భూమి పతనం: గూండ్ల వెంకట నారాయణ

“God is a solace, not the solution” (దైవం సాంత్వన మాత్రమే, పరిష్కారం కాదు) అని ప్రముఖ మరాఠీ రచయిత, స్కాలర్ శాంతా గోఖలే అన్నారు ఆవిడ రాసిన ఒక నాటకం గురించి మాట్లాడుతూ. ఆ నాటకంలో ఒక మానసిక రోగగ్రస్థుడు ఉంటే, అతణ్ణి ఏం చేయాలి, అతనితో ఎలా వ్యవహరించాలో తెలీని కుటుంబం భారాన్నంతా దేవుడి మీద వేసేస్తారు. ఆ ఘట్టం ప్రస్తావిస్తూ భారతీయ జీవన విధానంలో దైవాన్ని ఒక ఆధ్యాత్మిక చింతన కన్నా ఒక పరిష్కారంగా ఎలా చూస్తారో అన్నది వివరిస్తూ పై మాటలు అన్నారు. 

ప్రస్తుత కాలంలో భారతీయ వ్యవసాయ రంగం అస్తవ్యస్తమైపోయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుని, కుటుంబాలు చితికిపోయి, నగరాలకి కూలి పనులకి వలసపోయి, నానా బీభత్సంగా ఉంది పరిస్థితి. ఆ నేపథ్యంలో వచ్చిన కథలు, నవలలు చాలానే వచ్చాయి. వ్యవసాయ రంగం కష్టాలు పడుతున్న పాత్ర అనుకుంటే, మామూలుగా ఈ రచనల్లో నగరీకరణ (urbanization), పెట్టుబడిదారి వ్యవస్థ (captalism) antagonistగా ఉంటాయి. అందుకు విరుద్ధంగా గూండ్ల వెంకట నారాయణ రాసిన “భూమి పతనం”లో “దేవుని మీద భరోసా” అనేది ఆసక్తికరమైన స్థానాన్ని తీసుకుంది. ఈ నవలలో అది క్రైస్తవ మతంగా రూపు సంతరించుకుంది. (ఊర్లో చర్చిలు, ప్రార్థనలు ఎక్కువవడం, ప్రధాన పాత్రల్లో ఒకరు వ్యవసాయాన్ని వీడి మతప్రచారాన్ని వృత్తిగా చేపట్టడం వంటివి)  

“ఇందులో వ్యవసాయాన్ని నేపథ్యంగా తీసుకున్నా క్రైస్తవాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించాను. అలాగని ఆ మతాన్ని నేను దూషించదలచలేదు. దానిపై ఎలాంటి ద్వేషమూ నాకులేదు” అని రచయిత తన మాటగా పుస్తకం మొదట్లోనే చెప్పారు. “ఇక్కడి (అంటే భారతదేశం) పరాయీకరణలో భాగంగా నాకు మొదట క్రైస్తవం కనిపించింది.”  అని కూడా అన్నారు. నవల పూర్తి చేసిన నాకు మాత్రం, క్రైస్తవం మరో లక్షణమే (symptom)ఏ కానీ అసలు pattern “దేవుని మీద భరోసా” అనే అనిపించింది. 

ఉదాహరణకి, ఇందులో ఒక సన్నివేశం ఉంటుంది. కథంతా గుంటూరు దగ్గర్లో పల్లెటూరులో ఒక చిన్న సన్నకారు రైతు వ్యవసాయ కుటుంబం పడే పాట్లు, అగచాట్లు. కౌలుకి తీసుకున్న భూమి వేరొకరు తీసేసుకుంటే, వాళ్ళదే బీడు భూమిని చదును చేసి సాగు చేయాలనుకుంటారు. భార్యాభర్తలు, కాలేజికి వెళ్ళే వయసున్న కుర్రాడితో కలిసి ఒళ్ళు హూనమైయ్యేంత పని చేసి భూమిని బాగు చేసుకుంటారు. తర్వాత, అక్కడ నీటి బోరు వేయించాలి. దానికి డబ్బు ఉండదు కానీ, ఎలాగో అప్పు పుడుతుంది. రెండెకరాల భూమిలో ఎక్కడ వేయించాలో తెలీదు, ఎక్కడ వేస్తే నీళ్ళు పడతాయో తెలీదు. సిద్ధాంతులని అడిగి వేయించిన చోట ఇంతకు ముందు నీళ్ళు పడలేదు. మళ్ళీ వాళ్ళకి దక్షిణాలు గట్రా, అదో ఖర్చు. 

కొన్ని రోజులకి ఆ రైతుకి ఒక కల వస్తుంది. ఆ కలలో నల్ల బట్టలేసుకున్న ఒక చిన్నపిల్లాడు చేయిపట్టుకుని ఫలనా మూలకి తీసుకుని పోయి “ఇక్కడ వేయిస్తే నీళ్ళు పడతాయి” అని చెప్తాడు. మర్నాడు కొడుకుని వెంటేసుకుని తండ్రి ఆ జాగాకి వెళ్ళి అక్కడే బోరు వెయ్యాలని నిశ్చయిస్తాడు. బోరు వేస్తారు. నీళ్ళు పడతాయి. రైతు తాను నమ్ముకున్న అయ్యప్ప స్వామే వచ్చి దారి చూపించాడనుకుని దణ్ణం పెట్టుకుంటాడు. 

ఇప్పుడీ సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పక్క గ్రహాలకి వెళ్ళే శాస్త్ర విజ్ఞానం ఉన్న మనకు ఒక రైతుకి తన భూమిలో నీళ్ళు ఎక్కడ పడతాయో చెప్పలేని పరిస్థితి. అంతటి విజ్ఞానమే లేదా? ఉన్నా, అది సన్నకారు రైతులకి అందుబాటులో లేదా? అన్నది ఒకటి. అందుబాటులో లేదు కాబట్టే రైతులు అశాస్త్రీయ పద్ధతులు అవలంబిస్తున్నారు. పూజారులో, పాస్టర్లో చెప్పినవి నమ్మడం ఒక పద్ధతి. లేకపోతే ఈ నవలలో రైతుకి వచ్చినట్టు కలలు రావడం. వాటిని నమ్ముకోవడం అచ్చంగా పిచ్చేనా? నేలతోనూ, మట్టితోనూ మమేకమై పనిజేసే రైతుకి ప్రకృతి చెప్పే రహస్యమా? 

ప్రకృతిలో భాగమైన మానవుడు, ప్రకృతి vs పురుషుడు అన్న ద్వంద్వాన్ని సృష్టించినప్పుడే మొదలైన అనర్థం (దానిని ముద్దుగా development అని పిలుస్తుంటారు) ఇప్పుడు ఆఖరి దశకి చేరుకున్నట్టుంది. అందుకే అకాల వర్షాలు, కరువులు మామూలైపోయాయి. అవి ఎక్కువయ్యే కొద్దీ వ్యవసాయ సమస్యలు ఎక్కువైపోయి సమాధానాలు దొరక్క దేవుడే దిక్కై, ఆ దేవుడి పేరిట సొమ్ము చేసుకునేవారి పబ్బం గడుస్తుంది. అది ఈ నవలలో క్రైస్తవం కావచ్చు. మరెక్కడో ఇంకోటి అవ్వచ్చు. 

************

ప్రస్తుతం వస్తున్న తెలుగు సాహిత్యం (ముఖ్యంగా కథలు, కవితలు) నేను వీలైనంత మేరకు చదువుతుంటాను. వాటిల్లో, ముఖ్యంగా కథలతో నాకు ఒక సమస్య ఎదరవుతూ ఉంటుంది. ప్రముఖ పత్రికల్లోనూ, వెబ్ మాగజైన్లలో వచ్చిన ఈ కథలకి స్పందన కూడా విపరీతంగానే వస్తుంటుంది. కానీ కథ చదువుతున్నంత సేపు, చదివేశాక కూడా ఆ పాత్రలు ఏమిటో, వాటికలా ఒక దారుణంపై ఒక దారుణం అకారణంగా ఎందుకు జరగాలో అర్థంకాక గింజుకుంటూ ఉంటాను. రచయితలు చెప్పాలనుకున్న పాయింట్స్ కి mouthpieceలు గా తప్పించి ఆ పాత్రలకి ఒక స్వతంత్రత, ఒక ఉనికి ఉండవు. 

ఈ నవల కూడా ఆ భయంతోనే మొదలుపెట్టాను. కానీ ఒక పది పేజీలన్నా చదవకముందే ఆ ఇంటివాళ్ళు నాకు అచ్చమైన మనుషుల్లా కనిపించారు. వాళ్ళతో కాసేపు ఉండి, వాళ్ళు చెప్పే కబుర్లు వినాలని అనిపించింది. ముందుమాటలో అంపశయ్య నవీన్, “మొదటి నవల కాబట్టి అక్కడక్కడ కొంత అపరిపక్వత కనిపిస్తుంది. మొదటి ప్రయత్నం కాబట్టి ఆ మాత్రం అపరిపకత్వను అర్థం చేసుకోవచ్చు. ఇంకా తన శైలిని, సన్నివేశాల చిత్రణను, పాత్ర సృష్టిని నారాయణ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది.” అని అన్నారు. దానితో నేను విభేదిస్తాను. 

ఏ నవలకైనా ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి ఎంత మేరకు విస్తరించి ఉన్నదనేది ఆ రచయిత దృష్టికి (vision, ambition)కి తార్కాణమే కానీ, రచనా నైపుణ్యానికి కాదు. ఇదే ఊరిలో, ఈ కాలాన్నే తీసుకుని, గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో గత వందేళ్ళుగా వ్యవసాయ వృత్తి చుట్టూ వచ్చిన సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులని చర్చిస్తూ ఒక నాలుగొందల పేజీల నవల కూడా రాయచ్చు. అప్పుడది వేరే నవల అవుతుంది. ఈ నవల మాత్రం తీసుకున్నంత పరిధిలో చూపాల్సినవి, చర్చకు పెట్టాల్సినవి చాలా సమర్థవంతంగా చేస్తుంది. పాత్రల చిత్రణలో నాకేమీ అపరిపకత్వ కనిపించలేదు. సమాజం అనైతికం, అక్రమం అని ముద్ర వేసే పనులనీ ఏ మాత్రం sensationalize చేయకుండా అవసరమైనంత మేరకే రాశారు. 

రచయిత గ్రామీణ, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినందుకు, ఈ రచన బతుకులోంచి వచ్చిన నవల, అందుకని ఇందులో క్రాఫ్ట్, డిజైన్ లాంటి కృత్రిమత్వానికి అవసరం లేకుండా సరళంగా సాగిపోతుందని కొందరు విమర్శకులు అభిప్రాయపడచ్చు. కానీ సరళత్వంలో కూడా ఒక డిజైన్ ఉంది, అనుభవించిన బతుకుని పేజీపై పెట్టడంలోనూ క్రాఫ్ట్ పుష్కలంగా ఉందని నాకనిపించింది. అదే లేకపోతే, ఇద్దరు స్నేహితుల్లో మతాన్ని వ్యతిరేకించినవాడు పాస్టర్‍గా మారడం, ఎప్పుడూ బైబిల్ పట్టుకుని తిరిగేవాడు రైతుగా మారడం ఉండుండేవి కావు. అలాగే, మతప్రచారం చేసేవారి నైతికానైతికల గురించి కూడా అంత చిత్రీకరణ ఉండేది కాదు. 

నాకు ఈ నవల చదువుతున్నప్పుడు నేను మొన్నీ మధ్య చదివిన కన్నడ నవల “దీపవిరద దారియల్లి” గుర్తుకు వచ్చింది. (నా రివ్యూ ఇక్కడ) తీసుకున్న పరిమిత పరిధిలో కథని సమర్థవంతంగా నిర్వహించడం, మనుషుల అంతరంగాలని ఆవిష్కరించడం, సమాజం-పరిస్థితులు మనిషి బతుకుని ఎలా శాసిస్తాయో చూపెట్టడం అన్నీ ఒకేలా అనిపించాయి, తీసుకున్న కథాంశాలు చాలా వేరేవి అయినా. అయితే తెలుగు నవలలో మాత్రం చాలా వరకూ టైపోలు, పాత్రకి, కథా వాతావరణానికి సరిపడని భాష, inconsitencies (ఉదా: అతడు సుష్ఠిగా మద్యం తాగి శయనించాడు / ఇది లోలోపల అందరికి తెలిసిన విషయమైనా బాహ్యంగా ఎంతో రహస్యంతో కూడుకున్నది!), డైలాగుల్లో అటు యాస, ఇటు neutral toneగానీ consistentగా లేకపోవడం అనే సమస్యలున్నాయి. వాటిని వచ్చే ఎడిషన్‍లో సవరించగలిగితే బాగుంటుంది.   

“నదీ ప్రవాహంలాగా అది (పుస్తకం) మనుషుల చేతుల్లో ప్రవహిస్తూ వారి బుర్రల్లో నిలిచిపోవాలి. కడలిలో కలిసినట్టు. రచనలో అందుకు తగిన శక్తి ఉండాలి. ఈ రచనలో ఆ శక్తి లేకపోవచ్చు” అని అన్నారు రచయిత ముందుమాటలో. 

ప్రపంచ భాషల్లో ఏ సాహిత్యమైనా నాకు వచ్చిన భాషల్లో చదువుకుని మురిసిపోయే పాఠకురాలిగా నాకీ పుస్తకం మంచి అనుభవాన్ని మిగిల్చింది. ఒక ఉదృతిలో వచ్చి కుదిపి ఊపేసినంత కాకపోయినా, కాసేపే గట్టిగా కురిసే వానలా, ఒక నిట్టూర్పు విడిచి ఏమిటి,ఎందుకు అని ఆలోచనలకు తెరలేపింది. 

****************

 నేను చదువుతున్నది ఏ నవలైనా అందులో స్త్రీ పాత్రల చిత్రీకరణ పై ప్రత్యేక ధ్యాసపెట్టి, ఆలోచించి, ఏవన్నా నోట్స్ ఉంటే రాసుకోవాలని నిర్ణయించుకున్నాను, గత ఏడాది. ఈ నవలలో “నాగలక్ష్మి” పాత్ర నన్ను చాలా ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది. 

ప్రముఖ జర్నలిస్ట్ కోట నీలిమా రాసిన “Widows of Vidarbha” పుస్తకం చదివాకే నాకు భారతదేశంలో ఒక సన్నకారు రైతు పడే ఆవేదన ఏంటో అర్థమైంది. అప్పటి వరకూ మీడియాలో రైతుల ఆత్మహత్యల గురించి వినీ వినీ numb అయిపోయిన నాకు, ఆ జీవితాల గుండెచప్పుళ్ళని మళ్ళీ వినగలిగే శక్తిని ఇచ్చిందా పుస్తకం. అందులో భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నాక విధవలు అయిన వారి భార్యలు ఆ అప్పులెలా తీర్చారు, కుటుంబాన్ని ఎలా నెట్టుకొచ్చారు అన్నది ముఖ్యాంశం. అందుకే భూమిపతనం నవలలో సన్నకారు రైతుల కథ అని తెలియగానే ఆడ పాత్రల మీద ప్రత్యేక ధ్యాస పెట్టాను. 

నాగలక్ష్మి ఒక చిన్న రైతుకి భార్య. కౌలుకి చేస్తున్న భూమి వేరేవాళ్ళు లాగేసుకుంటే రోడ్డెక్కి దెబ్బలాటకి దిగుతుంది. తిట్టిపోస్తుంది. అవతలి వైపున్న వాడు ఆమెని కొట్టడానికి వస్తుంటే, అతని భార్య అడ్డుపడుతుంది, “సిగ్గులేకుండా ఆడదాని మీద చేయ్యెత్తుతావా?” అని. దానికి నాగలక్ష్మి భర్తకి ఇలా అనిపిస్తుంది: 

“కొండలకి కోపం వచ్చింది. ఆడది మొగోన్ని అదుపులో పెడితే తను మొగోడయ్యుండి పెళ్ళాన్ని అదుపు చేయలేక పోయినందుకు సిగ్గుచేటనిపించింది. చెప్పినా వినక పోవడంతో భార్యని ఒంగదీసి నాలుగు దెబ్బలు బాదాడు. జుట్టుపట్టుకుని నేల మీదకి ఈడ్చాడు.”

నాగలక్ష్మికి కొట్లాటకి వెళ్ళిందే తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి. కానీ తన ఇంటివాడే ఆమెపై చేయిచేసుకుంటాడు, అందరి ముందూ. పొలం పనులన్నీ ఒడుపుగా, చకచకాగా చేసేస్తుంది. కానీ ఎక్కడ సాగు చేయాలి, ఏ పంట వేయాలి అన్నవాటిలో ఆమె ప్రమేయం నడవదు. కూలీలు కొందరు కలిసొస్తారంటే ఆమె పని చేసేస్తుంది. కూలీలు పెట్టుకుని చేయించే పని అయితే ఆమే దగ్గరుండి చూసుకుంటుంది. ఇంత ధారపోసినా,  కథ చివరకి అన్యాయమైపోతుంది.

వ్యవసాయం గురించి జరిగే సంభాషణలు, తరతరాలుగా భూమిని ఎలా కాపాడుకోవాలనే చర్చలు తండ్రీ కొడుకుల మధ్య జరుగుతాయే గానీ, తల్లీ కూతుళ్ళ మధ్య జరగవు. కూతురూ మరో రైతుకి భార్య అయినా! భూమికి యజమాని రైతు. భార్యకి యజమాని భర్త. వానల్లేక భూమి బీడైపోతుంది, పంట పండదు. ఆడదాని మనసు, ఒళ్ళు బీడైపోతుంటే మాత్రం ఎవ్వరికీ తెలీను కూడా తెలీదు. 

కోట నీలిమా పుస్తకం subtitle “Making of Shadows”. రైతు కుటుంబాల్లో నీడల్లాంటి వారు ఆడవారు. వారి కథలు ఎప్పటికి వెలుగు చూసేనో! 


పుస్తకం వివరాలు:

భూమి పతనం: నవల
గూండ్ల వెంకట నారాయణ
పేజీలు: 179
వెల: 200

ప్రతులకి: Sri Sri vishweshwar rao 9490634849
అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు,

You Might Also Like

Leave a Reply