The Great Influenza: the story of the deadliest pandemic in history

“The Great Influenza: the story of the deadliest pandemic in history” అన్న పుస్తకం గురించి నేను మొదటిసారి విన్నది గత ఏడాది కోవిడ్ ఉధృతి మొదలయ్యాక బిల్ గేట్స్ తన బ్లాగులో ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ రాసిన “This book taught me a lot about the Spanish Flu” అన్న పోస్టులో. అప్పుడు దాన్ని గురించి అంత పట్టించుకోలేదు కానీ గత రెండు మూడు నెలలుగా కెనడాలో మూడో విడత కోవిడ్ విజృంభణ – మూడొందల ముప్పై నాలుగో సారి లాక్ డవున్ విధించడం, ఇదే సమయంలో భారతదేశం నుండి వరుసగా స్నేహితులు, బంధువుల దగ్గర్నుండి అపరిచితుల ఫార్వర్డ్ల దాకా కోవిడ్ కేసులు, ఆక్సిజన్ దొరక్కపోడం ఇలాంటివన్నీ వింటూ ఉండడంతో కలిగిన ఆందోళన అంతా అసలు ఏమిటీ జబ్బు? అన్న ప్రశ్న వైపుకి మళ్ళించింది నన్ను. టీకాల చరిత్ర, చరిత్రలోని ఫ్లూ మహమ్మారులు వంటివి చదువుతూ ఉండగా ఈ పుస్తకం/ఆ బ్లాగు టపా జ్ఞప్తికి వచ్చాయి. దానితో ఈసారి చదివాను – దాన్ని గురించి ఒక చిన్న పరిచయం.

ఈ పుస్తకం 1918 లో ఇప్పటి కోవిడ్ లా ప్రపంచాన్ని అంతా బాగా దెబ్బతీసి, అనేకుల ప్రాణాలని హరించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి కథ. అసలు అప్పటి వైద్యశాస్త్రం పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నతో మొదలవుతుంది పుస్తకం. ముఖ్యంగా అమెరికాలో ఇతర దేశాల కంటే మరింత దారుణమైన స్థితిలో ఉందంటూ – “As the Hopkins medical school was opening, American theological schools enjoyed endowments of $18 million, while medical school endowments totaled $500,000” అంటాడు రచయిత. ఇప్పటి అమెరికాతో అప్పటి దేశాన్ని పోల్చుకుని ఆశ్చర్యపోయాను. 

వైద్యరంగం, తొలినాటి వైద్యులు, వైద్య శాస్త్రవేత్తలని, వాళ్ళ జీవితాలని పరిచయం చేస్తూనే నెమ్మదిగా ఈ మహమ్మారి ఎక్కడ మొదలైంది? అన్న చర్చ మొదలైంది. అటుపై  ఈ మహమ్మారి ఇంకా మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే వచ్చింది. యుద్ధానికి, ఇది దేశ దేశాలకీ వ్యాపించడానికి సంబంధం ఏమిటి?, అసలా స్పానిష్ ఫ్లూ పేరెలా వచ్చింది? ఇది ఎలా వ్యాపిస్తుంది?  ఇక దీని ప్రభావం ప్రపంచంపై, ముఖ్యంగా అమెరికాపై, అక్కడి జనజీవనంపై ఎంత తీవ్రంగా పడింది? ప్రజారోగ్య శాఖలు, వైద్య వృత్తిలో ఉన్న వారు, శాస్త్రవేత్తలు – అంతా ఏం చేశారు? రాజకీయ నాయకులేం‌ చేశారు? పత్రికల్లో ఏం వార్తలొచ్చేవి? ఇలా ఎనాళ్ళు సాగింది? ఆ మహమ్మారి ఎలా ముగిసింది? ఇవన్నీ చారిత్రక ఆధారాలతో చర్చించాక చివరి మాటలో – “ఇలాంటిది ఇంకో మహమ్మారి మరోటి వచ్చే అవకాశం లేకపోలేదు. వస్తే మన పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించి – “బహుశా ఏం చేయలేమేమో” అంటూనే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిధ దేశ ప్రభుత్వాలు కలిసి పనిచేయడం వల్ల ఇపుడు ఇలాంటివి గుర్తించడం మునుపు కంటే కొంచెం నయమనీ, దీనివల్ల గత పాతికేళ్ళలో కొన్ని వైరస్ లు మనుషుల మధ్య వ్యాపించకుండా నిరోధించగలిగామని అంటాడు. 

పుస్తకంలో చర్చించిన చాలా అంశాలు చదువుతూ ఉంటే ఇదంతా ఇపుడు చూస్తున్న కథే కదా అన్న భావన కలిగింది. మాస్కులు కావాలా వద్దా? అని చర్చించుకోడాలు, సానిటైజేషన్ అవసరం గురించి ప్రచారం, లాక్ డవున్, క్వారంటైన్ ఇలాంటి వాటి లాభ నష్టాల చర్చలు, పత్రికల్లో మా మందంటే మా మందు పుచ్చుకోండని ఎవరు పడితే వారు చేసిన ప్రచారాలు, ఇదేం పెద్ద రోగం కాదు, మనకేం కాదంటూ ప్రసంగాలు చేసిన నాయకులు, ఎవరికీ ఏం చేయాలో తెలియని స్థితి, బెడ్స్ లేని ఆసుపత్రులు, స్థలంలేక గుట్టలుగా పడున్న శవాలు, తల్లి దండ్రులు పోయి అనాథలైన పిల్లలు – మొత్తం ఇప్పటి పరిస్థితికీ అప్పటికీ చాలా పోలికలు ఉన్నాయి. అయితే, అప్పటి స్థితి ఇప్పటికంటే మరింత దారుణంగా ఉన్నట్లు తోచింది – సంఖ్యా పరంగా, శాస్త్ర అభివృద్ధి పరంగా. అప్పటి అనుభవం నుండి మనం నేర్చుకున్నదేమిటి? అన్న ప్రశ్న ఉదయించింది నాకు – అవే చర్చలు ఇపుడు కూడా జరగడం చూసి.  దీనికి సమాధానం ఈ పుస్తకంలో పెద్దగా లేదు – ఇది 2004లో వచ్చిన పుస్తకం. 

నాకు కొత్తగా అనిపించిన విషయం – అప్పట్లో వివిధ దేశాలలో యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మహమ్మారి వార్తలు జనం మనోధైర్యం దెబ్బతీయకూడదని సెన్సార్ చేసేవాళ్ళట! అందువల్ల దీని నిజమైన తీవ్రత గురించి ఎక్కడా పూర్తి వివరాలు ఉండవంటాడు రచయిత. నవలాకారులు/కథకులు కూడా ఎక్కువగా ప్రస్తావించలేదట! ఇకపోతే, ఇప్పట్లాగే, ఆస్ట్రేలియా అప్పుడు కూడా ఇతర దేశాలతో పోలిస్తే సమర్థవంతంగా ఎదుర్కున్నదట. అయితే, అక్కడ సెన్సర్ లేకపోవడం వల్ల కొంత జనాభిప్రాయాలు డాక్యుమెంట్ చేశారు. అవి చదివితే “తక్కువ” రోగ తీవ్రతతోనే ఇంత భయంకరంగా ఉండిందా? అనిపిస్తుంది అని వ్యాఖ్యానిస్తాడు రచయిత. నాకిష్టంలేకున్నా ఓ విషయం రాయాలి: అపుడు కూడా “most terrifying numbers would come from India” అని రాశాడు. 

ఇక పుస్తకంతో పెద్ద ఇబ్బంది – సైజు. అలాగే, దాదాపు పావు పుస్తకం అయ్యేదాకా చాలా అనవసరపు విషయాలు చర్చించారనిపించింది. శాస్త్రం గురించి చెప్పడం సరే. శాస్త్రవేత్తల పర్సనాలిటీ వర్ణనలు, స్థూలకాయం ఒకరిది, బ్రహ్మచర్యం ఒకరిది – ఇవన్నీ ఎందుకు అసలు మనకి ఈ పుస్తకంలో? చిర్రెత్తుకొచ్చింది నాకైతే. పుస్తకం పక్కన పడేద్దామని కూడా అనుకున్నా కానీ బిల్ గేట్స్ పరిచయాలు కొంచెం ఆయా పుస్తకాల గురించి చాలా ఆసక్తిని రేకెతించేలా ఉంటాయి. ఆఖరుకి పుస్తకం నచ్చకపోయినా పూర్తి చేసేదాకా ఆపలేము అవి చదివాక అని నా అభిప్రాయం. అందువల్ల కొనసాగాను. కొంచెం పావు భావం అయ్యాక పుస్తకం ఇక పేజిలు వేగంగా తిప్పించింది చాలా వరకు. కానీ, గుడ్ రీడ్స్ వెబ్సైటులో ఎవరో రాసినట్లు ఎడిటింగ్ ఈ పుస్తకానికి ఓ పెద్ద లోపం. రచయిత కూడా రెండు మూడు పుస్తకాల కంటెంట్ ని ఒకే పుస్తకంలోకి కుక్కాడు అనిపించింది. 

కానీ, ప్రస్తుత పరిస్థితులలో ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకం అనిపించింది మొత్తం అయ్యాక. నాకు ఒక విచిత్రమైన భరోసా కలిగింది చివరికి వచ్చేసరికి. ఏ విధంగా చూసినా ఇప్పటి పరిస్థితికంటే మరింత దారుణమైన పరిస్థితి అప్పటిది (కనీసం ప్రస్తుతానికి). అప్పటి శాస్త్ర సాంకేతిక పరిమితుల మధ్య కూడా ఏదో ఒకలా అది దాటుకుని ఇలా ఇప్పటిదాకా ఏదో ఒకలా నిలబడ్డాము కనుక ఇదీ త్వరలో దాటిపోతుందనిపించింది ఈ పుస్తకం చదివాక. 

చివరగా ఒక్క మాట: ఈ పుస్తకానికి ఒక సంక్షిప్త అనువాదం, అలాగే, ఈ 1918 నాటి ఫ్లూ మహమ్మారి మన ప్రాంతాలలో ఏ ప్రభావం చూపింది? అన్న విషయం చర్చిస్తూ కూడా కొన్ని వ్యాసాలో, పుస్తకమో తెలుగులో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడిదాకా ఈవ్యాసాన్ని చదివిన రచయితలు ఎవరన్నా దీన్ని గురించి ఆలోచించి పుణ్యం మూటకట్టుకోగలరు. కనీసం రచయిత చివరిమాటనైనా అనుమతి దొరికితే నేను అనువాదం చేసేందుకు ప్రయత్నిస్తాను – అందులో మన ప్రస్తుత పరిస్థితికి ఉపయోగపడే ప్రశ్నలు కొన్ని ఉన్నాయని నా అభిప్రాయం. 

పుస్తకంలో నన్ను ఆలోచింపజేసిన కొన్ని వాక్యాలని ఉటంకించి వ్యాసాన్ని ముగిస్తాను:

“Public health measures lack the drama of pulling someone back from the edge of death, but they save life by the millions.”

“It now seemed as if there had never been life before the epidemic. The disease informed every action of every person in the city”

“So, the final lesson of 1918, a simple one yet one most difficult to execute, is that those who occupy positions of authority must lessen the panic that can alienate all within a society. Society cannot function if it is everyman for himself. By definition, civilization cannot survive that. 

Those in authority must retain the public’s trust. The way to do that is to distort nothing, to put the best face on nothing, to try to manipulate no one. Lincoln said that first and best: A leader must make whatever horror exists concrete. Only then will people be able to break it apart.”

You Might Also Like

One Comment

  1. 2021 – నా పుస్తక పఠనం – పుస్తకం.నెట్

    […] బాగా పరిశోధన చేసి రాశారు. ఈ పుస్తకం గురించి నేను వివరంగా రాసిన పరిచయం ఇక్కడ. […]

Leave a Reply