కొన్ని బొజ్జా తారకం రచనలు – ఒక పరిచయం

బొజ్జా తారకం అని ఒక ప్రముఖ న్యాయవాది ఉన్నారు, ఆయన ప్రజల సమస్యలు, ముఖ్యంగా దళిత సమస్యల గురించి చాలా కృషి చేశాడని నాకు వార్తాపత్రికల వల్ల కొంచెం అవగాహన ఉంది. ఇప్పటికంటే కొంచెం చిన్నపుడు (అంటే టీనేజ్ అనమాట) అంబేడ్కర్ రచనలకి ఈయన తెలుగు అనువాదాలు ఒకటీ అరా చదివాను. కానీ నాకు పెద్దగా ఈయన గురించి వివరాలు తెలియవు.  2012-13 ప్రాంతంలో ఒకసారి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కి వెళ్ళినపుడు అక్కడ “పంచతంత్రం” అని ఒక నవల కనబడేసరికి “ఓహో, ఈయన నవలలు కూడా రాశాడా” అనుకున్నా. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలలో రెండు విషయాలు తెలిశాయి:

ఇదే టైములో ఒక మితృలు “పంచతంత్రం” నవల చదవడానికి ఇవ్వడంతో దాదాపు ఏప్రిల్ నెల మొత్తం ఈయన రచనలు చదవడంతోనే గడిచిపోయింది. వాటి గురించిన సంక్షిప్త పరిచయం ఈ వ్యాసం.

వీటిలో నేను ఎంతో కొంత లోతుగా, పూర్తిగా చదివినవి: “పంచతంత్రం” నవల, “చరిత్ర మార్చిన మనిషి: ఆది రుద్రాంధ్ర మహోద్యమంలో బొజ్జా అప్పలస్వామి” -జీవితచరిత్ర, “ఇది రిజర్వేషన్ల దేశం” వ్యాసాలు. పైపైన చదివినవి – “కులం-వర్గం”, “నలుపు సంపాదకీయాలు”, “అంటరానితనం, ఇంకానా?” పుస్తకాలు. ఊరికే తిరగేసి, పూర్తి చేయకుండా వదిలేసినవి: “పోలీసులు అరెస్టు చేస్తే” పుస్తకం, “నలుపు” పత్రిక సంచికలు. పూర్తి చేయని వాటి గురించి ప్రస్తావన ఎందుకు? అంటే కారణం ఉంది. చెబుతా వాటి గురించి రాసేచోట.

పంచతంత్రం: ఈ నవల ఒక పల్లెటూరి కథ. అక్కడి సామాజిక వ్యవస్థ, వివిధ కులాల మధ్య సంబంధాలు, అక్కడి అంటరానితనం, వివక్ష, పెద్ద/ధనిక కులాలు, పోలీసులు, ఇతరలు దళితులతో ప్రవర్తించేతీరు ఇలాంటి అంశాలని స్పృశిస్తూ, ప్రధాన పాత్రల జీవన గమనంతో మనల్ని కూడా ప్రయాణం చేయిస్తుంది. కథని చెప్పడం నాకిష్టం లేదు కానీ ఈ బ్లాగు పోస్టులో కొంత కథ తెలుస్తుంది, చూడండి ఆసక్తి ఉంటే. నాకసలు ఇలాంటి పల్లెలు గానీ, ఈ తరహా పరిస్థితులు కానీ సినిమాల్లో చూడ్డమే తప్ప అనుభవం లేదు. కనుక చాలా ఆలోచింపజేశాయి నవలలోని కొన్ని సంఘటనలు. ముగింపు బాగా విప్లవాత్మకంగా ఉన్నా, నాకు ఇంకాస్త ఆశాజనకంగా ఉండి ఉంటే బాగుండు అనిపించింది. 

ఇక్కడో విషయం చెప్పుకోవాలి. నేను గత ఐదేళ్ళలో తెలుగు చదవడమే బాగా తగ్గిపోతూ వచ్చింది. ఇందులో కూడా ఓ తొంభై శాతం నేను చదివేవి జీవిత చరిత్రలు, ఆత్మకథలూ, వ్యాసాలే. నవలలైతే అసలు దాదాపు మానేశాను. అలాంటిది ఈ నవల నన్ను అలా అర్థరాత్రైపోతున్నా సరే కూర్చోబెట్టి చదివించింది. ఒకరోజులోనే పూర్తిచేసేశాను పుస్తకాన్ని. అందువల్ల నాకు సంబంధించినంతవరకూ ఇది గొప్ప నవలే. భాష పరంగా నాకు తారకం గారి తెలుగు చాలా స్వచ్ఛంగా అనిపించింది. శైలి పరంగా అంత గొప్పగా అనిపించలేదు కానీ ఆ కథా వస్తువు తాలూకా ప్రవాహంలో కొట్టుకుపోయాను అంతే. అందువల్ల అదేమంత పెద్ద లోటులా తోచలేదు నాకు.


బొజ్జా అప్పలస్వామి జీవిత చరిత్ర: ఇది తారకం గారి తండ్రి, స్వాతంత్ర్యానంతరం ఉన్న తొలి తరం రాజకీయ నాయకులలో ఒకరైన బొజ్జా అప్పలస్వామి గురించి, ఆయన తల్లిదండ్రులు, ముందు తరాల వారి గురించి, ఆయన సామాజిక, రాజకీయ కృషి గురించి రాసిన జీవిత చరిత్ర. తారకం గారి తరాన్ని గురించి పెద్దగా రాయలేదు కానీ, అప్పలస్వామి గారి చిన్నతనం నాటి సామాజిక పరిస్థితులు, అప్పటి సంఘ సంస్కరణాభిలాషుల కృషి, ఇలాంటివన్నీ చదువుతూ ఉంటే గతంలో ఇతర పుస్తకాలు కొన్ని చదువుతున్నపుడు అనిపించినట్లే, ఆకాలం నాటి జనాల్లోనే కొంత చైతన్యం ఎక్కువేమో ఇప్పటి తెలుగువాళ్ళకంటే అని అనిపించింది. కొన్ని విషయాలు అక్కడక్కడా రిపీట్ అయినట్లు ఉన్నాయి కానీ, పుస్తకం ఎక్కడా బోరు కొట్టకుండా చాలా విషయాలు చెప్పింది. ఇంతకీ పుస్తకం అంతా అయ్యాక కూడా నాకు అర్థం కాని విషయం – రుద్రాంధ్ర ఉద్యమం అంటే ఏమిటి? అని. ఆది ఆంధ్ర ఉద్యమం అంటే ఇదివరలో కూడా దాని ప్రస్తావన విన్నాను కనుక పంచములు/దళితులు/ఆది ఆంధ్రులు ఇవన్నీ సమానార్థక పదాలు అని అనుకుంటున్నాను.  పుస్తకం కవర్ పేజి/ టైటిల్ లో ఉన్న రుద్రాంధ్ర అంటే ఏమిటో మరి అర్థం కాలేదు.

ఇది రిజర్వేషన్ల దేశం: ఇది భారతదేశంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో సామాజికంగా వెనుక బడిన కులాల/తెగలకు ఉండే రిజర్వేషన్ల గురించి వ్యాసాలు. మన కుల వ్యవస్థే ఓ రిజర్వేషన్ పద్ధతి, అందువల్ల మొదట్నుంచీ ఇది రిజర్వేషన్ ల దేశమే, కొత్తగా ఇవొచ్చి తెచ్చే చెడు ఏం లేదు అన్న ప్రతిపాదనతో మొదలుపెట్టి రచయిత అసలు ఎందుకు రిజర్వేషన్లు? అన్న ప్రశ్నను తీసుకుని, వాటిని వ్యతిరేకించే కారణాలను ఒక్కొక్కటిగా విశ్లేషించారుని ఈ పుస్తకంలో. లాయర్ కనుక అనేక కేసుల ఉదాహరణలు, చట్టాల గురించిన చర్చలు కూడా చేశారు. నాకు పుస్తకంలోని విషయం చాలా ఉపయోగకరంగా అనిపించినా, కొంచెం క్లుప్తంగా రాసి ఉండొచ్చు అనిపించింది. నా ఉద్దేశంలో కాస్త కష్టపడైనా ఇది అందరం తప్పకుండా చదవాల్సిన పుస్తకం! ముఖ్యంగా ఎక్కడో ఓచోట రిజర్వేషన్ ల వల్ల సీటు పోయిందనో, ఉద్యోగం పోయిందనో బాధ/కోపానికి గురైన అందరూ చదవాలి (ఏమాటకామాటే, ఈ ఆగ్రహం నాకూ ఉండేది పద్దెనిమిదేళ్ళ వయసులో. ఇప్పుడు లేదు).

నలుపు సంపాదకీయాలు: 1989-93 మధ్యలో తారకం గారి సంపాదకత్వంలో వచ్చిన నలుపు పత్రికకి ఆయన రాసిన సంపాదకీయ వ్యాసాల సంకలనం. అప్పటి రాజకీయ, సామాజిక అంశాల (రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ విషయాలు) గురించి రెండు మూడు పేజీల్లోపు ఉండే వ్యాఖ్యానాలు. ఈ వ్యాఖ్యానాలకి మొదట పుస్తకం వెలువరించిన హైదరాబాదు బుక్ ట్రస్ట్ వాళ్ళు కాబోలు, ఒకట్రెండు వాక్యాల వ్యాఖ్య రాశారు దాదాపు అన్ని వ్యాసాలకీ. అవి బాగా రాసినట్లు తోచింది. ఇక సంపాదకీయాల విషయం – క్లుప్తంగా, చదవడానికి తేలిగ్గా ఉన్నాయి. వాటిలోని భావజాలాన్ని అన్నిచోట్లా నేను అంగీకరించలేకపోయినా (ఉదాహరణకి: ఆకలి చావులున్న చోట అంతరిక్ష పరిశోధనలు ఎందుకు? వంటి అభిప్రాయాలు), అలాగే ఆ కాలం నాటి అన్ని వార్తా విశేషాల గురించి నాకు అవగాహన లేకపోయినా, ఈ పుస్తకం చదవడం ఒక ఉపయోగకరమైన అనుభవం అనే చెప్పాలి. 

“కులం-వర్గం”: ఈ పుస్తకం లో ప్రధానంగా మార్క్స్, అంబేడ్కర్ ఇటువంటి వారి అభిప్రాయాలను, రచనలను గురించి పరిచయం చేస్తూ రచయిత తనకు ఆ అంశం మీద ఉన్న  జ్ఞానాన్ని కూడా సమ్మరైజ్ చేశారు. కొన్ని ఈయన ప్రస్తావించిన పుస్తకాలు గత పది పదిహేనేళ్ళలో తిరగేసినందువల్ల మరీ ఆశ్చర్యకరమైన విషయాలేం లేవు కాని, తారకం గారు ఇవన్నీ చాలా సులభంగా అర్థమయేలా రాసినట్లు అనిపించింది తెలుగులో. 

“అంటరాని తనం, ఇంకానా”: ఇది చిన్న పుస్తకం. తారకం గారి మరణానంతరం ప్రచురించారు. “అంటరానితనం – నిన్న, నేడు, రేపు” అని ఆయన రాసుకున్న ఒక వ్యాసం, దీనితోపాటే 2007లో ఆయన రాసిన మరో వ్యాసం “అరవై ఏళ్ళలో దళిత సామాజిక ప్రగతి” అన్న మరొక వ్యాసం కలిపి వేశారు. రెండూ కొంచెం మన దేశంలో కాలక్రమేణా అంటరానితనం విషయంలో పరిస్థితులు ఎలా మారుతున్నాయి? ఇంకా పూర్తి స్థాయిలో అంటరానితనం ఎందుకు పోలేదు? ఇలాంటి ప్రశ్నలు చర్చించారు. ఇందులో ప్రత్యేకించి కొత్త ప్రతిపాదనలూ అవీ లేవనుకుంటాను కానీ, రిజర్వేషంలు ఎందుకు అసలు? అనో, అసలు అంటరానితనం ఎక్కడుంది? కుల వివక్ష ఇపుడెవరు పాటిస్తున్నారు? అనో ఎపుడన్నా అనిపించి ఉంటే మటుకు తప్పకుండా ఈ పుస్తకం చదవండి. 

పోలీసులు అరెస్టు చేస్తే?: ఈ పుస్తకం నేను నిజానికి చదవలేదు. ఊరికే కుతూహలం కొద్దీ తిరగేశాను. ఒకవేళ ఏదన్నా పరిస్థితులో పోలీసులు మనల్ని అరెస్టు చేస్తే మనకి ఉండే హక్కులు ఏమిటి? వాళ్ళకి ఉండే పవర్ ఎంత? ఏది చట్ట విరుద్ధం? అసలు చట్ట ప్రకారం జరగాల్సిన పద్ధతి ఏమిటి? అన్న విషయాలన్నీ వివరంగా చర్చిస్తుందీ పుస్తకం. పుస్తకం మొదట్లోనే ఇది జనం మధ్యకి, ముఖ్యంగా పోలీసుల మధ్యకి కూడా ఎంత చొచ్చుకుపోయిందీ, రచయితకి ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందీ ప్రస్తావించారు. నిజానికి నాకసలు ఈ టాపిక్ తో ఓ పుస్తకం ఉందంటేనే అబ్బురంగా అనిపించింది. నాకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కునే అవకాశం తక్కువ అనిపించి నేనంత సూక్ష్మంగా చదవలేదు. కానీ, వచ్చి చాలా ఏళ్ళైంది కనుక కొంచెం పద్ధతులూ అవీ మారి ఉండొచ్చేమో కానీ… అయినా సరే, ఇప్పటికీ సమాజానికి ఉపయోగపడే పుస్తకమిది! 

అంతర్జాలంలో ఉన్న నలుపు పత్రిక సంచికలు: ఇందులో అన్నీ తారకం గారు రాసినవి కావు. వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాలున్నాయి. అన్నీ సామాజిక, రాజకీయ అంశాల పై వచ్చిన వ్యాసాలే. కొన్ని జీవిత చిత్రణలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సంచికలు ఉన్నాయి. వ్యాసాలు మరీ పెద్ద పెద్దగా లేకుండా, అలాగే భాష కూడా (నేను చదివిన వాటిలో) కృతకంగా లేకుండా, తేలిగ్గా అర్థమయ్యేలా ఉండటం నాకు అన్నింటికంటే నచ్చిన విషయం వీటిలో. 

మొత్తానికి కొంతవరకూ ఇలాంటి అంశాల మీద ఆసక్తి ఉండి, ముఖ్యంగా ఈ తరహా భావజాలం పట్ల వ్యతిరేకత లేకుండా, ఇలాంటివి తెలుగులో చదవాలి అనుకుంటే తప్పకుండా చదవాల్సిన రచనలివన్నీ. తారకం గారి పద్ధతి అందరికీ అర్థమయ్యేలా రాయాలి అని అనుకుంటాను. ఒక్కోచోట కొంత రిపిటీషన్ ఉన్నా కూడా నా మట్టుకు నేను చదివినంత వరకూ అన్నీ సులభగ్రాహ్యంగానే ఉన్నాయి. ఈబుక్స్ నాణ్యత అంత గొప్పగా లేదు. కొన్ని టూ కాలం ఫార్మాట్ లో తప్ప చదవడానికి కుదర్లేదు. ఒక పుస్తకం లో ఫాంట్ మరీ చిన్నగా ఉండి ఇబ్బంది పెట్టింది లాప్టాప్ పైన చదివేందుకు కూడా (జూం చేస్తే క్వాలిటీ తగ్గింది). ఇలాంటివి కొన్ని ఉన్నాయి నాకు సమస్యలు – ప్రింటు పుస్తకాలకి ఇలాంటివి ఉండవనుకోండి బహుశా. ఇక్కడ ప్రస్తావించిన అన్ని పుస్తకాలూ హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారు వేసినవే. అందువల్ల కొనుగోలు వివరాలకి వారి వెబ్సైటులో చూడండి. 

You Might Also Like

2 Comments

  1. 2021 – నా పుస్తక పఠనం – పుస్తకం.నెట్

    […] -ఈ పుస్తకాల గురించి ఒక పరిచయం గతంలో రాశాను.  […]

  2. leol

    మంచి పరిచయం సౌమ్య గారు. మోహనకృష్ణ ఇంద్రగంటి గారు ఒక ఇంటర్వ్యూలో బొజ్జా తారకంగారి పంచతంత్రం పుస్తకం గురించి ప్రస్తావించారు. ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను కానీ పిల్లల పంచతంత్రం చేతికి వచ్చింది. హైదరాబాదు బుక్ ట్రస్ట్ లో ప్రయత్నిస్తాను.

Leave a Reply