అసమాన అనసూయ – (నా గురించి నేనే) – కళా ప్రపూర్ణ డా. వింజమూరి అనసుయ దేవి
వ్యాసకర్త: సుజాత ఎమ్
ఒక 95 ఏళ్ళ విదూషి, తన జీవిత గమనం గురించి, తను ఎదుర్కొన్న కష్టాలు, దొరికిన సంతోషాల గురించి, చెప్పుకున్న విషయాలే ఈ పుస్తకం. అయితే ఇవి సామాన్యమైన కష్టాలూ కావు, సాధించినదేదీ సామాన్య విజయమూ కాదు. వీటిని ఏ ధైర్యంతో ఎదుర్కొనగలిగారో, ఏ హార్డ్ వర్క్ తో సాధించగలిగారో, చెప్పడమే ముఖ్య విషయం.
తన మొదటి 1925 లో కాకినాడ సరస్వతీ గాన సభ వారి ఆధ్వర్యంలో ఆంధ్ర సేవా సంఘం హాలులో జరుగుతున్న సంగీతోత్సవాల నాటి జ్ఞాపకాలు చెప్తూ మొదలు పెడతారు. చిన్న తనంలో బాల్యావస్థలో మనసులో ముద్రించుకుపోయిన జ్ఞాపకాలు, అందరికీ ఉంటాయి. అయితే, ముందుమాటలో వంగూరి రాజు గారు చెప్పినట్టు, వింజమూరి అనసూయాదేవి ఈ పుస్తకంలో రికార్డ్ చేసినది ఒక వ్యక్తి జీవితం గురించి / ఒక వ్యక్తి చరిత్ర కాదు. తెలుగు సంగీత చరిత్ర ఇది.
కాకినాడ లాంటి పాత కొత్త వాసనల ఊరి ప్రతిబింబం లాంటి, సరస్వతీ దేవి లాంటి ప్రతిభావంతురాలు ఈ అమ్మాయి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి మేనకోడలు. మావయ్య భావ గీతాలకి తొట్టతొలుత బాణీ కట్టింది. తెలుగు లలిత సంగీతానికి మొట్ట మొదటి కంపోసర్. ఆఖరి నిముషాల్లో, రాసి ఇచ్చే మావయ్య పాటలకు క్షణాల్లో బాణీలు కట్టడం, పసిప్రాయంలోనే, తెలియని కొత్త వాయిద్యాలైన వీణ, పియానోలను కూడా, తనంతట తానే వాయించడం, తండ్రి నాటక కళాకారుడు కాబట్టి, తెలుగు నాటకాలలో వాడే లెగ్ హార్మొనీ వాయించాలని కలలు కనడం, అయినా కాళ్ళందని చిన్న పిల్ల అని అవకాశం ఇవ్వకపోయినా, అనుకోని విధంగా హార్మొనిస్టు రాని పౌరాణిక నాటకానికి 11 ఏళ్ళ వయసులో రాత్రంతా హార్మొనీయుం వాయించటం లాంటి ఫీట్లు చేయడం, పిఠాపురం జీవితం, రాజు గారి పిల్లలతో స్నేహం, వగైరాలు, నిన్న మొన్నటి కబుర్లలాగా చెప్తారు.
కళ్ళు మూసుకుని కళ్ళకు బట్ట చుట్టి, హార్మోనియం మీద బట్ట కప్పి వాయించడం లాంటి బాల్య చేష్టల దగ్గర్నించి, కౌమారంలో తెలిసీ తెలియని తనంతో ప్రదర్శించిన అతిశయం, యవ్వనం లో తన ఆరాధకుల పై తనకుండిన నిర్లక్షాన్ని గురించి కూడా దాయకుండా చెప్పేంత ఇష్టం తనంటే తనకు. తానందుకున్న ప్రేమ లేఖలు, సూటర్స్ తనని బలవంత పెట్టడాలూ, ఆ ఎటెన్షన్ ని తను ఎంజాయ్ చెయ్యడమూ, అంతలోనే, ఎవరినీ దగ్గరికి రానీయనంత ఇండివిడ్యువాలిటీ ని ప్రదర్శించడం కూడా గుర్తు చేసుకుంటారు.
“నేను కొంచెం స్వార్ధపరురాలిని. నా సౌకర్యమే చూసుకుంటాను అనీ, కొంతవంతు ఎక్కడో కాస్త నార్సిసిస్టు ని కూడా” అని ఎవరు చెప్పుకుంటారు ? అయితే జీవితంలో దెబ్బ తిన్నాక, “నీ పొగరు అణచడానికే ఈ పని చేసాను అని చెప్పే మనిషి (మనుషులు) ఎదురైనప్పుడు ముక్కలైన మనసుని కూడగట్టుకుని, అహాన్ని చంపుకుని, పిల్లల కోసం, బ్రతుకు కోసం, కెరీర్ కోసం, తన మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం, పరువు కోసం, వాళ్ళతోనే కలిసి ఉంటూ, వాళ్ళని పశ్చాత్తాపంతో కుమిలేలా చేసారేమో గానీ, వెను తిరిగి పారిపోలేదు. ఈ సంగతి, చదువరులకు తెలియజేయాలనుకోవడం, నిజంగా చాలా బోల్డ్.
అంతవరకూ ఆవిడ మహారాణి. “మద్రాసులో రేడియో లో పని చేస్తున్నప్పుడు నా చుట్టూ మగవాళ్ళు పడేవారు. నేనెవర్నీ లెక్క చేసే దాన్ని కాదు. ఇంటి ముందు వాడుకోవడానికి రకరకాల కార్లు పంపే వారు. నేను బయటికొచ్చి, ఆరోజు చీరకి ఏ రంగు మేచ్ అవుతుందో ఆ కారు లో ఎక్కి వెళ్ళేదాన్ని”, అని చెప్పినప్పుడు గానీ, పెళ్ళయిన మగవాళ్ళు పెళ్ళాల చేత రెండో పెళ్ళికి రాయబారాలు పంపడం గురించి గానీ చెప్పడానికి వెనకాడలేదు. (పేర్లతో సహా)
వింజమూరి అనసూయాదేవికి తన జీవితం మీద చాలా స్పష్టత ఉంది. “ఎవరేమన్నా అనుకోనీ, నాకు నేనంటే పరమ ఇష్టం!” అని చెప్పుకోగల ధైర్యం ఉంది. బాల్యం, కౌమారంలో అద్భుత విజయాలు, విద్యలో పేరు ప్రఖ్యాతలూ సాధించేశాక, ఇక పైకెదిగేందుకు మెట్లే లేవా అన్నంత ఎత్తుకి ఎదిగిపోయినా, తన ఇంటి పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటూ, తల్లితండ్రులు తమ రెక్కల కింద దాచుకుంటూ ఉండగా ,తనతో పాటూ ఇల్లు విడిచిపెట్టొచ్చి, మద్రాసులో తనతో పాటూ ఇళ్ళు మారుతూ, తిరిగి, ఎన్ని త్యాగాలు చేస్తూ, తన కళా జీవితానికి ఊతమిచ్చారో ఆమెకు తెలుసు. ఎప్పుడూ చేయాల్సిన పనులు ఉండనే ఉన్నాయి తనకు. చూసుకోవాల్సిన వాళ్ళూ ఉన్నారు.
మద్రాసులో సినీ, రేడియో, గీతాల ప్రస్థానం కన్నా, కాకినాడలో ఆమె ఎదిగిన వైనం, స్కూల్లో, కాలేజీలో సంగీతం లో సాధించిన పనులు గుర్తించదగ్గవి. వీటిలో శ్రీశ్రీ కవితలకీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి పాటలకీ ఇప్పటికీ ఆవిడ ట్యూన్లు యధాతథంగా వాడగలగడం, బాలాంత్రపు రజనీకాంతరావు, బుజ్జాయి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కాంచనమాల, భానుమతి, ఘంటశాల వేంకటేశ్వరరావు ల్లాంటి ప్రముఖులతో ఆమెకు ఉన్న ఆత్మసంబంధం, మొదటి గురువు అయిన తల్లితో ఉన్న బంధమూ, ఏకసంథాగ్రాహి కావడం వల్ల, కాకినాడలో భోగం వాళ్ళ దగ్గర కూడా సేకరించి నేర్చుకోగలిగిన జావళులూ, పదాలు, గాలివాటుగా విన్న పల్లె పాటల్ని సేకరించడం, వాటికి శాస్త్రీయ మైన గుర్తింపు ఇవ్వడం, వాటికి ఎల్ పీ రికార్డుల ద్వారా, కనుమరుగైపోకుండా, ఒక శాశ్వతత్వాన్ని ఇవ్వడం, ఆకాశవాణిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చెయ్యడం, అద్భుత కళాకారులతో పనిచెయ్యడం, తనకు విద్యనీ, జ్ఞానాన్నీ, సంస్కారానీ ఇచ్చిన గురువుల్ని మర్చిపోకపోవడం, ఇవన్నీ, తన జీవితాన్ని సుసంపన్నం చేసిన అనుభవాలంటూ తృప్తి పడడం చాలా బావున్నాయి.
ప్రతిభావంతులైన ఆనాటి కళాకారులు, సొంతంగా ఇంట్లో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఇంట్లో మామూలుగా జరిగే వాదోపవాదాలు, చర్చలు, ఏకీభవించకపోవడాలు, ఇవన్నీ ఆవిడ వ్యక్తి వికాసాన్ని, (అమ్మాయిలు మూల పడుండాలని ఆశించని కుటుంబ వాతావరణం) నిర్దేశించాయి. ఇది జీవితపు రికార్డు కాబట్టి, జ్ఞాపకాల మీద ఆధారపడి రాసినా కూడా, ఆవిడ చూసిన, కలుసుకున్న ప్రముఖ వ్యక్తులూ, రెడ్ల, రాజుల, స్నేహితుల వివాహాలలో, వేడుకల్లో, తనకు దక్కిన స్నేహమూ, గౌరవం, ఆదరణా, పేరు ప్రఖ్యాతులూ, ఇవే ఆవిడ సంపాదన.
ఆత్మస్తుతీ, పరనిందా తప్ప ఆత్మకథల్లో ఏముంటాయి అని అందరూ అనుకునేమాటే. చాలా డార్క్ విషయాల్ని ఎవరూ చెప్పరు. ముఖ్యంగా ఇంట్లో అందరూ ప్రముఖులే అయిన వాళ్ళు అస్సలు చెప్పరు. “నేను నా పిల్లల కోసం ఇంత త్యాగం చేసాను. ఇన్ని బాధలు పడ్డాను. నా వృద్ధాప్యంలో వాళ్ళు కూడా నా దగ్గర బోల్డు డబ్బుంది అనుకున్నారు. నేనిలా కష్టాలు పడ్డాను.. ” అని, ముఖ్యంగా మీరు త్యాగాలు చెయ్యకపోతే అటు సూర్యుడిటు పొడవడూ అని లోకం పట్టుపట్టే స్త్రీలు/పెళ్ళాలూ, తల్లులూ అస్సలు చెప్పుకోరు. అయితే ఆ చెప్పుకోవడం కొన్ని సార్లు అవసరం.
“నాకే ఇలా జరిగితే, మామూలువాళ్ళకి ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో!” – అనే స్పృహ ఆమెకి ఉంది. ఈ పుస్తకంలో కెరీర్ పరంగా, సాధించిన పేరు ప్రఖ్యాతుల పరంగా, వృత్తి జీవితం లో తృప్తి , ప్రతిభా, పట్టుదలా, కష్టపడే తత్వం మూలాన ఉన్నత స్థానం లో ఉన్న వ్యక్తి, తన వ్యక్తిగత జీవితం లో చీకటి ని అంతే ఒప్పుదలతో బయట పెట్టడం చాలా షాకింగ్. కానీ ఆ ధైర్యం, తెగువా – సగం బలం ఈ పుస్తకానికి.
ఇదంతా నాకు భానుమతి ఆత్మ కథని గుర్తు చేసింది. ఆవిడ కూడా చాలా unique సింగర్, బోల్డన్ని కళల్లో ప్రవేశమూ, నైపుణ్యమూ, ధైర్యమూ ఉన్న తల్లిదండ్రుల చాటు పిల్ల. సరస్వతీ పుత్రికే. భానుమతి ప్రేమించి, పెళ్ళి చేసుకుంది. పెళ్ళి అయ్యాక, తల్లయ్యాక, నిజానికి చాలా స్టెబిలిటీ తో పని చేసింది. అనసూయని ప్రేమించానని చెప్పుకున్న వ్యక్తి బహుశా అసూయతో, అధికారం కోసం, డబ్బు కోసం, ద్రోహం చేసి పెళ్ళి చేసుకున్నాడు. పిల్లని పెంచుకోవడం, కెరీర్ ని కొనసాగించడం వగైరాలు ఆమె దాదాపూ ఒంటి చేత్తో సాధించుకున్న పనులు.
అయితే ఒక స్త్రీగా, భానుమతి లాగా రొమాంటిక్ జీవితం కాదు ఈవిడది. సొంత చెల్లెలు మోసం (ఊహ) చెయ్యగా, పదేళ్ళుగా తన మీద కన్నేసిన ఒక పెళ్ళయిన వాడు అదను చూసి రేప్ చేసి, రెక్కలు కత్తిరించేసి, ద్రోహపూరితంగా పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఈవిడ. సరస్వతీ పుత్రులు, అంతవరకూ వివిధ కార్యక్రమాలు, కచేరీలద్వారా ఎంతో సంపాదిస్తున్న లక్ష్మీదేవి లాంటి కూతురు పెళ్ళి ఎంతో దివ్యంగా చెయ్యాలని కలలు గన్న తల్లితండ్రులకు తీవ్ర వేదన కలిగించిన సంఘటన ఈ బలాత్కారం.
సొంతంగా, అందం, తెలివితేటలు, ప్రతిభా వ్యుత్పత్తులు కలిసిన మనిషి, ఈ ద్రోహం తరవాత పోయిన పరువు, పొరపాటున ఆ సంఘటనకు కారణం అయ్యానని వేదన చెందే మేనమామ, అంతవరకూ ఏకవచనంతో పిలుస్తూ వచ్చిన మనిషి భర్త అయి, అలాంటి ఘోరానికి ఒడిగట్టినా, అదేదో హక్కు చలాయించాలని చూడటం, అతని మొదటి భార్య కూడా, “అనసూయ అలాంటిది కాదు. నా మొగుడే చెరచి ఉంటాడని”, “తప్పక పెళ్ళి చేసుకుని ఉంటుంద”నీ చెప్పడం.. ఆడవారి బలహీనత ఉన్న ఒక విలువల్లేని మనిషికి భార్య అవల్సి రావడం, ఇవన్నీ హృదయాన్ని కలిచివేసే సంగతులు.
ఎన్నో ఘనతలు సాధించిన మొదటి మహిళగా అసామాన్యమైన పేరు పొంది కూడా, తన గర్వాన్నో, అహంకారాన్నో అణచడానికి చూసే కుళ్ళుమోతు భర్త గురించి, ఎన్నో కచేరీలలో తనతో పాటు పాల్గొనై, సరిసమానంగా ప్రతిభా, పేరు గల చెల్లెలి గురించీ, సూచన ప్రాయంగా చెప్పిన కొన్ని సంగతులు ఇదంతా ఆవిడ కడుపు మంట చల్లార్చుకోవడానికి రాసినదే అయి ఉంటుందా అనిపించేలా ఉంది. అయితే తన వెర్షన్ తను చెప్పే అధికారం అయినా ఆమెకు లేకపోతే ఎలా ? దీని గురించి మరీ ఆలోచించక్కర్లేదు. ఆ దుర్మార్గానికి తను ఎలా బలయినదీ – ఆఖరికి పెళ్ళయాక కూడా రకరకాలుగా అనుభవించిన బాధలు చెప్పుకునే గొంతు, ఆమెకి అక్కర్లేదా అనిపిస్తుంది.
ఈ బలవంతపు పెళ్ళి అయ్యి, అయిదుగురు పిల్లలున్న తల్లి, “నా పిల్లలు కూడా రత్నాలలాగా, ప్రతిభ, విద్య ఉన్నవారు. నా పంచ ప్రాణాలు” అంటూ, ఈ పిల్లల కోసం, తన కెరీర్ ని త్యాగం చేసి, కుటుంబ, సంసార బాధ్యతల కోసం, సహకరించని కుటుంబం కోసం – స్వయంగా రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ వచ్చి, అన్నమాచార్య కీర్తనలను స్వరపరచమని అడిగినా చెయ్యలేకపోయి, “ఈ ఘనత కూడా సాధించి ఉందును. కానీ ఇంటి బాధ్యతల వల్ల వొదులుకోవాల్సొచ్చింది” అని చెప్పడం బాధ కలిగిస్తుంది.
మొదట్నుండీ, కుటుంబం అంతా కలిసి, సందడిగా ఉండే, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఏ తీరిక వేళలోనో మేధో మధనాలు చేసే కుటుంబాలలో పెరిగిన మనిషి. తన కెరీర్ కోసం చాలా మంది కుటుంబసభ్యులు కావల్సొచ్చి అందరి పోషణ బాధ్యత నీ తీసుకున్న మనిషి. స్వయంగా భర్త చేతిలో డబ్బు విషయంలో మోసపోయిన మనిషి. ఎప్పుడూ ఒకరి మీద పై చేయై బ్రతికి, ఎవరి దయా దాక్షిణ్యాల మీదా ఆధారపడకుండా, తన లో తన ని నిలుపుకుంటూ, రోజువారీ యుద్ధాన్ని గెలుస్తూ వచ్చిన మనిషి.
ఆఖరికి భర్త చివరి అయిదు సంవత్సరాలూ కాన్సరుతో బాధపడి పశ్చాత్తాపంతో దగ్ధమవుతున్నప్పుడు అతనికి సేవలు చేయాల్సొస్తుంది. చివరి రోజుల్లో భర్త తనని అణిచివేయడం గురించి పశ్చాతాపం వ్యక్తం చేసాక, ఎవరికీ లొంగని, ఎవరికీ తలొగ్గని తను అతనికి అన్ని సేవలు చెయ్యడం, ఇదీ బహుశా అన్నేళ్ళు కలిసి ఉండడం వల్ల తనలో కలిగిన ప్రేమ వల్లనేమో అని అనుకోగల పెద్ద మనసు తనది. క్షమించడానికి కూడా మనసుండాలి.
పిల్లలు సహకరించని వేళ ఒక్కర్తీ, మనవల్ని కూడా చూసుకోవాల్సిన వేళ. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టిన వృద్ధాప్యంలో “కూరగాయలు చవగ్గా దొరుకుతాయని నడుచుకుంటూ ఫలానా చోటికి వెళ్ళేదాన్ని. చెయ్యలేని శారీరక శ్రమ చేసాను – పడరాని పాట్లు పడ్డాను” అని కూడా చాలా తృప్తి గా చెప్పగలగడం బావుంది.
ఈ ఆత్మకథ రచయిత్రి రాసిన (95 ఏళ్ళ వయసులో) ఆఖరి పుస్తకం. “నాదగ్గర ఫలానా విద్య ఉంది. ఈ ఈ పాటలు తెలుసు. ఎవరికన్నా నేర్చుకోవాలనుంటే నేర్పుతాను. తొందరపడండి. నాకిప్పుడు 95 ఏళ్ళు !” అని ఆహ్వానం ఇస్తారు ఓ చోట. ఈ రికార్డ్, ఆవిడ సాధించిన ఘనత, కలుసుకున్న వ్యక్తులు, సంగీతం ను యూనివర్సిటీ విద్యలో ప్రవేశ పెట్టడం, టీటీడీ ప్రచురించిన వివిధ తెలుగు గేయాలు, బాణీలూ, వరుసలతో అచ్చయిన పాటల పుస్తకాలు, సినిమాల్లో చౌర్యానికి గురయిన ట్యూన్లు, తన పేరు లేకుండా హిట్ అయిన ఎన్నో పాటలు, ఇవన్నీ గుర్తు పెట్టుకుని రెండు నోటు పుస్తకాల నిండా ఆవిడ రాసి పెడితే, వంగూరి ఫౌండేషన్ వాళ్ళు దీని ఒక అభిమాని శ్రీ సుభాష్ సాయంతో కంపైల్ చేసి ప్రచురించారు. అయితే ఈ ఎమోషనల్ ఫ్లో లో, కొన్ని పేజీలు (పేజీల్లో సంగతులే) రిపీట్ కావడమూ, ఆమె సేకరించిన ప్రముఖుల ఆటోగ్రాఫ్‌లలో కొన్ని రిపీట్‌లూ, ఇవన్నీ చిన చిన్నవే, కాస్త తరవాతి ఎడిషన్లలో ఎడిట్ చేస్తే బావుంటుంది. ముందుకీ, వెనక్కీ ఒక సంగతి నుండీ ఇంకో సంగతికి పరిగెత్తేసే విధానంలో కాకుండా, చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సినంత, చెప్పకూడని విషయాన్ని వదిలేయడం బావుంది.
కేవలం తొమ్మిదేళ్ళ వయసులో శాస్త్రీయ బాణీలతో ఎన్నో ప్రముఖ గేయాలు స్వరపరచిన సరస్వతీ పుత్రిక విజమూరి అనసూయాదేవి. అందం, ప్రతిభ కలపోసిన, ఒకప్పటి సెన్సేషన్ ! ఇదీ ఆవిడ జీవితం. నిజంగా అసామాన్యమైన కథ. తనని తాను “అసమాన అనసూయ” అని చాలాసార్లు చెప్పుకోగలంత పొగరు తనకు. ఎవరూ ఎన్ని అసూయలు పోయి, మోసాలు చేసి / ద్రోహాలు చేసినా ఆ ‘పొగరు’ని అణచలేకపోయారు. అదీ మెచ్చుకోవాల్సిన విషయం.
పుస్తకం లో ఆఖరు న ఒక పరిపూర్ణ జీవితం గురించి ఆమె రాసుకున్న మాటలు కొన్ని :
“జీవితం పరిపూర్ణమయింది. కోరికలనీ తీరాయి. వైకుంఠపాళీ ఆటలో ఎంత నీతి, నిజం ఉందో ఇప్పుడర్ధమైంది. పెద్ద నిచ్చెనెక్కి పైకి వెళ్ళిన నేను, తక్షణమే పెద్ద పాము నోట్లో పడి కిందకు వచ్చాను. అయితేనీం. పందాలు వేసుకుంటూ ‘పరమ పదం’ వరకూ చేరాను. ఇంక భయం లేదు. ఎక్కువ దూరం లేదు కనుక.”
” నా కోరిక :
ప్రశాంతమైన వాతావరణం, అగరవత్తులు, సాంబ్రాణి, పాలమడ్డి పొగలతో, నాకిష్టమైన ఎర్రరంగు పట్టుచీర కాళ్ళకు ఆల్తా, గోళ్ళకు మ్యాచింగ్ రంగు, చీరకు తగ్గ బొట్టూ, కాటుకలతో అలంకరించాలి. నా వాళ్ళంతా నా చుట్టూ ఉండాలి. నా తల దగ్గర నా హార్మోనియం పెట్టాలి. ఆ పక్కా ఈ పక్కా రెండు ఎలక్ట్రిక్ తంబూరాలు కంటిన్యుయస్ గా మోగుతూ ఉండాలి. నాకిష్టమైన పెర్ఫ్యూం నా మీద చల్లండి. ఎవ్వరూ ఏడవకండి. ఆరు తరాలు చూసి, ఇంత బలగాన్ని పోగేసుకున్న నా కంటే అదృష్టవంతులు ఎవరుంటారు ?
నలుగురు కూర్చుని నవ్వే వేళల
నా మాటొకపరి తలవండి !
నా పాటొక పరి పాడండి! “
……
తాడిగడప శ్యామల రావు
చదువుతుంటే కన్నీళ్ళు వచ్చాయి. ఆవిడకు జోహార్లు