For your own Good: Samantha Downing

వ్యాసకర్త: నారాయణ శర్మ G.V

(అంతా నీ మేలు కోసమే.. రచన: సమంతా డౌనింగ్)

**భయంకరం- జాలిగుండె వాళ్ళు చదవకండి**

‘థియొడోర్ క్రచర్’ -అందరూ అతన్ని టెడ్ అని పిలుస్తూంటారు- అతను ఈ నవలలో ప్రథాన పాత్ర. అతనే ఈ కథకు విలన్ కూడా. అల్లాటప్పా విలన్ కాదు: అద్భుతమైన తెలివితేటలు- దారి తప్పటం; ఆత్మకేంద్రితమైన భావనలలో కూరుకుపోయి ‘ఇతరులందరూ దుష్టులు, తనొక్కడే ఉత్తముడు’ అనుకోవటం; ‘వాళ్ల మేలు కోసమే తను వాళ్ళను తను శిక్షిస్తాడు-కాబట్టి అందులో తప్పు ఏమీ లేదు’ అనుకోవటంతో అతని వ్యక్తిత్వం చాలా ఘోరంగా తయారై ఉంటుంది.

‘నీ మేలు కోరి చెబుతున్నాను’ అనే మాటని వాడని పెద్దవాళ్ళు ఉండరేమో. అట్లాంటి పెద్దలకు అందరికీ ఈ కథలో టెడ్ చెంపదెబ్బ కొట్టినట్టు తగులుతాడు.  ‘నా వ్యక్తిత్వం దారి తప్పితే నేను కూడా ఇట్లా అవుతానా?’ అని భయం వేసేట్లు అతని పాత్రని ఆవిష్కరిస్తుంది రచయిత్రి.

టెడ్ ఒక పెద్ద ప్రైవేటు స్కూల్లో ఇంగ్లీషు టీచరు. అతనికి తన సబ్జక్టులో చాలా పట్టు ఉంటుంది. పిల్లలకు తను కాక వేరెవ్వరూ అంత గొప్పగా బోధించలేరు అనుకుంటూ ఉంటాడు.  

అమెరికాలో మామూలు వాళ్ళు అందరూ ప్రభుత్వం నడిపే బడులకే వెళ్తారు. అక్కడ వాటిని పబ్లిక్ స్కూళ్ళు అంటారు. ప్రైవేటు బడిలో చదివించాలంటే ఏ బిల్ గేట్స్ లాంటి డబ్బులో‌ ఉంటే తప్ప, మామూలు వాళ్ళకు సాధ్యం కాదు.  

సహజంగానే ఆ బడిలో పిల్లలందరూ బాగా ధనవంతుల పిల్లలు. టెడ్ మాత్రం చాలా సాధారణ కుటుంబంలో పుట్టి పైకి ఎదిగినవాడు. “వీళ్లెవ్వరూ తనంత కష్టాలను చూడలేదు..వీళ్ల అమ్మలు అయ్యలు సంపాదిస్తే తిని, వీళ్లంతా గాడిదల్లాగా పెరుగుతున్నారు. తను వీళ్లకు బ్రతకటం అంటే ఏమిటో చెబుతాడు- వీళ్ళకు కష్టాలను రుచి చూపిస్తాడు..”

బడిలో చదివే జాక్ అనే కుర్రాడు బాగా చదువుతాడు, మెరికలాంటి పిల్లవాడు, ఈ కథకు హీరో.  వాడి తల్లిదండ్రుల లక్ష్యం అల్లా వీడికి మరింత మంచి బడిలో సీటు సంపాదించటం.  దానికోసం వీడికి మంచి గ్రేడులు కావాలి. వాటి కోసం‌ వీడిని రాచి రంపాన పెడుతుంటారు; అంతేకాక వీళ్ల టీచర్లను ఏదో ఒక రకంగా లొంగదీసుకొని, అదనపు మార్కులు వేయించేందుకు ప్రయత్నిస్తూంటారు. ‘అట్లా చేయద్దు’ అని వీడు ఎంత చెప్పినా వాళ్ళు వినరు.

ఈ జాక్ అంటే టెడ్ కి కోపం. ‘వాడి మొఖం చూస్తేనే తనని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తూంటుంది. అతి తెలివి గాడిద!’ అందుకని కావాలని వాడిని పనిష్ చేస్తూంటాడు. అట్లా వాడికి తన తల్లిదండ్రులంటేను, టెడ్ అంటేను ద్వేషం‌ కూడా పెరుగుతుంది.

జాక్ క్లాస్మేటు, హీరోయిన్ పిల్ల కోర్ట్నీ. ఆ పిల్ల కూడా చాలా తెలివైన పిల్ల. కాలేజీ‌ మ్యాగజైనుకు ఎడిటర్ కూడా. ఆ పనిలో ఆమెను గైడ్ చేస్తుంటుంది, సోనియా అనే మరో‌ ఇంగ్లీషు టీచరు. ఈవిడకు పిల్లలంటే ఇష్టం, పిల్లలకు కూడా ఆవిడంటే ఇష్టం.

టెడ్ కి కోర్ట్నీ అంటే ఇష్టమే. కానీ వాళ్ల అమ్మ ఇంగ్రిడ్ అంటే చాలా కోపం. ఇంగ్రిడ్ బడి ట్రస్టీలలో‌ ఒకతె. తనను ఎక్కువ మెచ్చుకోదు- “ఎందుకంటే తను ఆ బడిలో‌ చదవలేదు కదా, ఈమెకు డబ్బున్నవాళ్లే నచ్చుతారు. ఆ బడిలో చదివి పెద్దైన టీచర్లకే వాళ్ళు బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తారు. నాలాంటి వాళ్లని పురుగుల్ని చూసినట్లు చూస్తారు”

కథలో మరొక పాత్ర ఫాలన్ అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఇదే బడిలో చదివి ఉంటుంది. పై చదువులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈమె కారక్టరు గురించి రిఫరెన్సులు అడుగుతారు. ఆ పిల్ల ఖర్మకాలి టెడ్ పేరు చెబుతుంది. టెడ్ ఆ పిల్లకు బుద్ధి చెప్పాలి అని డిసైడ్ అయిపోయి, ఆమె గురించి చాలా చెడుగా రాసి మెయిల్ పెడతాడు. వాళ్లెవ్వరూ ఈమెకి సీటు ఇవ్వరు. మంచి మార్కులు వచ్చినా ఎవ్వరూ సీటు ఎందుకు ఇవ్వట్లేదో ఆ పిల్లకు అర్థం కాదు. చివరికి ఆమెకు ఎక్కడా సీటు దొరకదు. ఆమె తల్లిదండ్రులు ఆమెను చీదరించుకుంటారు. చివరికి ఆ పిల్ల ఎవరో ఉద్యోగికి లంచం‌ ఇచ్చి టెడ్ రాసిన మెయిలు ప్రతిని చూస్తుంది. తన భవిష్యత్తును నాశనం చేసిన అట్లాంటి వాడి మీద ఎట్లాగైనా కక్ష సాధించాలని పూనుకొని ఉంటుంది. దొంగ సర్టిఫికెట్లు పెట్టి, చివరికి అదే బడికి టీచరుగా వస్తుంది.

అప్పుడు మనకు తెలుస్తుంది టెడ్ ఎంత తెగించినవాడో. అతని ఇంటి పెరడులో చాలా విషం ఉండే మొక్క ఒకటి పెరుగుతుంటుంది. అతను దాని పండ్లనుండి జ్యూసును బయటికి తీసి దాన్ని కాఫీగింజల్లోకి ఎక్కించటం ప్రాక్టీసు చేస్తాడు. చాలా తెలివిగా ఆ విషపు గింజలు హెడ్మాస్టరుకు అందేట్లు చేస్తాడు. స్టాఫ్ రూం లో కాఫీ త్రాగిన హెడ్మాస్టరుకు గుండెనొప్పి వచ్చి చచ్చిపోతాడు. అందరూ సంతాపం ప్రకటిస్తారు. ‘ఇదంతా నీ మేలు కోరే చేసాను. లేకపోతే ఎంత చెడ్డ పేరు వచ్చేది నీకు?!’ అనుకుంటాడు టెడ్.

ఇప్పుడు ట్రస్టీగా హెడ్మాస్టరు బాధ్యతలు ఇంగ్రిడ్ మీద పడతాయి. ఆమె కూడా టెడ్ కాఫీ గింజల ట్రిక్కుకు బలి ఐపోతుంది. అయితే ఈసారి ఆ నేరం ఆమె బిడ్డ కోర్ట్నీ మీద పడుతుంది. టీనేజరుగా ఆ పిల్లకు తల్లి అంటే చాలా కోపం‌ ఉంటుంది. తన కోపాన్ని దాచుకోకుండా తోటి పిల్లలతో మెయిలుద్వారా పంచుకొని ఉంటుంది. ఇప్పుడు పోలీసులు వాటి ఆధారంగా ఆ పిల్లను జైలు పాలు చేస్తారు.

You Might Also Like

One Comment

  1. Chenna Madduri

    మరి తర్వాతేమైంది?

Leave a Reply