కొండపొలం – సన్నపురెడ్డి వెంకట్రాంరెడ్డి నవల

వ్యాసకర్త: రాఘవ రెడ్డి

*******

వెంకట్రాంరెడ్డి గారి చేయి పట్టుకోని “కొండపొలం” బయల్దేరా.

ఎలా ఉంటుంది కొండపొలం వెళ్తే?

నెలరోజులపాటు కొండల్లో జీవించాలి. స్నానం చేసేందుకు నీళ్ళుండవు. స్నానం కాదు గదా, కనీసం కాళ్ళు కడుక్కున్నా కూడా చలిజ్వరం తెప్పించేలాంటి నీళ్లట! 

పురుగూ పుట్రా అన్న ఆలోచన లేకుండా నేల మీదే పడుకోవాలి. ఏ క్షణాన్నయినా కౄర మృగాలొచ్చి మీద పడొచ్చు. భయపడకూడదు. ఎండా వానలకి ఏ ఆశ్రయం ఉండదు. గొర్రెలతో పాటు గొర్రెల్లాగే ఆరుబైట భరించాల్సిందే.

అట్టాంటి కొండపొలానికి ఇంజనీరింగ్ చదువుకోనుండి, ఇంకా ఉద్యోగం రాక అల్లాడుతున్న రవితో పాటు నే కూడా బయదేలిపోయా.

దాదాపు ఇరవై కుటుంబాల వాళ్ళు కొండకు పోతున్నారు. ఇరవై మందికి పైగా జనం. వెయ్యి దాకా గొర్లు.

సజ్జరొట్టెలు, బెల్లం గడ్డ, పచ్చడి ముద్ద, ఉల్లిగడ్డ, బియ్యం – బత్తెం మూటలు భుజానేసుకుని జీవాలకు మేత వెతుక్కుంటూ నల్లమల కొండల్లోకి-

పెద పుల్లయ్య, గురప్ప, అంకయ్య, పిచ్చన్న, రాంచంద్ర, పాములేటి, మునెయ్య, తిరిపేలు, రామయ్య, భాస్కర్, శ్రీను-వీళ్ళందరితో పాటు నేనూ.

ఎట్టా ఉంది కొండపొలమనుభవం?

నీ పాసుగుల్లా, ఏవని చెప్పాలి. అది ‘జీవితం’ రా నాయినా.

మొదట ఒకట్రెండడుగులు నేనేశానేమో. ఇక ఆ తర్వాత నా సంగతి నాకు తెలీదు. నా ఒల్లు నా స్వాధీనంలో ఉంటే గదా.

తోకబోడు, ఎక్కుడుమిట్ట, గోపిదేవి కొండలు, దేవరకొండ, బండపేట్లు, సెలలు, బోడులు ఎక్కీ దిగీ.. మందతో పాటే నేనూ కొండపొలం జేస్తిని నాకు తెలీకుండానే.

….

“వంకలోంచి ఒక్క ఎగురున గట్టు మీదకు దూకింది ఆ జీవి. సరిగ్గా రవికి రెండడుగులు ముందే నేల మీద కాళ్ళాన్చింది. పులో, చిరుతపులో, ఎడగండో, చిరుబులో అర్ధమవకుండానే బేర్ మని అరిచాడు రవి.” 

తనకు తెలీకుండానే అతని ఒళ్ళంతా భయంతో వొణికి పోతాంటే, చేతుల్లోంచి గొడ్డలి కర్ర జారిపోతంటే, తనకు అడుగు దూరంలో తన ఎత్తున లేచి నిలబడి కళ్ళు చింతనిప్పుల్లా జేసి కోరలు బైటపెట్టి అరుస్తూ బావురుమని నోరు తెరిచిన ఆ జీవిని చూసి రవితో పాటు నేనూ కాళ్ళు తడుపుకున్నా.

“నీ మీందికి వొచ్చింది పులి కాదు. ఎడగండు. మనిసి మీందకు మార్కొనేంత సత్తవ దానికి లేదు. కోర చూపించి మీద పడే దాని మాదిరి బెదిరిస్తాది. ఆ బెదురులో మనముండగానే గొర్రెను పీకబట్టుకుని ఈడ్సకపోతాది” కొడుకు రవితో చెబ్తున్నాడు గురప్ప. “గట్టిగా అదిలించి నీ చేతిలో ఉన్న గొడ్డేటి కట్టెతో ఒక్క పీకు పీకిన్నేవనుకో, బేర్ మంటా పడుండాల్సింది. ఆ సంగతి తెలక బయపన్నెవు”

– గురప్ప చెబుతున్నది అడవిలోని ఆ ఎడగండ్లు గురించేనా? ఎవరి బతుకులోనైనా వొచ్చే కడగండ్ల గురించా?

….

అత్యంత సరళమైన కధ. గొర్లను మేత కోసం అడవి లోకి తోల్క పోయి ఒక నెల్లాళ్ళు వాన కుర్సిందాకా అక్కడే ఉండి అప్పుడు ఊరికి రావడం. 

ఇందులో ఎంత పనితనం చూపెట్టాడో ఈ రచయిత!తల్చుకుంటే అబ్బురంగా ఉంది.

ఒక్కొక్క కాపరిది ఒక్కొక్క కధ. అన్ని కధల్లోకీ మనల్ని తీసుకుపోతాడు. 

పొద్దున్నే మంద లేవేసుకుని నిలువుకాళ్ల మీద తిరిగి తిరిగీ గొర్ల మేపుకుని, సెలలో నీళ్ళు దాపుకుని , ఏ చెట్టు నీడకో జేరి పొవ్వులు పొందించుకోని ఎసట్లో గింజలేసుకుని..టేకాకుల్లో అన్నం తిని కాస్త ఆగుతారే, అప్పుడల్లా ఆత్రమాత్రంగా ఉత్కంఠగా పరుగులు తీస్తాం అక్షరాల వెంట. 

ఒక్కొక్కరి బతుకు విప్పే గొల్లల మాటల వెంట. పుల్లయ్య తాత చెప్పే పాఠాల వెంట. చెతుర్ల వెంట, నవ్వుల వెంట, గుండెలు కరిగే కతల వెంట, కన్నీళ్ళ వెంట.

నాకైతే నవల చదవడం పూర్తిచేసి పక్కన పెట్టాక కూడా అడవిలోనే ఉన్నట్టుగా ఉందింకా. పుల్లయ్య తాత, గురప్ప లు “నాయినా…” అని గుండెకాయల్ని గొంతులుగా మల్చి పిలుస్తున్నట్టుగానే ఉంది.

“నాయినా, దాని తావుకి మనమొచ్చినాం. మన తావుకది రాలా. అదిక్కడ రాజు. వొస్తే ఒక జీవాన్ని లాక్కుపోతే పోనీండి. పుల్లరి కట్టామనుకుందాం. మనం ఒక్కోలం యాబై పొట్టలు సేత పట్టుకోని వొచ్చిన్నాం నాయినా. కన్ను గలిగి ఉండాల” – పులి గురించి చెప్పన తాత నాతోనే ఉన్నాడింకా.

“పట్టెడు లావు చెట్టు వేరు చూస్చే పామనుకోని బెదిరిపోతివి. వంకలో చెట్లు కదిలితే చాటున మెకము ఉందనుకోని వొణికిపోతివి. ముందుపోడాన్కి జంకితివి, వెనక రాడాన్కి గొంకితివి. నువ్వు గొర్లు కాయడం లేదు సిన్నోడా! నీ బయ్యాన్ని నువ్వు కాసుకుంటా ఉండావు.” – గురప్ప నాతోనే చెబుతున్నాడు తన కొడుక్కి చెప్పినట్టు.

అచ్చమైన టీం స్పిరిట్ అంటే ఏందో అడుగడుగునా కళ్ళక్కడుతుంది. వచ్చిన కష్టాన్ని, సుఖాన్ని అందరూ కలిసికట్టుగా అనుభవించడమంటే ఏందో అర్ధమవుతుంది. ఒక జట్టుగా ఉంటే పెద్దపులినైనా ఎట్టా కాచుకోవచ్చో అర్ధమవుతుంది. 

….

ఎండలో, వానలో కూర్చోనూ నిలబడనూ లేకండా మందంట తిరుగుతూ మందను కాపాడుకుంటూ జీవాలను కన్నబిడ్డల్లా సాకే మనుషులు..

అవి కడుపునిండా మేస్తే తమ కడుపు నిండినట్టుగా తృప్తి చెందే మనుషులు..

అవి తినకుంటే తమకూ పిడచ గొంతు దిగని మనుషులు .. 

గొర్రె గిట్టల్లో విరిగిన ముల్లును తమ పళ్ళతో పట్టుకుని పెరికే మనుషులు!

మనుషులే నబ్బా నవల నిండా. 

మెత్తదనం మాయమవని అచ్చమైన మనుషుల మధ్య తిరగడం, వాళ్లతో కలిసి తినడం, నిద్రపోవడం, గొప్ప మార్దవమైన అనుభూతి.

“మ్మేయ్ సుబద్రా!” అని ఫోన్లో అంకయ్య అరిస్తే అందరితో పాటు నాకూ నవ్వొచ్చింది. కానీ కాసేపటికే అందర్తోపాటు నాకూ ఏడుపొచ్చింది.

“అమ్మే! అంతలావు తప్పు నేనేం జేసినా? కండ్లు కనపడని మా యమ్మ కాల్చిన రొట్టెలు బత్తేనికి కొండకు తెచ్చుకుంటే..ఒక పక్క మాడిపోయి, ఇంకోపక్క వెలిరొట్టె పడి కాలక- తింటే అరక్క కడుపు నొప్పి, తినకపోతే ఆకల్తో పొట్టనెప్పి – సగం రొట్టెలు కుక్కలకే బేస్చాంటి. పగులంతా పరిక్కాయో ఈతకాయో టూకిపండో మోవిపండో ఈటితోనే పానం పట్టుకోని ఉండానమ్మే. మేయ్ సుబద్రా! ఏవన్న తప్పు జేసింటే అంతకన్నా ఎక్కువే సిచ్చ అనుబగించినా గానీ, ఇప్పుడన్నా ఇంటికి రామే, మూడో బత్తేనికన్నా రా” – 

– కళ్లు తుడుచుకుంటున్నది అంకయ్యొక్కడేనా? 

సేద్దెగానికి మాత్రం పిల్లనియ్యననే ఇంకో సేద్దెగాడు, కూతుర్ని అట్టన్నా చేసుకుంటాడని, మేనమావకు పెళ్లికి ముందే తన బార్య అలవాటు చేయిస్తే.. అందుకు దారితీసిన లేనితనం లోంచి కన్నీళ్ళు పెట్టుకునే నిస్సహాయుడు, అల్లుడి కట్నం బాకీ కింద మందను ఇవ్వాల్సొచ్చి గుండె బద్దలు చేసుకున్న పాములేటి, కొండకు బయల్దేరుతుంటే వెంట వచ్చి పేరు పేరునా జాగ్రత్త చెప్పి, తన అంత్యక్రియల డబ్బులు జేబులోపెట్టుకుని మరీ అప్పుల బాధకు పురుగుమందు తాగిన నారాయణ – 

అరే బాబా, చుట్టూ పరచుకున్న జీవితం రా నాయినా! ఏవని చెప్పేది!

….

కాలికింద పడిన వేరు చూసి, ఎడగండును చూసి కాళ్ళు తడుపుకున్న రవి పెద్ద పులికి ఎదురు నిలబడి దాని తలను బద్దలుగొట్టి తరిమేసేవాడుగా ఎట్టయ్యాడు? దాన్ని కొట్టగలిగే శక్తి వచ్చి కూడా అది చావకూడదని ఎందుక్కోరుకున్నాడు? దాన్ని కొట్టాల్సొచ్చినందుకు ఎందుకు సిగ్గుపడ్డాడు?

ఎవరికి వాళ్ళు చదివి తెల్సుకోవాల్సిందే. కతని స్థలకాలాతో కలపడానికి వర్తమానం తో కలిపాడుగానీ, అది నాకనవసరమబ్బా. అడవిలోకెళ్లి, అడవి లోంచి బయటకొచ్చిందాకే నా నవల. నా కొండపొలం.

**

You Might Also Like

One Comment

  1. Varaprasad.k

    మొదట్లో వేరే చోట సమీక్ష చదివి అతడు అడవిని జయించాడు నవలలా వుంది అనుకున్నా. అయితే వేరే వేరే కదంశాలు అని మీ సమీక్ష చదివాక తెలిసింది. బావుంది.

Leave a Reply