#ఊబర్_కూల్_శ్రీనాథ

(ఈ వ్యాసం మొదట 19.10.2020న సాక్షి లో ప్రచురించతమైంది. కొన్ని మార్పులు, చేర్పులు చేసిన వర్షన్‍ని ఇక్కడ ఇస్తున్నాం – పుస్తకం.నెట్)

బెంగళూరుకి, మైసూరుకి దగ్గర్లో సోమనాథపురంలో చెన్నకేశవ గుడి ఒకటుంది. ప్రస్తుతం పూజలూ అవీ లేవు. బేలూరు, హళేబీడుకి ఉన్నంత పేరు ఈ గుడికి లేదు. 13వ శతాబ్దంలో హొయ్సళ రాజులు కట్టించారు కాబట్టి శిల్పకళా చాతుర్యం గొప్పగా ఉంటుంది. కానీ “శిలలపై శిల్పాలు చెక్కినారూ” అంటూ మురిసిపోవడానికి ఆ కళను ఆస్వాదించే జ్ఞానం మనకి లేదు గనుక చుట్టూ ఒకసారి తిరిగి “భలే ఉన్నాయ్” అనేసుకుని చకచకా బయటకొచ్చి చెట్టు నీడన పచ్చిక మీద కూర్చుని బోలెడన్ని ఆంగిల్స్ లో సెల్ఫీలు తీసుకుంటే (గుడి కనపడేట్టు), ఆపైన ఇన్‍స్టాగ్రామో, లేటర్‍గ్రామో చేయడానికి సరిపోయేంతటి సరంజామా – వింటేజ్ సరుకు!

శ్రీనాథుడినో, లేదా అసలు పద్యసాహిత్యాన్నో చదవడం కూడా అలాంటి అనుభవానికి దగ్గరగా ఉంటుందని ఊహించాను. శిల్పాల ప్రాముఖ్యత, వైశిష్ట్యమూ తెలియనట్టే పద్యాలలో సొబగు, సొగసు తెలియకపోయినా వ్యాఖ్యాన-తాత్పర్యాల పచ్చిక మీద కాలు చాపుకుని హాయిగా కూర్చునే వీలుని వదులుకోవడం దేనికి? షేక్స్పియర్‍ని అంటే నాటక ప్రదర్శనల్లోనో, సినిమాల్లోనో, ఆఖరికి మీమ్స్ లోనో కలిగిన పరిచయం వల్ల పలకరింపుగా నవ్వచ్చు. శ్రీనాథునికోసం కావ్యమే చేతపట్టుకోక తప్పలేదు. 

ఆశలూ, అంచనాలూ పెద్ద ఏముంటాయ్? ప్రపంచ సాహిత్యాలు చదివి అర్థం చేసుకునే 21వ శతాబ్దానికి చెందిన నాకు ఈ పధ్నాలుగవ శతాబ్దపు కవిగారిని అందరూ ఎందుకు కవి సార్వభౌముడంటారో తెల్సుకోవాలన్న కుతూహలం, ఛందస్సుతో కూడిన పద్యాలను చదువుకోవడం ఎలాగో నేర్చుకోవాలన్న ఆసక్తి మాత్రమే. పదహారణాల existentialist అయిన నాకూ, పరమ శివభక్తుడైన ఆయనకూ మధ్యే మార్గం (middle-ground) సాధ్యం కానప్పుడు, “ఈ కథ చదివిననూ, వినిననూ సకల ఆరోగ్యైశ్వర్య…” లాంటి బేరాలతో నాకు కుదరనప్పుడు, స్త్రీపురుష శృంగార క్రీడా వర్ణన నా ప్రాథమిక ఆసక్తి కానప్పుడు, శతాబ్దాల బట్టీ పోల్చుకోలేనంతగా మారిపోయిన తెలుగే మా ఇద్దరి మధ్య మిగిలిన చుట్టరికం. శిల్పాల్లో ఆధునిక ఛాయలున్న ఏ పనిముట్టో, కేశాలంకరణో కనిపించినప్పుడు మన పూర్వీకులపై గర్వం పొంగుకొచ్చి “కూల్, యా!” అని అనుకుంటాముగా, అలాంటివేవో ఆయన రాసినదాంట్లో కనిపించకపోతాయా అనే అంచనా. అంతటి జటిలమైన తెలుగును పూర్తిగా ఆస్వాదించే తాహతు లేకపోయినా దూరంనుండే గుటకలు వేసినా చాలుననుకున్నాను. “శివరాత్రి మాహాత్మ్యము” (సుకుమారుని చరితం)లో సుకుమారుడు చండాలకన్యని చూస్తూ నిలబడిపోయి, ఈ మాటలు అనుకున్నట్టే, నేను కూడా శ్రీనాథుని కవితా చింతకాయలని చూసి గుటకలు వేద్దామనుకున్నాను. 

 గీ. అవనిసుర! చింతకాయల కాజ్ఞ గాక
యరసి చూడంగ గ్రుక్కిళ్ల కాజ్ఞ గలదె?

యంటరాకున్న నేమి యంతంత నిలిచి
చిత్త మలరంగ నిన్ను విక్షీంపరాదె? 

 
(తాత్పర్యము: ఓ బ్రాహ్మణా! చింతకాయలు కావాలనుకుంటే ఒకరి ఆజ్ఞ కావాలిగానీ, పరిశీలించి చూడడానికి,  గుటకలు వేయడానికి ఒకరి ఆజ్ఞ అవసరం లేదుగా? అట్లే నిన్ను తాకకూడదు అన్నా ఏమైంది? దూరంగా నిలిచి మనసు తీరా నిన్ను చూసుకోవచ్చు కదా?)  

హాశ్చర్యం!

ప్రకృతి వర్ణనలుంటాయనుకున్నాను గానీ ఆకాశాన వేగంగా ప్రయాణించడం వల్ల సూర్యుడికి కడుపులో తిప్పేసింది, పాపం, సూర్యుడికి – ట్రావెల్ సిక్నెస్! పీకల దాకా తాగిన తామరపూల మధువుని కక్కుకున్నాడు. అందుకే సూర్యాస్తమయం వేళ అకాశమంతా ఎరుపు!

గీ. గగన యానవేగంబున గలబరించి
కడుపు నిండంగఁ గ్రోలిన కమలమధువుం
  గ్రక్కెనో నాఁగ గగనమార్గంబునందు
భానుబింబంబు రక్తాతపంబుఁగాసె”  

 “షో, డోన్ట్ టెల్” అనే ఫిక్షన్ రైటింగ్ రూల్‍కి పరాకాష్ట, ఒక రాజ్యపు ప్రహరీ గోడ వర్ణన: 

స్ఫటికమాణిక్యపాషాణ ఘటితమైన
యప్పురముకోట యకాశమంటి యొప్పు
వేడ్కఁ బాతాళభువనంబు వెడలి వచ్చి
చుట్టుచుట్టినయట్టి వాసుకియుఁ బోలె. 

ఇది చదవగానే చిన్నగా మొదలై ఎక్కే కొద్దీ మలుపులు  తిరుగుతూ ఎత్తు పెరిగే కోటగోడలు గుర్తొచ్చాయి, రాజస్థాను ట్రిప్పులో నేను చూసినవి!  ఇతరుల మనసుల్లోని మర్మం తెల్సుకోలేకపోవడం గురించి చమత్కారం, దోసకాయల్లా మనసులను పొడిచి చూడలేమని: “యెదరికోర్కి యెరుంగట యెట్టు కుట్టియా చూడఁగ దోసకాయలె”. 

ఈ పదవిన్యాసానికి ఒక “కూల్” వేసుకున్నా, నన్ను అమితంగా ఆకట్టుకున్నది మాత్రం శ్రీనాథుని కథానిర్మాణం. దేవుళ్ళకీ, మానవులకీ మధ్య కథలు కాబట్టి రెండు లోకాలైనా (ఉదా: కైలాసం, భూమి) ఉంటాయి. “శివరాత్రి మాహాత్మ్యము” (సుకుమారుని చరితం)లో అయితే సుకుమారుడు చనిపోయే వరకూ దేవలోక ప్రస్తావన రానేరాదు. ఇదో భక్తి కథ కాబట్టి, సుకుమారుని పాపపుణ్యాల లెక్కే కథకు కీలకం కాబట్టి పైలోకం నుండి సిసిటివి కామెరా నడుస్తుందనుకున్నాను. తెలుగు భక్తిసినిమాల్లో ప్రతి కీలక సన్నివేశానికీ ముందో, వెనుకో దేవుణ్ణి చూపించినట్టు: మేల్ గేజ్ (male gaze – మగవాని చూపు, ఆడదాన్ని కోరిక తీర్చే వస్తువుగా మాత్రమే చూసేది)లాగా, దేవుని చూపు (divine gaze – మనిషిని కర్మలనుసారంగా వర్గీకరించి చూసేది) ఒకటుంటుందనుకున్నాను. పోనీ కనీసం కవిగారైనా రన్నింగ్ కామెంటరీ చేస్తారనుకున్నాను గానీ ఊహు. “హరవిలాసం”లో శివపార్వతులు భక్తుడిని పరీక్షించడానికి కంచి పట్టణం మీద కుంభవృష్టి సృష్టించమని వరుణవాయు దేవతలకు పని అప్పగిస్తారు. వాళ్ళా పనిచేస్తారు, కానీ కవి దృష్టి మాత్రం ఆకాశంవైపు నుండి కాకుండా భూమి మీద అల్లకల్లోలాన్ని కళ్ళకి కట్టినట్టు వర్ణించడం మీదే ఉంది.  ఆ వైపరీత్యంలో సతమవుతున్న సగటు మనిషికి చోటిస్తాడు. నాకివ్వన్నీ “సూపర్ కూల్” అనిపించాయి.

శ్రీనాథుని కాలంనాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి నేనేం చదవలేదు గానీ, బ్యూరోక్రసీని, పదవుల్లో ఉండే హెచ్చుతగ్గులనీ ఆయన ఆనాడే ఆడేసుకున్నాడు. “శివరాత్రి మాహాత్మ్యము”లో శివునికి(సుప్రీమ్ బాసు), యమునికి(సీనియర్ మానేజర్‍)కి మధ్య జరిగే ఎపిసోడ్ అలా ఎత్తి ఇలా మానేజ్మెంటు పుస్తకాల్లో పెట్టచ్చు. ఇది చదివుండడం వల్లనేమో “హరవిలాసం”లో తపస్సులో ఉన్న శివుడిమీద పూలబాణం వెయ్యమనే పని అప్పజెప్తున్న ఇంద్రుడు, 

ఇది యనన్య సాధారణ మిది యవశ్య 
మిది పరోపకృతి క్రియాభ్యుదయశాలి
చేయు మిప్పని సంకల్పసిద్ధి గాఁగ
బాహువిక్రమపారీణ! పంచబాణ” 

అని మన్మథుడిని ఉత్సాహపరుస్తుంటే ఏ మాత్రం వర్కవుట్ అవ్వవని తెలిసీ ప్రాజెక్టులని నెత్తినేసేటప్పుడు మానేజర్ల అత్యుత్సాహమే కనిపించింది. ఆపైన మన్మథుడు ఏమయ్యాడో తెల్సు కదా! ఇట్లాంటి వాటికి మాత్రం కార్పరేటు చట్రంలో ఇరుక్కుపోయిన కష్టజీవిగా నేను “పరమ వీర కూల్” అర్పించుకోక తప్పలేదు. 

ఇలా ఎన్ని చెప్పినా, నన్నడిగితే, ఇవ్వన్నీ కాకుండా కూడా శ్రీనాథుని రచనల్లో ఇంకేదో ఉంది. రాతి శిల్పంలో కంటికి కనిపిస్తున్న భంగిమలకి, ఆభరణాలకి, ముఖ వర్చసుకి ఆపాదించలేని, వాటన్నింటి మధ్య తేలాడే అందమేదో ఉన్నట్టు. దాన్ని నేనింకా పట్టుకోలేకపోతున్నాను. బహుశా, ప్రస్తుత రాజకీయ,సామాజిక, సాంఘిక నేపథ్యంలో ఉన్న నేను, నా ఇష్టాన్ని, దాన్ని కలిగిస్తున్న కళాకారుడిని కూడా “పొలిటికల్లీ కరెక్ట్”గా నిలబెట్టాల్సి వచ్చే పరిస్థితి ఉన్నందుకేమో. ఉదాహరణకి, భాషని సంస్కృతంతో నింపి, అది మాత్రమే ఒప్పని  చెలామణి చేయించడం వల్లే తెలుగు అందరికీ కాకుండా పోతుందన్న వాదోపవాదాల్లో శ్రీనాథుని మీద ఇష్టాన్ని నేనెటు వైపు నిలబెట్టాలి?  అసలు నిలబెట్టాల్సిన అవసరముందా? ఈ ప్రశ్నలు దొలిచేస్తుంటే స్నేహితునితో మాటల మధ్యలో ఒక ఊతం దొరికింది: ఏ కాలానికైనా ఆ కాలానికే సంబంధించిన మాయ (myth) ఒకటుంటుంది. కవైనా, మామూలు మనిషి అయినా దానికి లోబడే జీవిస్తాడు, సృష్టిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి అదోటి ఉందని కూడా తెలీదు కదా, మనకి తెలీనట్టే! 

“తెలుగు కూడు పెట్టదు, ఇంజినీరుంగు చేస్తేనే బతుకు బ్రహ్మాండం!” అన్నది నా జీవితపు మాయ అయ్యి ఉండవచ్చు. కానీ ఆనాటి-ఈనాటి మాయాపొరలని చీల్చుకుని ఏ స్థలకాలాదులలోనైనా మనిషి ప్రవృత్తిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు, మనిషికి-దేహానికి, మనిషికి-దైవానికి, మనిషికి-కోరికకు మధ్య సంబంధబాంధవ్యాలను పరామర్శించడానికి శ్రీనాథుని కావ్యాలు వీలు కలిపిస్తాయని నాకనిపిస్తుంది ఖచ్చితంగా. అందుకే శ్రీనాథుడు నాకు “ఊబర్ కూల్”! ఒకరకంగా చూస్తే ఆయన పెద్దపెద్ద అంగలేసుకుని మిడిల్-గ్రౌండ్‍కి వచ్చేసే ఉంటాడు. నేనే ప్రస్తుతకాలపు చిక్కుముడులు తప్పించుకుని అక్కడికి చేరగలగుతానో లేదో. (అన్నట్టు, శ్రీనాథుడు ఒక వ్యక్తి కాదు, అనేకులు రాసినవి ఈ పేరుకిందకు వచ్చాయని తేలినా, శ్రీనాథడు “ఒక విశేష ఘటన” అయినా నా పఠనానుభవంలో మార్పు ఉండబోదు.) 

“కవి సార్వభౌముడి”గా తెలుగు సాహిత్య చరిత్రలో ధృవతారగా నిలిచిపోయిన కవిని పట్టుకుని ట్రెండింగ్ హాష్‍టాగ్‍గా మాట్లాడితే సంప్రదాయవాదులకు చిరాకు రావచ్చు. “విగ్రహాలను తాకరాదు. శిల్పాలను ముట్టరాదు” అని రాసుంటుంది పురాతన నిర్మాణాల వద్ద. దానికో ప్రయోజనముంది. ఎక్కువమంది చేతులతో తాకితే రాపిడికి రాయి అరిగిపోతుందని, తర్వాతి తరాలనాటికి బొమ్మల రూపురేఖలు మారిపోతాయనే భయముంటుంది. కావ్యాలు అలాంటివి కాదు కదా, నోళ్ళల్లో ఎంత నానితే అంత మంచిదేగా! మాబోటి వారు ఉచ్చారణా దోషాలతోనే పొడిపొడిగానే పద్యాలు చదువుకున్నా శ్రీనాథుని ఖ్యాతి తగ్గిపోదు కదా! 

“శ్రీనాథుడు ఇన్ 2020” అంటే, డిజిటిల్ రూపంలో పి.డి.ఎఫ్‍‍గా డౌన్లోడ్ చేసుకోగలగడం, వాట్సాపు/యూట్యూబుల్లో షికార్లు చేస్తున్న ఆడియోలు వినగలగడం కాదు, కదా? భక్తిపారవశ్యమో, అనితరసాధ్య పద్యరచనా ప్రతిభో మాత్రమే కాదు శ్రీనాథుడంటే. గతించిన తెలుగు సాహిత్య వైభవాన్ని మననం చేసుకోడానికి కాదు చదవాల్సింది. మనకోసం. మన మనుగడలో తడబాటులు, తప్పటడుగులపై అవగాహన పెంచుకోవడం కోసం. 

గీ. తివుచుచున్నది భవదీయదృగ్విలాస (లాగేస్తోంది నీకన్నుల అందం)
 మెత్తుకొనిపోవుచున్నవి యింద్రియములు 
  వెనుక ద్రొబ్బుచునున్నాఁడు మనసిజాతుఁ (మన్మథుడు)
డేమిసేయుదుఁ జెప్పవే యిందువదన.  

సకల సృష్టికీ ఆధారభూతమైంది ఈ “దొబ్బుడే”. ప్రస్తుతకాలంలో మాత్రం కోరికను వ్యక్తీకరించడంలో నిండుదనం, హుందాతనం సాధ్యమని తెలీను కూడా తెలీక, అణగారిన అణచుకున్న కోరికలు వికృత రూపాల్లో బయటపడ్డాక “నేరం నాది కాదు, దొబ్బుడిదే” అన్న వాదనకు ప్రతివాదనగా “ఆమోదం” (consent) అనే చిన్న పదాన్ని ప్రయోగిస్తున్నాం. మాటకు అర్థాన్ని మరో మాటతో చెప్పుకోవచ్చునుగానీ పరమార్థాన్ని జీవితానుభవాలలోనూ, వాటిని ప్రతిబింబించే కళలలోనూ మాత్రమే పట్టుకోగలం. “ఆమోదం” గురించి “మాస్టర్ క్లాస్” ఇచ్చాడు మన పూర్వీడుడొకాయన, ఎన్నో శతాబ్దాలకిందట! 

 నౌ టెల్ మీ, హౌ కూల్ ఈజ్ దట్?! 

You Might Also Like

2 Comments

  1. Amarnath

    Sreenaathuni pdyaalu okato rendo thelisinavi thappa, enduko aayana kaavyaala joliki poledu. Aayna samskrutha samaasaalu pada bandhaala gurinchey ekkuvagaa vini vundatam valla kaabolu. Mee vyasam loni acha telugu padyaalu choosaaka evo pogottukunnavi dorikinatlu gaa anipisthondi. Chakkani vyaasam prachurinchinanduku dhanyavaadaalu!

  2. Kallury Syamala

    ప్రాచీన ప్రబంధ కవుల్ని చదవటానికి వారిని నేటి రాకెట్ యుగంలో మనతో పాటు నిలబెట్టడానికి జరిగిన ఇంత మంచి ప్రయత్నం ఈ మధ్య కాలంలో చూడలేదు. మన మేనేజిమెంట్ గురువులు వాళ్ళ సూత్రాలని విశ్లేషించటానికి మహాభారతాన్ని కాచి వడగడ్తారు. పూర్ణిమ గారు అలవోకగా శ్రీనాథుణ్ణి.మనమధ్య నిలబెట్టేసారు. విలక్షణమైన చింతనా ధోరణి. మంచి వ్యాసం. అభినందనలు.

Leave a Reply