పంచతంత్రంలో కథల కొమ్మలు

వ్యాసకర్త: గాలి త్రివిక్రం

*********

రైమింగు కుదరడం వల్లో ఇంకెందుకనో గానీ మనకు మంత్రతంత్రాలు అని కలిపి చెప్పడం వాడుక. అంటే మంత్రానికి తోడుబోయింది తంత్రం అని చెప్తున్నామన్నమాట. మంత్రానికి మహిమ ఉంటుందని ఒక నమ్మకం. తంత్రానికి ఏముంటుందో తెలియదు (అంటే అసలేమీ తెలియదని కాదు, తంత్రమంటే ఉపాయమని ఒక అర్థం. సందర్భాన్ని బట్టి వేరే అర్థాలు వస్తాయి. ఉదాహరణకు కన్నడంలో ఇంజినీరింగ్ కాలేజిని తాంత్రిక కళాశాల అంటారు). అలాంటి తంత్రాలు ఐదు కలిసి పంచతంత్రం. ఆ ఐదు తంత్రాల్లో ఒక్కొక్కదాన్ని విశదీకరిస్తూ ఒక్కొక్క కథ. ఆ కథల్లో ఒక్కొక్కదాంట్లో మళ్ళా చిన్న కథలు, వాటిలో మళ్ళా బుల్లి కథలు. అందువల్ల పంచతంత్రంలో ఉండేది కథలో కథలో కథలో…కథ. ఇంతవరకూ అందరికీ తెలిసిందే.

అయితే, పంచతంత్రంలోని ఏ కథలో ఏ కథను ఎవరు ఎవరికి చెప్పారు? మొత్తం కథలెన్ని? ఇది ఒక పజిల్. నా దగ్గర గేయ, వచన రూపాల్లో 1985లో టిటిడి ప్రచురించిన విద్వాన్ విశ్వం గారి పంచతంత్రం పుస్తకం ఉండేది. తీరికూర్చుని ఆ కథల కమామిషూ ఏమిటో తేలుద్దామని చూడబోతే ఆ పుస్తకం మా ఊర్లో ఉండిపోయింది. సరే, అదైనా ఎట్లాగూ అంతకుముందు చందమామలో వచ్చిందేగదా, ఆ పాత చందమామల్లోనే వెతుకుదాం అని మొదలుపెట్టి జాబితా పూర్తిచేశాను. తీరా రెండు వర్షన్లనూ పోల్చి చూడబోతే కొన్ని తేడాలు కనిపించాయి. ఉదాహరణకు రెండు తలల పక్షి కథ తితిదే పుస్తకంలో అసమీక్ష్యకారిత్వంలో ఉండగా సీరియల్లో మిత్రసంప్రాప్తిలో చిత్రగ్రీవం ఇతర పావురాలతో చెప్పినట్లుగా ఉంది.

పూర్తిగా పోల్చిచూసినా ఆ రెండు వర్షన్లలో ఏది సరైనదో నిర్ధారించే వీలు నాకు లేకపోవడం వల్ల ఆ ప్రయత్నం అంతటితో కట్టిపెట్టి, నేను తయారుచేసిన లిస్టు పంచతంత్రంలోని కథల అమరికను స్థూలంగా తెలుసుకోవడానికి ఎవరికైనా కొంతవరకైనా పనికొస్తుందేమోనని ఇక్కడ ఇస్తున్నాను.

పంచతంత్రం: విష్ణుశర్మ ముగ్గురు రాకుమారులకు చెప్పిన ఐదు కథలు


1. వాటిలో మొదటిది మిత్రభేదం (పింగళకం అనే సింహం, సంజీవకం అనే ఎద్దు మధ్య చెడిన స్నేహం)
1.1. దాంట్లో కరకటం అనే నక్క దమనకం అనే నక్కకు చెప్పిన సీల పెరికిన కోతి కథ
1.2. దమనకం పింగళకానికి చెప్పిన రణదుందుభి కథ
1.3. దమనకం సంజీవకానికి చెప్పిన దంతిలుడి కథ
1.4. దమనకం కరటకానికి చెప్పిన దేవశర్మ – ఆషాఢభూతి కథ
1.5. దమనకం కరటకానికి చెప్పిన పామును చంపిన కాకుల కథ
1.5.1. దాంట్లో నక్క కాకికి చెప్పిన కొంగా, ఎండ్రకాయల కథ
1.6. దమనకం కరటకానికి చెప్పిన నీడ తెచ్చిన చావు (సింహం-కుందేలు)
1.7. దమనకం కరటకానికి చెప్పిన సాలె విష్ణువు కథ
1.8. దమనకం పింగళకానికి చెప్పిన కృతఘ్నుడి కథ
1.9. దమనకం పింగళకానికి చెప్పిన నల్లి కథ
1.10. దమనకం పింగళకానికి చెప్పిన కుకుద్రుమ రాజు (నీలి నక్క) కథ
1.11. సంజీవకం దమనకానికి చెప్పిన హంస – గుడ్లగూబ కథ
1.12. సంజీవకం దమనకానికి చెప్పిన మోసపోయిన ఒంటె కథ
1.13. దమనకం సంజీవకానికి చెప్పిన ఉల్లంకిపిట్ట కథ
1.13.1. దాంట్లో ఆడపిట్ట మగపిట్టకు చెప్పిన కొంగలు – తాబేలు కథ
1.13.2. ఆడపిట్ట మగపిట్టకు చెప్పిన మూడు చేపల కథ
1.13.3. ఆడపిట్ట మగపిట్టకు చెప్పిన పిచ్చుకా ఏనుగూ కథ
1.13.4. వివేకం గల పక్షి మిగతా పక్షులకు చెప్పిన ముసలి బాతు కథ
1.13.5. ముసలి బాతు గరుత్మంతుడికి చెప్పిన సింహమూ పొట్టేలూ కథ
1.14. కరకటం దమనకానికి చెప్పిన వంచకుడి కథ
1.14. 1. దాంట్లో మంత్రి రాజుకు చెప్పిన నాగకుమారుడి వధువు కథ
1.14. 1.1. దాంట్లో వధువు జనానికి చెప్పిన పుష్పకం కథ
1.15. దమనకం కరటకానికి చెప్పిన యుక్తి గల నక్క కథ
1.16. కరకటం దమనకానికి చెప్పిన నిరర్థకమైన హితవు (కోతి – సూచీముఖి) కథ
1.16.1. దాంట్లో కోతి – పిచ్చుక గూడు కథ
1.17. కరకటం దమనకానికి చెప్పిన దుష్టబుద్ధి కథ
1.17.1. దాంట్లో దుష్టబుద్ధి తండ్రి దుష్టబుద్ధికి చెప్పిన కొక్కిరాయి కథ
1.18. కరకటం దమనకానికి చెప్పిన ఇనుము తిన్న ఎలుకల కథ
1.19. కరకటం దమనకానికి చెప్పిన ముని వద్దా, బోయవాడి వద్దా పెరిగిన పక్షుల కథ
1.20. కరకటం దమనకానికి చెప్పిన రాజును చంపిన పెంపుడు కోతి కథ

2. పంచతంత్రంలో రెండవది మిత్రసంప్రాప్తి (హిరణ్యకం అనే ఎలుకకు, లఘుపతనకం అనే కాకికి, చిత్రాంగం అనే లేడికి, మంధరకం అనే తాబేలుకు మధ్య కుదిరిన స్నేహం)
2.1. చిత్రగ్రీవం అనే పావురాల నాయకుడు ఇతర పావురాలకు చెప్పిన రెండు తలల పక్షి కథ
2.2. హిరణ్యకం లఘుపతనకానికి చెప్పిన పాణిని – సింహం కథ
2.3. హిరణ్యకం లఘుపతనకానికి చెప్పిన జైమిని – ఏనుగు కథ
2.4. హిరణ్యకం లఘుపతనకానికి చెప్పిన పింగళుడు – మొసలి కథ
2.5. హిరణ్యకం లఘుపతనకానికి చెప్పిన ఇంద్రుడు – దితి కథ
2.6. హిరణ్యకం లఘుపతనకం & మంధరకానికి చెప్పిన చూడాకర్ణుడి కథ
2.6.1. దాంట్లో బృహస్పతి చూడాకర్ణుడికి చెప్పిన నువ్వుపప్పుకు ముడినువ్వులు కథ
2.6.1.1. దాంట్లో బ్రాహ్మణుడు భార్యకు చెప్పిన దురాశ గల నక్క కథ
2.7. హిరణ్యకం లఘుపతనకం & మంధరకానికి చెప్పిన విధిలో విశ్వాసం కథ
2.8  మంధరకం లఘుపతనకం, ఇతర మిత్రులకు చెప్పిన సాలెవాడి కథ
2.9. చిత్రాంగం మంధరకం, ఇతర మిత్రులకు చెప్పిన ఏనుగులను విడిపించిన ఎలుకల కథ
2.10. చిత్రాంగం హిరణ్యకం, లఘుపతనకానికి చెప్పిన తన గతం

3. పంచతంత్రంలో మూడవది కాకోలూకీయం: కాకులు, గుడ్లగూబల వైరం
3.1. స్థిరజీవి అనే కాకి మేఘవర్ణం అనే కాకికి చెప్పిన కాకి-గుడ్లగూబల గర్భ శత్రుత్వం కథ
3.1.1. దాంట్లో కాకి పక్షులకు చెప్పిన చంద్రసరస్సు కథ
3.1.2. కాకి పక్షులకు చెప్పిన కుందేలు – కౌజుపిట్టల కథ
3.2. స్థిరజీవి మేఘవర్ణానికి చెప్పిన బ్రాహ్మణుడి మేక కథ
3.3. స్థిరజీవి మేఘవర్ణానికి చెప్పిన చీమల చేత చచ్చిన పాము కథ
3.4. రక్తాక్షి అనే గుడ్లగూబ అరిమర్దనం అనే గుడ్లగూబకు చెప్పిన బ్రాహ్మణుడు – పాము కథ
3.5. క్రూరాక్షి అనే గుడ్లగూబ అరిమర్దనానికి చెప్పిన శిబి చక్రవర్తి కథ
3.6. క్రూరాక్షి అరిమర్దనానికి చెప్పిన ఆత్మార్పణ చేసుకున్న గువ్వ కథ
3.7. దీప్తాక్షుడు అనే గుడ్లగూబ అరిమర్దనానికి చెప్పిన ముసలివాడి పడుచుభార్య కథ
3.8. వక్రనాసుడు అనే గుడ్లగూబ అరిమర్దనానికి చెప్పిన బ్రాహ్మడూ దొంగా రాక్షసి కథ
3.9. ప్రాకారకర్ణం అనే గుడ్లగూబ అరిమర్దనానికి చెప్పిన రాజకుమారుడి పొట్టలో పాము కథ
3.10. రక్తాక్షి అరిమర్దనానికి చెప్పిన మోసపోయిన వడ్రంగి కథ
3.11. రక్తాక్షి స్థిరజీవికి చెప్పిన ఎలుక కన్య కథ
3.11. రక్తాక్షి అరిమర్దనానికి చెప్పిన బంగారు రెట్ట వేసే పక్షి కథ
3.12. రక్తాక్షి తన అనుచరులకు చెప్పిన మాట్లాడిన గుహ కథ
3.13. స్థిరజీవి మేఘవర్ణానికి చెప్పిన పాండవుల అజ్ఞాతవాసం కథ
3.14. స్థిరజీవి మేఘవర్ణానికి చెప్పిన కప్పలను మోసిన పాము (మందవిసర్పం) కథ
3.14.1. దాంట్లో మందవిసర్పం వేరొక పాముకు చెప్పిన నెయ్యి తాగి గుడ్డివాడైనట్టు నటించిన బ్రాహ్మడి కథ

4. పంచతంత్రంలో నాలుగవది లబ్దప్రణాశం: కోతి – మొసలి కథ
4.1. రక్తముఖం అనే కోతి కరాళముఖం అనే మొసలికి చెప్పిన గుడ్డిపగ (బంధువుల మీద పగబట్టిన కప్పరాజు పామును ఆహ్వానించిన కథ)
4.2. రక్తముఖం కరాళముఖానికి చెప్పిన గుండే, చెవులూ లేని గాడిద కథ
4.3. రక్తముఖం కరాళముఖానికి చెప్పిన కుమ్మరి వీరుడి కథ
4.3.1. దాంట్లో రాజు యుధిష్ఠిరుడికి చెప్పిన సింహి పెంచిన నక్క కథ
4.4. రక్తముఖం కరాళముఖానికి చెప్పిన కృతఘ్నురాలి కథ
4.5. రక్తముఖం కరాళముఖానికి చెప్పిన ప్రణయ కలహాల కథ
4.6. రక్తముఖం కరాళముఖానికి చెప్పిన పులితోలు కప్పుకున్న గాడిద కథ
4.7. కరాళముఖం రక్తముఖానికి చెప్పిన రైతు భార్య కథ
4.8. రక్తముఖం కరాళముఖానికి చెప్పిన నక్క – నలుగురు శత్రువుల కథ
4.9. రక్తముఖం కరాళముఖానికి చెప్పిన దేశం విడిచిన కుక్క కథ

5. పంచతంత్రంలో ఐదవది అపరీక్షితకారకం / అసమీక్షకారిత్వం: మంగలి – జైన మునుల కథ
5.1. దాంట్లో న్యాయాధిపతి మణిభద్రుడికి చెప్పిన విశ్వాసం గల ముంగిస కథ
5.1.1. దాంట్లో దేవశర్మ భార్య దేవశర్మకు చెప్పిన ఆశాపాతకుడి కథ
5.1.1.1. దాంట్లో అతిలోభి అత్యంతలోభికి చెప్పిన మంథరకుడి కథ
5.1.1.2. అతిలోభి అత్యంతలోభికి చెప్పిన తిరిగి బతికిన సింహం కథ
5.1.1.3. అతిలోభి అత్యంతలోభికి చెప్పిన చదువుకున్న మూఢుల కథ
5.1.1.4. అత్యంతలోభి అతిలోభికి చెప్పిన రెండు చేపలు – కప్ప కథ
5.1.1.4.1. దాంట్లో శతబుద్ధి అనే చేప ఏక బుద్ధి అనే చేపకు చెప్పిన చాణక్యుడి నందవంశ నిర్మూలన కథ
5.1.1.5. అతిలోభి అత్యంతలోభికి చెప్పిన కోతి ప్రతీకారం కథ
5.1.1.6. అతిలోభి అత్యంతలోభికి చెప్పిన గానం చేసిన గాడిద కథ
5.1.1.7. అత్యంతలోభి అతిలోభికి చెప్పిన గాలిమేడలు కథ
5.1.1.8. అతిలోభి అత్యంతలోభికి చెప్పిన మోసపోయిన రాక్షసుడి కథ
5.1.1.9. అత్యంతలోభి అతిలోభికి చెప్పిన త్రిస్తని అయిన రాజకుమార్తె కథ
5.1.1.9.1. దాంట్లో ప్రతీహారి మధుసేనుడికి (రాజు) చెప్పిన భూతాన్ని వదిలించుకున్న బ్రాహ్మణుడి కథ

You Might Also Like

Leave a Reply