‘తత్త్వమసి’

డిట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి ప్రచురణ ‘తత్త్వమసి’, కొత్త ఝాన్సీలక్ష్మి గారి కవితా సంకలనం ఆవిష్కరణ సభలో (డిసెంబరు 4, 2021) పుస్తకాన్ని పరిచయం చేస్తూ, సభ్యులు బూదరాజు కృష్ణమోహన్‌ చేసిన ప్రసంగ పాఠం.

********

ఝాన్సీ లక్ష్మి గారు DTLC సమావేశాలలో బైరాగి కవితలని విశ్లేషిస్తున్నప్పుడు నేనూ విన్నాను. నెమ్మదస్తురాలు, కవి హృదయాన్ని వెలికి తీసుకు రాగలిగిన వారుగా మాత్రమే నాకు తెలుసును. అయితే, వారు స్వయంగా కవితలు వ్రాసేవారని రెండు వారాల క్రితం వరకు నాకు తెలియదు. 

ఇది ఒక కవితా సంపుటి. కవిత అనగానే ‘ఏం చెపుతున్నారు?’, ‘ఎలా చెపుతున్నారు?’ అనే అంశాలుంటాయి కదా. ఏం చెపుతున్నారనే దానికి తరువాత వద్దాం. ఎలా చెపుతున్నారో చూసి నప్పుడు, నాకు ఒక చక్కటి పాత సినిమా పాట విన్నట్లనిపించింది. కవితలన్నీ కూడా బాగా పరిచయమున్న పదాలతో చేతులు చాచి రారమ్మని చదవడానికి ఆహ్వానిస్తాయి. ఇక కవితల రూపానికొస్తే, ఏ పాదానికి ఆ పాదం చక్కగా విడి ఒక భావాన్ని ప్రకటిస్తుంది. ఒక పాదం – ఒక భావం. ఇది చదవడాని కీ, అన్వయానికీ సులభం. పదాలు మథించి మథించి ఒక భావాన్ని ఒక పాదంలో ఇమడ్చడానికి పడ్డ పాట్లేవో వారు పడ్డారు. మనకి హాయిగా చదువుకోడానికి చేతికిచ్చారు. పదాలు, పాదాలు సులభంగా ఉన్నాయని విషయం తేలికనుకునేరు సుమా! లలితమైన పదాలు – లోతైన భావాలు. ఇది ఈ కవితా సంపుటి ప్రత్యేకత. 

ఇప్పుడు ‘ఏం చెప్పారు?’ అన్న విషయానికి వద్దాం. ముందుగా ఈ కవితాసంపుటి పేరు ‘తత్వమసి’. ఆధ్యాత్మిక వాఞ్మయముతో కొంత పరిచయమున్నవారికి ఇది చాలా పరిచిత వాక్యము. ఉపనిషద్వాక్యము. మహావాక్యమూ, సామవేద సారము అని పెద్దలు చెపుతారు. తత్ = అది, త్వం = నీవు, ఆసి = అయి ఉన్నావు. తత్వమసి = అది నీవు అయి వున్నావు, లేదా అదే నీవు. దీని మీద అనేక వ్యాఖ్యానాలు, గ్రంథాలు ఉన్నాయి. విన్నప్పుడు కొంత అర్ధమైనట్టే ఉంటుంది. కానీ అనుభవం లోకి తెచ్చుకోవడం ఎలా? 

ఈ నేపథ్యంలో కవితాసంపుటి లోకి ప్రవేశిద్దాము

ఈ కవితాసంపుటి చదివినప్పుడు నాకు మూడు కోణాలు కనిపించాయి. ఒకటి – వివరణాత్మకము – అంటే కవి స్పందనలు, ఊహలు, జ్ఞాపకాలు అలాంటివి. రెండు – ప్రకృతి లేదా బాహ్య దృష్టి. మూడు – అంతర్దృష్టి / ఆలోచనాత్మకము. కచ్చితమైన కోవలు కాదు గాని, కొన్ని కవితల్లో అవి ఇవీ కలబోసి ఉన్నాయి. 

మొదటి కోవకి చెందిన కవితల లో కొన్ని ఉదాహరణలు: 

నయన విన్యాసము (ఒకే వస్తువు అనేక కోణాలు), చెట్టు కూలిన వేళ (పర్యావరణం), నిజం -నీవు ( రైతు సమస్యలు), శిల (కొత్త కోడలు క్రమంగా శిలగా మారిన వైనం ), వీడని జాడలు(జ్ఞాపకాలు – విశేషించి జంతువుల మూగ బాసలు, కళ్లల్లో తళుకు మెరుపులు), శిల్పం – ( రాతి గుండె లో కదలికలు), ప్రభాత వసంతం (గువ్వల “క్వీ” కారములు ), హిమ తారక (snowflake -కొత్త మాట, కొత్త పోలిక), అవ్వ (అవసాన దశ), మావూరు. ఈ కవితల్లో కొన్ని అద్భుతమైన పంక్తులున్నాయి. సున్నితమైన భావాలున్నాయి. వీటిని సులభంగా అందుకోగలం. తక్కిన రెండు కోవలకు చెందిన కవితలకు ఇవి సోపానాలాంటివి. అలాంటి ఒక కవిత – 

రాలుతూ…
ఒక చిన్న శీతగాలి
ఒరుసుకుపోతుంటే
ఝల్లుమంటూ ఒళ్ళు
జలదరిస్తుంటే
అర్ధం తెలిసింది
సమయం సమీపించిందని
ఏదో ఉలికిపాటు ఊపేస్తుంటే
గతపు గురుతులు తోరణాలుగా

ఇక్కడ వరకు చదివితే – ఇది మనిషి అవసాన దశను చిత్రిస్తున్నట్టనిపిస్తుంది — కొంత ముందుకు చదివితే – అరే, ఇది ఆకు మీదే కవితాలాగుందే అన్పించింది. ఈ పంక్తులు చూడండి:

తొలి కిరణ స్పర్శ సోకగానే
కర్తవ్యం గుర్తుకొచ్చి
కార్యోన్ముఖమై
శ్రామికమూర్తిగా మారి
అచంచల నిరతితో
అమ్మ రెమ్మకు వన్నె గూర్చి
జీవలోకానికి ప్రాణవాయువు నందిస్తూ

ఇది ఆకు దినచర్య. అంటే, ఆకు తెంపి మన దగ్గరకు తీసుకురాలేదు. ఆకు అక్కడే ఉంది, చెట్టు మీద. మనని ఆకు దగ్గరికి తీసుకు వెళ్తున్నారు. ఆకు దినచర్యలో, కర్తవ్య దీక్షలో మనని మనం చూసుకోక మానము. ఆకులో ఆకునై అంటే ఇదా! గమనించండి… అవసానదశకి పండుటాకు మనకు తెలిసిన పోలికే. కానీ కవిత ఇలాచెప్పడం వల్ల కొంత సేపైనా ఆకులో మనని మనం చూసుకున్నాము – ఆ ఆకు మనమే అయ్యాము – ‘తత్త్వమసి ‘

**

ఇంతకూ ముందు “తత్వమసి” అనుభవం లో కి తెచ్చుకోవడం ఎలా అనుకున్నాం కదా! ఝాన్సీ లక్ష్మి గారు, తక్కిన రెండు కోణాల్లో, దానికి ఒక “blue print” ఇచ్చారు. నిజానికి అలా చెప్పే తత్త్వం కాదు వారిది. కానీ ఈ కవితల్లో అది అంతర్లీనంగా ఉందని మాత్రం గ్రహించవచ్చు. అదేమిటంటే:

ప్రకృతిని చూడు, స్పందించు, పులకించు, పరికించు, లీనమైపో – తన్మయం పొందు – తద్వారా – ‘తత్వమసి’

ఇక్కడ ‘తత్’ అంటే దేని మీద ప్రస్తుతం దృష్టి పడిందో అదే ‘తత్’. గిరులు, ఝరులు, తరులు, విరులు – ఇలా దేని మీద ఇప్పుడు దృష్టి పడిందో అదే ‘తత్’. అలానే దీపం – దానిని చూస్తున్నప్పుడు, గానం – అది వింటున్నప్పుడు, కాలం – దాని మీద ఆలోచిస్తున్నప్పుడు అదే ‘తత్’. ఆ ‘తత్’ మీద తదేక దృష్టి తో తాదాత్మ్యం – తద్వారా తత్వమసి. ఉదాహరణలు:

సెలయేరు
ధారల ధారల నీటిజాలులు
వాగుల వంకల కొండకోనల
మిట్ట పల్లముల జాలుల వాలులు
చిరుత వాగులై బుడుత యేరులై
ఒకటీ నొకటీ కలియుచు మురియుచు
దాటుతు దుముకుచు మరి మరి మురియుచు
ఆకృతి దాల్చిన రూపము నేనే
చిరు వాగును నేనే – సెలయేరును నేనే

సెలయేరు సోయగాలు గమించడం సులభమే. ‘సెలయేరును నేనే ‘ అనడానికి చాలా సాధన అవసరం.

పాట
పాటలో పదమునై
పదముతో గళమునై
గళములో గానమై
పాటలో లీనమై
పరివ్యాప్తమైన వేళ

వినగలను కర్ణేంద్రియరహితనై
దర్శించగలను నయనరాహిత్యనై
ఇహపరాలన్నీ మరచి
పాటలో పరిమళించిన మంత్రద్రష్టనో
సువిశాల ఇలా తలాన
ఎల్లలే లేని అవిభక్తనో
జనన మరణ చక్రభ్రమణంలో
విడివడిన విముక్తనో

పాట ఇలా విన్నారా ఎపుడైనా? పాటలో లీనమై, ఎల్లలే లేని అవిభక్తను – అంటే – ‘నేనే సర్వవ్యాపిని’ అన్న జ్ఞానం కలిగితే గాని జనన మరణ చక్రభ్రమణం విడివడదు. మరి ఈ భావం నిరంతరం నిలవాలంటే – అంతర్దృష్టి, ఆలోచన -> సమ దృష్టి -> మనసు సుందర మందిరం – తరువాత అది కుడా లయం -> తత్వమసి. 

ఇక మూడవ కోణం

ఉదాహరణలు:

అదే ప్రశ్న

– ‘నేనెవడను ‘ అన్న రమణ మహర్షి గారి సుప్రసిద్ధ ప్రశ్న కి కొంత నేపథ్యంగా – జిజ్ఞాసువైన మానవుడు తన అన్వేషణలో అన్నిటికి మూల కారణమైన ‘నీవెవరు?’ అని వేసుకున్న ప్రశ్న — ఎదురు తిరిగి – ఇంతకీ ‘నేనెవరు? అన్న ప్రశ్నగా మారడం చాలా బాగా చెప్పారు. అంతే కాదు. అసలు ప్రశ్నయే నేనైతే – సమాధానం ఎవరికీ? అనే ప్రశ్నతో మనని ఆలోచింపజేశారు.

సుందర మందిరం
ద్వంద్వాలకీ
బాంధవ్యాలకీ
అతిలోక సౌందర్య నందనాలకీ
అకళంక నిర్హేతుక వ్యధలకీ
దూరంగా
ప్రేమ రాహిత్యాన్నైనా ప్రేమిస్తాను
శుష్క ప్రియాల్నీ స్వీకరిస్తాను
శూన్య హస్తాల్నీ ఆహ్వానిస్తాను
సురు చిర సుందర శోభల్నీ
అందుకుంటాను

నిర్వికారంగా
నిరాసక్తంగా
నాలో నేనే ఒదిగి నిర్మించిన
ఈ శూన్య సుందర మందిరం
నీవు కొలువున్న
హృదయ పీఠం

ప్రేమరాహిత్యాన్నైనా ప్రేమించే మనసు సుందరం కాకుండా ఎలా ఉంటుంది? అలాంటి సుందర మందిరం శూన్యం అయితే – అంటే మనసు లయం అయితే -> తత్వమసి. ప్రకృతి తో తన్మయం, అంతర్దృష్టి తో మనసు లయం – ఇవి రెండూ ఒకదానికి ఒకటి తోడ్పడి ‘తత్వమసి’ వైపుకు నడిపిస్తాయి.

చివరిగా కవితగా అన్న కవితలో…
తేరి చూసిన రసజ్ఞుల మదిలో
హృదయానికి చేరువై
ఓ మెరుపై మెరిస్తే
కలం కల నిజమౌతుంది
పదం సార్ధకమై
సదా మురిసిపోతుంది

ఒక్క సారి కాదు అనేక సార్లు మీ కలం మెరుపు మెరిసింది. ఇంతకాలం ఈ భావాలు దాచి, పదాలు పేర్చి, మథించి మథించి నవనీతం వెలికి తీశారు.

మీకు అభినందనలు. మాతో పంచుకున్నందుకు ధన్య వాదాలు.

పుస్తకం వివరాలు:

తత్త్వమసి

రచయిత: కొత్త ఝాన్సీలక్ష్మి

ప్రచురణ: డిట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి

You Might Also Like

2 Comments

  1. లియో

    అద్భుతమైన పరిచయం. పుస్తకం కొని చదవాలనిపించింది.

    1. Anveshi

      పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పండి…

Leave a Reply