శ్రీసుధ మోదుగు కథాసంపుటి – “రెక్కల పిల్ల”
వ్యాసకర్త: శ్రీనివాస్ బందా
(“రెక్కల పిల్ల” మంచి పుస్తకం వారి వెబ్సైటులో కొనుగోలుకి లభ్యం)
**********
రెక్కల పిల్ల ఏమిటి? రెక్కలొచ్చిన పిల్ల అనాలి – లేకపోతే రెక్కలు తొడిగిన పిల్ల అనాలి. కానీ, ‘మనసుకి రెక్కలతో పుట్టిన పిల్ల’ అని చెప్పాలని రచయిత్రి అనుకున్నారేమో బహుశా. శీర్షికని అలా విలక్షణంగా పెట్టడం వల్ల, రచయిత్రికి స్వతహాగా అబ్బిన భావుకత, కవిత్వ ధోరణీ స్పష్టం అవుతున్నాయి.
ప్రతివారికీ బాల్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోదగినంత మధురమైనవి కొందరివి కాగా, మర్చిపోవాలని ప్రయత్నించేవి మరికొందరివి. చాలామంది జ్ఞాపకాలకి అక్షరాల రూపాన్నివ్వగలరు. అయితే ఒక వయసుకి వచ్చాక, ఆలోచనా ధోరణిలోనూ మాటతీరులోనూ శాశ్వతమైన మార్పులు చోటుచేసుకున్న తర్వాత, ఊహ తెలిసీ తెలియని రోజుల్లో జరిగిన సంగతులని గుర్తుంచుకోవడం పెద్ద ఫీట్ అనుకొంటే, వాటిని ఆ పసితనపు అమాయకత్వం నిండిన గొంతుతో చెప్పగలగటం మరింత పెద్ద ఫీట్. ఈ కథల్లోని ఈ విశేషం నన్నూ బాగానే ఆకట్టుకొంది. ఈ కథల్లోని శైలి, లౌక్యపు ఛందస్సుల జోలికి పోలేదు. ఇవాళ్టి పరిణితిలోంచి అప్పటి అమాయకత్వాన్ని చూసి, ఆ సంఘటనలకి ఒకింత గాంభీర్యాన్ని అద్దేందుకు ప్రయత్నించలేదు.
ఈ కథల్లోని ఏడెనిమిదేళ్ల పిల్లకి ఉండాల్సినంత అమాయకత్వం, కుతూహలం, ఉత్సాహాలతోబాటు ఒక పాలు ఎక్కువగా తార్కిక దృష్టి కూడా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం – ఆ వయసులో అటువంటి లాజికల్ అవుట్‌లుక్ ఏర్పడడానికి మొదటి పునాది ఇంట్లోనే పడుతుందని. తల్లిదండ్రులిద్దరికీ మూఢ నమ్మకాలు లేకపోవడం, దయ్యాలూ బూచాడూ వంటి భయాలని పిల్లలకి నేర్పకపోవటం, పిల్లలు వేసే ప్రశ్నలకి లాజికల్‌గా జవాబులు చెప్పడాన్ని తమ బాధ్యతగా గుర్తించడం వంటివి జరిగినప్పుడే, తరచి చూసే, ప్రశ్నించే అలవాటు పిల్లలకి వస్తుందని నా నమ్మకం. ఈ కథల్లో పాప వేసే ప్రశ్నలన్నీ లాజికల్‌గానే ఉంటాయి. పాపకు వచ్చిన సందేహాల్లో “ముక్కులో ముల్లిరిగితే పిట్ట చచ్చిపోదా? పుట్టలో పోసిన పాలని పాము ఎలా తాగుతుంది?” వగైరాలు ఇందుకు ఉదాహరణలు.
ఇక లాజికల్ థింకింగ్ తర్వాత ముఖ్యంగా అలవడాల్సింది సాయపడే గుణం. అది పాపలో పుష్కలంగా ఉంది. తనవల్ల అవ్వ కాలికి తగిలిన దెబ్బకి ఆయింట్మెంట్ రాయడం, పుల్లతో తారుని తోడి కాలేషాకి సాయం చెయ్యడం, అప్పుడే పరిచయమైన స్నేహితురాలి తండ్రి పడిపోతే, ఆయనకోసం సోడా తీసుకెళ్లడానికి అతృత చూపడం వగైరా అనేక సంఘటనలని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆ సాయపడాలనుకోవటం మనుషులకే కాకుండా, పశువులకి కూడా అని అనేక కథల్లో చెప్పటం జరిగింది.
ఈ రెండిటి తర్వాతా చెప్పుకోవలసింది పాపలోని అమాయకత్వం. “నేనూ సారాయి తాగనా?” అని, “జైల్లో పెడితే ఏమవుద్ది? ఎందుకు ఏడవటం?” అనడం లాంటివి ఎన్నెన్నో. ఈ అమాయకత్వం, పాపని మనకి మరింత దగ్గర చేస్తుంది.
ఈ కథలన్నిట్లోనూ, తొణికిసలాడే బాల్యపు చిందులు కనపడటం ఒకెత్తు. వాటిలో అనేక జీవిత సత్యాలని పొదగటం మరో ఎత్తు. “కలిసి రానప్పుడే కలిసికట్టుగా ఉండి నెగ్గుకు రావాలని” ఒక కథలో చెప్తే, “అమ్మాయి పుట్టినా సంతోషించాల్సిన విషయమే” అని ఎంతో సటిల్‌గా చెప్పిన కథ మరొకటి.
కారామాష్టారుగారన్నట్లు, ఇవన్నీ పుట్టు కథలే. సందేహంలేదు. మొత్తానికి ఈ కథల్లో నచ్చే విషయాలే తప్ప, నచ్చని విషయాలేమీ కనపడలేదు నాకు.
**********
Leave a Reply