కృతి : ప్రకృతి
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు రాసిన “స్థావర జంగమం” ఖండ కావ్యానికి ముందుమాట.)
***********
ప్రకృతికి మనిషికి సంభాషణ యెప్పుడు మొదలైందో తెలీదు గానీ అది నిరంతరం కొనసాగుతూనే వుంది. ప్రకృత్యారాధనలో చేసిన స్తోత్రపాఠాలు కావొచ్చు, ఆదిమ కవిత్వ వ్యక్తీకరణలు కావొచ్చు ఆ సంభాషణలో భాగాలే. అయితే ఆ సంభాషణ యేకముఖం కాదు; ద్విముఖం. ఆదానప్రదానం. పరస్పర చోదకం. ఆ క్రమంలోనే మనిషి మట్టితో మట్టి మనిషితో యెన్నటికీ రద్దు చేసుకోలేని రహస్య వొప్పందాలు చేసుకొని వుండొచ్చు. అందుకోసమే గాలి వూసులు పంచుకుంటుంది. నేల మారే రుతువులతో అలుపులేని గమకాలుతీస్తుంది. నింగి నిరంతరం విశ్వ సంగీతం వినిపిస్తుంది. రాతి కొండలు సైతం మనిషితో మాట్లాడతాయి. చెట్టూ చేమా మనిషిని పలకరిస్తుంటాయి. పూలు నవ్వుతాయి. కొమ్మల గూళ్ళలో పిట్టలు కథలు చెప్తాయి. సెలయేళ్ళు మనిషితో సల్లాపాలాడుతుంటాయి. జలపాతాలు దూకుడుగా సంవాదాలు చేస్తాయి. సాగరాలు ఘోషిస్తూనే ఉంటాయి. అలల చేతులు జోడించి అభివాదాలు చెబుతాయి. అయితే వినటానికి చెవులు వుండాలి, మనస్సు వుండాలి, హృదయ భాష తెలియాలి. వాటి మధ్య వీడని బంధం వుండాలి. అందులో లీనం కావాలి. అప్పుడొక కళా ప్రపంచం ప్రభవిస్తుంది. నూతన సృజన పురుడుపోసుకుంటుంది. సౌమనస్యంతో పూల మనసులు, సొగసులు చదివిన మా మాస్టారు డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు ప్రకృతితో చేస్తున్న మరో సంభాషణలోంచి పుట్టింది యీ కావ్యం. ప్రకృతికి దూరం జరుగుతూ తనను తాను కోల్పోతున్న మనిషికి స్థావర-జంగమాత్మకమైన ‘లోకవృత్త’ వైశిష్ట్యాన్ని గుర్తు చేయడానికి జరిగిన పూనిక యిది. ఇది యివాళ్టి అక్కర. ప్రాసంగికత.
సాహిత్యంలో పర్యావరణ వాదం యిటీవల బలంగా ముందుకు వచ్చిన ఆలోచన. ఇంతకు ముందు సాహిత్యంలో పర్యావరణ స్పృహ లేదా అంటే – వుంది. కానీ పర్యావరణ వాదం వేరు. పర్యావరణ స్పృహ వేరు. పర్యావరణ వాదం ప్రకృతికి మనిషికి వుండాల్సిన సంబంధం గురించి వివరించడం దగ్గర ఆగిపోదు; ప్రకృతి విధ్వంసానికి కారణమైన మూలాల్లోకి వెళ్లి చూస్తుంది. మనిషి ప్రకృతిని అదుపులోకి తీసుకోవటం ద్వారా యెంత వినాశనం జరుగుతుందో యెంత విధ్వంసం సంభవిస్తుందో తెలుసుకోవడం, తెలియజెప్పడం యీ వాదం ముఖ్య వుద్దేశం. అది పర్యావరాణాన్ని కేవలం వొక ప్రాంతానికో దేశానికో పరిమితమైన సమస్యగా చూడదు. మనిషి ప్రకృతిలో భాగం. మనిషి ప్రకృతికి వొదిగి ఉండాలి. ప్రకృతిపై ఆధిపత్యం చివరికి మనిషి వినాశానికి దారి తీస్తుంది – అన్న మేరకు పర్యావరణ స్పృహ పరిమితమైతే పర్యావరణ వాదం మరొక అడుగు ముందుకేసి మరింత నిర్దిష్టంగా పనిచేస్తుంది. క్రియాశీలంగా వుంటుంది. ఉద్యమ స్వభావంతో ఆలోచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు మైనింగ్ కోసం అడవులు నరకడం కొండలు తవ్వటం, అడవి కడుపు నుంచి – సాగర తీరాల నుంచి మనిషిని హింసాత్మకంగా తొలగించడం, దళారి పాలకులు అందుకు అనుగుణమైన చట్టాలు రూపొందించడం యిలా ప్రకృతి విధ్వంసం ద్వారా జీవావరణ అసమతుల్యతకు కారణమౌతున్న ప్రతి చోటా ప్రతి సందర్భంలో పాంచభౌతికమైన ప్రకృతి పరిరక్షణ కోసం జరిగే అనివార్య సంఘర్షణలో పర్యావరణ వాదం పీడితుల గొంతు వినిపిస్తుంది. వారికి అండగా నిలబడుతుంది. న్యాయం కోసం పోరాడుతుంది. ప్రకృతిని సంరక్షించే బాధ్యత మనిషిదే. ప్రకృతికి మనిషికి మధ్య వుండే సజీవమైన అవినాభావ సంబంధం గురించి మార్క్సిస్టులు విపులంగా చర్చించారు. ‘The history of nature and the history of men are dependent on each other so long as men exist’ అంటాడు Karl Marx. మరణమంటే మనిషి ప్రకృతితో సంబంధాన్ని కోల్పోవడమే అని కూడా అతనే అంటాడు. పెట్టుబడి మనిషి శ్రమని పరాయీకరిస్తుంది. పరాయీకరణకు అంతిమ రూపం మనిషిని ప్రకృతి నుంచి సైతం దూరం చేయడం. మనిషి ప్రకృతికి దూరమవడం అంటే చావును కొని తెచ్చుకోవడమే. పెట్టుబడుల సమాజం ప్రకృతిని లాభార్జనకు వనరుగా చూస్తుంది. దోచుకోవడానికి అనువైన సంపదగా మాత్రమే పరిగణిస్తుంది. బలం వుపయోగించి సొంతం చేసుకొనే సొత్తుగా భావిస్తుంది. అందుకోసం యుద్ధాలు సృష్టిస్తుంది. అణు జీవ రసాయనాయుధాలు నిర్మిస్తుంది. ప్రకృతి వినాశానికి దారులు వేస్తుంది. ప్రపంచం యెదుర్కొనే సమస్త అనర్థాలకూ కారణం పెట్టుబడిదారి విధానమే.
భూగోళం దక్షిణార్ధంపై వుత్తరార్ధం చెలాయించే వనరుల దోపిడీ, ప్రాచ్య పాశ్చాత్య దేశాల మధ్య నెలకొని వున్న సాంస్కృతిక వైరుధ్యాలు, జీవన తాత్వికతలో (భౌతిక – ఆధిభౌతిక భావజాలపరంగా) వాటి మధ్య గోచరించే వైవిధ్యం, మూడో ప్రపంచ దేశాలపై అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్యం … వీటికి పర్యావరణ వాదంలో పరిష్కారాలు వెదికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాహిత్య ప్రపంచం మనిషి కేంద్రంగా ప్రకృతి చుట్టూ తిరుగుతోంది. ఆ క్రమంలోనే విభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ వనవాసి మరోసారి యీ అధ్యయనంలోకి వచ్చింది. అలాగే గోపీనాథ్ మొహంతి అమృత సంతానం కూడా. ఇటీవల జయతి లోహితాక్షన్ రచన అడవి నుంచి అడవికి కూడా ప్రకృతి వాదం నుంచి పుట్టిందే. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి విజ్ఞానశాస్త్రాలు దోహదం చేస్తాయి. కానీ పర్యావరణ సాహిత్యం ప్రకృతిని గుడ్డిగా ఆరాధించటమో అర్థం చేసుకోవడమో గాక దాని పరిరక్షణకు మనిషి చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తుంది. నిజానికి అడవి బిడ్డలు ఆదివాసులు ప్రకృతి సమతౌల్యం కాపాడగలరు. విత్తు నాటినప్పుడు, పంట తీసినపుడు పండగ చేసుకునే గిరిజనుల జీవితమే పర్యావరణ పరిరక్షణకు తొలి పాఠం. వనౌకసులే కాదు ఆధునిక నాగరికత అంతగా సోకని పల్లెల్లో జానపదులు సైతం అదే పని చేస్తారు. పెంచిన మొక్క తొలి కుసుమ ప్రసూతిలో వుత్సవ సౌరభాన్ని ఆఘ్రాణిస్తారు. తినే ప్రతి గింజకూ కృతజ్ఞత ప్రకటిస్తారు. దాన్నొక పూనికతో గాక జీవిత విధానంలో దైనిక క్రతుకాండలో భాగంగా అతి సహజంగా ఆచరిస్తారు. బ్యాక్ టు నేచర్ కొత్త నినాదం. యాంత్రికత నుంచి బయటపడే ప్రాకృతిక మార్గం. సూరం శ్రీనివాసులు గారి యీ ‘స్థావర జంగమం’ కావ్యం ఆ అవసరాన్ని గుర్తించడంలో భాగంగానే వెలువడుతోంది.
***
మనుషులు తమ తమ పరిసరాల నుంచి రూపొందుతారు. తమ నేపథ్యాల నుంచి నిర్మాణం అవుతారు. కవులైనా రచయితలైనా అంతే. కవి భౌతిక జీవితం, చుట్టూ ఉన్న వాస్తవికత కవిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అలా ప్రభావితం కాని వాళ్ళు, ఆకాశం నుంచి వూడిపడిన వాళ్లు యెవరూ ఉండరు. నేపథ్యాన్ని విడిచి యే కవినీ అంచనా కట్టలేము. కవిని రుషిగానూ కవిత్వాన్ని తపస్సుగానూ పోల్చి లేని పోని మహిమని ఆపాదించే సంప్రదాయం మీద, భావజాలం మీద నాకు నమ్మకం లేదు.
కవిత్వానికి ప్రయోజనం ఏమిటి? దాదాపు 50 సంవత్సరాలుగా నన్ను సల్పుతున్న ప్రశ్న ఇది. రచయిత పరంగా, శ్రోతృ/పఠితృ పరంగా భిన్న సమాధానాలు లభించాయి. తరగతి గదిలో గురు ముఖతః నేర్చుకున్న అలంకార శాస్త్రం, ఆ తర్వాతి కాలంలో సామాజిక శాస్త్రాల వెలుగులో జీవిత ఆచరణలో సమాజం నుంచి అర్థం చేసుకున్న తెలుసుకున్న అనేక విషయాలు యీ ప్రశ్నకు సమాధానం సాధించడానికి తోడ్పడ్డాయి. ఈ ప్రశ్నకు రానురానూ మరో ప్రశ్న తోడైంది. కవిత్వానికి కారణం యేమిటి – దాని పుట్టుక యెలా జరుగుతుంది? కవి లోపల కవిత్వం రూపొందే ప్రాసెస్ యేమిటి? సాహిత్య ప్రయోజనం గురించిన ఆలోచనలు కొలిక్కి వచ్చినట్టు దాని వుత్పత్తికి సంబంధించిన ప్రశ్నలకు అంత తేలికగా జవాబు దొరకలేదు. ప్రాచీన అలంకారికుల సూత్రీకరణలు యెందుకో సంతృప్తిని కల్గించలేదు. ప్రతిభ వొక్కటే కవిత్వం పుట్టువుకు కారణమని కొందరు అలంకారికులు చెప్పారు. దానికి వ్యుత్పత్తి అభ్యాసాలు కూడా తోడుండాలి అని మరి కొందరు చెప్పారు. ప్రతిభ పూర్వజన్మ సుకృతం అని వక్కాణించారు. కొందరు పుట్టు కవులు (సహజ కవులు) వుంటారనీ కవిత్వం వాగ్దేవీ వరప్రసాదమనీ నమ్మబలికారు. వ్యుత్పత్తి అభ్యాసాల లేమిని ప్రతిభ ద్వారా అధిగమించవచ్చనీ పేర్కొన్నారు. అయితే ప్రతిభ (శక్తి) – వ్యుత్పత్తి (నిపుణత) – అభ్యాసాలు మూడూ కలిపి పరస్పర పూరకాలుగా వుంటూ కవిత్వం పుట్టుకకు కారణం (ఇతి హేతు:, న హేతవ:) అవుతాయని ప్రాచీనాలంకారికులు చెప్పిన మాట మాత్రమే మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం (పరావర్తనం) తో సంవదిస్తుంది. ఈ రెండింటినీ సమన్వయ దృష్టితో చూసినపుడు కవిత్వం కూడా సామాజిక వుత్పత్తే అన్న అవగాహన కలగడానికి వొక శాస్త్రీయమైన దారి దొరికింది. స్పష్టత యేర్పడింది .
మార్క్సిస్టు సాహిత్య విమర్శలో చెప్పిన పరావర్తన సిద్ధాంతం కవిత్వం పుట్టుకకు కారణాలు తెలుసుకోవటానికి తోడ్పడుతుంది. బాహ్య వాస్తవికత కవి హృదయం మీద / మనసు మీద / మెదడు మీద చిత్రితమవుతుంది. అది కేవలం బింబానికి ప్రతిబింబం వంటిది కాదు. కంటి ముందు దృశ్యం కవి మెదడులో పరావర్తనం చెందుతుంది. కాంతి పరిక్షేపం చెందినట్లు తిరిగి విరజిమ్ముతుంది. దానికి సృజనాత్మకత చేరుతుంది. అయితే ఆ సృజనాత్మకత పూర్వాలంకారికులు చెప్పినట్టు దైవ దత్తం కాదు. పూర్వజన్మ సుకృతమో సంస్కారమో కాదు. సృజనాత్మకత లోని వైవిధ్యం కూడా నుంచి బాహ్య వాస్తవికత నుంచి యేర్పడేదే. రచయిత పుట్టి పెరిగిన పరిసరాల నుంచి రూపుదిద్దుకునేదే. లోకంలో వుండేదే కవులు వర్ణిస్తారు. లోకోత్తర వర్ణనా నైపుణ్యం అంటూ ప్రత్యేకంగా వుండదు. విన్నవి కన్నవి … హృదయంమీద బలంగా ముద్రించుకున్నవాటికే కవులు వూహాశాలీనతను జోడిస్తారు. కవిత్వం అనన్య పరతంత్రం కాదు. దానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు అని గతి తార్కిక సాహిత్య భౌతికవాదం బల్లగుద్ది చెప్పింది. కవి క్రాంతదర్శిత్వం అంటే లేనిదాన్ని ఊహించడం కాదు. ఉన్నదానికి – ఉండాల్సినదానికీ, జరిగిన – జరుగుతున్న – జరగబోయే వాటికీ మధ్య వుండే కార్యకారణ సంబంధం చూసి తెలుసుకోవడం, చూపి తెలియజేయడం. ఆ తెలియ జేసే పద్ధతి వొక్కోసారి నవనవోన్మేమేషంగా వుంటుంది. మరోసారి గతానుగతికంగా వుంటుంది. కొన్నిసార్లు పాత భావనే కొత్తగా మెరుగులు దిద్దుకుంటుంది.
‘దృష్ట పూర్వా హ్యపి అర్థాః కావ్యే రస పరిగ్రహాత్ ,
సర్వే నవా ఇవాభాన్తి మధుమాస యివ ద్రుమాః’ (ధ్వన్యాలోకం) అని ఆనంద వర్ధనుడు చెప్పినా,
‘కత్తో ణామ న ఇట్ఠం సచ్చం కఇ సేవిఏసు మగ్గేసు,
సీమంతేఉణ ముక్కమ్మి తమ్మి సవ్వం నవం చేఅ’ (గౌడ వహో)
( సంస్కృత ఛాయ : కియన్నామ న దృష్టం సత్యం కవి సేవితేషు మార్గేషు, సీమాన్తే పున: ముక్తేస్మిన్ తస్మిన్ సర్వం నవం చైవ)
అని వాక్పతి రాజు వక్కాణించినా,
‘అర్థదృష్టిః సమాధిః, అర్థో ద్వివిధః – అయోనిః అన్యచ్ఛాయాయోనిశ్చ’
అని వామనుడు సూత్రీకరించినా సారం అదే.
అందుకే కవిగా శ్రీవివాసులు గారు పొందిన జీవితానుభవం, దాన్నుంచి నేర్చుకున్న పాఠం, చదివిన చదువులు అవి యిచ్చిన యెరుక, వేద వాఙ్మయం దగ్గర్నుంచి పురాణేతిహాసాల మీదుగా సంస్కృత కావ్యాలంకార శాస్త్ర గ్రంథాల గాఢ పరిశీలన వల్ల, ప్రాచీన అర్వాచీన తెలుగు కవితా ప్రపంచ అవలోడనం ద్వారా అలవర్చుకున్న సంస్కారం – ప్రోదిచేసుకున్న జ్ఞానం, నిరంతర స్వాధ్యయ ప్రవచనాల కారణంగా నిర్మితమైన వ్యక్తిత్వం, కవిత్వ నిర్మాణ విషయికంగా చేసిన అనారత సాధన యీ దీర్ఘ కవితలో దర్శనమిస్తాయి. ఆ క్రమంలోనే కొండలపై ఆషాఢమేఘాలు గజవప్రక్రీడలు గిరిజాకల్యాణం వింధ్య గర్వభంగం మైనాక ఆతిథ్యం గోవర్ధనోద్ధరణం మహాబలిపురం బటర్ బాల్ (వెన్న బంతి) రష్యా చైనాల అరుణారుణ అభ్యుదయ చైతన్యం ఆయుధాలు దాచే అగ్నిగర్భ శమీ వృక్షాలు అరణులు చిలికే అగ్గిరవ్వలు జననం నుంచి మరణం వరకు తోడుండే దర్భపోచలు ఏడడుగుల అగ్నిహోత్రాలు ఊర్ధ్వ మూలమధశ్శాఖల ఆధ్యాత్మిక ప్రవచనాలు కొమ్మలకు తలకిందులుగా వేలాడే వాలఖిల్యుల తపశ్చర్యలు …. యిలా యెన్నో కథలు గాథలు సాంస్కృతిక విశేషాలు అహమహమికతో అలవోకగా కవిత్వంలోకి చొచ్చుకొస్తాయి. కవిత్వంలో అది ప్రాచీనమైనా అర్వాచీనమైనా భాషా శైలీ మాత్రమే కాదు వొక పదబంధం కావొచ్చు భావచిత్రం కావొచ్చు కవి సామాజిక జీవన నేపథ్యం నుంచే రూపొందుతాయని చెప్పడానికి యిటువంటి నిరూపణలు యెన్నో కనిపిస్తాయి. భౌతికమూ లౌకికమూ కాని కాల్పనికత అనూహ్యం. కవి ఒక వూహని కన్సీవ్ చేసేటప్పుడు అనేక జ్ఞాతాజ్ఞాత ప్రభావాలకు లోనవ్వడం సహజం. పండిత కవి సాధారణ కవి నుంచి వేరుపడే సందర్భాలు యివే. దీనికి యీ కావ్యం నుంచి అనేక దృష్టాంతాలు చూపించవచ్చు గానీ మచ్చుకు ఒకటి:
ఉన్నచోటునుండీ కదలని మాకు
ఏ చోటా నిలవని నదీమతల్లితో
పరిచయాలూ, ప్రణయాలా? (గిరిగీత)
ఆన్నప్పుడు వసుచరిత్రలోని శుక్తిమతీ కోలాహలుల ప్రణయం గిరిక జనన వృత్తాంతం ప్రసక్తమౌతుంది. అయితే పాఠకులకీ నేపథ్యంతో పరిచయం లేని పక్షంలో సంక్లిష్టత యేర్పడి కవి ఆశించిన అర్థం హృదయంగమం కాకపోయే ప్రమాదం వుంది. పాదసూచికల్లో టీకా టిప్పణి అవసరపడతాయి. భిన్న సామాజిక వర్గాల నేపథ్యాలున్న సమూహాల్లో దాన్ని అధిగమించడం కవికి పెద్ద సవాలే. నిర్దిష్టత సాధారణీకరణల మధ్య సమన్వయం సాధించడం కత్తి మీద సామే.
సాహిత్యానికి పునాది జీవన వాస్తవికతే అయినప్పటికీ ఆ వాస్తవికతకి వెలుపల వుండి మాట్లాడుతున్నదానికీ లోపలినుంచి మాట్లాడుతున్నదానికీ తేడా వుంటుంది. కొండ నెత్తం మీద కూర్చున్నవారికీ పాదాల చెంత నిలబడ్డవాళ్ళకీ కొండ వొకేలా గోచరించదు. అడవి లోపల పుట్టి పెరిగినవాళ్ళకూ మైదానం నుంచి అడవిని చొచ్చినవాళ్ళకూ అడవి వొకేలా భాసించదు. నీళ్ళలో మునుగు ఈత కొట్టేవాళ్ళకీ వొడ్డున కూర్చున్నవాళ్ళకీ నీటి గాఢత వొకేలా అనుభవం కాదు. సంలీనత పారవశ్యం సహానుభూతి యెప్పుడూ సాపేక్షాలే అన్న విషయాన్ని దృష్టిలో వుంచుకుని యీ కవిత్వాన్ని ఆస్వాదించాలి. అలా ఆస్వాదించడానికి అనుగుణమైన శైలినే మాష్టారు స్వీవకరించారనడానికి యిక్కడే చాలా తార్కాణాలున్నాయి.
మా పై వాలి, మమ్ము తాకుతూ
సుతారంగా కౌగిలించి, తరించే
గడ్డపోచను ఏ తూనీగో తాకినప్పుడు
ఆ రెండింటికీ పులకరింత
మాలో మాత్రం పరమానందం పల్లవించి
చక్రభ్రమణాలు చేస్తాం క్షణకాలం పాటు (జలగీత)
యెంత సహజసిద్ధమైన కమనీయ దృశ్యం! నీటిలో పెరిగే గడ్డి పరకా, దాని మీద వాలిన తూనీగా, ఆ స్పర్శలో వాటి పులకింతా, ఆ కదలికలో నీటి గుండెలలో యేర్పడ్డ చిరు అలల ఆహ్లాద వలయాలూ … ఇదంతా వొక జీవావరణ సౌందర్యం. దాన్ని కవి కంటి రెటీనా మీద చిత్రించుకుని ఆగిపోలేదు. అది క్షణ భంగురం అని చెప్పి జీవనతాత్త్వికతను స్ఫురింప జేశారు. అక్కడే కవి సృజనాత్మక ప్రతిభ ద్యోతకమౌతోంది. తలవొంచి అభివాదం చేయాల్సిన యిలాంటి సందర్భాలు యీ కావ్యంలో తరచుగా తారస పడతాయి. గమనించండి.
***
‘స్థావర జంగమం’ విశిష్ట కావ్యం. ప్రాచీనత ఆధునికత కలగలిసిన కావ్యం. ఇందులో ప్రాచీనులు విశ్వసించిన ప్రకృతి ఆరాధన ఉంది. ఆధునికులు ప్రవచించిన పర్యావరణ స్పృహ ఉంది. అంతేకాదు; భావకవులు పలవరించిన ప్రకృతిపై ప్రేమ కూడా ఉంది. ఇందులోని భాష, కవిత్వ నిర్మాణం యెంత ఆధునికమో అంత ప్రాచీనం కూడా. కవిత్వ రూపం గేయంగానూ వచన కవితగానూ జమిలిగా నడుస్తుంది. ఇదొక విలక్షణ రూపం. కవిగా సూరం శ్రీనివాసులు గారు పండిత కవి. ఆయన ఆధునికులు ప్రాచీనులు కూడా. ప్రాచీనుల పాండిత్య స్ఫోరకమైన భాషా ఆధునికుల సరళ కవితా వ్యక్తీకరణ మిళితమైన ప్రత్యేకమైన శైలి ఆయనది. ప్రకృతిలోని మార్మికతే కవిత్వం.
ప్రకృతి అందరిదీ. అభివృద్ధి ముసుగువేసుకున్న ఆధునికత దానిమీద ఆధిపత్యాన్ని సాధించటానికి దారి తీస్తుంది. అందువల్ల ఆధునికత పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఆధునికతని వ్యతిరేకించే క్రమంలో పర్యావరణంపై ప్రేమ పుడుతుంది. దాన్ని కాపాడుకోవాలనే స్పృహ కలుగుతుంది. అయితే కాపాడుకోవటానికి ఆటంకంగా ఉన్న వ్యవస్థల పట్ల వ్యక్తుల పట్ల రూపొందించాల్సిన పోరాట మార్గాన్ని యెంచుకోవడంలోనే తడబాటు, తబ్బిబ్బు. ఆధునికతని పూర్వ ఆధునికులు ద్వేషిస్తారు. ఆధునికోత్తర వాదులు కూడా తిరస్కరిస్తారు. పూర్వ ఆధునికులు ఉత్తర ఆధునికులు యీ విషయంలో వొక్కటవుతారు. మాస్టారు వొక విధంగా పూర్వ ఆధునికులు, మరొక స్తరంలో ఉత్తర ఆధునికులు కూడా. అందువల్లే యీ కావ్యాన్ని యిలా కట్టారు. ఆయనది సమన్వయ మార్గం అని ప్రతిపదంలోనూ ద్యోతకమవుతుంది. అయితే ఆయన యీ కావ్యం లో ప్రకటించిన పర్యావరణ స్పృహ సాధారణీకృతం. నిర్దిష్టం కాదు. అందువల్ల ప్రకృతిలోని కొండా కోనా చెట్టూ చేమా నీరూ సర్వసామాన్యమైన మనిషిని వుద్దేశించే సంభాషిస్తాయి.
మాలో రాళ్ళున్నాయ్ రత్నాలున్నాయ్
చమురూ ఉంది, సౌందర్యమూ ఉంది
మనుషులే లేరు..
అందుకే అవి అంత భద్రంగా ఉన్నాయి (జలగీత)
సాగరం మనిషితో యీ మాట అంది గానీ అవీ భద్రంగా లేవు. అభివృద్ధి చెందిన దేశాల వ్యర్థ పదార్థాలకు సముద్రాలు డంప్ యార్డ్ లయ్యాయి. ఆర్ధిక వ్యాపార ఆధిపత్య యుద్ధాల్లో చమురు తెట్టెలతో కలుషితమయ్యాయి. కడుపులో దాచుకున్న జీవరాశికి నరకకూపాలయ్యాయి. మరొక చోట మరొక హెచ్చరిక:
మా నడుమ పాముల్లా
పిల్లనదులూ పాకుతూ పోతాయ్
ఆ అందాలను ఆదమరచి చూస్తున్నా
మీరు భరించలేరు
అన్నింటి నడకనూ ఆపి
కృత్రిమంగా దూకిస్తారు
అయినా భరిస్తాం (గిరిగీత)
ఆనకట్టలు కట్టి అర్ధాంతరంగా ఆపినా
అనుమతించినప్పుడే సాగే క్రమశిక్షణ మాది (జలగీత)
అభివృద్ధి పేరున యెంత విధ్వంసం జరిగింది/ జరుగుతోంది? నెహ్రూ ‘ఆధునిక’ దేవాలయాలుగా పిలిచిన బహుళార్థ సాధక భారీ నీటి ప్రాజెక్టుల గురించి, వాటి పొడవు వెడల్పు యెత్తు లోతుల గురించి, యెన్నెన్ని అబ్భురపరచే విషయాలతో పాఠ్య పుస్తకాలు విజ్ఞాన సర్వస్వాలు నింపేశారు? వాటి కింద ఆనవాళ్ళు లేకుండా సమాధి అయిన జీవితాల గురించి గానీ చరిత్ర సంస్కృతుల గురించి గానీ నిర్వాసితుల గోడు గురించి గానీ మానవ నిర్మిత కృత్రిమ సాగరాలు సృష్టించిన ముంపు బీభత్సంలో అదృశ్యమైన జీవరాశి గురించి గానీ వొక్క మాటైనా యెక్కడైనా ప్రస్తావించారా? భూప్రకంపనలకు తల్లడిల్లే తెహ్రీ డ్యాంకి వ్యతిరేకంగా, సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు నిరసనగా జరిగిన పర్యావరణ వుద్యమాలు అభివృద్ధి నిరోధకాలు అని ప్రచారం చేశారు. అలనాటి ఖాండవ వన దహనం దగ్గర్నుంచీ నేటి పోస్కో, జిందాల్, వేదాంత బహుళజాతి కంపెనీలు సృష్టిస్తున్న జీవవిధ్వంసం వరకూ విపరీత నాగరికతకీ అసహజ అభివృద్ధికీ యెదురొడ్డి నిలిచి బలయ్యేది ఆదివాసీలే. వారి జీవించే హక్కుల కోసం ప్రశించేవాళ్ళంతా యివ్వాళ దేశాద్రోహులే. ఉత్తర డకోటాలో గ్యాస్ పైప్ లైన్ ని అడ్డుకుంటూ యిటీవల అక్కడి నేటీవ్ అమెరికన్స్ చేసిన సుదీర్ఘ పోరాటంలో చేపట్టిన నినాదం: ‘reZpect our water’. పర్యావరణ వాదానికి గొప్ప ప్రతీక అది. ఈ కావ్యం చదువుతూ పోతుంటే దాని పొడవునా యెన్నో వాక్యాల వెనక దాగిన యిటువంటి ఆలోచనలెన్నో చుట్టిముడతాయి. సోంపేట కాకరపల్లి దగ్గర్నుంచి కూడంకులం తూత్తుకుడి వరకు ప్రకృతి పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయినవారంతా వూపిరి తీసుకోనివ్వరు. ఒక పాఠ్యాన్ని చదివినప్పుడు దాని చుట్టూ బయటా ఆవరించి వున్న అనేక విషయాల స్ఫురణ కలగజేయడమే ఆ పాఠ్యం గొప్పదనం.
ఈ కవిత్వంలో కరిగి వెన్నముద్దలయ్యే రాతి బండలున్నాయి. వాటికీ ప్రేమలూ, దాంపత్యాలూ పల్లవిస్తూనే ఉంటాయ్. ఏటి వొడ్డున ఇసుకతిన్నెలు కుసుమిస్తాయి. నిప్పునీటికుండలు ఉప్పొంగుతాయి. అలలు భంగపడి బద్దలౌతాయి. రాత్రింబవళ్ళని సమంగా చూసే విషువత్ దార్శనికతతో పాటు మానవ మేధలోని అల్పత్వాన్ని గుర్తించి యెత్తిపొడిచే నురగ నవ్వులూ వున్నాయి. నయాగరాల నయగారాలున్నాయి. రసమయ జీవితాల పక్కనే కర్కాటక కళామతల్లులున్నాయి. చెలియలి కట్టల సరిహద్దు రాళ్ళున్నాయి. పక్కనే పరచిన చీకటి తివాచీలు స్వాగతిస్తాయి. చిదుగులతో బడుగు బతుకులు వెలిగించే చిరుదివ్వెలున్నాయి. ఇవన్నీ యీ కవిత్వాన్ని తేజోమయం చేశాయి చైతన్యభరితం చేశాయి.
అది గిరి అయినా తరువైనా జలమైనా గీతమేదైనా తరగతి గదిలో నేర్పని యెన్నో వ్యక్తిత్వ వికాస పాఠాలు స్థావర జంగమంలో అడుగడుగునా సాక్షాత్కరిస్తాయి. జీవన తాత్త్వికతని బోధిస్తాయి. ఆత్మిక వికాసానికి దోహదం చేస్తాయి. ఖండికలను ‘గీత’ అని పిలవవడంలో కవి వుద్దేశించిన ప్రయోజనం అదేనేమో!
కాలం గాయాలు చేసినా
మంచునీళ్ళతో కడిగివేసికొని
మరునాటికే మళ్ళీ
నూతనంగా పుట్టి పెరుగుతాం
అర్ధాంతరంగా అంతంకాకూడదని
అడ్డంగా నరికినా కిందనుంచీ చిగురిస్తాం
…. …. ….
మా కళ్ళు మా వేళ్ళతోనే పొడిచినా
మా ఒళ్ళు మా ముక్కలతోనే నరికినా
మంటలమై మమతల వరమై
మీ ఆకళ్ళనే తీరుస్తుంటాం (తరుగీత)
ఇస్మాయిల్ దగ్గరనుంచి సూరం వారి వరకూ చెట్టు కవిత్వానికి ఆదర్శం, స్ఫూర్తీ.
తన కన్ను తానే పొడుచుకునే మనిషి పట్ల జాలితో రాసిన కవిత్వమిది. మనిషి స్వార్థం పట్ల, దిగజారుడుతనం పట్ల క్రోధం గర్భీకృతమైన జాలి అది. ఇందులో జీవితాల్ని చక్కదిద్దుకొమ్మని హెచ్చరికలున్నాయి. వికాసోన్ముఖం చేసే విన్నపాలున్నాయి. నచ్చచెప్పే అనునయాలున్నాయి. బతిమాలే బుజ్జగింపులున్నాయి. ఊరడించే లాలనలున్నాయి. కాంతా సమ్మితంగా యెరుకనిచ్చే వుపదేశాలున్నాయి. వెరసి యీ కవిత్వమొక ఆప్తవాక్యం.
***
ఆ మధ్య చాలా కాలం ప్రజా కవిగా జీవించిన వొకానొక మిత్రుడు తాను ప్రజా కవిని కాననీ ప్రకృతి కవిననీ ప్రకటించుకున్నాడు. ఆ చాటింపుతో పాలకుల కళ్ళు విచ్చుకున్నాయి. వెంటనే ఆయనకి రాజాస్థానంలో చోటు లభించింది. నా బోటి వాళ్ళకే కళ్ళు తిరిగాయి. ప్రకృతిలో ప్రజలు భాగమైనప్పుడు ప్రకృతి నుంచి ప్రజల్ని వేరుచేసే కుట్ర కదా యిది అనిపించింది. ప్రకృతిలో పాలకులే వుండి పాలితులు మాయమై పోతున్న సందర్భాలు, బలవంతుల నీడలో బలహీనులు బతికి బట్ట కట్టలేని దీన పరిస్థితులు యిటీవల యెక్కువగా తారసపడుతున్నాయి. ఎవరు యెక్కడ నిలబడాలో తేల్చుకోవాల్సిన సామాజిక రాజకీయ సందర్భంలో వెలువడుతున్న కవిత్వం యిది.
సమున్నత గిరి శ్రేణి సానువుల చెంత, అపార జల రాశుల తీరాల వద్ద, విశాల తరుచ్ఛాయల కింద చేతులు కట్టుకుని వినమ్రంగా నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో యీ కవిత్వం నిండా పరుచుకుని వున్నాయి.
నేర్చుకోవాలంటే కొండ పాదాల ముందు మోకరిల్లాలి. బండరాళ్లతో సహవాసం చెయ్యాలి. తరు మూలాల్ని కౌగిలించుకోవాలి. కంటక వనాల్ని అధిగమించాలి. నీటిలోని నిప్పుని ముద్దాడాలి. అలల కరవాలాలతో కరచాలనం చెయ్యాలి. అందుకు ముందు మానసికంగా సిద్ధం కావాలి. ‘స్థావర జంగమం’ ఆ పని చేస్తుంది. ప్రకృతిని మించిన పరమార్థం లేదని నిరూపిస్తుంది. ఈ నిరూపణలో నేనూ భాగమైనందుకు సంతోషిస్తూ ….
నింగీ నేలా గాలీ నీరూ మన సర్వస్వాన్నీ ద్రవ్యీకరణ (monetization) పేరుతో అమ్మివేస్తూ పరాయీకరణకి గురిచేస్తున్న చీకటి రాజ్యంలో మా మాష్టారిలోని ధర్మాగ్రహం మరింత పదునైన కవిత్వంగా పరిణమిస్తుందని ఆశిస్తూ …
చీకటి రోజుల్లో చీకటి గురించిన గానాలుంటాయి అన్న బ్రెహ్ట్ వాక్యాన్ని వెలుతురు గానాలు కూడా వుంటాయని సవరించుకుంటూ, రాబోయే విభా ప్రభాతాలు దుర్దినాల్ని అంతం చేస్తాయని విశ్వసిస్తూ …
హైదరాబాద్ వినమ్రంగా
ఎ. కె. ప్రభాకర్
అక్టోబర్ 2, 2021
తాడిగడప శ్యామల రావు
ప్రతి విషయానికీ మార్క్సిష్టు కళ్ళద్దాలు తగిలించి ఆవికృతరూపాలలో కాని మంచిని చూడలేరా? విసుగొస్తోంది.