A Gentleman in Moscow

చదవక చదవక చదివిన పుస్తకం గురించి వ్రాయక వ్రాయక వ్రాసిన వ్యాసం

వ్యాసకర్త: Lalitha Guda

***********’

ఇతివృత్తం:

అది మాస్కో నగరం. అది తిరుగుబాటు జరుగుతున్నప్పటి కాలం. ఆ తిరుగుబాటు ఫలవంతమయ్యి ప్రభుత్వం, పరిపాలన మారడం, తద్వారా ప్రజల జీవితాలలో మార్పులు నేపథ్యంగా నడిచే కథ. కథలో ప్రధాన పాత్ర సంపన్న వర్గానికి చెందిన ఒక పెద్దమనిషి, “జెంటిల్మ్యాన్”. ఓడలు బండ్లు చేయబడుతున్న ఆ కాలంలో, సంపన్న వర్గానికి చెందిన వాడైన కారణంగా ఏదో నేరం మోపబడి అతను నగరంలోని ఒక ప్రధాన హోటల్‌లో, గృహ నిర్బంధంలో ఉంచబడతాడు.  ఒకప్పుడు సేవకులకై కేటాయించబడేవి ఐన ఇరుకు గదులలో ఒకదానిలో అతని నివాసం నిర్ణయించబడుతుంది. ఆ నిర్బంధం పరిమితులు ఏమంటే అతను ఆ హోటల్ దాటి బయటకు వెళ్ళ రాదు. అక్కడ ఉన్న సౌకర్యాలు వాడుకోగలడు కాని ఆ పరిసరాలు దాటి బయటకు వెళ్ళలేడు.

ఆ జెంటిల్మ్యాన్ అంతకు ముందు కొంత కాలంగా అదే హోటల్‌లో, భాగ్యవంతుల కోసం కేటాయించే గదులలో అతిథిగా ఉంటూ, అదే తన నివాసంగా గడుపుతూ ఉన్నవాడు. అందువల్ల అతనికి ఆ పరిసరాలు, అక్కడ పని చెసేవారూ కొందరు సుపరిచితులు. ఇక గృహనిర్బంధానికి గురి ఐన తర్వాత కొందరితో పరిచయం స్నేహంగా, కొత్తగా ఏర్పడిన కొన్ని పరిచియాలు ఆత్మీయ బంధాలుగా ఎదగడం వల్ల అతని జీవితం సంపన్నవంతం అవుతుంది. అతడి అంతస్తు తగ్గినా అతని హుందాతనం తగ్గకుండా, ఒకప్పుడు సంపన్నుడిగా ఉన్నప్పుడు ఏ సుగుణాలు, ఏ విద్యలు తనకి ఉపయోగపడ్డాయో, వాటి సహకారంతోనే తన తర్వాతి జీవితాన్నీ అతడు సార్థకం చేసుకుంటాడు.

పుస్తకం చదవడం – ఎందుకు, ఏమిటి, ఎలా:

నా స్నేహితురాళ్ళు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఈ పుస్తకం చదివి నాతో సహా మా బృందంలో మిగతా వారినీ చదవమని ప్రోత్సహిస్తూ వచ్చారు. వారు చదవడం, చదవమని చెప్పడం, నేను చదవడం మొదలు పెట్టడం అనే వాటి మధ్యే చాలా కాలం గడిచింది. నేను చదవడం మొదలు పెట్టి, ఆపేసి, పుస్తకం పక్కన పెట్టేసాక, మరి కొన్ని నెలలు గడిచాయి. క్రొత్త సంవత్సతరం మొదలయ్యాక, గడచిన సంవత్సరంలో ఏం చదివానా అని తరచి చూసుకుంటే దాదాపుగా ఏమీ చదవలేదని, అందునా మనసుకి నచ్చి చదివినవి ఏమీ లేవని, అర్థమయింది. కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను కానీ వాటిని పుస్తక పఠనంలోకి లెక్క కట్టలేను. వాటి గురించి ఇప్పట్లో ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోలేను. కాబట్టి పుస్తకం వారు, పదే పదే మీరు 2020లో ఏ పుస్తకాలు చదివారో వ్రాయండి అని ఉత్సాహపరుస్తుంటే నా దగ్గర వ్రాయడానికి ఏమీ లేవే అని విచారపడ్డాను.

స్నేహితులతో ఆ మాట, ఈ మాట మాట్లాడుకుంటూ పుస్తకాల ప్రస్తావన వచ్చి మళ్ళీ నా స్నేహితురాలు నాకు ఈ పుస్తకం సూచించడం జరిగింది. దాంతో రెండో సారి పుస్తకం చదవడం మొదలు పెట్టాను. అప్పుడు అనుమానం వచ్చి అడిగాను నా స్నేహితురాళ్ళని, వాళ్ళకి ఈ పుస్తకం ఎందుకు నచ్చిందో చెప్పమని. వారి సమాధానాలు విని నాకు కుతూహలం పెరిగింది. నేను అంతవరకూ చదివిన దాంట్లో నాకు అదేదో రష్యాలో మార్పుల గురించి, పరిపాలించే వారు మారినా, తరగతులు తల్ల క్రిందులైనాయే తప్ప తారతమ్యాలు లేకుండా పోలేదనీ ఏదో భాష్యం చెప్తున్నట్టు అనిపించింది. అందువల్ల పెద్దగా చదవ బుద్ధి కాలేదు, కొత్తగా తెలిసేదేం లేదనిపించింది. కానీ మా స్నేహితురాళ్ళకి కనిపించిన కథ వేరేది అనిపించి, అదేంటో తెలుసుకోవాలనిపించింది. చదువుతూ కొంచెం ముందుకి వెళ్ళాక ఒక కథ ఏర్పడడం, అందులో ఒక అల్లిక కనిపించడం, మొదలు పెట్టింది. అప్పుడు ఆసక్తి పెరిగి మళ్ళీ మొదటినుంచి చదవడం మొదలు పెట్టాను. ఐతే ఈ సారి కాస్త వివరాలు గమనించుకుంటూ, కొన్ని ఒక నోటుపుస్తకంలో వ్రాసుకుంటూ చదివాను. అప్పుడు నాకు కాస్త కథ మీద, అందులో అందిస్తున్న వివరాలనుండి సంకేతాలు తీసుకుంటూ వెళ్తే, ట్రెజర్ హంట్ లాగా సాగుతున్న కథనం మీద , పట్టు దొరికింది. ఇక ఆ పైన చదవడం సులభమైంది, ఇష్టమైంది. అంతే, కథని చదవడం పూర్తి చేసి కంచికి పంపించాను.

కథా కాలంలో నడుస్తున్న చరిత్ర, దాని మీద వ్యాఖ్యానం, పుస్తకం పొడుగునా వినిపిస్తూనే ఉంటుంది. దానిని మించి, ప్రధాన పాత్ర, అతని జీవిత కథ, అతనితో స్నేహానుబంధాలు పెంచుకుంటున్న పాత్రలు పాఠకుడిని ఆకట్టుకుంటాయి. పాఠకుడికి, కథ చదువుతున్నప్పుడు, ఏదో నిధి కోసం వెతుకుతూ దారిలో రహస్యాలు తెలుసుకుంటూ, విజయాన్ని సాధించినట్టు ఉంటుంది.  ముగింపు కొంత నాటకీయంగా ఉన్నా రక్తి కట్టించేదిగా, బంధ విమోచనం చేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న అంభవం కలిగించేదిగా ఉంటుంది. ఉక్కిరి బిక్కిరి చేసే వివరాలు ఉన్నా ఆ వివరాలన్నింటికీ విలువ ఉంది. అందువల్ల ఈ పుస్తకం ఒకటికి రెండు సార్లు చదవ వలసి రావచ్చు. అందువల్లే ఈ పుస్తకాన్ని మరి కొన్ని సార్లు చదవాలి అనిపించవచ్చు. వ్యక్తులలోని మంచితనాన్ని, వ్యవస్థలలో ఉండే అధికార తత్వాన్ని, అందువల్ల కలిగే అనర్థాలని కథ పొడుగునా స్పృశిస్తూ, దేనినీ శృతి మించనీయకుండా కథని నడిపిస్తూ ఉండడం వల్ల కూడా ఇష్టంగా చదవగలిగాను, ఆలోచనని, కుతూహలాన్నీ పెంచుకోగలిగాను.

నా స్నేహితురాళ్ళని అభిప్రాయాలు అడిగాను అన్నాను కదా. అందులో ఒకరికి ప్రధాన పాత్ర జీవితంలో వస్తున్న మార్పులను ప్రతిఘటించకుండా, అటు వ్యక్తిత్వంతో రాజీ కూడా పడకుండా, చదువుతున్న వారిని తను జీవించే తీరుతో ఆకట్టుకోవడం నచ్చింది అని చెప్పింది. అలాగే, పిల్లలని పెంచడానికి కావలిసిన అనుభవం, అవగాహన, లేనివాడైనా, కేవలం సహృదయతత, ఆత్మీయత కలిగి ఉన్నవాడై కూతురిలా తనవద్దకు చేరిన అమ్మాయిని తగు విధంగా పెంచిన తీరు చాలా నచ్చిందని చెప్పింది. రెండో స్నేహితురాలు కూడా తనకీ పుస్తకం చదవడం మొదట్లో నిదానంగానే సాగిందనీ, తర్వాత కథ ఎలా అల్లుకుంటొందో తెలిసి బాగా ముందుకు సాగిందనీ, అతను ఆ అమ్మాయిని పెంచిన తీరు తనకి చాలా నచ్చిందనీ చెప్పింది.

వీరిద్దరూ ప్రస్తావించిన అమ్మాయి నేను అనుకున్న అమ్మాయి వేరని చాలా సేపటి దాకా నాకు తెలియలేదు. అందువల్ల వారు చదివిన కథ వేరు, నేను అర్థం చేసుకుంటున్నది వేరు అన్న భ్రమతో మొదటి సగ భాగం పైన చదివాను. కూతురు లాంటి అమ్మాయి కథలోకి ప్రవేసించాక వారు చెప్పింది అర్థమయ్యింది.

నచ్చిన విషయాలు, గుర్తుకు వచ్చే సంగతులు:

ఈ పుస్తకంలో నాకు మొదట నచ్చినది కథ చెప్పిన తీరు. తర్వాత పాత్రలు. అందరూ బాగుంటారు (ప్రతినాయకుడి ఛాయలున్న ఒక్క పాత్ర తప్ప.) ప్రతి ఒక్కరికీ ఒక కథ ఉంటుంది. కొంతమంది కథలు వివరంగా తెలుస్తాయి, కొంతమందివి క్లుప్తంగా. ఎవరి మీదా జాలి కలుగదు, ఇష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే అందరూ జీవితాన్ని, పరిస్థితులనీ ఒక పోరాటంలా కాకుండా, అలాగని ఏదో సర్దుకుపోతూ కాకుండా, కష్టమైనా ఇష్టంగానే జీవిస్తుంటారు. కథ మధ్యలో మన “జెంటిల్మ్యాన్” ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. కానీ అదృష్టవశాత్తూ తృటిలో అతని దృష్టి మళ్ళించే విషయం జరిగి అది తప్పిపోతుంది. అలా దక్కిన జీవితంలో, నిర్బంధలో ఎంత వీలు కాగలదో అంతా అతను సంపూర్ణంగా జీవిస్తాడు. చివరికి పరిమితులనూ అధిగమిస్తాడు. ఎంత విశాలంగా జీవించినా, అవకాశం ఉన్నప్పుడు అది పరిమితులని మించిన ప్రపంచంతో సాటి రాదని తన కూతురికి (కూతురులాంటి అమ్మాయి) తెలియజేయాలని కూడా తాపత్రయపడతాడు, సాధిస్తాడు.

ఈ పుస్తకం నుంచి కొన్ని మాటలు:

A man does not master his circumstances then he is bound to be mastered by them.

By Diverse Means We Arrive at the Same End

But every period has its virtues, even a time of turmoil. . . .

This is all well and good, allowed the Count. But what is rarely related is the fact that Life is every bit as devious as Death. It too can wear a hooded coat. It too can slip into town, lurk in an alley, or wait in the back of a tavern.

just remember that unlike adults, children want to be happy. So they still have the ability to take the greatest pleasure in the simplest things.

“For it is the role of the parent to express his concerns and then take three steps back. Not one, mind you, not two, but three. Or maybe four. (But by no means five.) Yes, a parent should share his hesitations and then take three or four steps back, so that the child can make a decision by herself—even when that decision may lead to disappointment. “ఈ మాటలు చెప్పిన వెంటనే తన సంరక్షణలో ఉన్న కూతురులాంటి అమ్మాయి గురించి ఒక మాట విని ఎంతో ఊహించుకుని కంగారుగా పరిగెత్తుతాడు మన పెద్దమనిషి 🙂

You Might Also Like

Leave a Reply