యార్లగడ్డ “ద్రౌపది”

వ్యాసకర్త: గాలి త్రివిక్రం

***************

నేను ఈ పుస్తకం గబగబా చదివేద్దామని ఆత్రంగా మొదలుపెట్టి, ప్రారంభంలో పేజీల కొద్దీ సాగిన స్వగతం దాటి ముందుకు కదలలేక పక్కన పడేశాను. అదైనా భారతానికి సంబంధించింది కాకపోతే మళ్ళా ముట్టుకునేవాడిని కూడా కాదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా మొదలుపెట్టి, గేరు మార్చిన తర్వాత ఇక ఆపకుండా చివరిదాకా చదివేశాను.

దీంట్లో అన్నిటికంటే ముందుగా చెప్పుకోవలసిన అంశం మాయలు, మహిమల ప్రసక్తి వీలైనచోటల్లా పరిహరించి (ద్రౌపది పూర్వజన్మలు, ఆమె పుట్టుక తప్ప), సాధ్యమైనంతవరకు వాస్తవిక దృక్కోణంలో చూపడం. ఉదాహరణకు ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో ఆమె కృష్ణుడిని తలచుకున్నప్పటికీ వస్త్రాపహరణం ఆగిపోవడంలో అతడి ప్రమేయం ఉన్నట్లు సూచించలేదు. తర్వాతెప్పుడో కృష్ణుడిని ఆ విషయమే అడిగినప్పుడు ఆ సమయంలో తాను సాల్వుడితో పదినెలలుగా యుద్ధం చేస్తూండడం వల్ల జరిగిన విషయాలు తనకు వెంటనే తెలియలేదని అంటాడు. (వాస్తవం కూడా అదే. తాను ద్వారకలో ఉన్నట్లైతే ఆ జూదం జరగనిచ్చేవాణ్నే కాదని కృష్ణుడు అంటాడు.)

కుంతీసంతానం విషయంలో కూడా దాపరికం ఏమీ లేదు. కర్ణుడి విషయం బయటపెట్టిన తర్వాత కుంతి కూడా కర్ణ-యుధిష్ఠిర-భీమ-అర్జునుల తండ్రులు నలుగురు, పాండురాజు కలిపి పంచభర్తృకగా సూచించబడుతుంది. అశ్వత్థామ చావకపోవడానికి కారణం పాండవులు అతణ్ని చంపకుండా వదిలెయ్యడమే తప్ప అతడి చిరజీవిత్వమో వాళ్ళు అతణ్ణి చంపలేకపోవడమో కాదు.

అట్లాగే భీష్ముడికి ఇచ్ఛామరణం అంటూ ఏమీ లేదు. రచయిత పొరబాటో ఉద్దేశపూర్వకమో తెలియదుగానీ యుద్ధం ముగిసేటప్పటికే అతనూ చనిపోయి ఉంటాడు! (25వ పేజీ: దుఃఖిస్తూ దుఃఖిస్తూ గాంధారి … భీష్ముడు, ద్రోణుడు మొదలగువారి శవాలను తిలకించి వారి పరాక్రమాన్ని గుర్తు తెచ్చుకున్నది.) ఉద్దేశపూర్వకమైతే ఏ ఉద్దేశంతోనో తెలియదు. ఎందుకంటే భీష్ముడు బతికే ఉండడం కథాగమనానికి ఎక్కడా అడ్డువచ్చే అవకాశమూ లేదు.  

కర్ణుడి గురించి తలపోస్తూ ద్రౌపది ఒకే మనిషిలో నీచత్వమూ, ఉన్నత వ్యక్తిత్వమూ ఉండడం సాధ్యమేనా అని ప్రశ్నించుకుంటుంది. అన్నింటా అన్నివేళలా ఉన్నతంగానో, నీచంగానో ఏ ఒక్క మనిషీ ఉండలేరు. ప్రతి ఒక్కరిలో మంచీ చెడూ తప్పవు. మదిమదిలో ఆ మంచీ చెడుల మధ్య ఘర్షణా అనివార్యమే. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క లక్షణం పైచేయి సాధించి, బయటపడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బయటికి కనబడే లక్షణాలను బట్టి ఎవరి గురించీ ఒక స్థిర నిర్ణయానికి రావడం పొరబాటే అవుతుంది.

మహాభారతంలో అసంఖ్యాకమైన పాత్రలున్నా ముఖ్యమైన ప్రతి పాత్ర ప్రవర్తనా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ రచనలోనైనా పాత్రల ప్రవర్తనలో తగిన కారణం లేకుండా నిలకడ లోపిస్తే పాత్రౌచిత్యం దెబ్బతిని రచన విశ్వసనీయత, రచయిత సామర్థ్యం, ఉద్దేశాలు ప్రశ్నార్థకాలౌతాయి. ఈ నవల్లో ద్రౌపదీ కృష్ణుల అనుబంధాన్ని, వ్యాస, ధృతరాష్ట్రుల ప్రవర్తనను చిత్రించిన విధానం రచయిత ఉద్దేశాన్ని ప్రశ్నార్థకం చేశాయి.

కృష్ణుడు ఎవరెట్లా చూడాలనుకుంటే వాళ్ళకు అట్లా కనబడుతాడు. కృష్ణుడి ఆకర్షణ చాలా బలమైనదని, దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరని, కృష్ణసఖులకు వరుసలతో పనిలేదు అని ఒక ప్రవాదం. (పేరుకు తగినట్లే కృష్ణబిలం / బ్లాక్ హోల్ అంత బలమైనదన్నమాట.) రాధ అతడికి మేనత్తట.

కృష్ణుడికి తొమ్మిది పెండ్లిండ్లు, పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు. నరకుడిని చంపినప్పుడు అతడి చెరనుంచి విడిపించిన 16,100 మంది దేవ కన్యలు ‘మమ్మల్నిప్పుడు ఎవరు పెండ్లి చేసుకుంటారు?’ అని బాధపడితే, అందర్నీ ఒకేసారి పెండ్లిచేసుకుని, ‘కృష్ణుడి భార్యలమని చెప్పుకోండి’ అని ఎవరిండ్లకు వాళ్ళను పంపేస్తాడు. వాళ్ళతో రొమాన్స్ కాదు గదా ఆ తర్వాత ఎప్పుడూ కలుసుకున్నట్లు కూడా మనకు తెలియదు. అందుకే దాన్ని కృష్ణుడి పెండ్లని గానీ, వాళ్లను కృష్ణుడి భార్యలని గానీ ఎవరూ భావించరు. ఐతే ఆ 16 వేల పైచిలుకు సంఖ్యను గోపికలుగా ఎంచి కృష్ణుడు 16 వేల మంది గోపికలతో తిరిగాడని కొందరు పొరబడుతూ ఉంటారు.

అయితే కృష్ణుడు తన అష్టభార్యలతో కాక ఏం సరసమాడినా రేపల్లె గోపికలతోనే. వాళ్ళెంతమందో తెలియదుగానీ పట్టుమని పదిమందైనా ఉంటారనేది సందేహమే. మిగతావాళ్లతో మామూలుగానే ఉన్నాడు. అలాంటిది చెల్లెలి వరసైన ద్రౌపది ఆకర్షణలో పడినట్లు చూపడం శోభించదు. ద్రౌపది వైపు నుంచి కూడా అంతే. ఇక అర్జునుడి విషయంలో – ఆలిని అన్నదమ్ములతో పంచుకున్నవాడు ఆత్మబంధువుతో పంచుకోవడానికి వెనకాడుతాడా అనుకున్నారేమో! ఇది ఇంకా విపరీతం.

నవవిధ భక్తి మార్గాల్లో సఖ్యం కూడా ఒకటి. కృష్ణుడి పట్ల అర్జునుడికున్నది. ద్రౌపది భక్తి కూడా అట్లాంటిదే అని రచయిత చెప్పదలచుకున్నట్లైతే ఆ ఉద్దేశం నెరవేరలేదు. నవలలో చిత్రించిన విధానం అపార్థానికి తావిచ్చేలానే ఉంది.

అంత పెద్ద మహర్షి వ్యాసుడు ద్రౌపదితో మాట్లాడేటప్పుడు ఆమె యజ్ఞకుండంలో ఉద్భవించిన విషయం విస్మరించి, ఒక పామరురాలిగా ఎంచి, ఆమె తనకు తెలిసిన విషయాలు చెప్తున్నప్పుడు ‘నీకు ఆ విషయం కూడా తెలుసా?’ అని ఒక్కొక్క విషయానికి ఆశ్చర్యపోవడం, నిర్ఘాంతపోవడం, తనను అవమానించినట్లు భావించి కోపించడం ఎందుకో అర్థం కాలేదు. పైగా, వ్యాసుణ్ని శృంగార సుఖం కోసం వెంపర్లాడుతున్నట్లుగా చిత్రించడం, ధృతరాష్ట్రుడు నిండు కొలువులో వస్త్రాపహరణానికి గురౌతున్న ద్రౌపది సౌందర్యాన్ని చూడలేకపోయినందుకు చింతించినట్లు చూపడం రచయిత ఉద్దేశాలను ప్రశ్నార్థకం చేశాయి.

భారతాన్ని, భారత యుద్ధాన్ని ధర్మానికి-అధర్మానికి మధ్య పోరాటంగా చూడడం సరికాదు. ఎందుకంటే పాండవులు కూడా అన్ని వేళలా ధర్మానికి కట్టుబడి లేరు. యుద్ధంలో కౌరవుల వైపున్న ముఖ్యమైన వీరుల్లో  భీష్మ, ద్రోణ, కర్ణ, సైంధవ, దుర్యోధనాదులందరినీ అధర్మంగానే పడగొట్టారు. మిగతా విషయాల్లో ఎట్లా ఉన్నా యుధిష్ఠిరుడు ఒక్క జూదం నియమాలకు కట్టుబడే విషయంలో మాత్రం చాలా నీతివంతంగా వ్యవహరించాడు – దాని మూలంగా తాను, తన కుటుంబం ఎంత నష్టపోతున్నా, ఎన్ని కష్టాల పాలౌతున్నా సరే! బహుశా నీతిపరుడని అతనికి ఖ్యాతి రావడానికి గల కారణాల్లో ఇదొకటి కావచ్చు.

అన్ని నీతులు చెప్పే అతడికి చేసిన తప్పు ఒప్పుకోవడానికి మాత్రం నోరు పెగలదు. “నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?” అని అడిగితే “నన్నోడినాకే నిన్నోడితి”నని చెప్పలేడు. అరణ్యవాసంలో నీళ్ళ కోసం పంపాలంటే మాద్రీసుతులనే ముందు పంపుతాడు (నవల్లో ఈ సన్నివేశం లేదు). అక్కడ నలుగురు పాండవుల ప్రాణాలు తీసిన యక్షుడు “నీ తమ్ముళ్లలో ఎవరిని బతికించమంటావు?” అని అడిగితే కుంతి కొడుకుల్లో తానున్నానని, మాద్రి కొడుకుల్లో ఒకరిని బతికించమన్నవాడే జూదంలో మాత్రం పందెంగా ఒడ్డడానికి ముందుగా మాద్రీసుతులిద్దరూ అయిపోయాకే కుంతీపుత్రులను ఒడ్డుతాడు! ఆ నీతి ఇక్కడేమైందో తెలియదు.

అతడు అందరూ తనమీద జాలి కురిపించడం కోరుకుంటాడని అనిపిస్తుంది. అత్మగౌరవం గలవాడెప్పుడూ అట్లా కోరుకోడు. వనవాసంలో ఒకసారి (నవల్లో ఈ సన్నివేశం లేదు) “నేను గాంగ ఇన్ని కష్టాలు పడుతున్నాను. నాలాగ కష్టాల పాలైనవాళ్ళు లోకంలో ఇంకెవరైనా ఉంటారా?” అని గొప్పలు(!) పోతే “నువ్వు జూదమాడి చేతులారా తెచ్చుకున్నావు. రాముడు కేవలం తండ్రికి మాట రానీయకూడదని వనవాసం చేశాడు. నీకు అరణ్యవాసంలో భార్య నీ వెంటే ఉంది. రాముడికి ఆ ఆనందం కూడా లేదు.” అని మార్కండేయుడు అతనికి రామాయణం గుర్తు చెయ్యవలసి వచ్చింది. యుధిష్ఠిరుడు అప్పటికీ తగ్గక, ద్రౌపది పడుతున్న కష్టం ఎవరైనా పడినట్లు కనీవినీ ఎరుగలేదనైనా ఒప్పుకోమంటే ద్రౌపది కంటే సావిత్రి పడిన కష్టం గొప్పదని మార్కండేయుడు సావిత్రి కథ చెప్తాడు.

కీలకమైన అనేక ఇతర అంశాల్లో అతడు ‘పాటించిన’ నీతి ప్రశ్నార్థకం – తమ్ములను సంప్రదించకుండా, వాళ్ల సమ్మతి తీసుకోకుండా వాళ్లను, ఉమ్మడి భార్యను పందెంగా ఒడ్డడంతో సహా. ఆ సమయంలో ద్రౌపది ఏకవస్త్ర కావడం నిజమే కావచ్చు. “ఏకవస్త్రవైనా, ఏ స్థితిలో ఉన్నా ఉన్నపళంగా దుఃఖిస్తూ రమ్మని” మత్రమే యుధిష్ఠిరుడు పంపిన సందేశం. దాన్ని పట్టుకుని ఏకవస్త్ర అన్నది యుధిష్ఠిరుడు చెప్పించిన అబద్ధం అనిపించేలా ఉంది ఈ నవలలో. ఇది కూడా అతని మీదికి తొయ్యడమెందుకు, అతడు నిజంగా చేసిన తప్పులే ఓపినన్ని ఉండగా?

ఈ నవలలో లేదుగానీ అజ్ఞాతవాసం గడువు తీరిపోయిందని భీష్ముడు చెప్పిన లెక్క కూడా లాజిక్కుకు నిలబడనిదే అని నా అనుమానం. అధిక మాసాలను తీసేస్తే పదమూడేండ్లు పూర్తవుతాయంట, కలిపితే పూర్తి కావంట. అయినా దుర్యోధనుడు అన్ని లెక్కలూ భీష్ముడికే తెలుసు అని నిర్ణయం ఆయనకే వదిలేస్తాడు. అధికమాసాలను తీసేసి లెక్కించడం కరెక్టా? ఇప్పుడు నాలుగేండ్లకొకసారి లీపు సంవత్సరం వస్తుంది. 2008 నవంబరు 1 నుంచి పదమూడేండ్లంటే 2021 అక్టోబరు 31కే గానీ మధ్యలో నాలుగు లీపు సంవత్సరాలొచ్చినాయని అధికంగా వచ్చిన ఆ నాలుగురోజులూ తీసేసి అక్టోబరు 27కే పదమూడేండ్లు పూర్తైనాయంటే ఎవరైనా ఒప్పుకుంటారా అనేది ప్రశ్న.

నీతిమాటెలా ఉన్నా, పాండవుల మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధం ఎంత బలహీనమైనదో చెప్పడానికి ద్రౌపది పెళ్లిళ్ళే అతిపెద్ద నిదర్శనం. మరికొన్ని సందర్భాల్లో కూడా ఈ విషయం తేటతెల్లమౌతూనే ఉంటుంది. మాయాద్యూతమప్పుడు ద్రౌపదిని పణంగా ఒడ్డిన యుధిష్ఠిరుడి చేతులు కాల్చేస్తానని భీముడు అందరి ముందూ గర్జిస్తాడు.

యుద్ధంలో కర్ణుడు యుధిష్ఠిరుడ్ని ఓడించి అవమానించి పంపేసినప్పుడు అర్జునుడు కర్ణుడ్ని చంపకుండా తనను పరామర్శించడానికి వచ్చినాడని యుధిష్ఠిరుడు “నీ గాండీవమెందుకు? కాల్చనా?” అని నిందిస్తే, “నీ చంచల స్వభావంతో, నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుతో, నీ సెల్ఫ్ పిటీతో నువ్వే అఘాయిత్యానికి పాల్పడుతావో అని నేను నీ గురించి పరిగెత్తుకుంటా వస్తే దానికి నన్నే తిడతావా? కర్ణుణ్ని కాదు, ముందు నిన్నే  చంపి పారేస్తే పీడా బోతాది” అని చంపడానికి మీదికి పోతే కృష్ణుడు శాంతపరచవలసి వచ్చింది.

నన్నేమన్నా ఫర్వాలేదుగానీ నా గాండీవాన్ని ఎవరైనా తూలనాడితే చంపేస్తానని అంతకుముందెప్పుడో ప్రతిజ్ఞ చేసి ఉన్నాడట. ఈ కోపానికి అట్లా గాండీవాన్ని సాకుగా చూపించారు. ఈ నవల్లో ఈ ప్రతిజ్ఞ గురించి ప్రస్తావించలేదు. అన్నదమ్ముల మధ్య నివురుగప్పిన నిప్పులా మత్సరాలున్నాయని చెప్పడానికేమో!

యుధిష్ఠిరుడెంతటి బలహీన మనస్కుడంటే ఎప్పటికప్పుడు అతడు వైరాగ్యంతో, నిరాశతో డీలా పడిపోతూ ఉంటే అతడి నడుం బిగించి ముందుకు నడపడానికి మోటివేటర్ తప్పనిసరి. ఎప్పటికప్పుడు ఆ పాత్ర తన తమ్ములో, కృష్ణుడో,  ద్రౌపదో ధరించవలసివస్తుంది. కుంతీపుత్రులు ముగ్గురి మనస్తత్వాలు, కారణాల గురించి గతంలో కౌంతేయులు అనే వ్యాసంలో చర్చించి ఉన్నాను. ఆ వ్యాసం రాసినప్పటికి ఈ నవల రాలేదు.

పంచభర్తృక ఐన ద్రౌపది గురించి రాసేటప్పుడు సెక్సువాలిటీ గురించి అనివార్యంగా చర్చించవలసే వస్తుంది. ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులతో అనుభవం పంచుకోకూడదని ఎందుకు నిర్ణయించారని ద్రౌపది వ్యాసుడిని అడిగినప్పుడు ఆయన ఎక్కువ వివరాల్లోకి పోకుండా “కుటుంబ వ్యవస్థ సరిగా నడిచేందుకు” అని క్ఌప్తంగా సమాధానమిస్తాడు.

కుంతి ద్రౌపదికి చెప్పిన కథలో స్త్రీలు తమ భర్తలతో కాక పరపురుషులతో సంభోగించకూడదనే నియమం మాత్రమే శ్వేతకేతువు విధించినట్లు ఉంది. పెండ్లి చేసుకోవడం, భార్యా భర్తలు కలిసి కాపురం చెయ్యడం అంతకు ముందు నుంచే ఉన్నట్లు సూచించబడింది. అంటే అంతకు ముందు భార్యాభర్తలుగా ఉంటూనే ఇష్టం వచ్చినవాళ్ళతో రొమాన్సు చెయ్యగల “open marriage” లాంటి వ్యవస్థ ఉండేదా? శ్వేతకేతువు విధించిన నియమమైనా స్త్రీలకు మాత్రమేనా? ఆడ-మగ ఇద్దరికీ సంబంధించిన విషయంలో మగవాళ్ళకు లేని నియమం ఆడవాళ్ళు మాత్రమే పాటించడం ఎట్లా సాధ్యం? నాతి చరామి అన్న వాగ్దానం లేకుండా పెళ్లికి విలువేమున్నట్లు? ఆ కట్టుబాటే పెళ్లికి పునాది కదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు.

ద్రౌపది పాండవుల్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క ఏడాది ఉండాలని నారదుడు ఏర్పరచిన నియమం అర్థవంతంగా, వివాహవ్యవస్థ ప్రయోజనానికి అనుగుణంగా ఉంది. ఈ నవలలో ద్రౌపది ఆలోచనలు ఆ విషయంలో చాలా అపరిపక్వంగా, అసంబద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో తనకు గర్భం వస్తే మరొకరితో సంగమం సాధ్యమా? అన్నది ఆమె సందేహం. నెల, పక్షం లేదా వారం ఉంటే బాగు, రోజుకొకరితో ఐతే ఉత్తమం అన్నది ఆమె ఆలోచన (ఆలోచనారాహిత్యం).

తనకు గర్భం వస్తే కనీసం ఎవరి వల్ల వచ్చిందో (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప) కొంతవరకన్నా తెలియాలంటే గడువు కనీసం నెల కంటే ఎక్కువుండాలి. ఒకరి వల్ల గర్భం వచ్చిన తర్వాత చూలింత, బాలింత దశలు దాటేవరకు అతడితోనే ఉండడం న్యాయం. కాబట్టి సంవత్సరం గడువే సరైనది. కాన్పు సమయంలో మారాల్సి వస్తే కొన్ని నెలలు పొడిగించుకోవచ్చు. అసలు వివాహ వ్యవస్థ మూలం అక్కడే ఉంది. 

ముఖ్యంగా స్త్రీ సంపాదనాపరురాలు కాని రోజుల్లో పిల్లల పోషణాభారం ఎవరు వహించాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు, పురుషుడి ఆస్తి మీద వారసత్వాన్ని నిర్ణయించవలసి వచ్చినప్పుడు పిల్లల తండ్రి వాళ్ళ బాధ్యత తీసుకోవాలన్నా, తను కూడబెట్టిన స్థిర చరాస్తులు వారసత్వంగా అప్పగించాలన్నా వాళ్ళు తన పిల్లలే అన్న నమ్మకం ఏర్పడాలి. పైన చెప్పుకున్న open marriageలో ఆ నమ్మకానికి అవకాశం లేదు. ఆ నమ్మకం కోసమే భార్యాభర్తలు కాని జంట సంభోగించకూడదనే నియమంతో వివాహం వ్యవస్థీకృతమై ఉండాలి. మగవాడు తాను స్వయంగా ఆ నియమాన్ని ఉల్లంఘిస్తూనే తన మీద ఆధారపడే ఆడదాన్ని మాత్రం కట్టుదిట్టాల్లో ఉంచగలిగాడు. అందువల్లే అధికారికంగానో అనధికారికంగానో బహుభార్యత్వం అమలైనట్లుగా బహుభర్తృత్వం ఆచరణలో లేకుండాపోయింది.

ఈ నవలలో ద్రౌపదీ స్వయంవరం తర్వాత పాండవులు ఐదు మందీ ఒకేసారి ఇంట్లోకి ప్రవేశించినట్లు ఉంది. ముందే ఇల్లు చేరిన యుధిష్ఠిర నకుల సహదేవులు నేరుగా ఇంట్లోకి పోకుండా భీమార్జునులు తమ మీదికి దాడికొచ్చినవాళ్లతో యుద్ధం చేసి వాళ్ళందరినీ తరిమికొట్టి, ద్రౌపదితో ఇల్లు చేరేవరకూ ఇంటి తలుపు వద్దే కాచుకొని ఉన్నారట. ఎందుకో?? ఈ వాకిలి దగ్గర కాచుకొని ఉండడమనే కాన్సెప్టు భారతంలో లేదు.

భీమార్జునులు ఇల్లు చేరేలోపు వాళ్లు కుంతితో ఏం మాట్లాడారో మనకు తెలియదుగానీ స్వయంవర విశేషాలు చెప్పకుండా ఉంటారా? వీళ్ళు చెప్పకపోయినా ఆమె అడగకుండా ఉంటుందా? అసలే తన కొడుకులు ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి దుర్యోధనాదుల వల్ల ఏమి కీడు మూడిందో అని అప్పటివరకూ భయపడింది కూడా. కాబట్టి ఆమే తన పుత్రుల కోసం వాకిట్లోకి ఒక కన్నేసి ఉందనో, లేక తనే తలుపు దగ్గర కాచుకొని ఉందనో అనుకోవడం ఇంకా సబబుగా ఉంటుంది. భీమార్జునులు వచ్చేలోపు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఏ గూడుపుఠాణీ పన్నారో మనకు తెలియదు.

కాకపోయినా నిజమైన భిక్షను పాండవులు ఏనాడూ “సమానంగా” పంచుకున్నదీ లేదు, కుంతి వాళ్ళకు సమంగా పంచిందీ లేదు. ఆరోజే కాసేపటి తర్వాత ఏం జరిగిందీ గమనించినా ఇదే విషయం తేటతెల్లమౌతుంది: భీమార్జున నకుల సహదేవులు తీసుకువచ్చిన భిక్షలో కొంత బలులకూ అతిథులకూ ఉంచి, మిగిలినది రెండు భాగాలు చేసి ఒక భాగం భీముడికీ, మిగిలినది మిగతా నలుగురికీ పెట్టమని కుంతే స్వయంగా ద్రౌపదికి చెప్పింది!

మొత్తానికి చూస్తే ద్రౌపదిని ఐదుగురూ పెళ్ళాడాలని స్పష్టంగా ప్రతిపాదించినవాడు యుధిష్ఠిరుడు. అన్నల పెండ్లిండ్లు కాకుండా తమ్ముడు చేసుకోకూడదనే నియమం హిడింబ విషయంలో ఏమైంది? పోనీ, ఆ నియమం అర్జునుడి విషయంలో పాటించే తీరాలనుకున్నా, బహుభార్యాత్వం నిషిద్ధం కాదు కాబట్టి అన్నలిద్దరూ విడివిడిగా వేరే కన్యలు ఎవరినైనా అదే ముహూర్తంలో ఆపద్ధర్మంగా పెళ్ళాడి ఉండొచ్చు. లేదా అన్నలిద్దరికీ తగిన సంబంధాలు కుదిరేవరకూ అర్జునుడి పెళ్లి వాయిదా వేసుకుంటే పోయె. అవేమీ ఆలోచించను కూడా లేదు. ఎందుకంటే అన్నదమ్ములందరికీ ద్రౌపదిని చూసినప్పటినుంచీ ఆమె మీదే మోహం. (అట్లా మోహం కలగడానికీ కారణముంది. దాని గురించి చివర్లో కీచక వధ సన్నివేశమప్పుడు మాట్లాడుకుందాం.)

స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టినవాడికే తన కుమార్తెనిస్తానని ద్రుపదుడు ముందే చాటింపు వేయించి ఉన్నాడు. తమలో మత్స్య యంత్రాన్ని ఛేదించగలవాడు అర్జునుడొక్కడే అని స్వయంవరానికి వెళ్ళబోయే ముందే తెలుసు. అదే జరిగితే ఏం చెయ్యాలో మాత్రం ముందే ఆలోచించుకోలేదు. ఎందుకు ఆలోచించుకోలేదంటే అప్పటికి ద్రౌపదిని వాళ్ళు చూడలేదు. ద్రౌపదిని చూడకముందు ఆలోచించుకోవలసిన అవసరం లేకపోయింది, చూసినాక ఆలోచనాశక్తే లేకుండా పోయింది.

తన ఐదుగురు కొడుకులను పెళ్ళాడమన్న కుంతి గురించి ద్రౌపది ఆలోచనలు రచయిత ఒక్క పేరాలో చక్కగా ఆవిష్కరించారు: “ఈమె … పరాయి పురుషులను ఆహ్వానించి వారి ద్వారా సంతానం పొందింది. ఆ సమయంలో ఈమెను సందేహం, పాపభీతి, సిగ్గు వెంటాడి ఉండొచ్చు. పాండవులు ఎవరి పుత్రులని ఎవరైనా అడిగినప్పుడల్లా కుంతీదేవి మనసులో ఎలాంటి అంతర్మథనం పొందిందో… తన కోడళ్ళు ఒక్కొక్క భర్తను కలిగి ఉంటే పరాయి పురుషుల సంగమంతో తాను సంతానాన్ని కన్న విషయం వారి మనసుల్లో చోటుచేసుకుని తనను తక్కువగా చూస్తారని కుంతి విచారించిందా? కోడలి ముందు తన స్థాయి తక్కువ కాకూడదనే ఉద్దేశంతోనే ఈమె ఐదుగురు కుమారులతో తనకు వివాహం చెయ్యాలని ముందుగానే నిర్ణయించిందా?“ ముందుగా నిర్ణయించకపోయినా కొడుకు చేసిన ప్రతిపాదనను ప్రతిఘటించకపోవడానికి ఇదీ ఒక కారణం కావచ్చు.

భారతంలో అర్జునుడి తీర్థయాత్ర కోసం నియమ భంగం జరగడం నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. వాళ్ళు ఉంటున్నది సింగిల్ బెడ్రూం ఇరుకింట్లో కాదు. సాక్షాత్తూ విశ్వకర్మ నిర్మించిన ఇంద్రప్రస్థంలో! అలాంటి ఇంద్రభవనంలో ఇంకెక్కడా స్థలం లేనట్లు ఆయుధాలు తీసుకుపోయి బెడ్రూంలో పెట్టుకుంటారా అన్నది మౌలికమైన సందేహం. బెడ్రూంలో కాదు, ఆ సమయంలో ఆయుధాగారంలోనే సరసమాడుతున్నారు ద్రౌపదీ యుధిష్ఠిరులు అని ఈ నవలలో సొగసైన సమాధానమిచ్చారు రచయిత.

కీచకుడి చావుకు కారణమైన సైరంధ్రిని అతడితోబాటే తగలబెట్టాలని ఆమెను కట్టేసి శ్మశానానికి తీసుకుపోయిన ఉపకీచకులందరూ కూడా భీముడి చేతిలో చచ్చిన తర్వాత అంతఃపురానికి తిరిగివెళ్తున్న సైరంధ్రిని చూసిన మనుషులు విరాటరాజు దగ్గరికి వెళ్లి “… ఆమె చాలా అందగత్తె. ఆమెను చూసినవాడికి ఎవడికైనా మోహం పుట్టి తీరుతుంది. ఆమెను మోహించిన వారందరికీ కీచకులకు పట్టిన గతే పట్టుతుంది. ఆ విధంగా మన నగరమే నాశనమౌతుంది…” కాబట్టి ఆమెను ఊరి నుంచి పంపించెయ్యమని చెప్తారు!

ఆ మాటలన్నది కీచకుడి సంబంధీకులు కాదు. విరాటనగరానికి చెందిన సాధారణ ప్రజలు. ఆమె ఆకర్షణ నిజంగా అంత బలమైనదా అనిపిస్తుంది గానీ ఈ మాటలు భారతంలో ఉన్నవే. (ఎందుచేతనో ఈ నవలలో చేర్చలేదు. సుధేష్ణాదేవే ఆమెను “దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపో” అని వేడుకున్నట్లు ఉంది.) అంటే ఆమెలో ఏ మగవాడినైనా రెచ్చగొట్టేంత బలమైన ఆకర్షణ ఉంది. ఆమె స్వయంవరమప్పుడు పాండవులు కూడా అదే ఆకర్షణకు లోనై, ఆమెను పెళ్ళాడడానికి అందరూ సిద్ధమై ఉంటారు.

స్వర్గారోహణ పర్వంలో ద్రౌపది చివరి క్షణాల్లో ఆమెను ఒడిలోకి తీసుకుని నోట్లో నీళ్ళు పోసి సాంత్వన కలిగించినవాడు భీముడైతే, “ఆగిపోతున్న ఆమె గుండె చివరి లయలో ధ్వనించింది” భీముడి పేరు కాదు. ఆమె భర్తల్లో తన పట్ల ఎక్కువ ప్రేమను చూపినవాడు భీముడైనప్పటికీ ఆమె అతణ్ని కాకుండా అర్జునుణ్ని ప్రేమించడాన్ని తప్పుపట్టలేం (ఎవరికి ఎవరిమీద ప్రేమ పుడుతుందో చెప్పలేకపోవడం ఒక కారణమైతే అసలు మొదట్నుంచి ఆమె పెళ్ళాడాలనుకున్నది అర్జునుడినొక్కడినే కావడం రెండో కారణం.) చివరి క్షణాల్లో ఆమె తాను అంతగా ప్రేమించిన అర్జునుడ్ని కాకుండా కృష్ణుడ్ని తలచుకోవడం ఈ నవలలో కొసమెరుపు. అటువంటప్పుడు తన భర్తల కంటే పరపురుషుడైన కృష్ణుడికి మనసులో ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ఆమె చేసిన తప్పు అని యుధిష్ఠిరుడు అనాలి. కానీ ఆ డైలాగు మాత్రం మార్చలేదు. అర్జునుడి మీద ఎక్కువ ప్రేమ ఉండడమే ఆమె తప్పట! కృష్ణుడి పేరెత్తడం తప్పు కానట్లే అర్జునుడి మీద ఎక్కువ ప్రేమ ఉండడం కూడా తప్పు కాకూడదు. కాబట్టి ఏ రకంగా చూసినా పాండవుల కంటే ముందు ఆమె మరణించడం సబబనిపించదు.అలాగే యుధిష్ఠిరుడు బొందితో స్వర్గానికి చేరడం కూడా నాకు అర్థం కాని విషయం.


రచయిత మనవిలో చెప్పినట్లు పురాణ పాత్రలను స్పృశించడం అసిధారావ్రతం. ఈ నవల సీరియల్ గా వస్తున్న రోజుల్లో ఖండన మండనలు చాలా తీవ్రంగా వచ్చాయని, రెండూ తనకు సంతోషాన్నిచ్చాయని అదే మనవిలో చెప్పుకున్నారు. సీరియల్ గా రాకముందు కూడా వివిధ నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని ఘట్టాలు చదివి వినిపించారట! వాటిలోని మౌలికమైన ప్రతిపాదనల గురించి జనాభిప్రాయం తెలిసే ఉంటుంది. అంటే ఆ అసిధారా వ్రతాన్ని తాను సమర్థంగా నిర్వహించాననే రచయిత నమ్మకం. నాకు పురాణాలు, ఇతిహాసాలను భిన్నకోణాల్లో చూపించే రచనల మీద ఆసక్తి ఎక్కువ. ఈ నవలలో అట్లాంటి కొత్త కోణాలు చాలానే ఉన్నాయి. ఐతే వాటిలో ఒకటి రెండు అంశాలు ఆయా పాత్రల స్వభావానికి విరుద్ధంగా ఉండడం లేదా పాత్రల మధ్య సంబంధం మూల కథలో ఉన్నదానికి విరుద్ధంగా ఉండడం వల్ల సమర్థనీయంగా అనిపించలేదు. రచయిత ఒక్క ద్రౌపది పాత్ర ఆధారంగా వివిధ భాషల్లో వచ్చిన నూటికి పైగా గ్రంథాలను కూలంకషంగా చదివి విషయసేకరణ చేశానన్నారు. బహుశా  నేను కూడా అన్ని పుస్తకాలు చదివాక (చదవడమంటూ జరిగితే) పూర్తిగా రచయితకు ఉన్నటువంటి అభిప్రాయాలే ఏర్పడుతాయేమో! అప్పటివరకూ ఆయా అంశాల్లో నా అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలకు నూరు పుస్తకాల దూరంలో ఉంటాయి.

**********************************

(ఈ పుస్తకం గురించి గతంలో ఇక్కడే వచ్చిన రెండు వ్యాసాలు: జంపాల చౌదరి గారిది (2010), డీటీఎల్సీ వారిది (2012). – పుస్తకం.నెట్)

You Might Also Like

2 Comments

  1. డా.జయదేవ్.చల్లా

    అవును రావు గారు.

  2. తాడిగడప శ్యామల రావు

    అందరూ చదివిన లేదా వివిధమార్గాల్లో (నాటకాలూ, సినిమాలూ, వారూవీరు వ్రాసిన వచనభారతాలూ వగైరా వగైరా తో) గ్రహించి అర్ధం చేసుకున్న భారతమే అసలుసిసలు భారతం అన్న భ్రమలో ఉంటాం. పైపెచ్చు వ్యాసుడి రచననూ పాత్రలనూ తిన్నగా తప్పులుపట్టే స్థాయిలో మనకు భారతకథ తెలుసు అన్న అహంకారంతో మాట్లాడతాం. దాని పర్యవసానమే కీర్తికండూతితో కొందరూ, తమతమ వికృత సిధ్హాంతాల ప్రచారానికి కొందరూ, మరేదేదో కాంక్షించి కొందరూ భారతపాత్రలను తమచిత్తం వచ్చినట్లుగా మార్చి రచనలు చేస్తున్నారు. భారతం అనే ఏమి లెండి రామాయణం విషయమూ అంటే పౌరాణికసాహిత్యం విషయమూ అంతే రావణ దుర్యోధనాదుల వలన ధర్మానికి సంభవించిన గ్లాని కంటే హెచ్చుగా ఈదుష్టులవలన హెచ్చుగా ధర్మద్రోహం జరుగుతున్నది.

Leave a Reply