పల్లె సంస్కృతిని ప్రతిబింబించే గూన ధార
వ్యాసకర్త: మహేష్ వేల్పుల
గూనధార ఆ పేరులోనే కొత్తదనం కనిపిస్తుంది, పల్లెదనం అగుపిస్తుంది, యువ కవి వేల్పుల రాజు గారు రచించిన ఈ కవితా సంపుటి మనసుని మరులుగొలుపుతుంది, వాక్యాలు వాటేసుకుంటాయి, సామాజిక స్పృహ కలిగిన రచయితలు తక్కువ మందే వుంటారు, అందులో మన కవి వేల్పుల రాజు గారు ముందు వరసలో నిలబడి తనదైన శైలిలో కవితలు వెలువరించిన తీరు అభినందనీయం.
గూనధార జలపాత బిందువులు పిల్లల అరచేతిలో వాలే నీటి పుష్పాలు
అన్నాడు వ్వా ఎంత మంచి ఊహ !! అలానే గూన పెంకులను కవచకుండలాలతో పోల్చిన తీరు వైవిధ్యంగా ఉంటుంది, పేదవాడి ఇల్లుకి గూన పెంకులేగా రక్షక కవచం.
పంట చెన్లో అభిమన్యుడు శీర్షికలో
ఆగమైన రైతు ఆకలకి
ఎండ్రిన్ గోళిలు ఆహారం కాబట్టే, పురుగుమందు డబ్బాలు
దూప తీర్చే చెలిమే నీరు కాబట్టే
ఈ వాక్యాలు రైతు వ్యధను ఎంతో దగ్గరనుండి చూస్తే గాని రాయలేరు, రెక్కలు ముక్కలుగా చేసుకొని ఆరుగాలం కష్టపడి కాంట పెడితే దళారులు కష్టాన్ని దోచుకునే ఈ కవితా చదివేటపుడు వాక్యాలు ఒక్కోటి దృశ్య రూపం దాల్చి మదిని స్రవింపజేసింది.
ఇక బీడీ కార్మికుల కష్టాలను, జీవన గాధలను కళ్లముందుంచాడు,
చేతులనే యంత్రాలుగా మలిచి నిరంతరం కష్ట పడ్డా కడుపులోకి మెతుకు సరిగ్గా దొరకట్లే అంటూ రాసిన తీరు బీడీ కార్మికుల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాడు.
తన సైకిలుతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒక్కో పదాన్ని సంధానం చేసిన విధానం ఆకట్టుకుంది, అప్పట్లో సైకిలును అంబులెన్స్ తో పోల్చడం అనేది కవి యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది, ఒకప్పుడు సామాన్యుడి జీవితంలో సైకిలే బెంజు కారుతో సమానం, ట్రింగ్ ట్రింగ్ మంటూ కాంచి, సీటు ఎక్కి తొక్కుడు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే బాల్యపు తీపి జ్ఞాపకం.
ఇక అమ్మ గురించి రాస్తూ
చెమట సుక్కలే శెలిమె నీరనుకుని, పచ్చి బాలింత అయినా
పనికిపోక తప్పని,
పాలియ్యాల్లకు పరుగునొచ్చి
ఈ వాక్యాలను ఎంతో ఆర్ద్రతతో రాసాడు కవి, అమ్మ ప్రేమను పొంది యాంత్రిక పోకడలో తల్లిని మరిచిన వారందరినీ ఆలోచింపజేసే రచన ఇది.
పల్లె జీవనంలో ఉట్టికి ముఖ్య స్తానం ఉంది, ఉట్టి జ్ఞాపకాలతో మనల్ని తట్టి లేపుతాడు కవి, మన ఇండ్లల్ల ఆహారపదార్థాలను దాచివుంచే ఫుడ్ బ్యాంక్ అది, దానిగురించి చదువుతుంటే చిన్నప్పుడు మా నాయనమ్మ ఉట్టిలో దాచి ఇచ్చిన జున్ను తిన్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మానవ మనుగడ చక్రం అనే శీర్షికలో ఓ ఆడపిల్ల కాల చక్రానికి మూలం
వారి ఋతుక్రమ చక్రం,
సృష్టిని సృష్టించే చర్య,
అది అతి పవిత్రం,
దానికెందుకు అంటగడుతుండ్రు మలినం
అంటూ కవి వర్ణించిన తీరు పాఠకులను ఆలోచింపజేస్తుంది ఆడపిల్లల మనోవేదనికి అక్షరరూపం దాల్చి చక్కగా రాసారు.
శ్రమ జీవుల గాధలను కన్నీరు తెప్పించేలా రాసారు.
పెట్టుబడిదారులకు అసలైన పెట్టుబడి కార్మికుల శ్రమ దోపిడీ
అంటూ రాసిన తీరు కవి కార్మికుల శ్రామికుల పక్షపాతి అని తెలియజేస్తుంది,
కార్మికుల బొక్కలలో కరిగిన కాల్షియం బహుళజాతి కంపెనీల గోడలకు సున్నం అన్నాడు, ఆ వాక్యం చూడండి ఎంత ఉద్వేగంతో రాసారో !! ఆ ఒక్క వాక్యం చాలు పెట్టుబడిదారులు శ్రామికులను ఎంత పెట్టుబడిగా వాడుతున్నారో తెలియజేయడానికి.
జీవంతో ప్రయాణం శవంతో గమ్యం ఈ శీర్షికని ఎంత బాధతో రాసాడో !! వలస కార్మికుల గోసలను కళ్లకుకట్టాడు, లాక్డౌన్ సమయంలో మూట ముల్లె సదురుకొని చంటి బిడ్డలను సంకనెత్తుకొని వందల మైళ్ల దూరం నడిచి నడిచి సొమ్మసిల్లి చివరికి శవాలు ఇండ్లకు చేరిన దృశ్యాలు ఎన్నో, ఆ గాధలను కవి సిరా చుక్కల్లో నింపి చదువరులను కంటతడి పెట్టిస్తాడు. పల్లె బిడ్డ కధ, ప్రకృతితో మమేకమైన బిడ్డ కధ సల్ల గట్క తాగి జీవాల వెంట తిరిగిన కాళ్ళు కధ, తన కంటికి కనిపించిన తనతో పెనవేసుకుపోయిన ఎన్నో దృశ్యాలకు అక్షరరూపం దాల్చి మనముందుకు ఇలా గూనధార రూపంలో అక్షరధారను ప్రవహింపజేశాడు, ఇంతటి చక్కని కవితా సంపుటిని అందరూ చదవాలి, ఆస్వాదించాలి, కవి వేల్పుల రాజు గారు ఇలాంటి ఎన్నో కవితా సంపుటీలు వెలువరించి సాహిత్య ప్రయాణంలో ఉన్నత శిఖరాలను చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
ప్రతులకు:
వేల్పుల కవిత
గ్రా: ముండ్రాయి
మండలం: నంగునూర్
జిల్లా: సిద్దిపేట
పిన్: 502375
9701933704.
Leave a Reply