అమ్యూలెట్

వ్యాసకర్త: దివ్యప్రతిమా కొల్లి

పది నిమిషాలలో మనల్ని వేరే లోకానికి తీసుకెళ్ళే (అరగంట లో చదవగలిగే) పుస్తక పరిచయం. 

చాలా సార్లు పుస్తక పరిచయాలు వ్రాయాలనుకున్నా. కానీ నచ్చిన పుస్తకాల పరిచయం కూడా ఆ పుస్తకాలంత గొప్పగా ఉండాలని, అలా వ్రాయలేనపుడు చదివి ఊరుకుందామనిపించి వ్రాయలేదు . ఈ మధ్య ‘రివ్యూలు వ్రాయండి’ అన్న పుస్తకం.నెట్ ఫేస్బుక్ మీమ్ చూసాను. ఈసారికి అలా నాకు నేను విధించుకున్న కట్టి పడేసే నియమాలను దాటి తప్పులున్నా పర్లేదని వ్రాస్తున్నా. 

అయితే నా ధైర్యం ఒక్కటే నా చేత ఈ రివ్యూ వ్రాయించట్లేదు, ఇది ఒక అరగంటలో చదువగలిగే పుస్తకమిచ్చిన ఉత్సాహం. 

మా అమ్మాయికి రెండేళ్ళున్నపుడు పీపో అని ఓ పుస్తకాన్ని ఆరు నెలల పాటూ రోజూ తనకు చదివి వినిపించేదాన్ని. మొదట రెండు రోజులు ఉత్సాహంగా చదివినా, తర్వాత  బొరుకొట్టే ఉద్యోగం చేస్తున్నట్టు చదివేదాన్ని. కానీ కొన్నాళ్ళకు అందులో గీసిన బొమ్మల్లో రోజుకో కొత్త విషయం కనిపించేది. అలా బొమ్మలు చదవడం నేర్చుకున్నా. అప్పుడప్పుడూ బొమ్మలు గీస్తుంటా కూడా. 

మా అమ్మాయి ఇప్పుడు బొమ్మల పుస్తకాలు చదవట్లేదు. నేను బొమ్మల మీద ఇష్టంతో చదివిన గ్రాఫిక్ నవలలు అంత గొప్పగా అనిపించలేదు. కానీ ఈ గ్రాఫిక్ నవల మాత్రం .. తాగిన అరగంట దాకా నాలుక పై ఉండే ఫిల్టర్ కాఫీ రుచిలా, చదివి నాలుగు రోజులయినా గుర్తొస్తూనే ఉంది. 

ఈ మధ్య ‘బుక్ షెల్ఫ్’ లైబ్రరీ నడుపుతున్న హరిప్రియ సూచించిన “అమ్యూలెట్’ సీరీస్ మా ఎనిమిదేళ్ల అమ్మాయి చదువుతుంటే తనతో చర్చించడం కోసం నేనూ చదివాను. ఒక్కో పుస్తకం చదవడానికి అరగంట చాలు. సీరీస్ లో ఇప్పటికి ఎనిమిది  పుస్తకాలే వచ్చాయి. తొమ్మిదవది ఎప్పుడొస్తుందా అని ఆ పుస్తక రచయిత, ‘కజు కీబూషీ’ ను పిల్లలు ఆరా తీయడం లాక్డౌన్ లో అతనితో హరిప్రియ నిర్వహించిన వెబ్ మీట్ లో విన్నాను. పాపం రచయిత కజూ, పిల్లలకు నవ్వుతూ వివరించాడు, చదవడానికి అరగంటే పట్టినా, దానిని తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందట.

ఈ పరిచయం చదివిన వారందరూ ఈ పుస్తకం చదవాలని కోరుకుంటున్నా గనుక కథను మరీ ఎక్కువ చెప్పలేను. పుస్తకం లో ఓ కుటుంబం – తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాక, తల్లి , తన ఇద్దరు పిల్లలు వారి తాతగారింటికి మకాం మారుస్తారు.  అక్కడ అనుకోకుండా మరో లోకంలోకి వీరు ప్రవేశించాక, వీరి భాధ్యతలు, సాహసాల గురించి కథ. నేను పది నిమిషాలు చదివినా, ఆ లోకంలోకి వెళ్లిపోయేదాన్ని. మళ్ళీ ఏదో పని గుర్తొచ్చి బయటకు వచ్చినా తిరిగి పుస్తకం తెరిచి ఒక లైను చదివితే చాలు, మళ్ళీ ఆ  లోకానికి వెళ్ళిపోయేదాన్ని. ఆ బొమ్మలు, వాటి రంగులు  భలే ఉన్నాయి. బొమ్మల రంగులు, కథ జరిగే ప్రదేశం బట్టీ మారడం భలే ఉంది. సినిమాలలో కూడా అలా కాంతులు, రంగులు మార్చలేరేమో! 

కథలో నాకు బాగా నచ్చిన పాత్ర – మిస్కిట్. లైబ్రరీ పుస్తకం తిరిగి ఇచ్చేయాలని గనుక, కథ మర్చిపోకుండా గుర్తుగా ఈ క్రింది బొమ్మలు గీసుకున్నా. ఆ కనుబొమ్మలు గాలిలో తేలుతున్నట్లు భలే ఉన్నాయి కదూ ! 

A drawing of a person

Description automatically generated with low confidence

నేను చాలా సార్లు కోడిగుడ్డుకు కూడా ఈకలు పీకడానికి ప్రయత్నిస్తుంటాను. మనుష్యులలో లాగా పుస్తకాలలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని నమ్మి బాగా నచ్చిన పుస్తకాలను కూడా విమర్శిస్తూ ఉంటా. కానీ పిల్లల పుస్తకం అవటం వలనో, ఆ బొమ్మలకు మైమరచిపోవటం వలనో, సై-ఫై పుస్తకం కనుక మరీ లిటరల్ గా అర్ధం చేసుకోకపోవటం వలనో ఇందులో నచ్చనివి గుర్తించ లేకపోయా. కనుక ఈసారికి మీరే వెతుక్కోండి. ఆ నిర్లక్ష్యానికి ఈసారికి ఆనందిస్తున్నా. 

అలా ఖర్చు లేకుండా కరోనా మర్చిపోయి వేరే లోకానికి ప్రయాణించడానికి నేడే చదవండి – “అమ్యూలెట్’.

You Might Also Like

Leave a Reply