How to avoid a climate disaster: Bill Gates

వ్యాసకర్త: హేలీ

*********

ఈ పుస్తక పరిచయ వ్యాసం బిల్ గేట్స్ రాసిన “How to avoid a climate disaster – The solutions we have and the breakthroughs we need” అన్న పుస్తకం గురించి . పోయిన  సంవత్సరం ఈ  పుస్తకం  గురించి విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి మార్కెట్లో విడుదల అవ్వగానే కొని చదివిన పుస్తకం .  ఈ  మధ్య  కాలంలో ఇలా ప్రీ ఆర్డర్ చేసి కొన్న పుస్తకాలు తక్కువ నేను . ఈ పుస్తకమే దానికి మినహాయింపు . 

బిల్ గేట్స్ గురించి పరిచయం అక్కర్లేదు . సాఫ్ట్వేర్ శ్రామి’కుల’ గురువు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు . వ్యాపార దిగ్గజం. అపర కుబేరుడు వగైరా వగైరా . అయితే పర్యావరణ పరిరక్షణకు గేట్స్ కు ఏమిటి సంబంధం? సరే అయన రాసాడనే అనుకుందాం నేనెందుకు చదివాను? ఈ వివరాలలోకి వెళ్లాలంటే వాక్లావ్ స్మిల్/ వాత్సలాఫ్ స్మిల్   ( Vaclav Smil –  https://en.wikipedia.org/wiki/Vaclav_Smil) గురించి తెలుసుకోవాలి. వాత్సలాఫ్ స్మిల్ మన కాలంలో ఇటువంటి విషయాలపై  అంటే  వాతావరణ మార్పు,  పర్యావరణ సంక్షోభం, శిలజ ఇంధన వనరుల వినియోగం (Fossil fuels) , పునరుత్పాదక ఇంధన వనరులు (Renewable energy) , అవధుల్లేని భౌతిక అభివృద్ధి సాధ్యమే అనే వ్యామోహం వగైరాల గురించి  అపారమైన విద్వత్తు కలిగి నిశితమైన పరిశీలనతో సహేతుకంగా చర్చించగల అతికొద్ది మేధావులలో ఒకరు. ఈయన జెకోస్లోవేకియాకు చెందినా కూడా ఇప్పుడు కెనడాలో నివాసం ఏర్పరుచుకున్నారు. 

( స్మిల్ గేట్స్ మధ్యన సంభాషణ)

ఇటువంటి విషయాలపై స్మిల్ రాసిన ముప్పై ఏడుకు పైగా పుస్తకాలు తాను చదివానని అంటారు బిల్  గేట్స్. మీరు సరిగ్గానే చదివారు అక్షరాలా  ముప్పై  ఏడే ! 37!  అంతేకాక తాను ఎంతగానో అభిమానించే రచయిత స్మిల్ అని ఎన్నోసార్లు తెలియజేసుకున్నారు గేట్స్. స్టార్ వార్స్ సిరీస్ లో కొత్త సినిమా కోసం అభిమానులు ఎలా ఎదురు చూస్తారో తాను స్మిల్ కొత్త  పుస్తకాల కోసం అలా ఎదురుచూస్తానని చెప్పుకుంటారు గేట్స్. ఈ విషయం పై వీరిద్దరి సంభాషణ ఇక్కడ చూడచ్చు ( రెండు నిమిషాల కంటే తక్కువ నిడివి గల వీడియో https://www.youtube.com/watch?v=p55cFT-ti-I ) . 

గేట్స్ తాను చదివే పుస్తకాల గురించి రాసుకునే గేట్స్ నోట్స్ కు  వీరాభిమానిని .  మొట్టమొదటగా స్మిల్ గురించి  తెలుసుకున్నది  అక్కడే: (https://www.gatesnotes.com/Books

అప్పటి  నుంచి  స్మిల్  రాసే  పుస్తకాలను ఆయన ఇంటర్వ్యూలను ఫాలో అవుతూ ఉన్నాను .  ఈ మధ్య  కాలంలో పర్యావరణ సంక్షోభం గురించి పత్రికాముఖంగా స్మిల్ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు . కొత్తగా  పుస్తకాలు కూడా రాసారు ఈ విషయం సంబంధించి . అందులో ముఖ్యంగా అవధుల్లేని భౌతిక అభివృద్ధి అన్నది సాధ్యమే  అన్న అపోహ నుంచి మనం బయటపడాలి కానీ మన ఆర్ధిక శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని వినిపించుకోటానికి సిద్ధంగా లేరు అన్న ప్రతిపాదనను పదే పదే చేసారు స్మిల్ (చూడు: “Growth must end. Our economist friends don’t seem to realise that” మరియు We Must Leave Growth Behind మరియు Want Not, Waste Not

ఈ ఇంటర్వ్యూలు అన్నిటిలో స్మిల్ చేసిన ప్రతిపాదనలు కొన్ని గేట్స్ రాసిన ఈ పుస్తకం గురించిన పరిచయానికి చాలా అవసరం. ప్రతీ ఒక్కరు SUV కొనుక్కోవాలనీ పెద్ద పెద్ద ఇంద్ర భవనాలలో ఉండాలనీ ఋతువులతో సంబంధం లేకుండా ఎక్కడో ఏదో దేశంలో పెరిగిన రాస్ప్ బెర్రీస్ వంటి పండ్లను ఎప్పుడు బడితే అప్పుడు ఆరగించాలని అనుకోవటం వంటి గొంతెమ్మ కోరికలను కోరుకోవటం మనం ఆపట్లేదని అదే మన జీవన విధానాలలో ప్రధాన సమస్య అని అంటారు స్మిల్.నిజానికి ఈ పర్యావరణ సంక్షోభం నుంచి బయట పడటం అన్నది మనం అనుకుంటున్నంత కష్టసాధ్యమైన పనేమీ కాదని ఈ జీవన ప్రమాణాలు అన్న విషయంలో మనకున్న అపోహలను తీసివేసి మన జీవన ప్రమాణాలను ఒక రెండు మూడు మెట్లు తగ్గించుకుంటే మన సుఖసంతోషాలకు వచ్చే లోటేమి లేదని అంటారు  స్మిల్ .  కానీ మనం భౌతిక సౌఖ్యాల విషయంలో ఏ మార్పులు చేయటానికి సిద్ధంగా లేమని అదే మన సమస్యని అంటారు స్మిల్ .నిజానికి 1980 కాలంలో ఈ SUV అన్న వాహన శ్రేణిని మార్కెట్టులో ప్రవేశపెట్టారని అప్పట్లో  ఇటువంటి SUV కావాలని తపించిన వారెవరు లేరని ఇవన్నీ కొత్తగా తయారు చేయబడ్డ అవసరాలని అసలు 1980 లలో ఈ SUV  అన్నది కనిపెట్టకుండా ప్రపంచాన్నంతటికి ఈ రోగం అంటించకుండా ఉంటే బిలియన్ల టన్నుల కార్బన్ ఎమిషన్స్ ను వాతావరణం లోకి వెలువడకుండా అరికట్టి ఉండచ్చని అంటారు స్మిల్. తాను కొన్న హోండా అక్కార్డ్ కారు తొమ్మిది వందల కిలోగ్రాముల బరువు ఉంటుందని తాను కొన్నప్పటికి ఇప్పటికి కారులు ఇంకా పెద్దవిగా బరువైనవిగా ఉండేవి తయారు చేస్తున్నారని అంతే కాక పేరుకి చిన్న కార్ల కంపెనీ ఐన హోండా కంపెనీ కూడా ఒక అక్కార్డ్ సివిక్ వంటి మోడళ్ళు మాత్రమే కాక దాదాపుగా ఆరేడు రకాల SUV లు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోందని అసలు ఇన్ని మోడళ్ళు అవసరమేనా అని ఎవరు ఆలోచంచట్లేదని ఇటువంటి ప్రతీ అనవసర వస్తువు తయారు చేయటానికి ఎన్నోఇంధన వనరులు మరెన్నోభౌతిక పదార్థాల వినియోగం అవసరమని అసలు ఈ పర్యావరణ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఈ దుబారా తయారీ ఆపితే చాలని అంటారు స్మిల్ . ధనిక దేశాలలో జనాభా తగ్గుతున్నా కూడా వారు ఇప్పటికి అడ్డు అదుపు లేనట్టుగా వారి వస్తు వినియోగాన్ని తగ్గించుకోవట్లేదని అదే విధంగా పేద దేశాలలో జనాభా పెరుగుదల తగ్గట్లేదని అక్కడి ప్రజలు కూడా మాకు ధనిక దేశాల వారి జీవన విధానాలే కావాలని వారు చేసిన తప్పులే చేయటానికి సిద్ధపడుతున్నారని  అంటారు స్మిల్. ఒక వస్తువును లేదా సేవను వినియోగించే ముందు ఆ వస్తువు లేదా సేవ తయారీలో మరియు వినియోగంలో అవసరమయ్యే పదార్థాల తాలూకా ఖర్చు గురించి ఇంధన వనరుల వినియోగం గురించి వ్యర్థాల తొలగింపజేసే విధానం వగైరాల గురించి సమగ్రంగా ఆలోచించాలని అంటారు స్మిల్ . 

జీడీపీ గురించిన వ్యామోహం నుంచి కూడా మనం బయటపడాలని అంటారు స్మిల్. జీడీపీ పెరిగే కొద్దీ అంతే స్థాయిలో మన జీవితాలలో ఆనందం సంతృప్తి అన్నది అలవడుతుంది అనుకోవటం మన మూర్ఖత్వమని అంటారు ఆయన. జీడీపీ  పెరుగుదల అన్నగణాంకానికి  ఒక స్థాయిని దాటాక దానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కంటే ఎక్కువ ఇవ్వటంలో అర్థం లేదని అంటారు స్మిల్ . 1960 1970 ల  దశకాలలో యూరోపు వారి జీవన స్థాయిని ఉదాహరణగా చెప్తారు ఇక్కడ స్మిల్ . అప్పటి కాలం యూరోపు వారు అంత దౌర్భాగ్యపు జీవితమేమి గడపలేదని ఇప్పుడు ఆ స్థాయికి మన పదార్థ వినియోగ స్థాయిని తగ్గించటం వల్ల మనం కోల్పోయేదేమి లేదని అంటారాయన . సరే యూరోపులో ఉండే ప్రతి పౌరుడు విమానంలో సింగపూరుకు విహారయాత్రకు వెళ్లే సౌలభ్యాన్ని కోల్పోతామేమో దాని వలన మనం ఏం నష్టపోతాము? ఇటువంటి వ్యర్థ ఖర్చులు వస్తు వినియోగము మన  ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థలో చాలానే ఉన్నదని అంటారు స్మిల్ . కౌ బాయ్ ఎకానమీ మరియు స్పేస్ మ్యాన్ ఎకానమీ గురించి కూడా ప్రస్తావిస్తారు స్మిల్ మరొక ఇంటర్వ్యూలో. అంటే ప్రపంచంలో వనరులకు అవధుల్లేవని తనకు దొరికినదంతా దోచుకోవాలి అని ఆలోచించే కౌబాయ్ ఆలోచనకు  స్పేస్ షిప్ లో వ్యోమగాములలాగా అన్ని విషయాలలో పరిమితులకు లోబడి ఉండాలని గుర్తించి ప్రతి వస్తువును ఆచితూచి వాడుకోవడానికి గల తేడా గురించి ప్రస్తావిస్తారు స్మిల్ .నిజానికి ఎన్నో ప్రాచ్య దేశపు సంస్కృతులలో మరియు పశ్చిమ దేశపు సంస్కృతులలో కూడా కోరికలను తగ్గించుకొమ్మని ఉన్నదాంతో సంతృప్తి చెందమని ఆధ్యాత్మికమైన ఆలోచనా ధోరణిని అలవర్చుకొమ్మని చెప్పే దాఖలాలు ఉన్నాయని ఈ పర్యావరణ సంక్షోభం దృష్ట్యా మనం ఆ సాంస్కృతిక మూలాలకు తిరిగి వెళ్లాలని అంటారు స్మిల్ . అయితే మన చుట్టూతా ఉండే ప్రపంచం ఇప్పుడు అలా లేదని అంటారు ఆయన .ప్రతీ ఒక్కరు పెద్ద SUV కావాలని పెద్ద బాత్రూం కావాలని ఇంకా ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ వాటిని తీర్చుకోవటం కోసం పదార్థ వినియోగం (material consumption) పెంచుకుంటూ  పోతున్నామని  అంటారు  స్మిల్  .  అయితే  ఇది  కూడా  ఒకరకంగా  సిగరెట్టు  తాగటం  వంటిదేనని  సిగరెట్టు తాగితే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు ఖచ్చితంగా తెలియటం వలన యాభై ఏళ్ళ మునుపు కంటే ఇప్పుడు వాటి వాడకం తగ్గిందని అలాగే మన జీవన విధానాల వలన తెచ్చిపెట్టుకున్న ఈ పర్యావరణ సంక్షోభం గురించి కూడా మెల్లగా నిజం తెలుసుకుని మన జీవితాలను చక్కదిద్దుకుంటామని తాను ఆశిస్తున్నానని అంటారు స్మిల్.

మరొక ఇంటర్వ్యూలో కూడా ఈ విశృంఖల వస్తు వినియోగం గురించి ప్రస్తావిస్తారు స్మిల్. రెండేళ్లకు ఒక సెల్ల్ఫోన్ మారుస్తున్నారు మనలో చాలా మంది. ప్రతి సెల్ఫోన్ కోసం రాగి,  వెండి , బంగారం , అరుదైన లోహాలు ( Rare earth metals) వగైరాలు అవసరం అవుతాయి . వీటన్నిటి తయారీలో పర్యావరణానికి జరిగే హానికి సరైన వెల కట్టకుండా కోటానుకోట్ల ప్రజానీకం పదే పదే ఫోన్లు కొనుక్కుంటూ పోతున్నారని అంటారు ఆయన. ఆయన దగ్గర ఫోను లేదుట! 

1950లో సగటు అమెరికా పౌరుని ఇల్లు 1000 sqft ఉండేదట ఇప్పుడు 2500 sqft అయ్యిందట . కుటుంబాల సైజు తగ్గిందట. కొంతమంది ఇళ్ళు ఎంత పెద్దవైపోయాయంటే కొన్ని గదులకు అసలు వారు వెళ్ళటమే మానేశారట. ఇటువంటి ప్రతి ఇంటి నిర్మాణానికి ఎన్ని వనరులు అవసరం రోజువారీ నిర్వహణకు అవసరమయ్యే ఇంధన వనరులు వగైరాల మాట ఏమిటి? ఎంత వ్యర్థమైన జీవన విధానం ఇది అని వాపోతారు స్మిల్. ఇదేదో అమెరికా వారికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని చైనా వారు కూడా అమెరికా వారిలాగా SUVల మోజులో పడ్డారని కాలిఫోర్నియాలో లాగా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించుకుంటున్నారని అంటారు స్మిల్. లెస్ ఈజ్ మోర్ (less is more) అంటే ఉన్నదాంట్లో సంతృప్తి చెందటం అన్న మంత్రానికి అనుగుణంగా మనం నడుచుకోవాలని అదే మనకు సరైన మార్గమని అంటారు స్మిల్. ఉదాహరణకు ఒక కొత్త కారు తయారు చేస్తున్నామనుకోండి అది కనీసం ముప్పై ఐదేళ్లు అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో నడిచే లాగా దాన్ని రూపొందించాలని అంటారు స్మిల్. కానీ ఇప్పటి వ్యాపార విధానం అన్నది దీనికి విరుద్ధంగా ఉందని అంటారు స్మిల్.ఇప్పుడు మనం planned obsolescence వంటి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్న విషయం ప్రస్తావిస్తారు స్మిల్ . ఉదాహరణకు యాపిల్ ఫోను గురించి ఇటువంటి  ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఫోను కొన్న ఒకటి రెండేళ్లకు మీకు మరో ఫోను కావాలని అనిపించేట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ఆ ఫోన్ పనితీరు తగ్గేలా యాపిల్ వారు ఫోన్లను రూపొందిస్తారని వారి మీద వినియోగదారులు మేధావుల ఆక్షేపణ. 

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గాక కూడా మన జీవన విధానాన్ని పెద్దగా మార్చుకోమని మునుపటిలాగానే వారాంతరాలలో విమానాలెక్కి విహారయాత్రలకు వెళ్ళటానికి జనాలు మొగ్గుచూపుతారని క్రూజ్ షిప్పులలో నౌకాయాత్రలకు క్యూ కడతారని ఇదే మన ముందున్న ప్రధాన సమస్యని అంటారాయన. అంటే బతకటం అంటే ఇలా మెటీరియలిస్టిక్ గా  బ్రతకటమే అన్నట్టుగా మన జీవితాలు తయారయ్యాయని ఆయన ఘోష. టివీ లేని కాలం నుంచి పద్నాలుగు ఇంచుల టీవీల కాలానికి మారాము తర్వాత ఇరవై ఒక్క ఇంచు టీవీ నుంచి ముప్పై నలభై యాభై డెబ్బై ఇంచుల దాకా మారాము ఇలా ఇంట్లో ఉండే టీవీ ల సైజు సంఖ్య పెంచుకుంటూ పోతూ అదే అభివృద్ధి అనీ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న మన జీవన విధానంలో లోపాల గురించి మనకు చెప్పటానికి  స్మిల్ వంటి మేధావే రానక్కర్లేదు.  కాకపోతే ఆయన ఈ జీవన విధానాన్ని వేరే దృక్కోణంలో విశ్లేషిస్తారు. ఈ వస్తువుల తయారీలో వినియోగంలో వ్యర్థాల తొలగింపులో అయ్యే పదార్థ వినియోగం ఇంధన శక్తి వినియోగం వగైరాల గురించి  కొంచెం శాస్త్రీయంగా ఇప్పటి కాలపు మేధావుల మన్ననలను అందుకుంటూ. కాబట్టే ఆయన వాదనలను వినాలి. 

సరే ఈ పరిచయం అంతా స్మిల్ గురించే కానీ ఇందులో బిల్ గేట్స్ ఏడీ అంటారేమో. గేట్స్ మీకు ఇంత పెద్ద అభిమాని కదా మరి మీరు ఇలా నిరంతర భౌతిక పెరుగుదల అంటే ఎండ్లెస్ మెటీరియల్ గ్రోత్ అన్నది ఆగాలి అన్న ప్రతిపాదన చేశారు కదా అటువంటి ప్రతిపాదనలు వ్యాపారవేత్తలు ఒప్పుకుంటారా? అసలు బిల్ గేట్స్ ఒప్పుకుంటాడా? అని అడిగారు స్మిల్ ను ఒక విలేఖరి. దానికి సమాధానంగా స్మిల్ ఇలా అన్నారు. బిల్ గేట్స్ కు ఈ  విషయం  నేను  చెప్పాల్సిన  అవసరం  లేదు .  పర్యావరణం  గురించి  అతనికి  చాలానే  తెలుసు .  ఆయన  సంపాదించిన కోట్ల  డాలర్ల  గురించి  మర్చిపోండి  ప్రస్తుతానికి అతను స్వతహా ప్రపంచ వ్యవహారాల  గురించి  ఎంతో  కుతూహలం  కలిగిన  వ్యక్తి .  డజన్ల  కొద్దీ  పుస్తకాలు చదువుతాడు  నాకు  మల్లే  అని  అన్నారు వాత్సలాఫ్  స్మిల్ .  ఇదంతా చదివి నేను వాత్సలాఫ్  స్మిల్ కు పెద్ద అభిమానిని అయ్యాను నిజానికి. ఈ విషయాలలో నా  ఆలోచన ధోరణి ఆయన ఆలోచనలతో కలుస్తుంది.

 అయితే స్మిల్ పుస్తకాలను పరిచయం చేస్తూ గేట్స్ ఇలా అంటారు ( చూడు:  https://www.gatesnotes.com/Books/Growth ) . భవిష్యత్తును దర్శించటంలో కంటే కూడా నా ఉద్దేశంలో గతాన్ని విశ్లేషించటంలోనే స్మిల్ విద్వత్తు దాగి ఉందని అంటారు గేట్స్. ఆంటే అంతులేని పెరుగుదల (limitless growth) అన్నది టెక్నాలజీతో సాధ్యమే అని గేట్స్ మనోగతం. ఈ విషయంలో స్మిల్ కొంత నిరాశావాదం కలిగి ఉన్నారని టెక్నాలజీ శక్తిని ఆయన సరిగ్గా అంచనా వేయట్లేదని గేట్స్ అభిప్రాయం. ఇదేంటిది తాను ఎంతగానో అభిమానించే స్మిల్ వంటి మేధావిని గేట్స్ ఇంత మాట అనేశాడు అని అనుకున్నాను నేను ఇది మొదటి సారి చదివినప్పుడు. అప్పటి నుంచి ఈ విషయం పై గేట్స్ ఆలోచనలను చదవటానికి ఎదుర చూసి చూసి మొత్తానికి ఈ సంవత్సరం గేట్స్ రాసిన “How to avoid a climate disaster – The solutions we have and the breakthroughs we need” అన్న పుస్తకం చదివాను.

అందరికి ఉద్యోగావకాశాలు వచ్చేలా మన ఆర్ధిక వ్యవస్థ బలపడాలంటే నిరంతర విద్యుత్తు సరఫరా అన్నది చాలా కీలకమని అంటారు గేట్స్. విద్యుత్తు సరఫరా లేకుండా ఆఫీసులు ఫ్యాక్టరీలు కాల్ సెంటర్లు ఎలా నడుస్తాయి ఉద్యోగాలు నిలబడేదెలా అని ప్రశ్నిస్తారు గేట్స్. తలసరి ఆదాయానికి ఇంధన శక్తికి పరస్పర అవినాభావ సంబంధం ఉందని అంటారు గేట్స్. ఇంధన వినియోగం తద్వారా వెలువడే శక్తి యొక్క వాడకం పెరిగే కొద్దీ ఆదాయం జీడీపీ వగైరాలు పెరుగుతూ పోతాయని అంటారు గేట్స్ . 

తనకేదన్నా సమస్య చూపితే దానిని టెక్నాలజీ ద్వారా ఎలా పరిష్కరించాలో ఆలోచించటం తనకు స్వతహా ఉన్న లక్షణమని అంటారు గేట్స్. కాబట్టి ఈ వాతావరణ మార్పు పర్యావరణ పరిరక్షణ అన్న విషయంలో కూడా రాజకీయాల గురించి జీవన విధానాల మార్పుల గురించి తాత్విక చింతనల గురించి కంటే కూడా టెక్నాలజీ గురించే ప్రస్తావన గేట్స్ పుస్తకంలో. తాను కార్బన్ ఎమిషన్ కు కాలుష్యానికి కారణమైన ప్రెవేటు విమానాలలో తిరుగుతూ పర్యావరణ పరిరక్షణ గురించి ఉపదేశాలు ఇవ్వటంలోని కపట వైఖరి అంటే హైపోక్రసీ గురించి ఇలా అంటారు గేట్స్. తలసరి కార్బన్ ఎమిషన్ చాలా ఎక్కువగా ఉండే నా వంటివారి జీవన విధానంలో కొంత మార్పు అవసరమేనేమో ఒప్పుకుంటాను కానీ ప్రపంచం మొత్తం పదార్థ వస్తు వినియోగం సేవల వినియోగం తగ్గించుకోవలసిన అవసరం ఏమీ లేదు ఆయా వస్తువులు మరియు సేవల తయారీ కోసం అవసరమయ్యే ఎనర్జీ అంటే శక్తి కార్బన్ ఫ్రీ అయితే చాలు అంటారు గేట్స్. బహుశా ఆయనలోని వ్యాపారి అంటున్న మాటలు కామోసు ఇవి . స్మిల్ ఏ జీవన విధానాన్ని తప్పు పట్టాడో  గేట్స్ అదే జీవన విధానంలో తప్పేమి లేదని ఇది కేవలం ఎనర్జీ తయారీ మరియు వినియోగం గురించిన సమస్య  అన్నట్టుగా వాదిస్తారు. 

షాంఘై నగరం తాలూకా రెండు ఫోటోలను పోలుస్తారు ఈ పుస్తకంలో ఒక చోట గేట్స్. 1987 నాటి షాంఘైలో ఆకాశ హర్మ్యాల సాంద్రత తక్కువ 2013 నాటి షాంఘైలో ఇసుకవేస్తే రాలనన్ని ఆకాశ హర్మ్యాలు. పేదరిక నిర్మూలన గురించి ఏ మాత్రం చింతన ఉన్నవారైనా సరే ఇదంతా మన మంచికే అని అనుకోవాలని దీన్ని ఒక శుభ పరిణామంగా చూడాలని అంటారు గేట్స్. ఈ రెండు ఫోటోలలో ఇంత అభివృద్ధి కనిపిస్తోంది కదా అంటే ప్రజల జీవన ప్రమాణాలు లెక్కలేనన్ని విధాలుగా మెరుగుపడ్డట్టే కదా  అని అంటారు గేట్స్. ఈ భౌతిక ప్రగతి అంతా కూడానూ మన మంచికే అంటారాయన. అంతేకాక  ఇంత మంది మనుషులు ఇన్ని వస్తువులు నిరంతరం స్దాన చలనం చెందుతూ ప్రపంచమంతా ప్రయాణం చేస్తూ ఉండటం అన్నది మనమంతా ఆనందించాల్సిన విషయం అంటారాయన. ఆధునిక రవాణా వ్యవస్థ రాకముందు ఆహరం విషయంలో మనకు ఛాయిస్ అంటే ఎంపిక చేసుకునే సౌలభ్యం తక్కువగా ఉండేదని అంటారాయన. తనకు సంవత్సరం పొడుగుతా ద్రాక్షలు తినటం అంటే ఇష్టమని ప్రస్తుతం ఈ ద్రాక్షలు కంటైనెర్ షిప్పుల ద్వారా దక్షిణ అమెరికా నుంచి వస్తున్నాయని ఆ నౌకలు ప్రస్తుతం శిలాజ ఇంధనాల ఆధారంగా నడుస్తున్నాయని అంటారు గేట్స్. అంటే ఇంధనం మారితే చాలు ఈ విధానంలో పెద్దగా లోపమేది లేదని ఆయన ఉద్దేశం. ఈ రవాణా వ్యవస్థే లేకపోతే నాకు ఎప్పుడు పడితే అప్పుడు ద్రాక్షలు తినే సౌలభ్యం లేకుండా పోతుంది అని ఆయన భావం. అయితే ఆ కోరికలో ఆయనకి ఏమి తప్పు కనిపించట్లేదు అనమాట. ఇది నాకు మింగుడు పడని విషయం.ఉదాహరణకు సౌరశక్తి మీదనో లేక మరేదో కొత్త టెక్నాలజీ మీదనో నడిచే రవాణా వ్యవస్థ వచ్చినా కూడాను అమెరికాలో కూర్చుని ఇండియా నుంచి  బంగినపల్లి మామిడిపళ్ళు తినటంలో ఉండే ప్రగతి మరియు అభివృద్ధి ఏంటో నాకు అర్థం కావట్లేదు . ఇదే విషయం మరొక చోట కూడా అంటారు ఆయన. వడగాలుల వేడిమిని తట్టుకోలేక భారత దేశంలో ఎందరో చనిపోతున్నారని దీనిని ఆపటానికి ఎయిర్ కండిషనర్ పెట్టుకోవాలంటే అది పర్యావరణానికి హాని కలిగిస్తుందని అనటం సరికాదని అంటారు. దీనికి పరిష్కారం ఎయిర్ కండిషనర్లు శిలాజ ఇంధన ఆధారిత శక్తి వ్యుత్పత్తి  నుండి స్వచ్ఛమైన క్లీన్ ఎనర్జీకి మారటమే అంటారాయన. ఎయిర్ కండిషనర్ అన్నది విలాస వస్తువు కాదని ఆధునిక ఆర్ధిక వ్యవస్థ మొత్తము దానిమీదే ఆధార పడి ఉందని అంటారాయన ఈ పుస్తకంలో మరొక చోట. కంప్యూటర్లు అంతర్జాల ఆధారిత సేవలు అందించే క్లౌడ్ సర్వర్లు  డేటా సెంటర్లు వగైరాలు అన్ని అంతరాయం లేకుండా నడవాలంటే కూడా ఎయిర్ కండిషనింగ్ అన్నది చాలా అవసరమని అమెరికాలో తొంబై శాతం ఇళ్లల్లో ఏదో ఒక రకమైన ఎయిర్ కండీషనింగ్ అన్నది ఉందని అంటారు గేట్స్. సరే కంప్యూటర్ల విషయం పక్కన పెడతాం. మనం బతకడానికి ఎయిర్ కండిషనర్ అవసరమే అన్నదే నాకు నమ్మటానికి కష్టంగా అనిపించే విషయం. ఇప్పటి విచిత్ర జీవన విధానం దృష్ట్యా భానుడి తాపాన్ని తట్టుకోటానికి చాలా మంది ఏ.సి మీద ఆధార పడుతూ ఉండవచ్చును అంత మాత్రం చేత ఏ.సి లేనిదే మనం బతకలేము అనచ్చునా? మనం చేజేతులా తెచ్చుకున్న జీవన విధానమే కదా ఇది? చెట్లు చెరువులు అన్నిటినీ కబ్జా చేసుకుని అస్త వ్యస్తమైన నగరీకరణ ప్రణాళికలతో నిర్మించుకున్న నగరాలలోని కాంక్రీటు జంగిల్ జీవితాలకు కదా ఏ.సి అవసరం అయ్యింది? అంత మాత్రం చేత అది నిత్యావసర వస్తువు అయిపోయినట్టేనా?

కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైనా కూడా పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణమైన కార్బన్ ఎమిషన్ అన్న విషయంపై ఈ వైరస్ ప్రభావం తాను ఊహించినంతగా లేదని అంటారు ఆయన.  సంవత్సరానికి మనము 51 బిలియన్ టన్నుల కార్బన్ ను వాతావరణం లోకి వదులుతూ ఉంటే కరోనా వచ్చిన సంవత్సరంలో ఒక ఐదు శాతం తక్కువ అంటే బహుశా 48 లేదా 49 టన్నుల కార్బన్ వదులుతామేమో అంతే అని అంటారు. దీనికి కారణాలు చూపుతూ కార్బన్ ఎమిషన్ అనేది మానవుడు చేసే ఎటువంటి పనుల వల్ల వస్తుందో సామాన్యులకి అర్ధమయ్యే భాషలో వివరిస్తారు గేట్స్. కేవలం విమానాలు ఆపటం వల్లనో రవాణా తగ్గించటం వల్లనో కార్బన్ ఎమిషన్ అన్నది తగ్గదని అంటారు గేట్స్. 

అయితే ఈ పర్యావరణ సంక్షోభం గ్లోబల్ వార్మింగ్ వగైరాలు సాధారణమైన సమస్యలు కానే కావని అంటారు. ఒక అంచనా ప్రకారం చైనా ఇండియా నైజీరియా వంటి దేశాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న విధానం చూస్తూ ఉంటే 2060 వరకు అంటే రాబోయే నలభై ఏళ్ళ వరకు  ప్రపంచంలో ప్రతి నెలా ఒక సరికొత్త న్యూయార్క్ నగరానికి సమానమైన నగరం నిర్మించాల్సిన అవసరం ఉందని అంటారు గేట్స్. అంటే ఆ స్థాయి ఆర్ధిక కార్యకలాపాలు నిర్మాణ వ్యవహారాలు జరిగే అవకాశం ఉన్నదట – “The world will be building the equivalent of another New York City every month for the next 40 years”. ఇంతటి అభివృద్ధి కార్బన్ ఎమిషన్లు జరగకుండా చేయాలంటే సామాన్యమైన విషయం కాదని అంటారాయన. జీవన ప్రమాణాలు అన్నవి పెరుగుతూ పోతున్నాయని ఆ పెంపుదలను ఆపటం అన్నది అనైతికమని అంటారు గేట్స్ . ముఖ్యంగా పేద దేశాలు ఇప్పుడిపుడే అభివృద్ధి నిచ్చెనమెట్ల ఎక్కుతున్నాయని జీవన ప్రమాణాలు మెరుగయ్యే కొద్దీ అందరికి కార్లు ఫ్రిడ్జులు ఎయిర్ కండిషనర్లు వగైరాల అవసరం ఏర్పడుతుందని  తలసరి ఎనర్జీ వినియోగం అన్నది కూడా పెరుగుతుందని వీటికి మనం సన్నద్ధం అవ్వాలని అంటారాయన. ఎలాగైనా సరే వాతావరణంలోకి కార్బన్ వెలువడకుండా శక్తిని వ్యుత్పత్తి చేసి ఈ పేదదేశాల ప్రజల ప్రగతికి ఊతమివ్వటమే మన ముందున్న సవాలని అంటారాయన. 

ఇక పుస్తకం అంతాను భవన నిర్మాణ సామాగ్రి మొదలుకొని వ్యవసాయ పద్దతుల వరకు ప్రతీ సమస్యకు కొత్త టెక్నాలజీ పరిష్కారం చూపే అవకాశం ఎలా ఉందో వివరిస్తారు గేట్స్. అందరు చదవాల్సిన పుస్తకం ఇది. ఈ విషయంలో మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుంది. రకరకాల కోణాలలో పర్యావరణ సంక్షోభం గురించి గ్లోబల్ వార్మింగ్ గురించి వాతావరణ మార్పును గురించి ఆలోచించేలా మనకు ప్రోద్బలాన్నిస్తుంది . నాకైతే బిల్ గేట్స్ వాదన అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. అయితే ఎలాగైనా సరే ఈ సమస్యను నూతన ఆవిష్కరణలతో టెక్నాలజీతో పరిష్కరించాలి అన్న ఆయన కుతూహలం నచ్చింది. బహుశా వ్యాపారస్తులకు ఉండాల్సిన లక్షణాలలో ఇది కూడా ఒకటి కాబోలు. Every crisis is an opportunity అంటారు కదా. ప్రతీ సంక్షోభం ఒక కొత్త అవకాశానికి నాంది అని. ఏమో టెక్నాలజీ మనలను ఈ విపత్తు నుంచి బయట పడేస్తుందేమో. అలా అనుకుందాం. లేదంటే బెంబేలెత్తి పోతాము.

You Might Also Like

2 Comments

  1. leol

    అద్భుతమైన వ్యాసం. జరుగుతున్న తప్పులు ఎత్తిచూపటం ఎంత ముఖ్యమో, సమస్యలకు పరిష్కారం వెతకటం అంతే ముఖ్యం. రెండు పార్శ్వాలను కలుపుతూ మంచి పరిచయం చేశారు. వ్యాసకర్త ఎవరు?

    1. సౌమ్య

      Leo garu, I updated author name now. Thanks for noticing this!!

Leave a Reply