కలల కన్నీటి పాట: విభా
విభా కన్నడ కవి. చాలా చిన్న వయసులో చనిపోయింది ఆవిడ. రాసినవి కొన్నే అయినా బలంగా తాకే కవితలవి. మామూలుగా అయితే ఇలాంటి కవులు, ముఖ్యంగా ఆడవారు, చాలా త్వరగా కనుమరుగైపోతారు. వారి స్నేహితులో, బంధువులో పూనుకుని పుస్తకాలు వేస్తేనే తెలుస్తాయి మనకి. (శివలంకె రాజేశ్వరి గారి “సత్యం వద్దు, స్వప్నమే కావాలి” అనే కవిత సంపుటి గురించి నా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఒకటే ఆశ్చర్యం.) అలాంటి పేరు ఎక్కువ వినిపించనివారి కవితలు చదువుకోవడమే అబ్బురమనుకుంటే, వాటిని అనువాదం చేసి మరో భాషలోకి తీసుకురావడం అపురూపం.
కవితా సంపుటాలకి సమీక్షలు, పరిచయాలు రాయడం, నా మట్టుక్కు నాకు, కష్టం. అనంతమైన భావాన్నేదో అలతి పదాల్లో మనకి అందిస్తారు కవులు, ఆ పదాల మూట విప్పి, ఆ అనంత భావామేదో బోధపడ్డాక, అందులో పడి మునకలేస్తుంటాం. మళ్ళీ ఆ మునకుల గురించి రాయగలగాలంటే మనకీ పదాలతో అంత ప్రతిభ ఉండాలి. అది లేనప్పుడు, అయినా రాయలేక ఊరుకోలేనప్పుడూ, ఇదో ఇలాంటి అరకొర వ్యాఖ్యానాలు రాయాల్సి వస్తుంది. “All imperfections are tolerable when served in small doses” అన్న Wislawa Szymborska గారి మాటలు తలుచుకుంటూ రాస్తున్నాను.
*****
ముందుమాటలు మరెక్కడ అవసరం ఉన్నా లేకపోయినా అనువాదాలకి అవి తప్పనిసరి. కథనో, కవితనో అనువాదం చేసి అందించడం ఎంత ముఖ్యమో, ఆ కథకుని, కవిని మనం సొంతం చేసుకోవడానికి (వారి రచనలు మన భాషలో ఉన్నా కూడా) వారి జీవితాలని, నేపథ్యాలని తర్జుమా చేయడం అవసరం.
జీవితాలని, నేపథ్యాలని తర్జుమా ఎలా చేస్తారు? “అక్కడ పుట్టారు, ఇవి రాశారు, అలా పోయారు” అని చెప్తే సరిపోదా అంటే సరిపోవచ్చు. కానీ మనం నేపథ్యానికి వారి నేపథ్యాలకీ ఎక్కడ సారూప్యాలు ఉన్నాయి, అయినా అవి విలక్షణంగా నిలబడ్డానికి ఏవి నిలబెడుతున్నాయో చెప్పగలిగితే, పాఠకులకి తోవని చూపినవారవుతారు.
“కలల కన్నీటి పాటలు”కి ఓల్గా గారు, అజయ్ వర్మ రాసిన ముందుమాట, పరిచయ వ్యాసం విభాని అర్థం చేసుకోవడంలో నాకు బాగా సహాయపడ్డాయి. చిన్న వ్యాసాలైనా లోతైన అవగాహన కలిగించాయి. తెలుగు సాహిత్య సర్కిళ్ళో అనువాదం ప్రస్తావన వచ్చీ రాగానే “మూల రచనల ఆత్మని పట్టుకోవాలి అనువాదాలు” అనే మాట వినిపిస్తుంటుంది. రచనల ఆత్మ గురించి నాకు తెలీదు కానీ, రచయితలని అనువాదకులు ఎంత బాగా అర్థం చేసుకుంటే, ఎంత ఆత్మీయ అనుబంధం ఏర్పర్చుకుంటే అనువాదాలు అంత అద్భుతంగా వస్తాయని అజయ్ రాసిన పరిచయం, అనువాదాలు చదివితే బోధపడుతుంది.
*****
“మతి ఎలా ఉంటే గతి అలా ఉంటుంది” అని ఒక నానుడి. “మనిషి చర్యలకి, మానసిక లోకానికీ పెద్ద వ్యత్యాసం లేనప్పుడు రచనల్లో గాఢత, చిక్కదనం ఉంటాయ”ని కొందరి విశ్లేషణ. విభా జీవితంలో విరామమివ్వని మృత్యుహేల వల్ల ఆమె చావు గురించి అంత బాగా రాసిందా, ఆమె చనిపోబోయే ముందు చావు గురించి ఎలా రాయగలిగింది అన్నవాటికి మనం ఖచ్చితంగా జవాబులు వెతుక్కోలేం.
“ప్రతీక్ష” అనే కవితలో యముడి రాక గురించి చెప్తూ:
అతడి దయలేని అడుగు మన ఇంటి గుమ్మానికొస్తే నా ప్రాణం నీలో, నీ ప్రాణం నాలో, ఉండటం చూసి అతడు - తిరిగెళ్ళిపోయేలా (పేజ్: 63)
“పొద్దెక్కే వేళలో” అనే కవితలో ఇలా అంటుంది. అందుకే యుముడి ఆమె ఇంటికి వచ్చాక తిరిగెళ్ళిపోయాడు కానీ, ఆమెని కూడా తీసుకెళ్ళిపోయాడు.
ఈ రాత్రి నీ కవితలని ధ్యానిస్తూ నిద్రపోయాను. కవిత, వాస్తవాన్ని మించిన లోకమని చెప్పేవాళ్ళపై జాలి వేసింది. (పేజ్: 70)
*****
“చప్పుడు” అనే కవితలో పుట్టబోయే బిడ్డకి వాడు లోకంలో వచ్చాక ఎన్ని చప్పుళ్ళు భరించాలో చెప్తుంది. దీపావళి పండుగ నేపథ్యం. అందులో ఈ కింది stanza నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఇలాంటిది ఒక కవితలో చదువుతానని నేను అనుకోలేదు. చిన్నప్పటి నుంచి భర్తల అభిప్రాయాల బరువు మోస్తున్న ఎందరో భార్యలని చూశాను. రాజకీయంగా, సాంఘికంగా ఏం జరుగుతున్నా ఆ విసుగునీ, ఆవేశాన్నీ భార్యల మీద గుమ్మరించేస్తూ ఉంటారు. విభా దాన్ని noise అన్న అర్థంలో వాడ్డం నాకు భలే గొప్పగా అనిపించింది.
ఇతను ఊరిలో ఉండుంటే ఇలాంటి వేడుకలన్నీ ఎంత అర్థహీనం అని ఏవేవో ప్రసంగాలిచ్చేవాడు కానీ దేనిలోనూ తలదూర్చని నాకు - వినే శిక్ష మాత్రం తప్పేది కాదు. (పేజ్: 84)
*****
విభా కవితల్లో మరణమూ, ప్రేమ, ఆడవారిపై వివక్ష లాంటివి అంశాలతో పాటు సామాజికాంశాలూ ఉన్నాయి. దోపిడికి గురవుతున్న వర్గం గురించి “దోచుకున్నారని” అనే కవితలో రాస్తూ ఆవిడ ఆగ్రహావేశాలతో ఊగిపోదు. “న్యాయం అడగుదాంలే” అంటూనే “అడిగినా కూడా ఇవ్వకుండా దాచుకోడానికి మన దగ్గర ఇంకేం మిగిలింది” అని అంటుంది.
వాళ్ళు మన రొట్టెని, నిద్రని, నవ్వునీ దోచుకున్నారని మనం ఈ లోకపు జనుల అదాలత్తులో ఒక రోజు న్యాయమడుగుదాం. కాని, ఇప్పటి ఈ స్థితిని చూడు - వాళ్ళు దోచుకోవాలన్నా మనదగ్గర ఏమీ మిగలలేదు వాళ్ళు కూడా ఇప్పుడు మనలానే నిరుపేదలుగా మిగిలినందుకు బాధగావుంది. (పేజ్: 86)
*****
“ఖాళీ అవ్వని కణజం” స్త్రీ పురుషుల శారీరక కలయిక అనే అంశంతో రాసినది. ఇది చదువుతున్నప్పుడు నాకు మంటో రాసిన “సడక్ కె కినారె” (రోడ్డు పక్కన) అనే కథ గుర్తొచ్చింది. ఆ కథలో ఒక స్త్రీతో శారీరక కలయిక తర్వాత మగవాడు వదిలిపెడతాడు. ఆమె మళ్ళీ మళ్ళీ ఆ రాత్రిని గుర్తుచేసుకుంటూ ఉంటుంది. సంభోగ సమయంలో ఆడా, మగా దేహాల అనుభవం, అనుభూతి ఎంత వేరుగా ఉన్నాయో విభా కవిత, మంటో కథ డీల్ చేస్తాయి. ఉదా, విభా కవితలో కొన్ని పంక్తులు:
నీ చిటికెన వేలి స్పర్శకి వంటి నరాలన్నీ బిగిసి శృతి పట్టిన క్షణాలలో నేను మధురనాదాలను పలికే వీణని నువ్వు ఒక్క క్షణం మౌన సముద్రానివి మరుక్షణం తాండవ రుద్రుడువి.
మంటో కథలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఇలా బాధపడుతుంది.
నేనేమో అతన్ని ఇంకా తీవ్రంగా కోరుకోవడమేమిటి? అతను బలవంతుడైపోయాడు. నేను బలహీనపడిపోయాను. కౌగిలో పెనవేసుకున్న రెండు మబ్బుల్లో ఒకటి నీరై కరిగిపోవడమేమిటి? మరోటి ఉరుమై మెరుపై గర్జించి మాయమైపోవడమేమిటి? ఇది ఎవరి న్యాయం? ఆకాశానిదా? భూమిదా? వాటిని సృష్టించినవాడిదా?
*****
“తెలుగు సాహిత్యంలో స్త్రీవాద పవనాలకు సమాంతరంగా దేశంలో అనేక చోట్ల ఆ గాలి వీచింది. ఐతే ఇతర భాషల గురించిన తులనాత్మక అధ్యయనాలు కొరవడిన కారణంగా Feminist Sisterhood” ఏర్పడటంలో చాలా ఆలస్యమవుతూనే ఉంది. విభా కవిత్వం సున్నితమైన, అదే సమయంలో పదునైన స్త్రీవాద దృక్కోణాన్ని కలిగి ఉంది. … పితృస్వామ్య మూలాలన్నింటినీ ఆమె తడిమింది. స్త్రీల జీవితాన్ని అణిచివేసే సమస్త ఆధిపత్య భావాలనూ ఆమె తడిమింది.”
ఓల్గా గారు ముందుమాటలో అన్న మాటలు. యాధృచ్చికంగా, విభా కవితలు చదవడం మొదలెట్టినప్పుడే నాకు “నీలిమేఘాలు” స్త్రీవాద కవితా సంకలనం కూడా అందింది. ఊరికే ఎలా ఉన్నాయో చూద్దాం కవితలని తిరగేస్తుంటే, విభా కవితలు నీలిమేఘాల్లో ఉన్నట్టు, నీలిమేఘాల కవితలు విభా రాసినట్టు అనిపించింది. ఇంకా శ్రద్ధగా చదివి, రెండు పుస్తకాల్లో ఉన్న సారూప్యాలని, విలక్షణతలని విశ్లేషిస్తూ రాయచ్చు. కానీ ప్రస్తుతానికి, మచ్చుగా, అబ్బూరి ఛాయాదేవి 90లలో రాసిన కవితనీ, ఓ పాతికేళ్ళ తర్వాత విభా రాసిన కవితనీ పక్కపక్కన పెడుతున్నాను. Feminist sisterhood ఇలా నాన్-అకాడమిక్‍గా కూడా వెతుక్కోవచ్చు. 🙂
విన్నావా? అమ్మ అంటుంది: ఆడపిల్లవి పెళ్ళి కావాలిసిన అబలవి గుండెల్లో గుబులివి నాన్న అంటాడు: పెళ్ళి కావాలా పిచ్చి పిల్ల పెళ్లంటే మాటలా! స్నేహితుడు అంటాడు: సూర్యచంద్రులే సాక్ష్యం నీతోనే నాకు మోక్షం పెళ్ళి కాదు, మనకి ప్రేమే లక్ష్యం! సమాజం అంటుంది: నువ్వు ఆడదానివి గీత దాటకూడని దానివి మచ్చపడితే మాయని దానివి - అబ్బూరి ఛాయాదేవి (నీలిమేఘాలు. పేజి: 72)
పొడుచుకొస్తుంది వెలుతురు నేనూ బతుకుతున్నాను ఎన్నో శతాబ్దాలనుండి ఇదే వంటింటిలో ఇదే పొయ్యిసందులో అవతల - సూర్యుడు నిత్యం పుడుతున్నాడట కానీ నేను చూడనేలేదు నాకెక్కడ అతడి దిష్టి తాకుతుందని నాయనమ్మ బయటకొదలనేలేదు అవతల - చాలా వెలుగుందట. కానీ నేను చూడనేలేదు నా రంగెక్కడ మాసిపోతుందని అమ్మ బయటకొదలనేలేదు. అవతల - కనులుప్పొంగించే పచ్చదనముందట. కానీ నేను అనుభవించనేలేదు నేనెక్కడ దానిలో కనుమరుగైపోతానని నాన్న బయటకొదలనేలేదు. కాని ఇప్పుడిప్పుడు - సూర్యుడు వెలుగ్గూటిలోంచి లోపలకి చొరబడి నన్నే చూస్తున్నాడు. ఎక్కడినుంచో పొడుచుకొస్తున్న వెలుతురు, మార్చేస్తున్నది నా రంగునంతా. పచ్చదనం చేచాపి పిలుస్తున్నది. కిటికి అవతలనుండి నన్ను. - విభా (కలల కన్నీటి పాట: పేజి 25-26)
Leave a Reply