నూతిలో గొంతుకలు

వ్యాసకర్త: గరికపాటి పవన్ కుమార్ 

‘ఆవేదనల అనంతంలో’నుంచి పుట్టేదే కవిత్వం. ఆ ఆవేదనకు ఆలంబనగా నిలచి కవిత్వ దాహాన్ని తీర్చడానికి  ప్రయత్నించిన , ప్రయత్నిస్తున్న మహాకవులలో బైరాగి ఎన్నదగినవాడు. తెలుగు,హిందీ, ఆంగ్ల భాషలలో సాహితీవేత్తగా అత్యున్నత స్థానాన్ని అందుకోగలిగాడు. కృష్ణశాస్త్రి బైరాగి గురించి చెబుతూ “బైరాగి మన కవులు – వ్రేళ్ళ మీద లెక్కపెట్టదగిన బహుకొద్దిమందిలో ఒకడు” అన్నాడు. కవిగా, కవిత్వ తత్త్వవేదిగా బైరాగి పరిపూర్ణత్వాన్ని సాధించాడని చాటిచెప్పే కావ్యమే “నూతిలో గొంతుకలు”.  

నూతిలో గొంతుకలు ఉవ్వెత్తుగా ఎగసిన అగ్నిపర్వతపు లావాలా ఉరికే ఒక దీర్ఘ కవితా కావ్యం.  కవిమాటల్లో “నూతిలో గొంతుకలు సంశయ కావ్యం. దీనిలో మానవుడు “ఏది త్రోవ” అని అడుగుతున్నాడు. “నాన్యపథః విద్యతే2యనాయ” అని చెప్పగలిగే స్థితిలో లేడు.” 

ఈ  కావ్యానికి మొదలు కరాళ కాళ రాత్రి’లోని చీకటి. ‘చూపులేని, రూపులేని రేపు లేని మాపులేని ఒక పెనుచీకటి నిముసం’. ఆ చీకటిలో 

“రాత్రి నిదురబోతున్నది 

జగతి నిదురబోతున్నది 

నిదురబోతున్నది వీణ 

…. 

నిదురబోతున్నాయి గుండెదడలు 

… 

నిదురబోతున్నాయి వాడిన పువ్వుల్లో ఆశలు

ఆ చీకటిలో 

ఋజువెక్కడ 

తెరువెక్కడ 

ఈ  నల్లని  ముసుగులోన దాక్కున్నది ఎవరి ముఖం 

ఈ చీర చెరగుచాటున దాగిఉన్నదే హృదయం 

ఈ శూన్యావరణంలో ఏమున్నది స్పర్శ సుఖం 

త్రోవ తెలియదెటువున్నది ఆలయం 

చీకటినాడి ఎక్కడ?”

అని ప్రశ్నించే గొంతుకలు, కవి అప్పుడు దారికూడా చూపుతున్నాడు, చేయవలసింది ఏమిటంటే 

“ఆ చీకటి గుండెల్లోకి 

చొచ్చుకుపో గుచ్చుకుపో 

…. 

చొచ్చుకుపో చిమటల దీక్షతో, వానపాముల ఓపికతో 

…. 

అప్పుడు వింటావు నీవు 

ఉరియుచ్చుల అనుభవాలు ప్రకటించే 

              నూతిలోని గొంతుకలు”

ఇలా చీకటి గుండెలోతుల్లోకి చొచ్చుకు పోగాపోగా  వినిపించే నూతిలోని గొంతుకలు వినడానికి పాఠకుణ్ణి సిద్ధం చేసాడు కవి, ఈ గొంతులకు ప్రాతినిధ్యం వహించే నాయకులు ” “హేమ్లెట్,  అర్జునుడు, రాస్కల్నికోవ్” – సందిగ్ధావస్థలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు.  హేమ్లెట్ వేదన కర్మ పూర్వం, అర్జునుడి వేదన కర్మక్షేత్రంలో తక్షణికం, రాస్కల్నికోవ్ బాధ కర్మ తరవాత, అది మానవుని సహజ వేదన, అతన్ని త్రికాలాలలోను వెంటాడుతుంది.”

చెయ్యబోతున్నది తప్పా ఒప్పా, చెయ్యాలా వద్దా అనే సంశయం హేమ్లెట్ ది 

చెయ్యడానికి వచ్చిన పని తప్పా ఒప్పా అనే సంశయం అర్జనుడిది 

చేసేసిన పనిని ఒప్పుకోవాలా లేదా అనే సంశయం రాస్కల్నికోవ్ ది 

ఇక హేమ్లెట్  స్వగతం –

డి ట్రాజెడీ అఫ్ హేమ్లెట్, ప్రిన్స్ అఫ్ డెన్మార్క్, విలియం షేక్స్పియర్ వ్రాసిన నాటికలోని ప్రధాన పాత్ర. తన తండ్రిని చంపిన తన బాబాయి  మీద పగ తీర్చుకోవడానికి తాను పడే మథన క్రమం. మొదటిగా, తన బాబాయే తన తండ్రిని హత్య చేసాడని నిర్ధారించుకోవడం, ఆ తర్వాత ఏ రకంగా తనని హత్య చేయాలని నిర్ణయించుకోవడం ఇది హేమ్లెట్ స్వగతం –

వేసిన ప్రశ్న ఒప్పైనా ప్రత్యుత్తరం తప్పేనని 

ప్రత్యుత్తరం తప్పైతే వేసిన ప్రశ్న తప్పేనని

…..

అడ్డుతుంది ఆలోచన బంధమై క్రియాపథాన 

మరుగుపరుస్తవి నిజాన్ని ఊహల చిలవలు పలవలు 

ఆలోచన క్రియతో శృతి కుదరని ఒక భగ్న వీణ 

మసికక్కే చైతన్యపు మరణోన్ముఖ దీప శిఖలు 

పలవరించి పొరలుతుంది పీడకలలు కనే ప్రాణి 

… 

ఈవిధంగా హేమ్లెట్ అంతరంగాన్ని ఆసరాగా నేటి మానవుని అనుభూతి అంతరంగ సంఘర్షణాన్ని అత్యద్భుతంగా వెలువరించాడు కవి.  ఈ  అద్భుతమైన పాదాలలో “స్వకరుణ అనే కుంపటి కడ  ఇడుముల చలి కాచుకుంటూ” “వృద్ధవేశ్య నడివీధిన” నిలువబడి పిలిస్తే తలవంచుకు వెళ్లాలా, నిలచి మారు పలకాలా? ఇలా ఏది త్రోవ అని ప్రశ్నిస్తూ ఉంటాడు సగటు మానవుడు తన వేదనలో.

ఆపైన తక్షణికమైన “అర్జున విషాద యోగం” – సంధి ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాత మహాభారత యుద్దానికి సర్వ సంసిద్ధం అయి, కురుక్షేత్ర రంగంలో అర్జునుడి మనస్థితి.  సర్వం సంసిద్ధం భీకర సమర రంగంలో కాని  వికట పటహ ఘోష మార్మ్రోగే నా హృదంతరంగంలో అని మొదలెట్టిన తక్షణికమైన వేదనలో “మనరేపిన పాపధూళి  మలిన పరుస్తోందెవ్వరినో మనప్రశ్నకు ప్రత్యుత్తరమెవఁడో చెప్పదు  తప్పక” అంటూ కర్మ చేయబోయే టప్పటి  వేదన తాలూకు ప్రతీకలను కవి కదం తొక్కించాడు. 

“డేరాల్లో కలత నిదుర, కలవరాల పీడకలలు

నల్ల కడలి ఉప్పెనలో మునిగితేలి తలల అలలు 

అట ఇంద్రప్రస్థంలో మగదిక్కులు లేని యిళ్ళు 

నిర్జన నిశిలో జ్యోతులు మెరిసే తస్కరుల కళ్ళు 

దివ్వెలకడ చేరి ప్రశ్నలు వేసే పిల్లలు 

ఏ సాంత్వన మివ్వగలరు  శంకాకులలై  తల్లులు. 

అర్జునుడి ఆలోచనా పరంపరకు ఒక నల్లని వర్ణ పద  చిత్రం కనిపిస్తుంది. 

ఈ వేదన కూడా ప్రశ్నా  రూపంగానే ముగుస్తుంది 

“బ్రతుకు చీలు బాటమీద నిలబడి యున్నాను నేడు 

ఎటుబోతే పూలతోట ఎటుబోతే వల్లకాడు?

ఈ ప్రళయ ముహూర్తంలో ఏమిటి నా కర్తవ్యం 

ఈ అగ్ని పర్వతంపై ఏ దిక్కున గంతవ్యం 

దేనివలన జనులందరు తరతరాల సుఖిస్తారు 

మన మహోచ్ఛ నిర్ణయాన్ని సంప్రీతిని స్మరిస్తారు.?

దీని తర్వాత రాస్కల్ని కొవ్ – కర్మ తర్వాత పడే వేదన. రాస్కల్ని కొవ్ – దోస్తవిస్కీ  వ్రాసిన “క్రైమ్ అండ్ పనిష్  మెంట్  ” నవలలో ప్రధాన పాత్ర, అతి బీదవాడైన రాస్కల్నికోవ్ , ఒక బార్ లో ఒక వడ్డీవ్యాపారి గురించి “తను లేకపోతే ఈ సమాజం చాలా బాగుంటుంద”ని విని ఆ వడ్డీ వ్యాపారిని ఆమె  అపార్టుమెంట్లోనే  హత్య చేస్తాడు. ఆ తర్వాత డబ్బుకోసం వెతికే సమయంలో వాళ్ళ చెల్లి అక్కడకు రావడంతో, తనని కూడా హత్య చేస్తాడు. ఆ తర్వాత నుంచి ఆ జంట హత్యలు  తానే చేశానని ఒప్పుకోక  ఎవరితో చెప్పుకోలేక  మధన పడుతూ, భయపడుతూ ఎంతో వేదన అనుభవిస్తాడు. సోనియా తన ప్రియురాలు.

ప్పుడూ  నడిరేయి చీకటి జడలు విచ్చిన కాననంలో 

భీతి తప్పక ప్రతిఫలించదు హరిత ప్రకృత్యాననంలో “

.. 

త్రోవ తప్పిన ప్రేతకోటికి త్రోవ ఎక్కడ వెలుగు ఎక్కడ 

బ్రతుకుని తాకట్టుగొన్నది ముసలి మిత్తవ ఎక్కడున్నది

“  శాంతి ఎక్కడ భ్రాంతి  తప్పక, పరిహసించే గడ్డి పోచలు 

దిక్కులన్నీ వెక్కిరింతలు మొయులు నొసలున నల్ల త్రాచులు 

స్వీయ హృదయం న్యాయసదనం నేరమారోపించటానికి 

నరనరాలా గూఢచారులు దృష్టి నాపై ఉంచటానికి”

చేసిన తప్పుకు హృదయమే న్యాయస్థానం, నరనరాలలోని వేదనే గూఢచారులు, పశ్చాత్తాపంతో రగిలిపోతున్న ఒక హృదయం అందులోనుంచి వెలువడే ఆక్రోశం. ఈ గొంతుక కూడా “భ్రాంతి నుంచి శాంతి లోకి, సోనియా త్రోవ చూపు, వెలుగు చూపు త్రోవచూపు” అంటూ వేడుకుంటూనే అంతమవుతుంది.  

ఇక మిగిలిన భాగాలు “సంఘర్షం” “ఒక సమిష్టి ప్రార్థన” ల లోని ఆవేదన, వ్యంగ్యం వెనుక దాక్కుంటుంది”. ఇక చివరి భాగం “కవి సమస్య”  – అభివ్యక్తి కొరకు కవి చేసే సంఘర్షణ. 

“ఎక్కడ మొదలెట్టడమో ఎక్కడ తుది ముట్టడమో 

విరిగిన పని ముట్టులతో  ఏమిటి చెక్కడమో ?”

తవ్వండి , చీకటి తప్ప వారికి తోడెవరూ లేని చోట, ఎక్కడో  భూగర్భపు లోతుల్లో ఉన్న ఆ గొంతుకలు వినాలంటే, చొచ్చుకుపో గుచ్చుకుపో ఆత్మల అగాథంలోకి….

You Might Also Like

5 Comments

  1. గరికపాటి పవన్ కుమార్

    నా స్నేహితుడు ఒకరు, పవనూ ఇది పాత కావ్యం కదా, ఇప్పుడు రాస్తున్నావేమిటి సమీక్ష అని చనువుగా అడిగాడు, కాలానికి కట్టుబడనిదే కవిత్వం, కదా అని తప్పించుకున్నాను. కానీ సత్యవతి గారి పై వ్యాఖ్య చదివిన తరువాత ఈ వ్రాసిన వ్యాసానికి సార్ధకత సిద్ధించింది అనిపించింది

  2. చుండి

    నూతిలోని గొంతుకలను సహేతుకంగా సామాన్య
    పాఠకులకు పరిచయం చేసారు పవన్ గరికపాటి.
    ఆమ్లెట్లు తప్ప హామ్లెట్ గురించి తెలియని మాములు
    వాళ్ళకి విషయాన్ని క్లుప్తంగా పరిచయం చేస్తూనే బైరాగి అంతరంగాన్ని మధించి మనకోసం చెప్పే ప్రయత్నం చాలా బాగుంది .

  3. సత్య వతి

    మళ్ళీ చదువుకోవాలి బైరాగి ని.అనిపించింది

  4. తమ్మినేని యదుకుల భూషణ్

    బైరాగి పదహారణాల తెలుగు కవి. ఎటువంటి భావానికైనా ఆకృతినివ్వగల అపారమైన అతని శబ్దశక్తి విస్మయం గొలుపుతుంది. ‘నూతిలో గొంతుకలు’ అందరూ రాయగల కావ్యం కాదు.సకల బలహీనతలను భస్మీపటలం చేయగల మంత్రదండం-తెలుగులో తొలి తాత్విక కావ్యం.

    పవన్ బైరాగిని పరిచయం చేయడం బావుంది.

  5. M N MURTHY

    Frankly speaking this is easy and at the same time difficult to understand. Highly introspective.

Leave a Reply