మనసూ-లోకం -విముక్తి

పరిచయం – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

పుస్తకం పేరు – కైవల్యం

కవయిత్రి – టి శ్రీవల్లీ రాధిక


image.png

భిన్న భావజాలాల వల్ల ప్రభావితమైన సమూహంలో ఒకరుగానూ, సమూహం నుంచి విడివడి భిన్న భావజాలాలను గమనించే వారిలో ఒకరుగానూ వ్రాసిన కవితలు శ్రీవల్లీ రాధిక గారివి. కైవల్యం పేరుతో అవి ప్రచురింపబడినాయి.

*

స్త్రీలకు ఇంటా బయటా ఉన్న సహజాత భయాలూ, సమాజం విధించిన ఆంక్షలూ వీటి నీడలు పడి స్వంత ఇల్లు కూడా ఎలా తన ఇల్లనుకోవాలో అన్న సందిగ్ధతను ఈ కవిత వివరంగా చెప్పి

“….

నన్ను నేను తెలుసుకునేంత జ్ఞానం 

నాకేనాడూ కలగకుండా పాటుపడతారు

నన్ను నేను మరిచేంత ఆనందం అసలెక్కడైనా ఉంటే 

నాదాకా రాకుండా కోట కడతారు

అయినా సరే, అంతకన్నా గొప్ప చోటు అవనిలో 

నాకెక్కడా దొరకదంటారు.”

అనే సత్యాన్ని వివరిస్తుంది.

లోతైన ఆలోచనను సాధారణమైన పదాలలో అందించే ఈ కవితలలో కొన్నిటిని జీవితగమనములో ఎత్తులు, లోతులను చూసినవారికి సులువుగానే అర్థమౌతాయి.

“మనసును తేలిక చేసేందుకు

మమకారపు బరువుతో దానిని నింపుతుంటాం. 

….

కాలిపోబోతున్న ఇంటినుంచి 

బయటపడే కంగారులోనూ 

కనిపించిన ప్రతీదాన్నీ మూటకడతాం.

కూడికలూ గుణకారాలూ మాత్రమే చేస్తూ 

నిశ్శేషాన్ని సాధించాలని ఆశపడతాం.”

కవితలోని ఈ వాక్యాలను పరిశీలిద్దాం. జీవితంలో పసివారి నుంచి ఎంత రాటుదేలినవారికైనా సరే మమత, ప్రేమ అన్నభావాలను పంచుకొనే మనుష్యులు వారి జీవితంలో ఉంటూ ఉంటారు. కష్టసుఖాల్లో పరస్పరం తోడుగా ఉండడం వల్ల మనసులోని భారాలు తొలగుతాయని, తేలికవుతాయని అనుకుంటుంటాము. కానీ నిజానికి మమకారాలు, ప్రేమలూ నిరంతరం మనం మోస్తున్న బరువులే. ఏ ఆనందం కోసం వాటిని మోస్తూ జీవిస్తారో, అవే బాధను,వియోగాన్ని, విరక్తిని కలిగించినపుడే ఎందుకీ భారాన్ని మోసుకుంటూ వచ్చామా అన్న మెలకువ కలుగుతుంది. 

దేహం ఎవరు, నేను ఎవరు అన్న జిజ్ఞాస కలిగి, దహనక్రియలో నశించనున్న దేహం నేను కాదన్న ప్రవచనాలు స్వయంగా  చెప్పగలిగే వారితో సహా మనుష్యులంతా బంధనాల మాయలో ఉంటారు. కాలిపోబోతున్న ఇంట్లోంచి బయటపడేవారు విలువైన వస్తువులో, డాక్యుమెంట్లో తీసుకొని బయటపడాలని అంత కంగారులోనూ ప్రయత్నించినట్లే’ దేహం నుంచి వేరైన నేను వీటిని ఆశించను ‘అన్న పక్వత రాకుండా ఏవో సాధించాలని ఏవో మూటలు కట్టే ప్రయత్నంలోనే ఉండేవారమే అందరమూ అన్న భావన. 

*

అటువంటి పరిస్థితిలోనూ ఈ బరువులను వదిలించుకోగలిగే సందర్భాలు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ అప్పుడు మనమేం చేస్తాం? వాటిని వదులుకోలేక విలపిస్తాం. పిల్లలు బొమ్మ విరిగిందని ఏడుస్తూ కూర్చున్నట్లే అచ్చంగా. ఆ యా సందర్భాలను విముక్తి కలిగిందని గుర్తించమంటూ ఈ కవితలో-

“మలినం లేని స్నేహం 

మహిలో దొరకకపోతే

నీది మహర్జాతకమని అర్థం.

నీ ప్రయత్నమేమీ లేకుండానే

సంకెలలన్నీ సడలిపోవడం

ఏ అదృశ్యహస్తమో నీకందిస్తున్న సాయం

మరణానికి ముందే మనుష్యులంతా 

నిను వదిలేయడం ఓ మహద్భాగ్యం.”

అంటూ ఇంకా అనేక ఉదాహరణలను చూపిస్తారు.

అంత మాత్రాన విరాగిగా , యోగిగా ఉండిపోవాలని కాదు. నిత్యమూ ఆ యా క్షణాలను/ ఉదయాలను, అది అందించే జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడమెలాగో పరోక్షంగా చెప్తూ అసలు ఆ జీవితానందాన్ని ఎవరూ గమనించడం లేదేమిటో అని చింతిస్తూ ఈ కవిత

“ప్రతి ఉదయపు వెలుగూ 

ఓ వార్తా పత్రికలా వాకిట్లోకి వస్తుంది.

చదవడం రాదని బాధపడేవాళ్ళూ

చదివే ఆసక్తి లేదనే వాళ్ళూ

ఎలా చదవాలో తెలియనివాళ్ళూ

ఏదో ఒక రకంగా చదివేసే వాళ్ళూ

అందరినీ అరమరికలు లేకుండా పలకరిస్తుంది.”

అంటూ పత్రికలోని ప్రతి విభాగాన్నీ ఎవరెలా చూస్తారో వదిలేస్తారో చెప్తున్నప్పుడు ఉదయపు వెలుగు గురించే కాక అది జీవితాన్ని గురించి చెప్తున్నదని గ్రహించవచ్చు.

“అన్నిటినో,కొన్నిటినో కోరుకునే వారూ

తలవంచుకుని వాటిల్లో కూరుకునే వారూ

అంతటా కనిపిస్తారు.

తాము ఆశించినదేదీ లేదని నిట్టూర్చేవారూ

ఉన్నవేవీ తమకవసరం లేదని విసిరేసేవారూ

అప్పుడప్పుడూ ఎదురవుతారు.”

అన్ని పంక్తులనూ పత్రికకూ, వెలుగుకూ, జీవితానికీ అన్వయించవచ్చు.  

ఇంకా సాధన, జిజ్ఞాస మొదలైన కొన్ని కవితలలో వస్తువు ఎవరికి వారికి అనుభవంలోనికి రావడం వల్లనే అందులో లోతు తెలుస్తుంది.  వాటి గురించి చదువరుల మధ్య చర్చ వల్ల ప్రయోజనం సాధింపబడదు. కాబట్టి వాటిని ఇక్కడ ప్రస్తావించలేదు.

అయితే ఒక కవితలో

 “తప్పుని కప్పి పుచ్చుకునేవారూ

తప్పుచేయక తప్పలేదనేవారూ

తప్పుని ఒప్పుగా చెప్పుకునేవారూ ఉంటారు కానీ

తప్పుని తప్పని గుర్తించని వారుంటారా?” అంటారు. 

ఉంటారు . ఎందుకు ఉండరు? అసలు ఆ వర్గమే ఎక్కువ అని నా అనుకోలు. పైనున్న వారంతా తప్పు చేసేవారే అయితే, తప్పు చేయని వారు కూడా ఉంటారు అనుకుంటే, ఈ రెండు వర్గాలూ తక్కువ శాతమే ఉంటారు. తప్పుని తప్పని గుర్తించని వారే అధికులు .

చింతనాయుతమైన ఈ కవితలను అప్పుడప్పుడూ చదవడం నాకు తృప్తినిస్తూ ఉంటుంది.

                                                       ———-

You Might Also Like

Leave a Reply