పల్నాడు కథలు: సుజాత వేల్పూరి
వ్యాసకర్త: సుజాత ఎమ్
ఒక సారి ఒక వెబ్ జైన్ లో ధారావాహికంగా ప్రచురితం అయ్యాక, ఆయా కథలకి పాఠకులు మిగులుతారా అని నాకో అనుమానం ఉండేది. ఈ మధ్య ఒకటే పనిగా ‘సారంగ’, ‘ఈమాట’ లాంటి అంతర్జాల పత్రికల్లో వచ్చిన కథల గుచ్చాలు పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. అవి బహుశా తెర (స్క్రీన్) మీద చదువుకోలేని వారి కోసమో లేదా ఇలా మాసం మొదటి రోజునో పక్షానికో వెలువడే పత్రికలని చదివే తీరిక/సౌలభ్యమూ లేనివాళ్ళ కోసమో అని అనుకుంటున్నాను ఇన్నాళ్ళూ. పైగా మనకే ఆనంద వికటన్ లూ లేవు. ఉన్న విపుల, చతురా కాస్తా కనుమరుగయ్యాయి. ఇప్పుడు మనకి చదువుకోవడానికి పుస్తకాలు కావాలి కదా.
అలా, ‘పల్నాడు కథలు’ ఒక వాక్యూమ్‍ని పూరించడానికి వచ్చిందనిపిస్తుంది. అసలు ఒక చోట ఆల్రేడీ చదివేసిన పుస్తకాల్ని చదవడం ఎలా ఉంటుంది అనే అనుమానం పటాపంచలు చేసిన పుస్తకం ఇది. దీనిలో ఉన్న కథలనీ ఒక ప్రాంతానివి, ఒక మర్చిపోయిన గతానివి. ముఖ్యంగా మహిళలవి. అలా అని ఇవి స్త్రీవాద కథలు కాదు.
అనుకోకుండా ఈ కథలన్నీ ఎక్కువగా ‘కథానాయికల’ కథలు. ఈ నాయికల్లో ఒకావిడ సొంతవాళ్ళచే రేప్ చేసి చంపబడ్డ పసిదాని సోదరి. ఇంకో ఆవిడ పిల్లలని పోషించుకోవడం కోసం నాటు బాంబులు స్మగుల్ చేసే కూలీ మనిషి. ఒకావిడ రికార్డింగు డాన్సులు వేసే మనుషుల కుటుంబానిది. ఒక నాయిక బ్రతకడానికి ఒళ్ళమ్ముకునే సామాన్యురాలు. ఒక సింగిల్ మదర్, కూతురి భవిషత్ కోసం ఒళ్ళు దాచుకోకుండా రెక్కలు ముక్కలు చేసుకునే ‘రోజు కూలీ’. ఇవి బహుశా ప్రభుత్వ పథకాలు ఇంకా చిక్కని రోజులు అనిపించింది. ఈ పిల్ల పడే కష్టం చూసి. (నా నెగిటివ్ థింకింగ్)
ఈ కథల్లో మహిళా ప్రధానమైన కథలే కాక నిజమైన హీరోలు ఉన్న కథలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నైపుణ్యంతో చెప్పిన కథలు. వీటిలో కనిపించే హీరోలు చాలా మటుకూ ఒంటరి మహిళలే అయినా మనసున్న Male మారాజులు కూడా ఉన్నారు. మన చుట్టూ కనిపించే వాళ్ళే – మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, కళారాధకులు, చిన్న పిల్ల పూల జడ కోసం తంటాలు పడే బీద తల్లికి పువ్వులు ఉచితంగా ఇచ్చే షావుకారు, బాంబులు చేరేసే బీదరాలిని జాలి తలిచి, న్యాయంగా వదిలేసె ఇన్స్పెక్టరూ. ఈ సిన్మా పిచ్చి అబ్బాయీ, ఒక మంచి తండ్రీ, కొడుకూ.. ఇలా.
కొన్ని సార్లు మనమే ఎరుకా లేకుండా చూపించే చిన్న దయ, కరుణా, ఎదుటి వాళ్ళకెంత మీనింగ్ ఫుల్ గా ఉంటాయో తెలిస్తే మనం ఇంకొన్నిసార్లు చెయ్యమూ ఈ మంచిపన్లు ? అనిపించేలా చేస్తారు రచయిత్రి. చిన్న చిన్న acts of kindness, మనకే తెలీకుండా ఇతరుల పట్ల మనం చేసే ధాష్టీకం, మనమో, మనవాళ్ళో ఒకరిని ‘ఉద్ధరిస్తున్నా’మనుకుంటూ చేసే పన్లూ, వీటి గురించి మనకి సూక్ష్మం అర్ధం అయితే చాలదూ.
ఈ కథల్లో పల్నాటి అమ్మాయిలు పౌరుష వంతులు. ఏ కష్టాన్నన్నా భరిస్తారు గానీ, వాటి ముందు మోకరిల్లరు. సీత ఎలియాస్ విజయశాంతి లాంటి అమ్మాయిలు వృత్తి లో భాగంగా గాంగ్ రేప్ కి గురయ్యి కూడా పనిలోకి వెళ్ళాల్సి వచ్చేంత exploit అవుతూ ఉంటుంది. అసలీ పిల్ల ఈ కష్టం ఎలా భరిస్తుంది ? అది గుండేనా అసలు ? అనిపిస్తుంది. మన దేశంలో ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలకు, unreported లైంగిక దాడులకూ లెక్కే లేదు.
కొత్తగా వచ్చిన చట్టాల ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయో గానీ, బయటకు రాని, మౌన ఆవేదనల మధ్య, కౌటింబిక హింసల మధ్యా జరిగే రేప్ లకే దిక్కు లేదు. ఒళ్ళమ్ముకునే అమ్మాయికేమి రక్షణ ? ఏ హక్కు లు ? ఆ పిల్ల పడే బాధ / అవమానం, హింసా ఎవరికయినా అర్ధం అవుతాయా ? ఒక ప్రాస్టిట్యూట్ ని జాలి తలుస్తాడా మామూలు సంఘ జీవి ? చిన్న చిన్న ఎదురీతలకే రేప్ ని ఒక కంట్రోలింగ్ టూల్ గా వాడుకుని ఆడవాళ్ళని అణిచేసే లోకానికి, ఈ సీత అంటే జాలి చూపించే మనిషి వింతే కదా. ఈ వింతలు పల్నాడులోనే కాకుండా ఎక్కడన్నా కూడా ఉండొచ్చు. కానీ ఈ ఒక్క కథలో, ఆమె సవతి తండ్రి పాత్రలో, కథలోని సంఘర్షణనంతా, ప్రేమనంతా చూపించేసి, చాలా ఎత్తుకు తీసికెళిపోయారు రచయిత్రి.
ఈ సంపుటిలో అన్ని కథలూ వేటికవే సాటి. సంభాషణలు, కథలను చెప్పే విధానమూ, పాత్రలని పరిచయం చేసే విధానమూ, వాడినా భాషా, అచ్చు తప్పులు లేకుండా, (ఆల్రెడీ ప్రచురింపబడ్డాయి కాబట్టి బాగా కత్తెరలు పడి కరెక్షన్లు జరిగినా కూడా) అచ్చమైన పల్నాటి ప్రాంతపు “స్పెషాలిటీ – పేషన్” తో చాలా బాగా తీసుకొచ్చారు. అంతర్జాలం దాదాపుగా అందుబాటు లో ఉన్నా, దేశం లో మనుషుల కన్నా, మొబైల్ ఫోన్లే ఎక్కువ అయిపోయినా, చదివేందుకు physical పుస్తకాలే అనువు చాలా మందికి. కాబట్టి, ముఖ్యంగా మంచి పుస్తకాలు క్రమంగా కనుమరుగవుతున్న సమయాన ఇలాంటి పుస్తకాలు చదవడం ఓ మంచి అనుభవం.
Leave a Reply