పాట్నా – ఒక ప్రేమ కథ

వ్యాసకర్త: CSB

(“Patna Blues” -Abdullah Khan తొలి నవలకి అరిపిరాల సత్యప్రసాద్ తెలుగు అనువాదం గురించిన పరిచయ వ్యాసం. పుస్తకం, అనువాదం రెండూ అమేజాన్ లో కొనుగోలుకి లభ్యం.)

*********

గత కొన్ని రోజులుగా ఇతను నన్ను వదలట్లేదు, నా ఆలోచనలు నుండి పోవట్లేదు. తాను కట్టుకున్న కలల కట్టడాలు కుప్ప కూలినందుకు ఎవరి మీద కోప్పడట్లేదు, కనీసం ప్రశ్నించట్లేదు. నిజానికి అతను ఒక కథలో క్యారక్టరే అయినా, అతని కథ కల్పితం కాదు. అది ఒక మధ్య తరగతి వాడి నిజ జీవితానికి నిదర్శనం!
ఒక మధ్య తరగతి వాడి జీవితం ఎలా వుంటుందో, అది ముస్లిం కోణం నుంచి చూపించే కథ ఇది. టైటిల్ చూసి ప్రేమ కథ అనగానే సంప్రదాయ పద్దతిలో వుండే కథ అనుకున్నా, కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా, వ్యతిరేకంగా వున్న కథ ఇది. ఒక ముస్లిం యువకుడి విషాద గాథ ఇది. ఒక మనిషి జీవితం రాజకీయ పరిణామాల వల్ల, సమాజ ధోరణి వల్ల ఎలా చిన్నాభిన్నమైందో చూపించే కథ ఇది. ‘జీవితం అంటే గెలుపు ఓటములు లేని యుద్ధమని, ఏం జరిగిన, అది ఎలా వున్నా… బ్రతకడమే ధ్యేయంగా ముందుకు సాగాలని చెప్పే కథ ఇది’. ఒక గొప్ప అనుభూతిని ఇచ్చే కథ ఇది.


ఇది ఒక ఫెయిల్యూర్ స్టోరీ. ‘గెలవడం ఎలానో తెలియాలంటే, విజయగాథలు చదవాలి. కానీ బ్రతకడం ఎలానో తెలియాలంటే ఓడిన వారి కథలే చదవాలి’. ఎందుకంటే వందకి మహా అయితే ఇద్దరో ముగ్గురో, తాము కన్న కలలు సాకారం చేసుకునే ప్రాసెస్లో విజయవంతులు అవుతారు. వాళ్ళ కథలే ఎప్పుడూ మనం వింటుంటాం, తిప్పి తిప్పి అవే చదువుతుంటాం. ఆ మిగిలిన తొంభై ఏడుగురి కథలు కాల గర్భాన కలిసిపోతాయి. వాళ్ళూ తమ కల కోసం పోరాడిన వాళ్ళే. వాళ్ళ జీవితంలో గెలుపు మాత్రమే లేదు. దాని వల్ల వాళ్ళు హీరోలు కాదంటే ఎలా? “రణరంగంలో పోరాడి ఓడినా వీరుడే అంటారు!” మరి అలాంటి వీరుల కథలు మనం ఎందుకు రాయం, చదవం?… అలా పోరాడి ఓడినా, బ్రతికి నిలబడిన వీరుడి కథే ఇది!

తండ్రి కలనే తన కలగా చేసుకుని, సివిల్స్ సాధించడమే తన ధ్యేయంగా పెట్టుకుని సాగుతున్న ఆరిఫ్ అనే ముస్లిం యువకుడు, ఒక పెళ్ళి అయిన హిందూ యువతితో ప్రేమలో పడటం, ఆ తరువాత అది అపరాధ భావనగా మారటం. తాను కన్న కలలు కలలగానే మిగిలిపోవడం, దాని మీద ఎవరిని నిందించకపోవడం. ఇలా చితికెక్కిన ఆశలతో చితికిన మనసుతో ఆరిఫ్ చేసే ప్రయాణం మన గుండెల్ని ఖచ్చితంగా మెలిపెడుతుంది, కన్నీరు పెట్టించేలా సాగుతుంది. 


మండల్ కమీషన్ నుండి మోడీ దాక ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఈ కథలో భాగమవ్వడం వల్ల ఒక వాస్తవికత భావన వస్తుంది. కథ అంతా పాట్నా చుట్టూ సాగడం, ఆ భావనకు మరింత బలాన్ని చేకుర్చింది. అలా సాగినా కూడా… ఎక్కడ కూడా ప్రాంతీయ వాదం దగ్గరే ఆగినట్టు అనిపించదు. దాన్ని దాటి పాఠకుడు, ఇది నా కథ అని ఓన్ చేస్కునేలా సాగుతుంది. కథ మధ్య మధ్యలో రచయిత ఉర్దూ గజల్స్(కవితలు), పాటలు వాడటం వల్ల కథనం మరింత బాగా సాగింది. 

అసలు రచయిత ఇంత బాగా సున్నితమైన విషయాల మీద మత రాజకీయలను, సమాజ ధోరణిని ఎండగడుతూ ఎలా ఇలా రాయగలిగాడా అని ఆశ్చర్యం వేసింది. కొంచెం సినిమాటిక్ గా అక్కడక్కడా అనిపించినా, అది పాఠకుడు అంగీకరించేలా వుండటంతో అది మనం పెద్దగా పట్టించుకోకుండా ఏకబిగిన చదువుతాం ఈ పుస్తకాన్ని. కొన్ని చిక్కు ముడులను రచయిత చివర్లో విప్పకుండా అలానే వదిలేయడం వల్ల, పాఠకుడిలో ప్రశ్నల ప్రవాహామే పుట్టుకొస్తుంది. కానీ అదే రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం కావడంతో, పాఠకుడ్ని ఆలోచింపజేయడంలో రచయిత సఫలమయ్యడనే చెప్పాలి. 

క్లైమాక్స్ చదివాక  కొద్దిగా ఆనందం కలిగిన, దాన్ని ఏదో తెలియని అసంతృప్తి అధిగమిస్తుంది. ఆ అసంతృప్తి మన నిత్య జీవితాన్ని ప్రతిబింబించడం వల్లే పుట్టుకొస్తుంది.

ఈ నవల మొత్తం చదివాక కూడా ఎక్కడా దీనికి అనువాద నవల అనే ఛాయ లేకుండా, అచ్చ తెలుగు నవల అనేలా దీన్ని తెలుగులో తీసుకోచ్చినందుకు ‘అరిపిరాల సత్యప్రసాద్’ గారిని ఖచ్చితంగా ప్రశంసించాలి. ఇంత మంచి నవల రాసిన ‘అబ్దుల్లా ఖాన్’ గారికి అభినందనలు. 

P.S:  సాధారణంగా నేను ఒక పుస్తకం చదివాక పక్కన పెట్టేయడమే తప్ప, ఇలా నా అభిప్రాయాన్ని రాయటం ఇదే మొదటిసారి… ఇప్పటికే ఈ పుస్తకాన్ని మూడుసార్లు చదివాను, ఎన్నిసార్లు చదివినా ఈ పుస్తకం ఇచ్చే గొప్ప అనుభూతిని మాటల్లో చెప్పలేం, రాతల్లో రాయలేం, అది అనుభవిస్తేనే అర్థమవుతుంది.

You Might Also Like

Leave a Reply