తిలక్ అమృతం కురిసిన రాత్రి – ఒక పరిచయం

రాసి పంపిన వారు: డా. వైదేహి శశిధర్

నా అభిప్రాయంలో మంచి కవిత్వానికి లిట్మస్ టెస్ట్- విశ్లేషణ తో సంబంధం లేని మన సహజ స్పందన.ఒక మంచి కవిత చదివాక మనం ఉత్తేజితులమవ్వాలి. ఆ కవిత పదే పదే స్ఫురణ కు రావాలి. అంతకుముందు లేని ఒక కలవరం అనుభవం లోకి రావాలి.ఇజాలకు, భావజాలానికి నిమిత్తం లేకుండా మనల్ని ఆ కవిత వెంటాడాలి.“అమృతం కురిసిన రాత్రి “ నన్ను అలా వెంటాడిన పుస్తకాలలో ముఖ్యమైనది.

అమృతం కురిసిన రాత్రి లో దాదాపు 90 దాకా కవితలు ఉన్నాయి.అందులో ఇరవై పైగా కవితలు చాలా మంచి కవితలు.ఇప్పటికీ నన్ను వెంటాడే కవితలు .

తిలక్ కవితల్లో నన్ను ఆకర్షించింది ఆయన భావుకత, తనదైన కవిత్వీకరణ, అద్భుతమైన ఔచిత్యం కల మెటఫర్లు ,అన్నిటినీ మించిన ఆర్ద్రత.ఆయన శైలిలో గొప్ప టెక్నిక్ స్ఫురింపజేయటం. తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఔచితి కల మెటఫర్ల ద్వారా సజెస్ట్ చేస్తూ,తన అనుభూతి ఆకారాన్ని పాఠకులకు హత్తుకునేటట్లు చేయటం.

“ఇప్పటికీ మధుమాసం లొ సహకార తరువుల క్రింద
పవ్వళించిన వేళ నా గళాన సౌందర్య మధూళి చిందుతుంది..
ఇప్పటికీ దిగులునీరు నిండిన కోటి మనస్సరస్తీరాల నా కవిత
కోరికల కోణాకారపు కొత్తచెట్లను నాటుతుంది “

(అదృష్టాధ్వగమనం)

“అన్నా! ఒక్క సమ్మెట పోటుకే ఉరలిన రక్తాన్ని తుడుచుకునే లోపలనే
చక్కని సన్నజాజి పందిరి క్రింద స్వాప్నిక సుర వధూటి నిలబడుతుంది
నవ్వుతూ పిలుస్తుంది వదనాన జారే స్వేదాంబుకణాన్ని
తన వలాహక చేలాంచలం తో తుడుస్తుంది..”

(చావులేని పాట)

తిలక్ కవితల్లో మరో విశిష్టత ఆయన సర్వస్వతంత్రత.అన్ని పవనాల్నీ ఆహ్వానించగల విశాలదృక్పధం.ఆయన ఏ ఇజానికీ,వాదానికీ,ఏ భావజాలానికి తన్ను తాను బంధించుకోలేదు.ఎప్పుడైతే కవి ఓ ఇజానికో,వాదానికో బద్ధుడవుతాడో అప్పుడు తనకు తాను నిర్దేశించుకున్న పరిధులకు లోనై తన కవిత్వపు విస్తృతిని, భావనా శక్తిని నియంత్రించుకోవటం జరుగుతుందని నా అభిప్రాయం.ఆయన కవిత్వం ఒక సైద్ధాంతిక నిబద్ధత లోంచి కాక ఒక సహజమైన,ఆర్ద్రమైన ,మానవీయ స్పందన లోంచి వచ్చినట్లనిపిస్తుంది.

“ఒక్క నిరుపేద ఉన్నంతవరకు
ఒక్క మలినాశ్రు బిందు వొరిగినంతవరకు
ఒక్క ప్రేగు ఆకలి కనలినంతవరకు
ఒక్క శుష్కస్తన్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పసిపాప ఉన్నంతవరకు
ఒక్క తల్లి నీరవాక్రోశరవమ్ము విన్నంతవరకు
నాకు శాంతి కలుగదింక నేస్తం ,నేను నిగర్వినైనాను.
ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను . “

(ఆర్తగీతం)

కవిత్వం కూడా జీవితం లాంటిదే.ఏదో ఒక కోణం లోంచి దర్శిస్తే జీవితానికి కానీ కవిత్వానికి కానీ పరిపూర్ణత లేదు.జీవితం లోని అన్ని కోణాలని కవిత్వం లో ప్రతిఫలిస్తూ అటువంటి పరిపూర్ణతను సాధించగలగటం బహుశా కవి అందుకోగలిగిన అత్యున్నత శిఖరం కావచ్చునేమో.తిలక్ జీవితంలోని,సమాజంలోని దాదాపు అన్ని కోణాలను స్పృశించారనే చెప్పాలి.యవ్వనాన్ని,ఉద్వేగాన్ని,మాధుర్యాన్ని,సౌందర్యాన్ని ఎంత అందంగా చిత్రీకరించారో అంతే గాఢంగా నైరాశ్యాన్ని,జీవనవైఫల్యాన్ని,వేదనను,భయాన్ని,తప్పించుకోలేని మరణాన్ని కూడా చిత్రీకరించారు.

“అన్నా! నేను నిర్మిచుకున్న ఆశా చంద్రశాలలో
కాలం కరిగి వెన్నెలయింది
నా భావం వీణా నిక్వాణమయింది
నా గీతం రటన్నటన్నూపుర నినాదమయింది
నేను యవ్వనాన్ని ఆనంద జీవన వనాన్ని.”
(చావులేనిపాట)

అని వ్రాస్తూనే,

“ఎన్నెన్ని అఖాతాలు ఎన్ని అడ్డంకులు
ఎన్ని వేదనా వాదనాయుతమైన విశ్వాసాలు
ఈ గుండెలో ఎన్ని గాయాలు!
అన్నా!
నేనొక జ్వాలా వలయితుణ్ణి,దుఃఖితుణ్ణి
నాలోపల నా బాధలు
నా వెలుపల క్షతజగత్తు ఆక్రోశించిన కరుణా భీభత్సరవాలు
నిరంతర పరిణామ పరిణాహ జగత్కటాహంలో
సలసలకాగే మానవాశ్రుజలాలు !”

(అదృష్టాధ్వగమనం)

అంటూ, మరో కోణాన్ని ఆవిష్కరిస్తారు.

ఈ సంకలనం లో “నువ్వు లేవు నీ పాట ఉంది “ కవితకు ఓ ప్రత్యేకత ఉంది. రెండున్నర పేజీల ఈ కవిత కేవలం రెండు మూడు వాక్యాలు మాత్రమే.ఈ కవిత ప్రియబాంధవి గతస్మృతుల తాలూకు దుఃఖావేశం తో సాగిన ప్రవాహంలా ఉంటుంది.

“నలుపుచారలు లేని తెల్లని సూర్యకాంతి పడిన పాలరాతి గచ్చులా ప్రతిఫలించి
నీ వొడిలో నా తల పెట్టుకుని అభ్యంగనావిష్కృత త్వదీయ వినీల శిరోజ తమస్సముద్రాలు పొంగి
నీ భుజాలు దాటి ,నా ముఖాన్ని కప్పి ఒక్కటే ఒక్క స్వప్నాన్ని కంటున్నవేళ
చంద్రికాస్నపిత సంగీతం వింటున్న వేళ …..”

(నువ్వు లేవు నీ పాట ఉంది)

ఇప్పటివరకూ నా అనుభవం లో,పద్యకవిత్వం ,చందోబధ్ధమైన కవిత్వం మినహాయించి,పుస్తకం చూడనవసరం లేకుండా కంఠవశమైన వచన కవితలు తిలక్ వి మాత్రమే.అంతేకాదు, గొంతెత్తి పాడుకున్న ప్రతిసారీ అమృతం కురిసినట్లే ఉంటుంది.ఒక గొప్ప ఆనందోద్వేగానికి లోనవుతూ ఎన్నోసార్లు ఆయన కవితలు చదువుకోవటం నా ప్రత్యక్ష అనుభవం.
***********************************
(2004 ఉత్తర అమెరికా సాహితీ సదస్సులో చేసిన ప్రసంగానికి సంక్షిప్త రూపం)

You Might Also Like

9 Comments

  1. M. V. Lakshmi

    వైదేహి గారూ
    జీవితం లోని అన్ని కోణాలనూ మానవీయ స్పందనతో స్పృశించి రచింప బడిన ‘అమృతం కురిసిన రాత్రి’ కవితలను గురించి రమణీయ మైన వ్యాఖ్య వ్రాసారు; చాలా బాగుంది. ఎప్పుడో టీనేజ్ లో చాలా సంవత్సరాల క్రితం ఈ పుస్తకాన్ని చదివినప్పుడు సరిగ్గా మీకు కలిగిన అనుభూతే నాకూ కలిగింది; తిలక్ గారు వాడిన పదాలూ, పద చిత్రాలూ , రూపకాలంకారాలూ (మెటఫర్లూ ) ఇప్పటికీ నన్ను వెంటాడు
    తూనే ఉంటాయి; నా కవిత్వ పఠనాసక్తిని పెం పొంది స్తూనే ఉంటాయి. వాటిని మరొక సారి చదివి ఆనందించడానికి ప్రేరేపించిన మీకు ధన్య వాదాలు.
    ఎం. వి. లక్ష్మి

  2. sri

    tilakgari kavithasaily chaala bagundi

  3. janaki ramana

    chaaaaaaaaaaalaaaaa bavundi

    1. janaki ramana

      you are right

  4. bvrk kumar

    its very nice
    thank you

  5. వైదేహి శశిధర్

    “అమృతం కురిసిన రాత్రి” మీద నేను వ్రాసిన పరిచయ వ్యాసం పై సహృదయతతో తమ అభిప్రాయాలు తెలిపి ప్రోత్సహించిన సతీష్,తమ్మినేని యదుకుల భూషణ్,యోగీశ్వరరావు గార్లకు నా కృతజ్ఞతలు.

    వైదేహి శశిధర్

  6. yogishwar rao k

    Simply superb.

  7. తమ్మినేని యదుకుల భూషణ్

    తమకు నచ్చినకవులగురించి కవులు రాయడం,మనం చదవడం
    చాలా హాయికలిగించే పనులివి;తిలక్ గురించి వైదేహి సారభూతమైన
    వాక్యాలతో క్లుప్తంగా రాశారు.కవిత్వం కంఠవశం కావలసిందే,ఆ
    తర్వాతే అది అర్థమవడం,కాంతులీనడం మొదలవుతుంది.
    కవయిత్రి ఇలా ఆకర్షణీయమైన గద్యరచనలు ఇంకా చేయాలని
    ఆశించే వారిలో నేనొకణ్ణి.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  8. సతీష్

    మంచి కవిత్వానికి మంచి పరిచయం…మీ పుణ్యమా అని మళ్ళీ ఒకసారి తిరగేసా!ధన్యవాదాలు

Leave a Reply