“బ్రెయిన్ డ్యామేజ్”: ఫ్రీదా మ్యాక్‌ఫద్దెన్

వ్యాసకర్త: నారాయణ శర్మ G V

(నారాయణ శర్మ గారు పరిచయం చేస్తున్న ఇంగ్లీష్ థ్రిల్లర్ సీరీస్ లో ఇది రెండో వ్యాసం. అన్ని వ్యాసాలనూ ఇక్కడ చూడవచ్చు. – పుస్తకం.నెట్)

[ఫ్రీదా మ్యాక్‌ఫద్దెన్ (Frieda McFadden) 2013 నుండి ఇప్పటివరకూ ఒక పన్నెండు నవలల వరకూ రాసినట్లున్నారు. స్వతహాగా డాక్టరుగారు అయిన ఆమెకు ప్రవృత్తి, మిస్టరీ నవలలు రాయటం. ఆమె మొదటి నవల ‘ద సూయిసైడ్ మెడ్’ కూడా బాగుంటుంది. (ఒక మెడికల్ కాలేజీలో ప్రతి ఏడాదీ ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ‘ఆ సూయిసైడ్ ల వెనక ఏమున్నది?’ అనేది దాని ప్రథాన ఇతివృత్తం. కాలేజీలో ప్రేమలు, మానసిక రోగాలు, డ్రగ్స్, ప్రొఫెసర్లని మంచి చేసుకునేందుకు అడ్డదారులు తొక్కే పిల్లలు- ఇట్లా రకరకాల వాళ్లు ఉంటారు గజిబిజిగా.)

డాక్టరుగా బ్రెయిన్ డ్యామేజ్‌ని అదువు చెయ్యటంలో స్పెషలైజ్ చేసిన ఆవిడ వ్రాసిన రెండో నవల, ఈ ‘బ్రెయిన్ డ్యామేజ్’. దీని తర్వాత ఆమె ఇట్లా మెడికల్ బాక్‍గ్రౌండ్ ఉండే నవలలు వ్రాయటం మానేసి, వేరే తరహా నవలలు వ్రాయటం మొదలు పెట్టారు. ]

***

కథను హీరోయిన్ ‘నేను’ అని ఉత్తమపురుషలో చెబుతూ నడుపుతుంది.  ప్రతి అధ్యాయం మొదట్లో ఆమె narrative ఎన్ని ఏళ్ళు-లేదా  నెలలు- లేదా రోజుల క్రితందో రాస్తుంటుంది.  అట్లా కథ ముందుకూ, వెనక్కూ నడుస్తూ సాగుతుంది. చదువరికి కూడా కథ ఒక సరళ రేఖలో మాదిరి కాక, వర్తమానంలో కొంత, భూతకాలంలో కొంత- ముక్కలు ముక్కలుగా తెలుస్తూ పోతుంది.

***

కథలో హీరోయిన్ ‘చార్లీ’ డెర్మటాలజిస్టుగా ప్రాక్టీసు చేస్తూంటుంది. వయసు ముఫ్ఫై ఐదేళ్ళు తుంటుంది; తల్లి ఆమెను పెళ్ళి చేసుకొమ్మని పోరుతుంటుంది; కానీ‌ ఆమెకు ఇంకా పెళ్ళి చేసుకునే అవకాశం ఉండదు. ఆమె పేషంట్లు అందరూ చిన్న చితకా పనుల్లో వాళ్ళు- ఆర్థికంగాను ఇతరత్రాను ఈమెకి నచ్చే అవకాశం లేదు. ఇతరులెవ్వరినీ కలిసేందుకేమో, మరి ఆమెకు సమయం ఉండదు.

అట్లాంటి సమయంలో ఆమెను వెతుక్కుంటూ వస్తాడు, క్లార్క్ అనే అందమైన కుర్రాడు. ‘పేరున్న ఒక సంస్థ’లో లాయరుగా పనిచేస్తుంటాడతను. సరిగ్గా అదే సమయానికి ఆమె పేషంటు ఒకడు చార్లీని బెదిరిస్తూ ఉంటాడు. క్లార్క్ వాడి బారినుండి ఆమెను కాపాడి ఆమెకు మరింత దగ్గర అవుతాడు. త్వరలోనే చార్లీ, క్లార్క్‌ పెళ్ళి చేసుకుంటారు.  

అంతలో అనుకోని ఘోరం జరిగిపోతుంది: చార్లీ ఒకతే ఇంట్లో‌  ఉన్నప్పుడు, ఆగంతకుడు ఒకడు- తలుపు తడతాడు. చార్లీ తలుపు తెరవగానే ఇంట్లోకి జొరబడి ఆమెను కాల్చేస్తాడు. బుల్లెట్ ఆమె మెదడులో కుడివైపున రంధ్రం చేసుకుంటూ పోతుంది!

***

తెలివి వచ్చేసరికి ఆమె ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంటుంది. తను ఎవరో కూడా ఆమెకు గుర్తు ఉండదు. శరీరంలో ఎడమ భాగం పూర్తిగా ఆమె స్వాధీనంలో లేకుండా అవుతుంది. ఊరికే స్వాధీనంలో లేకపోవటం కాదు- అసలు ఆ భాగం ఉన్నట్లే ఆమెకు ఎరుక ఉండదు!

ఆమెని గమనించుకుంటూ, మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఈమె ఆమెను కూడా గుర్తు పట్టదు.

***

రిహాబిలిటేషన్ సెంటర్లో నర్సులు, డాక్టర్లు చాలా మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రేమాభిమానాలు, అనుభవం, ఇట్లాంటి పేషంట్లను వారి వారి సామర్థ్యాలను బట్టి చిన్న చిన్న గ్రూపులుగా చేసి, గ్రూప్ యాక్టివిటీలు చేయించటం వంటివి ఈమెను మెల్లమెల్లగా మన లోకంలోకి తెస్తాయి. ఈమెకు మెదడులో ఆలోచనలు అవీ మొదలవుతాయి, కానీ చాలా సంగతులు గుర్తే ఉండవు. కుడి చెయ్యి, కాలు పని చేయటం మొదలు పెడతాయి; కానీ ఎడమచెయ్యి, కాలు ఉన్నాయని కూడా తెలీదు! కూర్చోవాలంటే కూడా బ్యాలెన్సు ఉండదు.  

మెల్లిగా తోటి పేషంట్లతోటీ, వాళ్ళ గొంతులతోటీ, వారివారి సైగలతోటీ, వాళ్ల కథలతోటీ పరిచయం పెరుగుతుంది ఈమెకు.  వాళ్ళ మెదళ్ళు ఒక్కొక్కరివీ ఒక్కో రకంగా దెబ్బతిని ఉంటాయి. వాళ్లలో “జామీ” అనే అతనికి, ఈమెకు కొంత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. జామీ కూడా వీల్ ఛెయిర్ కు పరిమితమైన వాడే. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇట్లా చెంచా కూడా ఎత్తలేని దశలోకి చేరుకొని ఉంటాడు. ఈమెలాగానే అతనూ క్రమంగా బాగౌతుంటాడు. ఆ క్రమంలో అతను తన కుటుంబం గురించి చెబుతాడు ఈమెకు.  అతని భార్య కారెన్ డ్రగ్ అడిక్టు. వీళ్లకు ఒక కొడుకు ఉంటాడు. ఇతని ప్రాణాలన్నీ‌ ఆ కుర్రాడి మీదనే. అయితే ఆ కుర్రవాడికి తన వికలాంగత్వం కనబడనివ్వకూడదు అని జామీ తాపత్రయం.  “వాడు అర్థం చేసుకోలేడు, నన్ను ఇట్లా చూస్తే బాధపడతాడు” అని అతని భావన.

చార్లీకి ఇట్లాంటి భావనలు అన్నీ‌ బాగా అర్థం అవుతుంటాయి; కానీ ఈమె పరిమితులు ఈమెవి! ‘తనను తుపాకీతో‌ కాల్చిన ఆగంతకుడు ఎవ్వరో తనకు తెలిసినవాళ్ళే’ అనిపిస్తూంటుంది ఆమెకు. “నీకు ఇట్లాగే అవ్వాలి. తగిన శాస్తి జరిగింది” అని ఆమె కుడి చెవిలో‌ గుసగుసగా చెప్పాడు ఆ కాల్చిన వాడు! అట్లా ఆమెకు పీడ కలలు వస్తున్నాయి. కానీ‌ వాడు ‘ఎవ్వడు?’ అనేది స్పష్టంగా తెలీటం లేదు ఈమెకు!  

***

చార్లీకి ఇన్సూరెన్సు ఐపోవస్తూంటుంది. త్వరలో ఆమెను ఇంటికి పంపేస్తారు. ఇంట్లో సాయం ఎవ్వరూ‌ లేరంటే ఆమె ఏ నర్సింగ్ హోం లోనే చేరచ్చు. అయితే ఇక అక్కడ ఆమెకు ‘మెరుగయ్యే అవకాశాలు’ అంటూ ఇక ఏమీ ఉండవు. అప్పటికి కూడా- ఈమెకు ఒకటి-రెండూ పనులు అన్నీ ఎవరైనా చేయించాల్సిందే; అన్నం ఎవరైనా తినిపించాల్సిందే; వీల్ ఛెయిర్ ను ఎవరైనా నడిపించాల్సిందే; అన్నిటినీ‌ మించి ఈమెకు బ్యాలెన్సు లేదు- శరీర భాగాలన్నీ కుడివైపుకు పడిపోతూ ఉంటాయి; ఎడమవైపు ఉన్నవి ఏవీ అసలు కనబడను కూడా కనబడవు. ఇంద్రియాలు ఏవీ‌ లేకపోతే ఇక బ్రతుకు ఎలాగ?

ఈమె దుబ్బగా, పొట్టిగా ఉంటుంది. తల్లికి ఈమెను ఎత్తి పనులు చేయించే శక్తి లేదు. కాబట్టి నర్సింగ్ హోం తప్పదు. అయితే దానికి కూడా చాలా డబ్బులు కావాలి. తల్లికి అంత స్తోమతు లేదు!

***

ఆమెను కాల్చినందుకుగాను అప్పట్లో ఆమెను బెదిరించిన పేషంటునే అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు పోలీసులు. అతను కూడా నేరాన్ని ఒప్పుకుంటాడు. అయితే ఆమె మెమరీలో మాత్రం ఆ సంఘటన ఉండదు.

ఆ సమయంలో వస్తాడు చార్లీ‌ భర్త. “నేను నీ‌ భర్తను. ఇకమీద నీ బాధ్యత అంతా నాది” అంటూ. ‘అతను తన భర్త’ అంటుంటే కాబోలు అనుకుంటుంది చార్లీ- అంతే తప్ప అతనితో తను గడిపిన సమయం ఏదీ‌ ఆమె మెదడులో లేదు. అయితే అతను వచ్చిననాటినుండి ఈమె పరిస్థితికి ఈమెను చాలా చీదరించుకుంటూ, చిన్నబుచ్చుతూ ఉంటాడు. రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు ఈమెను ఎలా చూసుకోవాలో ట్రెయినింగ్ ఇవ్వటం మొదలు పెడతారు అతనికి. ఆ నర్సులకు ఎవ్వరికీ అతనంటే ఇష్టం కాదు. “అతని సంరక్షణలో ఈమె ఇంకా వెనక్కి పోతుంది” అని వాళ్లందరి భావన. దానికి తగినట్లు అతను కూడా “నిన్ను లేవనెత్తి నడిపించటం నా వల్ల కాదు- ఊరికే వీల్ చైర్లోనే ఉండు అంతే” అనటం మొదలు పెడతాడు. ఈమె కూడా అందుకు సరేనంటుంది- “భర్తకదా, అతను ఎట్లా చెబితే అలా చెయ్యాలి!” అని.

***

ఇంకా కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అవుతుందనగా  ఆమెకు తన శరీరపు ఎడమ భాగం కూడా తెలియటం మొదలు పెడుతుంది. మెల్లగా తనను నిజంగా కాల్చింది ఎవరో గుర్తుకొస్తుంది. ఆ క్రమంలోనే భర్తకు, జామీకి పోట్లాట జరుగుతుంది. గందరగోళం అంతా జరిగాక, చివరికి కథ సుఖాంతం అవుతుంది. ఆ క్రమంలో‌ “ఇదేమి ప్రపంచం దేవుడా, మరీ ఇట్లా ఉంది?!” అని మనకూ అనిపిస్తుంది.

***

వ్యక్తితత్వం మానవ జీవితాలని శాశిస్తున్నది. మానవ సంబంధాలు మార్పు చెందుతున్నాయి. ‘ఎవరికైనా స్వార్థమే ముఖ్యం’ అన్నప్పుడు, ‘భార్యకు బాగాలేనప్పుడు భర్త, భర్తకు బాగాలేనప్పుడు భార్య, పిల్లలకు బాగాలేనప్పుడు తల్లిదండ్రులు ఎందుకు బాధ్యత వహించాలి?’ వంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. మన కుటుంబ వ్యవస్థలోకి ఆర్థికత ఇంకా ఏమంత జొరబడలేదు- విదేశాలలో ఆ జొరబాటు వేళ్ళు ఊనుకునే దశలో ఉన్నది.  ఇటువంటివి చదివినప్పుడు మనసుకు బాధగా అనిపించినా, మన ప్రస్తుత ఛాయిస్‌లు మనల్ని ఎటువైపుకు తీసుకువెళ్లచ్చో కొద్ది కొద్దిగా అర్థం అవుతుంది.  

***

ఈ పుస్తకం అమెజాన్ లో‌ లభిస్తుంది. ‘గుడ్ రీడ్స్’లో చాలా మంది పాఠకులు దీనికి చక్కని రేటింగ్ ఇచ్చారు.  కొందరికి మటుకు ఈ కథ నచ్చలేదు- “బ్రెయిన్ బాగాలేని మనిషి రాసుకున్న డైరీలాగా ఉంది” అని వారన్నారు. మనలో కూడా చాలామందికి ఈ పుస్తకం నచ్చుతుందని నా ఊహ. 

You Might Also Like

Leave a Reply