విశ్వనాథ అలభ్య సాహిత్యం: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర కల్యాణ మణిమంజరి

వ్యాసకర్త: కౌటిల్య చౌదరి

విశ్వనాథ సాహిత్యం, నా వద్ద ఉన్నవాటిని మళ్ళా మళ్ళా చదువుకుని ఆనందపడటం పాతికేళ్ళ వయసువరకూ ఉన్న అలవాటు… నవలలు, కథలు, నాటకాలు, విమర్శలు, కొన్ని కావ్యాలు… ఇలా నాన్న వద్ద ఉన్నవి చదవటం, మార్కెట్లో దొరికినవి కొనుక్కోటం! అలా సాగిపోతున్న రోజుల్లో వెబ్ పరిచయాలు, ఇంటర్నెట్లో విశ్వనాథ గురించిన చర్చలు, పెద్దవాళ్ళని కలవటాలు, వాళ్ళ ముఖతా విశ్వనాథ గురించి మరికాస్త తెలుసుకోవటం, ముఖ్యంగా అసంకలిత సాహిత్యం ఆరు భాగాలు… ఇవన్నీ విశ్వనాథ అలభ్య సాహిత్యాన్ని వెతకాలనే ఆరాటం బాగా పెంచాయి. అందుకు నాకు బాగా వెసులుబాటు ఇచ్చినవి: డిజిటల్ లైబ్రరీ(ఇప్పుడు మూతపడిందనుకోండి!),  ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్. అదొక వ్యసనంగా ఎన్ని రాత్రుళ్ళు నిద్ర లేకుండా వెతికి కొంత అరుదైన సాహిత్యాన్ని వెతికి పట్టుకుని భద్రపరిచేవాణ్ణి…. ఇదంతా పదిశాతం మాత్రమే! తర్వాత మా జె.వెంకటేశ్వరరావుగారి పరిచయం, పాతపుస్తకాలు వెతుక్కుని కొనుక్కోవడం, ఒక్కొక్క పుస్తకం కోసం నెలల కొద్ది తపనపడి, ప్రింటు పుస్తకం చేతిలోకి వచ్చినప్పుడు ఎగిరి గంతెయ్యడాలు…ఒక్కొక్క వెతుకులాట ఒక్కో కథ! అదో లోకం!!!

మా జేవీ గారు ఆయన జీవితం మొత్తం కష్టపడి సేకరించిన అరుదైన పుస్తకాలు, ముఖ్యంగా విశ్వనాథవి! అన్ని ఉన్నా ఇంకా సేకరించి భద్రపరచాలని ఆయన ఆరాటం! వివేకానందుల యతిగీతానికి విశ్వనాథ ఆశువుగా చేసిన అనువాదం, వెతికి పట్టుకుని, విశేషాలతో పాటు కలిపి ముద్రించి, వివేకానందుల ౧౫౦ వ జయంతికి పంచిన ఉత్సాహం మాస్టరుగారిది. తరువాత రోజుల్లో ఆరోగ్యం సహకరించక నన్ను పురమాయించేవాళ్ళు!!! అదేమిటో, ఆయన అన్నేళ్ళ తపస్సు ఫలితమా అన్నట్టు నాకు నెలరోజుల వెతుకులాటలోనే దొరికేవి…. అలాంటి వాటిలో ఒకటి ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం!!!

“డాక్టరు గారూ! పెద్దాయన రాసిన ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఉండాలండీ! విజయవాడ ఒక పెద్ద కోమటి సెట్టిగారు ఆయన కొడుకు పెళ్ళికి, పెద్దాయనతో పాటు, ఆరోజుల్లో పేరు పొందిన మరో పదకొండు మంది కవులతో రాయించి, చక్కటి ఖద్దరు బైండుతో వేసి, పెళ్ళికానుకగా పంచారు. అందులో పెద్దాయనది, స్ఫూర్తిశ్రీ భాస్కరరావు గారివి, ఇలా అందరు కవులవి మంచి ఫొటోలు తీయించి వేయించారు.. ఎవరికీ అమ్మలేదు కాబట్టి ఎక్కడా దొరకదు లైబ్రరీల్లో! పెద్దాయన ఇలా రాసినట్టు ఎవరికీ తెలీదు కూడాను. ఆ ఫొటోల కోసమన్నా నాకు కావాలి. మీరు వెతికి పెడుదురూ!” అని అడిగారు. ఇక వెతుకులాట! కొన్నాళ్ళకి మా గుంటూరు సంతలోనే అడిగిన వరమిచ్చినట్టు ప్రత్యక్షమయ్యింది. చక్కటి, ఎర్ర రంగు ఖద్దరు బైండింగుతో! కాస్త చిమ్మటలు కొట్టినా పుస్తకం ఏమాత్రం చెడలేదు. మాస్టరుగారికి తీసుకెళ్ళి చూపించినప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం ఇప్పటికీ గుర్తు! పెద్దాయన ఫొటోని అలానే చూస్తూ ఉండిపోయారు! కలర్ జిరాక్స్ చేయించి, లైబ్రరీలో ఎదురుగా పెట్టుకున్నారు…

స్తోత్రానికి పెద్దాయన రాసిన పద్యానువాదం విశ్లేషణ చేసే సాహసం చెయ్యను కానీ, ఆ పుస్తకం వివరాలు, విశేషాలు చెప్తాను. పుస్తక ముద్రణ పరంగా చూసుకున్నా, సాహిత్య పరంగా చూసుకున్నా, ఈ పుస్తకం ఆర్కైవ్ వాల్యూ చాలా గొప్పది.

మొదటిది చక్కటి ఖద్దరు బైండింగు, క్యాలికో… మంచి మందపాటి కాగితం. ప్రతి పేజీకి ఎరుపురంగు డిజైనుతో బోర్డరు. ఫొటోలన్నీ చక్కటి ఫొటో పేపరు మీద ముద్రించారు. అందుకనే అరవయ్యేళ్ళఅవుతున్నా చెక్కు చెదర్లేదు ఫొటోలు. కవులందర్నీ కూచొబెట్టి స్టూడియోలో తీయించారు. విశ్వనాథ హాఫ్ బూట్స్ లో మహా స్టైలిషుగా ఉన్నారులే! ప్రతి కవి అనువాదానికి మొదట వారి వారి ఫొటో! ఫొటోలు కాకుండా మొత్తం నూటా అరవైనాలుగు పేజీలు. మా అకాడమీ ప్రచురణలన్నీ ఇలా ఖద్దరు బైండింగుతోనే వెయ్యాలన్నది నా కోరిక, తీరట్లేదు… ప్రింటింగువాళ్ళు ఈ రోజుల్లో సెక్షను కుట్టుకే ఏడుస్తున్నారు!

ఈ పుస్తకం ముద్రణా కాలం, నవంబరు 1964. వెయ్యి ప్రతులు ముద్రించారు. ముద్రించినవారు, శ్రీ మనికొండ కాశీ విశ్వనాథం, రామా బైండింగ్ వర్క్సు, విజయవాడ వాళ్ళు… వారి రెండవ కుమారుడి పాణిగ్రహణ బహూకృతిగా “కరుణ శ్రీ” జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి సంపాదకత్వంలో ముద్రించి పంచారు… ఊరికే పెళ్ళిలో పంచటం కాకుండా గొప్పగా ఆవిష్కరణ సభ కూడా నిర్వహించారు. ఆ సభ వివరాలన్నీ పుస్తకం  చివర్లో పొందుపరిచారు.  ఇలాంటి పనులు చెయ్యాలంటే కోమట్లే చెయ్యాలి. సాహిత్యపోషణ చరిత్రలో వారిది ముఖ్య అధ్యాయం. 

పుస్తకం పై వేపు అట్ట లోపలి భాగంలో ద్వాదసశ జ్యోతిర్లింగ క్షేత్రాల మ్యాపు. తర్వాత శృంగేరి శంకరాచార్య, కంచి పరమాచార్య ఆశీస్సులు. మనికొండ వారి కుటుంబం ఫోటోలు, నూత్న దంపతుల ఫొటోలు. ఆదిశంకరుల ఫోటో!

రామభద్రేంద్ర స్వామివారి అనుజ్ఞ మేరకు ఈ పుస్తకాన్ని ముద్రిస్తున్నట్లు విజ్ఞప్తిలో చెప్తారు మనికొండవారు.  మహా మహోపాధ్యాయ జమ్మలమడక మాధవరామ శర్మ  “ శివదర్శనం” అన్న పేరుతో రాసిన పీఠిక అదనపు సొబగు ఈ పుస్తకానికి. వారిది, సభలో ఈ పద్యాలని గానం చేసిన మహతీ శంకర్ గారిది కూడా చక్కటి ఫొటోలు ఉన్నాయి. 

తర్వాత ఆదిశంకర విరచిత సంస్కృత స్తోత్రం, పేజీకి ఒక్కో శ్లోకం చొప్పున తాత్పర్యంతో పాటుగా! ప్రతి శ్లోకానికీ ఎదురు పేజీలో, వి. కామేశ్వరరావు అన్న ఆర్టిస్టుతో, ఒక్కో జ్యోతిర్లింగ క్షేత్రానిది చక్కటి బొమ్మలు గీయించి వేయించారు.

తర్వాత ఒక్కో కవిదీ విశ్వనాథతో మొదలుపెట్టి వరుసగా పద్యానువాదాలు. వాటి తర్వాత కవులందరి గురించీ నాలుగు పేజీల్లో సంక్షిప్త పరిచయాలు. ఆ పన్నెండు మంది కవులు వీరు!

౧. కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

౨. మద్వశ్రీ పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యులు

౩. శ్రీ దోమా వెంకటస్వామి గుప్త

౪. శ్రీ ముదిగొండ వీరభద్రమూర్తి

౫. శ్రీ వావిలాల సోమయాజులు

౬. స్ఫూర్తిశ్రీ టి. భాస్కరరావు

౭. శ్రీ అక్కిరాజు వేంకటేశ్వర శర్మ

౮. శ్రీ బొడ్డు బాపిరాజు

౯. శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ

౧౦. శ్రీ కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి

౧౧. శ్రీ పి. వేంకట గోపాలరావు

౧౨. శ్రీ ధనకుధరం వేంకటాచార్యులు

తర్వాత సంపాదకులు కరుణశ్రీ గారి అనువాదం కూడా! మొత్తం కలిపి మూలానికి పదమూడు అనువాదాలు.

 తరువాత ఆవిష్కరణ సభ వివరాలు. చివరిగా ప్రకాశకుల అభినందన పద్యాలతో పుస్తకం ముగుస్తుంది.

సభాప్రారంభం చేస్తూ కవిసమ్రాట్ విశ్వనాథ మాటలు ఇవి!

“ఈనాడు భారతదేశములో నాస్తికభావము పెరిగిపోయినది. దేవుడులేడను రోజులు వచ్చినవి. వేదాలు, దేవుడు లేడనే నేటి కాలములో శ్రీ మనికొండ విశ్వనాథము వైదిక ధర్మ ప్రచారము కోసము నడుము కట్టుకొనుట మిక్కిలి సంతోషకరమైన విషయము.” 

పుస్తకంలో ముఖ్యవిషయం చాలా గొప్ప ప్రయత్నం. విశ్వనాథ అసంకలిత సాహిత్యంలో కలికితురాయి. ఏది ఎలా ఉన్నా, నేను పైన చెప్పిన విశేషాలన్నీ కలుపుకుని, పుస్తక ముద్రణ సమగ్రంగా ఎలా ఉండాలి అన్న అంశంలో, ఈ పుస్తకానికి గొప్ప ఆర్కైవ్ వాల్యూ!!!

You Might Also Like

Leave a Reply