మనసు లోపించిన మనోధర్మపరాగం
వ్యాసకర్త: శంకగిరి నారాయణస్వామి (కొత్తపాళీ)
(ఈ వ్యాసం ఇటీవలే ఆంధ్రజ్యోతి “వివిధ” లో వచ్చిన వ్యాసానికి పూర్తి పాఠం. పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి అనుమతిచ్చిన కొత్తపాళీ గారికి ధన్యవాదాలు. – పుస్తకం.నెట్)
బి. తిరుపతిరావు గారు “చరిత్రలో చెదిరిన అస్తిత్వాలు చెప్పుకున్న స్వగతాలు” అనే శీర్షికతో మనోధర్మపరాగం నవలను గురించి రాసిన వ్యాసం ఆగస్టు 23న వివిధలో చదివాను.
చదివి చాలా ఆశ్చర్యానికీ, కొంత అయోమయానికీ గురయ్యాను. ఎందుకంటే అప్పటికే ఆ నవలను నేను ఒకటికి నాలుగు సార్లు చదివి ఉన్నాను. మిత్రులు శ్రీమతి దేవరకొండ అన్నపూర్ణతో కూలంకషంగా సవిమర్శకంగా రెండు లైవ్ కార్యక్రమాలలో చర్చించి ఉన్నాను. తిరుపతిరావు గారు తన వ్యాసంలో చెప్పుకొచ్చిన చాలా విషయాలు నాకు ఆ నవలలో కనబడలేదు.
“చారిత్రక నవలకు చరిత్రలో ఒక నిర్దిష్టకాలం భూమికగా వుంటుంది. రచయిత … ఆథెంటిక్ గా చిత్రించాలి. ఈ విషయంలో నరేంద్ర విజయవంతమయ్యారు. ఈ నవలకున్న epic లక్షణాల్ని ఎవ్వరయినా అంగీకరిస్తారు.” అని రాశారు తిరుపతిరావు, తన వ్యాసాన్ని ముక్తాయిస్తూ. వ్యాసంలో పలు చోట్ల నవల “ఆథెంటిక్”గా ఉంది అని కితాబిచ్చారు.
నాలుగు వందల పేజీలు సాగినంత మాత్రానా, దాదాపు నూట యాభయ్యేళ్ళ చరిత్రను చెబుతున్నట్టు కనిపించినంత మాత్రానా ఎపిక్ ఐపోదు. ముప్ఫై పాత్రలు వారి వారి గొంతులతో కథ చెప్పినట్టు రాయడం వల్ల ఆథెంటిక్ ఐపోదు. నవల మొదటి సగంలో కథ చెప్పిన 15 కంఠాలలో 12 దేవదాసి కుటుంబాలకి చెందిన స్త్రీలవి. ఇందులో ముగ్గురు చిన్న పిల్లలు (ధనకోటి తాయార్, కళారంజని, రూపరాణి). ఉన్న ఆధారం నిలకడగా లేని పరిస్థితిలో రేపు ఎలా గడుస్తుందా అని ఆరాటపడే స్త్రీలు నలుగురు. కాగా మిగతా ఐదుగురు స్థిరమైన జీవనం కలిగి ఉండడమే కాక సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉన్నవారు. వయసులోనూ, ఆర్ధికంగానూ, జీవన శైలిలోనూ ఇంత వైవిధ్యం ఉన్న పాత్రల కంఠాలు పలికినప్పుడు మరి ఎన్ని భిన్న స్వరాలు వినబడాలి అవి ఆథెంటిక్ అయితే? ఈ కంఠాలన్నిటిలోనూ పాఠకులకు వినబడేది ఒకటే అపస్వరం – మాకేమి దిక్కురో దేవుడో అన్నటువంటి ఒక ఏడుపు. నవలలో సగభాగం, నవల ముఖ్యాంశమైన సమూహానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అనేక పాత్రలు ఒకే గొంతుతో దీనంగా రోదించడం ఆథెంటిక్ కాదు.
“ఆ కాలంలో ఉన్న దేవదాసీ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని, ఇంగ్లీషు వాళ్ళు వచ్చి దేవదాసీల యినాం భూములు రద్దు చేయటం వల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులను, ఫలితంగా వాళ్ళు నమ్ముకున్న సంగీతం, నాట్యం మొదలైన వాటిలో వచ్చిన మార్పులను ఈ నవలలో నేపథ్యంగా రచయిత చెప్పుకుంటూ వచ్చాడు.” అని రాశారు తిరుపతిరావు, నవల ముఖ్యాంశాన్ని పరిచయం చేస్తూ.
ఈ అభినందనకు తగిన సమర్ధన నాకు నవలలో కనబడలేదు. ఎప్పుడో వందేళ్ళ కిందట మా ముత్తవ్వ అంత గొప్పగా నాట్యం చేసేదిట, ఇంకొకరి ముత్తవ్వ రాళ్ళు కరిగేలా వీణ వాయించేదిట అని చెప్పుకోవడమే తప్ప, అప్పటి ఉన్నతస్థితి నుండి ఇప్పటి దీనస్థితికి దిగజార్చిన పరిస్థితుల ప్రస్తావన కానీ ఆత్మపరిశీలన కానీ లేవు నవలలో, నవలను నడిపించిన పాత్రలలో. ఒక్కో అధ్యాయం మొదట్లోనూ రచయిత రాసినట్టుగా ఉన్న చిన్న పేరాలలో కట్టే-కొట్టే-తెచ్చే అన్నట్టుగా వికీపీడియాలో దొరికే హిస్టరీ ముక్కలు నాలుగేసి రాశారు. పోనీ అలా ప్రస్తావించిన విషయాలకి తరువాతి కథనంలో సంఘటనలకి లంకె ఏమన్నా ఉందా అంటే అదీ కనబడదు. ఈ.వీ. రామస్వామిని నెత్తికెత్తుకోవడమూ, కంచి పరమాచార్యని కించపరచడమూ వంటి అసందర్భాలు తప్ప.
“దేవదాసీలు ఎంతో సంస్కారవంతంగా గొప్ప అభిరుచితో జీవించారనే చారిత్రక వాస్తవాన్ని అత్యంత శక్తివంతంగా … చిత్రించాడు రచయిత. వాటి ఆత్మను, లైంగిక అభిరుచుల్ని, వాంఛల్ని హుందాగా ప్రకటింప జేశాడు.” అని రాశారు తిరుపతిరావు.
ఇది నాకు అస్సలు అర్ధంకాని సమర్ధన. దేవదాసీలు గొప్ప అభురుచితో సంస్కారవంతంగా జీవించారనేది ఎప్పటి ఎలాంటి చారిత్రక వాస్తవం? ఈ ప్రతిపాదన ఎన్నో రకాల అభ్యంతరాలకు చోటు చేస్తోంది, ఈ నవల విషయంలోనూ, ఇతరత్రానూ. అసలు సంస్కారం అంటే ఏవిటనే మౌలికమైన ప్రశ్న తలెత్తుతుంది. మొదట గమనించాల్సిన విషయం అందరు దేవదాసీ కుటుంబాలూ, అందరు దేవదాసీ స్త్రీలూ ఒకే విధంగా లేరు, ఒకే విధమైన స్థితిగతులు కలిగి లేరు, ఒకే విధమైన జీవనం గడపలేదు.
ఆ సంగతి నవలా రచయితే చెప్పారు, నవలకు ముందు మనవి మాటలో. “గొంతులు నొక్కి వేయ బడిన కొందర్ని గమనించినప్పుడు నాలో పెద్ద అలజడి రేగింది. నవలా రూపంలోనైనా వాళ్ళకు మాట్లాడే ఆ కనీసపు హక్కునివ్వడానికి నేనిక్కడ ప్రయత్నం చేశాను,” అని చెప్పుకున్నారు. అటువంటి స్పృహతో ఈ నవల రాయబడిందని స్వయంగా రచయితే ప్రకటించినప్పుడు, ఆ భావనకి విరుద్ధమైన తీర్మానం మరి తిరుపతిరావుకి ఎలా స్ఫురించిందో.
అదలా ఉండగా, నవలా రచయిత ఇలా ప్రకటించుకున్న ఉద్దేశం నవలలో ఫలించలేదనీ, ఫలించక పోవడమే కాక, ఈ నవలా కథనంలో దేవదాసీ సామాజిక చరిత్రకి అన్యాయం జరిగిందనీ నాకు బలంగా అనిపించింది నవల చదువుతుంటే. అన్యాయం జరిగిందన్న ఈ భావన వల్లనే నేను ఈ నవలను అన్నిసార్లు చదివి, లైవ్ కార్యక్రమంలో దాదాపు మూడు గంటల పాటు సవిమర్శకంగా చర్చించి, ఇప్పుడు ఈ వ్యాసం రాయడానికి కూడా సాహసిస్తున్నాను.
దేవదాసీ చరిత్రకి అన్యాయం
నవల మొదట్లోనే, దేవదాసీ వ్యవస్థను గురించిన తొలి పరిచయ వాక్యంలోనే ఎంతో వివక్షా పూరితమైన పదజాలంతో మొదలు పెట్టారు.
” … దేవదాసీ వ్యవస్థ 8వ శతాబ్దానికే చేదు పువ్వుల్ని పూసింది.”
ఏవిటా చేదు పువ్వులు? ఏ ప్రమాణం వల్ల అవి చేదు అని నిశ్చయించారు? ఇటువంటి వివక్షా పూర్వకమైన పరిచయం తరవాత వచ్చే కథనం దేవదాసి సమాజం పట్ల సానుభూతితో – కనీసం నిష్పక్షపాతంగా నయినా – నడుస్తుందని ఎలా ఆశిస్తాం? ఆ విధంగానే నవల ఆద్యంతమూ దేవదాసీల పట్ల వివక్షతోనే నడిచింది.
పోనీ చరిత్రని సమగ్రంగా చిత్రించారా అంటే, 8వ శతాబ్దినించి ఒక్క గంతులో నాయకరాజులు, మహారాష్ట్ర రాజుల దగ్గరికి దాదాపు వెయ్యేళ్ళని ఒక్క వాక్యంలో దాటేశారు. అక్కడి నించి తెల్ల దొరలు తమకు పన్నులు రావడం లేదని దేవదాసీల యినాం భూముల్ని రద్దు చేశారని, వ్యభిచారం తప్ప మరో మార్గం లేని బీదరికంతో వేగి పోయారనీ మరో వాక్యంతో దాదాపు రెండు వందల యేళ్ళ బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ ఘాతుకాలని దాటవేశారు.
అప్పటి చరిత్ర అంతా తవ్వుకోవడం ఈ నవల పరిధి కాదు, మన కథ 1889 లో నాగలక్ష్మి పుట్టుకతో మొదలైంది అని పాఠకులు సర్ది చెప్పుకున్నా, అక్కడే మొదలవుతున్నది నవలలో దేవదాసీ పాత్రలకూ, వారి కథనానికి సామూహికంగా జరిగిన అన్యాయం.
మొదటి అధ్యాయంలో నాగలక్ష్మి తల్లి అయిన కుముదవల్లి కంఠంతో మొదలు పెట్టి నవల మొదటి సగం అంతటా పరుచుకున్న పన్నెండుగురు దేవదాసీ స్త్రీల కంఠాలలోనూ ఒకటే మాదిరి దైన్యం, ఒకటే మాదిరి సందిగ్ధం. అప్పట్లో, అంటే తమకే గుర్తులేని తాతమ్మల కాలంలో తమ జీవితాలు బాగుండేవి. ఎంతో వైభోగంగా ఉండేవి. ఇప్పుడు బాలేవు. ఇదే గొడవ. పతనం జరిగింది నిజమే, కానీ అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే శోధన కానీ, ఆత్మ పరిశీలన కానీ మనకు కనబడవు. పెద్దగా చదువుకోక ఉన్నంతలో బతికీడుస్తున్న కుముదవల్లి, రంగనాయకి వంటి పాత్రల సంగతి సరే – కొంత వొప్పుకోవచ్చు. కళాశాలలో ఆధునిక విద్య చదువుకుని, ముత్తులక్ష్మీ రెడ్డికి అనుంగు సహచరిగా, ఆవిడ ఉద్యమంలో యోధురాలిగా పని చేస్తున్న మోహనాంబ మాటలోనూ తేడా ఏమీ లేదు (76వ పేజీ). స్వయంగా మంచి సంగీత విద్వాంసురాలై ఉండి, ఒక బ్రాహ్మణ సంగీత విద్వాంసుణ్ణి పెళ్ళి చేసుకుని భద్ర జీవితం గడుపుతున్న పెరియనాయకి మాటలోనూ (110వ పేజీ) తేడా ఏమీ లేదు.
దేవదాసీ కుటుంబాలలో పురుషులకి ఎటువంటి స్థానం లేకుండా పోయిందనీ, వాళ్ళు పక్కవాద్యంలో రాణించకపోతే తార్పుడుగాళ్ళుగా మాత్రమే బతికారన్నట్టు చిత్రించడం కూడా సరి కాదు. అనేక వాయిద్యాలలో మహా విద్వాంసులు ఎంతో మంది ఉండగా (ముఖ్యంగా సన్నాయి వారి సొత్తు), నాట్యంలోనూ ఎందరో గొప్ప నిష్ణాతులు, పండితులు, గురువులు ఉన్నారు. తంజై నలువర్ (చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలు) దగ్గర నించీ, ఇరవయ్యవ శతాబ్దపు గురువులు మీనాక్షీసుందరం పిళ్ళై, రాజరత్నం పిళ్ళై గార్ల వరకూ ఎందరో మహానుభావులు వారి శిష్యులచే పూజించబడ్డారు.
అంతకు మునుపటి పరిణామాల సంగతి ఏమైనా, బ్రిటీషు పాలన సమయంలో దేవదాసీ సామాజిక వర్గాన్ని సమూలంగా కుదిపి వేసిన సంఘటన మద్రాసు ప్రెసిడెన్సీలో 1930 ప్రాంతాల ముత్తులక్ష్మీ రెడ్డి ప్రవేశ పెట్టిన దేవదాసీ వ్యతిరేక బిల్లు. అప్పటికే ఇదొక “సంఘ సంస్కరణ ఉద్యమం” లాగా దక్షిణ భారత దేశంలో బాగా వ్యాప్తి చెంది ఉన్నది. ఐతే, దేవదాసీ పాత్రలకి స్వంతగొంతులో కథ చెప్పుకొనే అవకాశం ఇవ్వడానికి ఈ నవల రాశాను అని చెప్పుకున్న రచయిత, తన మాటగా ముత్తులక్ష్మీ రెడ్డి (70వ పేజీ) గురించి, ఆవిడ ఉద్యమంలా చేపట్టి నిర్వహించిన దేవదాసీ రద్దు చట్టం గురించి – అవి చాలా మంచి విషయాలన్నట్టు ఆరాధనా పూర్వకంగా రాయడాన్ని పాఠకులు ఎలా అర్ధం చేసుకోవాలి?
అకారణ బ్రాహ్మణ ద్వేషం
ఈ నవల చదివితే పాఠకులకి కలిగే ముఖ్యమైన భ్రమ – ఆ కాలంలో ఆ ప్రాంతాల్లో రెండే వర్గాల మనుషులు ఉండే వాళ్ళని – దేవదాసీ స్త్రీలు, బ్రాహ్మణ పురుషులు. దేవదాసీ స్త్రీలు యవ్వన వతులు, అందగత్తెలు, అమాయకులు. బ్రాహ్మణ పురుషులు వయసు పైబడినవారు, డబ్బూ అధికారమూ వారి సొత్తు, వీళ్ళు అమాయకులైన దేవదాసీ యువతులను exploit చేస్తూ ఉండేవాళ్ళు అని. నవల అంతటా ఈ భావనను బలపరిచే ఉదాహరణలు కోకొల్లలు. అటుపైన నాగలక్ష్మికి ఆశ్రయమిచ్చిన రాజకీయ నాయకుడు వరదాచారి పాత్ర చిత్రణలోనూ, నాగలక్ష్మిని పెళ్ళి చేసుకుని ఆమెని అందలమెక్కించడమే తన జీవితాశయంగా బతికిన విశ్వనాథన్ పాత్ర చిత్రణలోనూ ఎన్ని వెక్కిరింపులు, ఎన్ని innuendoలు.
అక్కడక్కడా బ్రాహ్మణ స్త్రీలు తారస పడినప్పుడు వారు దేవదాసీ స్త్రీల పట్ల ఏదో తెలియని అక్కసుతో ఉన్నారన్నట్టుగా చిత్రించడం పదే పదే కనిపిస్తుంది. చిన్నపిల్ల పొన్న గాయత్రి కథలో (6వ అధ్యాయం) వాళ్ళ నాయనమ్మ మాటల ద్వారానూ, పక్క వాద్యం అందించే హరిణీ ప్రియంవద (13వ అధ్యాయం), గాయని మంగతాయారు (18వ అధ్యాయం) కథనాల్లో ఈ అక్కసు ప్రస్ఫుటంగా కనబడుతున్నది. నాగలక్ష్మి విశ్వనాథన్ని పెళ్ళి చేసుకున్నాక రత్నమాల, అభిరామసుందరి, మధురిమ చెప్పే కథనాలలో ఈ అక్కసు విశ్వనాథన్ పాత్ర మీద కేంద్రీకరించ బడింది.
నిజమైన చరిత్రని పరిశీలిస్తే ఇటువంటి తీర్మానాలకు గాని, ఈ అక్కసుకి గానీ కారణం కనబడదు. దక్షిణ భారతం మొత్తమ్మీద ఎక్కడా బ్రాహ్మణులు అంత సామాజిక బలంతో, ఆర్ధిక మదంతో ఉన్న దాఖలాలు లేవు. అక్కడక్కడా కొందరు జమీందారులు, వకీళ్ళు లేదా పెద్ద ఉద్యోగస్తులు ఉండి ఉండవచ్చు కాని, మొత్తమ్మీద ధనం కానీ, అధికారం కానీ బ్రాహ్మణేతరుల వద్దనే ఉంటూ ఉన్నది. పోషకుణ్ణి వెతుక్కుంటున్న దేవదాసీ ఆ విధంగా బ్రాహ్మణేతరులను ఎంచుకోవడానికే ఆస్కారం ఎక్కువ. అదీ కాక, రెండు సామాజిక వర్గాల మధ్యన సంపర్కం దృష్ట్యా చూస్తే బ్రాహ్మణులు, అందునా ముఖ్యంగా బ్రాహ్మణ విద్వాంసులు దేవదాసీ కళాకారిణులకి ఎంతో సహాయం చేశారు. దోహదం చేశారు, చేయూతనిచ్చారు.
ఈ కథనంలో అసలైన చిక్కు, అసలు కర్నాటక సంగీతమంటే ఏవిటి, అది ఎవరికి ఎందుకు కావాలి అనే ప్రశ్న దగ్గర వస్తున్నది. నాగలక్ష్మికి మేనమామ భార్య అయిన మూగాంబిక నోట పలికించిన మాటలు (“బాగా తినీ తీరీ కూర్చునే జల్సారాయుళ్ళు యింకేమీ పనిలేకపోవటంతో తీరిక యెక్కువగా వుండటంతో యీ మాదిరిగా సంగీతం, నాట్యం అని కాలక్షేపం చేస్తా వుంటారు” – పేజీ 127) కర్నాటక సంగీతాన్ని ఏమాత్రం తెలిసిన పాఠకులకైనా తీవ్ర అభ్యంతరం కలుగజేస్తాయి. ఈ మాటలు కేవలం ఆ పాత్ర, ఆ సందర్భంలో అనుకున్న మాటలు మాత్రమే అని నియంత్రించుకోవడానికి వీలు లేకుండా, నవల పొడవునా దాదాపు ఇదే భావన పలు విధాలుగా కనిపించింది.
నవలకి అవసరం లేని కథనాలు (జ్ఞానేశ్వరీదేవి, సరళకుమారి), అసహజంగా చొప్పించిన పిట్టకథలూ (స్వలింగ సంపర్కం, పేజీ 322), మొదలు పెట్టిన భావన పూర్తిగా స్థిర పడకుండానే వెంటనే దానికి పూర్తి విరుద్ధ భావనను పాఠకులపై రుద్దే రసాభాస కథనం నవలలో అనేక మార్లు – ఇటువంటి లోపాలకి తోడు అతి పెద్ద లోపం – కర్నాటకసంగీతం గురించి గానీ, దేవదాసీ నృత్యం గురించి గానీ రచయితకి ఏమీ తెలియదు సరికదా, తెలుసుకోవడానికి కనీస ప్రయత్నం చేసినట్లు కూడా కనబడదు.
ఈ నవల చేజార్చుకున్న ఒక మంచి అవకాశంగా మిగిలిపోయింది.
Leave a Reply