విశ్వనాథ అలభ్య సాహిత్యం: పిల్లల రామాయణము

వ్యాసకర్త: కౌటిల్య చౌదరి

ఈ దేశంలో రాముణ్ణీ, రామాయణాన్నీ అందరూ తమ సొంతమనే అనుకుంటారు… అందుకే కొలిచేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఎంత ఉన్నారో, తెగడేవాళ్ళు కూడా అంతగానే! నాలుగక్షరాలు రాయగల ప్రతి రచయితా, నాలుగు పద్యాలు చెప్పగల ప్రతి కవి, “రామాయణా”న్ని తన ఊహల్లో మలిచి, రాముడి కథని తన మాటల్లో చెబుదామనుకున్నవాళ్ళే! అందుకే దేశం మొత్తానికి ఎక్కడ వెతికినా వందల,వేల, లక్షల రామకథలు… “కట్టె, కొట్టె, తెచ్చె” అని మూడు ముక్కల్లో చెప్పినా, ఆరు కాండలతో ఇరవై వేల శ్లోకాలతో మలిచినా ఈ నేలకే చెల్లింది. మూలకథ ఒకటే!ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు సొంతం చేసుకుని సొబగులద్దుకున్నారు…. 

కవుల కలాల్లో ఎంతగా తీర్చిదిద్దబడ్డదో అంతగా జానపదుల గొంతుల్లో అన్ని సొబగులు పోయింది. వాల్మీకి కలం ఎంత అందంగా నడిచిందో, సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులవాడి గొంతూ అందంగానే పాడుతుంది. నాటక కర్తలు ఎంత అందంగా రామకథని ఆడించారో, అంత అందంగానే బొమ్మల కథల్లో రామాయణం ఒదిగింది. కాళిదాసు, భవభూతుల నుంచి తుఱకలైన కమన్ గార్ చిత్రకారుల దాకా! కొన్ని అందమైన ప్రక్షిప్తాలు, కొన్ని యథానువాదాలు; కొన్ని అందంగా ఎంచుకు మలిచిన కథలు, కొన్ని సంపూర్ణ రామాయణాలు! ఒక్కొకళ్ళదీ ఒక్కొక్క శైలి, ఒక్కో విధమైన రసపోషణ!

ఇక తెలుగువాడిదే అదృష్టం! మా జీ.వీ గారు అన్నట్టు, “ఎన్ని రామాయణ అనువాదాలు, గత వెయ్యేళ్ళలో వచ్చినా, ఏదీ మహాకావ్య స్థాయి అందుకోలేకపోయింది. యథానువాదాలూ, యథేచ్చానుసరణలూ తప్ప! కాని ఇన్ని వందలయేళ్ళు, తెలుగు నేలన భారత, భాగవతాలు నిత్యం చదివిన పుణ్యం వల్ల, ఆ స్థాయిలో, పదమూడువేల పద్య గద్యాలతో రామాయణ కల్పవృక్షం ఆవిర్భవించింది. ఈ మూడు మహాకావ్యాలూ ఉన్న నేల తెలుగునేల ఒక్కటే! అందరికీ ఏ ఒక్కటో దక్కింది. ఈ తెలుగు జీవుడి అదృష్టం, ఆ మహాకవులు దొరికారు!”

విశ్వనాథ అవతారికలో చెప్పుకున్నట్టు, మళ్ళా మళ్ళా ఎందుకూ రామాయణం అంటే, ఎవడి భక్తి రచనలు వాడివి, ఎవడి అనుభూతి వాడిది! కల్పవృక్ష మహాకావ్యం రాస్తున్నా, ఆ అనుభూతి, రామకథను గురించి నాటకాలూ, సాహితీ విమర్శలూ వ్రాయించింది, “నా రాముడు” లాంటి కావ్యాలూ వ్రాయించింది! ఆ సాగుబాటులో మొదలై, వెలుగు చూడక ఆగిపోయిన, విశ్వనాథ సాహితీ అనర్ఘ రత్నం, ఈ “పిల్లల రామాయణం”!

విశ్వనాథవారి అసంకలిత సాహిత్యం వెతుకులాటలో ఉన్నప్పుడు, మొట్టమొదట దీనిని గురించి తెలిసింది, వరంగల్లు, కాకతీయ విశ్వ విద్యాలయం – తెలుగు విభాగం వాళ్ళు 1977లో, విశ్వనాథ వాఙ్మయ జీవిత విశేష సంచికగా ముద్రించిన “విమర్శిని” పరిశోధన పత్రిక వలన! తరువాత మా జేవీగారిని అడిగా, ఆయన వద్ద కూడా పూర్తి పాఠం లేదు. వారసుల్ని కనుక్కున్నా దొరకలేదు. అప్పట్లో ఆ కలెక్షనంతా, వరంగల్లు “విశ్వనాథ భారతి” వాళ్ళ దగ్గరకు వెళ్ళిందని చెప్పారు. సంపత్కుమారగారు వెళ్ళిపోయాక, ఆయన లైబ్రరీ అంతా ఇంకో పెద్దమనిషి దగ్గరకు చేరిందని తెలిసి, ఆయన్ని వెతికిపట్టుకుని, విశ్వనాథవారు స్వదస్తూరీతో వ్రాసిన, “పిల్లల రామాయణం” కాపీ సంపాదించగలిగా… అది తెచ్చుకుని, నేను – మా జేవీగారు చదువుకుని ఎంత ఆనందపడ్డామో! పిల్లలమీద ఆయనకి ఉన్న ముద్దు, వాళ్ళకి కథ చెప్పాలన్న ఉబలాటం ఎంత బాగా కనిపిస్తాయో! ఆ రచన వివరాలు టూకీగా చెప్తా.

పాటిబండ్ల మాధవశర్మగారు, విజయవాడ నుంచి 1951లో “బాలప్రభ” అనే పిల్లల వారపత్రిక నడిపేవారు. ఆ పత్రికకోసం విశ్వనాథవారితో ఈ “పిల్లల రామాయణం” వ్రాయించుకున్నారు. దాదాపు ముప్పై సంచికల్లో వరుసగా ముద్రితమైంది. ఖచ్చితంగా ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఆగిపోయింది అన్న వివరాలు తెలియట్లేదు. దొరికిన కొన్ని ఆధారాల వల్ల, 1951 జూన్ ప్రాంతాల్లో మొదలై, 1952 మొదట నెల వరకు సాగి ఉండవచ్చు అనుకుంటున్నాను. ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్ లో దొరకలేదు. వేటపాలెం లైబ్రరీకూడా ప్రయత్నించాను, ఫలితం లేదు. కాని, మొత్తం వ్రాతప్రతి దొరికిన తర్వాత, పత్రిక వివరాలు నేను అంతగా పట్టించుకోలేదు. పత్రిక ఆగిపోవటం వల్లనో లేక వేరే ఏ కారణాలవల్లనో తెలీదు, ఈ రచన అసంపూర్ణంగా ఉండిపోయింది. తెలిసిన పండితుల్ని, కవుల్ని చాలా అర్థించాను, పూర్తి చెయ్యగలరా అని! కాని, ఎఱ్ఱన్నలా గట్టి గుండె ఉన్న మహానుభావుడు తారసపడలేదు. నా కోరిక అలానే మిగిలిపోయింది!

దొరికిన ప్రతి బాగా పరిశీలించినప్పుడు, విశ్వనాథవారు కల్పవృక్షంలానే, ఈ పిల్లల రామాయణానికి కూడా ఒక ప్రణాళిక సిధ్ధం చేసుకున్నారు అనిపిస్తుంది. దీనికి విశ్వనాథ, అత్యంత సరళంగా, రచనకి అనువుగా, గేయపధ్ధతిలో ఉండే మాత్రా ఛందస్సు “ముత్యాల సరం” ఎంచుకున్నారు (అన్నీ నాలుగు పాదాల పద్యాలు; పధ్నాలుగు మాత్రల పాదాలు మూడు, తొమ్మిది మాత్రల పాదం ఒకటి). ఒక్కొక్క కాండలో కథనీ, పన్నెండు ఖండాలుగా, ఒక్కొక్క ఖండంలో పధ్నాలుగు పద్యాలుగా ప్రణాళిక సంకల్పించినట్లు అనిపిస్తుంది. బాలకాండ(168 పద్యాలు), అయోధ్యకాండ (169 పద్యాలు) పూర్తయ్యి, అరణ్యకాండలో మొదటి ఖండంతో(14 పద్యాలు) ఈ రచన అసంపూర్ణంగా ముగుస్తుంది(మొత్తం 351 పద్యాలు). కల్పవృక్షంలా ఖండాలకి విడిగా పేరు పెట్టలేదు. కాని ఒక్కొక్క ఖండంలో కథాభాగాన్ని చక్కగా ఇమిడ్చారు. 

స్థూలంగా ఒక్కో ఖండంలో కథ ఇలా సాగుతుందిః

బాలకాండముః

1. రాక్షసులూ- రావణాసురుడూ, వారి దుండగాలూ

2.అయోధ్య, అందులో దశరథుడు, ఆయనకు రాముడు మొదలయిన నలుగురు కొడుకులు పుట్టుట…అందుకాయన యజ్ఞము చేయుట

3. రామలక్ష్మణుల భరత శత్రుఘ్నల బాల్యమున చదువు సంధ్యలు

4. విశ్వామిత్రుడు బ్రహ్మర్షియైన కధ; ఆయన రాముని చూడ వచ్చుట.

5. దశరథుడు విశ్వామిత్రుడడిగిన దిచ్చుటకు సిద్ధపడి రాముని నాకిమ్మనగా వెనుకాడుట, వశిష్టుడు చెప్పిన మీదట రామలక్ష్మణులను వాని వెంట పంపుట

6. విశ్వామిత్రుడు మంత్రములనుపదేశించుట;అస్త్రములిచ్చుట; తాటక వచ్చుట, దానిని రాముడు సంహరించుట

7. విశ్వామిత్రుని యజ్ఞమును పాడు చేయవచ్చిన మారీచ సుబాహులను రాముడు సంహరించుట, రామలక్ష్మణులను విశ్వామిత్రుడు మిధిలానగరమునకు తీసికొవి పోవుట 

8. అహల్యాశాప విమోచనము – మిధిలానగర ప్రవేశము

9. జనకునకు సీత లభించుట; సీత పెండ్లిని గూర్చి జనకుడు విచారించి శివుని విల్లు విరచిన వానికియ్య నిశ్చయించుకొనుట; రాజులు వచ్చి అశక్తులై పోవుట; రాముడు వచ్చుట

10. రాముడు శివుని విల్లును విశ్వామిత్రుని యాజ్ఞ మీద విఱచుట; జనకుడు తన కుమార్తెలను రామలక్ష్మణ భరత శతుఘ్నులకిచ్చుట

11. కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆవును దోలికొని పోవుట; పరశురాముడు వానిని సంహరించుట, వాని కొడుకులు దొంగచాటుగా జమదగ్నిని తలకోసి చంపుట; పరశురాముడు రాజులను ఇర్వదియొక్క మారులు ఏరి ఏరి చంపుట

12. పెండ్లివారు అయోధ్యకు పోవుచుండగా పరశురాముడు ఎదుర్కొనుట; రాముడు పరశురాముని చేతిలోని విష్ణువు ధనస్సును, అతని ఆత్మశక్తిని కలిపి లాగుకొనుట 

అయోధ్య కాండముః

1. దశరథునకు వచ్చిన మునిశాప కథ

2. శ్రీరామ పట్టాభిషేక ప్రయత్నము.

3. కైక వరములడుగుట

4. శ్రీరాముని వనగమనము

5. సీతారామలక్ష్మణులు, గుహుని – భరద్వాజుని మన్నన అంది చిత్రకూటము చేరుట

6. భరతుడు వచ్చి, దశరథుని మరణ విషయము, రామువి వనగమనము తెలిసి తనకు రాజ్యమక్కరలేదని చెప్పుట

7. భరతుడు చిత్రకూటమునకు ససైన్యముగా వచ్చుటను లక్ష్మణుడు చూచి చెప్పుట

8. పితృవాక్య పరిపాలనము ధర్మమని రాముడు భరతునకు చెప్పుట

9. చివరకు భరతుడు శ్రీరాముని పావుకోళ్లను తీసికొని సింహాసనము నందుంచి. అన్నగారికి బదులుగా రాజ్యపరిపాలన వ్యవహారము చూచుట కంగీకరించుట

10. లక్ష్మణుడు నిద్రాహారములు మాని సీతారాముల కంగరక్షకుడై వారిని సేవించుట; వారి అరణ్యవాసము సరదాగా గడచిపోవుచుండుట

11. కాకాసుర వృత్తాంతము

12. శ్రీరాముడు అత్రి ఆశ్రమమునకు చేరుట. అనసూయ సీతకు చీర పెట్టుట; సీతారామ లక్ష్మణులు దండ కారణ్యమునకు బయలుదేరుట

అరణ్యకాండముః

  1. విరాధుడు సీతను పట్టుకొని, రామలక్ష్మణులచేత చేతులు నరకబడి, పూడ్చి పెట్టబడుట.

ఇంతటితో రచన అసంపూర్ణంగా ముగుస్తుంది.

ఇక ఈ రచనలో నాకు గొప్పగా అనిపించిన కొన్ని విషయాలు చెప్తాను.

కావ్యం ఇలా మొదలవుతుంది.

“పొద్దు పొడిచిన క్రొత్త లోపల
పెద్ద కాలపు మొదటి నాళ్లుల
సుద్ది చెప్పెద మీరు విందురె
ముద్దు నాయనలూ!

ఇంత కోరలు బుర్ర మీసలు
చింత నిప్పుల వంటి కన్నులు
గంతు నిడి పై దూకి చంపెద
రంత రాక్షసులూ

చదువు కొను పిల్లలను బడిలో
వదలి పంతు లొకింత పోయిన
ఒదిగి యెచ్చట దాగి యుందురొ
యురికి కొని పోవన్‌.”

చదువుతుంటే, నేను నా బాల్యంలోకి పరుగెత్తి వెళ్ళినట్లు, మా పెద్దతాత ఒకళ్ళు మమ్మల్ని పిలిచి దగ్గర కూచోపెట్టుకుని, మేము అబ్బురపడేలా ఒక పెద్ద కథ చెప్పినట్టు అనిపిస్తుంది. ఆ మూడవ పద్యం చూడండి! పిల్లలలో ఉండే ఊహాశక్తి పరిధుల్లోకి వెళ్ళి, వాళ్ళ మనసుల్లోకి సునిశితంగా హత్తుకునేట్టు చెప్పగల నేర్పు చాలా కొద్దిమందికి సాధ్యమవుతుంది. అదీకాక, ఆ వయసులో వాళ్ళకి సుద్దులు చెప్పాలి. అందునా జీవితాంతం మరిచిపోకుండా పాటించేటంతగా, వాళ్ళ హృదయాల్ని తాకేలా చెప్పాలి. అదీ ఇక్కడి అల్లికలోని విశేషం!  

రావణుడూ, ఆ రాక్షసులూ, వాళ్ళు పెట్టే కష్టాలు చెప్పాక, ఒక ఆశ కల్పించాలి! అక్కడ నాయకుణ్ణి ప్రవేశ పెట్టాలి! వాడి పుట్టుపూర్వోత్తరాలకంటే ముందు, వాడి గొప్పలు చెప్పాలి. అప్పుడు, ఈ పసి మనసులు పడ్డ ఆదుర్తా తీరేది.

“ అట్టి కష్టము లన్ని బోవగ
పుట్టి నాడొక గొప్ప దొర! దొర
పుట్ట బట్టియె మీరు నేనును
బ్రదికి యున్నాము.”

అసలు ఆ దొర ఎక్కడ పుట్టాడో ఎలా చెప్పాలి? అక్కడెక్కడో అయోధ్య అంటే ఈ పిల్లసన్నాసులకి ఎట్టా తెలిసిద్దీ! వీళ్ళేమన్నా జాగ్రఫీలు చదూకున్నారా! కానీ, వాళ్ళ మనసుల్లో ఎగిరే వింతలోకాల ఊహలకి అందేలా చెప్పాలి!

“ తెలుగు దేశము మనది మన నే
లకును దూరపు టుత్తరాదిని
కలదయోథ్య యటన్న పేరున
పెద్ద పట్టణమూ.

చూడు మన బెజవాడ ప్రక్కన
కృష్ణ యున్నది, పెన్న యున్నది
మరల ఆ నెల్లూరు ప్రక్కన
పెద్దవగు నదులూ.

అల్ల రాజమహేంద్రవరమున
ప్రక్క గోదావరియు నున్నది
అట్లె యున్న దయోధ్య ప్రక్కన
సరయు వన్న నదీ”

ఇదీ శిల్పమంటే! నువ్వు ఉద్దేశించి చెప్తున్న పాఠకుడి ఊహలో నువ్వు ఇమడాలి. అప్పుడే రససిద్ధి! పిల్లల రామాయణం రచన మొత్తం ఇదే తరహాలో సాగుతుంది. తాతగారు రాత్రిపూట వెన్నెట్లో మంచవేసి పడుకోబెట్టి చెప్తూ “ఊ!” కొట్టించే కథలా! 

ఇలా చెప్పుకుంటూ పోతే వట్టి రచనా శిల్పానికే పెద్ద వ్యాసం అవుతుంది. మిగతా విషయాలు కొన్ని చెప్తాను.

రాముడిని, ఎంత చక్కగా వర్ణిస్తారో!

“రాముడనగా ఏమిటో మరి
తెలియదా? ఉప్పుమని ఊదిన
ఎంతమందైనను సరే రాక్షసు
లెగిరిపోవలయున్‌.

అసలు కోపము రాదు రామున
కాయనకు కోపమ్మె వచ్చిన
మూడు లోకమ్ములును ఛట్టున
బూడిదై పోవున్‌.

రాముడన నెటు వంటి వాడని
ప్రాణములలో నున్న దీపము
అతని పేరను కొన్నజాలును
భయము పరువెత్తున్‌

అసలు నీవే చూడుమీ యెపు
డైన నీవును భయము వేసిన
రామునిం దలచుకో భయమపు
డున్న నన్నడుగూ.

పచ్చ కప్పుర మింత కన్నుల
పెట్టుకో యెట్లుండు రాముని
గట్టిగా కనువిచ్చి చూచిన
అచ్చమటులుండున్‌.”

నాయకుణ్ణి, అందునా జగదధినాయకుణ్ణి, జాతి ఆదర్శమూర్తినీ, అతని గొప్ప లక్షణాల్ని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పే తీరు ఇదీ అనిపిస్తుంది!

“అబ్బో! ఋషికిని ఎన్నా ఎన్నో
కథలు వచ్చును దారి వెంబడి
వాని నన్నిటి నన్నదమ్ముల
నూరించి చెప్పెన్‌.”

కథ, పిల్లలు చెవులు దోరపెట్టుకుని వినేలా చెప్పాలీ అంటే, ఊరిస్తూ చెప్పాలి! ముఖ్యంగా అద్భుతం, కరుణ రసాల్ని సమపాళ్ళలో పోషించుకుంటూ రావాలి! భీభత్సానికి తావుండకూడదు. అలానే పొందిగ్గా, ఊరిస్తూ సాగుతుంది విశ్వనాథ కథనం!

“లక్ష్మణుండంతటను వందలు
బాణములతో నాకసంబున
పందిరిం గట్టె నొక నెత్తురు
చుక్క పడకుండా
రాము డొక బాణమ్ము వేసెను
మరి సుబాహుడు తగులంబడియెను
మంట తోనే యెగిరి పడె అ
వ్వాయి చువ్వవలెన్‌.
రేగి యింకొక యమ్మువిడె మా
రీచుపయి శ్రీరామచంద్రుడు
అంత, వాడేమయ్యెనో లే
దై పానవాలూ”

అవ్వాయిచువ్వ అనగానే మనసుకి ఎన్ని గిలిగింతలు పెట్టినట్లవుతుందో!

అహల్యఘట్టం కూడా అంతగానే ఆకట్టుకుంటుంది, అద్భుతరసంతో! కల్పవృక్షంలో అహల్యఖండంలానే సాగుతుంది కథ, కథనం!

“వట్టి కాళ్ళనె నడచుచుండెను
ప్రభువు శ్రీరఘురామచంద్రుడు
రాళ్ళు కాళ్ళకు దగిలి యెగురుచు
పగిలిపోవగనూ.

ఇంతలో నొక రాయి యెగిరిన
దెగిరి నట్లుగ నొక్క స్త్రీ యై
అట్టె చూచెడు రామచంద్రుని
యెట్టెదుట నిలిచెన్‌.”

ఇక అయోధ్యకాండ మొత్తం ముఖ్యంగా భరతుడి గురించే! భరతుడు, రామాయణంలో కష్టాలు పడటంలో రెండో రాముడు. ఎందుకో రామాయణంలో రాముడిని అనుసరించాలనుకోటమే కాని, ఎక్కువగా ఆలోచించను ఎప్పుడూ! నేను ఎక్కువగా తపన పడ్డది, పడేది భరతుడి గురించే! 

రాముడికి ఎన్ని కష్టాలొచ్చినా ఆయనపై నిందలు మోపినవాళ్ళూ, అకారణంగా ద్వేషించినవాళ్ళూ లేరనే అనుకోవచ్చు. కాని, భరతుడు మాత్రం తాను చెయ్యని తప్పుకి, అడుగడుగునా ద్వేషింపబడ్డాడు, శంకింపబడ్డాడు. ప్రజలు, మంత్రులు, భరద్వాజుడు, లక్ష్మణుడు సైతం శంకిస్తారు. రాముడు కూడా అంతగా స్వాగతించలేకపోతాడు. తన చుట్టూ బిగుసుకున్న రాజకీయ చట్రంలోంచి బైటకు రావాలనే తపన ఎంత కనిపిస్తుందో! ఆ తపన, ఘర్షణ ఇక్కడ పిల్లల రామాయణంలో కూడా చక్కగా చూపిస్తారు విశ్వనాథ!

రామాయణంలో కరుణరసం పొంగే ఘట్టాలు, పొంగించే పాత్రలు ఎన్ని ఉన్నా, భరతుడొక్కడే దానికి తారాస్థాయి అనిపిస్తుంటుంది. ఆ పాత్రలో ఉన్న కరుణరసాన్ని ఎక్కువగా అవగతం చేసుకున్నది, దాన్ని ఆలంబనగా చేసుకుని, ఇంకాస్త రసాన్ని పండించగలిగిన వాళ్ళల్లో భాసుడు ప్రథముడైతే, విశ్వనాథ తరువాత ఉంటాడేమో! దానికి ఆ మహాకవి సుతిమెత్తటి గుండెలోంచి పైకుబికిన ఈ నాలుగు మాటలు చిన్న నిదర్శనం….. మొదట్లో వచ్చే ఈ పద్యంలో, భరతుణ్ణి తప్ప మరెవరి గురించీ వర్ణన ఉండదు. మహాకవికీ భరతుడంటే అంత తపన, అక్కర!

“రాజు మూడవ భార్య కైకయి
భరతుడని యావిడ కుమారుడు
అతని గుండియ వెన్నపూసో
అచ్చావు నెయ్యో!”

ఇక భాష గురించి చెప్పుకుంటే, పూర్తి వ్యవహార శైలి! ఒక్క దీర్ఘసమాసం కూడా కనపడదు. వర్ణనలు చాలా తక్కువగా, అవసరమున్నంత వరకే! ఇక తెలుగుపలుకుబళ్ళు, జాతీయాలూ కొట్టి పోస్తారు, ఈ కావ్యం నిండా! అప్పుడే కదా, పసి గుండెలకి భాష కమ్మగా హత్తుకునేది! మచ్చుకు కొన్ని!

“అసలు దద్దమ్మైనగానీ
యల్లుడని యనుకొన్నం జాలును
ఇంతకింతగ పెరిగి చని కొ
మ్మెక్కి కూర్చుండున్‌. 
ఆడలే నమ్మయును మద్దెల
ఓడటన్న విధానం గొందరు
విల్లు కాదిది దొంగ వేషము
పెద్ద మ్రాననిరీ. 

“బంధువుల కందరకు పాపము
పైని ప్రాణాల్‌ పైన పోయెను
కత్తి వేసిన నొకని మొగమున
నెత్తురనిలేదూ.

ఎట్లు రాముని దాచవలెనో
ఎచట దాచగ వలెనొ తెలియక
యొక్కరొక్కరు విరిసి మడమలు
త్రొక్కుకొన్నారూ.”

“అందరకుం బెండ్లములు కావలె
అట్లె నాకును భార్య కావలె
అందులో తప్పేమియున్నది
అంతకోపపడన్‌.

పిట్ట కొంచెము కూంత ఘనమును
పట్టుకొన గుప్పిటికి రావును
అట్లె కానీ! యీ ధనుస్సును
ముట్టుకొమ్మనియెన్‌.”

“రాజు రాముండవునటంటకు
రాంజికొని మండినది మంధర
కల్లు త్రావిన కోతి నిప్పులు
త్రొక్కినట్లయ్యెన్‌.”

ఇంత చదివిన పిల్లలకి, భాష, భాషలోని హాయి, అందులో చమక్కులు, గిలిగింతలు పెట్టడాలు చక్కగా తెలుస్తాయి.

వట్టి కథ నడిపించకుండా, మధ్యమధ్యలో కొన్ని అవసరమైన విషయాలు, మన సంస్కృతి-వారసత్వం గురించి, సూచనా ప్రాయంగా కొన్నిచోట్ల, విపులంగా కొన్నిచోట్ల అలతి పదాలతో వివరిస్తారు.

“అగ్ని ప్రాణము, ప్రాణ మగ్నియు
అగ్నికిని పూజలను చేసిన
ప్రాణ ముండును చాల కాలము
బ్రదుకుదురు ప్రజలూ.
యజ్ఞమనగా మంత్రములతో
అగ్నితో హోమములు సేయుట
పూర్వ బుషు లందుకే బ్రదికిరి
వేలుగా ఏండ్లూ.

చివర్లో అరణ్యకాండ, విరాధవధ ఘట్టంలో, సీతను పట్టుకున్న విరాధుడు ఇట్లా అంటాడు.

“సీత నా పెండ్లామురా యిది
సీత బంగరు బొమ్మ యీయను
నీకు జోగికి పెండ్లమేమిటి
నేను కొనిపోదున్‌.”

ఇలా పిల్లలని, ఒక ఫ్యాంటసీ ప్రపంచంలో తిప్పుతుంది కావ్యం పూర్తిగా. ఇది పిల్లల పట్ల మహాకవికి ఉన్న ప్రేమనూ, వాత్సల్యాన్నీ పిల్లలను ఉద్దేశించి చేసే రచనపట్ల అభిలాషనూ ప్రకటిస్తూంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పద్యమూ అమృత గుళికే! కాని, కల్పవృక్షంలా ఈ కావ్యం సంపూర్ణం కాకపోవటం తెలుగునేల దురదృష్టం!

You Might Also Like

Leave a Reply