చారిత్రాత్మక కల్పన కాకర్త్య గుండన
వ్యాసకర్త: అనిల్ డ్యాని
తెలుగు నాట చరిత్రకు కొదవలేదు అలాగే చారిత్రక కల్పనకు కొదవలేదు. చరిత్రను వేదిక గా చేసుకుని ఎన్నో రచనలు వచ్చాయి, ఇంకా వస్తాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన నవలల పరంపరలో , ప్రముఖ ఆధ్యాత్మిక, నవలా రచయిత నేతి సూర్యనారాయణ శర్మ గారి నుంచి వెలువడిన నవల, కాకర్త్య గుండన. ఈ నవల ఒక విలక్షణమైన చారిత్రక కల్పన. మొదలు పెట్టిన దగ్గరనుంచి ముగింపు దాకా ఎన్నో మలుపులు తిరుగుతూ చివరకి ఊహించని విధంగా ముగించే ఈ కథ తెలుగు నవలా ప్రపంచంలో ఒక విన్నూత్నమైన శైలి ఉన్న రచనగా చెప్పుకోవచ్చు.
కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమదేవి తదనంతరం మొదలుతుంది ఈ కథ. రాజ్యంలో చక్రవర్తి కుమారుడు గాయపడడం, అతను మంచానికే పరిమితం కావడం తో ఈ కధ మొదలవుతుంది. రాజ్యాన్ని ఏలడానికి తరవాతి తరం కోసం ఎదురుచూసే క్రమంలో , రాజగురువు ఆ ప్రక్రియని కాలానికి వదిలిపెట్టమంటాడు. అలా కాలానికి వదిలేసి ఆ వచ్చే వీరుడు ఎవరై ఉంటారో అనే ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తూ ఉంటారు. చాలా గమ్మత్తుగా నడుస్తూ ఉంటుంది కథ. మధ్య మధ్యలో మనకి కధ నడక తెలుస్తూనే ఉన్నా.అందులో వచ్చే మలుపులని మాత్రం పాఠకుడు ఊహించలేడు.
నవల రాయడానికి కేవలం వస్తువులు పాత్రలు ఉంటే మాత్రమే సరిపోదు. దానిని ముందుకు నడపగల శైలీ నైపుణ్యం అవసరం. పైగా చారిత్రాత్మక నవల. ఆ కాలంనాటి సంగతులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉండాలి. ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల పట్ల అవగాహన ఉండాలి. ఎక్కడ ఏ చిన్న తేడా జరిగినా, ఇప్పుడు అసలే నిప్పులేకపోయినా అగ్గిరవ్వలు అంటుకునే కాలం కాబట్టి రచయితకు తానేం రాస్తున్నాననే స్పృహ అవసరం. వాస్తవానికి చారిత్రాత్మక కల్పనకు అవే మూల స్తంభాలు. ఈ నవలకూడా చాలా అంశాల్ని మనముందుకు తెస్తుంది.వజ్రాల వ్యాపారాన్ని, అందులో ఉండే మోసాలని అలాగే ఆనాటి ప్రజల అలవాట్లు , రాణీ వాసం ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ రాజుల సుఖ లాలస కోసం కట్టబడిన వేశ్య గృహాలు, అవి రాజుల కోసం ఎలా వాడబడేవి అనేటువంటి అనేకానేక విషయాలు ఈ నవల చర్చకు పెడుతుంది. చదువుతుంటే ఆనాటి పాత్రలన్నీ మన కళ్ళముందు నిలబడతాయి.
గుండన క్యారెక్టర్ ని మలచిన తీరు అబ్బురం అనిపిస్తుంది. జన్మతః వీరుడైనప్పటికి అతను చేసే ప్రతీపనీ ఎవరో ఒకరు ఆటంకం పరచడం అతను చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకొనివ్వకుండా కాలం అడ్డుపడుతుందా? శత్రు మూక అడ్డుపడుతుందా అనేది నవలలో చదివి తెల్సుకోవాలి. రాజ్యంలో ఉండే శత్రువులు, అలాగే బయట నుంచి వచ్చే శత్రువుల ను రాజ్యం ఎలా ఎదుర్కొన్నది.అందులో గుండన పాత్ర ఎంత అన్నది మాత్రం చాలా సస్పెన్స్ తో కూడి ఉన్న అంశం.
కాలం ఏదయినా, అందులో ఉండే ప్రేమ మాత్రం అజరామరమైనది గుండనకి ఒక అమర్త్యమైన ప్రేమ కథని అల్లారు శర్మ గారు.ఆ భాగం చదువుతున్నంత మేర మనం ఆ జంటని కళ్ళతోనే ఆశీర్వదిస్తాం. వాళ్ళకి ఎదురయ్యే అడ్డంకులు అన్ని అధిగమించి ఒక్కటవ్వాలని కోరుకుంటాం. అంత గొప్ప ప్రేమ కథని మనకి అందించారు శర్మ గారు.
కాకతీయుల కాలం నుంచి మొదలు పెట్టి విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూహూర్తం పెట్టె వరకు జరిగిన ఈ కథలో చాలా ఉప కథలూ ఉన్నాయి. కొన్ని నిజమేనా అనిపించే సంఘటనలు ఉన్నాయి. శత్రు రాజులు కోట ముందు మకాం వేసేదాక తెలుసుకోలేని చక్రవర్తి బేలతనము కనబడుతుంది. మహర్షుల వారు చెప్పిన కాలం కోసం ఎదురు చూడడం లేదా వీరుడికోసం వెతుక్కోవడం తోనే సరిపోతుంది. అతి తక్కువ కాల వ్యవధిలో రెండు సార్లు ముట్టడికి గురైన కోటను రక్షించే వీరుడి కోసం చేసే ప్రయత్నాలు ఒకటి రెండు చోట్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి.
కాకర్త్య గుండన నవల చదువుతున్నంత సేపు చందమామ కథలు జ్ఞప్తికి వస్తాయి. చాలా చోట్ల చెప్పబడే ఉపకథలు సందర్భం లేకుండా వస్తాయి. ఎక్కడో ఒకచోట చెప్పాలి కాబట్టి పురాణ పాత్రల నేపథ్యాన్ని రచయిత ఎంచుకున్నట్టు కనబడుతుంది. దాని వలన పాఠకులకు ఉపయోగం లేకపోగా, ఇదేదో మత పరమైన అంశాన్ని చెబుతున్నారు రచయిత అనే ఫీల్ లోకితీసుకువెళ్లే ప్రమాదం ఉంది. రచయిత ఇంతకు ముందు శంకరాచార్యల జీవిత చరిత్రను రాసిన అనుభవముంది. దానిలోనుంచి బయటకి వచ్చి మళ్ళీ ఇంకో చారిత్రాత్మక నవల రాయడం అనేది అంత తేలికైన విషయం ఏమి కాదు. మిమ్మల్ని నిరాశ పరచకుండా చదివించగలిగే శైలి శిల్పం ఉన్న పుస్తకం. ముగింపు పాఠకుడు కోరుకున్నది ఇవ్వడమా..? లేక రచయిత మనఃపూర్వక ముగింపు ఇవ్వడమా అన్నది పుస్తకం చదివిన తర్వాత మనకి చాలా సందిగ్ధత ఏర్పడుతుంది. మనమే కన్విన్స్ అయిపోతాం. ఎవరైనా ధైర్యం చేస్తే సినిమాగా తీయదగిన నవల. ఇది నదీ మాసపత్రిక నవలల పోటీలో బహుమతి పొందిన నవల. ఆ తదుపరి సాక్షి ఆదివారం అనుబంధం ” ఫన్ డే”లో ధారావాహికగా వచ్చి ముందే పాఠక ఆదరణ పొందిన నవల.
రచయితకు అభినందనలు. ప్రచురణ కర్తలకి ధన్యవాదాలు. పాఠకులకి వీలుగా అమెజాన్ లో కూడా లభ్యం. వెల: 250 రూపాయలు మాత్రమే.
అమెజాన్ లింక్ :
కాకర్త్య గుండన-చారిత్రక కల్పన – శంకరభారతి
[…] రచయితకు అభినందనలు. ప్రచురణ కర్తలకి ధన్యవాదాలు. పాఠకులకి వీలుగా అమెజాన్ లో కూడా లభ్యం. వెల: 250 రూపాయలు మాత్రమే.కొనుగోలు చేయడానికి… 9951748340 నెంబర్ పై ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. మీ చిరునామా పిన్ కోడ్ తో సహా వాట్సాప్ చేయండి. ఇతర సమాచారం కోసం ఇదే నెంబర్ పై వాట్సాప్ చేయవచ్చు.సౌజన్యంhttps://pustakam.net/?p=21827 […]
కాకర్త్య గుండన-చారిత్రక కల్పన – శంకరభారతి
[…] కాకర్త్య గుండ్యన అనుమకొండలోని రాజవంశీయులతో పెళ్ళిసంబంధ మేర్పరచుకుని, అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లోపలే మరణిస్తాడు. అతని కొడుకైన బేతరాజు అప్పటికి చాలా చిన్నవాడు, బాలుడు. మేనల్లుడు, బాలుడు అయిన బేతరాజును అతని మేనత్తయైన విరియాల కామమసాని (గుండ్యన చెల్లెలైన కుంతలదేవి), భర్తయైన ఎఱ్ఱనరేంద్రుని సహయంతో సంరక్షించి కాపాడుతుంది. బేతరాజు యుక్తవయస్కుడు కాగానే అతడిని రాజ్యాభిషిక్తుని చేస్తుంది. ఇది గూడూరు శాసనంలో చెప్పబడి ‘కాకతి నిల్పుట కోటి సేయదే’ అని కామమసాని రాజనీతిజ్ఞతకు ప్రశంసాపూర్వక కథనంగా లోకోక్తియై చరిత్రలో నిలిచింది.వెల : రూ. 250కొనుగోలు చేయడానికి… 9951748340 నెంబర్ పై ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. మీ చిరునామా పిన్ కోడ్ తో సహా వాట్సాప్ చేయండి. ఇతర సమాచారం కోసం ఇదే నెంబర్ పై వాట్సాప్ చేయవచ్చు.సౌజన్యంhttps://pustakam.net/?p=21827 […]