పి.సత్యవతి కథలు

వ్యాసకర్త: సూరపరాజు పద్మజ

*******

వారు కథలు ఎందుకు చెప్పవలసి వచ్చిందో ముందుమాటలో తనే చెప్పుకున్నారు సత్యవతి గారు – ఇలా కథనూ, అది పుట్టేందుకు కారణమైన వ్యథనూ కడుపులోనే దాచుకుని ఎల్లకాలం మామూలుగా తిరగడం తెగని నరకం, వాటిని బయట పడెయ్యడమే విముక్తి కథకూ, దాన్ని మోస్తూ వచ్చిన మనసుకు అని. అయితే, అంతగా ఆమెను బయటికి చెప్పిందాకా నిలవనివ్వని ఈ సమస్యలు వారివి కావు. సంఘం లోని సమస్యలు మనుషులందరి ముందు బెట్టి చర్చించడం సంస్కర్తలు భుజాన వేసుకునే బాధ్యత. తన తోటి మనుషుల బాధలు సంఘం దృష్టి కి, ఒక్కొక్కసారి బాధితుల దృష్టి కి కూడా తీసుకురావడం తప్పించుకోలేని బాధ్యత కొంతమంది కి. అలా ఒక అత్యవసర కారణం వ్రాయించినా, ఈ రచయిత్రి రచనలలో ఎక్కడా ప్రథమకోపంతో వచ్చే ఉద్రేకం, తీర్పులు ఇచ్చే నైజం మచ్చుకి కూడా చూడలేము.


తన ఎరుకలోని స్త్రీల చుట్టూ బిగించి ఉన్న ఇరుకు నిరంకుశత్వపు చట్రం చువ్వలు కదిలించడానికి ఉట్టి తాటాకు మంటలాటి ఉక్రోషం, దోషులను నరికేసో, కాల్చిపారేసో గొడవ వదిలిపోయింది అనుకునే తాత్కాలిక ఆగ్రహమో కాదు కావలసిన ఆయుధం అని గ్రహించిన ఆలోచనబలం, చేపట్టిన పనిపట్ల వీగిపోని నిగ్రహం, నిబద్ధత, కార్యశీలత ఉన్న ఉద్యమకర్త సత్యవతి. తిరుగుబాటు కర్రలతో, కరపత్రాలతో నడిస్తే దాని నిడివి కొన్నిరోజులు.

విషయాన్ని పునాదుల్లో పట్టుకోవాలి, రుగ్మత లక్షణాలు కాకుండా మూలకారణం పైకి అందరి దృష్టి మళ్ళించడమే కర్తవ్యం. ఆ కారణమే ఆమెను కథలు చెప్పేట్లు చేసింది. ఈ కథలు ఆడవాళ్ళే చెప్పగలిగినవి, చెప్పవలసినవి.

పురుషాధిక్య ప్రపంచంలో తమ, దుఃఖాలో, సౌఖ్యాలో మా తరఫున వ్యక్తీకరించండి అని ఆ అధికారం కూడా మగరచయిత చేతిలో పెట్టడం మనస్కరించక తామే చెప్పదలుచుకుని స్త్రీలు తమ కథలు వ్రాయడం మొదలు పెట్టి దాదాపు వంద సంవత్సరాలు అవుతున్నా ఇంకా చెప్పేందుకు మిగులుతునే ఉండటమూ ఒక కారణం ఈమె ఈ పని తలపెట్టడానికి.

పీడిత స్త్రీల గొంతు తనదిగా చేసుకోవలసి రావడం ఒక అగత్యం ఇటువంటి రచయితలకు. జరుగుతున్న విషయాల ప్రేరణకు వ్రాసేవి నమ్మదగిన కథలవుతాయిగానీ, ఒక వాదమో, సిద్ధాంతమో కథలను ఉత్పత్తి చేస్తే వందలు వేల సంఖ్యల్లో తయారయే ఒకే నమూనా కార్ఖానా వస్తువుల్లానో, ఒకే మొహం వేసుకున్న బార్బీ బొమ్మల్లానో ఉంటాయి అవి.

సత్యవతి గారిది indispensable need, the need to talk truth. కఠిన సత్యాలను వ్రాయాలని పూనుకున్నవారి రచనల్లో సహజంగానే పరువాల ప్రాయపు అందం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల్లో ఎవరో ఒకరి వివాహేతర ఆకర్షణ, వీటిల్లో సుఖమైన సొగసైన తీరికగల అంతఃసంఘర్షణ ఉండవు. పోనీ, కవిత్వం లాంటి వచనంలో పెడుతూ బాధ కూడా మల్లెలపొట్లంలా ఉంటుందేమో అన్నట్లు వ్రాయడమూ ఆమె లక్షణం కానేకాదు.

కాదనలేము, కథకు ప్రాణమే ఘర్షణ. అందుకే మనిషి మేధ నూ, వ్యక్తిత్వాన్నీ అది పడే సంఘర్షణల పరిమాణాన్ని బట్టి అంచనావేసి ఆ మేధకు, మేత ను నెమరు వేసే మనసున్న కథల పాత్రల staminaకు గౌరవ పురస్కారాలు ఇచ్చేయడం విమర్శకులకు, పాఠకులకు హోదాగల సాహితీ స్పృహ.

ఇలాంటి privileged substance ను, ముందుగా మూటకట్టి బావిలో పారేసి, ‘‘మనం ఇప్పుడు కొంచెం సేపు నిజాలు మాట్లాడుకుందామా, వైభవోపేతమైన ఆర్ద్ర కథానికలను గోడమీద చిలక్కొయ్యకు తగిలించి?‘‘ అని అన్నట్టుంటుంది సత్యవతి గారి కథలు చదవడం మొదలు పెట్టగానే. రోగులు వేల సంఖ్యలో టపటపా రాలిపోతున్నప్పుడు వృత్తి ధర్మం తెలిసిన వైద్యులెవరూ కాన్ఫరెన్సులు చేస్తూ, eulogies వ్రాస్తూ కూచోరు కదా. మెడపై కత్తి పెట్టైనా మిగతా డాక్టర్లను కూడా కదిలించి patients ను attend అవుతారు. రోగం ఏమిటో తొందరగానే తెలిసిపోయింది, ‘‘లింగ వివక్ష‘‘.


ఆడదాన్ని ఎప్పుడూ విద్యనుంచీ, అభివృద్ధి నుంచీ, ఆస్తి నుంచీ, అవకాశాలనుంచీ ఓ నాలుగు అడుగుల దూరంలో ‘‘ఆడ‘‘నే ఉంచుతూ వస్తున్న systematic discrimnation. She is the ‘‘Other” . ఈ వ్యాధి ఎంత లోతులకు పాతుకుపోయిందో ఏయే భాగాలు నాశనం చేసిందో, వదిలేస్తే ఇంకెంత దూరం వెళ్ళగలదో అంచనా వేసి , ఆ వైరస్ కు ఆదిలోనే ఎలా విరుగుడు వేసుకోవాలో టకటకా చెప్పేయడమే సూటిగా మాట్లాడే ఈ కథల పని.

వ్రాతలు ఎప్పట్నుంచో ఉన్నా, ప్రబలంగా సాహిత్యం పురుషుల చే, పురుషుల కొరకు, ప్రముఖంగా పురుషార్ధాలు ప్రధాన విషయం గా సృష్టింపబడుతూ వచ్చింది అనాదిగా. తిండిని, పిల్లలను, సృష్టించే పనికే పరిమితం కావించబడిన స్త్రీ లు అప్పుడప్పుడూ వంటగదిలోంచో పురిటిగదిలోంచో తొంగిచూడటమే చూపించాయి ఈ సాహిత్యం లోని ఒకటీ అరా పుటలు. ఇల్లలకడంలో, పిల్లల పెంపకంలో, కుటుంబ ఆదాయం పెంచటం లోనే తృప్తిగా విలీనమైపోయే ఆడవారిని తమ కథల్లో చూపించడం వాస్తవం చూపించడమా, లేక అదే అవలంబించతగ్గ ఆదర్శమని బోధించడమా? ఇటువంటి సాహిత్యం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనే విషయం స్త్రీలు తేల్చుకునే లోపు శతాబ్దాలు దొర్లిపోయాయి.

అంతేనా, రాజ్యాలు కూలిపోవడానికీ, పోరాటాలు రాజుకోవటానికీ, పురుషుడి పతనానికీ ‘‘ఆమె‘‘ నే కారణంగానూ చూపించ ప్రయత్నించాయి మగవాళ్ళు వ్రాసిన కొన్ని కథలు. పురుషుడి ప్రతి తప్పటడుగుకీ స్త్రీ గుణగణాలే కారణం. స్త్రీ ఎప్పటికీఅట్టడుగున నిలబడిపోవడానికీ స్త్రీ వ్యక్తిత్వం లోని అవకరాలే కారణం అని కూడా చెప్తూ వచ్చిన కథలు నిజం కాదు, అవి అబద్ధాలు అని చెప్పడం తప్పనిసరి అవసరం అయింది మహిళకు.

తన చిత్రీకరణ లో మార్పు వస్తేకానీ తన దర్శనం లో సత్యం ఉండదు అని తెలుసుకుని ముందుగా స్వంత అభివ్యక్తీకరణకు పూనుకున్నారు తొలితరం మహిళా రచయిత్రులు. ‘‘మేము ‘‘‘‘అలా‘‘‘‘ ఉన్నాం కాబట్టి మా స్థితి ఇలా లేదు, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మేము ‘‘‘‘అలా‘‘‘‘ ఉండవలసిన వస్తోంది‘‘ అని సిమోన్ ది బువా తో మొదలుపెట్టి ఇప్పటి ఆడవాళ్ళవరకూ మళ్ళీ మళ్ళీ చెప్పవలసి వస్తోంది.

కాలక్రమేణా వీరి పోరాటాలు, ఉద్యమాలు, సత్యాగ్రహాలు కొన్ని హక్కులు సాధించిపెట్టాయి ఆడవారికి. వంద, రెండొందల సంవత్సరాల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవు, ఖచ్చితంగా. ఎన్నికల్లో వోటువేయగలగడం నుంచి ఎన్నికల్లో పోటీ చేయగలగడం వరకూ, సమాన విద్యా, ఉద్యోగం చేజిక్కించుకోవడం, చట్టరీత్యా ఆస్తి లో భాగం ఉందనిపించుకునేవరకూ వచ్చారు.

కానీ లా పుస్తకాల్లో, రాజ్యాంగపుటలలోని అక్షరాలు, ‘‘అవతలి వాడి జేబులో ధనం లాగా, పుస్తకంలో చదువులాగా‘‘ అక్కరకు రాదు ఆపదవేళలలో .

జనాలకు ఒక Paradigm shift జరిగితే తప్ప , family dynamics మారితే తప్ప రోజువారీగా ఆడది ఇంచ్ ఇంచ్ గా అణగద్రొక్కపడటం లో మార్పు రాదు.
హామ్లెట్ , తండ్రి హత్యను స్టేజ్ మీద నాటకం గా వేసాడు, దోషి ఎవరో తను తెలుసుకోవడానికి కాదు, ‘‘ నీ కథ, నీ సంగతి నాకు మొత్తం తెలుసు, ఇప్పుడు లోకానికి కూడా తెలిసిపోయింది ‘‘ అని దోషి కి తెలియచెప్పడానికి.

సత్యవతి గారు చేసిందీ ఇదే. ఈ కథలు చదివేసి ఏమీ జరగనట్టు నటించి పక్కన పడేయలేరు conscience ఉన్న ఆడామగా ఇద్దరూ . రచయిత్రి ఈ కథల్లో చూపించని ప్రపంచ పార్శ్వం లేదు, చర్చించని సంగతి లేదు.

పైగా చాలా నిష్పక్షపాతంగా సత్యవతి గారి కథలు స్త్రీకి తన పతనంలో తనది ఎంత వంతు పాత్ర నో చూపిస్తాయి. ఇలా తనను తనకే హానికారకంగా మారుస్తున్నదెవరో అదీ తెలుసుకోండి అనీ ప్రోద్బలం చేస్తాయి.


అది internalised పురుషపక్షపాతపు ఆలోచనా ధోరణి. ‘‘Male feminists‘‘ అనే మాట అబద్ధపు అసహజపు సమాసం. కానీ పురుషాధిక్యత అస్థికృత్తు గా ఉన్న ఆడవాళ్ళు మటుకు చాలామంది మనచుట్టూ ఉన్నారు. మగ, ఆడ ఇద్దరిలో ఉన్న ఈ ధోరణిని, రోగాన్ని diagnose చేసి వ్రాసిపెట్టిన findings సత్యవతి గారి కథలు.

సమస్యకు కారణాలు ఎక్కడెక్కడ ఏయే స్థానాల్లో, స్థాయిలలో ఉన్నాయో చూస్తాం ఇక్కడ. సమస్య నిజానికి ఒకటే. ఆమెకు సంబంధించిన విషయాలన్నిటిలో నిర్ణయం ఆమెది కాదు, అంతే.

చదువు, ఆటలు, ఉద్యోగం, పెళ్ళి, ఆఖరుకి ఎంతమందిని, ఏ జెండర్ పిల్లలను కనాలి, జీతం ఎంత తెచ్చుకోవాలి, ఇంటికి ఎంతకు రావాలి, ఉద్యోగంలో బదిలీలు ఉండాలాకూడదా …. అన్నీ ఆమె యజమాని నిర్ణయిస్తాడు.

తనకు నిర్ణయించుకోగల శక్తి, హక్కు ఉన్నాయన్న జ్ఞానాన్ని మొలకలోనే తెంపేస్తూ వచ్చింది ఈ వ్యవస్థ. శుభ్రమైన పులుసుకోసం కుంకుడుకాయల్ను చితక్కొడ్తూనే గింజ వేర్పాటును చాకచక్యంగా చేసినట్లే ఆడదాని నుంచి దాని బుర్ర ను విడదీసి పడేసి పులుసు పిండుకోగల system ఇది.

ఈమధ్య కాలంలో నియంత్రణ రూపం మారింది కానీ అసలు విషయం ఇంకా పూర్తిగా మారలేదు. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వత్తిడి పడుతోంది స్త్రీ పైన.
తను తొందరగా వత్తిళ్ళ కు లొంగిపోతుంది. ఆ వత్తిడి ఇంట్లో ప్రేమ కావచ్చు, బయట మార్కెట్ కావచ్చు. లోబడే గుణం వదిలించుకోకపోతే స్త్రీ ని చాలా వ్యవస్థ లు బానిసను చేస్తాయి. మగవాడు దీనికి, ఈ వస్తుప్రపంచ నియంతృత్వానికి అతీతుడు కాదు కానీ, తన అసహాయత లను, నష్టాలను కూడా చివరకు తన భార్యపైనే మోపుతాడు.

ఒక్క తన భర్తకే కాదు స్త్రీ బానిస, భర్తకు భర్తలైన ఆయన ఆఫీసర్లు, ఆపై మేనేజ్మెంట్ లు, వాటిని శాసించే corporate ప్రపంచం, ఆ ప్రపంచం ప్రదక్షిణ చేసే వస్తువినియోగ సిద్ధాంతం, దానిని ఆయుధం చేసుకున్న గ్లోబల్ మార్కెట్.
ఈ వలయంలో కేంద్రం డబ్బు, వలయపు చిట్టచివరి కక్ష్య లో నిరంతరం గానుగెద్దులా తిరిగే స్త్రీ. ఆడదానికి ఆర్థిక స్వాతంత్య్రం అతిముఖ్యం. ఆర్థిక స్వాతంత్య్రం అంటే డబ్బు సంపాదించడం తో ఆగదు, దానిని వినియోగం చేసే స్వాతంత్య్రం కూడా కలిగి ఉండాలి.

Slavery at all levels is the internalised feature of this system, and its worst victim is the woman.

ఆడది మాయ అంటారు కానీ, తనను తాను, కుటుంబం అనీ, మర్యాద అనీ, ప్రేమ అనీ బాధ్యత అనీ త్యాగం అనీ చివరకు తనలోనే తప్పు ఉందనే మైకంలో పడిపోయి, ఆడది తననే మాయచేసుకునేట్టు చేసేదే ఈ పురుషస్వామ్య సంఘం. ఇంట్లో అందరి బాధలనూ పీల్చుకోవడానికి పుట్టాననుకునే బ్లాటింగ్ పేపర్ ఆడది.

స్త్రీ తెలుసుకోవలసింది తనకు సరైన స్పృహ అవసరం అనే సంగతి, అది అడుగడుగునా, దినదినమూ అభ్యసించవలసిన విద్య. అది ఎలా ఎక్కడెక్కడ అవసరం అవుతోందో ఈ కథలు చెప్తాయి, ఏ మాత్రం కేకలు, అరుపులు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు లేకుండా. చిన్న చిన్న సంభాషణలతో, వాస్తవ సంఘటనలను మర్యాద పూర్వకమైన దూరం నుంచి చూస్తూనే ఈ ఎఱుక కలిగిస్తారు రచయిత్రి.

శైలి, శిల్పం పట్టుకువేలాడ్డం నా style కాదు అంటూనే , ఈ రచయిత్రి కథను ఎంత విప్పాలో , ఎంత సూచించి ఊరుకోవాలో అంతే చేస్తూ ఈ కథలు వ్రాశారు. కథ నడవడమే కథనం.

ఈ కథలు చదివితే మనం మనకు మరింత బాగా తెలిసొస్తాం. ఇంకొకర్ని తిట్టుకోవడం మానేస్తాం. మనం మెరుగవ్వాలంటే ఏం చెయ్యాలో అది చేయడం అవసరమని తెలుసుకుంటాం. స్త్రీ ప్రతి బలహీనత వెనక పరిస్థితులేంటో ఇంకాస్త దయగా , వివేకంగా చూడగలుగుతాం.

తెలుగులో అచ్చం గా ఆడవారిచేత ఆడవారికోసం ఆడవారి కథలు చెప్పిన పుస్తకం ఇది.

ఎన్నో దాచుకోవలసిన వాక్యాలు, అందులో కొన్ని:
“మనిషికి కావలసింది కొంచెం ప్రేమ, కొంచెం జ్ఞానం, అహంకారం కాదు‘‘.
‘‘బతుకులో , చావులో శాంతి పరిరక్షణే కదా మన ఆడవాళ్ళ ధ్యేయం‘‘
‘‘ఓ స్త్రీ, వింటూపో, సున్తే జావ్, అందులోనే నీ భలా ఉంది‘‘
‘‘నీ తెలివి, నీ చదువూ, నీ ఉద్యోగం గుర్తొచ్చి నీవు ఎగిరిపడితే ఆ తల్లి మచ్చ ను ఒక paper weight లా వాడతాడు నీమీద‘‘.
‘‘భయాలతోరణం మధ్యతరగతి జీవితం‘‘
‘‘ప్రేమ సంబంధాలు ఉంటే బ్రతకాలి, అధికార సంబంధాలు, ధర్మాలతో తనకేం పని, ఏం ధర్మాలు తనకొక్కదానికేనా?‘‘
‘‘గాంధారి కంతలు తనకు ఇమడడం లేదు ఈమధ్య , అవి విప్పేయాలి అని తెలిసొస్తోంది‘‘

పురుషులందు పుణ్య పురుషులు లేకపోలేదయా కానీ సంఖ్యలో చాలా తక్కువయా . స్త్రీ జనోద్ధరణ అనేది ఏ స్త్రీ కి ఆ స్త్రీ నే చేసుకోవాలి. కావున ‘‘భద్రం గా పిల్లాపాపలతో నోములు పూజలతో, పార్టీ , ఖరీదైన హాలీడేస్ తో బ్రతికేస్తూ జీవితం వెళ్ళదీయకుండా చుట్టూ రకరకాల నరకాల్లో అణగారుతున్న నీ స్నేహితులకూ, ఇరుగుపొరుగుకూ, నీ భర్త కాదన్నా, అతన్ని కాదనైనా సరే నీకు చేతనైనంత సాయం చేయాలంటే ముందు నీకు జ్ఞానం కాస్త ఉండాలి అనే స్పృహ కొంచెం రావాలి‘‘ అని ఆడవాళ్ళ తో అంటున్న కథలివి. నిజం, నిజాయితీ, self- respect ఆడవారికి మరింత అవసరం అవుతున్న రోజుల్లోకి వస్తున్నాం ఇప్పుడు.

కథా సంకలనానికి వేరే టైటిల్, ముందుమాటలూ లేకుండా ‘‘సత్యవతి కథలు‘‘ గానే ఈ పుస్తకం తీసుకురావడం లోనే రచయిత్రి ఏంటో కూడా తెలుస్తుంది. ఒక మాట ఎక్కువ, తక్కువ వాడకుండా , అక్షరానికి ఇవ్వవలసినంత విలువనిచ్చి, అక్షరాలతో చేయించుకోవాల్సినంత పని efficient గా చేయించిన పనితనం ఈ గ్రంధకర్త కు స్వంతం. The style here is being straight.

Thank you for telling these stories Sathyavathi garu!

You Might Also Like

One Comment

  1. P Vasanta Lakshmi

    అద్భుతం పద్మజ..
    సత్యవతి గారి కథలు ఒక పుస్తకం కాదు ,ఒక ఆలోచనా ధోరణి , ఈ ఆలోచనకి రూపం ఎలా ఇవ్వాలన్న విషయం లో మటుకు నేను పూర్తిగా విఫలమయ్యాను ..పద్మజ నువ్వు “సత్యవతి కథలు “లో సారాన్ని ఎంత బాగా ఆకళింపు చేసుకున్నావు , ప్రతి స్త్రీ ఈ కథలు చదివి , తన కుటుంబ పరిధి అంటూ తనకు తాను సంకెళ్లు వేసుకోవడం , ఇకనైనా మానేసి , విముక్తి పొందాలి అనే నా ఆకాంక్ష..అందులో నేనూ ఉన్నాను.
    శతాబ్దాలుగా మన బుర్రలని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆడిస్తూ , ఈ పురుషాధిక్య సమాజం , ఒక్క నాటికీ కూడా అలసట చెందలేదు , అబ్బా..ఎంత కాలం ఇలా ఆడిస్తాం అంటూ విసుగు చెందలేదు అంటేనే తెలుస్తోంది..వారు ఈ ఆటలో ఎన్నెన్ని ప్రయోజనాలు పొందుతున్నారో..అని.
    మనమేమో పిచ్చి వాళ్లు లాగా , కొంచం వెసులుబాటు దొరకగానే , అదే సంపూర్ణ స్వేచ్చ అనే భ్రమలో హాయిగా ఉండి పోతాం.
    ఎంత కండిషనింగ్ చేయబడ్డాము..మనం..తలుచుకుంటే దుఃఖం ఆగదు.
    మెరుపు లాంటి ఎన్నో వాక్యాలు , నువ్వు రాసావు.అందులో బ్లాట్టింగ్ పేపర్ లా పీల్చుకోవడం అనేది ఎంతో నచ్చింది.
    సునిశితమైన సమీక్ష అంటే ఇది ..అని పది కాలాల పాటు చెప్పుకునేలా ఉంది.. ఈ సమీక్ష.పద్మజ..
    ఇది , ప్రారంభం మాత్రమే..మరెన్నో విలువైన సమీక్షలు నీ నుంచి చదవాలని ఎదురుచూస్తూ
    వసంత లక్ష్మి.పి.

Leave a Reply