కాలం కంపనలో కొన్ని క్షణాలు, శ్రీకాంత్ తో…
వ్యాసకర్త: మూలా సుబ్రహ్మణ్యం
**************
“కనులలోని చందమామలను నీటిపొరలతో తగలవేస్తూ
రాత్రంతా గడిపివేయడంలోనూ
పగటిని భారంగా లెక్కిస్తూ గడపడంలోనూ
ప్రేమ ఉండి ఉంటుంది
మనం చేసే ఈ గాయమయపు చర్యలన్నిటిలోనూ
ప్రేమ ఉండి ఉంటుంది నిజంగా మనల్ని ఇంకా బ్రతికిస్తున్న
ప్రేమ ఉండే ఉంటుంది”
2002 లో వచ్చిన శ్రీకాంత్ “యితర” కవిత సంకలనంలోనివి ఈ పంక్తులు. విన్నకోట గారు సజెస్ట్ చేస్తే 2006 లో అనుకుంటాను నేను మొదటిసారి చదవడం. చదివాకా నమ్మకంగా అనుకున్నాను నేను చదివిన కొద్దిపాటి మంచి కవిత్వంలో శ్రీకాంత్ కవిత్వం తప్పక ఉంటుందని. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ శ్రీకాంత్ “శ్రీకాంత్” గా తనని తాను ఆవిష్కరించుకున్నారు. 300 పేజీలకి పైగా విస్తరించిన దట్టమైన కవిత్వం చివరన “వ్రాత నాకు ఒక గూడు” పేరుతో వాకిలి అంతర్జాల పత్రికలో అఫ్సర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ కవిగా శ్రీకాంత్ నీ, అతని సంఘర్షణనీ మరింత అర్థంచేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
శ్రీకాంత్ కవిత్వం చదవడమంటే చెట్టు లేని ఆకుల గలగల వినడం, చినుకుల్లేని వానలో తడవడం, వెన్నెల్లో కూచుని కాలడం, అంతంలేని శీతాకాలపు రాత్రుళ్ళలో తుంపర్లయి తిరిగి ఆవిరైపోవడం, నిప్పుల్ని ముద్దాడడం, నిన్ను నువ్వు మరచిపోవడం, అక్షరాన్ని మోహించి ఆ పాదఖడ్గపు కాంతి అంచున నీ మెడను వాల్చి నీ బ్రతుకుని నీకు ఇమ్మని వేడుకోవడం.
చాలా మంది కవుల్లాగే ఇతని కవిత్వానికీ కేంద్ర బిందువు “ఆమె”. ఎన్నెన్నో రూపాలలో అమ్మగా, అమ్మమ్మగా, కూతురుగా, భార్యగా, ప్రియురాలిగా ఇంకా స్నేహితురాలిగా దర్శనమిస్తుంది. ఆమె చుట్టూ పచ్చిక మైదానాలపై ఎగిరే తూనీగలు, ఆమె శరీరంపై మెరిసే పసుపు పచ్చని పూవులు. పంటకాలవల్లాంటి ఆమె ఆరచేతులు, ఆమె కళ్ళల్లో ఇంద్రధనస్సులు. నిశ్శబ్దంలో ఆమె ఉన్న పరిధి మేరా, రాత్రి వృత్తాల లేత వెన్నెల వాన.
ఒక లేత సాయంత్రపు ఎండ సరస్సుల మీంచీ చెట్లలోంచీ తప్పించుకుని వచ్చి చల్లగా చేతుల్ని చుట్టుకున్నట్లు ఈ కవిత్వమంతా ఆమె గాజుల జల్లు. ఆమె నవ్వడాన్ని తరచూ చూడవు నువ్వు అంటూ మొదలయ్యే కవిత చూడండి
“వంటలో నిమగ్నమై హటాత్తుగా తల ఎత్తి
మసి అంటిన అరచేతితో
తన ముఖాన్ని తుడుచుకుంటూ
నీవైపు చూసి అప్రయత్నంగా నవ్వుతుంది తను
మరి
ఇక ఆ తరవాతా, ఆ రాత్రి అంతా
మండుతూనే ఉండింది
ఆ కట్టెల పొయ్యి అప్రతిహతంగా ఉజ్వలంగా –“
అయితే రహస్య మృత్యు కుహరం లాంటి నగరంలో మనుషులు కాలకృత్యాలయి, కర్మలై పాపాలై, శాపాలై, శోకాలై, పెళ్ళిళ్ళయి, సంసారాలై, ఆస్తి దస్తావేజులై, భూదాహాలయి, భవంతుల మోహాలయి, వస్తు విహారాలై వికృతంగా కనిపించే కల్లోల కాలం ఈ కవినీ బాధించింది. మళ్ళీ ఈ దిక్కుమాలిన లోకం నుంచి కవిని కాపాడేది ఆమే. “నువ్వు ఎదురొస్తావనే” కవిత చూడండి.
“నువ్వు ఎదురొస్తావనే ఇంటికి రావడం తళతళలాడే ముఖంతో మిలమిల మెరిసే కనులతో చేతులు చాచి హత్తుకుంటావనే తిరిగి రావడం, ధూళి నిండిన దారులను వదిలి, మాలిన్యం అంటిన మనుషులను ఒదిలి, కవిత్వ వ్యసనాల్ని వొదిలి, ఆకాశమంత పెరిగిన ఆహాన్ని వొదిలి, రూపాయిని వొదిలి, జనం లేని అంతర్జాలాన్ని వొదిలి అంతిమంగా నువ్వు ఉన్నావనే, నువ్వలా ఎదురు చూస్తూ ఉంటావనే, నువ్వు సెలయేళ్ళలాంటి పాదా లతో తిరుగుతుంటావనే ఈ ఇంటికి రావడం.”
అయితే ఆమె చాలా అలసిపోయి, చాలా పగిలిపోయీ, ఈ లోకపు గట్టుదాటి నీలోకి దుమికినప్పుడు, ఆ వాలుతున్న కనురెప్పల కింద చలించే అరణ్యాలూ, నుదిటిపై తెరలుగా వీచే పురాస్మృతులూనూ. నీకు కొంత ప్రేమా, కొంత నిస్సహాయతా అయిన ఆమె అలసట అంతటినీ ఒక్క ప్రశ్నలో అద్భుతంగా చిత్రిస్తాడు శ్రీకాంత్, “ఇవాల్సినది” కవితలో..
“how was the day” అని అడుగుదామనుకున్న అతనితో
“నిస్సత్తువగా కుర్చీలో జారగిలబడి, భుజాన బ్యాగుని పక్కకు వదిలి
కళ్ళలోని వాననీ
శరీరంలో వడలిన పూలనీ, రేగే ధూళినీ తుడుచుకుంటూ,
సొమ్మసిల్లుతూన్న నవ్వుతో
అతి కష్టం మీద
ఇలా అంటుంది తను అప్పుడు అతనితో
“కొద్దిగా, ఓ గ్లాసు మంచినీళ్ళు అందిస్తావా?”
ఏ సంకలనంలోనైనా మనవి కాని కవితలు కూడా కొన్ని ఉంటాయి. అలాగే ఈ సంకలనంలో కూడా లోకంలోని చీకటిని పచ్చిగా బూతులతో చిత్రించే కొన్ని కవితలు నావి కావని నాకనిపిస్తుంది. అయితే చీకటిని తిట్టుకుంటూ అందులోనే ఉండిపోలేదు శ్రీకాంత్. వెలుగుని ఈ కవి ఎంత అందంగా చిత్రిస్తాడో “రెండు” కవితలో పంక్తులు చూడండి.
“కిటికీలూ తలుపులూ తెరిస్తే గదిలోకి వరదలా పొర్లుకువచ్చే వెలుతురు. వాన చినుకుల తడి. చినుకుల కాంతిలో పొదగబడే రంగుల పూల పరిమళం చిట్లుతున్న విత్తనాలూ, తొలిచివుర్ల జీవన ఉత్సాహమూ, ఇంకా నేను. నేను అనే నువ్వు. నువ్వు అనే సమస్తం. – ఒక శాంతి లోకం, కాలం”
అలాంటి శాంతిని తనలోనూ నింపుకున్నాడేమో, అతన్ని కలవడానికి వెళ్ళి, ఉస్మానియా మెడికల్ కాలేజీ మెట్రో స్టేషన్ మెట్లు దిగుతూ ఫోన్ చేసి లేండ్ మార్కులు చెబితే “అయ్యో నువ్వు మెట్రో స్టేషన్ కి అటు దిగేసినటున్నావబ్బా నేనొస్తున్నా ఉండు” అని, ఆ ఫుట్ పాత్ మీద డిసెంబరు పొద్దుటి ఎండలో దూరంగా చేయూపుతూ, ఎలాంటి ఆదరాబాదరా లేకుండా నడుచుకునొస్తున్న అతన్ని చూస్తే నాలోనూ ఒక శాంతి. అతని కాలేజీ కేంటీన్లో కూచుని కాఫీ తాగుతూ కవిత్వం గురించి మాట్లాడుకున్నది నిజానికి తక్కువే. అప్పుడే నా చేతిలోకి వచ్చింది “శ్రీకాంత్”. అలా గత రెండేళ్ళుగా అతని కవిత్వంలో గాఢతకీ, నిజాయితీకీ అబ్బురపడుతూనే ఉన్నా. చివరికి సహచరి వెన్న రొట్టెలు చేయడం కూడా కవి సమయమే ఇతనికి.
“ఇప్పుడు నీ చేతుల్లో అలవోకగా కదిలే వెన్న కలిపిన ఆ పిండిని అలా గమనిస్తూ ఉంటే పార్వతి చేతుల్లో పిండి ముద్దతో రూపుదిద్దుకున్న పిల్లవాడి కథ నిజమే అనిపిస్తుంది. అందుకే మరి నీ చేతుల్లోని పిండి కూడా జీవం పోసుకుని ఇక రొట్టెలయ్యీ చీకటి వేళకి వెలుగయ్యీ శ్వాసయ్యీ మేం నీకు చెప్పడం మరచిన కృతజ్ఞతలయ్యీ ఇలా ప్రతి రాత్రీ మాకు ఇంత ప్రాణాన్నీ జీవధాతువునీ ప్రసాదిస్తాయి”
శ్రీకాంత్ కవిత్వం కూడా పాఠకుడికి ఇంత జీవధాతువుని ప్రసాదిస్తుంది.
ప్రతులకి:
నవోదయ బుక్ హౌస్,
కాచిగూడ, హైదరాబాద్.
Or
google pay number : 9848666846
ద్వారా లభిస్తుంది.
తాడిగడప శ్యామల రావు
“మసి అంటిన అరచేతితో తన ముఖాన్ని తుడుచుకుంటూ నీవైపు చూసి అప్రయత్నంగా నవ్వుతుంది తను. మరి ఇక ఆ తరవాతా, ఆ రాత్రి అంతా మండుతూనే ఉండింది ఆ కట్టెల పొయ్యి అప్రతిహతంగా ఉజ్వలంగా”
ఓహో. తెలుగు వాక్యాన్ని ముక్కలుముక్కలుగా విరిచి, ఆముక్కల్ని నిలువుగా పేర్చి వ్రాస్తే అది ఆటోమేటిగ్గా (వచన)కవిత్వం ఐపోతుంది! ఎంత సులువూ కవి కావటమూ కవిత్వం బరికేయటమూను!!
ఇన్నాళ్ళూ ఎంత అమాయకత్వం ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం అంతానూ. కవి కావాలంటే గొప్ప భావాలు కలగాలీ గొప్ప వ్యక్తీకరణ ఉండాలీ గొప్ప భాషాపటిమ ఉండాలీ అదుండాలీ ఇదుండాలీ అని.
అవేమీ అక్కరలేదూ ఎలాగో కాస్త పేరూ పలుకుబడీ వంటివి ఉండాలీ అని జ్ఞానోదయం అయింది.
ధన్యవాదాలు.