిగిలిపోతుంది.’

*******

అంతర్జాతీయంగా రాజకీయ వాతావరణం చల్లబడుతున్న రోజులవి.
1980ల్లో రష్యా నాయకత్వంలో మార్పు, గోర్బచేవ్ నేతృత్వంలో సంస్కరణలు [పెరెస్త్రొయిక(перестройка)- పార్టీపరమైన పునర్నిర్మాణం, గ్లాస్నోస్త్ (гласность)- ప్రభుత్వ విధుల్లో పారదర్శకత], దాని వల్ల అగ్రరాజ్యాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు తొలగి, కొత్తగాలులు వీస్తున్న కాలం- ముఖ్యంగా రష్యాకు కొమ్ముకాసే మన వామపక్షవాదులకు బలవంతంగానైనా కనువిప్పు కలిగిన కాలం. తెలుగు సాహిత్యం పై వారి పట్టు సడలి, విప్లవాలు, వీరంగాలు తగ్గి, కవిత్వ విహంగం స్వేచ్ఛగా ఎగరడానికి అనువైన వాతావరణం ఏర్పడింది.

“ The great enemy of clear language is insincerity. When there is a gap between one’s real and one’s declared aims, one turns as it were instinctively to long words and exhausted idioms, like a cuttlefish spurting out ink” ( Politics and English – George Orwell , 1946)

“నీతీ, నిజాయితీ లేకపోతే స్పష్టంగా రాయలేరు. చిత్తశుద్ధి లేనిరాతల్లో అర్థం పర్థం లేని బరువైన పదాలు, నలిగిపోయిన పలుకుబళ్లు అనాలోచితంగా చోటుచేసుకుంటాయి” అని రెండు ప్రపంచ యుద్ధాలు , మారణ హోమాలు , నియంతృత్వ పాలన కళ్లారా చూసిన ఆంగ్లరచయిత జార్జ్ ఆర్వెల్ అభిప్రాయం వెలిబుచ్చి మూడు దశాబ్దాలు దాటాక, నిజానుభావాలను నిజాయితీగా వ్యక్తం చేసే కొత్త తరం కవులు ముందుకొచ్చారు. వారికి కవిత్వంతో సమాజాన్ని మార్చాలి అన్న పిచ్చిభ్రమలు లేవు. అరువు తెచ్చుకున్న డాంబిక సిద్ధాంతాల బరువూ లేదు, వారికున్నదల్లా నిజాయితీయే,కాబట్టి -సహజంగా వారిభాష కలకదేరి, మరింత తేటపడి, సరళంగా, స్పష్టంగా మారింది. వీరికి చక్కని ప్రతినిధిగా నిలబడతాడు విన్నకోట రవిశంకర్. అంతేకాదు, సంధి యుగంలో కవితా ప్రస్థానం ఆరంభించి , నిజాయితీగా రాస్తూ తనకు తెలియకుండానే తెలుగు వచన కవిత్వ శైలీ నిర్మాతల్లో ఒకడుగా నిలిచిపోయాడు అంటే అతిశయోక్తి కాదు.

******

తనకు తెలిసిన దైనందినజీవితాన్ని, తనదైనటువంటి అనుభవాలను నిజాయితీగా కవిత్వంలోకి ప్రవేశపెట్టి – వాటికి కావ్యగౌరవాన్ని కలిగించాడు. తనది కవిత్వానికి కట్టుబడిన జీవితం- కనుకనే, కవిత్వాన్ని అందలమెక్కించే ఏ అవకాశాన్ని వదులుకోలేదు. పత్రికల్లో సాటి కవుల కవితాగుణాలను ఉగ్గడిస్తూ వ్యాసాలు ప్రకటించినా ,నానా సభల్లో కవిత్వాన్ని విశ్లేషిస్తూ జనరంజకమైన ఉపన్యాసాలు వెలయించినా అవన్నీ తన జీవితంలో విడదీయరాని భాగమే.

విదురుడు పేర్కొన్న పండితలక్షణాల్లో పెక్కు రవిశంకర్ లో కనిపించడం యాదృచ్చికం కాదు. దూతగా వచ్చిన సంజయుడు రేపటి సభలో ఏమి చెప్పబోతాడా అని ధృతరాష్ట్రుడిలో ఆందోళన మొదలై, మనశ్శాంతి కరువైంది. ఆ నేపథ్యంలో , నీతికోవిదుడైన విదురుడు, నిదుర రాక అలమటిస్తున్న ధృతరాష్ట్రుడి వ్యాకులతను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో విలువైన కొన్ని పండిత లక్షణాలు పేర్కొంటాడు. విదురుడు పేర్కొన్న పాండిత్యం పుస్తకాలకు పరిమితమైనది కాదు. తిక్కన మాటల్లో చెప్పాలంటే “ నడవడికొప్పు సేయు “ నటువంటిది..

“క్షిప్రం విజానాతి చిరం శృణోతి
విజ్ఞాయ చార్థం భజతే న కామం
నాసంపృష్టో వ్యుప యుఙ్క్తే పరార్థే
తత్ప్రజ్ఞానం ప్రథమం పణ్డితస్య “

( “విషయమును త్వరగా ఎఱుగును . జ్ఞానము గట్టిపడుటకై చాలా కాలము వినును . చక్కగా తెలిసికొనియే దేనినైనా సేవించును. అంతే కానీ కామముతో కాదు. ఇతరులు అడగకుండా నోరు పారవేసికొనడు . పండితుని తొలి చిహ్నమిది.” )
( శ్రీమన్మహాభారతం, ఉద్యోగ పర్వము -అనువాదం /వ్యాఖ్యానం -శలాక రఘునాథ శర్మ)

ఇటువంటి పాండిత్యాలమీదే నాకు ఆసక్తి. ‘పుస్తకాలు చదివి చదివి ఎవడూ పండితుడు కాలేడు- రెండక్షరాల ప్రేమను – నిండుగా ఎరిగిన వాడే నిజమైన పండితుడు అని కబీర్ వాక్కు. అదే విషయాన్ని బలపరుస్తూ “ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినగాని , హీనుడవగుణంబు మానలేడు “ అన్న వేమన నిష్కర్ష – ఇటువంటి పాండిత్యాన్ని పొందిన వాడే, జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చగల కవిత్వాన్ని సృష్టించగలడు. ఈ విషయాన్ని గుర్తించబట్టే కవికుల గురువు ఇస్మాయిల్ “జీవిత పుటల్ని చివరిదాకా తిరగవేసే ఆసక్తి , నిజాయితీ , ధైర్యమూ రవిశంకర్ కున్నాయి “ అని – సరిగ్గా ముప్పై ఏళ్ల క్రింద “ కుండీలో మర్రి చెట్టు “ కు రాసిన మహత్తరమైన తమ పరిచయవాక్యాల్లో తీర్మానించగలిగారు.

తన కవిత ద్వారా కవి చేయగల పనిని ( “చీకటిలో ఉన్న వస్తువు మీద వెలుగు ప్రసరించడమే)- గుర్తించి – సదరు కవితకు వన్నె తెచ్చే గుణాలు ( “ఏ కవితలోనైనా కవి నిజాయితీ, తనదైన స్వరం వినబడాలి “) స్పష్టంగా తెలపడమే కాదు – ఇప్పటి వరకు తాను రచించిన కవిత్వం – తన కవితాదర్శానికి ఉజ్వల ఉదాహరణగా నిలిచేలా జాగ్రత్త వహించారు. ఇది అంత చిన్న విషయం కాదు. జీవితంలో, ఒక ఆదర్శానికి కట్టుబడి – సమస్త సాహిత్య వ్యాపారాన్ని దానికి అనుగుణంగా నడపడం, అందులో పరితృప్తి చెందడం -అంతకన్నా కవికి కావలిసినదేముంది ??

కానీ, తెలుగునాట కవి పరిస్థితి విపరీతము – సొంత అనుభవాలను తోసిరాజని, చేతికి అందివచ్చిన సిద్ధాంతాలధూపంతోనో, దినపత్రికలనుంచి దిగుమతి చేసుకున్న వార్తలధూమంతోనో, ధీమాగా చెలరేగిపోవడం, తర్వాత ఆ రాతలను కవిత్వమని భ్రమింపజేసి, పరభాషల్లోకి అనువాదాలు చేయించుకుని, అడ్డమైన పురస్కారాల కోసం అర్రులు చాచడం – జీవితకాలంలో ఒక్కటంటే ఒక్క కవిత రాసి ఎరుగని స్వయంభువులైన కవిత్వ పీఠాధిపతుల అవస్థ ఇది.

దానికి భిన్నంగా, దాదాపు నాలుగు దశాబ్దాల కాలంలో కవి కూర్చిన కవితలు నూటా ముప్పై మూడు అంటే – ముక్తసరిగా ఏడాదికి మూడు కవితలు. మనవారికి ప్రతి సంక్రాంతికి ఒక కవితాసంకలనం వేయనిది నిద్రపట్టదు. రవిశంకర్ ఇబ్బడి ముబ్బడిగా రాయకపోవడానికి ఏమిటి కారణం ? అని విచారిస్తే – మళ్ళీ విదురుడే దిక్కు :

“వాక్ సంయమో హి నృపతే సుదుష్కరతమో మతః
అర్ధవచ్చ విచిత్రం చ న శక్యం బహు భాషితుమ్ “

( పలుకును పట్టియుంచుకొనుట రాజా! మిక్కిలి దుష్కరమైన కార్యము.
అర్థవంతముగా, చమత్కారముగా ఎక్కువ పలుకుట సాధ్యము కాదు “)

  తమ్మినేని యదుకులభూషణ్                                   29- 11- 21

                                                                                       న్యూ జెర్సీ 

You Might Also Like

Leave a Reply