ఢావ్లో పుస్తకావిష్కరణ సభలో ఓల్గా గారి ప్రసంగం
(28th ఆగస్టు, 2021న రవీంద్ర భారతి, హైదరబాద్ లో జరిగిన ఢావ్లో పుస్తకావిష్కరణ సభలో ఓల్గా గారి ప్రసంగం ఇది. దీన్ని ప్రచురించడానికి అనుమతించిన ఓల్గా గారికి అనేకానేక ధన్యవాదాలు. – పుస్తకం.నెట్)
బల్దేర్ బండి రమేశ్ కార్తీక్ నాయక్ మనకిప్పుడు మరొక మాట నేర్పాడు – “ఢావ్లో”. తెలుగు భాషా సాహిత్యాలకు రమేష్ కార్తీక్ నాయక్‍ను స్వాగతించి అభినందించాలి. గోర్ బంజారా కథలతో తెలుగు కథా ఆవరణంలో మరొక జీవన ద్వారం తెరుచుకుంది. ప్రధాన స్రవంతి పాఠకులకు తెలియని జీవితమిది. బంజారాలంటే మన అందరికీ ఒకటి రెండు దృశ్యాలే కళ్ళముందు కనిపిస్తాయి. ఒకటి రెండు సంబరాలు మరొక మూడు నాలుగు కఠోర వాస్తవాలు వార్తాపత్రికల ద్వారానో బంజారాల గురించి వ్యాసాల ద్వారానో, ఒకటి రెండు పరిశోధనా గ్రంధాల ద్వారానో తెలిసే బంజారాల పరిమిత ప్రపంచం నుంచి రమేశ్ మనల్ని తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో పడేశాడు. దూరం నుండి టెలిస్కోప్‍లో చూడకండి, మైక్రోస్కోపులో చూపిస్తా రండి అని మనల్ని వారి ఇళ్ళల్లోకి, పశువుల కొట్టాల్లోకి, పొలాలలోకి, అడవులలోకి తీసుకెళ్తున్నాడు. అక్కడనుంచి పట్టణాలకు, పాఠశాలలకూ, విశ్వవిద్యాలయాలకూ వచ్చిన యువకులు పడే ఒక గందరగోళపు యతానమయ జీవితపు ముక్కలను మనకి దగ్గరగా తీసుకొచ్చి, కళ్ళముందు పెట్టి చూడమంటున్నాడు.
కష్టం రమేశ్ – నువ్వు చూపే జీవితాలు మాకు అర్థం కావటం కష్టం. మేమేదో భ్రమల్లో బతుకుతుంటే నువ్వు మమల్ని ఇంత సంక్లిష్ట ప్రపంచంలోకి ఒకసారి నెడితే తట్టుకోగలమా? సుక్రు, మంగ్లీ, సేపు, ధర్మి, దాది, ఝమ్లి, పిక్ణి, పుస్సా, సల్కా, వీరు, ఎంతమందిని పరిచయం చేశావో! ఎన్ని వస్తువులను కొత్త పేరుతో మాకు చూపించావో. ఆకలి, దరిద్రం, మరణం, ఇవి మాకు తెలియనవి కావు. కానీ బంజారాలకి వాటి అర్థ తాత్పర్యాలేమిటో నీ కథల ద్వారా మాకు తెలిసింది.
అభివృద్ధి పేరిట చుక్కల లోకానికి విహార యాత్రకు వెళ్తున్న అత్యంత్య నాగరిక ప్రపంచానికి, ఒక బర్రె ప్రసవానికీ, మరణానికి కలతపడి కన్నీరు కార్చే బంజారాలు ఎలా అర్థమవుతారు? బంజారాలకు ఈ నాగరిక ప్రపంచం ఎంత గందరగోళమో, ఆ నాగరిక ప్రపంచనికి బంజారాల జీవితమంత మార్మికం. మార్మిక వాస్తవికతతో తప్ప ఎట్లా చెప్పగలవు ఈ జీవితాలలోని అంతులేని, ఎడతెగని తారతమ్యాలను. అందుకే రెక్కల మనిషి వచ్చాడు. మార్క్వైజ్‍ని చదివిన బంజారా యువకుడికి ఈ ప్రపంచం, ఈ మనుషులు ఎలా కనపడతారు? ఎలా అర్థమవుతారు? ఎలా ఇమడగలుగుతారు ఈ జిత్తుల మారి, కపట నాటక ప్రపంచంలో? రమేశ్ రాసిన బంజారా కతలు అర్థం కావటం లేదనో, కథలలా లేవనో అనటం ఎంతో తేలిక. బంజారాలకు మన జీవితం, మన కథలు అర్థం కావటం అంతే కష్టమనీ, వారి దృష్టిలో మనది అయోమయ ప్రపంచంగానే ఉంటుందనీ అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. వాళ్ళు మనకు మనం అభివృద్ధి చేయాల్సిన నాగరికత నేర్పాలిసిన ట్రైబ్‍లు”గా తప్ప మరోలా కనబడతారా? కనిపించేలా చేయాలని ప్రయత్నిస్తున్నాడు రమేశ్. చూడండి. అర్థం చేసుకోండి. అభివృద్ధి పధకాల మాయపొరలనుంచి కాకుండా బంజారాల కళ్ళ నుండి, దృష్టి నుండి చూడండి. అప్పుడు బంజారాలకు, ప్రధాన స్రవంతికి మధ్య దూరం తరిగి సహకారం పెరుగుతుంది.
ఢావ్లో బంజారా ఉత్సవ సమయ వేదనా గీతం. ఉత్సవాన్నీ, వేదనను కలిపి చూడమంటున్నాడు. చూడటం నేర్చుకుందాం పట్టండి. రమేశ్ అందించిన జీవిత శకలాలనన్నింటినీ కలిపి కుడదాం. ఆ పనిలో కలిసి రమ్మని మనల్ని పిలుస్తున్నాడు. రమేశ్‍కు ఈ సమాజం పట్ల అసహనం ఉండడం సహజం. లేకపోతే అసహజం. రమేశ్ పట్ల మనకు సహనం లేకపోతే అది అన్యాయం. ఆ సామాజిక అన్యాఉఅం మన ప్రధాన స్రవంతి ప్రపంచానికి అలవాటైపోయింది. దానినుంచి బైటపడటం ఒక సవాలు. ఆ సవాలు రమేశ్ సాహిత్యం ద్వారానూ, వ్యక్తిగానూ మనకు విసురుతున్నాడు. ఎదుర్కుందాం రండి.
-ఓల్గా (28.08.2021)
Leave a Reply