Christmas Spirit – Morgana Best

వ్యాసకర్త: నారాయణ శర్మ G.V

(ఇంగ్లీషు_థ్రిల్లర్_నవలలకు_తెలుగులో_రివ్యూలు-4)

***********

పాత కాలపు మన జానపద కథల్లో దయ్యాలు-భూతాలు హీరోలకు బానిసలవ్వటం, వాళ్ల చేత ఆకాశయానాలు వగైరాలు చేయించి సాయం చేయటం, దుష్టమాంత్రికులు ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నించటం, అర్థం లేని మంత్రాల్ని చదివి మనల్ని ముగ్ధుల్ని చేయటం, హీరోయిన్లను ఎత్తుకుపోవటం లాంటివి చాలాసార్లు చూసాం. ఆ తర్వాత తులసీదళం లాంటి సీరియళ్ళలో మంత్రాలను, చింతకాయల్ని, సైన్సును కలిపి భయంకరంగా పండించాం. అయితే ఆ తర్వాత ఇక దయ్యాలకు భూతాలకు మనం తెలుగువాళ్లం దాదాపు మంగళం పాడేసినట్లు అయ్యింది.

కానీ ఇంగ్లీషు నవలా ప్రపంచం వాటిని రకరకాలుగా పండిస్తూనే పోయింది. డ్రాకులాతో మొదలెట్టి వాంపైర్లవరకు, హైబ్రిడ్ దేవతలవరకు, జాంబీల వరకు ఎవ్వరికీ కనబడని రకరకాల నిర్జీవరాసుల పేర్లతోటి వేలకొద్దీ నవలలు వస్తూనే ఉన్నాయి.

సాధారణంగా భయాన్ని, భీభత్సాన్ని పోషించే ఈ నవలలు అట్లా ఉండగానే, మళ్ళీ ఓసారి దయ్యాల్ని మానవీయంగాను ప్రేమభరితాలుగాను చూపే రచనల ఒరవడి ఒకటి ఊపు అందుకున్నది.  బ్రిటిష్ అమ్మమ్మ జె.కె.రౌలింగ్ మాంత్రికులకు పుట్టిన పిల్లాడు మంత్రాలు నేర్పించే బడికి వెళ్ళటం, దుష్టశక్తుల్ని నాశనం చేసేయటం గురించి వివరంగా చెప్పి ప్రపంచానికి వెర్రెత్తించారు. దానికి ముందూ, ఆ తర్వాత కూడా దయ్యాలు, భూతాలు నవ్వుతూనూ, సరదాగా నవ్వు పుట్టిస్తూనూ ఉండేట్లు, మనుషులకు మిత్రులు అన్నట్లు రాసిన నవలలు చాలానే వచ్చాయి. అట్లాంటి ఒక నవల, ఆస్ట్రేలియా అమ్మమ్మ మోర్గానా బెస్ట్ వ్రాసిన “క్రిస్ట్‌మస్‌ స్పిరిట్” గురించి చెబుతాను ఈసారి.

కథలో హీరోయిన్ ప్రుడెన్స్ వాల్‌ఫ్లవర్- మెనోపాజ్ కు దగ్గరగా ఉన్న ఒంటరి; విడాకులైపోయినై; కొడుకు ఎక్కడో దూరంగా ఉంటాడు. కూతురు తనతో మాట్లాడదు; బంధువులు అవకాశవాదులు- అయినా జీవితాన్ని తేలికగాను, నవ్వులతోటీ ఉత్సాహంగా స్వీకరించటమే కాక తన సంతోషాన్ని పదిమందికీ పంచే పాత్ర ఈమెది.  

ఈమె ప్రత్యేకత ఏంటంటే ఈమెకి ఏవో ప్రత్యేక శక్తులు ఉంటాయి- దయ్యాలు, భూతాలు వాటికి ఇష్టమైతే ఈమెను కాంటాక్టు చేస్తుంటాయి! ఈమెకు కూడా అవి కనబడవు, వినబడవు- కేవలం అవి ఏమి చెప్పాలనుకుంటున్నదీ మాత్రం ఈమెకు మెదడులోనే నేరుగా తెలిసిపోతూ ఉంటుంది. తన ఈ శక్తిని ఈమె స్టేజీ షో ల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటుంది. టిక్కెట్లు కొని ఆ షోలు చూడటానికి వచ్చిన వాళ్ల పూర్వీకుల ఆత్మలు, వాటి ఇష్టం కొద్దీ వచ్చి ఈమె ద్వారా తమ వాళ్లకు బెస్ట్ విషెస్ చెబుతుంటాయనమాట.  అంతే తప్ప ఈమె వాటిని పిలవటం, అవి బొంగురు గొంతుతో‌ మాట్లాడటం వగైరా భయంకరాలు ఏమీ ఉండవు.

అయితే వచ్చిన వాళ్ళలో ఫలానావాళ్ళని పిలిచి స్టేజి మీద నిలబెట్టి, ఈమధ్యే చనిపోయిన వాళ్ల తండ్రి పేరు, అతను ఎక్కడ చదువుకున్నాడు, ఆయనకు ఏవి ఇష్టం, ఆయన ఎట్లా చనిపోయాడు, ఇప్పుడు ఎలా ప్రశాంతంగా ఉన్నాడు’ లాంటివి చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోతూ, సంతోషంగా కళ్లనీళ్ళు పెట్టుకుంటూ, వాళ్ళు ఇప్పుడు శాంతినొందారు అని తెలుసుకొని తృప్తిపడుతూ ఉంటారనమాట.

అయితే అకస్మాత్తుగా ఈమెకు అందమైన భూతం ఒకడు కనిపిస్తాడు; ఈమెతో మాట్లాడతాడు కూడా. భూతం ఎట్లా కనబడింది, ఎట్లా మాట్లాడుతోంది అని ఈమె ఆశ్చర్య పడుతుంటే అది తన పేరు “ఆలం” అని తన కథ చెప్పి, ఈమెని సాయం చెయ్యమంటుంది:

‘ఆలం ఒక పోలీసు ఇన్‌స్పెక్టరు. చచ్చిపోయేముందు అతనొక యాక్టరు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఆ యాక్టరుకు డ్రగ్ అలవాట్లు ఏమీ లేవు; కానీ‌ తన ఓ సినిమాలో ఫలానా మాఫియా డాన్ వేషం వేయబోతూ, నిజజీవితంలో అట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారో కనుగొనే క్రమంలో‌ ఆ డాన్ కొడుకుతో పరిచయం పెంచుకున్నాడు. ఒక దుర్ముహూర్తాన అతని శవం బయట పడింది. ‘ఆత్మ హత్య చేసుకున్నాడు’ అనుకున్నారు అందరూ. కానీ కాదు- ఎవరో చంపారు అతన్ని. బహుశా ఆ డాన్ కొడుకు కావచ్చు? కాకపోవచ్చు. ఆలం ఆ కేసును పరిశోధిస్తూ ఉండగా అకస్మాత్తుగా తను కూడా చనిపోవాల్సి వచ్చింది! ఎందుకు? తనకి అర్థం కావట్లేదు! తన కేసు పూర్తయితే తప్ప, తనకు ప్రశాంతత దొరకదు- అప్పటివరకూ తనకు ఇట్లా భూతం రూపంలో ఉండక తప్పదు.’


ఆలం అందంగా ఉంటాడు, భూతం అయినా చక్కగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు, అవకాశవాదులైన తన బంధువుల కంటే చాలా నయం. “పాపం, భూతం రూపం నుండి విముక్తి దొరికితే ‘అవతలి తీరం’చేరుకుంటాడు హాయిగా” అని ఈమె సాయం చేస్తానని ఒప్పుకుంటుంది.  ఆ క్రమంలో ఈమె ఆ మాఫియావాళ్లని, పోలీసుల్ని, చనిపోయిన యాక్టరు చెల్లెల్ని- ఇట్లా అనేకమందిని కలుస్తుంది. తెలిసీ తెలీకనే చాలా రిస్కు తీసుకుంటుంది. అయితే పోలీసులు పాపం మంచివాళ్ళు- చివర్లో ఈమెని కాపాడి అసలు దొంగల్ని బాగానే పట్టుకుంటారు. మరి, చివరికి ఆ ‘ఆలం భూతం ఏమైంది?’ ఆ ముచ్చటకోసం ఈవిడ రాసిన ‘ఇంకో నవల చదవాలట’ మరి! ఇక ఆపుతాను- ఆ రెండో నవల ఎట్లా దొరుకుతుందో ఏంటో- వెతకాలి ఇప్పుడు.

You Might Also Like

Leave a Reply